పత్తి.. తెల్లబంగారమాయింది. రైతులకు సిరులు కురిపిస్తోంది. మెట్ట ప్రాంతాలకే పరిమితమైన పత్తి మాగాణుల్లో సాగు చేస్తున్నా రు. గడిచిన మూడేళ్లుగా విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో వరి సాగు జరగడంతో ఊహించని దిగుబడులు పెరిగాయి. మార్కెట్ డిమాండ్ తక్కువగా ఉండడంతో రైతులు ప్రత్యామ్నాయంగా పత్తి పంట సాగుపై దృష్టి సారించారు. దిగుబడులు, ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు.
ఆత్మకూరు: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పత్తి సాగు ఏటేటికి పెరుగుతోంది. గతంలో నకిలీ పత్తి విత్తనాల కారణంగా చివరికి దిగుబడులు రాక, పెట్టి పెట్టుబడులు నష్టపోయిన రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా విత్తన నాణ్యతపై దృష్టి సారించారు. ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నారు.
నకిలీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. పత్తికి మద్దతు ప్రకటించడంతో రైతుల పాలిట వరంగా మారింది. జిల్లాలో తొలి కారుగా వరి సాగు చేస్తే.. రెండో కారుగా పత్తి సాగు చేయడంపై రైతులు దృష్టి సారించారు. జిల్లాలో పత్తి సాగు ఈ ఏడాది గతంలో పోలిస్తే గణనీయంగా పెరిగింది. గతంలో 3,500 హెక్టార్ల నుంచి 4 వేల హెక్టార్ల వరకు సాగు చేస్తుంటే.. ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 6 వేల హెక్టార్లలో సాగవుతోంది. కొన్ని చోట్ల ఫిబ్రవరిలోనే (రబీ సీజన్) రైతులు వరికి ప్రత్యామ్నాయంగా దాదాపు 1,500 హెక్టార్లలో పత్తి సాగు చేశారు.
సాగు వ్యయం అధికమైనా..
పత్తి పంట సాగుకు సాధారణంగా పెట్టుబడి ఎక్కువ అవుతుంది. గతంలో ఎకరాకు రూ.5 వేల నుంచి రూ. 6 వేలు అయ్యే వ్యయం ప్రస్తుతం రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు అవుతోందని రైతులు చెబుతున్నారు. గతంలో మాగాణి భూముల్లో రెండు కార్లు వరి సాగు చేసే వారు. అయితే పంట మార్పిడితో భూసారం పెరుగుతుందనే వ్యవసాయ నిపుణులు, భూమి శాస్త్రవేత్తలు చెబుతుండడంతో వరి సాగు అనంతరం రెండో కారుగా పత్తి సాగు చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా సాగు ఖర్చు పెరిగినా దానికి రెట్టింపుగా పత్తి కొనుగోళ్లు పెరగడం, «కొనుగోలు ధర సైతం ఆశాజనకంగా ఉండడంతో అధిక శాతం రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపారు.
బీటీ పత్తి సాగు అధికం
జిల్లాలో (కందుకూరు డివిజన్‌తో కలుపుకొని) 38 మండలాల్లోని 22 మండలాల్లో పత్తి సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. మిగిలిన మండలాల్లో అరకొరగా సాగు చేస్తున్నారు. గతంలో నాటు గింజలు పత్తి సాగుకు ఉపయోగించే వారు. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన బీటీ పత్తి మంచి దిగుబడులు ఇస్తుండడంతో అధిక శాతం రైతులు బీటీ పత్తి సాగు చేస్తున్నారు. పలు మండలాల్లోని గ్రామాల్లో ఆర్‌బీకేల ద్వారా పత్తి విత్తనాలు వ్యవసాయ అధికారులు రైతులకు అందజేశారు. దీనికి తోడు రైతులకు సాగులో మెళకువులు, చీడపీడల నివారణ చర్యలు సూచిస్తుండడతో నష్ట నివారణ చర్యలతో పత్తి దిగుబడులు పెరిగాయి.
రైతులకు అందుబాటులో సిబ్బంది
రైతులు తొలికారు వరి సాగు చేసే అధిక వర్షాలకు నష్టపోయారు. ప్రభుత్వం ద్వారా ఉచితంగా విత్తనాలు రెండో మారు ఇచ్చాం. అయితే రెండో కారుగా పత్తి సాగు చేయడంతో తొలి కారు నష్టాలను కొంత మేర రైతులు పూడ్చుకోగలుగుతున్నారు. పత్తి సాగు చేస్తున్న రైతులకు అందుబాటులో ఉండేలా వ్యవసాయ సిబ్బందికి సూచనలు ఇచ్చాం. నేను స్వయంగా వ్యవసాయ శాస్త్రవేత్తలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి పరిశీలించి సూచనలు ఇస్తున్నాం.
– దేవసేన, ఏడీఏ, ఆత్మకూరు
లాభాలు బాగున్నాయి
ఈ ఏడాది పత్తి పైరు సాగుతో లాభాలు వస్తున్నాయి. కొంత వరి పైరులో నష్టపోయినా పత్తి ధర అధికంగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతున్నాయి. ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశా. దిగుబడి బాగుంది. వర్షాలు లేకుంటే మరో రెండు నెలల పాటు పత్తి దిగుబడి వస్తుంది. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి సలహాలు చెబుతున్నారు.
– ఓబుల్ రెడ్డి, రైతు, రామస్వామిపల్లి
కేజీ రూ.70 నుంచి రూ.120
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పత్తి కొనుగోలు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గతంలో రూ.50 లేదా రూ.60లకే కిలో పత్తి కొనుగోలు ఉంటే.. ఈ ఏడాది అధిక గిట్టుబాటు ధర లభిస్తోంది. తొలి దశలో మే నెలలో కిలో పత్తి రూ.118, రూ.120 చొప్పున రైతుల వద్ద కొనుగోలు చేశారు. జూన్ 20వ తేదీ వరకు ఇదే ధరతో పలు మండలాల్లో కొనుగోలు చేస్తుండగా అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలు వల్ల కొనుగోలు ధర తగ్గింది. పత్తి నాణ్యత తగ్గడంతో రూ.70 నుంచి వంద రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. అయినా మంచి ధరే తమకు దక్కుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment