ఈసారి పత్తి సాగును ప్రోత్సహించాలనుకున్న ప్రభుత్వం
కానీ సాధారణ విస్తీర్ణం కన్నా తక్కువగా సాగు
గత ఏడాదిని మించి పోయిన వరినాట్లు
ఏకంగా 65.49 లక్షల ఎకరాల్లో పంట
అక్టోబర్ 1 నుంచి యాసంగి పంటల సీజన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి సాగు పడిపోయింది. సాధారణ విస్తీర్ణంతో పోల్చితే గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం ఈసారి పత్తి విస్తీర్ణాన్ని సాధారణ సాగు లక్ష్యం కంటే పెంచాలని పిలుపు ఇచ్చినా రైతులు పట్టించుకోలేదు. వరివైపే మొగ్గుచూపారు. ఈ నెలాఖరుతో వానాకాలం సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ బుధవారం ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్లో ఏకంగా 60 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పేర్కొంది.
సాధారణ సాగు విస్తీర్ణం ప్రకారం చూసినా కనీసం 50.48 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావాలి. కానీ సర్కారు ప్రత్యేకంగా నిర్దేశించిన లక్ష్యాన్ని పక్కనపెడితే, సాధారణ విస్తీర్ణంతో పోల్చినా 86.67 శాతానికే పత్తి సాగు పరిమితమైంది. ఈ సీజన్‌లో కేవలం 43.76 లక్షల ఎకరాల్లోనే ఈ పంట సాగయ్యింది. సర్కారు లక్ష్యంతో పోల్చుకుంటే.. ఏకంగా 16.24 లక్షల ఎకరాలు తగ్గగా, సాధారణ విస్తీర్ణంతో పోల్చుకుంటే 6.72 లక్షల ఎకరాలు తగ్గడం గమనార్హం.
వరి వైపు రైతుల మొగ్గు
రాష్ట్రంలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు నూటికి నూరు శాతం సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 57.18 లక్షల ఎకరాలు కాగా గతేడాది 64.61 లక్ష ల ఎకరాల్లో సాగైంది.
తాజా సీజన్‌లో దాన్ని అధిగమించి 65.49 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 114.53 శాతం పెరిగింది. ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రైతు లు వరి వైపు మొగ్గు చూపారని అంటున్నారు.
తగ్గిన పప్పు ధాన్యాల సాగు
పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం మాత్రం గణనీయంగా తగ్గడం గమనార్హం. అన్ని రకాల పప్పుధాన్యాల సాధారణ సాగు విసీర్ణం 8.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5.90 లక్షల (69.30 శాతం) ఎకరాల్లోనే సాగైంది. కీలకమైన కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.11 లక్షల ఎకరాలు కాగా, కేవలం 4.99 లక్షల ఎకరాల్లోనే సాగైంది.
అలాగే పెసర సాధారణ సాగు విస్తీర్ణం 1.01 లక్షల ఎకరాలు అయితే, కేవలం 68,556 (67.38 శాతం) ఎకరాల్లోనే సాగైంది. మొక్కజొన్న 6.09 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 5.46 లక్షల (89.73 శాతం) ఎకరాల్లో, సోయాబీన్ 4.29 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 4.01 లక్షల (93.47 శాతం) ఎకరాల్లో, జొన్న 70,068 ఎకరాలకు గాను 41,782 ఎకరాల్లో సాగైంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి యాసంగి పంటల సీజన్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment