Industrial establishment
-
పరిశ్రమల స్థాపనపై ఆసక్తి చూపాలి
ఒంగోలు సబర్బన్: నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో వివిధ రకాల పరిశ్రమల స్థాపనపై ఆసక్తి చూపాలని కాకినాడ జేఎన్టీయూ వైస్ చాన్సలర్ (వీసీ) తులసీ రాందాస్ పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు ఒంగోలులోని ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాలులో కాకినాడ జేఎన్టీయూలోని సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆధ్వర్యంలో యువ ఇంజినీర్లకు, ఇంజినీరింగ్ విద్యార్థులకు అవగాహ న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రెండో రోజు మంగళవారం సదస్సుకు వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో ముఖ్యమైందని అభివర్ణించారు. కొత్త రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం కాకినాడ జేఎన్టీయూలో ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ సెల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దీని ద్వారా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహిస్తామన్నారు. మొత్తం ఈ సెల్ పరిధిలో 8 జిల్లాలున్నాయని, ఇప్పటికే మూడు జిల్లాల్లో అవగాహనా సదస్సులు పూర్తి చేశామన్నారు. కొత్త రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా స్థానిక అవసరాలతోపాటు ఎగుమతులకు సంబంధించి కూడా ఇతర రాష్ట్రాలతో, ఇతర దేశాలతో వ్యాపార లావాదేవీలు నెరుపుకోవచ్చన్నారు. సహజ వనరులను వినియోగించుకోవడం, భూగర్భం నుంచి ఖనిజాలను వెలికితీసి వాటి ద్వారా ఉత్పత్తులను పెంపొందించుకోవడం చేయాలన్నారు. ఐటీ పార్కులు, మందుల తయారీ కంపెనీలు, ఓడరేవులు, వంతెనలు, విమానాశ్రయాలుతోపాటు అనేక రకాల కొత్త ప్రాజెక్టులు వస్తున్నందున వాటికి సంబంధించిన నిపుణులుగా యువ ఇంజినీర్లు, ఇంజినీరింగ్ విద్యార్థులు ఎదగాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చుకుని ప్రతి ఒక్కరూ స్వంత ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చి కొత్త పథకాల ద్వారా నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను తీర్చిదిద్దడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్విస్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ కల్యాణ్ చక్రవర్తి, పేస్ కళాశాల చైర్మన్ అండ్ కరస్పాండెంట్ శ్రీధర్, ఏబీఆర్ చైర్మన్ బసివిరెడ్డి, కృష్ణచైతన్య కళాశాల చైర్మన్ చైతన్యలతోపాటు పలు ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి వారికి కాకినాడలోని సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వీసీ చెప్పారు. -
భవితకు భరోసా!
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్లకు మహర్దశ రానుంది. ఇక్కడ ఏర్పాటుకానున్న టీసీఎస్, ఇబ్రహీంపట్నం సమీపంలో నెలకొల్పనున్న వైట్‌గోల్డ్ స్పిన్నింగ్ మిల్స్ కంపెనీలతో గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి. ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కోసం స్థానిక యువతీ యువకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాజధాని హైదరాబాద్ నగరానికి అతి సమీపంలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో యువత కొంత కాలంగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది. చేతిలో డిగ్రీ, పీజీ పట్టాలున్నా అవి దేనికీ పనికి రాకుండాపోతున్నాయి. ఇప్పటికే టాటా లాంటి కంపెనీలు ఈ ప్రాంతంలో ఉన్నా స్థానికులకు మాత్రం ఉద్యోగాలు అందని ద్రాక్షలా మారింది. పేరుకే ఈ ప్రాంతంలో వందలాది ఇంజినీరింగ్, పీజీ కళాశాలలున్నా.. ‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా ఆయా కళాశాలల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు దక్కడంలేదు. ఒకవేళ దొరికినా కేవలం వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్స్, స్వీపర్ పోస్టులే స్థానికులకు పరిమితమయ్యాయి. మరికొందరు డిగ్రీలు చేతబుచ్చుకుని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇప్పటికే పలు కోచింగ్ సెంటర్లలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నగరానికి అన్ని దిక్కులా ఎన్నో పరిశ్రమలు వెలిశాయి. కానీ నాగార్జునసాగర్ రహదారి పరిధిలోని పట్నం నియోజకవర్గంలో మాత్రం ఏ ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఇప్పుడిప్పుడే పలు కంపెనీలు ఈ ప్రాంతం వైపు దృష్టి సారిస్తున్నాయి. టీసీఎస్‌లో 28 వేల మందికి అవకాశాలు.. మండలంలోని ఆదిబట్ల సమీపంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)పై నిరుద్యోగ యువత గంపెడాశలు పెట్టుకుంది. ఇప్పటికే 28 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టీసీఎస్ సీఈఓ చంద్రశేఖరన్ ప్రకటించారు. దీంతో స్థానిక యువతలో ఆశలు నెలకొన్నాయి. కాగా.. టీసీఎస్ బహుళజాతి సంస్థ కావటంతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పేరిట కళాశాలలోనే విద్యార్థులను ఎంపిక చేసుకుంటారని, స్థానికులకు అవకాశా లు తథ్యమని కొందరు భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్నో ఇంజనీరింగు కళాశాలలు ఉండటంతో చాలామంది విద్యార్థులకు ఉపాధి లభించి నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరుతుందని పలువురు ఆశిస్తున్నారు. వైట్గోల్డ్లో పదివేల ఉద్యోగాలు.. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధిలోని సుమారు 200 ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న వైట్‌గోల్డ్ ఇంటెగ్రేటెడ్ స్పింటెక్స్ పార్క్ స్పిన్నింగ్ మిల్స్ నిర్మాణానికి గత ఏడాది అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో స్థానిక మహిళలకు అధిక శాతం అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇది కూడా నిర్మాణ దశలో ఉండటంతో భవిష్యత్తులో మహిళలకు ఉద్యోగావకాశాలు దక్కుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వైట్ గోల్డ్‌లో దాదాపు పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు. త్వరలోనే ఐటీఐఆర్.. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో త్వరలోనే ఐటీఐఆర్ సంస్థ కూడా ఏర్పా టు కాబోతున్నట్లు సమాచారం. ఇందు కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు తెలిసింది. ఐటీఐఆర్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందిగా ప్రభుత్వం సంస్థ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఐటీఐ ఆర్ ఏర్పాటు సాకారమైతే ఈ ప్రాంతం మరింత పురోభివృద్ధి దిశగా పయనిస్తుందని, పెద్ద సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి దొరికే అవకాశాలున్నాయి. -
పరిశ్రమల ఏర్పాటుకు భూమి రెడీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమిని అధికార యంత్రాంగం ప్రాథమికంగా గుర్తించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు తక్షణ కేటాయింపు నకు వీలుగా ఉన్న భూముల వివరాలతో ల్యాండ్ బ్యాంకు రూపొందించే ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర పారి శ్రామిక మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (టీఐఐసీ) బృందాలు ఇటీవల జిల్లాలో పర్యటించి ఎంపిక చేసిన భూములను పరిశీలించి వెళ్లాయి. సుమారు నెల రోజుల పాటు జిల్లాలో భూములను సర్వే చేసి 13.439 ఎకరాల భూమి పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉన్నట్లు తేల్చాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ యంత్రాంగం ద్వారా బుధవారం నివేదిక కూడా సమర్పించారు. అధికారులు సమర్పించిన ఈ నివేదికపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాలో ఆరు పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసి సుమారు రెండు వేల ఎకరాలకు పైగా భూమిని పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. తాజాగా మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు భూ లభ్యతపై ఆరా తీసేందుకు సర్వే నిర్వహించి నివేదిక సిద్ధం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించాలంటూ రెవెన్యూ విభాగానికి తొలుత 34,184.59 ఎకరాలు వివరాలు అప్పగించారు. వీటిలో 16,723.07 ఎకరాల భూమి అనువుగా లేదని సర్వేలో తేల్చారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్న 13,439 ఎకరాల్లో 2301.71 ఎకరాలు సమతల భూమి, 3802.49 ఎకరాలు చిన్నపాటి కొండలు, గుట్టలు, 7335.50 ఎకరాలు కొండలతో కూడి ఉన్నట్లు గుర్తించారు. మహబూబ్‌నగర్‌లోనే అధికం అత్యధికంగా మహబూబ్‌నగర్ డివిజన్లో 13వేల ఎకరాలకు పైగా భూమి పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉంది. గద్వాల డివిజన్ పరిధిలో కేవలం 10.36 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్న ప్రభుత్వ అసైన్డ్, అటవీ, శిఖం భూముల వివరాలను కూడా నివేదికలో పొందుపరిచారు. నారాయణపేట, వనపర్తి డివిజన్ల పరిధిలోనూ భూమిని గుర్తించినా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మండలాల్లో మాత్రమే పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు వస్తారని టీఐఐసీ అంచనా వేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోనూ మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి సారిస్తే పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని టీఐఐసీ వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. హైదరాబాద్- బెంగళూరు మార్గంలో పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటించిన నేపథ్యంలో జిల్లా పారిశ్రామిక అభివృద్ధిపై ఆసక్తి నెలకొంది. -
ఐటీ జిల్లాగా మారుస్తాం
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మహేశ్వరం, న్యూస్‌లైన్: మహేశ్వరంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు నగరంలోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని మహేశ్వరం,రావిర్యాల, ఆదిభట్ల, తుక్కుగూడ గ్రామాల్లో ఐటీఐఆర్‌లో భాగంగా పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలిచిపోయిన పరిశ్రమలు.. రావిర్యాల ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్కు, మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ సెజ్‌ల అభివృద్ధికి నిధులు పెద్దమొత్తంలో విడుదల చేసి ఐటీ రంగాన్ని విస్తరింపజేస్తామన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిలిచిపోయిన పరిశ్రమల పనులను పునఃప్రారంభిస్తామన్నారు. జిల్లాను ఐటీ జిల్లాగా మారుస్తామని స్పష్టంచేశారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కప్పాటి పాండురంగారెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సామల రంగారెడ్డి, సరూర్‌నగర్ మండల శాఖ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా యువజన నాయకులు గడ్డం వెంకట్‌రెడ్డి, రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. -
కార్మికుల ఆందోళనపై ఉక్కుపాదం..
ఆందోళనలపై ఉక్కుపాదం.. ‘పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తే కార్మిక సంఘా లనే రద్దు చేస్తా... ఐదారు వేల మందిని తీసుకొచ్చి ప్రదర్శన చేసినంత మాత్రాన భయపడేవాణ్ని కాదు...’ తమ సమ స్యలను నివేదించుకునేందుకు వచ్చిన విద్యా వలం టీర్ల మీద చంద్రబాబు విరుచుకు పడిన తీరిది. ఉత్తుత్తి హామీలు రాష్ట్రంలో 2000 సంవత్సరం నాటికి లక్ష కోట్ల రూపాయలు పారిశ్రామిక పెట్టుబడి లక్ష్యాన్ని సాధిస్తాం - ముఖ్యమంత్రి ప్రకటన (19.10.96) గత ఏడాది 3203 కోట్లతో 52 మంది పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే ఈ ఏడాది 1003 కోట్లతో 26 కొత్త ప్రతిపాదనలు మాత్రమే అందాయి. (18.7.97న పత్రికావార్త)