ఓటరు లేకుండా ఓటు వేస్తున్న టీడీపీ నాయకుడు (సర్కిల్‌లో)
సాక్షి, కందుకూరు రూరల్ (ప్రకాశం): మండలంలోని పలుకూరు గ్రామంలో ఉన్న 91, 92, 94 పోలింగ్ బూత్‌లలో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఓటర్లకు మేము డబ్బులు ఇచ్చాం ఆ ఓట్లు మేమే వేసుకుంటామని టీడీపీ మండల నాయకుడు, కొందరు టీడీపీ ఏజెంట్లు ఓటర్ల వద్ద నుంచి దౌర్జన్యంగా స్లిప్పులు లాక్కొని మరీ ఓటు వేసుకున్నారు. ఎవరైనా ఓటు వేయడం చేతగాని వారు... చూపు కనిపించని వారు ఉంటే వారి బంధువులతో ఓటు వేయించుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగకుండా మేము ఆ ఓటరుకి డబ్బులు ఇచ్చాం... ఆ ఓటు తామే వేసుకుంటామని ఓటరు వద్ద నుంచి స్లిప్ లాక్కొని ఓటు వేసుకున్నారు.
ఏజెంట్లు వెళ్లి ఓటు వేయవద్దని వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు వాధించినప్పటికీ పట్టించుకోకుండా దౌర్జన్యంగా ఓట్లు వేసుకున్నారు. దీనిపై పోలింగ్ అధికారిని ఏజెంట్లు ప్రశ్నించినా మీరు తేల్చుకోండని తప్పించుకునే ధోరణితో మాట్లాడుతున్నారే తప్పా నిబంధనలను పాటించ లేదు. నా ఓటు నేను వేసుకుంటానని ఓ ఓటరు టీడీపీ ఏజెంట్‌తో వాదించాడు. ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతుండగానే టీడీపీ ఏజెంట్ ఓటరు వద్ద స్లిప్ లాక్కొని దానిని టీడీపీ నాయకుడు రోశయ్యకు ఇచ్చారు. ఆయన స్లిప్ తీసుకుని కనీసం ఓటరును ఈవీఎం వద్దకు కూడా తీసుకెళ్లకుండా హడావిడిగా ఓటు వేశాడు.
వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు వారిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా ఓట్లు వేసుకుంటున్నారు. ఇలా అనేక మంది ఓట్లను దౌర్జన్యంగా వేసుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. బూత్‌లలో వెబ్ కాస్టింగ్ కెమేరాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా టీడీపీ ఏజెంట్లు ఓట్లు వేసుకోవడంపై ఓటర్ల అసహనం వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా తమ ఓటు తాము వేసుకోలేకపోతున్నామని కావాలని స్లిప్‌లు లాక్కొని ఓట్లు వేసుకున్నారని కొందరు ఓటర్లు ఆవేదన చెందారు. బూత్‌లలోని వెబ్ కాస్టింగ్ కెమేరాల పుటేజిని పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాలని ఓటర్లు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment