
రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి రేటు పెంచడం ద్వారా ఆదాయం పెంచాలని, అప్పుడే తాను చెప్పిన విధంగా సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేయగలనని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను కోరారు. ఆదాయం పెంచకుండా సంక్షేమం, అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఒక శాతం వృద్ధి రేటు పెంచితే అదనంగా రూ.15 వేల కోట్లు, 3 శాతమైతే రూ.45 వేల కోట్ల ఆదాయం వస్తుందని.. అప్పుడైతేనే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయగలనని పునరుద్ఘాటించారు.
వచ్చే ఆర్ధిక ఏడాది 15 శాతం పైగా వృద్ధి రేటు సాధించేందుకు అనుగుణంగా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సును ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీఎస్‌టీ, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలలి, పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.
మే నెలలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ద్వారా రూ.15 వేలు చొప్పున ఇస్తామని, స్కూల్స్ తెరిచేలోగా ఈ మొత్తాన్ని పంపిణీ చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద మూడు వాయిదాల్లో ఇస్తున్న మొత్తంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు, 5 వేలు, 4 వేలు చొప్పున మూడు వాయిదాల్లో రైతులకు ఇస్తామని తెలిపారు. (హామీ మేరకు రూ.6 వేలు+రూ.20 వేలు = రూ.26 వేలు ఇవ్వాలి. కానీ కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారు).
మెగా డీఎస్సీ కింద 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎస్సీ వర్గీకరణతో సహా ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. స్కూల్స్ తెరిచే నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని చెప్పారు. ఏప్రిల్‌లో మత్స్యకారుల జీవనోపాధికి రూ.20 వేలు ఇస్తామని, 2027లో పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. కలెక్టర్లు సీఈవోలా పని చేయాలని, ఎప్పటికప్పుడు పనితీరుపై సమీక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే..
రెవిన్యూ సమస్యలపై దృష్టి పెట్టడం లేదు
– రెవెన్యూ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కలెక్టర్లు వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కేవలం భూ సంబంధిత సమస్యలే 60–70 శాతం ఉన్నాయి. దీనిపై వర్క్‌షాప్ నిర్వహించాలి. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలిసిన కలెక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, మంత్రులు, నిపుణులు నెల రోజుల్లో నివేదికతో రావాలి. “వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్’ అనే నినాదంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
– ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు రూ.1,030 కోట్లు విడుదల చేశాం. ఇప్పుడు మరో రూ.6,200 కోట్లు విడుదల చేస్తాం. రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరముంది. అన్ని వర్క్ ప్లేసుల్లో చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అంతర పంటలతో అరకు కాఫీని ప్రోత్సహించాలి.
– బీసీల్లో వడ్డెర కులస్తులకు క్వారీలు ఇచ్చేలా, మత్స్యకార సొసైటీలకు చెరువులు అప్పగించి చేపలు పెంచుకునేలా తోడ్పాటు ఇవ్వాలి. కల్లు గీత కార్మీకులకు కేటాయించిన వైన్ షాపులు దుర్వినియోగం కాకూడదు.
– రైతులు ఇచి్చన భూములను తాకట్టు పెట్టడం, విక్రయించడం ద్వారా వచ్చే నిధులతోనే అమరావతి నిర్మాణం చేపడుతున్నాం. అనకాపల్లి వద్ద స్టీల్ ప్లాంట్, రామాయపట్నం కోసం భూములతో పాటు మిగతా ప్రాజెక్టులకు ఇదే నమూనాను అమలు చేయాలి. అనకాపల్లిలో టౌన్íÙప్, రామాయపట్నంలో మరో టౌన్ షిప్ వస్తాయి.
– కలెక్టర్లు.. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన అన్ని అనుమతులను వచ్చేలా చూడాలి. సోలార్ రూఫ్ టాప్, సహజ సేద్యంను ముందుకు తీసుకెళ్లాలి. గ్రీన్ ఎనర్జీ, పర్యాటకం, వాట్సాప్ గవర్నెన్స్, పీ4 గేమ్ చేంజర్ కానున్నాయి.
– వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి. పశువులకు మేతపై దృష్టి పెట్టాలి. వడగాడ్పుల వల్ల ఒక్క వ్యక్తి కూడా మృతి చెందకూడదు. కాల్ సెంటర్ నిర్వహించాలి. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా పచ్చి మేత పెంపకానికి చర్యలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వలసలకు తావివ్వొద్దు.
– మంత్రులు, శాఖాధిపతులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా, నియోజకవర్గ, మండల, సచివాలయాల స్ధాయిలో విజన్ ప్రణాళికలతో ముందుకు సాగాలి. శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీలతో కలిసి పని చేయాలి. సాంకేతికతను ఉపయోగించుకోవాలి.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారు
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ప్రారంభంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో సీఎం పక్కనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కుర్చీ వేశారు. అయితే ఆయన రాకపోయినప్పటికీ ఆ చైర్‌ను అలాగే ఖాళీగా ఉంచి సదస్సు నిర్వహించారు. కాగా, 2025–26 ఆర్థిక ఏడాదిలో స్థూల ఉత్పత్తి లక్ష్యాలలో భాగంగా వృద్ధి శాతం 16, 17, 18 చొప్పున జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్దేశించారు.
Comments
Please login to add a commentAdd a comment