రామాయపట్నం పోర్టు పైలాన్
సాక్షి. ఉలవపాడు(ప్రకాశం): రామాయపట్నం పోర్టు శంకుస్థాపన, ఆ తరువాత పరిణామాలు చూసిన వారికి బాబు నైజమేంటో అర్థమవుతుంది. కేంద్రం పోర్టు నిర్మిస్తామంటే.. లేదు, లేదు తామే కట్టుకుంటామని గొప్పలుపోయిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు.. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పైలాన్లు ఆవిష్కరించడం, ఆ తర్వాత పనులు ప్రారంభించకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా హడావుడిగా కార్యక్రమం ఏర్పాటు చేసి పైలాన్ ఆవిష్కరించారు. అంతే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఇస్తే మేజర్ పోర్టు నిర్మిస్తామని కేంద్రం చెబుతున్నా.. లెటర్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తామని చెప్పడంతోనే ఈ పోర్టు నిర్మాణంపై ప్రజలకు అనుమానం వచ్చింది. రెండు నెలల్లోపు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని జనవరి 9న నిర్వహించిన పైలాన్ ఆవిష్కరణ సభలో చంద్రబాబు చెప్పారు కానీ, ఇప్పటి వరకు అతీగతి లేదు. కేవలం ఎన్నికల ప్రచారం కోసం రామాయపట్నం పోర్టు పేరు వాడుకోవడానికి ఇక్కడ పైలాన్ ఆవిష్కరించారు తప్ప మరొకటి కాదని జిల్లా ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు
ప్రాథమిక అనుమతులే లేవు
రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రక్రియ అంతా మోసమేనని తేలిపోయింది. ఓడరేవుకు అవసరమైన ప్రా«థమిక అనుమతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నుంచి అనుమతి పొందలేదు. ఓడరేవుకు అవసరమైన చోట అటవీ భూములు సేకరించాలి. దీనికి అటవీ శాఖ అనుమతి అవసరం. ఇక భూసేకరణకు సంబంధించి ప్రజల వద్ద నుంచి సేకరించాల్సిన భూమికి సంబంధించిన వివరాలు, సేకరణ అంశాలు అసలు ప్రారంభంకాలేదు. కేవలం ఎన్నికలు వస్తున్నాయనే కారణంతోనే భారీ ప్రాజెక్టు అయిన రామాయపట్నం పోర్టుకు హడావుడిగా శంకుస్థాపన చేశారు. ప్రజలను మోసం చేసే కార్యక్రమంగా మాత్రమే ఇది మిగిలింది.
ముందుకు పడని అడుగు
పోర్టు నిర్మాణానికి ఉలవపాడు, గుడ్లూరు మండలాల పరిధిలో 2,200 ఎకరాలు అవసరమని నిర్ణయించారు. ఉలవపాడు మండలంలోని రామాయపట్నం రెవెన్యూలో 1 నుంచి 262 సర్వే నంబర్లు వరకు, గుడ్లూరు మండలం రావూరు రెవెన్యూ పరిధిలోని 1 నుంచి 72 సర్వే నంబర్ల వరకు భూమిని తీసుకోవాలని భావించారు. అంటే రామాయపట్నం, సాలిపేట గ్రామాలతోపాటు అటవీ శాఖ భూములు ఇందులో ఉన్నాయి. వీటిని సేకిరిస్తేనే పోర్టు నిర్మాణం సాధ్యం. రెండు నెలలో పనులు మొదలు అవుతాయని చెప్పిన చంద్రబాబు కనీసం భూ సేకరణలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. భూ సేకరణ గురించి కానీ, పోర్టు నిర్మాణ పనుల గురించి ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు.
పేపరు మిల్లుదీ అదే పరిస్థితి..
‘పోర్టు, పేపరు మిల్లు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా అభివృద్ధికి డోకా లేదు’ అంటూ బాకా ఊదిన ప్రభుత్వ పెద్దలు అసలు విషయాన్ని మరిచారు. గుడ్లూరు మండలం చేవూరు, రావూరు రెవెన్యూ పరిధిలో పేపరు మిల్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇండోనేషియా ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకుని 2,400 ఎకరాలు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. భూమి పూజ చేసి పైలాన్ ఆవిష్కరించారు. కానీ ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
రామాయపట్నం పోర్టు కోసం వైఎస్సార్ సీపీ పోరాటం
కావలి నుంచి రామాయపట్నం వరకు పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు
రామాయపట్నం పోర్టు కోసం గత ఐదేళ్లుగా వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి కావలి నుంచి రామాయపట్నం వరకు పాదయాత్ర చేశారు. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితోపాటు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కందుకూరుకు వచ్చిన సమయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రామాయపట్నం పోర్టును నిర్మిస్తామని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రజలకు జగన్ భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment