
కరీంనగర్, సాక్షి: అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) రగడ కొనసాగుతోంది. ఒకవైపు నవీన్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలనే గొంతుకలు పెరుగుతున్న వేళ.. ఆయన మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చినా కూడా తగ్గేదేలే అంటున్నారు. తాజాగా..
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం(MLC Election Campaign) లో కాంగ్రెస్‌ది, తనది వేర్వేరు దారన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికి మద్ధతుగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందంతో ఇవాళ కరీంనగర్‌లో సభకు హాజరవుతున్నారు. అయితే అంతకంటే ముందే..
అదే కరీంనగర్(Karimnagar) వేదికగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ హాజరైన బీసీ జేఏసీ మీటింగ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ప్రత్యక్షం కావడం, తాజా పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
‘‘జానారెడ్డి కళ్లల్లో ఆనందం కోసం చిన్నారెడ్డి నాకు షోకాజ్ నోటీస్ పంపించారు. నేను ఈ బీసీ జేఏసీ సమావేశానికి వస్తే ఓ పార్టీ అభ్యర్థి బాధపడుతున్నారు. మరి అదే అభ్యర్థి.. నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు?’’ అని ఎమ్మెల్సీ నవీన్ నిలదీశారు.
.. రాహుల్ గాంధీ స్పిరిట్‌తోనే బీసీ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నా. కానీ, నేను ఇలా చేయడం కాంగ్రెస్ లో మరి కొన్ని వర్గాలకు నచ్చడం లేదు. మీకు పడకపోతే నేను బీసీ ఉద్యమాన్ని ఆపుతానా?.. ఇస్సా, ఇజ్జత్, హుకూమత్ కోసమే బీసీ ఉద్యమమం అంటూ తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్ చేశారు.