
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో రబ్బర్ స్టాంప్ పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన మీద పట్టులేకుండా పోయింది. రాష్ట్ర మంత్రులను ఏఐసీసీ నిర్ణయించడం ఏంటి? అని ప్రశ్నించారు. అలాగే, ఎంఐఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘ఢిల్లీలో వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓటు వేసింది. తెలంగాణాను మజ్లీస్‌కు అంటగట్టడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ యత్నిస్తున్నాయి. మజ్లీస్ కబంధ హస్తాల నుండి తెలంగాణాను కాపాడమే మా లక్ష్యం. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం బీజేపీదే. రేషన్ బియ్యానికి కేంద్రం 37 రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్రం 10 రూపాయలు ఖర్చు చేస్తోంది. తెలంగాణాలో ఇచ్చే రేషన్ బియ్యం మోదీ ఇస్తున్నవే.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము బియ్యానికి పది రూపాయలు ఖర్చు బెడుతున్నామని చెబుతున్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుంది. ముఖ్యమంత్రికి పాలన మీద పట్టు లేకుండా పోయింది. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంపుగా మారాడు. రబ్బర్ స్టాంపు పాలన తెలంగాణాలో కొనసాగుతోంది. రాష్ట్ర మంత్రులను ఏఐసీసీ నిర్ణయించడం ఏంటి?. హెచ్‌సీయూ విషయంలో మంత్రులు ఏం చేయాలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ సూచనలు ఇవ్వడం ఏంటి?. తెలంగాణాలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అవినీతి రహిత రాష్ట్రంగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలన అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.