చేతులు కాలినా విధానాలు మారవా? | Sakshi Guest Column On Cotton Cultivation | Sakshi
Sakshi News home page

చేతులు కాలినా విధానాలు మారవా?

Published Tue, Nov 5 2024 4:55 AM | Last Updated on Tue, Nov 5 2024 4:55 AM

Sakshi Guest Column On Cotton Cultivation

విశ్లేషణ

పంజాబ్‌ రైతులు పత్తిలో భయంకరమైన బోల్‌వార్మ్‌ తెగుళ్ళను ఎదుర్కోవడానికి ఏళ్లుగా వాడిన బీటీ–1, బీటీ– 2  రెండూ విఫలమైనాయి. చేతులు కాలిన తర్వాత కూడా విధాన నిర్ణేతలు ఎలాంటి పాఠాలూ నేర్చుకోలేదు. హెర్బిసైడ్‌(కలుపు నివారిణి గ్లైఫోసేట్‌)ను తట్టుకోగల జన్యుపరివర్తిత కొత్త తరం పత్తి (హెచ్‌టీబీటీ)ని అనుమతించే ప్రయత్నం కలవరపెడుతోంది. బీటీ పత్తి సాగు వల్ల అధిక దిగుబడి వస్తుందనే అపోహను బద్దలుకొట్టే విషయం ఏమిటంటే, పత్తి దిగుబడిలో భారత్‌ కంటే ముందున్న చాలా దేశాలు వాస్తవానికి జన్యుమార్పిడి రకాలను పండించడం లేదు. జీఎం మొక్కజొన్న, జీఎం సోయా, జీఎం అల్ఫాల్ఫా పైలట్‌ ప్రాజెక్ట్‌లకు అమెరికా ప్రయత్నిస్తోంది. నెమ్మదిగా ఇవి జన్యుమార్పిడి ఆహార పంటల తుది ప్రవేశానికి తలుపులు తెరుస్తాయి.

ఏదో తప్పు జరుగుతోంది. 2070 నాటికి భారతదేశం నికర–జీరో ఉద్గారాలకు కట్టు బడి ఉన్న సమయంలో, మన విధాన ప్రతిస్పందన కూడా అలాగేఉండాలి. రసాయన రహిత వ్యవసాయ పద్ధతుల కోసం మార్గదర్శకా లను రూపొందించడంపై దృష్టి పెట్టాలి. కానీ హానికరమైన కలుపు నివారిణి గ్లైఫోసేట్‌ (గడ్డిమందు)ను పత్తి సాగులోకి విస్తృతంగా అను మతించడానికి వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని సీనియర్‌ అధికారులు పరిశ్రమల శ్రేణులతో జతకట్టడం కలవర పెడుతోంది.

ఇది ఇక్కడితోనే ఆగదు. హెర్బిసైడ్‌(కలుపు నివారిణి)ని తట్టుకో గల జన్యుపరివర్తిత కొత్త తరం పత్తి(హెచ్‌టీబీటీ)ని ఆమోదించడంలోని చిక్కులను కూడా ప్రత్యేక కమిటీ పరిశీలిస్తోందని నివేది కలు చెబుతున్నాయి. భారతదేశంలో వాణిజ్య సాగు కోసం ఆమోదించిన ఏకైక జన్యుమార్పిడి పంట అయిన బీటీ పత్తి విస్తీర్ణం పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌ లలో కుప్పకూలిన సమయంలో ఇది వస్తోంది. సాగులో 46 శాతం క్షీణత, వాయవ్య ప్రాంతాల్లో పత్తి దెబ్బతినడం మన కళ్లు తెరిపించాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా, అదే పరిష్కారంగా ముందుకు సాగడం కలవరపెడుతోంది (ఇప్పుడు కలుపు సంహారిణిని తట్టుకునే అదనపు జన్యువుతో).

గతంలోనూ ఇలాగే చెప్పారు!
రైతులపై, పర్యావరణంపై బీటీ పత్తిపంట కలిగించిన విధ్వంసం నుండి ఏదైనా పాఠాలు నేర్చుకుంటే తక్షణ దిద్దుబాటు జరగాలి. కానీ పరిశ్రమ లాబీ ఎంత బలమైనదంటే, మన విధాన రూపకర్తలు వాళ్ల ఒత్తిడికి ప్రతిస్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. బీటీ పత్తి సాగు విస్తీర్ణం కనిష్ఠ స్థాయికి పడిపోయిన పంజాబ్‌ నుండే ఇది మొదలైంది. బీటీ–3 విత్తనాలను కేంద్రం అందుబాటులోకి తేవాలని ఆ రాష్ట్రం డిమాండ్‌ చేసింది. 

పంజాబ్‌ రైతులు భయంకరమైన బోల్‌వార్మ్‌ తెగుళ్ళను ఎదు ర్కోవడానికి సంవత్సరాలుగా వాడిన బీటీ పత్తి రకాలైన బీటీ–1, బీటీ– 2 (బోల్‌గార్డ్‌ అని పిలుస్తారు) రెండూ విఫలమై దెబ్బతిన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వినాశకరమైన తెల్లదోమ దాడి అనేకమంది రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ రెండింతలు జాగ్రత్తగా ఉంటుందని నేను అనుకున్నాను. చేతులు కాలి పోయిన తర్వాత కూడా పంజాబ్‌ ఎలాంటి పాఠాలూ నేర్చుకోలేదు. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు సరేసరి.

మరింత ముందుకు వెళ్ళేముందు, హెర్బిసైడ్లను తట్టుకునే జన్యు మార్పిడి పత్తి అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సులువుగా చెప్పాలంటే, హెర్బిసైడ్‌ని తట్టుకోవడం కోసం ఒక అద నపు జన్యువును పత్తి రకంలో చొప్పిస్తారు. ఇక్కడ గ్లైఫోసేట్‌ అని భావించాలి. ఇంతకుముందు మోన్‌ శాంటోను కొనుగోలు చేసిన బేయర్‌ కంపెనీ వెబ్‌సైట్‌లో, బోల్‌గార్డ్‌–3 (రైతులు దీనిని బీటీ–3 అని పిలుస్తున్నారు) ‘మూడు ప్రోటీన్‌ లతో మీ పత్తి మొక్కలను బోల్‌వార్మ్‌ నుండి, ఇతర తెగుళ్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు. పురుగు నియంత్రణను తక్కువ పిచికారీలతో అరికట్ట వచ్చనీ, పత్తికి అన్ని సీజన్లలోనూ తక్కువ నష్టం కలిగిస్తుందనీ చెప్పారు.

జన్యుమార్పిడి పత్తికి చెందిన మునుపటి రెండు జాతుల పనితీరుపై కూడా ఇలాగే అతిశయించి చెప్పారు. వాస్తవ సత్యాలను మాత్రం చాలా సౌకర్యవంతంగా ఫుట్‌నోట్‌లలో పెట్టేశారు. ‘నేచర్‌ ప్లాంట్స్‌ జర్నల్‌’ 2020 మార్చిలో ప్రచురించిన ఒక పత్రంలో, నాగ్‌ పూర్‌లోని సెంట్రల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ కాటన్‌ రీసెర్చ్‌ మాజీ డైరెక్టర్‌ కె.ఆర్‌. క్రాంతి, ప్రసిద్ధ మానవ శాస్త్రవేత్త, వాషింగ్టన్‌ యూనివర్సిటీకి చెందిన గ్లెన్‌ డేవిస్‌ స్టోన్‌ ఇద్దరూ భారతదేశంలో బీటీ పత్తి దీర్ఘకాలిక ప్రభావాన్ని పరిశీలించారు. 

వారి అంతిమ నిర్ధారణ ఏమిటంటే, దిగుబడి విషయంలో జన్యుమార్పిడి పత్తి పేలవంగా పనిచేసింది. పురుగుమందుల వాడకం తగ్గిన ప్రారంభ దశ తర్వాత, రసాయనాల వినియోగం వాస్తవానికి పెరిగింది. బీటీ పత్తిని విడుదల చేసిన తర్వాత భారతదేశం చూసిన ఉత్పత్తి పెరుగుదల వాస్తవానికి ఎరు వులు, నీటిపారుదల వంటి ప్రధాన ఇన్‌ పుట్‌ల పెరుగుదల కారణంగా జరిగిందే.

పురుగుమందుల వాడకం విషయానికొస్తే, 2002–2013 మధ్య పత్తిపై పురుగుమందుల వాడకం 93 శాతం పెరిగింది. ఎరువుల విని యోగం 2004–2016 మధ్య 58 శాతం పెరిగింది. జన్యుమార్పిడి పత్తి సాగును చేపట్టిన 24 సంవత్సరాల తర్వాత భారత్, దిగుబడి పని తీరుకు సంబంధించి 70 దేశాలలో 36వ స్థానంలో ఉంది. బీటీ పత్తి సాగు వల్ల అధిక దిగుబడి వస్తుందనే అపోహను బద్దలు కొట్టే విషయం ఏమిటంటే, భారత్‌ కంటే ముందున్న చాలా దేశాలు వాస్తవా నికి జన్యుమార్పిడి రకాలను పండించడం లేదు.

పత్తి సాగును మార్చడానికి విధాన నిర్ణేతలకు ఇది గుణపాఠం కాదా? ఆ విషయానికి వస్తే, ఇప్పటికే సాగులో ఉన్న రకాలతో పోలిస్తే తక్కువ దిగుబడిని ఇస్తున్నప్పటికీ జీఎం ఆవాలు అధిక దిగుబడిని ఇస్తున్నాయంటున్న వాదనలను కూడా వారు చూడకూడదా? తద్వారా, దీర్ఘకాలిక ఆరోగ్యం, పర్యావరణ ప్రభావాలను (పంటల ఉత్పాదకతలో ఎలాంటి తగ్గుదల లేకుండా) పట్టించుకుంటూ, వాతా వరణాన్ని తట్టుకోగల వ్యవసాయ పద్ధతులకు మారడం వైపు దృష్టి కేంద్రీకరించవద్దా?

బీటీ పత్తితో దుర్భరమైన అనుభవం వ్యవసాయ రోడ్‌మ్యాప్‌ను మళ్లీ గీయవలసిన అవసరాన్ని చూపుతుంది. స్థిరమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల అగ్రిబిజినెస్‌ దిగ్గజం బేయర్‌తో పరిశోధనా సహకారం నెలకొల్పుకున్న ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌(ఐకార్‌) వాస్తవాలను చూడటానికి నిరాకరించింది.

జంట వ్యూహం
అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి జీఎం పంటలను నెట్టడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో మెక్సికో ప్రతిఘటించిన తర్వాత నెమ్మదిగా పెద్ద మార్కెట్‌ అయిన భారత్‌ వైపు దృష్టి పెట్టింది. ఆహార భద్రతను పెంపొందించడానికి అమెరికా జన్యుమార్పిడి పంటల దిగుబడిపై దృష్టి సారించింది (వాణిజ్యపరంగా ప్రవేశపెట్టిన జన్యుమార్పిడి పంటల నుండి దిగుబడి పెరిగినట్లు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఆధారాలు లేవు). 

ఇథనాల్‌ ఉత్పత్తిలో వాడేందుకు జీఎం మొక్కజొన్న, ఇంకా జీఎం సోయా, ఎండుగడ్డి పశుగ్రాసం కోసం జీఎం అల్ఫాల్ఫా లాంటి కొన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయడా నికి కూడా ప్రయత్నిస్తోంది. జీఎం అల్ఫాల్ఫా లాంటిది వెంటనే ఆహార గొలుసులోకి వెళ్లదు కాబట్టి ప్రజల ఆమోదం పొందుతుంది. జన్యుమార్పిడి మొక్కల లోకి చొచ్చుకుపోవడానికి కూడా కొన్ని ప్రయ త్నాలు జరుగుతున్నాయి. నెమ్మదిగా ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలు జన్యుమార్పిడి ఆహార పంటల తుది ప్రవేశానికి తలుపులు తెరుస్తాయి. 

అయితే వీటిని విమర్శించేవారి వాదనలను కొట్టిపారేసేందుకూ, జీఎం పంటలు, రసాయనాల ప్రమాదాలను తక్కువచేసి చూపేందుకూ పెద్ద ప్రయత్నాలే జరుగుతున్నాయని ఇంటర్నేషనల్‌ మీడియా కలెక్టివ్‌ పరిశోధన చెబుతోంది. ఆఖరికి సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాల సంభావ్యతను తగ్గించేందుకు కూడా దీన్ని పొడిగి స్తున్నారు. 

ఉదాహరణకు హార్వర్డ్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్కూల్‌లోని ఒక ప్రొఫె సర్‌కు చక్కెర పరిశ్రమ భారీ సొమ్మిచ్చి, సుక్రోజుకూ, గుండె వ్యాధికీ సంబంధం లేదని చెప్పించినట్టు!  వంగడానికి సిద్ధంగా ఉండే అధికార వ్యవస్థ(శాస్త్రీయ సంస్థలతో సహా) ద్వారా జీఎం పంటలను చొప్పించడం, విమర్శకులను తీవ్రంగా ఎదుర్కోవడం అనే జంట వ్యూహం రాబోయే రోజుల్లో మరింత పదునెక్కనుంది. జాగ్రత్త!

దేవీందర్‌ శర్మ 
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు
ఈ–మెయిల్‌: hunger55@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement