గ్రామీణ యువతలో అది 34 శాతమే
36.38 శాతం మందికి జోడించిన ఫైల్‌తో ఈ–మెయిల్ పంపగల సామర్థ్యం
45.56 శాతం మందికి ఫైల్ లేదా ఫోల్డర్‌ను కాపీ చేయగల లేదా తరలించగల సామర్థ్యం
ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్–2024 వెల్లడి
సాక్షి, అమరావతి : దేశంలో కంప్యూటర్ నైపుణ్యం పట్టణ యువతలో 61 శాతం ఉండగా అదే గ్రామీణ యువతలో కేవలం 34 శాతమే ఉందని ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్–24 వెల్లడించింది. కంప్యూటర్ నైపుణ్యాల సామర్థ్యం రాష్ట్రాల మధ్య వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆ నివేదిక తెలిపింది. కెమెరా, మోడమ్, ప్రింటర్ వంటి పరికరాలు ఇన్‌స్టాల్ చేసే సామర్థ్యం పట్టణ యువతలో ఉందని.. అయితే గ్రామీణ యువతలో అది ఎనిమిది శాతమేనని పేర్కొంది.
ఇలా వివిధ రకాల కంప్యూటర్ నైపుణ్యాల్లో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాయని వివరించింది. ఇక ఫైళ్లను బదిలీచేసే సామర్థ్యం మినహా చాలా నైపుణ్యాల్లో కర్ణాటక ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. ఫైల్ లేదా ఫోల్డర్‌ను కాపీ చేయగల లేదా తరలించగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 45.56 శాతం ఉంటే కేరళ యువతలో 90.28 శాతం.. తమిళనాడు యువతలో 72.28 శాతం, కర్ణాటక యువతలో 64.36 శాతం, తెలంగాణలో 53.83 శాతం ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది.
అలాగే, డూప్లికేట్ లేదా టూల్స్‌ను కాపీచేసి పేస్ట్ చేయగల సామర్థ్యంతో పాటు సమాచారాన్ని ట్రాన్స్‌ఫర్ చేయగల నైపుణ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 43.30 శాతం ఉందని ఆ నివేదిక తెలిపింది. ఇది కేరళ యువతలో 89.30 శాతం, తమిళనాడు యువతలో 70.45 శాతం, కర్ణాటక యువతలో 60.24 శాతం, తెలంగాణలో 50.40 శాతం ఉంది.
ప్రెజెంటేషన్ల సామర్థ్యం కేరళలో ఎక్కువ..
ఇక జోడించిన ఫైల్‌తో ఈ–మెయిల్ పంపగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 36.38 శాతం ఉంటే కేరళ యువతలో అత్యధికంగా 73.34 శాతం, తమిళనాడులో 55.33 శాతం, కర్ణాటకలో 45.04 శాతం, తెలంగాణలో 45.46 శాతం సామర్థ్యం ఉంది. ప్రెజెంటేషన్ సాఫ్ట్‌వేర్‌తో ఎలక్ట్రానిక్ ప్రెజెంటేషన్లను సృష్టించగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 10.18 శాతం ఉండగా కేరళ యువతలో 40.33 శాతం, తమిళనాడులో 26.10 శాతం, కర్ణాటకలో 22.33 శాతం, తెలంగాణలో 14.27 శాతం ఉందని రిపోర్ట్ వెల్లడించింది.
గ్రామీణంలో ‘నెట్’ వినియోగం 25 శాతమే..
అలాగే, దేశంలో 15 ఏళ్ల వయస్సు నుంచి 29 ఏళ్లలోపు యువత ఇంటర్నెట్ వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 25.30 శాతం ఉండగా పట్టణ ప్రాంతాల్లో 57.53 శాతం ఉందని తెలిపింది. వర్గాల వారీగా ఇంటర్నెట్ వినియోగాన్ని పరిశీలిస్తే.. ఎస్టీ వర్గాల్లో 20.39 శాతం, ఎస్సీల్లో 24.96 శాతం, వెనుకబడిన వర్గాల్లో 34.28 శాతం, సాధారణ వర్గాల్లో 50.15 శాతం ఇంటర్నెట్ ఉందని రిపోర్ట్ తెలిపింది. మెజారిటీ యువత మాధ్యమిక లేదా ఉన్నతస్థాయి విద్యను అభ్యసిస్తున్నారని, దీంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్, డిజిటల్ నైపుణ్యాల యాక్సెస్ యువత జనాభాలో కూడా పెరిగిందని.. అయితే సాంకేతిక నైపుణ్యాలను, సామర్థ్యాన్ని పెంచేందుకు యువతకు తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment