వ్యవసాయ పథకాలపై ఏపీ రైతులకే ఎక్కువ అవగాహన
అన్ని పథకాలపై అవగాహనకు రైతు భరోసాయే మూలం
ఈ పథకాన్ని జగన్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామ స్థాయిలో నెలకొల్పిన వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) వ్యవస్థ రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. రైతులకు అవసరమైన మందులు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలతో పాటు ప్రభుత్వ పథకాలను కూడా అన్నదాతలకు చేరువ చేస్తున్నాయి. వీటితో పాటు వ్యవసాయ అధికారులూ క్షేత్రస్థాయిలో రైతులకు అన్ని విధాలుగా సహాయ పడుతున్నారు.
మరీ ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ ప్రవేశ పెట్టి, సమర్ధంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం రైతుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇతర పథకాలపైనా పూర్తి స్థాయిలో అవగాహన పెరగడానికి దోహదపడింది. ఈ పథకాలను ఏపీ రైతులు సమర్ధంగా వినియోగించుకుంటున్నారు. పథకాల అమలు, రైతులకు అవగాహన కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ పథకాలపై రైతుల అవగాహనపై నాబార్డు నిర్వహించిన సర్వే ఈ విషయాలను వెల్లడించింది. ప్రధానంగా రుణాలు, బీమా, నిల్వ, మార్కెటింగ్‌పై రైతుల్లో అవగాహన, రైతులకు పథకాల అనుకూలత తదితర అంశాలపై నాబార్డు సర్వే నిర్వహించి, నివేదిక విడుదల చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ పథకాల పట్ల దేశంలో ఇతర రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు అత్యధిక అవగాహన ఉందని ఈ సర్వే తెలిపింది.
రైతులకు సీఎం జగన్ ఇచ్చిన ‘భరోసా’
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న రైతు భరోసా పథకం పట్ల రైతుల్లో సానుకూలత నెలకొందని, వారికి ఈ పథకం ప్రయోజనకరంగా ఉందని సర్వే పేర్కొంది. కిసాన్ క్రెడిట్ కార్డు (కెసీసీ)ల పట్ల ఏపీ రైతుల్లో అత్యధికంగా 86 శాతం అవగాహన ఉందని, మహారాష్ట్రలో కేవలం 27 శాతమే అవగాహన ఉందని తెలిపింది. ఆంధ్రఫ్రదేశ్ రైతుల్లో పంటల బీమా పథకాల పట్ల అత్యధిక అవగాహన ఉందని తెలిపింది.
ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయడమేనని పేర్కొంది. దీంతో పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల పట్ల కూడా ఏపీ రైతుల్లో పూర్తిస్థాయిలో అవగాహన ఉందని చెప్పింది. పంటల బీమా పథకంపై ఏపీ రైతుల్లో 83 శాతం, రాజస్థాన్ రైతుల్లో 66 శాతం అవగాహన ఉందని తెలిపింది.
ఇతర రాష్ట్రాలకు ఏపీనే ఆదర్శం
వివిధ పథకాలు, పంటల బీమా అమలు, అవగాహనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇతర రాష్ట్రాలకు ఓ మంచి ఉదాహరణ అని నాబార్డు తెలిపింది. ఏపీలో ప్రతి గ్రామంలో వ్యవసాయ అధికారి ఉన్నారు. ఆ అధికారి ప్రతి నెలా రైతులకు సంబంధించిన పథకాలపై సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతు భరోసా కేంద్రాల వారీగా గ్రామ స్థాయిలో వలంటీర్లు ప్రతి గ్రామంలో సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ రైతులకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.
వివిధ పథకాలపై రైతులతో దరఖాస్తులు చేయించడం, పునరుద్ధరణ, సమస్యలు, క్లెయిమ్స్ పరిష్కారాల్లో వలంటీర్లు సహకరిస్తున్నారు. అలాగే ఈ–క్రాప్ పోర్టల్–అప్లికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో రైతులు, పంటలు మొదలైన వాటి గురించి సమాచారం ఉంటుంది. పంటల బీమా, క్లెయిమ్‌ల సమాచారం పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. రైతులు సాగు కోసం చేసిన వ్యయం, క్లెయిమ్ మొత్తాన్ని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు క్లెయిమ్ మొత్తాన్ని బదిలీ చేస్తోంది. ఇది ఈ–యాప్‌తో సాధ్యమవుతోంది అని నాబార్డు తెలిపింది. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం, పథకాలను వినియోగించుకోవడంలో రైతుల్లో అవగాహన చాలా బాగుందని, ఇది రైతు భరోసా కేంద్రాల ఫలితమేనని నాబార్డు సర్వే వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment