సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్‌లో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా ప్రకటించింది. కనీసం 60 లక్షల నుంచి 65 లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చూడాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయంలోని వ్యవసాయశాఖ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన తొలి సమీక్షలో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులతో మాట్లాడారు.
రానున్న వానాకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని పేర్కొన్నారు. మరో 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేసేలా చూడాలన్నారు. అందుకనుగుణంగా వ్యవసాయశాఖ సమాయత్తం కావాలని ఆదేశించారు. పత్తితోపాటు కంది సాగును మరింత ప్రోత్సహించాలని, ప్రస్తుతం వివిధ పంటల సాగుకు అవసరమయ్యే 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. సేంద్రీయ సాగు, భూసారాన్ని దృష్టిలో ఉంచుకుని పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలనీ దీనికి రూ.76.66 కోట్లు నిధుల విడుదల చేయాలని చెప్పారు.
ఆయిల్‌పామ్ సాగులో అంతర పంటల సాగుకై డీసీసీబీల ద్వారా ఎకరానికి రూ.40 వేలు వరకు పంటరుణాలు అందించాలని సూచించారు. ప్రతీ ఏడాది మార్చి చివరి వరకు యాసంగి కోతలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటే వడగళ్ల వానల నుంచి నష్టాన్ని నివారించవచ్చని నిరంజన్‌రెడ్డి సూచించారు. వానాకాలం సాగు సమయంలోనే యాసంగి వరి సాగు నారుమళ్లకు అవసరమయ్యే భూమిని వదులుకోవాలని చెప్పారు. బాన్సువాడ, బోధన్, హుజూర్‌నగర్, మిర్యాలగూడల మాదిరిగా వరి సాగు సీజన్ ముందుకు జరపాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment