తహవూర్‌ రాణాకు బిగ్‌ షాక్‌ | Tahawwur Rana Extradition Stay Request Rejected By US Court | Sakshi
Sakshi News home page

తహవూర్‌ రాణాకు బిగ్‌ షాక్‌

Published Fri, Mar 7 2025 8:54 AM | Last Updated on Fri, Mar 7 2025 9:18 AM

Tahawwur Rana Extradition Stay Request Rejected By US Court

వాషింగ్టన్‌: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కీలక సూత్రధారి తహవూర్‌ రాణా(Tahawwur Rana)కు బిగ్‌ షాక్‌ తగిలింది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ వేసిన పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ముంబై దాడుల కేసులో తహవూర్‌ రాణాను భారత్‌కు అప్పగించేందుకు(Extradition) అమెరికా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే చికిత్సపై హామీకి భారత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో.. ఈ కారణాన్ని చూపిస్తూ భారత్‌కు తన అప్పగింతను నిలిపివేయాలంటూ అమెరికా సుప్రీం కోర్టు(US Supreme Court)లో తహవూర్‌ పిటిషన్‌ వేశాడు. 

‘‘ప్రాణాంతక జబ్బులతో పోరాడుతున్న నన్ను భారత్‌కు అప్పగించడమంటే మరణశిక్ష విధించడమే. నా అప్పగింత అమెరికా చట్టాలతో పాటు ఐరాస తీర్పుల ఉల్లంఘనే. కనుక అప్పగింతపై స్టే విధించండి’’ అని తహవూర్‌ పిటిషన్‌ పేర్కొన్నాడు. పాక్‌ సంతతికి చెందిన ముస్లిం వ్యక్తిని కావడంతో తనను కచ్చితంగా హింసిస్తారని, భారత్‌కు అప్పగిస్తే తాను బతికే అవకాశమే లేదని వాదించాడతను. అయితే తహవూర్‌ రాణా వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అతని పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో త్వరలోనే తహవూర్‌ను అమెరికా భారత్‌కు అప్పగించే ఛాన్స్‌ కనిపిస్తోంది. 

ఎవరీ తహవూర్‌ రాణా..?
పాక్‌ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన తహవూర్‌ రాణా.. ప్రస్తుతం లాస్‌ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్‌ జైల్లో ఉన్నాడు. 2009లో FBI అతన్ని అరెస్టు చేసింది. పాక్‌–అమెరికా ఉగ్రవాది డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీతో అతనికి దగ్గరి సంబంధాలున్నాయి. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి అమెరికా పర్యటనలో.. తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించే అంశంపై అధ్యక్షుడు ట్రంప్‌ స్వయం ప్రకటన చేశారు. ఇందుకుగానూ ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో రాణా భారతదేశానికి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కోవడం దాదాపు ఖాయమని భావించారంతా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement