అండగా నిలబడాలి: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Key Comments at YSRCP Youth Leaders Meeting | Sakshi
Sakshi News home page

అండగా నిలబడాలి: వైఎస్‌ జగన్‌

Jul 2 2025 4:38 AM | Updated on Jul 2 2025 4:38 AM

Ys Jagan Key Comments at YSRCP Youth Leaders Meeting

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి 

యువజన విభాగం ప్రతినిధులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

అందరినీ చిరునవ్వుతో పలకరించాలి.. ఏదైనా సమస్య వస్తే తోడుగా నిలబడి పోరాడాలి 

ఎమ్మెల్యే కావడం మీ అందరి లక్ష్యం కావాలి.. అందుకు పార్టీ యువజన విభాగం పదవి తొలి అడుగు 

మీరు ఎదగడం.. మీ చేతుల్లోనే 

మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది 

ఈరోజు నుంచే పని మొదలు పెట్టండి 

ఇది సోషల్‌ మీడియా యుగం.. మీ ఫోన్‌ ఒక గన్‌ లాంటిది 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా ఎదిగేందుకు అవకాశం.. 

కానీ విలువలు, విశ్వసనీయత చాలా ముఖ్యం.. నేను ఏనాడూ ఆ రెండింటినీ విడిచి పెట్టలేదు 

అమ్మతో కలసి ఈ ప్రస్థానం మొదలు పెట్టా.. విలువలకు కట్టుబడే రాజకీయాలు చేశా 

హామీలు ఎగ్గొట్టే విధానాన్ని ఎండగడుతూ ఈ సర్కారును నిద్ర లేపుతున్నాం

పార్టీ యువజన విభాగం కార్యాచరణలో ఇది ఆరంభం మాత్రమే. తర్వాత జిల్లాల్లో నా పర్యటన ఉంటుంది. ఇంకా పాదయాత్ర కూడా ఉంటుంది. ఇక ముందు మనం మళ్లీ మళ్లీ కలుస్తాం. ఇది మనం మమేకం కావడంలో తొలి అడుగు. – వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ‘‘రాజకీయాల్లో ఎదుగుదలకు యువజన విభాగంలో పదవి కీలకం.. అది తొలి అడుగు.. ఎమ్మెల్యే కావాలన్నదే ఆ పదవుల్లో ఉన్న వారి లక్ష్యం కావాలి...’ అని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ప్రతినిధులకు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నిత్యం ప్రజలతో మమేకం కావడం.. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించడం.. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలిచి వారితో కలిసి పోరాడడం.. ఈ మూడు లక్షణాలను పార్టీలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, అప్పుడే రాజకీయాల్లో నిలబడి ఎదుగుతారని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయాల్లో ఎదుగుదలకు మంచి అవకాశం ఉంటుందని.. అందుకే చొరవ చూపి వెంటనే కార్యాచరణ మొదలు పెట్టాలని దిశానిర్దేశం చేశారు.

‘ఎదగడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. అయితే మీరు ఆ మూడు లక్షణాలను పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు దాన్ని బేరీజు వేసుకోవాలి. ఆరు నెలల్లో మీరు అది సాధించాలి. మీరు పిలుపునిస్తే కనీసం 2 వేల మంది కదిలి రావాలి..’ అని సూచించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ 
కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన పార్టీ యువజన విభాగం ప్రతినిధుల సమావేశం జరిగింది. పార్టీ యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటు సీనియర్‌ నేతలు హాజరయ్యారు.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై యువజన విభాగం ప్రతినిధులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వైఎస్‌ జగన్‌  ఏమన్నారంటే..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా ఎదిగేందుకు అవకాశం..
పార్టీలో క్రియాశీలకంగా నిర్మాణ కార్యక్రమం సాగుతోంది. ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ, వారు హామీలు ఎగ్గొట్టే విధానాన్ని ఎండగడుతూ.. ఈ సర్కారును నిద్ర లేపుతున్నాం. ఇందులో చాలా క్రియాశీలకంగా ఉన్నాం. అయితే ఇంకా ఎదగాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు నాయకుడి దృష్టిలో పడతారు. అధికారంలో ఉన్నప్పుడు పాలకులకు పదవుల పంపకంపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. కాబట్టి నాయకులపై దృష్టి అందరిపై అంతగా ఉండదు. ఎవరైనా నాయకుడిగా ఎదగాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అది సాధ్యం. మన పార్టీ నుంచి ఎన్నికైన వారిలో చాలా మంది కొత్తవారే. 

మూడు లక్షణాలు అలవర్చుకోవాలి..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయంగా ఎదుగుతారు. అయితే అందుకు కొన్ని లక్షణాలు అలవర్చుకోవాలి. ఒకటి.. నిత్యం ప్రజలతో మమేకం కావాలి. ఎప్పుడూ వారికి అందుబాటులో ఉండాలి. చిక్కటి చిరునవ్వుతో చక్కగా పలకరించాలి. అందరితోనూ అలాగే వ్యవహరించాలి. ఇంకా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వారితో కలిసి పోరాడాలి. ప్రజల తరఫున నిలబడాలి. వారికి తోడుగా ఉండాలి. ఈ మూడు చేయగలిగితే ఎవరైనా నాయకుడిగా ఎదుగుతారు.

అదే మీ లక్ష్యం కావాలి..
నియోజకవర్గ స్థాయి ఇన్‌ఛార్జ్‌లకు చెబుతున్నా. ఈరోజు నుంచి మీరు పని మొదలు పెట్టండి. మీరు పిలుపునిస్తే కనీసం 2 వేల మంది రావాలి. ఇది నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌లకు ఇస్తున్న టార్గెట్‌. అలా లేకపోతే ఆ దిశగా కృషి చేయాలి. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా ఇది మీ తొలి అడుగు. మీ చివరి అడుగు కనీసం ఎమ్మెల్యే కావడం. ఎదగడం మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. కానీ మీరు పై మూడు గుణాలు పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు దాన్ని బేరీజు వేసుకోవాలి. ఆరు నెలల్లో దాన్ని సాధించాలి. 

కార్యాచరణ ఇలా ఉండాలి..
దీనికి తగ్గట్టుగానే గ్రామ, మండల, మున్సిపాలిటీ, వార్డు కమిటీలు ఏర్పాటు కావాలి. వాటిలో సమర్థులను నియమించండి. ఎదగడానికి సిద్ధంగా ఉన్నవారిని పార్టీలోకి తీసుకురండి. అసంఘటితంగా ఉన్నవారిని సంఘటితం చేయాలి. అలా మీరు పక్కా ప్రణాళికతో పని చేస్తే, చొరవ చూపితే, కృషి చేస్తే రాజకీయంగా బాగా ఎదుగుతారు. అప్పుడు మీరు ఒక్క పిలుపునిస్తే జనం కదిలి వస్తారు. ఇక పార్టీ జిల్లా అధ్యక్షులు, యువజన విభాగం అధ్యక్షుడిగా మీరు పిలుపునిస్తే కనీసం 5 వేల మంది రావాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోతే వెంటనే కమిటీల మీద దృష్టి పెట్టండి.

వాటిని ఏర్పాటు చేయండి. వాటి పనితీరు ఎప్పటికప్పుడు బేరీజు వేయండి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న యూత్‌ అధ్యక్షులకు చేదోడు వాదోడుగా ఉంటూ, సలహాలు ఇస్తూ వారిని చేయి పట్టుకుని నడిపించండి. తద్వారా మీరు ఎదుగుతారు. అప్పుడు మీరు పిలుపునిస్తే ఐదు వేలు కాదు.. 20 వేల మంది కదిలి వస్తారు. ఇక పార్టీ జోన్‌ విభాగం అధ్యక్షుడిగా మీరు పిలుపునిస్తే 10 వేల మంది రావాలి. అలా లేకపోతే, ఆ స్థాయికి ఎదగడం కోసం పక్కాగా ప్లాన్‌తో పని చేయండి. పార్టీలో కింది శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ ముందుకు నడిపించడం మీ కార్యాచరణ కావాలి. అలా మీరు రాజకీయంగా ఎదిగాక, మీరు పిలుపునిస్తే పది వేలు కాదు.. ఏకంగా 40 వేల మంది వస్తారు.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌..
ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగడం కోసం పార్టీలో కొత్తగా వర్కింగ్‌ ప్రెసిడెంట్లను నియమిస్తున్నాం. వారు మీకు అండగా ఉంటారు. యువ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన యువ నాయకులను ఆ పదవుల్లో నియమిస్తాం. ఆర్గనైజేషన్‌ తెలిసిన వారు మీకు తోడుగా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెడతారు. అలా కేసులు పెట్టినా ఎదుర్కొనేలా.. పార్టీ మీకు అండగా, తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చేందుకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన యంగ్‌ అభ్యర్థులను వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా తీసుకొస్తున్నాం. వారు పార్టీ జోన్లకు వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా పని చేస్తారు.

ఆ విభాగాలు బలంగా ఉండాలి..
పార్టీలో సంస్థాగతంగా యువజన, మహిళ, విద్యార్థి, రైతు విభాగాలు చాలా బలంగా ఉండాలి. అలాగే ఎస్సీ, బీసీ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలి. అప్పుడు పార్టీ మరింత బలపడుతుంది. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి. అలా అన్ని వ్యవస్థలు దృఢంగా ఏర్పడితే పార్టీ మరింత బలపడుతుంది. ఇంకా ఎదుగుతుంది. 

మీ ఫోన్‌.. మీ ఆయుధం
ఆర్గనైజేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియాలో భాగస్వామ్యం కావాలి. ఇది సోషల్‌ మీడియా యుగం. కాబట్టి మీ ఫోన్‌ ఒక గన్‌ లాంటిది. అంటే అది ఒక ఆయుధం అన్నమాట. సోషల్‌ మీడియా ఎక్కౌంట్, యూట్యూబ్, ఎక్స్‌ పోస్టులు.. ఇలా అన్ని మాధ్యమాల్లో మీరు చురుకుగా ఉండాలి. గ్రామస్థాయి వరకు భాగస్వామ్యం కావాలి. మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే, దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే, పార్టీలో మా వరకు తెలియడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులందరికీ ఈ మెసేజ్‌ వెళ్లాలి. ఎవరికి, ఎక్కడ, ఏ అన్యాయం జరిగినా పార్టీ మొత్తం తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి. ఇదీ విజన్‌. ఇందులో భాగస్వాములు కావాలి. ఇది మీ అందరికీ తెలియాలి.

విలువలు, విశ్వసనీయతకే పెద్దపీట
2011లో మన పార్టీని స్థాపించాం. నేను కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చినప్పుడు నా వెనక ఎవరూ లేరు. నేను, అమ్మ.. ఇద్దరం కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చాం. మా  ఇద్దరితోనే పార్టీ ప్రస్థానం మొదలైంది. అప్పుడు నాతో రావడానికి కొందరు సిద్ధం కాగా.. ఇప్పుడు నా పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి, నాతో రమ్మని చెప్పను. రాజకీయంగా తెరమరుగైపోతావ్‌ అంటున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో నాతో రమ్మని చెప్పలేనన్నాను. దేవుడు దయ తలిచి, పరిస్థితులు చక్కబడ్డప్పుడు, నేను బాగున్నప్పుడు రమ్మని చెప్పా. ఎందుకంటే.. అప్పుడు నేను కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో ఢీ కొడుతున్నా. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ విలువలు, విశ్వసనీయతకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చా. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఏరోజూ వాటి విషయంలో రాజీ పడలేదు.

ఒంటరిగా మొదలై ఎదిగాం..
ఆ సమయంలో కాంగ్రెస్‌ను వీడి 18 మంది నాతో వస్తామన్నారు. వారందరినీ రాజీనామా చేయమని కోరా. అప్పటి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూడా వస్తానంటే తననూ రాజీనామా చేయమన్నా. అలా 18 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ రాజమోహన్‌రెడ్డి అందరం ఉప ఎన్నికలకు వెళ్లాం. అప్పుడు నాకు 14వ లోక్‌సభలో రికార్డు స్థాయిలో అత్యధికంగా ఏకంగా 5.50 లక్షల మెజారిటీ వచ్చింది. పార్లమెంట్‌లో అందరూ మనవైపే చూశారు. దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో... నాపై కక్ష కట్టారు. సిట్టింగ్‌ ఎంపీగా ఎం.రాజమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో పార్టీ నుంచి 15 మంది విజయం సాధించారు. ఎక్కడా విలువలు, విశ్వసనీయత తగ్గలేదు.

కాంగ్రెస్‌ – టీడీపీ కుమ్మక్కు...
నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కరెంటు చార్జీలు విపరీతంగా పెంచితే ఆ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. దానికి మద్దతు ఇవ్వాలని టీడీపీని కోరినా.. చంద్రబాబు కలిసి రాలేదు. అప్పుడు ఆయన కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిల్చి, నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడారు. కాంగ్రెస్, టీడీపీ రెండూ కుమ్మక్కయ్యాయి. దాంతో ఆ ప్రభుత్వం గట్టెక్కింది. అలా ఆ రెండు పార్టీలు విలువలు లేని రాజకీయం చేశాయి.

టీడీపీకి దేవుడు మొట్టికాయ..
రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియో­జకవర్గాల్లో ఎన్నికలు జరిగితే.. మన పార్టీ నుంచి 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు గెలిచారు. అయితే వారిలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను లాక్కున్నారు. అలా అనైతిక రాజకీయాలు చేశారు. కానీ ఆ తరువాత ఏం జరిగింది? 2019లో జరిగిన ఎన్నికల్లో మన పార్టీకి అఖండ విజయం దక్కింది. అదే టీడీపీకి ఆ ఎన్నికల్లో దేవుడు మొట్టి­కాయ వేశాడు. ఆ ఎన్నికల్లో టీడీపీకి సరిగ్గా 23 ఎమ్మెల్యే సీట్లు, మూడు ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే అంతకుముందు మన పార్టీ నుంచి ఎంత మందినైతే అనైతికంగా లాక్కు­న్నారో, ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి సరిగ్గా అన్నే సీట్లు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement