ముద్ద అన్నం.. తింటే కడుపు నొస్తోంది | The boys school had meals with poor quality rice | Sakshi
Sakshi News home page

ముద్ద అన్నం.. తింటే కడుపు నొస్తోంది

Published Wed, Nov 13 2024 3:48 AM | Last Updated on Wed, Nov 13 2024 3:48 AM

The boys school had meals with poor quality rice

తిమ్మాపూర్‌ ‘గురుకులం’లో ఆకలికేకలు

తిమ్మాపూర్‌: ‘వారం రోజులుగా హాస్టళ్లలో అన్నం నాసిరకంగా ఉంటోంది. ముద్దలు ముద్దలుగా ఉండటంతో పాటు వాసన వస్తోంది. తినలేకపోతున్నాం. ఆకలవుతోందని తింటే కడుపునొస్తోంది. దీంతో చాలా మంది విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నారు. హాస్టల్‌ అధికారులు విషయాన్ని బయటకు తెలియనివ్వడం లేదు. మేము అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు.

వారంరోజులుగా కడుపునిండా తిండిలేక నీరసించిపోతున్నాం’అంటూ కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీ మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగారు.  

బియ్యంలో కల్తీ లేదు: ప్రిన్సిపాల్‌ 
రామకృష్ణ కాలనీలోని జ్యోతిబాపూలే బాలుర గురుకులంలో 450 మంది విద్యార్థులు ఉన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచే గురుకుల భోజనం చార్జీలను ప్రభుత్వం 40 శాతం పెంచింది. తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అయినా అధికారులు మెనూ మార్చకపోగా, నాసిరకంగా అన్నం పెట్టడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారానికి రెండుసార్లు మాంసాహారం పెట్టాల్సి ఉండగా సరిగ్గా పెట్టడం లేదని, కోడిగుడ్లు వారానికి రెండు మూడే ఇస్తున్నారని తెలిపారు. 

వారం రోజులుగా ఓపిక పట్టిన విద్యార్థులు మంగళవారం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ప్రిన్సిపాల్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ భోజనం ఎలా తినాలని నిలదీశారు. మీ పిల్లలకు ఇలాగే పెడుతున్నారా అని ప్రశ్నించారు. సివిల్‌ సప్లయ్‌ అధికారులు నాసిరకం బియ్యం పంపుతున్నారని, దాంతో మెత్తగా అవుతోందని, బియ్యంలో ఎలాంటి కల్తీ లేదని, కావాలనే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని ప్రిన్సిపాల్‌ వెంకటరమణ తెలిపారు. 

మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గురుకులంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. మిగతా వాటి పరిస్థితి ఏంటని విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement