
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో అలజడి రేగింది. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కనపెడుతున్నారని, నిన్న మొన్న చేరుతున్నవాళ్లకు పదవులు ఇవ్వడం ఏమాత్రం సరికాదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి(Malreddy Rangareddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర జనాభాలో అధికంగా.. 42 శాతం జనాభా రంగారెడ్డి జిల్లాలోనే ఉంది. అలాంటి జిల్లాకు దయచేసి అన్యాయం చేయకండి. గతంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్(Hyderabad) జిల్లాలకు కనీసం ఆరుగురు మంత్రులు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఎంత మంది ఉన్నారు?. ఒకవేళ సామాజిక సమీకరణలు అడ్డు వస్తున్నాయంటే రాజీనామాకు నేను సిద్ధం. జిల్లా అభివృద్ధి కోసం.. మంత్రి ప్రాతినిధ్యం కోసం ఇంకొకరిని గెలిపించేందుకు నేను రెడీ అని కాంగ్రెస్ అధిష్టానంను ఉద్దేశించి మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోనైనా గ్రేటర్ పరిధిలోని నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని అన్నారాయన. ఇక..
.. పార్టీలోకి ఎవరొచ్చినా గౌరవం ఇవ్వాలి. కానీ పదవులు ఇవ్వొద్దు. ఇప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళని మంత్రులుగా తీసుకోవద్దు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టడం సరైంది కాదు. పని చేసిన వారిని పక్కన పెడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వస్తున్నాయి. కనీసం పదేండ్లు కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలి. కార్యకర్తల మనోభావాలను.. నేతల సీనియారిటీనీ పరిగణనలోకి తీసుకోవాలి అని ఆయన కోరారు. ఈ క్రమంలో ‘‘పార్టీ లైన్ దాటోద్దు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్న’’ అని మల్‌రెడ్డి వ్యాఖ్యానించడం కొసమెరుపు.
