cotton cultivation
-
చేతులు కాలినా విధానాలు మారవా?
పంజాబ్ రైతులు పత్తిలో భయంకరమైన బోల్వార్మ్ తెగుళ్ళను ఎదుర్కోవడానికి ఏళ్లుగా వాడిన బీటీ–1, బీటీ– 2 రెండూ విఫలమైనాయి. చేతులు కాలిన తర్వాత కూడా విధాన నిర్ణేతలు ఎలాంటి పాఠాలూ నేర్చుకోలేదు. హెర్బిసైడ్(కలుపు నివారిణి గ్లైఫోసేట్)ను తట్టుకోగల జన్యుపరివర్తిత కొత్త తరం పత్తి (హెచ్‌టీబీటీ)ని అనుమతించే ప్రయత్నం కలవరపెడుతోంది. బీటీ పత్తి సాగు వల్ల అధిక దిగుబడి వస్తుందనే అపోహను బద్దలుకొట్టే విషయం ఏమిటంటే, పత్తి దిగుబడిలో భారత్ కంటే ముందున్న చాలా దేశాలు వాస్తవానికి జన్యుమార్పిడి రకాలను పండించడం లేదు. జీఎం మొక్కజొన్న, జీఎం సోయా, జీఎం అల్ఫాల్ఫా పైలట్ ప్రాజెక్ట్‌లకు అమెరికా ప్రయత్నిస్తోంది. నెమ్మదిగా ఇవి జన్యుమార్పిడి ఆహార పంటల తుది ప్రవేశానికి తలుపులు తెరుస్తాయి.ఏదో తప్పు జరుగుతోంది. 2070 నాటికి భారతదేశం నికర–జీరో ఉద్గారాలకు కట్టు బడి ఉన్న సమయంలో, మన విధాన ప్రతిస్పందన కూడా అలాగేఉండాలి. రసాయన రహిత వ్యవసాయ పద్ధతుల కోసం మార్గదర్శకా లను రూపొందించడంపై దృష్టి పెట్టాలి. కానీ హానికరమైన కలుపు నివారిణి గ్లైఫోసేట్ (గడ్డిమందు)ను పత్తి సాగులోకి విస్తృతంగా అను మతించడానికి వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు పరిశ్రమల శ్రేణులతో జతకట్టడం కలవర పెడుతోంది.ఇది ఇక్కడితోనే ఆగదు. హెర్బిసైడ్(కలుపు నివారిణి)ని తట్టుకో గల జన్యుపరివర్తిత కొత్త తరం పత్తి(హెచ్‌టీబీటీ)ని ఆమోదించడంలోని చిక్కులను కూడా ప్రత్యేక కమిటీ పరిశీలిస్తోందని నివేది కలు చెబుతున్నాయి. భారతదేశంలో వాణిజ్య సాగు కోసం ఆమోదించిన ఏకైక జన్యుమార్పిడి పంట అయిన బీటీ పత్తి విస్తీర్ణం పంజాబ్, హరియాణా, రాజస్థాన్ లలో కుప్పకూలిన సమయంలో ఇది వస్తోంది. సాగులో 46 శాతం క్షీణత, వాయవ్య ప్రాంతాల్లో పత్తి దెబ్బతినడం మన కళ్లు తెరిపించాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా, అదే పరిష్కారంగా ముందుకు సాగడం కలవరపెడుతోంది (ఇప్పుడు కలుపు సంహారిణిని తట్టుకునే అదనపు జన్యువుతో).గతంలోనూ ఇలాగే చెప్పారు!రైతులపై, పర్యావరణంపై బీటీ పత్తిపంట కలిగించిన విధ్వంసం నుండి ఏదైనా పాఠాలు నేర్చుకుంటే తక్షణ దిద్దుబాటు జరగాలి. కానీ పరిశ్రమ లాబీ ఎంత బలమైనదంటే, మన విధాన రూపకర్తలు వాళ్ల ఒత్తిడికి ప్రతిస్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. బీటీ పత్తి సాగు విస్తీర్ణం కనిష్ఠ స్థాయికి పడిపోయిన పంజాబ్ నుండే ఇది మొదలైంది. బీటీ–3 విత్తనాలను కేంద్రం అందుబాటులోకి తేవాలని ఆ రాష్ట్రం డిమాండ్ చేసింది. పంజాబ్ రైతులు భయంకరమైన బోల్వార్మ్ తెగుళ్ళను ఎదు ర్కోవడానికి సంవత్సరాలుగా వాడిన బీటీ పత్తి రకాలైన బీటీ–1, బీటీ– 2 (బోల్‌గార్డ్ అని పిలుస్తారు) రెండూ విఫలమై దెబ్బతిన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వినాశకరమైన తెల్లదోమ దాడి అనేకమంది రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. ఈ నేపథ్యంలో పంజాబ్ రెండింతలు జాగ్రత్తగా ఉంటుందని నేను అనుకున్నాను. చేతులు కాలి పోయిన తర్వాత కూడా పంజాబ్ ఎలాంటి పాఠాలూ నేర్చుకోలేదు. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు సరేసరి.మరింత ముందుకు వెళ్ళేముందు, హెర్బిసైడ్లను తట్టుకునే జన్యు మార్పిడి పత్తి అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సులువుగా చెప్పాలంటే, హెర్బిసైడ్ని తట్టుకోవడం కోసం ఒక అద నపు జన్యువును పత్తి రకంలో చొప్పిస్తారు. ఇక్కడ గ్లైఫోసేట్ అని భావించాలి. ఇంతకుముందు మోన్ శాంటోను కొనుగోలు చేసిన బేయర్ కంపెనీ వెబ్సైట్లో, బోల్‌గార్డ్–3 (రైతులు దీనిని బీటీ–3 అని పిలుస్తున్నారు) ‘మూడు ప్రోటీన్ లతో మీ పత్తి మొక్కలను బోల్వార్మ్ నుండి, ఇతర తెగుళ్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు. పురుగు నియంత్రణను తక్కువ పిచికారీలతో అరికట్ట వచ్చనీ, పత్తికి అన్ని సీజన్లలోనూ తక్కువ నష్టం కలిగిస్తుందనీ చెప్పారు.జన్యుమార్పిడి పత్తికి చెందిన మునుపటి రెండు జాతుల పనితీరుపై కూడా ఇలాగే అతిశయించి చెప్పారు. వాస్తవ సత్యాలను మాత్రం చాలా సౌకర్యవంతంగా ఫుట్నోట్లలో పెట్టేశారు. ‘నేచర్ ప్లాంట్స్ జర్నల్’ 2020 మార్చిలో ప్రచురించిన ఒక పత్రంలో, నాగ్ పూర్లోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ కె.ఆర్. క్రాంతి, ప్రసిద్ధ మానవ శాస్త్రవేత్త, వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన గ్లెన్ డేవిస్ స్టోన్ ఇద్దరూ భారతదేశంలో బీటీ పత్తి దీర్ఘకాలిక ప్రభావాన్ని పరిశీలించారు. వారి అంతిమ నిర్ధారణ ఏమిటంటే, దిగుబడి విషయంలో జన్యుమార్పిడి పత్తి పేలవంగా పనిచేసింది. పురుగుమందుల వాడకం తగ్గిన ప్రారంభ దశ తర్వాత, రసాయనాల వినియోగం వాస్తవానికి పెరిగింది. బీటీ పత్తిని విడుదల చేసిన తర్వాత భారతదేశం చూసిన ఉత్పత్తి పెరుగుదల వాస్తవానికి ఎరు వులు, నీటిపారుదల వంటి ప్రధాన ఇన్ పుట్ల పెరుగుదల కారణంగా జరిగిందే.పురుగుమందుల వాడకం విషయానికొస్తే, 2002–2013 మధ్య పత్తిపై పురుగుమందుల వాడకం 93 శాతం పెరిగింది. ఎరువుల విని యోగం 2004–2016 మధ్య 58 శాతం పెరిగింది. జన్యుమార్పిడి పత్తి సాగును చేపట్టిన 24 సంవత్సరాల తర్వాత భారత్, దిగుబడి పని తీరుకు సంబంధించి 70 దేశాలలో 36వ స్థానంలో ఉంది. బీటీ పత్తి సాగు వల్ల అధిక దిగుబడి వస్తుందనే అపోహను బద్దలు కొట్టే విషయం ఏమిటంటే, భారత్ కంటే ముందున్న చాలా దేశాలు వాస్తవా నికి జన్యుమార్పిడి రకాలను పండించడం లేదు.పత్తి సాగును మార్చడానికి విధాన నిర్ణేతలకు ఇది గుణపాఠం కాదా? ఆ విషయానికి వస్తే, ఇప్పటికే సాగులో ఉన్న రకాలతో పోలిస్తే తక్కువ దిగుబడిని ఇస్తున్నప్పటికీ జీఎం ఆవాలు అధిక దిగుబడిని ఇస్తున్నాయంటున్న వాదనలను కూడా వారు చూడకూడదా? తద్వారా, దీర్ఘకాలిక ఆరోగ్యం, పర్యావరణ ప్రభావాలను (పంటల ఉత్పాదకతలో ఎలాంటి తగ్గుదల లేకుండా) పట్టించుకుంటూ, వాతా వరణాన్ని తట్టుకోగల వ్యవసాయ పద్ధతులకు మారడం వైపు దృష్టి కేంద్రీకరించవద్దా?బీటీ పత్తితో దుర్భరమైన అనుభవం వ్యవసాయ రోడ్‌మ్యాప్‌ను మళ్లీ గీయవలసిన అవసరాన్ని చూపుతుంది. స్థిరమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల అగ్రిబిజినెస్ దిగ్గజం బేయర్‌తో పరిశోధనా సహకారం నెలకొల్పుకున్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐకార్) వాస్తవాలను చూడటానికి నిరాకరించింది.జంట వ్యూహంఅభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి జీఎం పంటలను నెట్టడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో మెక్సికో ప్రతిఘటించిన తర్వాత నెమ్మదిగా పెద్ద మార్కెట్ అయిన భారత్ వైపు దృష్టి పెట్టింది. ఆహార భద్రతను పెంపొందించడానికి అమెరికా జన్యుమార్పిడి పంటల దిగుబడిపై దృష్టి సారించింది (వాణిజ్యపరంగా ప్రవేశపెట్టిన జన్యుమార్పిడి పంటల నుండి దిగుబడి పెరిగినట్లు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఆధారాలు లేవు). ఇథనాల్ ఉత్పత్తిలో వాడేందుకు జీఎం మొక్కజొన్న, ఇంకా జీఎం సోయా, ఎండుగడ్డి పశుగ్రాసం కోసం జీఎం అల్ఫాల్ఫా లాంటి కొన్ని పైలట్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయడా నికి కూడా ప్రయత్నిస్తోంది. జీఎం అల్ఫాల్ఫా లాంటిది వెంటనే ఆహార గొలుసులోకి వెళ్లదు కాబట్టి ప్రజల ఆమోదం పొందుతుంది. జన్యుమార్పిడి మొక్కల లోకి చొచ్చుకుపోవడానికి కూడా కొన్ని ప్రయ త్నాలు జరుగుతున్నాయి. నెమ్మదిగా ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు జన్యుమార్పిడి ఆహార పంటల తుది ప్రవేశానికి తలుపులు తెరుస్తాయి. అయితే వీటిని విమర్శించేవారి వాదనలను కొట్టిపారేసేందుకూ, జీఎం పంటలు, రసాయనాల ప్రమాదాలను తక్కువచేసి చూపేందుకూ పెద్ద ప్రయత్నాలే జరుగుతున్నాయని ఇంటర్నేషనల్ మీడియా కలెక్టివ్ పరిశోధన చెబుతోంది. ఆఖరికి సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాల సంభావ్యతను తగ్గించేందుకు కూడా దీన్ని పొడిగి స్తున్నారు. ఉదాహరణకు హార్వర్డ్ పబ్లిక్ హెల్త్ స్కూల్లోని ఒక ప్రొఫె సర్‌కు చక్కెర పరిశ్రమ భారీ సొమ్మిచ్చి, సుక్రోజుకూ, గుండె వ్యాధికీ సంబంధం లేదని చెప్పించినట్టు! వంగడానికి సిద్ధంగా ఉండే అధికార వ్యవస్థ(శాస్త్రీయ సంస్థలతో సహా) ద్వారా జీఎం పంటలను చొప్పించడం, విమర్శకులను తీవ్రంగా ఎదుర్కోవడం అనే జంట వ్యూహం రాబోయే రోజుల్లో మరింత పదునెక్కనుంది. జాగ్రత్త!దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
పత్తి కాదు..వరే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి సాగు పడిపోయింది. సాధారణ విస్తీర్ణంతో పోల్చితే గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం ఈసారి పత్తి విస్తీర్ణాన్ని సాధారణ సాగు లక్ష్యం కంటే పెంచాలని పిలుపు ఇచ్చినా రైతులు పట్టించుకోలేదు. వరివైపే మొగ్గుచూపారు. ఈ నెలాఖరుతో వానాకాలం సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ బుధవారం ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్లో ఏకంగా 60 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పేర్కొంది. సాధారణ సాగు విస్తీర్ణం ప్రకారం చూసినా కనీసం 50.48 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావాలి. కానీ సర్కారు ప్రత్యేకంగా నిర్దేశించిన లక్ష్యాన్ని పక్కనపెడితే, సాధారణ విస్తీర్ణంతో పోల్చినా 86.67 శాతానికే పత్తి సాగు పరిమితమైంది. ఈ సీజన్లో కేవలం 43.76 లక్షల ఎకరాల్లోనే ఈ పంట సాగయ్యింది. సర్కారు లక్ష్యంతో పోల్చుకుంటే.. ఏకంగా 16.24 లక్షల ఎకరాలు తగ్గగా, సాధారణ విస్తీర్ణంతో పోల్చుకుంటే 6.72 లక్షల ఎకరాలు తగ్గడం గమనార్హం. వరి వైపు రైతుల మొగ్గు రాష్ట్రంలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా, ఈ సీజన్లో ఇప్పటివరకు నూటికి నూరు శాతం సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 57.18 లక్షల ఎకరాలు కాగా గతేడాది 64.61 లక్ష ల ఎకరాల్లో సాగైంది. తాజా సీజన్లో దాన్ని అధిగమించి 65.49 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 114.53 శాతం పెరిగింది. ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రైతు లు వరి వైపు మొగ్గు చూపారని అంటున్నారు. తగ్గిన పప్పు ధాన్యాల సాగు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం మాత్రం గణనీయంగా తగ్గడం గమనార్హం. అన్ని రకాల పప్పుధాన్యాల సాధారణ సాగు విసీర్ణం 8.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5.90 లక్షల (69.30 శాతం) ఎకరాల్లోనే సాగైంది. కీలకమైన కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.11 లక్షల ఎకరాలు కాగా, కేవలం 4.99 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అలాగే పెసర సాధారణ సాగు విస్తీర్ణం 1.01 లక్షల ఎకరాలు అయితే, కేవలం 68,556 (67.38 శాతం) ఎకరాల్లోనే సాగైంది. మొక్కజొన్న 6.09 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 5.46 లక్షల (89.73 శాతం) ఎకరాల్లో, సోయాబీన్ 4.29 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 4.01 లక్షల (93.47 శాతం) ఎకరాల్లో, జొన్న 70,068 ఎకరాలకు గాను 41,782 ఎకరాల్లో సాగైంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి యాసంగి పంటల సీజన్ ప్రారంభం కానుంది. -
రికార్డుస్థాయిలో పత్తికి భారీ లాభాలు
-
వేసవిలో కూడా పత్తి సాగు చేసి మంచి లాభాలు సంపాదిస్తున్న రైతు
-
కాటన్‌పై కాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 33 జిల్లాలకుగాను 16 జిల్లాల్లో వర్షాభావం నెలకొందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, సోమవారం నాటికి 42.48 లక్షల ఎకరాల్లో సాగైంది. వాస్తవంగా గతేడాది ఇదే సమయానికి 53.79 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంటే ఈసారి ఏకంగా 11.31 లక్షల ఎకరాలు తక్కువగా సాగైనట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. సీజన్ ఆలస్యం కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఈసారి కొద్దిపాటి వర్షాలకు రాష్ట్రంలో 28.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కానీ వాటిని కాపాడుకోవడం కూడా రైతులకు సవాల్‌గా మారింది. వర్షాలు లేకపోవడంతో అవి మొలకెత్తే పరిస్థితి లేకుండాపోతోంది. వ్యవసాయశాఖ తాజా అంచనా ప్రకారం దాదాపు 10 లక్షల ఎకరాల్లో కూడా పత్తి మొలకెత్తలేదని అధికారులు చెబుతున్నారు. మరికొన్నిచోట్ల పత్తి భూమిలోనే మాడిపోయిందని అంటున్నారు. దీంతో రైతులు మళ్లీ భూమిని దున్ని పత్తి వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వాస్తవంగా పత్తి వేయడానికి ఈ నెలాఖరు వరకే గడువు. చిట్టచివరకు ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలి. ఆ తర్వాత పత్తి వేయడానికి అదనుపోయినట్లే. ఆలస్యమైతే చీడపీడలు ఆశిస్తాయి. పైపెచ్చు మళ్లీ దున్ని విత్తనాలు వేయాలంటే మరింత ఖర్చుతో కూడిన వ్యవహారం. మరోవైపు అనుకున్న వెరైటీలు దొరక్క ఏదో ఒక రకం విత్తనం వేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి ప్రభుత్వం కూడా పత్తి సాగును ప్రోత్సహించాలని పిలుపునిచ్చింది. కనీసం 65 లక్షల ఎకరాలకైనా పెంచాలని రైతులకు కోరింది. కానీ పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు. గతేడాది మేరకైనా పత్తి సాగవుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పత్తి అదను దాటిపోతే దానికి బదులుగా మొక్కజొన్న లేదా ఆముదం వంటి పంటలను రైతులు వేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై కసరత్తు వర్షాలు లేకపోవడం, కాల్వల్లో నీటి విడుదల లేకపోవడంతో అనేకచోట్ల ఇంకా వరి నార్లు పోయలేదు. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్ సీజన్ ఎలా గట్టెక్కుతుందో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి కూడా ఇదే పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ఈ సీజన్ సాగు ప్రమాదంలో పడినట్లేనని వ్యవసాయ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కంటింజెన్సీ ప్రణాళికపై వ్యవసాయశాఖ సమాలోచనలు చేస్తోంది. సకాలంలో పంటలు వేయని పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలన్న దానిపై ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో మంతనాలు జరుపుతోంది. నార్లు వేయని పరిస్థితి నెలకొంటే వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలని భావిస్తోంది. స్వల్పకాలిక రకాలైన వరి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండాలని కిందిస్థాయి సిబ్బందిని వ్యవసాయశాఖ ఆదేశించింది. రోజువారీగా జిల్లా అధికారులతో క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తోంది. ఖర్చు రెట్టింపైంది నా రెండెకరాల భూమిలో 20 రోజుల క్రితం పత్తి గింజలు విత్తాను. కానీ వర్షాలు రాకపోవడంతో మొలకలు రాలేదు. దీంతో రెండోసారి పత్తి విత్తనాల ప్యాకెట్లు కొనుగోలు చేసి విత్తాను. పత్తి విత్తనాలకు రూ.3,500, సాగుకు రూ.6,000, విత్తడానికి రూ.1,000 ఖర్చయింది. వర్షం రాకపోవడంతో రెండుసార్లు విత్తనాలు వేయడంతో పెట్టుబడి రెట్టింపైంది. ఇప్పటివరకు రూ.21 వేలకుపైగా ఖర్చయింది. – రేఖ శ్రీధర్, రైతు, నర్సింహులపేట, మహబూబాబాద్ జిల్లా వానల్లేక మొలకెత్త లేదు జూన్ మొదటి వారంలో పొడి దుక్కుల్లో నాలుగెకరాల్లో పత్తి విత్తనాలు పెట్టాం. సమయానికి వర్షాలు పడలేదు. ఎండ తీవ్రత బాగా ఉంది. దీంతో విత్తనాలు మొలకెత్తలేదు. మరోసారి విత్తనాలు వేయాల్సి వచ్చింది. రెండోసారి పెట్టిన విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి. రెండుసార్లు వేయాల్సి రావడంతో ఖర్చు ఎక్కువైంది. – చామకూరి రమేష్, పిండిప్రోలు, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా -
పత్తి పంటలో లాభాలు రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
-
కోటిన్నర ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే వానాకాలం సీజన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ పంటల ప్రణాళికను ఖరారు చేసింది. ఇందులో భాగంగా కోటిన్నర ఎకరాల్లో పంటలు సాగయ్యేలా చూడాలని నిర్ణయించింది. అత్యధికంగా 60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని ప్రతిపాదించింది. ఇక 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని వ్యవసాయశాఖ రైతులకు పిలుపునిచ్చింది. కంది, మొక్కజొన్న 8 లక్షల ఎకరాల చొప్పున, సోయాబీన్ 5 లక్షల ఎకరాలు, పెసర లక్ష ఎకరాలు, మినుములు 50 వేల ఎకరాల్లో సాగును ప్రతిపాదించారు. మొత్తం సాగుకు ప్రతిపాదించిన కోటిన్నర ఎకరాల్లో 10 లక్షల ఎకరాలు ఉద్యాన పంటలున్నాయని వ్యవసాయ శాఖ తెలిపింది. గతేడాది 1.46 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని వెల్లడించింది. 18.47 లక్షల క్వింటాళ్ల విత్తనాలు.. ఉద్యాన పంటలను మినహాయించి చూస్తే 1.40 కోట్ల ఎకరాల్లో ఆహార, వాణిజ్య పంటలు సాగవుతాయి. అందుకోసం 18.47 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయశాఖ పేర్కొంది. విత్తనాలకు కొరత లేదని, 1.82 కోట్ల ఎకరాలకు సరిపడా 22.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. అకాల వర్షాల నుంచి బయటపడేలా ముందస్తు నాట్లు.. ఈ ఏడాది యాసంగిలో రెండు దఫాలు పెద్ద ఎత్తున అకాల వర్షాలు రావడంతో లక్షలాది ఎకరాల పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వానాకాలం, యాసంగి సీజన్లను ముందుకు జరపడం వల్ల నష్టాన్ని నివారించవచ్చని భావిస్తున్న ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టింది. సీజన్‌ను ముందుకు జరపడంతో పాటు తక్కువ కాలపరిమితి కలిగిన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని, అకాల వర్షాలు, వడగళ్లను తట్టుకునే రకా లను రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఎక్కువ సమయం తీసుకునే పంట రకాలను ప్రోత్సహించకూడదని ప్రభుత్వం భావిస్తోంది. 135 రోజుల మధ్యస్థం, 125 రోజుల తక్కువ కాలపరిమితి వెరైటీలను రైతులు వేసుకోవాలని సూచించింది. కాగా, ఐదు రకాల మధ్యస్థ కాల పరిమితి కలిగిన వరి వంగడాలు, స్వల్పకాలిక వ్యవధి కలిగిన 10 రకాల వరి వెరైటీలను వేసుకోవాలని రైతులకు సూచించింది. వానాకాలంలో జూన్ 10–20వ తేదీల మధ్య నారు వేయాలని చెప్పింది. ఈ మార్పులవల్ల ఇబ్బందులు ఉండవని పేర్కొంది. అలాగే యాసంగిలో స్వల్పకాలిక రకాలను మాత్రం వేయాలని స్పష్టం చేసింది. వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయాలని సూచించింది. యాసంగిలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 10 మధ్య నార్లను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. -
70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్లో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా ప్రకటించింది. కనీసం 60 లక్షల నుంచి 65 లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చూడాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయంలోని వ్యవసాయశాఖ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన తొలి సమీక్షలో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులతో మాట్లాడారు. రానున్న వానాకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని పేర్కొన్నారు. మరో 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేసేలా చూడాలన్నారు. అందుకనుగుణంగా వ్యవసాయశాఖ సమాయత్తం కావాలని ఆదేశించారు. పత్తితోపాటు కంది సాగును మరింత ప్రోత్సహించాలని, ప్రస్తుతం వివిధ పంటల సాగుకు అవసరమయ్యే 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. సేంద్రీయ సాగు, భూసారాన్ని దృష్టిలో ఉంచుకుని పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలనీ దీనికి రూ.76.66 కోట్లు నిధుల విడుదల చేయాలని చెప్పారు. ఆయిల్‌పామ్ సాగులో అంతర పంటల సాగుకై డీసీసీబీల ద్వారా ఎకరానికి రూ.40 వేలు వరకు పంటరుణాలు అందించాలని సూచించారు. ప్రతీ ఏడాది మార్చి చివరి వరకు యాసంగి కోతలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటే వడగళ్ల వానల నుంచి నష్టాన్ని నివారించవచ్చని నిరంజన్‌రెడ్డి సూచించారు. వానాకాలం సాగు సమయంలోనే యాసంగి వరి సాగు నారుమళ్లకు అవసరమయ్యే భూమిని వదులుకోవాలని చెప్పారు. బాన్సువాడ, బోధన్, హుజూర్నగర్, మిర్యాలగూడల మాదిరిగా వరి సాగు సీజన్ ముందుకు జరపాలని సూచించారు. -
అమృత్ పత్తి.. ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి! ఎలా సాగు చేయాలంటే?
పత్తి దిగుబడుల పరంగా ఎకరానికి 20 క్వింటాళ్లు సాధించిన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారికి చెందిన యువ రైతు ఫడ్ విజయ్ ఆదర్శంగా నిలుస్తున్నారు. రెట్టింపు దిగుబడి సాధించిన విషయం ఆ నోటా ఈ నోటా తెలుసుకొని పరిసర గ్రామాల రైతులు ఆసక్తిగా పొలాన్ని చూసి వెళ్తున్నారు. సాధారణ సాగులో కొంత మందికి 6 నుంచి 8 క్వింటాళ్లు, మరికొంత మందికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే, ఈ రైతు ఏకంగా రెట్టింపు కంటే అధిక దిగుబడి సాధించడమే రైతులను ఆకర్షిస్తోంది. ఫడ్ విజయ్‌కు మహరాష్ట్రలోని యవత్మాల్ జిల్లా అంబోడ గ్రామంలో చుట్టాలు ఉన్నారు. ఒకసారి ఆ గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ అమృత్ ప్యాటర్న్‌లో సాగు చేయడాన్ని గమనించాడు. దిగుబడి అధికంగా వస్తుందని ఆ రైతులు చెప్పడంతో ఆ వైపు మొగ్గు చూపాడు. అమృత్ పద్ధతి అంటే..? యవత్మాల్ జిల్లా మహాగావ్ తాలూకా అంభోద గ్రామానికి చెందిన రైతు శాస్త్రవేత్త అమృత్‌రావు దేశ్‌ముఖ్ తన క్షేత్రంలో అనేక ఏళ్లపాటు ప్రయోగాలు చేసి ఈ సాగు పద్ధతిని రూపొందించారు. అందువల్లనే అమృత్ ప్యాటర్న్ అని పేరు వచ్చింది. ఏకంగా 50 క్వింటాళ్ల వరకు ఎకరంలో పత్తి దిగుబడి సాధించిన ఘనత ఆయనిది. ఆదిలాబాద్ జిల్లాలో సాధారణంగా పత్తి సాగులో రైతులు మొక్కల మధ్య కొంచెం అటూ ఇటుగా ఒక అడుగు, వరుసల మధ్య 3 నుంచి 4 అడుగులు లేదా 4 నుంచి 5 అడుగుల దూరం పాటిస్తారు. అమృత్ ప్యాటర్న్‌లో మొక్కల మధ్య దూరం కచ్చితంగా ఒక అడుగు ఉండే చూస్తారు. ఒక వరుస మధ్య 4 అడుగులు, ఆ పక్కన వరుస మధ్య దూరం 6 అడుగుల దూరం పాటిస్తారు. అంటే.. మొదటి రెండు వరుసల మధ్య దూరం నాలుగు అడుగులు.. రెండు, మూడు వరుసల మధ్య ఆరు అడుగుల దూరం అనుసరిస్తారు. ఇదే తీరులో చేనంతా పాటిస్తారు. ఇదే విధానాన్ని విజయ్ అవలంభించారు. నెల తర్వాతే ఎరువులు.. పత్తి సాగులో మొదటి నెల రోజుల పాటు ఎలాంటి ఎరువులు, పురుగుమందులు వాడలేదు. ఇలా చేయటం వల్ల మొక్కకు కొమ్మలు ఎక్కువగా వస్తాయి. విత్తిన నెల తర్వాత ఎకరాకు ఒక బ్యాగు 10:26:26 వేశారు. ఆ తర్వాత నెలలోనూ అదే మోతాదులో అదే ఎరువుతో పాటు అతి తక్కువ ధరకు లభ్యమయ్యే పురుగుల మందు వాడినట్టు వివరించారు. మూడో నెల తర్వాత 5 కేజీల సల్ఫర్, ఆ తర్వాత 25 కేజీల మెగ్నీషియం నెలకు అందిస్తే సరిపోతుందని విజయ్ తెలిపారు. తద్వారా ప్రతి మొక్కకు వచ్చే కొమ్మలైనా ప్రధాన కొమ్మ, పిల్ల కొమ్మలు చాలా తక్కువ దూరంలో వస్తాయని తెలిపారు. పూత, కాత ఎక్కువగా రావడంతో పాటు రాలిపోకుండా ఉంటాయని విజయ్ వివరించారు. సాళ్ల మధ్య ఎక్కువ దూరం పెట్టడం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి అధిక దిగుబడి వస్తోంది. చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని అనుభవపూర్వకంగా విజయ్ చెబుతున్నారు. ఎకరానికి రూ. 20 వేలు ఖర్చయ్యింది. 20 క్వింటాళ్ల పత్తి తీసిన తర్వాత మళ్లీ నీటి తడి ఇచ్చారు. ఫలితంగా మున్ముందు కూడా మరికొంత పత్తి దిగుబడి రావచ్చని విజయ్ ఆశిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి అమృత్ పద్ధతిని అవలంభించడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధ్యమవుతుంది. ఎరువులు, పురుగుల మందులు ఎక్కువగా వాడే అవసరం పడదు. కలుపు తీయడంతో పాటు ఎరువులు, మందుల ఖర్చుల్లో చాలా ఆదా అవుతుంది. అధిక సాంద్రతతో పూత, కాత రావడం జరుగుతుంది. – సాయిప్రణీత్(96768 83233), వ్యవసాయ విస్తరణాధికారి, కొల్హారి గ్రామం సాగు పద్ధతి మార్చుకొని అధిక దిగుబడి సాధించా... రెండేళ్ల కింద పత్తి సాగులో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మహరాష్ట్రలో కొంతమంది రైతులు అవలంభిస్తున్న అమృత్ ప్యాటర్న్‌లో గతేడాది పత్తి సాగు చేశాను. కొన్ని కాయలు కూడా కుళ్లిపోయాయి. అప్పుడు 9 నుంచి 11 క్వింటాళ్ల మధ్య దిగుబడి వచ్చింది. అమృత్ విధానాన్ని పూర్తిస్థాయిలో పాటించకపోవడంతో దిగుబడి అంతకు పరిమితమైంది. రెండో ఏడాది.. గడిచిన వానా కాలంలో ఈ విధానంలో అమృత్ ప్యాటర్న్‌లో అన్ని పద్ధతులను పూర్తిస్థాయిలో అవలంభించాను. ఎకరానికి 20 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. – ఫడ్ విజయ్ (77024 42958), ఇన్నోవేటివ్ పత్తి రైతు, కొల్హారి గ్రామం, గుడిహత్నూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా – గొడిసెల కృష్ణకాంత్ గౌడ్, స్టాఫ్ రిపోర్టర్, సాక్షి, ఆదిలాబాద్. చదవండి: Goat Farming: మేకలు, నాటు కోళ్ల పెంపకం.. ఏడాదికి రూ. 8–9 లక్షల నికరాదాయం! మరి ఖర్చు? Red Rice Health Benefits: బియ్యంపై పొరలో ‘ప్రోయాంతో సైనిడిన్’..అందుకే అలా! ఎర్ర బియ్యం వల్ల.. -
యాసంగిలో పత్తి ప్రయోగం
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో పత్తి సాగు చేయించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ సన్నాహాలు చేస్తోంది. వాస్తవంగా వానాకాలంలోనే పత్తి సాగు చేస్తారు. అదే కాలం అనుకూలం కూడా. కానీ పత్తికి మంచి డిమాండ్ ఉండటంతో యాసంగిలోనూ సాగు చేసే అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిశోధనలు చేసింది. అవి ఫలించాయి. దీంతో దేశంలోనే మొదటిసారిగా యాసంగిలో పత్తిసాగు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. వరికి బదులుగా యాసంగిలో పత్తి సాగు చేయాలని రైతులకు వ్యవసాయశాఖ పిలుపు ఇచ్చింది. మరోవైపు సాగు కోసం భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) అనుమతి కోరింది. ఆ అనుమతి లాంఛనమేనని వ్యవసాయ విశ్వవిద్యాలయ వర్గాలంటున్నాయి. అలాగే.. పత్తి సాగుకు అవసరమైన విత్తనాలను సిద్ధం చేయాలని కంపెనీలను వ్యవసాయశాఖ అధికారులు కోరినట్లు సమాచారం. ఇది విజయవంతమై మంచి దిగుబడులొస్తే.. మున్ముందు యాసంగిలో వరికి పత్తి ప్రత్యామ్నాయం అయ్యే అవకాశముంది. భారీ లాభాలు ఉన్నందునే..: దేశంలో పత్తి పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. అయితే ఈ ఏడాది వానాకాలం సీజన్లో పత్తి ప్రతిపాదిత లక్ష్యం 70 లక్షల ఎకరాలు కాగా, తీవ్రమైన వర్షాల కారణంగా 50 లక్షల ఎకరాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఇప్పుడు యాసంగిలో కొద్ది మొత్తంలో పత్తిని సాగు చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డిసెంబర్ నుంచి పత్తిని వేయించాలని భావిస్తున్నారు. వానాకాలంలో పత్తికి మంచి ధర పలుకుతుంది. మద్దతు ధరకు మించి గతేడాది క్వింటాకు రూ.10 వేల వరకు వచ్చాయి. కాబట్టి యాసంగిలోనూ పత్తిని ప్రోత్సహిస్తే రైతులకు మరింత లాభం ఉంటుందని వ్యవసాయశాఖ భావిస్తోంది. గులాబీ రంగు పురుగు ఆశించే చాన్స్? కాగా, వానాకాలంలో, యాసంగిలో పత్తిని వేయడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ విశ్వవిద్యాలయం పేర్కొంది. వానాకాలంలో పత్తికి గులాబీ రంగు పురుగు పడుతుంది. దీనివల్ల లక్షలాది ఎకరాల్లో దిగుబడి తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వానాకాలం తర్వాత వెంటనే యాసంగిలో వేయడం వల్ల అది కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వానాకాలంలో వేసిన పంటకు నవంబర్లోనే పత్తి పూర్తిగా తీసేయాలని సూచిస్తున్నారు. లేకుంటే గులాబీ రంగు పురుగు ఆశిస్తుందని, అది వెయ్యి కిలోమీటర్ల వరకు పాకుతుందని చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే... యాసంగిలో వేసే పత్తిని గతంలో జనవరి వరకు పరీక్షించారు. ఎండలు కూడా ఇబ్బంది కలిగిస్తాయని నిర్ధారణకు వచ్చారు. అయితే.. పరిశోధనల అనంతరం కొన్ని రకాల జాగ్రత్తలతో యాసంగిలో పత్తి వేయొచ్చని తుది నిర్ణయానికి వచ్చినట్లు విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. గతేడాది యాసంగిలో పత్తి సాగుపై చేసిన పరిశోధనలపై నివేదిక తయారు చేశామని, ఆ మేరకు ఐకార్‌కు ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. దీనిపై కేంద్రం నిర్ణయంతోపాటు జాతీయ విధానం రావాల్సి ఉందని, అనుమతి వస్తే పండిన పంటకు మద్దతు ధర వస్తుందని చెబుతున్నారు. కాగా పత్తి.. ఏ సమయంలో వేయాలన్న దానిపై అధికారులు త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు. -
లక్ష్యానికి దూరంగా పత్తి సాగు.. 43.94 లక్షల ఎకరాలకే పరిమితం
సాక్షి, హైదరాబాద్: ఈసారి పత్తి విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని భావించిన వ్యవసాయ శాఖకు నిరాశ తప్పేట్లు లేదు. గతేడాది పత్తికి భారీగా ధర రావడంతో వరికి బదులు పత్తిని ప్రోత్సహించాలని నిర్ణయించినా ఆచరణలో అది సాధ్యమయ్యే అవకాశం లేకుండా పోతోంది. వరుసగా భారీ వర్షాలు, వరదలు రావడంతో వేసిన పంటే చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో లక్ష్యం నీరుగారే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అటు వ్యవసాయశాఖ, ఇటు రైతులు కూడా ఆవేదనకు గురవుతున్నారు. ఈ నెలాఖరు వరకే అదును వానాకాలం సీజన్లో తొలకరి వర్షాలతోనే పత్తి విత్తనాలు చల్లుతారు. జూన్‌లో పత్తి సాగు మొదలై జూలై చివరి నాటికి ఆ పంట వేయడం పూర్తి కావాలి. అంటే దాదాపు ఇప్పటికే పత్తి సాగు చేసి ఉండాలి. కానీ భారీగా కురుస్తున్న వర్షాలు, వరదలతో పత్తి సహా అనేక పంటలు నీట మునిగాయి. ఈ ఏడాది 1.43 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 69.70 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. మొత్తం సాగు విస్తీర్ణంలో పత్తి ప్రతిపాదిత సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 43.94 లక్షల ఎకరాల్లో సాగైంది. లక్ష్యం చేరుకోవాలంటే పత్తి సాగు పెద్దఎత్తున పెరగాలి. కానీ 70 లక్షల ఎకరాలకు చేరుకోవడం కష్టమేనని అధికారులు అంటున్నారు. ఇప్పటికే వేసిన పత్తిలో దాదాపు 8 లక్షల ఎకరాలు నీట మునగడం, అందులో మరికొంత ఇసుక మేట వేయడం, ఇంకొన్నిచోట్ల పూర్తిగా విత్తనాలు భూమిలోనే కుళ్లిపోవడం వంటివి జరిగాయి. అటువంటి చోట్ల మళ్లీ రెండోసారి పత్తి వేయాలన్నా కూడా భూమి పూర్తిగా ఆరిపోవాలి. మళ్లీ దుక్కిదున్నాలి. కానీ ఇప్పుడు వర్షాలు తగ్గలేదు. తగ్గాక దుక్కిదున్ని వేయాలంటే మరో 15 రోజులకు పైగా సమయం పట్టొచ్చు. అప్పటికే అదును తీరిపోతుందని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. భద్రాచలం, సంగారెడ్డి సహా ఒకట్రెండు చోట్ల మాత్రం కొందరు రైతులు మళ్లీ పత్తి విత్తనాలు కావాలని విన్నపాలు చేశారు. ఏది ఏమైనా ఈసారి పత్తి సాగు 50 లక్షల ఎకరాలకు మించక పోవచ్చని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రైతులకు మూడు ప్రత్యామ్నాయాలు పత్తి వేయాలన్న రైతుల ఆశలను వర్షాలు అడియాశలు చేశాయి. కోట్ల రూపాయల పెట్టుబడికి నష్టం వాటిల్లింది. దీంతో రైతులకు మూడే ప్రత్యామ్నాయాలు ఉన్నాయని వ్యవసాయ వర్గాలు అంటున్నాయి. ఒకటి పత్తి వేసే అవకాశం ఉంటే రెండోసారి వేయడం. రెండోది ప్రత్యామ్నాయంగా తేలికపాటి నేలల్లో, నీటి వనరులు ఉన్నచోట వరి వేయడం.. సాధ్యంకాని చోట మొక్కజొన్న వేసుకోవడం. అలాగే మూడోది ముందస్తు రబీకి వెళ్లడం. ముందస్తు రబీలో భాగంగా వేరుశనగ వంటి పంటలు వేయాల్సి ఉంటుంది. వరి, మొక్కజొన్న వంటి వాటిని వచ్చే రెండు మూడు వారాల్లోగా వేయాల్సి ఉంటుంది. వర్షాలు భారీగా కురవడంతో రైతులు వరి నాట్లవైపే మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ తర్వాత మొక్కజొన్న వేస్తారంటున్నారు. ప్రభుత్వం తలచినది ఒకటైతే, వాతావరణ పరిస్థితుల వల్ల మరోటి జరుగుతోందని అంటున్నారు. -
రైతులకు సిరులు కురిపిస్తోన్న పత్తి..
పత్తి.. తెల్లబంగారమాయింది. రైతులకు సిరులు కురిపిస్తోంది. మెట్ట ప్రాంతాలకే పరిమితమైన పత్తి మాగాణుల్లో సాగు చేస్తున్నా రు. గడిచిన మూడేళ్లుగా విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో వరి సాగు జరగడంతో ఊహించని దిగుబడులు పెరిగాయి. మార్కెట్ డిమాండ్ తక్కువగా ఉండడంతో రైతులు ప్రత్యామ్నాయంగా పత్తి పంట సాగుపై దృష్టి సారించారు. దిగుబడులు, ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఆత్మకూరు: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పత్తి సాగు ఏటేటికి పెరుగుతోంది. గతంలో నకిలీ పత్తి విత్తనాల కారణంగా చివరికి దిగుబడులు రాక, పెట్టి పెట్టుబడులు నష్టపోయిన రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా విత్తన నాణ్యతపై దృష్టి సారించారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. నకిలీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. పత్తికి మద్దతు ప్రకటించడంతో రైతుల పాలిట వరంగా మారింది. జిల్లాలో తొలి కారుగా వరి సాగు చేస్తే.. రెండో కారుగా పత్తి సాగు చేయడంపై రైతులు దృష్టి సారించారు. జిల్లాలో పత్తి సాగు ఈ ఏడాది గతంలో పోలిస్తే గణనీయంగా పెరిగింది. గతంలో 3,500 హెక్టార్ల నుంచి 4 వేల హెక్టార్ల వరకు సాగు చేస్తుంటే.. ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 6 వేల హెక్టార్లలో సాగవుతోంది. కొన్ని చోట్ల ఫిబ్రవరిలోనే (రబీ సీజన్) రైతులు వరికి ప్రత్యామ్నాయంగా దాదాపు 1,500 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. సాగు వ్యయం అధికమైనా.. పత్తి పంట సాగుకు సాధారణంగా పెట్టుబడి ఎక్కువ అవుతుంది. గతంలో ఎకరాకు రూ.5 వేల నుంచి రూ. 6 వేలు అయ్యే వ్యయం ప్రస్తుతం రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు అవుతోందని రైతులు చెబుతున్నారు. గతంలో మాగాణి భూముల్లో రెండు కార్లు వరి సాగు చేసే వారు. అయితే పంట మార్పిడితో భూసారం పెరుగుతుందనే వ్యవసాయ నిపుణులు, భూమి శాస్త్రవేత్తలు చెబుతుండడంతో వరి సాగు అనంతరం రెండో కారుగా పత్తి సాగు చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా సాగు ఖర్చు పెరిగినా దానికి రెట్టింపుగా పత్తి కొనుగోళ్లు పెరగడం, «కొనుగోలు ధర సైతం ఆశాజనకంగా ఉండడంతో అధిక శాతం రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపారు. బీటీ పత్తి సాగు అధికం జిల్లాలో (కందుకూరు డివిజన్‌తో కలుపుకొని) 38 మండలాల్లోని 22 మండలాల్లో పత్తి సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. మిగిలిన మండలాల్లో అరకొరగా సాగు చేస్తున్నారు. గతంలో నాటు గింజలు పత్తి సాగుకు ఉపయోగించే వారు. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన బీటీ పత్తి మంచి దిగుబడులు ఇస్తుండడంతో అధిక శాతం రైతులు బీటీ పత్తి సాగు చేస్తున్నారు. పలు మండలాల్లోని గ్రామాల్లో ఆర్బీకేల ద్వారా పత్తి విత్తనాలు వ్యవసాయ అధికారులు రైతులకు అందజేశారు. దీనికి తోడు రైతులకు సాగులో మెళకువులు, చీడపీడల నివారణ చర్యలు సూచిస్తుండడతో నష్ట నివారణ చర్యలతో పత్తి దిగుబడులు పెరిగాయి. రైతులకు అందుబాటులో సిబ్బంది రైతులు తొలికారు వరి సాగు చేసే అధిక వర్షాలకు నష్టపోయారు. ప్రభుత్వం ద్వారా ఉచితంగా విత్తనాలు రెండో మారు ఇచ్చాం. అయితే రెండో కారుగా పత్తి సాగు చేయడంతో తొలి కారు నష్టాలను కొంత మేర రైతులు పూడ్చుకోగలుగుతున్నారు. పత్తి సాగు చేస్తున్న రైతులకు అందుబాటులో ఉండేలా వ్యవసాయ సిబ్బందికి సూచనలు ఇచ్చాం. నేను స్వయంగా వ్యవసాయ శాస్త్రవేత్తలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి పరిశీలించి సూచనలు ఇస్తున్నాం. – దేవసేన, ఏడీఏ, ఆత్మకూరు లాభాలు బాగున్నాయి ఈ ఏడాది పత్తి పైరు సాగుతో లాభాలు వస్తున్నాయి. కొంత వరి పైరులో నష్టపోయినా పత్తి ధర అధికంగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతున్నాయి. ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశా. దిగుబడి బాగుంది. వర్షాలు లేకుంటే మరో రెండు నెలల పాటు పత్తి దిగుబడి వస్తుంది. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి సలహాలు చెబుతున్నారు. – ఓబుల్ రెడ్డి, రైతు, రామస్వామిపల్లి కేజీ రూ.70 నుంచి రూ.120 గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పత్తి కొనుగోలు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గతంలో రూ.50 లేదా రూ.60లకే కిలో పత్తి కొనుగోలు ఉంటే.. ఈ ఏడాది అధిక గిట్టుబాటు ధర లభిస్తోంది. తొలి దశలో మే నెలలో కిలో పత్తి రూ.118, రూ.120 చొప్పున రైతుల వద్ద కొనుగోలు చేశారు. జూన్ 20వ తేదీ వరకు ఇదే ధరతో పలు మండలాల్లో కొనుగోలు చేస్తుండగా అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలు వల్ల కొనుగోలు ధర తగ్గింది. పత్తి నాణ్యత తగ్గడంతో రూ.70 నుంచి వంద రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. అయినా మంచి ధరే తమకు దక్కుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పత్తికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: ఈసారి వానాకాలం సీజన్ సాగు విస్తీర్ణంలో దాదాపు సగం మేరకు పత్తి సాగు చేసేలా రైతులను సన్నద్ధం చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 2022 వానాకాలం సీజన్ వ్యవసాయ ప్రణాళికను ప్రకటించింది. గతేడాది వానాకాలం సీజన్లో 1.29 కోట్ల ఎకరాల్లో పంటలు వేయగా, ఈసారి ఏకంగా 1.42 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పేర్కొంది. అంటే సాగు విస్తీర్ణం 13 లక్షల ఎకరాలు పెరగనుందన్నమాట. మొత్తం 1.42 కోట్ల ఎకరాల్లో ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలో వ్యవసాయ శాఖ ప్రణాళికలో స్పష్టత ఇచ్చింది. ఆ మేరకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఈ వానాకాలం సీజన్లో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారు. గతేడాది వానాకాలం సీజన్లో 46.42 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగవగా, ఈసారి మరో 23.58 లక్షల ఎకరాలు పెంచేలా ప్రణాళిక రూపొందించింది. -
పత్తి బంగారమైంది
సాక్షి, అమరావతి: పత్తి రైతుకు ఈ ఏడాది పండగే అయింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో తెల్ల బంగారమే అయింది. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కంటే ఎక్కువే రైతుకు లభిస్తోంది. ప్రస్తుతం పత్తి ఎమ్మెస్పీ క్వింటాల్‌కు రూ.6,025 ఉండగా, మార్కెట్లో రూ.8,800 పలుకుతోంది. ఇది రూ.10వేల వరకు వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. తగ్గిన విస్తీర్ణం.. పెరిగిన డిమాండ్ రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.73 లక్షల ఎకరాలు. గతేడాది 14.91లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 12.86 లక్షల ఎకరాల్లోనే సాగైంది. గతేడాది 10.46 లక్షల మిలియన్ టన్నుల దిగుబడి రాగా, ఈ ఏడాది 9.33 లక్షల మిలియన్ టన్నులు వస్తుందని అంచనా. ఈ ఏడాది క్వింటాల్ పొడుగు పింజ పత్తి రూ.6025, మధ్యస్థ పత్తి రూ.5,726గా కనీస మద్దతు ధర నిర్ణయించారు. గత రెండేళ్లలో ఎమ్మెస్పీ లభించకపోవడంతో ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా 2019–20లో 13 లక్షల క్వింటాళ్లు, 2020–21 లో 18 లక్షల క్వింటాళ్ల పత్తిని 44,440 మంది రైతుల నుంచి ఎమ్మెస్పీకి కొనుగోలు చేసింది. ఈ ఏడాది 50 మార్కెట్ యార్డులతో పాటు 73 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో వ్యాపారులు రేటు తగ్గించే అవకాశం లేకుండా పోయింది. సీజన్ ఆరంభం నుంచి మంచి ధర పలుకుతోంది. రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో దిగుబడి పెరిగినప్పటికీ, అకాల వర్షాలతో కొన్ని చోట్ల దిగుబడి తగ్గింది. మొత్తం మీద చూస్తే దిగుబడి తగ్గింది. దీంతో డిమాండ్ పెరిగింది. దీనికి నాణ్యత కూడా తోడవడంతో పత్తి రైతుకు ఎక్కువ ధర లభిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయంగా దూది వినియోగం పెరడం, కాటన్ యార్న్ ధరలు పెరగడం కూడా పత్తి ధరల పెరుగుదలకు కారణాలుగా చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాటన్ సీడ్‌కు కూడా మంచి రేటొస్తోంది. క్వింటాల్‌కు కనిష్టంగా రూ.3,180 గరిష్టంగా రూ.3,620 పలుకుతోంది. ఆదోని ‘పత్తి’ యార్డుకు మహర్దశ పత్తికి మంచి ధర వస్తుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన పత్తి మార్కెట్‌గా పేరొందిన కర్నూలు జిల్లా ఆదోని యార్డుకు వ్యాపారులు క్యూ కడుతున్నారు. ఇక్కడకు ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పత్తి రైతులొస్తుంటారు. సీజన్ ప్రారంభం నుంచి సోమవారం వరకు 2 లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకాలు జరిగాయి. రోజుకు వెయ్యి మంది రైతులు 25 వేల క్వింటాళ్ల పత్తిని తీసుకొస్తున్నారు. క్వింటాల్ రూ.8,670కు అమ్ముకున్నా నేను మూడెకరాల్లో పత్తి సాగు చేస్తున్న. ఈ ఏడాది ఎకరాకు 9 క్వింటాళ్ల వరకు వస్తోంది. సోమవారం ఆదోని యార్డులో క్వింటాలు రూ.8,670 చొప్పున 8 క్వింటాళ్లు అమ్మాను. గతంలో ఎప్పుడూ ఇంత ధర రాలేదు. చాలా ఆనందంగా ఉంది. – కే.వీరన్న, పరవతపురం, కర్నూలు జిల్లా గత ఏడాదికంటే ధర పెరిగింది నేను 2 ఎకరాల్లో పత్తి వేశా. మొదటి కోతలో 3 క్వింటాళ్లు రాగా క్వింటాల్ రూ.6,800కు అమ్మాను. రెండో కోతలో 5 క్వింటాళ్ల దిగుబడి రాగా రూ.7,500కు అమ్ముకున్నా. గతేడాదికంటే ఈసారి మంచి ధర వస్తోంది. – షేక్,ఖాసీం, పెద్దవరం, కృష్ణా జిల్లా లాట్‌కు 10 మంది పోటీపడుతున్నారు అనూహ్యంగా పెరిగిన ధరతో పత్తి కొనుగోలుకు వ్యాపారులు క్యూకడుతున్నారు. ఈసారి నాణ్యమైన పత్తి అధికంగా వస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మన యార్డులో లాట్‌కు పది మంది తక్కువ కాకుండా పోటీపడుతున్నారు. మంచి ధర పలుకుతోంది. – బి. శ్రీకాంతరెడ్డి, కార్యదర్శి, ఆదోని మార్కెట్‌యార్డు, కర్నూలు జిల్లా ఈసారి మంచి రేటొస్తుంది అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలోని రైతుల నుంచి పత్తి కొనుగోలుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. సోమవారం అత్యధికంగా క్వింటాల్‌కు రూ.8,800 ధర పలికింది. రోజురోజుకు పెరుగుతున్న ధరను బట్టి చూస్తుంటే ఈసారి క్వింటాల్ రూ.9500కు పైగా పలుకుతుందని అంచనా వేస్తున్నాం. రూ.10 వేల మార్కును అందుకున్నా ఆశ్చర్య పోనక్కర్లేదు. జి.సాయిఆదిత్య, ఏజీఎం, సీసీఐ కర్నూలు జిల్లా కౌతలం మండలం తోవి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు టి.నాగరాజు. 15 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. గత ఏడాది కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) క్వింటాల్‌కు రూ.5,825. అయినా మార్కెట్లో క్వింటాల్ రూ. 4,800 మించి ధర లేదు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో కనీస మద్దతు ధర (క్వింటాల్ రూ.6,025)కు విక్రయించాడు. ప్రభుత్వ కేంద్రం లేకపోతే తక్కువ ధరకు వ్యాపారులకే అమ్ముకోవాల్సి వచ్చేది. అతను ఖరీఫ్‌లో కూడా పత్తి సాగు చేయగా ఎకరాకు 9–10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈసారి వ్యాపారులే మంచి రేటు ఇస్తుండటంతో సోమవారం ఆదోని మార్కెట్ యార్డులో క్వింటాల్ రూ.8,800కు అమ్ముకోగలిగాడు. అంటే ఎమ్మెస్పీ (రూ.6,025) కంటే రూ.2,775 అధికంగా వచ్చింది. పెట్టుబడిపోను ఎకరాకు రూ.49 వేలు లాభంతో ఆనందంగా ఇంటికెళ్లాడు. -
సేంద్రియ పత్తి సాగుకు సై!
దేశీయంగా సేంద్రియ పత్తి సాగును విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. మన దేశంలో సేంద్రియ పత్తి సాగులో ముందంజలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రమే ఇందుకు కేంద్ర బిందువు కావటం విశేషం. దేశీయ వంగడాలతో కూడిన సేంద్రియ పత్తి సాగును విస్తృతంగా వ్యాప్తిలోకి తేవాలన్న సంకల్పంతోనే అక్కడ రెండేళ్లుగా ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ రూపుదిద్దుకుంటున్నది. గ్వాలియర్‌లోని రాజమాత విజయరాజె సింధియా కృషి విశ్వ విద్యాలయం (ఆర్.వి.ఎస్. కె.వి.వి.) పరిధిలోని ఖండవా ప్రాంగణంలో ఇది ఏర్పాటైంది. భారతీయ సంప్రదాయ రకాలపై విస్తృత పరిశోధనలు చేసి మెరుగైన సేంద్రియ పత్తి వంగడాలను అభివృద్ధి చేయటం చాలా కీలకం. ఇందుకోసం విదేశీ సంస్థలతో కలిసి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఇటీవల ఒక అవగాహన ఒప్పందం చేసుకోవడం పెద్ద ముందడుగని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్.వి.ఎస్.కె.వి.వి. వైస్ ఛాన్సలర్‌గా ఉన్న డా. సూరపనేని కోటేశ్వరరావు పర్యవేక్షణలోనే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనిచేస్తుండటం మరో విశేషం. ప్లాంట్ బ్రీడర్ అయిన డా. రావు స్వస్థలం కృష్ణా జిల్లాలోని పోలుకొండ. ఇప్పుదు మన దేశంలో 90%పైగా విస్తీర్ణంలో సాగవుతున్న హైబ్రిడ్ జన్యుమార్పిడి పత్తి (Gossypium hirsutum, G.bar-ba-den-se) విత్తనాలు అంతర్జాతీయ సేంద్రియ ప్రమాణాలతో కూడిన పత్తి సాగుకు పనికిరావు. అందువల్లనే భారతీయ సంప్రదాయ పత్తి రకాలతోనే మెరుగైన సూటి వంగడాల అభివృద్ధిపై ఇంతకుముందెన్నడూ, ఎక్కడా ఎరుగని రీతిలో సేంద్రియ భూముల్లోనే బ్రీడ్ చేయడంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నామని డా. రావు ‘సాక్షి’తో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సాగవుతున్న సేంద్రియ పత్తిలో మన దేశం వాటా 56 శాతం. మన దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న రాష్ట్రం మధ్యప్రదేశ్. ఆ రాష్ట్రంలో దాదాపు లక్ష హెక్టార్లలో 87 వేల మంది చిన్న, సన్నకారు రైతులు సేంద్రియ పత్తిని సాగు చేస్తున్నారని అంచనా. బీటీ పత్తి రైతులకన్నా వీరికి 30% అదనంగా ఆదాయం వస్తున్నదని గణాంకాలు చెబుతున్నాయి. సేంద్రియ పత్తి సాగు వ్యాప్తికి ఉన్న ప్రతిబంధకాలలో ముఖ్యమైనది.. సేంద్రియ పత్తి విత్తనాల కొరత. జాతీయ, అంతర్జాతీయ సేంద్రియ ప్రమాణాల ప్రకారం జన్యుమార్పిడి (సూటి వంగడాలు లేదా హైబ్రిడ్) విత్తనాలు సేంద్రియ వ్యవసాయానికి పనికిరావు. హైబ్రిడ్ బీటీ పత్తి విత్తనాలు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడితేనే తగినంత దిగుబడినిస్తాయి. సేంద్రియ పత్తి సాగులో దేశీయ పత్తి రకాల (Gossypium ar-bo-re-um-)కు చెందిన సూటి వంగడాలను మాత్రమే వాడాల్సి ఉంటుంది. సూటి రకాల పత్తి నుంచి తీసే విత్తనాలను రైతులు తిరిగి పొలంలో విత్తుకోవచ్చు. హైబ్రిడ్ పత్తి నుంచి తీసిన విత్తనాలు మళ్లీ విత్తుకోవడానికి పనికిరావు. ప్రతి ఏటా కంపెనీ నుంచి రైతులు విధిగా కొనుక్కోవాల్సిందే. అయితే, దేశీ పత్తి వంగడాలు స్వల్ప విస్తీర్ణంలో సాగవుతున్నా వీటి దూది పింజ పొట్టిగా ఉంటుంది. సంప్రదాయ ఖాదీ ఉత్పత్తులకు ఈ పత్తి సరిపోతుంది. అయితే, సేంద్రియ పత్తి సాగును విస్తృతంగా వ్యాప్తిలోకి తేవాలంటే.. అంతర్జాతీయంగా సేంద్రియ పత్తి వస్త్రాల తయారీ కంపెనీల యంత్రాలకు అనుగుణంగా ఉండే విధంగా పొడుగు పింజ రకాలను అభివృద్ధి చేయాలి. ఈ సమస్యను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇప్పటికే అధిగమించిందని డా. రావు వెల్లడించారు. ఎంపీ ప్రభుత్వ మద్దతుతో మన దేశీ పత్తి రకాలతోనే గత నాలుగేళ్లుగా మెరుగైన వంగడాలను రూపొందించామన్నారు. వీటిలో 3 రకాలు చాలా మెరుగ్గా ఉన్నాయన్నారు. దేశీ పత్తి రకాల పింజ 24–26 ఎం.ఎం. ఉండేదని అంటూ.. తాము అభివృద్ధి చేసిన రకాల పింజ 28–33 ఎం.ఎం. వరకు ఉందన్నారు. వీటి పంటకాలం 140 రోజులేనని, అధిక సాంద్రతలో సాగుకు అనువైనేనన్నారు. చీడపీడలను సమర్థవంతంగా తట్టుకోవడం వల్ల రైతులకు ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు. అమెరికన్ బీటీ పత్తి వంగడాల వల్ల ఈ దేశీ వంగడాలు జన్యు స్వచ్ఛతను కోల్పోవని చెబుతూ.. వీటి క్రోమోజోమ్ నంబర్లు వేరు కావటమే ఇందుకు కారణమని వివరించారు. తమ యూనివర్సిటీ పరిధిలోని అనేక ప్రాంగణాల్లోనూ సేంద్రియ సాగును ప్రామాణికంగా చేపట్టామని, ఏటా రెండు పంటలు వేస్తూ విత్తనోత్పత్తి చేస్తున్నామన్నారు. సేంద్రియ పత్తి సాగులో దిగుబడులు బీటీ హైబ్రిడ్లకు దీటుగానే వస్తున్నాయని కూడా ఆయన అన్నారు. ఈ కృషిని మరింత ముమ్మరం చేయడం కోసమే ఎఫ్.ఐ.బి.ఎల్. తదితర స్వదేశీ, విదేశీ పరిశోధన, వాణిజ్య, ప్రభుత్వేతర సంస్థలతో ఇటీవల ఎం.ఓ.యు. కుదుర్చుకున్నట్లు వివరించారు. మన దేశంలో చిన్న, సన్నకారు రైతులకు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతులు నేర్పించటం కష్టమేమీ కాదన్నారు. నికార్సయిన సేంద్రియ పత్తిని పండించి, తగిన పరిమాణంలో స్థిరంగా సరఫరా చేయగలిగితే ఆకర్షణీయమైన ధర చెల్లించడానికి విదేశీ వస్త్ర వాణిజ్య సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఏ రైతు పండించిన సేంద్రియ పత్తితో ఆ వస్త్రాన్ని తయారు చేశారో తెలియజెప్పే (ట్రేసబిలిటీ) వివరాలను వస్త్రాలపై పొందుపరచే విధంగా పటిష్టమైన ఉత్పత్తి గొలుసును ఏర్పాటు చేస్తే.. మన దేశానికి సేంద్రియ పత్తి సాగు రంగంలో భవిష్యత్తులో తిరుగు ఉండబోదని డా. రావు ఆశాభావం వ్యక్తం చేశారు. సేంద్రియ పత్తి సాగు చేసే నీటి సదుపాయం ఉన్న రైతులు ఆకుకూరలు, పప్పుధాన్యాలు, నూనెగింజలను అంతరపంటలుగా సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. రసాయనిక పద్ధతులతో పోల్చితే సేంద్రియ పద్ధతిలో పత్తి సాగు ఖర్చు 60% వరకు తగ్గుతున్నదని, రైతులకు 30% అదనంగా ఆదాయం వస్తున్నదన్నారు. ఆదాయం మెరుగ్గా ఉందని ఆచరణలో గమనిస్తే.. వాణిజ్య స్థాయిలో పత్తి సాగు చేసే పెద్ద రైతులు కూడా సేంద్రియం వైపు ఆకర్షితులవుతారన్నారు. మరో మూడేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా సేంద్రియ పత్తి వంగడాలను అందించగలుగుతామని డా. రావు ఆశాభావం వ్యక్తం చేశారు. వివరాలకు.. vcrvskvvgwl@gmail.com -
'పత్తి'కి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి సాగుకు పెద్దపీట పడుతోంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 53.64 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలు వేసినట్టు వ్యవసాయ శాఖ తన నివేదికలో పేర్కొంది. సాధారణ పత్తి సాగు 43 లక్షల ఎకరాలే కాగా,ఈ సీజన్లో అది అదనంగా 10 లక్షల ఎకరాలకు పెరిగింది. రికార్డు స్థాయిలో 53 లక్షల ఎకరాలు దాటిపోయిందని నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం సాగు విస్తీర్ణంలో 84% పంటలు వేశారు. అందులో గత ఖరీఫ్‌లో ఈ సమయానికి సాగు లెక్కల తో పోలిస్తే వరి,కందులు, జొన్న, వేరుశనగ పంటల విస్తీర్ణం పెరగ్గా, మొక్కజొ న్న, చెరకు, సోయా బీన్ పంటల విస్తీర్ణం తగ్గింది. గత సీజన్లో ఈ సమయానికి కురిసిన దానికన్నా 21% ఎక్కువ వర్షపాతం నమోదైంది. నియంత్రిత సాగు బాటలో... ఈ సీజన్లో పంటల సాగు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నియంత్రిత బాటలోనే ఉందని గణాం కాలు చెబుతున్నాయి. సాధారణం కంటే 16 లక్షల ఎకరాలు ఎక్కువగా ఈ ఏడాది పత్తి 60.16 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఇప్పటికే 53 లక్షలకు పైగా ఎకరాల్లో విత్త నాలు పడ్డాయి. ఇది 89%. పంటల వారీగా చూస్తే వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జొన్న (70%), కందులు (66%), పెసలు (62%), మినుములు (75%), సోయాబీన్ (83%), చెరకు (67%) సాగయ్యాయి. ఇక, వరి ఈ ఖరీఫ్ లో 41.76 లక్షల ఎక రాల్లో సాగు చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక కాగా, అందులో 36% అంటే 15.13 లక్షల ఎకరాల్లో ఇప్పటి వరకు నాట్లు పడ్డాయి. ఇతర పంటల్లో ఆముదం 33,951 ఎకరాల్లో (37%), వేరుశనగ 11,578 ఎక రాల్లో (28%) సాగయ్యాయి. మక్కలు తగ్గాయి: ఈసారి రాష్ట్రంలో చర్చనీయాంశమైన మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. గత సీజన్లో ఈ సమయానికి 8 లక్షల ఎకరాలకు పైగా ఈ పంట వేయగా, ఈసారి 1.75 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ వానాకాలంలో 1,25 ,45,061 ఎకరాల్లో సాగు చేపట్టాలనేది ప్రభుత్వ ఆలోచన కాగా, అందులో 69% అంటే 86, 45,534 ఎకరాల్లో అన్ని రకాల పంటలు కలిపి సాగయ్యాయి. వ్యవసాయ శాఖ నివేదికలోని ముఖ్యాంశాలు.. ► రాష్ట్రంలో ఈ సీజన్ సాధారణ వర్షపాతం 358.3 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 21% అధి కంగా 433.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. 18 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ, 13 జిల్లాల్లో సాధారణ స్థాయిలో, 2 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ► మొత్తం ఆహార ధాన్యాల సాధారణ సాగు 50 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికి 27 లక్షల ఎకరాలకు పైగా సాగైంది. సగటు కన్నా ఎక్కువ వర్షం కురిసిన జిల్లాలు భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్(అర్బన్), కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సిద్ధిపేట, జనగామ, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, జోగుళాంబ, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, నారాయణ్ పేట. సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు ఆదిలాబాద్, కొమురంభీం,మంచిర్యాల, వరంగల్ (రూరల్), జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్, ములుగు, నల్లగొండ. లోటు జిల్లాలు: నిర్మల్, నిజామాబాద్. -
పత్తి 10 లక్షల ఎకరాలు అదనం
సాక్షి, హైదరాబాద్: గతేడాది వానకాలం సాగు కంటే ఈసారి పత్తిని 10.30 లక్షల ఎకరాల్లో రైతులతో అధికంగా సాగు చేయించాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా పంటల మ్యాపింగ్ పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం సమావేశమయ్యారు. ఆ తర్వాత జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. మరోసారి చర్చించి దీనికి తుదిరూపు ఇస్తారు. గతేడాది 54.45 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈసారి ఆ మొత్తం విస్తీర్ణాన్ని 64.75 లక్షల ఎకరాలకు పెంచుతూ జిల్లాల వారీగా మ్యాపింగ్ తయారుచేశారు. మెదక్, నారాయణ్‌పేట్, యాదాద్రి భువనగిరి జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ పత్తి సాగు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నల్లగొండ జిల్లాలో 7.25 లక్షల ఎకరాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 4.50 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్‌లో 4.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అధికంగా ఉంటుందని మ్యాపింగ్ చేశారు. వరి సాగు తగ్గించేలా ప్రణాళిక మ్యాపింగ్ ప్రకారం రాష్ట్రంలో ప్రధానంగా పత్తి, కంది సాగును ప్రోత్సహిస్తారు. ఈ వానాకాలం సీజన్లోనే ఏ జిల్లాలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలనే దానిపై లెక్కలు కూడా తీశారు. వీటిని త్వరలోనే జిల్లా కలెక్టర్లకు పంపనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో వరి సాగు విస్తీర్ణం 40.24 లక్షల ఎకరాల్లో, పత్తి 64.75 లక్షల ఎకరాల్లో, కందులు 14.09 లక్షల ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గత వానాకాలం సీజన్లో సాగైన వరి విస్తీర్ణం 41.19 లక్షల ఎకరాలుండగా, దాన్ని 40.24 లక్షల ఎకరాలకు పరిమితం చేస్తారు. అంటే 95 వేల ఎకరాలు తగ్గిస్తారు. ఇందులో అత్యధికంగా 3 జిల్లాల్లో సాగు 3 లక్షల ఎకరాల చొప్పున ఉంది. నల్లగొండలో 3.30 లక్షల ఎకరాలు, సూర్యాపేటలో 3.20 లక్షల ఎకరాలు, నిజామాబాద్‌లో 3 లక్షల ఎకరాల్లో వేశారు. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ వరి సాగును తగ్గించాలని నిర్ణయించారు. కంది పంటకు ప్రోత్సాహం ఈసారి కంది సాగును విపరీతంగా ప్రోత్సహించాలని పంటల మ్యాపింగ్‌లో నిర్ణయిం చారు. ఎంత కంది వస్తే అంత మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కూడా సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని జిల్లాల్లో కంది పంట సాగును పెంచనున్నారు. గత వానాకాలంలో 7.38 లక్షల ఎకరాల్లో కంది సాగు కాగా, ఈసారి అదనంగా 6.70 లక్షల ఎకరాలతో 14.08 లక్షల ఎకరాల్లో మ్యాపింగ్‌ను సిద్ధం చేశారు. ఇందులో అత్యధికంగా వికారాబాద్‌లో 1.73 లక్షల ఎకరాలు, నారాయణ్‌పేట్‌లో 1.70 లక్షల ఎకరాలు, రంగారెడ్డిలో లక్ష ఎకరాల్లో సాగుకు ప్రతిపాదించారు. సోయాబీన్ తగ్గింపు.. సోయాబీన్ సాగును ఈ వానాకాలంలో తగ్గించాలని పంటల మ్యాపింగ్‌లో పేర్కొన్నారు. దీని ప్రకారం గతేడాది 4.26 లక్షల ఎకరాల్లో సాగు నమోదు కాగా, ఈసారి 2.46 లక్షల ఎకరాల్లో వేసేలా ప్రణాళిక తయారు చేశారు. 1.80 లక్షల ఎకరాలు తగ్గించాలని ప్రతిపాదించారు. ఇక జొన్నలు, మినుములు, ఆముదం సాగు పెంపును మ్యాపింగ్‌లో ప్రస్తావించారు. ఈ వానాకాలంలో జొన్నలు 1.42 లక్షల ఎకరాలు, మినుములు 65,980 ఎకరాలు, ఆముదం 1.39 లక్షల ఎకరాల్లో సాగు చేసేలా ప్రతిపాదించారు. ఇక చెరకు సాగును కూడా పెంచాలని ప్రణాళికలో పేర్కొన్నారు. ఈసారి 69,855 ఎకరాల్లో వేసేలా ప్లాన్ చేశారు. వేరుశనగ 49,960 ఎకరాల్లో సాగు మ్యాపింగ్ చేశారు. సర్కారు చెప్పినట్లుగానే పంటలు వేయాలన్న నిర్ణయంపై రైతులను ఎలా ఒప్పించాలన్న దానిపై వ్యవసాయశాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. తక్కువ కాలంలో రైతులను ఒప్పించగలమా అన్న సంశయం కూడా కొందరు అధికారుల్లో వ్యక్తమైంది. -
పత్తి వేస్తే పంట పండినట్టే!
సాక్షి, హైదరాబాద్: పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే రాష్ట్రంలో వానాకాలం, యాసంగి కలిపి ఏడాదికి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేయాలని వ్యవసాయ రంగ నిపు ణులు ప్రభుత్వానికి, రైతులకు సూచించారు. ఇక వరి కంటే పత్తి పంటే లాభదాయకమని తేల్చి చెప్పారు. తెలంగాణలో వానాకాలం పంటగా 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో కందులు వేయడం మం చిదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శుక్రవారం వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగ నిపుణులు చేసిన ముఖ్యమైన సూచనలివీ... వరిని ఎక్కువగా పండించడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర అవసరాలు, బియ్యం మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో రెండు పంటలకు కలిపి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పండించాలి. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేస్తే రైతుకు ధర రాదు. ఈ 65 లక్షల ఎకరాల్లో సన్న, దొడ్డు రకాలు కలిపి వానాకాలంలో 40 లక్షల ఎకరాలు, యాసంగిలో 25 లక్షల ఎకరాలు సాగు చేయాలి. వరితో పోల్చుకుంటే పత్తి సాగు చాలా లాభదాయకం. కాల్వల ద్వారా వచ్చే నీటితో పత్తిని సాగు చేస్తే ఎక్కువ దిగుబడితోపాటు నాణ్యమైన పత్తి వస్తుంది. వరిలో ఎకరానికి 30 వేల నికర ఆదాయం వస్తే, పత్తి పంటకు ఎకరానికి అన్ని ఖర్చులు పోను 50 వేల వరకు ఆదాయం వస్తుంది. తెలంగాణలో 65 నుంచి 70 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు చేయడం శ్రేయస్కరం. కందులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తెలంగాణలో వర్షాకాలం పంటగా కందులను 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో సాగు చేయడం ఉత్తమం. వర్షాకాలంలో మక్కలు పండించకపోవడం చాలా మంచిది. వర్షాకాలంలో మక్కల దిగుబడి ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే వస్తుంది. అదే యాసంగిలో 40 నుంచి 45 క్వింటాళ్ల వరకు ఉంటుంది. మక్కలకు మార్కెట్లో డిమాండ్ కూడా అంతగా లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ అవసరాలకు తగినట్టు యాసంగిలో మాత్రమే మక్కలు సాగు చేసుకోవడం మంచిది. 18న సీఎం వీడియో కాన్ఫరెన్స్... వ్యవసాయరంగ నిపుణులు చేసిన సూచనలపై ప్రభుత్వం చర్చించిన తర్వాత నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసే విధానాన్ని ఖరారు చేస్తుంది. అనంతరం సమగ్ర వ్యవసాయ విధానం, పంటల సాగు పద్ధతులపై క్షేత్రస్థాయి అధికారులు, రైతుబంధు సమితులతో ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. వాస్తవానికి శుక్రవారం ఈ వీడియో కాన్ఫరెన్స్ జరగాల్సి ఉండగా.. అది ఈ నెల 18కి వాయిదా పడింది. -
‘బీజీ–3’ అమ్మితే ఏడేళ్ల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: నిషేధిత బీజీ–3 పత్తి విత్తనం అమ్మితే ఏడేళ్లు జైలు శిక్ష విధించేలా చట్టం చేసేందుకు తెలంగాణ వ్యవసాయశాఖ కసరత్తు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ (ఈపీ) చట్టం 1986 రూల్ 13 ప్రకారం పర్యావరణానికి హానికలిగించే విత్తనాలు విక్రయిస్తే ఏడేళ్ల జైలుతోపాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈసారి ఈ చట్టాన్ని ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. ప్రస్తుతం 1966 విత్తన చట్టం ప్రకారమే కేసులు నమోదు చేస్తున్నారు. ఈ చట్టం వల్ల నకిలీ, కల్తీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కేవలం రూ. 500 జరిమానా, ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. గతేడాది నకిలీ, కల్తీ పత్తి విత్తనాలు విక్రయించిన, తయారుచేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. చాలా మందిని అరెస్టు చేశారు. ఈసారి అంతకుమించి ఏడేళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటేనే దీన్ని అరికట్టగలమన్న భావనలో సర్కారు ఉంది. పైగా పర్యావరణ చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. రైతులూ జాగ్రత్త! బీజీ–3 పత్తి విత్తనాలు కొనుగోలు చేసేముందు రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ విజ్ఞప్తి చేస్తో్తంది. ఈ విత్తనాలు జీఎం (జెనిటికల్లీ మోడిఫైడ్) అని, వీటిని సాగు చేసినందుకుగాను ఇటీవల మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన రైతులపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే రైతులను దళారులు మోసపుచ్చి బీజీ–3 విత్తనాలను అంటగడుతున్నారు. చాలా మంది రైతులకు ఈ విత్తనంపై అవగాహన లేకపోవడం, కలుపురాదని ఎక్కువ దిగుబడి వస్తుందని ప్రచారం చేస్తూ అక్రమార్కులు వారికి అంటగడుతున్నారు. ఈ పత్తి విత్తనాలు వేస్తే అత్యంత ప్రమాదకరమైన గ్లైఫోసేట్ పురుగుమందు వినియోగించాలి. ఇది జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసేవని, క్యాన్సర్‌కు కారకమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. బీజీ–3 విత్తనాల విక్రయాలు రాష్ట్రంలో చాపకిందనీరులా జరుగుతున్నాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోకి విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. గత ఏడాది 694 శాంపిళ్లను పరీక్షించగా, 119 శాంపిళ్లలో బీజీ–3 లక్షణాలున్నట్లు నిర్ధారించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ 2వ తేదీ వరకు బీజీ–3 లక్షణాలున్న విత్తనాలను నిర్ధారించేందుకు 17 శాంపిళ్లను పరీక్షించగా అందులో 8 శాంపిళ్లు బీజీ–3గా తేలినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేశారు. ఆరుగురు డీలర్ల లైసెన్స్‌లను కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. 112 క్వింటాళ్ల పత్తి విత్తనాలు సీజ్ చేయగా, 56,122 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. గణనీయంగా పత్తి సాగు ఈసారి ఇప్పటి వరకు సాగైన పంటల్లోనూ పత్తిదే అగ్రస్థానంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం ఇప్పటివరకు 11 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా.. అందులో అత్యధికంగా పత్తి 8.50 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది బీజీ–3 విత్తనం సాగు చేసినందుకు 45 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే కొందరు దళారులు, వ్యాపారులు, కొందరు అధికారుల నిర్లక్ష్యంతో బీజీ–3 విత్తన అడ్డాగా రాష్ట్రం మారింది. బీజీ–2 విత్తనం విఫలం కావడంతో కొన్ని కంపెనీలు ప్రమాదకరమైన బీజీ–3 విత్తనాన్ని రైతులకు అంటగడుతున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్ టీమ్స్ పనిచేస్తున్నప్పటికీ దళారులు, అక్రమార్కులు ఈ ప్రమాదకరమైన విత్తనాలను అన్నదాతలకు పెద్దమొత్తంలోనే విక్రయించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ వర్గాలే ధ్రువీకరించడం గమనార్హం. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాల్లో బీజీ–3 విత్తన పంట చాపకింద నీరులా విస్తరిస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర నుంచి సరఫరా కావడంతో పాటు మన రాష్ట్రంలో రైతుల పొలాల్లోనే బీజీ–3 పత్తి విత్తన పంటను సాగు చేయించి, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. -
పత్తి సాగు 98 శాతం
సాక్షి, హైదరాబాద్: పత్తి సాగు గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు 98 శాతం పత్తి పంట సాగైనట్లు వ్యవసాయశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాగుపై వ్యవసాయశాఖ బుధవారం నివేదిక విడు దల చేసింది. ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 40.99 లక్షల ఎకరాలకు చేరినట్లు తెలిపింది. అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 77.65 లక్షల ఎకరాల్లో పంటల సాగయ్యాయి. ఏడు జిల్లాల్లో లోటు వర్షపాతం... 7 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయ నివేదిక తెలిపింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో లోటు నమోదైందంది. హైదరాబాద్, సిద్దిపేట జిల్లాల్లోనైతే ఏకంగా 33 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదు కాగా, మెదక్‌లో 32 శాతం, సంగారెడ్డి జిల్లాలో 31 శాతం, యాదాద్రి జిల్లాలో 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే 194 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అలాగే 6 మండలాల్లో వర్షాభావం నెలకొంది. ఇక ఆదిలాబాద్, కొమురంభీం, పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 32 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఆ ప్రకారం 115 మండలాల్లో అత్యధిక వర్షం కురిసింది. మిగిలిన 20 జిల్లాల్లో(269 మండలాల్లో) సాధారణ వర్షపాతం రికార్డు అయింది. ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 320.9 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 311.7 మిల్లీమీటర్లు నమోదైంది. జూన్ నెలలో 14 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, ఈ నెలలో ఇప్పటివరకు 14 శాతం లోటు కనిపించడం గమనార్హం. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సాక్షి, పరకాల రూరల్: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం వరికోల్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోర్తాల తిరుపతి (39) తనకున్న ఎకరం భూమితోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని మూడేళ్లుగా పత్తి పంట సాగు చేస్తున్నాడు. పెట్టుబడి ఎక్కువ కావడం, దిగుబడి తగ్గడంతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పటికే రూ.2 లక్షల అప్పు ఉండగా ఈ ఏడాది మరో రూ.లక్ష అప్పు చేశాడు. దీంతో అప్పు ఎలా తీర్చాలి అని మనోవేదనకు గురైన తిరుపతి సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య సమ్మక్క, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
గులాబీ పురుగు పీడ మరెక్కడా లేదు!
► పత్తి సాగు కాలాన్ని 6 నెలల్లో ముగించడమే పరిష్కారం ► అంతర్జాతీయ పత్తి సలహా సంఘం సాంకేతిక అధిపతి ► డాక్టర్ కేశవ్ క్రాంతితో ‘సాగుబడి’ ఈ–మెయిల్ ఇంటర్వ్యూ అంతర్జాతీయ పత్తి సలహా సంఘం(ఐసీఏసీ) ప్రపంచ దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులతో కూడినది. దీని కేంద్ర సచివాలయం వాషింగ్టన్లో ఉంది. పత్తి సాగుపై ఆయా దేశాలకు సాంకేతిక, శాస్త్రీయ సలహాలను అందిస్తుంది. ఈ సంఘంలో సాంకేతిక విభాగం అధిపతిగా పనిచేస్తున్న తెలుగు శాస్త్రవేత్త డాక్టర్ కేశవ్ క్రాంతితో ‘సాక్షి సాగుబడి’ తాజాగా ఈ–మెయిల్ ఇంటర్వ్యూ చేసింది. పత్తి సాగు సీజన్ ప్రారంభంలోనే గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గులాబిరంగు కాయతొలిచే పురుగు రైతులను బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. దీని పీడ పత్తిని విస్తారంగా సాగు చేస్తున్న చైనా, పాకిస్తాన్ సహా ఏ దేశంలోనూ లేదన్నారు. ఇతర దేశాల మాదిరిగా 5–6 నెలల్లో పత్తి సాగు పూర్తయ్యే వంగడాల రూపకల్పనే ఉత్తమ పరిష్కారమని డా. క్రాంతి చెబుతున్నారు. ♦ పత్తి కాయలు తొలిచే గులాబీ రంగు పురుగు ఈ ఖరీఫ్ సీజన్ మొదట్లోనే తెలంగాణ, ఆంధ్రాతోపాటు 5 రాష్ట్రాల్లో పెచ్చరిల్లింది. రైతాంగాన్ని బెంబేలెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పత్తి సాగవుతున్న దేశాల్లో కూడా ఇలాగే ఉందా? మన దేశంలో గులాబీరంగు పురుగు సమస్య, ముఖ్యంగా గత ఏడాది డిసెంబర్ తర్వాత కూడా పత్తి పంట సాగు కొనసాగిన ప్రాంతాల్లో, తిరిగి తలెత్తుతుందని ముందుగా ఊహించినదే. ఈ సమస్య మన దేశంలోనే ఉంది. ఇతర దేశాల్లో లేదు. దీనికో ముఖ్య కారణం ఉంది. పత్తి విత్తిన తర్వాత 5–6 నెలల్లో పంటను తీసెయ్యాలి. అంతకుమించి దాదాపు ఏడాది పొడవునా పత్తి సాగులో ఉండడం వల్ల, పత్తిని మాత్రమే ఆశించే ఈ పురుగులు మనుగడ సాగించగలుగుతున్నాయి. అందువల్ల మన దేశంలో గులాబీ రంగు పురుగు సమస్యగా మారింది. పత్తి విత్తనోత్పత్తి చేసే రైతులు మన దేశంలో సుమారు 2 లక్షల హెక్టార్లలో దాదాపుగా ఏడాది పొడవునా పత్తి పంటను సాగు చేస్తున్నారు. ఇతర దేశాల్లో ఐదారు నెలల్లో పత్తి సాగును పూర్తి చేసి, మరో ఆరు నెలల తర్వాతే తిరిగి పత్తి విత్తుకుంటున్నారు. ఈలోగా పురుగులు నశిస్తున్నాయి. అందువల్ల వారికి గులాబీ రంగు పురుగు బెడద తలెత్తడం లేదు. ♦ మన మాదిరిగానే బీటీ పత్తిని సాగు చేస్తున్న చైనాలో పరిస్థితి ఏమిటి? చైనాలో 1997 నుంచి బీటీ–1 (సీఆర్‌వై1ఏసీ)ని మాత్రమే సాగుచేస్తోంది. అయినా, గులాబీ రంగు పురుగు అక్కడ సమస్యగా మారలేదు. గులాబీ రంగు పురుగు సమస్య చైనాలో కొన్నేళ్ల క్రితం, పాకిస్తాన్లో గత ఏడాది తలెత్తినప్పటికీ.. ఏడాది పొడవునా పత్తి సాగులో లేదు కాబట్టి పురుగుల సంతతి సమస్యాత్మకంగా మారలేదు. పాకిస్తాన్లో బీటీ–1కు గులాబీ రంగు పురుగు అలవాటుపడిపోయినప్పటికీ పత్తిని 6–7 నెలల్లో ముగించి, తర్వాత గోధుమను సాగు చేసే అలవాటు ఉండటం వల్ల.. ఈ పురుగు సమస్యాత్మకంగా మారడంలేదు. ► మన దేశంలో గులాబీ రంగు పురుగు రాకుండా ముందస్తు చర్యలు ఏమైనా తీసుకున్నారా..? మన దేశంలో బీటీ 1, బీటీ 2 (బోల్‌గార్డ్–2) రకం బీటీ విత్తనాలకు గులాబీ రంగు పురుగు అలవాటు పడిపోయింది. పైగా 2016–17 నాటి పత్తి పంట పొలాల్లో ఎడతెగకుండా ఏడాదంతా కొనసాగింది. ఈ కారణాల రీత్యా ఈ ఆగస్టులోనే పత్తి చేలల్లో గులాబీ రంగు పురుగు ఉధృతమవుతుందని ఫిబ్రవరిలోనే ఢిల్లీలోని ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ► ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేమిటి? ప్రస్తుతం బీటీ పత్తి విత్తన కంపెనీలు ఒక కాపీ (జ్ఛిఝజ్డీyజౌuట) ఉన్న బీటీ జన్యువులనే వాడుతున్నారు. రెండు కాపీలు (జిౌఝ్డౌyజౌuట) ఉన్న బీటీ జన్యువులతో కూడిన హైబ్రిడ్స్‌ను మాత్రమే మార్కెట్లో అమ్మాలని విత్తన కంపెనీలను ప్రభుత్వం ఆదేశించాలి. మా సలహా మేరకు ఇప్పటికే ఒక కంపెనీ ఈ పని చేసి, సత్ఫలితాలు పొందుతోంది. పత్తి రైతులకు ప్రభుత్వం గట్టిగా చెప్పాల్సిందేమిటంటే.. డిసెంబర్ నెలాఖరుకన్నా ముందే పత్తి పంటను పూర్తి చెయ్యాలి. ఆ తర్వాత పొలంలో పత్తి మొక్కలు ఉండకూడదు. ఇందుకోసం పత్తి విత్తన కంపెనీలు కూడా మధ్యకాలిక లేదా స్వల్పకాలిక హైబ్రిడ్ విత్తనాలను మాత్రమే రైతులకు అమ్మాలని విత్తన కంపెనీలకు ఆదేశాలివ్వాలి. ► సింథటిక్ పైరిత్రాయిడ్ పురుగుమందులకు సేంద్రియ ప్రత్యామ్నాయాలేవీ లేవా? ట్రైకోగామా పరాన్నజీవులను సకాలంలో పత్తి పొలంలో విడుదల చేస్తే గులాబీరంగు కాయతొలిచే పురుగులను గుడ్ల దశలోనే అరికట్టవచ్చు. ఈ పరాన్నజీవులను జీవనియంత్రణ ప్రయోగశాలల్లో పెంపొందించవచ్చు. సిఐసిఆర్, ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం తదితర యూనివర్సిటీలలో ఇవి అందుబాటులో ఉన్నాయి. లింగాకర్షక బుట్టలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేయడం ఒక మంచి ఉపాయం. అయినప్పటికీ, గులాబిరంగు కాయతొలిచే పురుగు యాజమాన్యాన్ని రసాయన రహిత పద్ధతుల్లో చేపట్టాలనుకుంటే చేయాల్సినది.. ఒకటి: 150–180 రోజుల్లో పంట పూర్తయ్యే పత్తి వంగడాలను రూపొందించుకోవడం ఉత్తమం. రెండు: పత్తి పంట పూర్తయ్యాక కనీసం 180 రోజులు గడచిన తర్వాతే తదుపరి పత్తి విత్తుకోవాలి. ► సిఐసిఆర్ రూపొందించిన లింగాకర్షక బుట్టలను రైతులు పొందాలంటే ఎలా? నేను సిఐసిఆర్‌లో పనిచేస్తున్నప్పుడు సరికొత్త ఫెరొమోన్ ఫార్ములేషన్‌ను రూపొందించాను. మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటికన్నా ఇది ఎక్కువ రెక్కల పురుగులను ఆకర్షించగలుగుతుంది. 30–45 రోజులు పనిచేస్తుంది. లింగాకర్షక బుట్ట (రెండు ల్యూర్‌లు సహా) ధర రూ. 25గా సిఐసిఆర్ విక్రయిస్తున్నది. పన్నులు, రవాణా చార్జీలు అదనం. పర్యవేక్షణ: పత్తి చేలల్లో తొలి దశలో ఎకరానికి 2–3 లింగాకర్షక బుట్టలు పెట్టాలి. లింగాకర్షక బుట్టలు: అక్టోబర్ చివరి నాటికి ప్రతి ఎకరంలో 20–30 వరకు లింగార్షక బుట్టలు ఏర్పాటు చేయాలి. నవంబర్ ఆఖర్లో లేదా డిసెంబర్ మొదట్లో ల్యూర్‌ను మార్చాలి. ఇప్పుడు చేయాల్సిందేమిటి..? సీజన్ మొదట్లోనే గులాబీ రంగు పురుగు వచ్చిందని బెంబేలెత్తిపోవాల్సిన పని లేదు. లింగాకర్షక బుట్టలు, పైరిత్రాయిడ్ మందుల వాడకం ద్వారా నియంత్రించవచ్చు. నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా స్థానం (సి.ఐ.సి.ఆర్.) లింగాకర్షక బుట్టలను తయారు చేసింది. దీని ఖరీదు రూ. 20–25 మాత్రమే. వీటిని ఎకరానికి 20–30 చొప్పున పెడితే సమస్య తగ్గుతుంది. సెప్టెంబర్ నుంచి హెక్టారుకు 5 చొప్పున లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి, పురుగు తీవ్రతను అంచనా వేసుకోవాలి. ఒక్కో బుట్టలో ఒక రాత్రికి 8 తల్లి రెక్కల పురుగుల చొప్పున వరుసగా 3 రోజులు పడితే ఇక ఆలస్యం చేయకుండా పైరిత్రాయిడ్ పురుగుమందులు పిచికారీ చేయాలి. దీనితోపాటు ఎకరానికి 20–30 లింగాకర్షక బుట్టలను పత్తి రైతులంతా సామూహికంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఏర్పాటు చేసిన 35–40 రోజులు పనిచేస్తుంది. ఆ తర్వాత మార్చుకోవాలి. 120 రోజుల ‘యుగాంక్’ సంగతులేమిటి? నాగపూర్‌లోని సీఐసీఆర్ రూపొందించిన 100–120 రోజుల్లో పూర్తయ్యే ‘యుగాంక్’ పత్తి సూటి వంగడంపై క్షేత్రప్రయోగాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది దేశంలో చాలా చోట్ల దీన్ని ప్రయోగాత్మకంగా పండించి చూస్తారు. ఫలితాలు అనుకూలంగా ఉంటే త్వరలోనే రైతులకు అందించే ప్రక్రియ మొదలు కావచ్చు. ఈ వంగడాన్ని త్వరగా రైతులకు అందించాలన్నదే నా కోరిక. నేనే అక్కడికి వెళ్లి ఈ ప్రక్రియను వేగవంతం చేయాల్సి వస్తుందేమో. సూటిరకం బీటీ పత్తి వంగడాలకు పచ్చజెండా! ప్రతి ఏటా కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా తిరిగి వాడుకునే సూటిరకం బీటీ పత్తి వంగడాలకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఇటీవల పచ్చజెండా ఊపింది. నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సీఐసీఆర్) రూపొందించిన ఈ వంగడాలు మరో 2–3 ఏళ్లలో రైతులకు అందుబాటులోకి రావచ్చు. సీఐసీఆర్ ఈ వంగడాలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్నది. వచ్చే ఏడాది జాతీయ విత్తన సంస్థ (ఎన్.ఎస్.సి.) ద్వారా పెద్ద ఎత్తున విత్తనోత్పత్తి చేసిన తర్వాత రైతులకు అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విత్తనాలను రైతులు ఒకసారి కొంటే.. తాము పండించిన పత్తి నుంచి విత్తనాలు తీసి తిరిగి విత్తుకోవచ్చని, ఇతర విత్తనాలతో కలవకుండా ఉంటే నాలుగేళ్ల పాటు తిరిగి వాడుకోవచ్చని సీఐసీఆర్ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఎస్. లదానియా చెప్పారు. పత్తి పంటను డిసెంబర్ కల్లా పూర్తి చేస్తే తప్ప గులాబి రంగు పురుగును నిర్మూలించలేమన్నారు. నీటి పారుదల సదుపాయం ఉన్నప్పటికీ డిసెంబర్ నాటికి పత్తి పంటను ముగించడం ముఖ్యమన్నారు. లింగాకర్షక బుట్టల కోసం సంప్రదించాల్సిన సిఐసిఆర్ చిరునామా: THE DIRECTOR, CENTRAL INSTITUTE FOR COTTON RESEARCH, PB.No 2 SHANKARNAGAR PO NAGPUR 440 010; Phone: 07103-275536/38 (office)Fax: 07103-275529, E-mail: itmucicrngp@gmail.com ఈ–మెయిల్ ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
మరో 54 పత్తి కొనుగోలు కేంద్రాలు
ఢిల్లీలో బీజేపీ నేతల వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఈ ఏడాది రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగుచేసిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచేందుకు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అంగీ కరించారని తెలంగాణ బీజేపీ నేతలు తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, పార్టీ సమ న్వయకర్త బాలరాజ్ తదితరులు శుక్రవారం స్మృతీ ఇరానీతో సమావేశమై పత్తి కొనుగోలు కేంద్రాలు పెంచాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఈ ఏడాది అదనంగా 54 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలకు హామీ ఇచ్చారు. అలాగే కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ను కలసి హైదరాబాద్‌లోని అటవీ పరిశోధన సంస్థ సేవలను మరింతగా వినియోగించుకునేం దుకు అధిక నిధులు కేటాయించాలని కోరారు. ఈ సంద ర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జీఎస్టీ విషయంలో పూటకోమాట మాట్లాడుతోందని విమర్శించారు. -
అంచనాలను మించి పత్తి సాగు
► ఖరీఫ్‌లో అన్ని పంటల సాగు 75 లక్షల ఎకరాలైతే... అందులో పత్తే 42 లక్షల ఎకరాలు ► ఊపందుకోని వరి నాట్లు... జలాశయాలు నిండకపోవడమే కారణం ► 144 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు ► వ్యవసాయశాఖ నివేదిక వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి అంచనాలకు మించి సాగవుతోంది. ఇప్పటికే వంద శాతం మైలు రాయిని దాటేసింది. ఇంకా సాగు పెరిగే అవకాశముందని వ్యవసా యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన పంటల సాగు పెద్దగా ఊపందుకోలేదు. ముఖ్యంగా ఆహారధాన్యాల పంటల సాగు గతేడాదితో పోలిస్తే తక్కువగా ఉంది. జలాశయాలు, చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరకపోవడంతో వరి నాట్లు అనుకున్నంత స్థాయిలో పుంజుకోలేదు. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. పత్తి తప్ప మిగతా పంటల సాగు సంతృప్తికర స్థాయిలో లేదని వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పుంజుకోని వరి నాట్లు... ఖరీఫ్‌లో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 48.72 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 25.90 లక్షల ఎకరాల్లో (53%) సాగయ్యాయి. అందులో పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.35 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. గతేడాది ఇదే కాలానికి 12.12 లక్షల ఎకరాల్లో పప్పు ధాన్యాలు సాగయ్యాయి. ఇక వరి నాట్ల పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. చెరువులు, జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరకపోవడంతో నాట్లు పుంజుకోలేదని అంటున్నారు. మరిన్ని వర్షాలు పడి వరదనీరు వచ్చి చేరితేనే నాట్లు ఊపందుకుంటాయని అంటున్నారు. ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 6.72 లక్షల ఎకరాల్లో (29%) నాట్లు పడ్డాయి. ఇక నూనె గింజల పంటల్లో కీలకమైన సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 5.10 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 3.77 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది ఇదే సమయానికి సోయా ఏకంగా 6.95 లక్షల ఎకరాల్లో సాగైంది. 144 మండలాల్లో లోటు వర్షపాతం రాష్ట్రంలో 584 మండలాలకు గాను 144 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. 254 మండలా ల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 183 మండలాల్లో అధిక వర్షం కురిసింది. మూడు మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో 16 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లాలో 15 మండలాలు, నిర్మల్ జిల్లాలో 14, మంచిర్యాల జిల్లాలో 13, కొమురంభీమ్ జిల్లాలో 11, మెదక్ జిల్లాలో 10 మండలాల్లో లోటు వర్షపాతం రికార్డయింది. 42.17 లక్షల ఎకరాలకు చేరిన పత్తి.. రాష్ట్రంలో ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. అందులో ఇప్పటివరకు 75.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా 42.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇప్పటివరకు సాగైన అన్ని పంటల్లో ఒక్క పత్తే 55.78 శాతం సాగు కావడం నివ్వెరపరుస్తోంది. గతేడాది సర్కారు మాట విని ఇతర పంటలు అధికంగా వేయడం, పత్తిని నిర్లక్ష్యం చేయడం వల్ల పెద్ద ఎత్తున నష్టపోయామని భావించిన రైతులు ఇప్పుడు పత్తికి జై కొట్టారు. గతేడాది ఇదే సమయానికి పత్తి సాగు విస్తీర్ణం కేవలం 26.80 లక్షల ఎకరాలు మాత్రమే. -
పత్తి ధర పడిపోతుందా?
- ధరల పరిస్థితిపై అధికార యంత్రాంగం ఆందోళన - సాగు అధికమైతే ధరలు పడిపోయే ప్రమాదముందన్న నిపుణులు - ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సాగయిన వివిధ పంటలు (ఎకరాల్లో) 10.10 కోట్లు - ఇందులో పత్తి సాగు(ఎకరాల్లో) 1.79 కోట్లు - రాష్ట్రంలో ఇప్పటి వరకు సాగైన పత్తి (ఎకరాల్లో) 30 లక్షలు - 2016–17లో దేశవ్యాప్తంగా పత్తి సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) 1.69 కోట్లు సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైతులంతా పత్తి బాట పట్టారు. గతేడాది పత్తి పంటకు మార్కెట్లో మంచి ధర పలకడంతో ఇప్పుడు రైతులు తెల్ల బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు. గతేడాది కంది, మిర్చి వంటి పంటల ధరలు పతనం కావడంతో పత్తి పంటే మేలన్న భావన రైతుల్లో నెలకొంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10.10కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. తెలంగాణ అన్నదాతలంతా మూకుమ్మడిగా పత్తి వైపు పరుగులు తీస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగు కాగా, అందులో 30.85 లక్షల ఎకరాల్లో పత్తి వేయడం విస్మయానికి గురి చేస్తోంది. అధిక సాగుతో ధర పతనంపై ఆందోళన... అంతర్జాతీయంగా పత్తి ధరలు గణనీయంగా పడిపోనున్నాయి. రైతులను ఇతర పంటల వైపు మళ్లించాలని గతేడాది ఖరీఫ్‌లో ప్రభుత్వం వ్యవసాయ శాఖను ఆదేశించింది. దీంతో రైతులు సోయా, పప్పుధాన్యాలు సాగు చేశారు. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తారుమారైంది. గత ఏడాది పత్తికి మార్కెట్లో రెట్టింపు స్థాయిలో ధర పలకడంతో రైతులు, అధికారులు కంగుతిన్నారు. దానికి తోడు సోయా, కంది, పెసర పంటల ధరలు మార్కెట్లో పతనమయ్యాయి. రాష్ట్రంలో ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42.21 లక్షల ఎకరాలు కాగా... 2015–16లో 41.71 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత ప్రభుత్వం పత్తిని నిరుత్సాహపరచడంతో 2016–17లో 30.52 లక్షల ఎకరాలకు పడిపోయింది. పరిస్థితి తిరగబడడంతో ప్రభుత్వం గతేడాది వద్దన్న పంటలనే ఈసారి ప్రోత్సహిస్తోంది. ఇదిలా ఉండగా పత్తి విషయంలో ఇప్పుడు 2015–16 నాటి పరిస్థితి పునరావృతమవుతుందా అన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. అప్పట్లో పత్తి పెద్ద ఎత్తున సాగైంది. దీంతో ధర రూ.3,700 వరకు పడిపో యింది. కనీస మద్దతు ధర గరిష్టంగా క్వింటాలుకు రూ. 4,050 నిర్ణయించగా, వ్యాపారులు రూ. 3,600కు మించి కొ నుగోలు చేయలేదు. సీసీఐ కూడా చేతులెత్తేసింది. ఇలా ఒక ఏడాది సాగు పెరిగితే ధర పడిపోవడం, మరో ఏడాది సాగు తగ్గితే దాని ధర పెరగడంతో ఈ సారీ అలా జరుగుతుం దేమోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయంగా అదనపు పత్తి... అంతర్జాతీయంగా పత్తి అధికంగా ఉత్పత్తి అవుతోంది. చైనా, అమెరికా దేశాల్లో ఉత్పత్తి అధికంగా ఉంది. మన దేశం నుంచి చైనా గతంలో పత్తి దిగుమతి చేసుకునేది కానీ క్రమంగా నిలిపివేసింది. అమెరికాలో ఎక్కువగా నాన్ కాటన్ బట్టలవైపే మొగ్గుచూపుతుండడతో అక్కడా ఇతర దేశాలకే ఎగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు దేశంలో పత్తిసాగు రైతులకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అప్రమత్తమైన రాష్ట్రం పత్తి సాగు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈసారి అధికంగా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు ఇటీవల కేంద్రానికి విన్నవించారు. పత్తి సాగు విస్తీర్ణం పెరగడం వల్ల ఈసారి ధరలు తగ్గే ప్రమాదముందని రైతు సంఘం జాతీయ నేత సారంపల్లి మల్లారెడ్డి, జాతీయ వ్యవసాయరంగ నిపుణుడు నర్సింహారెడ్డి అభిప్రాయపడుతున్నారు. పడిపోతున్న పప్పుధాన్యాల సాగు... రైతులు పెద్ద ఎత్తున పత్తి వైపే మరలిపోతుండటంతో పప్పు ధాన్యాల సాగు గణనీయంగా పడిపోతోంది. ఖరీఫ్‌లో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, గతేడాది ఇదే సమయానికి 7.62 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. కానీ ఈసారి కేవలం 4.82 లక్షల ఎకరాలకే వాటి సాగు పరిమితమైంది.