చంద్రబాబు ఆలోచన ఒకటి.. అభ్యర్థులు మనోగతం మరొకటి | TDP Party Leaders Not Interested in Prakasam Parliament Seat | Sakshi
Sakshi News home page

ఎడ్డెం అంటే తెడ్డెం

Published Tue, Mar 12 2019 12:32 PM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

TDP Party Leaders Not Interested in Prakasam Parliament Seat - Sakshi

సాక్షిప్రతినిధి,ఒంగోలు: బాబ్బాబు.. నువ్వు అక్కడి నుంచి పోటీలో ఉండు...లేదు లేదండీ.. నేను చేయలేనండి..అధిష్టానం ఆలోచన ఒకటి.. అభ్యర్థులు మనోగతం మరొకటి.జిల్లాలో టీడీపీ నుంచి ఒంగోలు పార్లమెంట్‌ స్థానంతో పాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించింది. పోటీకి ఎవరూ ముందుకురాని దుస్థితి నెలకొంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ ముఖ్యనేతలు ప్రకాశం జిల్లా నుంచి రోజూ కొందరు నాయకులను అమరావతికి పిలిపించుకొని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.

ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ నుంచి ఎవరూ ముందుకు రాకపోవడంతో మంత్రి శిద్దా రాఘవరావును నిలిపితే బాగుంటుందని ఆ పార్టీ జిల్లా నేతలు ముఖ్యమంత్రికి సూచించారు. ఈ మేరకు మంత్రి శిద్దాతో చర్చించిన చంద్రబాబు పార్లమెంట్‌కు పోటీ చేయాలని శిద్దాను ఆదేశించారని, ఇందుకు  మంత్రి శిద్దా ఓకే చెప్పినట్లు సమాచారం. శిద్దా రాఘవరావు పార్లమెంట్‌కు పోటీ చేయనుండడంతో దర్శి టీడీపీ అభ్యర్థిగా కనిగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కదిరి బాబూరావును నిలపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. కనిగిరి టీడీపీ అభ్యర్థిగా ఇటీవల టీడీపీలో చేరిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కనిగిరిలో రెడ్డి సామాజికవర్గం ఓట్లలో చీలిక తెచ్చేందుకే సీఎం కనిగిరి అభ్యర్థిగా ఉగ్రను ఎంపిక చేసినట్లు  తెలుస్తోంది.

అయితే తాను దర్శి అభ్యర్థిగా పోటీ చేయనని ఎమ్మెల్యే కదిరి బాబూరావు అడ్డం తిరిగారు. ఈ విషయం టీడీపీ అధిష్టానానికి బాబూరావు ఇదివరకే పలుమార్లు తెలిపారు. చంద్రబాబు ఇందుకు అంగీకరించ లేదు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణకు సన్నిహితుడైన  కదిరి చివరి వరకూ కనిగిరి టీడీపీ టికెట్‌ కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు కనిగిరి టికెట్‌  ఉగ్ర నరసింహారెడ్డికే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉగ్రకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. సోమవారం మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కదిరి బాబూరావును అమరావతికి పిలిపించి మాట్లాడారు. దర్శి నుంచే పోటీ చేయాలని సుజన మరోమారు కదిరికి సూచించారు. సామాజిక సమీకరణాల్లో భాగంగానే దర్శికి ఎంపిక చేసినట్లు సుజనా కదిరికి చెప్పారు. కనిగిరిలో గెలవలేవని, సర్వేలలో తేలిందని, పార్టీకి చెందిన కొందరు నేతలు సైతం నిన్ను వ్యతిరేకిస్తున్నారని సుజన కదిరికి వివరించినట్లు సమాచారం. అయినా తాను దర్శికి వెళ్లేది లేదని టికెట్‌ ఇవ్వక పోతే కనిగిరి నుంచే స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కదిరి సుజనా చౌదరికి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దర్శి నుంచే పోటీ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారని తరువాత నీఇష్టం అని సుజనా కదిరికి స్పష్టం చేశారు. పోటీకి ఒప్పుకోకపోతే మంత్రి శిద్దా  కుటుంబం నుంచే దర్శి అసెంబ్లీకి సైతం పోటీ చేయిస్తామని సుజనా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కదిరి అక్కడి నుంచి వెళ్లి పోయినట్లు  సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement