కలెక్టర్ బంగ్లా ఎదుట ప్రభుత్వ పథకాల ప్రచార ఫ్లెక్సీ
ఒంగోలు: టీడీపీ నేతలు ఎన్నికల కోడ్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. పాలక పార్టీ నేతల హోర్డింగులు, ఫ్లెక్సీల తొలగింపునకు ఒంగోలు మున్సిపల్ అధికారులు జంకుతున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఆర్టీసీ బస్టాండ్‌లో మాత్రం ప్రచార హోరు తగ్గడం లేదు. డిపోలోని భారీ స్క్రీన్‌పై ఇప్పటికీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన యాడ్‌లతో పావుగంటకోసారి ఊదరగొట్టేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని, వీటిని నిలుపుదల చేయాలని ప్రతిపక్ష నేతలు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. మరో వైపు బస్టాండులోని డిపో కంట్రోలర్ రూము వద్ద రాయితీలకు సంబంధించి చంద్రబాబు ఫొటోతో కూడిన ప్రచార పోస్టర్లు యథావిధిగా కొనసాగుతున్నాయి.
ఇక డిపోలోని స్తంభాలకు సీఎం పేరుతో కూడిన పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. డిపో గ్యారేజీ గేటుకు సమీపంలో టీడీపీ అనుబంధ యూనియన్ నాయకులు చంద్రబాబు, మంత్రి ఫొటోలతో వేసిన భారీ ఫ్లెక్సీని ఇంకా తొలగించలేదు. బస్టాండ్‌తోపాటు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులపైన ఎన్‌టీఆర్ ఫొటోతో ఉన్న వైద్య సేవ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండులో రాజీవ్ మార్గ్ నుంచి బస్టాండ్ జంక్షన్‌లోకి వెళ్లే మార్గంలో చంద్రబాబు, మంత్రుల ఫోటోలతో ఉన్న భారీ కటౌట్‌ను అధికారులు తొలగించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కలెక్టర్ బంగళాకు అభిముఖంగా కబాడీపాలెం వైపు వెళ్లేమార్గంలో భారీ హోర్డింగ్ ఒకటి కోడ్ ఉల్లంఘన తీరును తేటతెల్లం చేస్తోంది. ప్రధానంగా హోర్డింగ్‌ల తొలగింపులో నగరపాలక సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment