సాక్షి, అమరావతి: సుబాబుల్, జామాయిల్, సరుగుడు కర్రకు ధరలేక రైతులు లబోదిబోమంటున్నారు. బడా పేపర్ మిల్లులను కట్టడి చేయడంలో రాష్ట్రంలోని గత ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో వాళ్లు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. అందరి సమక్షంలో కుదుర్చుకున్న కనీస ఒప్పంద ధరను సైతం ఇవ్వలేమని ఐటీసీ సహా ఇతర పేపర్ మిల్లులు తెగేసి చెబుతున్నాయి. ఫలితంగా జామాయిల్ రైతులు ఎకరానికి సుమారు 25 వేలు, సుబాబుల్ రైతులు ఎకరానికి రూ.20 వేలు ఏటా నష్టపోతున్నారు. ధరల వ్యవహారంలో కంపెనీలు రైతుల్ని ఏమాత్రం ఖాతరుచేయకుండా అగౌరవపరుస్తున్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వమైనా తమ గోడు పట్టించుకోవాలని సుబాబుల్, జామాయిల్ రైతుల సంఘం కోరుతోంది.
రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలలో సాగు..
రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఎకరాలలో సుబాబుల్, జామాయిల్ (యూకలిప్టస్), సరుగుడు (చౌకలు) సాగవుతోంది. విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాధారిత పంటగా వీటిని సాగుచేస్తున్నారు. మొత్తం సాగులో 40 శాతం వరకు ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఉంది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం 80 వేల నుంచి లక్ష మంది వరకు ఈ తోటల్ని పెంచుతుంటారు. ఒకసారి ఈ మొక్కల్ని నాటితే పది పన్నెండేళ్ల పాటు ఉంచవచ్చు. వానలు ఉండి కాస్తంత సస్యరక్షణ చేస్తే మూడేళ్లలో తొలిసారి కర్ర కొట్టవచ్చు. మూడేళ్లకు కౌలు కలుపుకుని ఎకరానికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. అన్నీ సవ్యంగా ఉంటే 25 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుంది.
మిల్లుల ఇష్టారాజ్యం.. ధరలు దారుణం
2014కి ముందు సుబాబుల్, జామాయిల్ ధరలు టన్నుకు రూ. 4,400 నుంచి రూ.4,600 మధ్య ఉండేది. ఆ తర్వాత ధరలు క్రమేణా తగ్గడం మొదలుపెట్టాయి. దీంతో రైతులు ఆందోళనకు దిగడంతో టీడీపీకి చెందిన ఆనాటి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రైతులు, పేపర్ మిల్లుల ప్రతినిధులతో సమావేశమై కనీస ధరను రూ.4,600గా నిర్ణయించారు. అయితే, ఇందుకు మిల్లర్లు ప్రత్యేకించి ఐటీసీ వంటి కంపెనీలు ససేమిరా అనడమే కాకుండా రూ.4,000లకు మించి ఇవ్వలేమని భీష్మించాయి. ఈలోగా వ్యవసాయ మంత్రి మారిపోవడంతో రైతులు మళ్లీ మొరపెట్టుకున్నారు. జిల్లాకో రేటు పెట్టుకునేందుకు, తమ ఏజెంట్లతో కొనుగోలు చేయించేందుకు అనుమతివ్వాలని కంపెనీలు పట్టుబట్టి సాధించాయి. కంపెనీ ఏజెంట్లు, ఏఎంసీ అధికారులు కుమ్మక్కై ఏదో నామమాత్రంగా నిబంధనల ప్రకారం కొన్నట్టు చూపి మిగతా కర్రను తమ ఇష్టానుసారం కొంటున్నారు.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, చీమకుర్తి ప్రాంతంలో రూ.4,400లకు కొనాల్సిన జామాయిల్ కర్రను టన్ను రూ.1,800, సుబాబుల్‌ను రూ.2 వేల నుంచి రూ.2,400 మధ్య కొంటున్నారు. అదే కృష్ణాజిల్లా నందిగామలో రూ.2 వేలకు మించి ఇవ్వడంలేదు. కర్ర కొట్టుడు, రవాణా ఖర్చులను తామే భరిస్తున్నందున ఇంతకుమించి ఇవ్వలేమని పేపర్ మిల్లులు తెగేసి చెబుతున్నాయి. రవాణా సౌకర్యం బాగుంటే ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే మారుమూల అయితే ధర తక్కువగా ఉంటోందని సుబాబుల్ రైతుల సంఘం నాయకుడు హనుమారెడ్డి చెప్పారు.
ప్రతి రైతుకూ ఏటా రూ.25 వేలు నష్టం
ధర లేకపోవడంతో రైతులు ఏటా ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25 వేల వరకు నష్టపోతున్నారు. దీనిపై రైతులు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నాచేసినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం జామాయిల్ కర్ర టన్నుకు నిర్ణయించిన రూ.4,400ను, సుబాబుల్‌కు నిర్ణయించిన రూ.4,200ల ధరైనా ఇవ్వకపోతే తాము బతికేదెలా? అని ప్రశ్నిస్తున్నా రైతుల వేదన అరణ్యరోదనగానే మిగిలింది. ఆ ధరతో కొనుగోలు చేయలేమని ఐటీసీ, ఏపీ పేపర్ మిల్స్, జేకే పేపర్ మిల్స్ చెబుతున్నాయి. పేపర్ ధర పెరుగుతున్నప్పుడు ముడిసరకు ధర ఎందుకు పెరగదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
తీసి ఇవ్వాలంటే ఎలా?
గత ప్రభుత్వ అనాలోచిత చర్యవల్ల రైతులే తమ తోటల్ని నరికి కర్రను స్టాక్ పాయింట్‌కు తరలించాల్సిన పరిస్థితి. ఇది చాలదన్నట్టు ఆ కర్రకుండే తాటను సైతం రైతులే తీయించి పేపర్ మిల్లులకు సరఫరా చేయాలని ప్రకాశం జిల్లాలో షరతు విధించారు. ఈ నిబంధనను తొలగించాలని రైతులు ఆందోళన చేస్తే దాన్ని తీసివేయడానికి బదులు రాష్ట్రవ్యాప్తంగా అదే విధానాన్ని అమలుచేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment