వ్యవసాయ సలహా మండళ్లు రద్దు చేసిన ప్రభుత్వం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
రాష్ట్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
మండళ్లతో పంటల ప్రణాళిక రూపకల్పనలో రైతుల భాగస్వామ్యం
వీటిని రద్దు చేయడం పట్ల రైతుల ఆగ్రహం
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి కక్ష సాధింపు పరిపాలన రైతుల వైపు మళ్లింది. వ్యవసాయం దండగంటూ గతంలో పాట పాడిన సీఎం చంద్రబాబు.. అధికారంలోకి వచ్చీ రాగానే రైతులను, వ్యవసాయాన్ని దెబ్బతీసే చర్యలు ప్రారంభించారు. పంటల ప్రణాళికలో రైతులను భాగస్వామ్యం చేసి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నిలిపే వ్యవసాయ సలహా మండళ్లను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది.
దేశంలో మరెక్కడా లేని విధంగా ఎంతో సమున్నత ఆశయంతో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏర్పాటు చేసిన బలమైన ఈ వ్యవస్థను రద్దు చేస్తూ వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ ఆదేశాలు జారీ చేశారు.
రాజకీయాలకు తావు లేకుండా
సీజన్ ప్రారంభం నుంచి పంటను మార్కెట్‌లో మద్దతు ధరకు అమ్ముకునే వరకు రైతులకు అండగా నిలిచి, వారి అభ్యున్నతికి తోడ్పడే లక్ష్యంతో 2020లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యవసాయ సలహా మండళ్ల వ్యవస్థను తీసుకొచ్చింది. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా, గ్రామ స్థాయిల్లో ఆదర్శ రైతు, మండల స్థాయిలో స్థానిక ఎమ్మెల్యే సారథ్యంలో ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి.
సంబంధిత శాఖల అధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలు వీటిలో ఉంటారు. రాష్ట్ర, జిల్లా స్థాయి సలహా మండళ్లలో 10 మంది, మండల స్థాయిలో 8 మంది, ఆర్బీకే స్థాయి మండళ్లలో ఆరుగురు చొప్పున రైతులను భాగస్వాములను చేశారు. ఎక్కడా రాజకీయాలకు తావు లేకుండా దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలోనే ఉన్న ఆదర్శ రైతులకే వీటిలో చోటు కల్పించారు. సన్న, చిన్న కారు రైతులతో పాటు మహిళా రైతులు, కౌలు రైతులకూ ప్రాధాన్యతనిచ్చారు. సుమారు లక్ష మంది రైతులు వీటిలో ఉన్నారు.
ప్రతీ నెలా సమావేశమవుతూ
ఆర్బీకే స్థాయి మండలి ప్రతి నెలా మొదటి శుక్రవారం సమావేశమై గ్రామ స్థాయిలో రైతుల సమస్యలు, వారి అవసరాలను గుర్తించి మండల కమిటీకి పంపిస్తారు. ప్రతి నెలా రెండో శుక్రవారం సమావేశమయ్యే మండల స్థాయి మండలి గ్రామ స్థాయిలో వచ్చే సలహాలు, సూచనలు, రైతుల అవసరాలకు తగినట్టుగా ప్రణాళిక రూపొందించి జిల్లా స్థాయి మండలికి పంపిస్తారు.
మూడో శుక్రవారం జిల్లా స్థాయి మండలి సమావేశమై ఈ ప్రణాళికను పరిశీలించి, జిల్లా స్థాయిలో ఓ ప్రణాళిక రూపొందించి రాష్ట్ర కమిటీకి పంపిస్తుంది. రాష్ట్ర స్థాయి సలహా మండలి ప్రతి సీజన్‌లో ఓసారి భేటీ అయి రాష్ట్ర స్థాయి ప్రణాళిక రూపొందిస్తుంది. సలహా మండళ్ల ద్వారా రైతులు ఏ సీజన్‌లో ఏ పంట వేయబోతున్నారో ముందుగానే తెలిసేది.
తద్వారా రైతులు కోరుకున్న విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామ స్థాయిలో అందించే వెసులుబాటు కలిగేది. ఇలా విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలుగా తోడ్పాటు అందించిన ఈ మండళ్ల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తే.. రైతులకు మరింత మేలు జరిగేది. కానీ కూటమి ప్రభుత్వం మండళ్లను రద్దు చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు మండిపడుతున్నారు.
సలహా మండళ్ల బాధ్యతలు
» ఆగ్రో క్‌లైమేట్ జోన్స్, మార్కెట్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పంటల మార్పిడి, పంటల ప్రణాళిక రూపకల్పన
» రైతుల ఆదాయం పెంచే పంటల సాగును ప్రోత్సహించడం
» అదనపు ఆదాయం పెంపు మార్గాలు
» ఎగుమతి మార్గాల అన్వేషణ
» సాగునీటి సమర్ధ వినియోగం
» డిమాండ్ –సరఫరా మధ్య గ్యాప్ లేకుండా పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చేలా ప్రణాళికలు
ఈ సలహా మండళ్లు రద్దు చేయడం సరికాదు
గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్లు రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వీటిని సమర్ధంగా వినియోగించుకుని, మరింత బలోపేతం చేయాలే తప్ప రద్దు చేయడం సరికాదు. –కనుమూరి శ్రీనివాసరాజు, మాజీ చెర్మన్, ఆత్రేయపురం మండల వ్యవసాయ సలహా
మండలి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాఇది కుట్రపూరిత ఆలోచన
వ్యవసాయ సలహా మండళ్ల రద్దు ముమ్మాటికీ కుట్రపూరిత ఆలోచన. రైతులకు మేలు చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థను రద్దు చేయడం సరికాదు. ఇది రైతులపై కక్ష సాధింపే. సూపర్ సిక్స్‌లో ఇచ్చిన ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment