ఐటీ జిల్లాగా మారుస్తాం
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
మహేశ్వరం, న్యూస్‌లైన్: మహేశ్వరంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు నగరంలోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని మహేశ్వరం,రావిర్యాల, ఆదిభట్ల, తుక్కుగూడ గ్రామాల్లో ఐటీఐఆర్‌లో భాగంగా పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి చేస్తామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలిచిపోయిన పరిశ్రమలు.. రావిర్యాల ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్కు, మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ సెజ్‌ల అభివృద్ధికి నిధులు పెద్దమొత్తంలో విడుదల చేసి ఐటీ రంగాన్ని విస్తరింపజేస్తామన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిలిచిపోయిన పరిశ్రమల పనులను పునఃప్రారంభిస్తామన్నారు.
జిల్లాను ఐటీ జిల్లాగా మారుస్తామని స్పష్టంచేశారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కప్పాటి పాండురంగారెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సామల రంగారెడ్డి, సరూర్‌నగర్ మండల శాఖ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా యువజన నాయకులు గడ్డం వెంకట్‌రెడ్డి, రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.