bt cotton
-
దేశంలోనే మేటి.. కర్నూలు సీడ్
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు.. విత్తనాల సీజన్లో దేశంలోని రైతులకు.. ముఖ్యంగా ఉత్తరాది రైతులకు గుర్తుకు వచ్చే పేరిది. దేశంలోనే పెద్ద విత్తన కేంద్రంగా ఉమ్మడి కర్నూలు జిల్లా విరాజిల్లుతోంది. ఏటా రూ.500 కోట్ల విలువ చేసే విత్తనాలు ఇక్కడి నుంచి పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం విత్తన ప్రాసెసింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యే విత్తనాల్లో 50 శాతం కర్నూలు జిల్లా నుంచే ఉండటం విశేషం. రాష్ట్రం నుంచి ఏటా ఇతర రాష్ట్రాలకు రూ.1000 కోట్ల విలువైన విత్తనాలు వెళ్తుండగా.. ఇందులో సగం జిల్లా నుంచే ఎగుమతి అవుతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక, హరియాణా, ఒడిశా, గుజరాత్ తదితర రాష్ట్రాలకు బీటీ పత్తి విత్తనాలతో పాటు మొక్కజొన్న, జొన్న, సజ్జల్లో హైబ్రిడ్ విత్తనాలు, వేరుశనగ, మినుము, పెసర, జనపనార, వరి తదితర విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. వ్యవసాయ సీజన్ మొదలవుతుందంటే సగానికిపైగా రాష్ట్రాల అధికారులు విత్తనాల కోసం కర్నూలుకు క్యూ కడతారు. ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ తదితరులు ఇక్కడికి వచ్చి మొక్కజొన్న, సజ్జ, జొన్న విత్తనాల నాణ్యత, ప్రాసెసింగ్‌ను రెండు రోజుల పాటు పరిశీలించారు. ఒక్క రాజస్థాన్‌కే దాదాపు రూ.50 కోట్ల విలువ చేసే విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. మహారాష్ట్ర విత్తన అవసరాలన్నీ కర్నూలు జిల్లా ద్వారానే తీరుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం విత్తనాభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా కర్నూలులోనే ఏర్పాటు చేసింది. వివిధ విత్తన కంపెనీలతో విత్తనోత్పత్తి చేయిస్తూ నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షిస్తోంది. కర్నూలు నుంచి అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు జనపనార విత్తనాలు, అసోం, బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలకు హైబ్రిడ్ మొక్కజొన్న, సజ్జ విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. గుజరాత్, హరియాణాకు పత్తి, మొక్కజొన్న, వరి విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. విత్తనోత్పత్తిలో బహుళజాతి కంపెనీలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేశీయ కంపెనీలతో పాటు బహుళ జాతి సంస్థలు కూడా విత్తనోత్పత్తి చేస్తున్నాయి. నూజివీడు, గంగా–కావేరి, సింజెంటా, కావేరి, బేయర్, పయనీర్, మహికో, అంకూర్, తులసీ సీడ్ కంపెనీలు జిల్లాలో బీటీ పత్తితో సహా వివిధ విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. జాతీయస్థాయి విత్తన సంస్థలు కూడా ఇక్కడ ప్రధానా కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం విశేషం. బహుళజాతి కంపెనీలు కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు కేంద్రాలుగా ఉన్న విత్తన కంపెనీల భాగస్వామ్యంతో విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాలు వరి, మొక్కజొన్న విత్తనోత్పత్తికి పెట్టింది పేరు. రైతులకు లాభసాటి విత్తనోత్పత్తి ద్వారా రైతులకు రెట్టింపు లాభాలు వస్తాయి. జిల్లాలో దాదాపు 10 వేల మంది రైతులు 25 వేల నుంచి 30 వేల ఎకరాల్లో విత్తనోత్పత్తి చేస్తున్నారు. ఒక్కో రైతు 2 – 4 ఎకరాల వరకు విత్తనం సాగు చేస్తున్నారు. ఉదాహరణకు మొక్కజొన్నకు మార్కెట్లో క్వింటాకు నాణ్యతను బట్టి రూ.1,600 నుంచి రూ.2,000 వరకు ధర లభిస్తోంది. అదే విత్తనమైతే క్వింటాకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ధర లభిస్తుంది. ఉత్పాదకతను బట్టి విత్తన కంపెనీలు ధరను ఇస్తాయి. దిగుబడి ఎక్కువగా ఉంటే ధర కొంచెం తక్కువగా, తక్కువగా ఉంటే ఎక్కువ ధర లభిస్తుంది. విత్తన కంపెనీలు యూనివర్సిటీలతో ఎంవోయూ చేసుకొని బ్రీడర్ సీడ్ తెప్పిస్తారు. ఆ సీడ్‌ను ఎంపిక చేసుకున్న కొంత మంది రైతులకు ఇచ్చి, దాని ద్వారా ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి చేయిస్తారు. తద్వారా సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి అవుతుంది.. విత్తనోత్పత్తి ద్వారా రైతులు పండించిన పంటలకు 50 శాతం అధిక ధర లభిస్తోంది. ఏ కంపెనీ విత్తనోత్పత్తి చేయిస్తుందో.. అదే కంపెనీ రైతుల నుంచి సీడ్‌ను కొంటుంది. ప్రభుత్వ ప్రోత్సాహం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక విత్తనోత్పత్తిని ప్రోత్సహిస్తోంది. కర్నూలు నగరానికి సమీపంలోని ఓర్వకల్లు ఇండ్రస్టియల్ హబ్‌లో విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు, విత్తన పరిశ్రమలకు ప్రత్యేకంగా భూములు కేటాయిస్తోంది. ఇండ్రస్టియల్ హబ్‌లో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే 80 కంపెనీలు ముందుకు రావడం విశేషం. ఈ కంపెనీలకు ప్రభుత్వం పలు రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. విత్తనోత్పత్తి మరింత వృద్ధి చెందాలంటే.. విత్తనోత్పత్తికి జిల్లా భూములు, వాతావరణం అనుకూలం. ఇక్కడ విత్తన ధ్రువీకరణ సంస్థ కూడా ఉంది. విత్తనోత్పత్తికి ముందుకు వచ్చే రైతులకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. విత్తన సంస్థలు, ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా పెట్టుబడి రాయితీ, సబ్సిడీ, విద్యుత్ రాయితీలు వంటివి ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. కర్నూలును పత్తి విత్తన కేంద్రంగా, నంద్యాల వరి విత్తన కేంద్రంగా, తంగెడంచ ఫారాన్ని కూరగాయల విత్తనాలు, ఇతర విత్తనాల ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ది చేయవచ్చని, దేశవాళీ విత్తనాలను మరింతగా ప్రోత్సహించాలని తెలిపారు. దేశంలోనే సీడ్ హబ్‌గా కర్నూలు విత్తనోత్పత్తి, విత్తన పరిశ్రమకు కర్నూలు జిల్లా దేశంలో పెట్టింది పేరు. 2000 సంవత్సరానికి ముందు దేశం మొత్తానికి అవసరమైన విత్తనాల్లో 75 శాతం ఇక్కడే ఉత్పత్తి అయ్యేవి. నాటితో పోలిస్తే నేడు విత్తనోత్పత్తి తగ్గింది. అయినప్పటికీ వివిధ రాష్ట్రాలు విత్తనాల కోసం కర్నూలు వైపు చూస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓర్వకల్లు ఇండ్రస్టియల్ హబ్‌లో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు భూములు కేటాయించడంతో పాటు రాయితీలు ఇస్తోంది. మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. – ఎంవీ రెడ్డి, చైర్మన్, సీడ్ మెన్ అసోసియేషన్, కర్నూలు జిల్లా దేశంలోని సగం రాష్ట్రాలకు కర్నూలు విత్తనం ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుండటంతో వివిధ రాష్ట్రాలకు విత్తనాలు ఎగుమతి చేసేందుకు ముమ్మరంగా ప్రాసెసింగ్ జరుగుతోంది. విత్తనోత్పత్తికి జిల్లాలోని భూములు చాల అనుకూలమైనవి. బహుళజాతి కంపెనీలు కూడ ఇక్కడ విత్తనోత్పత్తి చేస్తున్నాయి. విత్తనోత్పత్తి రైతులకు లాభసాటిగా ఉంటోంది. – మురళీధర్‌రెడ్డి, చైర్మన్, తెలుగు రాష్ట్రాల సీడ్ మెన్ అసోషియేషన్ -
GM Mustard: ఆధారాలు లేకుండానే అనుమతులా?
ప్రశ్నలు వేయడం, వాటికి సమాధానాలు కనుక్కోవడంతోనే సైన్స్ ప్రస్థానం మొదలవు తుందని మా సైన్స్ టీచర్ చెబుతూండేది. ఇంకోలా చెప్పాలంటే... సైన్స్ ఎల్లప్పుడూ ప్రశ్నలకు సిద్ధంగా ఉంటుందీ అనాలి! దీనివల్ల సాంఘిక, ఆర్థిక ఆందోళనలకు తావిచ్చే, పర్యావరణ విధ్వంసానికి దారితీసే అపోహలను తొలగించుకోవచ్చు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలపై వ్యాఖ్యానం చేయవచ్చు. అయితే ఆర్థిక ప్రయోజనాల కారణంగా సత్యాన్వేషణ తాలూకూ గొంతుకలను నొక్కివేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రదర్శించే సాక్ష్యాలు కూడా నమ్మదగ్గవిగా ఉండవు. విషయం ఏమిటంటే... జన్యుమార్పిడి పంటలపై ఎప్పుడు చర్చ మొదలైనా, సాక్ష్యాల ఆధారంగా ముందుకెళ్లాలని కొందరు శాస్త్రవేత్తలు చెబుతూంటారు. తద్వారా శాస్త్రీయ సమాచారం, వాదం, ప్రజా విచారణలన్నీ పక్కకు తొలగిపోయేలా చేస్తూంటారు. దేశంలోకి మొట్టమొదటి జన్యుమార్పిడి పంట బీటీ కాటన్‌ను 2001లో వాణిజ్యస్థాయిలో విడుదల చేశారు. అప్పట్లో జరిగిన జెనెటిక్ ఇంజినీరింగ్ అప్రైజల్ కమిటీ (జీఈఏసీ) సమావేశాల్లో పాల్గొన్న వారిలో నేనూ ఉన్నాను. జన్యుమార్పిడి పంటల ప్రవేశంపై తుది నిర్ణయం తీసుకునే ఈ జీఈఏసీ సభ్యులతోపాటు, ‘జెనిటిక్ మ్యానిపులేషన్ అండ్ ద మానిటరింగ్ కమిటీ’కి సంబంధించిన పర్యవేక్షణ బృందం కూడా ఈ సమావేశంలో పాల్గొంది. బీటీ పత్తి విత్తనాన్ని అభివృద్ధి చేసిన మహికో – మోన్శాంటో సభ్యులు, కొంతమంది పౌర సమాజపు ప్రతినిధులు కూడా అందులో ఉన్నారు. రెండు నెలలు ఆలస్యంగా నాటినా ఆ ఏడాది పత్తి పంట దిగుబడి యాభై శాతం ఎక్కువైనట్లు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం చెబుతోందని సమావేశంలో ప్రస్తావించారు. బీటీ కాటన్ కారణంగానే ఇలా జరిగిందనడంతో ఆశ్చర్యం వేసింది నాకు. ఆ సమాచారం తప్పనీ, అశాస్త్రీయమైందనీ, దాన్ని ఏదైనా పరిశోధన సంస్థతో నిర్ధారించాలనీ నేను పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్, అప్పటి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్‌ను కోరాను. సాధారణ పరిస్థితుల్లో ఎదిగేందుకు ఐదు నెలల సమయం తీసుకునే పంటలో రెండు నెలలు ఆలస్యంగా విత్తినా అధిక దిగుబడి సాధించడం దాదాపు అసాధ్యం. వ్యవసాయ పరి శోధనల్లో విత్తనాలు వేసే సమయం చాలా ముఖ్యమైన అంశమన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అంశంలో ఒక ప్రైవేట్ కంపెనీకి మినహాయింపు ఇస్తే, భవిష్యత్తులో యూనివర్సిటీ శాస్త్రవేత్తలను కూడా విత్తిన సమయం గురించి పట్టించుకోవద్దని చెప్పే అవకాశం ఏర్పడుతుంది. జీఈఏసీ ఛైర్మన్‌కు నేను వేసిన ప్రశ్న ఏమిటంటే– రెండు నెలలు ఆలస్యంగా విత్తినా దిగుబడి పెరగడ మంటే... అది రైతులకు చాలా ప్రయోజనకరమైంది కాబట్టి, రైతులందరూ రెండు నెలలు ఆలస్యంగా విత్తుకోవాలని ఎందుకు సలహా ఇవ్వకూడదూ? అని! ఈ సమావేశం పూర్తయిన తరువాత సాయంకాలం ఐసీఏఆర్ ఉన్నతాధికారి ఒకరు నాతో మాట్లాడుతూ, బీటీ విత్తనాల ట్రయల్స్ ఇంకో ఏడాది చేయాల్సిందిగా మహికో–మోన్శాంటో కంపెనీని కోరినట్లు తెలిపారు. అవసరమైనంత మేర అన్ని పరీక్షలు పూర్తి చేసినట్లు మోన్శాంటో చెప్పినా జన్యుమార్పిడి పంటల అనుమతిని ఒక ఏడాది ఆలస్యం చేయగలిగామన్నమాట. ఆ సమావేశంలో ప్రశ్నలేవీ వేయకుండా ‘సాక్ష్యాల’ ఆధారంగా అనుమతులిచ్చి ఉంటే ఏడాది ముందుగానే జన్యుమార్పిడి పంటలు దేశంలోకి వచ్చేసి ఉండేవి. బీటీ వంకాయపై నిషేధం దేశంలోకి బీటీ వంకాయ అనుమతిని నిరాకరిస్తూ 2010లో అప్పటి పర్యావరణ శాఖ మంత్రి జైరామ్ రమేశ్ ఒక ప్రకటన చేశారు. ‘డెసిషన్ ఆన్ కమర్షియలైజేషన్ ఆఫ్ బీటీ బ్రింజాల్(బీటీ వంకాయ వాణిజ్యీకరణ మీద నిర్ణయం)’ పేరుతో అప్పట్లో 19 పేజీల డాక్యుమెంట్ ఒకటి విడుదలైంది. దీనిపై శాస్త్రవేత్తలు ఎన్ని మాటలు చెప్పినా నా అంచనా ప్రకారం ప్రతి వృక్ష శాస్త్రవేత్తా కచ్చితంగా చదవాల్సిన డాక్యుమెంట్ అది. దేశ విదేశాల్లోని శాస్త్రవేత్తలతో, ఏడు దఫాలుగా ప్రజలతో సంప్రదింపుల తరువాత జైరామ్ రమేశ్ ఆ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. జన్యుమార్పిడీ టెక్నాలజీపై రైతులు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు దేశం మొత్తమ్మీద వంకాయ పండించే ప్రాంతాల్లో సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి. జాగరూకత, ముందస్తు జాగ్రత్త, సిద్ధాంతాల ఆధారంగా జైరామ్ రమేశ్ ఒక నిర్ణయం తీసుకుంటూ... ఏ కొత్త టెక్నాలజీ అయినా ఆయా సముదాయాల సామాజిక, సాంస్కృతిక విలువలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. మీడియాలో ఒక వర్గం జన్యుమార్పిడి పంటలపై బహిరంగ విచారణను తోసిపుచ్చింది. అంతా బూటకం అని కొట్టి పారేసింది కూడా. అయితే ప్రజలు లేవనెత్తిన కీలకమైన అభ్యంతరాలను మంత్రి గుర్తించి తగు నిర్ణయం తీసుకోవడం మాత్రం నాకు ఆనందం కలిగించింది. అంతేకాదు... జన్యుమార్పిడి విత్తన సంస్థల అధ్యయనాల నియమాలు, సమాచారాన్ని విశ్లేషించిన తీరు, ఫలితాలన్నింటినీ ప్రస్తావిస్తూ డాక్యుమెంట్‌ను రూపొందించడమూ ప్రశంసనీయమైన అంశం. జాగరూకతతోనే ముందుకు వాస్తవ పరిస్థితులకూ, కొందరు సేకరించే సాక్ష్యాలకూ మధ్య ఉన్న అంతరం సైన్స్ ఆధారిత పద్ధతుల అవసరాన్ని మరోసారి నొక్కి చెబుతోంది. శాస్త్రపరమైన విచారణను పరిమితం చేయడం మార్కెట్ పోకడల్లో ఒకటి. వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు మార్కెట్లు సైన్స్‌ను తొక్కేసేందుకూ ప్రయత్నిస్తూంటాయి. జీఎం ఆవాల విషయంలో జరుగుతున్నదీ అదే. జీఈఏసీ ఇటీవలే దీనికి పర్యావరణ అనుమతులు ఇచ్చేసింది. ఈ డీఎంహెచ్–11 జన్యుమార్పిడి ఆవాల పంట దిగుబడి సామర్థ్యం ఎంతన్నది ఐసీఏఆర్‌కూ తెలియక ముందే పర్యావరణ అనుమతులు రావడం గమనార్హం. దేశ వంటనూనె దిగుమతులను ఈ సరికొత్త ఆవాల ద్వారా తగ్గించుకోవచ్చు అన్న భావనను కలిగిస్తున్నారు. అయితే దీని దిగుబడి చాలా తక్కువ అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే అదెంత తప్పుడు భావనో అర్థమైపోతుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం... జీఎం ఆవాల పరీక్షలకు అన్ని ప్రోటోకాల్స్‌ను ఢిల్లీ యూనివర్సిటీ స్వయంగా సిద్ధం చేసింది. విద్యార్థినే ప్రశ్నాపత్రం తయారు చేయమని అడగటం లాంటిది ఇది. అంతేకాదు... హెర్బిసైడ్ల(గడ్డిమందుల)ను తట్టుకునే ఆవాల వెరైటీ బీటీ వంకాయ మాదిరిగా కనీస పరీక్షలను కూడా ఎదుర్కోలేదు. జీఎం ఆవాల పరీక్షల్లో ఆరోగ్య నిపుణులు ఎవరూ లేకపోవడం, తేనెటీగలపై జీఎం ఆవాల ప్రభావం ఏమిటన్నది పరిశీలించకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న లోపాలు. ఇన్ని లోపాల మధ్య జీఈఏసీ విత్తనాల వృద్ధికి ఎలా అనుమతిచ్చిందో అర్థం కావడం లేదు. సైన్స్ అంటే సత్యాన్ని వెతకడం. ఇటాలియన్–బ్రిటిష్ ప్రొఫెసర్ మైకెలా మాసిమీ 2017లో లండన్ రాయల్ సొసైటీ అవార్డు అందుకుంటున్న సందర్భంగా చేసిన ప్రసంగంలో అచ్చంగా ఈ వ్యాఖ్యే చేశారు. ‘‘ప్రజలకు సైన్స్ విలువను అర్థమయ్యేలా చేయడం మన బాధ్యత అని నేను నమ్ముతున్నాను. కచ్చితత్వం, సాక్ష్యాలు, సిద్ధాంతాలపై విశ్వాసం, కచ్చితమైన పద్ధతులను అవలంబించడం వంటి వాటిని కూడా నిశితంగా పరిశీలించాలి’’! (క్లిక్ చేయండి: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!) - దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
రైతులకు సిరులు కురిపిస్తోన్న పత్తి..
పత్తి.. తెల్లబంగారమాయింది. రైతులకు సిరులు కురిపిస్తోంది. మెట్ట ప్రాంతాలకే పరిమితమైన పత్తి మాగాణుల్లో సాగు చేస్తున్నా రు. గడిచిన మూడేళ్లుగా విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో వరి సాగు జరగడంతో ఊహించని దిగుబడులు పెరిగాయి. మార్కెట్ డిమాండ్ తక్కువగా ఉండడంతో రైతులు ప్రత్యామ్నాయంగా పత్తి పంట సాగుపై దృష్టి సారించారు. దిగుబడులు, ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఆత్మకూరు: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పత్తి సాగు ఏటేటికి పెరుగుతోంది. గతంలో నకిలీ పత్తి విత్తనాల కారణంగా చివరికి దిగుబడులు రాక, పెట్టి పెట్టుబడులు నష్టపోయిన రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా విత్తన నాణ్యతపై దృష్టి సారించారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. నకిలీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. పత్తికి మద్దతు ప్రకటించడంతో రైతుల పాలిట వరంగా మారింది. జిల్లాలో తొలి కారుగా వరి సాగు చేస్తే.. రెండో కారుగా పత్తి సాగు చేయడంపై రైతులు దృష్టి సారించారు. జిల్లాలో పత్తి సాగు ఈ ఏడాది గతంలో పోలిస్తే గణనీయంగా పెరిగింది. గతంలో 3,500 హెక్టార్ల నుంచి 4 వేల హెక్టార్ల వరకు సాగు చేస్తుంటే.. ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 6 వేల హెక్టార్లలో సాగవుతోంది. కొన్ని చోట్ల ఫిబ్రవరిలోనే (రబీ సీజన్) రైతులు వరికి ప్రత్యామ్నాయంగా దాదాపు 1,500 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. సాగు వ్యయం అధికమైనా.. పత్తి పంట సాగుకు సాధారణంగా పెట్టుబడి ఎక్కువ అవుతుంది. గతంలో ఎకరాకు రూ.5 వేల నుంచి రూ. 6 వేలు అయ్యే వ్యయం ప్రస్తుతం రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు అవుతోందని రైతులు చెబుతున్నారు. గతంలో మాగాణి భూముల్లో రెండు కార్లు వరి సాగు చేసే వారు. అయితే పంట మార్పిడితో భూసారం పెరుగుతుందనే వ్యవసాయ నిపుణులు, భూమి శాస్త్రవేత్తలు చెబుతుండడంతో వరి సాగు అనంతరం రెండో కారుగా పత్తి సాగు చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా సాగు ఖర్చు పెరిగినా దానికి రెట్టింపుగా పత్తి కొనుగోళ్లు పెరగడం, «కొనుగోలు ధర సైతం ఆశాజనకంగా ఉండడంతో అధిక శాతం రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపారు. బీటీ పత్తి సాగు అధికం జిల్లాలో (కందుకూరు డివిజన్‌తో కలుపుకొని) 38 మండలాల్లోని 22 మండలాల్లో పత్తి సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. మిగిలిన మండలాల్లో అరకొరగా సాగు చేస్తున్నారు. గతంలో నాటు గింజలు పత్తి సాగుకు ఉపయోగించే వారు. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన బీటీ పత్తి మంచి దిగుబడులు ఇస్తుండడంతో అధిక శాతం రైతులు బీటీ పత్తి సాగు చేస్తున్నారు. పలు మండలాల్లోని గ్రామాల్లో ఆర్బీకేల ద్వారా పత్తి విత్తనాలు వ్యవసాయ అధికారులు రైతులకు అందజేశారు. దీనికి తోడు రైతులకు సాగులో మెళకువులు, చీడపీడల నివారణ చర్యలు సూచిస్తుండడతో నష్ట నివారణ చర్యలతో పత్తి దిగుబడులు పెరిగాయి. రైతులకు అందుబాటులో సిబ్బంది రైతులు తొలికారు వరి సాగు చేసే అధిక వర్షాలకు నష్టపోయారు. ప్రభుత్వం ద్వారా ఉచితంగా విత్తనాలు రెండో మారు ఇచ్చాం. అయితే రెండో కారుగా పత్తి సాగు చేయడంతో తొలి కారు నష్టాలను కొంత మేర రైతులు పూడ్చుకోగలుగుతున్నారు. పత్తి సాగు చేస్తున్న రైతులకు అందుబాటులో ఉండేలా వ్యవసాయ సిబ్బందికి సూచనలు ఇచ్చాం. నేను స్వయంగా వ్యవసాయ శాస్త్రవేత్తలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి పరిశీలించి సూచనలు ఇస్తున్నాం. – దేవసేన, ఏడీఏ, ఆత్మకూరు లాభాలు బాగున్నాయి ఈ ఏడాది పత్తి పైరు సాగుతో లాభాలు వస్తున్నాయి. కొంత వరి పైరులో నష్టపోయినా పత్తి ధర అధికంగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతున్నాయి. ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశా. దిగుబడి బాగుంది. వర్షాలు లేకుంటే మరో రెండు నెలల పాటు పత్తి దిగుబడి వస్తుంది. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి సలహాలు చెబుతున్నారు. – ఓబుల్ రెడ్డి, రైతు, రామస్వామిపల్లి కేజీ రూ.70 నుంచి రూ.120 గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పత్తి కొనుగోలు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గతంలో రూ.50 లేదా రూ.60లకే కిలో పత్తి కొనుగోలు ఉంటే.. ఈ ఏడాది అధిక గిట్టుబాటు ధర లభిస్తోంది. తొలి దశలో మే నెలలో కిలో పత్తి రూ.118, రూ.120 చొప్పున రైతుల వద్ద కొనుగోలు చేశారు. జూన్ 20వ తేదీ వరకు ఇదే ధరతో పలు మండలాల్లో కొనుగోలు చేస్తుండగా అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలు వల్ల కొనుగోలు ధర తగ్గింది. పత్తి నాణ్యత తగ్గడంతో రూ.70 నుంచి వంద రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. అయినా మంచి ధరే తమకు దక్కుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
బీటీ పత్తి.. ఓ సాగు వైఫల్యం
సాక్షి, హైదరాబాద్: బీటీ పత్తి.. ఓ సాగు వైఫల్యమని ప్రపంచ స్థాయి వ్యవ సాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ తొలి జన్యు మార్పిడి బీటీ పత్తి పంట దేశ పరిస్థితులకు అనుగుణంగా లేదని వారు పేర్కొంటున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ), జతన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్‌లో దేశంలో 18 ఏళ్ల బీటీ పత్తి సాగుపై సాక్ష్యాలతో కూడిన సమీక్ష చేపట్టారు. ఈ వెబినార్‌లో అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఆండ్రూ పాల్ గుటిఎరేజ్, కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ మాజీ డైరెక్టర్ డాక్టర్ కేశవ్ క్రాంతి, ఎఫ్ఏవో మాజీ ప్రతినిధి డాక్టర్ పీటర్ కెన్మోర్లతో పాటు 500 మంది వరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1960, 70లలో కాలిఫోర్నియాలో పురుగు మందులను వాడటం వల్ల తెగుళ్లు ప్రబలాయని, దీని నుంచి భారతదేశం గుణపాఠం నేర్చుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానిం చారు. 2005లో 11.5 శాతం, 2006లో 37.8 శాతం, 2011లో దాదాపు అత్యధిక విస్తీర్ణానికి బీటీ పత్తి సాగు పెరిగినా పురుగు మందుల వాడకంలో నియంత్రణ రాలేదని, దిగుబడి పెంపులో కూడా ఎలాంటి మార్పు బీటీతో సాధ్యం కాలేదన్నారు. పురుగు మందుల వాడకం, తెగుళ్ల నియం త్రణలో భాగంగా పర్యావరణ సమ స్యలు తీవ్రంగా తలెత్తుతున్నాయని, దీని వల్ల రైతులు కూడా ఇతర విత్తనాల వైపు మళ్లుతున్నారని పేర్కొన్నారు. ఈ వెబినార్ నిర్వహణకు అలయన్స్ ఫర్ సస్టైనబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చ రల్ (ఆషా), ఇండియా ఫర్ సేఫ్ ఫుడ్ సంస్థలు సహకారం అందించాయి. -
జన్యుమార్పిడి వంగ అక్రమ సాగుతో కలకలం
నిషేధం ఉన్నప్పటికీ జన్యుమార్పిడి వంగ పంట హర్యానాలో సాగులో ఉన్న విషయం కలకలం రేపింది. అనుమతి లేని కలుపు మందును తట్టుకునే బీటీ పత్తి కొన్ని లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చినట్టుగానే నిషిద్ధ జన్యుమార్పిడి వంగ పంట కూడా పొలాల్లోకి వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్ల క్రితం బీటీ వంగ రకాన్ని ప్రైవేటు కంపెనీ తయారు చేసినప్పుడు దేశవ్యాప్తంగా అప్పటి పర్యావరణ మంత్రి జయరామ్ రమేశ్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే.. వ్యతిరేకత వెల్లువెత్తింది. అంతటితో బీటీ వంగపై కేంద్రం నిషేధం విధించింది. పదేళ్ల తర్వాత ఈ వంగడం రైతు పొలంలో కనిపించడం ఏమాత్రం సమర్థనీయంగా లేదు. కాయతొలిచే పురుగును తట్టుకుంటుందని చెబుతున్న బీటీ వంగను ఫతేబాద్‌లో ఒక రైతు సాగు చేస్తున్నట్టు వెల్లడైంది. బస్టాండ్ల దగ్గరల్లో విత్తనాల దుకాణాల్లో విత్తనం కొన్నట్లు ఆ రైతు చెబుతున్నారు. మన దేశంలో నిషేధించిన మూడేళ్ల తర్వాత 2013లో బంగ్లాదేశ్ ప్రభుత్వం బీటీ వంగ సాగును అనుమతించింది. మొదట్లో కొన్నాళ్లు కాయతొలిచే పురుగును తట్టుకున్న బీటీ వంగ, ఆ తర్వాత తట్టుకోలేకపోతున్నదని సమాచారం. అక్రమ పద్ధతుల్లో బీటీ వంగ వంగడాన్ని రైతులకు అందిస్తుండడంపై జన్యుమార్పిడి వ్యతిరేక వర్గాలు మండిపడుతున్నాయి. ‘మనకు 3,000కు పైగా వంగ రకాలు ఉన్నాయి. బీటీ వంగ పండించడం మొదలు పెడితే ఈ సంప్రదాయ వంగడాలన్నీ జన్యుకాలుష్యానికి గురవుతాయి. వంగ పంటలో జీవవైవిధ్యం అడుగంటిపోతుంది. పత్తిలో జరిగింది ఇదే..’ అని కోలిషన్ ఫర్ ఎ జీఎం ఫ్రీ సంస్థ ప్రతినిధి శ్రీధర్ రాధాకృష్ణన్ అన్నారు. అధికారులు బీటీ వంగ సాగవుతున్న పొలాల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలి. నిషిద్ధ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనిపెట్టాలి. జన్యుమార్పిడి బీటీ పత్తి మొక్కలను ధ్వంసం చెయ్యాలి. నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించడంతోపాటు నిషిద్ధ విత్తనాలు రైతులకు అంటగడుతున్న కంపెనీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ‘ఎందరు రైతులు సాగు చేస్తున్నారో..’ ఫతేబాద్‌లో రైతు సాగు చేస్తున్న వంగ తోట నుంచి నమూనాలను సేకరించి న్యూఢిల్లీలోని జాతీయ మొక్కల జన్యువనరుల బ్యూరో(ఎన్.బి.పి.జి.ఆర్.)కు పరీక్షల నిమిత్తం పంపామని, పది రోజుల్లో ఫలితం వెలువడుతుందని హర్యానా ఉద్యాన శాఖ డైరెక్టర్ జనరల్ అర్జున్ సింగ్ శైని తెలిపారు. ‘ఇది బీటీ వంగే అని తేలితే దాన్ని అరికట్టడానికి చాలా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ పొలంలో పంటను ధ్వంసం చేయాలి. ఆ విత్తనాలు రైతు చేతికి ఎవరెవరి చేతులు మారి వచ్చాయన్నది నిగ్గుతేల్చాల్సి ఉంటుంది. బీటీ వంగ అక్రమంగా సాగవుతుండడమే నిజమైతే దేశంలో ఇంకా ఎంత మంది రైతుల దగ్గరకు ఈ విత్తనాలు చేరాయో కనిపెట్టాల్సి ఉంటుంది’ అని శైని అన్నారు. బీటీ వంగ, నాన్ బీటీ వంగ -
బీటీ–3పై ఏం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: జీవ వైవిధ్యానికి ప్రమాద కరమైన బీటీ–3 పత్తి విత్తనాన్ని ఏం చేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై ఏర్పాటు చేసిన ‘క్షేత్రస్థాయి తనిఖీ, శాస్త్రీయ మూల్యాం కన కమిటీ (ఎఫ్‌ఐఎస్‌ఈసీ)’పరిశీలన ము మ్మరం చేసింది. పత్తి అధికంగా సాగుచేసే గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్ర దేశ్‌లలో.. అనుమతిలేని బీటీ–3 విత్తనం ఏమేరకు వ్యాప్తి చెందిందో అధ్యయనం చే స్తోంది. అందులో భాగంగా 12 మంది సభ్యుల బృందం గురు, శుక్రవారాల్లో తెలం గాణలోని గద్వాల, మంచిర్యాల, వికా రాబాద్ జిల్లాల్లో పర్యటించింది. రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కె.కేశవు లు నేతృత్వంలో రైతులను కలసి విచారించిం ది. ఆయా జిల్లాల్లో పత్తి పంటలను, జిన్నింగ్ మిల్లులను, విత్తన శుద్ధి ప్లాంట్లను పరిశీలిం చి, విత్తన నమూనాలను సేకరించింది. బీటీ–3కి అనుమతి లేకున్నా పలు చోట్ల ఆ విత్తనాన్ని వేశారని గుర్తించింది. అనంతరం హైదరాబాద్‌లో విత్తన కంపెనీలు, డీలర్లు, విత్తనోత్పత్తిదారులతో సమావేశమైంది. దిశా నిర్దేశం చేయండి అనధికార, పర్యావరణ కాలుష్య కారకమైన బీటీ–3 పత్తి విత్తనాలను అరికట్టడంపై స్పష్టమైన నిబంధనలతో అన్ని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి కేంద్ర బృందాన్ని కోరారు. తగిన ముందు జాగ్రత్తలు చేపట్టాలని, ఆ విత్తనాలను క్రమబద్ధీకరించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కొన్నేళ్లుగా అనధికార బీటీ–3 పత్తి విత్తనాలు విక్రయిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని జాతీయ, రాష్ట్ర విత్తన సంఘాల ప్రతినిధులు, విత్తనోత్పత్తిదారులు కేంద్ర బృందానికి స్పష్టం చేశారు. అనధికార పత్తి విత్తనాలను పూర్తిగా నియంత్రించాలని డిమాండ్ చేశారు. కొందరు విత్తనోత్పత్తిదారులు చేసిన తప్పులకు విత్తన డీలర్లు ఇబ్బందులపాలు కావాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించటానికి తగిన నిబం ధనలు రూపొందించాలని.. విత్తనాల గుర్తిం పుపై డీలర్లకు, రైతులకు శిక్షణ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి కావలసిన పత్తి విత్తనాల్లో 40 శాతం వరకు రాష్ట్రం నుంచే సరఫరా చేస్తున్నామని.. అనుమతి లేని బీటీ–3 పత్తి విత్తనాల వల్ల వాతావరణం కలుషితమవుతుందని రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కె.కేశవులు పేర్కొన్నారు. బీటీ–3 పత్తిలో హెచ్‌టీ లక్షణాన్ని కనుగొని విత్తన ధ్రువీకరణ చేయటానికి ప్రైవేటు పత్తి సంకరజాతి రకాల నోటిఫికేషన్ అడ్డంకిగా ఉందని కేంద్ర ప్రభుత్వ జీవ సాంకేతిక విభాగం ముఖ్య శాస్త్రీయ అధికారి వి.ఎస్.రెడ్డి చెప్పారు. కేంద్ర బృందానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలివీ.. 1. చట్టవిరుద్ధ బీటీ–3 పత్తి విత్తనోత్పత్తిని, అమ్మకాలను నియంత్రించే చర్యలు చేపట్టాలి. 2. అన్ని రాష్ట్రాల లాఎన్ఫోర్స్మెంట్ అథారిటీలు చేపట్టాల్సిన తక్షణ చర్యలను గుర్తించి మార్గదర్శకాలు రూపొందించాలి. 3. బీటీ–3 పత్తి విత్తనోత్పత్తిపై, గ్లైఫోసేట్ అమ్మకాలపై పర్యవేక్షణకు మార్గదర్శకాలు రూపొందించాలి. 4. విత్తన ఉత్పత్తిదారుల వద్ద లేదా ప్రొసెసింగ్ ప్లాంట్లలో బీటీ–3 పత్తి విత్తనాలను తనిఖీ చేసి వెంటనే నాశనం చేసేలా విధివిధానాలు రూపొందించాలి. 5. బీటీ–3 పత్తి వాడకం, గ్లైఫోసేట్ దుష్ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పించాలి. 6. బీటీ–3లో హెచ్‌టీ లక్షణం పరీక్ష కోసం ప్రొటోకాల్స్ రూపొందించాలి. -
భవిష్యత్తు దేశీ పత్తిదే!
దేశవ్యాప్తంగా బీటీ పత్తి రైతులు గులాబీ రంగు పురుగు, ఇతర చీడపీడల బెడదతో తల్లడిల్లుతున్నారు. బీటీ పత్తి పురుగుమందుల వాడకాన్ని, పెట్టుబడులను తగ్గిస్తుందని ఆశించారు. అనుకున్నదొకటి. అయ్యిందొకటి. కరువు కాటకాలు, చీడపీడల ధాటికి బీటీ పత్తి విఫలం కావటంతో రైతులు అప్పులపాలై, ఆత్మహత్యల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో కలుపు మందులను తట్టుకుంటుందన్న నెపంతో, మరో జన్యుమార్పిడి పత్తి రకం లక్షలాది హెక్టార్లలోకి అక్రమంగా చొరబడింది. ఆలస్యంగా కళ్లు తెరచిన కేంద్ర ప్రభుత్వం జీవవైవిధ్యాన్ని హరించే ఈ విత్తనాలను సహించవద్దని రాష్ట్రాలకు సూచించింది.. ♦ అమెరికన్ హైబ్రిడ్లు/ జన్యుమార్పిడి పత్తి విత్తనాలపైనే గత కొన్నేళ్లుగా మన రైతులు ఆధారపడుతున్నారు. సంక్షోభంలోకి నెట్టిన వీటిని వదిలేయాల్సిన సమయం వచ్చిందా? ♦ మరుగున పడిన దేశీ పత్తి రకాలే ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. చీడపీడల బెడద లేని, కరువు కాటకాలను దీటుగా తట్టుకొనే దేశీ పత్తి రకాలను తిరిగి నెత్తికెత్తుకోవటమే.. మన రైతులకు ఆర్థికపరంగా, మన భూములకు పర్యావరణపరంగా శ్రేయస్కరమా? ♦ ఇంతకీ ప్రస్తుతం దేశీ పత్తి సాగు చేస్తున్న రైతులు సంతోషంగానే ఉన్నారా? ఖాదీ వస్త్రాలకు ప్రజాదరణ ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నంలో భాగమే ఈ కథనం. దేశీ పత్తి రైతులను, పరిరక్షకులను ప్రపంచ సేంద్రియ మహాసభలో ‘సాగుబడి’ ఇటీవల పలుకరించింది.. పత్తి సాగుకు, ఖాదీ వస్త్రాల ఉత్పతికి భారతీయ ఉపఖండం అనాదిగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. పత్తి ‘గాస్సిపియం’ కుటుంబానికి చెందినది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 పత్తి జాతులుండగా, జి.అర్బోరియం, జి.హెర్బాసియం, జి.హిర్సుటమ్, జి.బార్బడెన్స్ అనే 4 జాతులు మాత్రమే సాగులో ఉన్నాయి. ఇందులో జి.అర్బోరియం, జి.హెర్బాసియం భారతీయ లేదా దేశీ పత్తి జాతులు(మిగతావి అమెరికన్ జాతులు). ఇవి సన్నని పొట్టి పింజ రకాలు. భారతీయ చేనేత కళాకారులు నేసిన మేలైన వస్త్రాలు పూర్వం ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేవి. అమెరికన్ పత్తి దురాక్రమణ.. పత్తిని శుద్ధి చేసి నూలును తయారు చేయటం, చేనేత మగ్గాలపై బట్ట నేసే సాంకేతిక కళా నైపుణ్యంలో భారతీయులకు మరెవరూ సాటి రారు. ఆంగ్లేయులకు బొత్తిగా తెలియని కళ ఇది. భారతీయ చేనేత వస్త్రాలను 1721వ సంవత్సరంలో బ్రిటిష్ పాలకులు నిషేధించారు. అయినా 1820వ సం. వరకూ ఎగుమతులు కొనసాగాయి. మాంచెస్టర్ తదితర ప్రాంతాల్లో 18వ శతాబ్దం తొలి నాళ్ల నుంచి స్పిన్నింగ్ మిల్లులు నిర్మించటం ప్రారంభమైంది. స్పిన్నింగ్ యంత్రాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకొని బ్రిటన్‌లో స్పిన్నింగ్ మిల్లులను నెలకొల్పారు. అమెరికన్ పత్తి రకాలు.. పొడుగు పింజతో కూడిన పత్తినిస్తాయి. కాబట్టి, ఆ పొడుగు పింజ పత్తితో నూలు తయారు చేయడానికి అనుగుణంగా రూపొందించిన యంత్రాలవి. అయితే, యుద్ధం కారణంగా అమెరికా నుంచి పత్తి దిగుమతులు దెబ్బతినటంతో బ్రిటిష్ పాలకుల దృష్టి భారత్‌పై పడింది. జి.హిర్సుటమ్ జాతికి చెందిన అమెరికన్ పత్తి విత్తనాలను భారతీయ రైతులకు ఇచ్చి సాగు చేయించటం ప్రారంభించింది. క్రమంగా దేశమంతటా అమెరికన్ పత్తి రకాల సాగు విస్తరించింది. ఇక్కడి నుంచి పత్తిని తీసుకెళ్లి బ్రిటన్‌లో తయారు చేసిన వస్త్రాలను.. ఇక్కడికి తెప్పించి అమ్మేవారు. అందువల్లే స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీ విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపు ఇవ్వాల్సి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతీయ ప్రభుత్వాలు కూడా దేశీ పత్తి రకాలు కొరగానివని భావించి, అమెరికన్ పత్తి రకాలను ప్రోత్సహించాయి. పొడుగు పింజ కలిగి ఉండే అమెరికన్ పత్తికి తగిన మిల్లులను ఏర్పాటు చేయించాయి. దీంతో దేశీ పత్తి విత్తనాలు కనుమరుగయ్యాయి. కొండపత్తి, పలమనేరు, జయధర్.. మన దేశంలోని వివిధ వ్యవసాయక వాతావరణ ప్రాంతాలకు అనువైన అనేక దేశీ పత్తి రకాలు పూర్వం నుంచే, ముఖ్యంగా వర్షాధారంగా, సాగులో ఉన్నాయి. బీటీ పత్తి నేపథ్యంలో వీటి సాగు విస్తీర్ణం 2%కి తగ్గింది. కొన్ని సంస్థలు, కొందరు రైతులు సాగు చేస్తూ, సంరక్షిస్తుండబట్టి దేశీ పత్తి రకాలు అక్కడక్కడయినా పొలాల్లో కనిపిస్తున్నాయి. దేశీ పత్తి రకాలు మన మెట్ట భూములకు బాగా అనువైనవని తెలిసినప్పటికీ ప్రభుత్వ రంగంలో పరిశోధనలకు విధానపరమైన ప్రోత్సాహం కరువైంది. బీటీ పత్తితో కల చెదిరిన చాలా మంది రైతులు ఇప్పుడు దేశీ పత్తి రకాల వైపు మళ్లే అవకాశాలున్నాయని భారత్ బీజ్ స్వరాజ్ మంచ్‌కు చెందిన దేశీ పత్తి పునరుజ్జీవనోద్యమకారులు ఆశిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ‘సహజ సమృద్ధ’, చెన్నైకి చెందిన ‘తుల’, మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన గ్రామ సేవా మండల్ (ఆచార్య వినోబా భావే దీన్ని నెలకొల్పారు) వంటి స్వచ్ఛంద సంస్థలు సుమారు ఎనిమిది దేశీ పత్తి రకాలను రైతులతో ఇప్పటికీ సాగు చేయిస్తూ, సంరక్షిస్తున్నాయి. వీటిలో ‘కొండపత్తి’ కూడా ఒకటి. ఈ పత్తితోనే శ్రీకాకుళం జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పొందూరు ఖద్దరు వస్త్రాలను నేస్తున్నారు. దూది నుంచి వస్త్రం తయారు చేసే వరకు ఏ దశలోనూ యంత్రాలు వాడకుండా వృత్తి కళాకారులే అన్ని పనులూ తరతరాలుగా నైపుణ్యంతో కొనసాగిస్తుండటం విశేషం. చిత్తూరు జిల్లాలో పుట్టిన ‘పలమనేరు’ రకం మహారాష్ట్రలో సాగులో ఉంది. జయధర్ పత్తిని కర్ణాటకలో సహజ సమృద్ధ సంస్థ సాగు చేయిస్తున్నది. తమిళనాడులో కరువు పీడిత ప్రాంతాల్లో కరుంగన్ని పత్తిని ‘తుల’ సాగు చేయిస్తున్నది. ప్రభుత్వం దేశీ పత్తి రకాలపై దృష్టి సారిస్తే పునర్వైభవం తేవచ్చు. రైతుకు భరోసాగా నిలవొచ్చు. దేశీ పత్తిని పునరుద్ధరించక తప్పదు! విషతుల్యమైన బీటీ కాటన్ విఫలమైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ గులాబీ పురుగు పంటను తినేస్తోంది. రైతుల ఆత్మహత్యల్లో 85% దీనివల్లే. కలుపుమందులను తట్టుకునే(హెర్బిసైడ్ టాలరెంట్–హెచ్.టి.) జన్యుమార్పిడి పత్తి మరింత ప్రమాదకరం(దీన్నే బీటీ–3 అని, గ్లైసెల్ పత్తి అని పిలుస్తున్నారు). దీని వల్లే అమెరికాలో ‘సూపర్ వీడ్స్’ కొరకరాని కొయ్యలుగా తయారయ్యాయి. మన పత్తి ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతున్నా, ప్రభుత్వం ఇప్పటికీ తోసిపుచ్చుతూనే ఉంది. దేశీ పత్తి రకాలు వాతావరణ మార్పులను, చీడపీడలను తట్టుకుంటాయి. సాగు నీరు అక్కర్లేదు. ఇప్పుడున్న మిల్లులకు దేశీ పత్తి సరిపడదు. కానీ, గాంధీ మార్గంలో ఖాదీ వస్రాల తయారీకి బాగా ఉపయోగపడుతుంది. విదర్భలో సేంద్రియ దేశీ పత్తి సాగులో మేం రైతులకు శిక్షణ ఇచ్చాం. విత్తనాలిచ్చి సాగుచేయిస్తున్నాం. ఆ పత్తిని కొని అన్ని పనులూ చేతులతోనే చేయించి ఖాదీ వస్త్రాన్ని తయారు చేస్తున్నాం. ప్రభుత్వం ఎందుకు చేయకూడదు? – డా. వందనా శివ, నవధాన్య, డెహ్రాడూన్ దేశీ రకాలతోనే పత్తికి పూర్వవైభవం! భారత్‌లో పత్తి పంట భవిష్యత్తంతా మనవైన దేశీ (ఆసియా) పత్తి వంగడాలకు మళ్లీ పూర్వవైభవం తేవటంలోనే ఉందని నా ప్రగాఢ విశ్వాసం. వినగానే సాధ్యమేనా అనిపిస్తుంది కానీ, లోతుగా ఆలోచిస్తే భవిష్యత్తు దేశీపత్తిదేనని అర్థమవుతుంది. స్వాతంత్య్రం వచ్చే నాటికి పత్తి విస్తీర్ణంలో 97.5% దేశీ రకాలే సాగులో ఉన్నాయి. బీటీ పత్తి ధాటికి ఇది 2%కి తగ్గింది. దేశీ పత్తి రకాలు చౌడు నేలలు, పెద్దగా సారం లేని తేలిక నేలలు, ఎడారి, చలకా నేలల్లో గడ్డు పరిస్థితులను తట్టుకుంటాయి కాబట్టే భారతీయ రైతులు పూర్వకాలం నుంచీ వీటిని ఇష్టంగా సాగు చేశారు. అమెరికన్ పత్తి జాతుల్లో ఏ ఒక్కటి కూడా ఇటువంటి నేలల్లో పెరగలేవు. కాయతొలిచే గులాబీ పురుగుతో సహా ఏ రకమైన పురుగులనైనా, తెగుళ్లనైనా దేశీ రకాలు తట్టుకుంటాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండానే స్థిరంగా మంచి దిగుబడులు ఇవ్వగలవు. బీటీ పత్తి హైబ్రిడ్లను అస్థిరమైన రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయటం వల్ల చీడపీడల బెడదతో ఖర్చు భారం అంతకంతకూ పెరిగిపోతున్నది. రైతుల నికరాదాయం బాగా తగ్గి, సంక్షోభంలోకి కూరుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా 60% పత్తి సాగు నీటివసతి లేని మెట్ట పొలాల్లోనే జరుగుతున్నది. సుస్థిర వ్యవసాయ పద్ధతుల్లో తక్కువ ఖర్చుతోనే దేశీ పత్తి రకాల సాగుతో స్థిరమైన దిగుబడులు పొందవచ్చు. అయినా, భారత్‌లో దేశీ పత్తి పరిశోధనలపై తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతుండటం దురదృష్టకరం. కానీ, అమెరికన్ హైబ్రిడ్ల కన్నా మెరుగైన రెండు దేశీ వంగడాలను నాందేడ్ ఎం.ఎ.యు. పర్బని శాస్త్రవేత్తలు ఇటీవల రూపొందించటం విశేషం. తగిన ప్రభుత్వ విధానాన్ని రూపొందించుకోవాలి. ఇప్పటికైనా మేలుకుంటే దేశీ పత్తికి బంగారు భవిష్యత్తు తథ్యం. భారత్‌లో పర్యటించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. – డా. కేశవ్ క్రాంతి, పూర్వ సంచాలకులు, కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ, నాగపూర్, అధిపతి, సాంకేతిక సమాచార విభాగం, అంతర్జాతీయ పత్తి సలహా సంఘం, వాషింగ్టన్, అమెరికా Tel +1-202-292-1687 (Direct), 1-202-463-6660 x122 (Main), Fax +1-202-463-6950, http://www.icac.org ఎప్పుడేమౌతుందోనన్న భయం లేదు..! నాకు 16 ఎకరాల నల్లరేగడి పొలం ఉంది. 35 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. పూర్వం నుంచి జయధర్ దేశీ పత్తిని సాగుచేసేవాడిని. జయధర్ పత్తి సాగు విస్తీర్ణం తగ్గి కొనేవాళ్లు లేక.. నాలుగేళ్లు బీటీ పత్తి పండించా. బీటీ పత్తి సాగు చాలా ఖర్చుతో కూడినది మాత్రమే కాదు, మహా యాతనతో కూడిన పని. బీటీ వేశామంటే రసాయనిక ఎరువులు కచ్చితంగా వేయాల్సిందే. పురుగుల బెడద చాలా ఎక్కువ. పంట ప్రతి దశలోనూ విసుగు–విరామం లేకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక పురుగుమందు చల్లుతూ ఉండాల్సిందే. రైతును ప్రశాంతంగా ఉండనివ్వదు. ఎప్పుడు ఏం ముంచుకొస్తుందోనని భయంతో గడపాల్సి ఉంటుంది.. జయధర్ పత్తి అలాకాదు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు అక్కర్లేదు. ఎటువంటి చీడపీడలూ రావు. నిశ్చింతగా సాగు చేయొచ్చు. ఎకరానికి ఏడాదికి రెండు బండ్ల పశువుల ఎరువు వేస్తే చాలు. పనులన్నీ మా కుటుంబ సభ్యులమే చేసుకుంటాం. జయధర్ పత్తి సాళ్ల మధ్య అడుగున్నర దూరం ఉంచుతాం. మధ్యలో ధనియాలు, శనగ అంతరపంటలుగా పండిస్తున్నాను. ఎకరానికి 2.5 క్వింటాళ్ల జయధర్ పత్తి, క్వింటా శనగలు, క్వింటా ధనియాలు పండుతాయి. ధనియాల పంటకు మాత్రమే 3 దఫాలు పంచగవ్య, అవసరాన్ని బట్టి పంచపత్ర కషాయం పిచికారీ చేస్తా. అంతే. పత్తిపైన చల్లేదేమీ లేదు. రూ. 40 వేల వరకు నికరాదాయం వస్తుంది. మా వూళ్లో మరెవరూ వేయకపోయినా జయధర్ పత్తిని నేను వేస్తున్నాను. క్వింటా పత్తిని రూ. 5 వేలకు సహజ సమృద్ధ వాళ్లు కొంటున్నారు. – కాట్రహెళ్లి కల్లప్ప(097391 91437) ఉత్తంగి(హూవినహడగలి), బళ్లారి తాలూకా, కర్ణాటక సేంద్రియ దేశీ పత్తి నుంచి ఖాదీ దుస్తుల వరకు..! ఆచార్య వినోబా భావే 1930లో స్థాపించిన సంస్థ మా ‘గ్రామ్ సేవా మండల్’. గత 30 ఏళ్లుగా దేశీ పత్తి రకాలను రైతులతో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయిస్తూ పరిరక్షిస్తున్నాం. వారి నుంచి పత్తిని మార్కెట్ ధరకన్నా 20% అధికంగా చెల్లించి కొనుగోలు చేస్తాం. చరఖాతో సుమారు వెయ్యి మంది మహిళలు దేశీ పత్తి నుంచి నూలును తయారు చేస్తారు. వెయ్యి మీటర్ల దారాని(గుండి)కి రూ. 4.50 చొప్పున చెల్లిస్తాం. ఆ నూలుతో అన్ని వయసుల వారికీ ఉపయోగపడే ఖాదీ వస్త్రాలను తయారు చేసి.. మాకున్న 3 దుకాణాల ద్వారా విక్రయిస్తున్నాం. సేంద్రియ సాగులో వర్షాధారంగా ఎర్రభూమిలో ఎకరానికి రెండు క్వింటాళ్లు, నల్లరేగడి భూముల్లో 3–4 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తున్నది. క్వింటాలుకు ఈ ఏడాది రూ. 6 వేలకు కొనుగోలు చేస్తున్నాం. అనుమోలు, ఏకే7, వైధవి అనే సహజ బ్రౌన్ కాటన్ (సీఐసీఆర్), శుభ్ర, కొమోలి అనే సర్జికల్ కాటన్ దేశీ రకాలను ప్రస్తుతం వంద మంది రైతులతో సాగు చేయిస్తున్నాం. మా దగ్గర చిత్తూరు జిల్లాకు చెందిన ‘పలమనేరు’ పత్తి రకం కూడా ఉంది. పొడుగు పింజ, పెద్ద గింజ రకం ఇది. గోంగూర, మొక్కజొన్న, అలసంద, బంతి వంటి పంటలను పత్తిలో అంతర/ఎర పంటలుగా సాగు చేయిస్తున్నాం. పప్పుధాన్య పంటలతో పంట మార్పిడి తప్పనిసరిగా పాటిస్తే పత్తి సాగులో సమస్యలు ఉండవు. గ్రామస్వరాజ్యం సాధన కృషిలో భాగంగా సేంద్రియ పత్తి నుంచి ఖాదీ వస్త్రాలు, సేంద్రియ గానుగ నూనెల ఉత్పత్తిపై కూడా శిక్షణ కూడా ఇస్తాం. – వసంత్ ఫుటానె (094229 58767), గ్రామ్ సేవా మండల్, గోపురి, వార్థా, మహారాష్ట్ర www.gramsewamandal.org/ ‘పలమనేరు’ రకం దేశీ పత్తి సాగు చేస్తున్నా! నేను స్వతహాగా చార్టర్డ్ ఎకౌంటెంట్‌ని. గత ఐదేళ్లుగా ఆ పని మానేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. తమిళనాడు వ్యవసాయ వర్సిటీ వెబ్సైట్లో చెప్పిన పద్ధతులను తొలుత అవలంబించా. తర్వాత సుభాష్ పాలేకర్ పద్ధతిని అనుసరిస్తున్నా. మాకు 19 ఎకరాల పొలం ఉంది. పలమనేరు రకం దేశీ పత్తిని ఒక ఎకరంలో, అనుమోల్ దేశీ పత్తి(అంతరపంటలుగా గోంగూర, కంది) మరో ఎకరంలో ఈ ఏడాదే సాగు చేస్తున్నా. సజ్జ, రాగులు, మిర్చి, అల్లం, ఉల్లి, కంది, పెసర, మొక్కజొన్న, జొన్న, కూరగాయలు సాగు చేస్తున్నా. 1.5 ఎకరంలో సీతాఫలం, మూడెకరాల్లో ఆరెంజ్ తోటలను సాగు చేస్తున్నా. వంట గదిలో అవసరమైన వాటిలో 80% పంటలను పండిస్తున్నా. మాకు చిన్న దాల్ మిల్లుంది. చిన్న ట్రాక్టర్‌ను నేనే స్వయంగా నడుపుతూ పొలం పనులు చేస్తా. అవగాహనతో కొద్ది విస్తీర్ణంలో సాగు చేస్తే దేశీ పత్తి సాగు మంచిదే. ఖాదీ వస్త్రాల తయారీకి దోహదపడటం చేయదగిన పని. సబ్సిడీలు కాదు, మంచి ధర ఇస్తే చాలు. – అశ్విని ఔరంగాబాద్కర్ (098905 15814), వార్ధా, మహారాష్ట్ర మా పత్తితోనే ఖాదీ వస్త్రం నేయించా..! మా వారు ఇంజినీరు. నేను ఐదేళ్లుగా పదెకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. గత ఏడాది ఎకె7 సూటి రకం పత్తిని ఎర్ర నేలలో సాగు చేశా. ఖర్చు రూ. 3 వేల లోపే అయ్యింది. రెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పత్తిని అమ్మలేదు. గ్రామ్ సేవా మండల్‌కు తీసుకువెళ్లి ఖాదీ వస్త్రాలను నేత నేయించుకున్నాను. ఈ సంవత్సరం శుభ్ర రకం దేశీ పత్తిని ఎకరంలో వేశా. 5 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావచ్చు. వేరుశనగ, నువ్వులు, పసుపు, కంది, బఠాణీ, గోంగూర పంటలు సాగు చేస్తున్నా. గోంగూర కాయల రెబ్బలతో జామ్, షర్బత్, పచ్చడి తయారు చేసి తెలిసిన వాళ్లకు, చుట్టుపక్కన వాళ్లకు అమ్ముతున్నాను. గోంగూర గింజల నుంచి గానుగలో నూనె తీయించి, వంట నూనెగా వాడుతున్నాం. ఒకే పంటను కాకుండా అనేక పంటలు కలిపి సాగు చేయటం ముఖ్యం. ఒకటి పోయినా మరొకటైనా పండుతుంది. జీవామృతం, అవసరం మేరకు దశపర్ణి కషాయం వాడతాం. రసాయనాలు అసలు వాడం. ఈ రోజుల్లో ఏది పండించినా రూపం మార్చి(వాల్యూ ఎడిషన్ చేసి) అమ్మితే తప్ప వ్యవసాయం గిట్టుబాటు కాదు. – కీర్తి మంగ్రూల్కర్(095525 56465), వార్ధా, మహారాష్ట్ర –పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
బీటీ పత్తి విత్తనాల ధర ఖరారు
– బీటీ–1 ప్యాకెట్ ధర రూ.635 – బీటీ–2 ప్యాకెట్ ధర రూ.800 కర్నూలు(అగ్రికల్చర్): బీటీ పత్తి విత్తనాల ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ధర కాస్త తగ్గింది. ఈ ఏడాది జిల్లాలోని కర్నూలు, ఆదోని డివిజన్లలో పత్తి సాగు పెరిగే అవకాశం ఉండటంతో వ్యవసాయశాఖ జిల్లాకు 10.15 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లను కేటాయించింది. బీటీ–1 450 గ్రాముల ప్యాకెట్ ధర రూ.635, బీటీ–2 విత్తనాలు 450 గ్రాముల ప్యాకెట్ ధర రూ.800లుగా నిర్ణయించింది. -
సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు స్టే
సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు స్టే సాక్షి, హైదరాబాద్: బీటీ పత్తి విత్తనాల రాయల్టీ నిర్ణయం విషయంలో తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. బీటీ విత్తనాల ప్యాకెట్‌కు రూ.50ని రాయల్టీగా నిర్ణయిస్తూ తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వును నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ధర్మాసనం స్టే విధించింది. తదుపరి విచారణను జూన్ 14కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తేల్చిచెప్పింది. మహికో మోన్శాంటో, విత్తన కంపెనీల మధ్య నడుస్తున్న వివాదానికి సంబంధించి మధ్యవర్తి వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై ఈ మధ్యంతర ఉత్తర్వులు ఏ విధమైన ప్రభావం చూపబోవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మహికో మోన్శాంటో బీటీ పత్తి విత్తనాల రాయల్టీని ప్యాకెట్‌కు రూ.50గా ఖరారు చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మోన్శాంటో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన సింగిల్ జడ్జి, ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బు ధవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, విత్తన కంపెనీల త రఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, ఎస్ .నిరంజన్‌రెడ్డిలు వాదనలు వినిపించారు. -
బీటీ పత్తిలో గులాబీ రంగు
- గుజరాత్‌కే పరిమితమైన పురుగు ఇప్పుడు రాష్ట్రంలోకి ప్రవేశం సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాలో సాగు చేస్తున్న బీటీ పత్తిని గులాబీ రంగు పురుగు ఆశించినట్లుగా స్థానిక వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటివరకు కేవలం గుజరాత్లో మాత్రమే బీజీ-2 పత్తిని గులాబీ రంగు పురుగు ఆశిస్తుండగా... ఇప్పుడు వరంగల్ జిల్లాలోనూ ఈ ఏడాది గులాబీ రంగు పురుగును గుర్తించారు. అలాగే ఈ సమస్య మహబూబ్‌నగర్ జిల్లాలోనూ ఉన్నట్లు రాష్ట్ర శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వర్షాధార బీటీ పత్తిని రైతులు చాలావరకు ఏరివేసి ఆ పత్తి చేలను వదిలేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పత్తి మొక్కలు పూర్తిగా ఎండి వాటిలో రోగ నిరోధక శక్తి లేకపోవడంతో అది పురుగుకు వరంగా మారి, వదిలేసినచేలల్లో గులాబి రంగు పురుగు ఉధృతమై మిగతా పత్తి చేలను కూడా ఆశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ చేలల్లో గులాబీ రంగు పురుగుతో పాటు పిండినల్లి కూడా ఎక్కువగా ఆశిస్తున్నట్లు గుర్తించారు. గులాబీ రంగు పురుగు లార్వాలు కాయలలోకి ప్రవేశించి పత్తిని, గింజలను తింటాయి. దీనివల్ల పత్తి సరిగా పగలదు. వచ్చే పత్తి నాణ్యత బాగా తగ్గి గుడ్డి పత్తి అవుతుంది. బరువు కూడా బాగా తగ్గుతుంది. నివారణ చర్యలు... పత్తి ఏరినటువంటి చేలల్లో గొర్రెలు, మేకలు, పశువులను తోలి మేపాలి. పత్తి మోడులను రోటవేటర్‌తో భూమిలోకి కలియదున్నాలి. నీటి వసతి ఉన్నప్పటికీ పత్తిని పొడిగించకుండా తీసేసి మొక్కజొన్న లేదా ఇతర ఆరుతడి పంటలు వేసుకోవాలి. గులాబీ రంగు పురుగు నివారణకు క్వినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 300 గ్రాములు వేపనూనెతో కలిపి పిచికారి చేయాలి. పత్తి మోడులను ఇళ్ల దగ్గర పొయ్యిలో వాడడానికి నిల్వ చేయకూడదు. గులాబీ రంగు పురుగు ఆశించిన పత్తి చేల నుంచి తీసిన పత్తిని అంతకు ముందు నిలువ ఉంచుకున్న పత్తిలో కలుపకూడదు. -
విత్తుపై పెత్తనానికే జన్యు జిత్తులు!
సమకాలీనం జన్యుమార్పిడి పంటల క్షేత్ర పరీక్షల వల్ల జన్యుకాలుష్యం ముప్పు ఉంది. అది మనుషులపైనా, ఇతర జీవులపైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే అమెరికా సహా అధిక దేశాలు వాటిని నిషేధించాయి. 2002లో ఎన్డీఏ ప్రభుత్వం అనుమతించిన బీటీ పత్తి రైతాంగాన్ని ముంచింది. ఆహారోత్పత్తిని పెంచడంలో ప్రపంచానికే ఆదర్శంగా భావించే ఇజ్రాయెల్ జన్యు మార్పిళ్లకు దూరంగా ఉంది. విత్తనంపై పెత్తనంతో మన వ్యవసాయాన్నే చెరబట్ట చూస్తున్న బహుళజాతి హిరణ్యాక్షుల నియంత్రణకు తెలుగువారు ఉద్యమం సాగించక తప్పదేమో. మంచి కొంచెమైనా ఫలితం గొప్పగా ఉంటుంది. 'చిత్తశుద్ది కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత?....'అని పోల్చి చెప్పాడు వేమన. ఎంతో విశాలమైన మర్రి చెట్టును, అతి చిన్నదిగా ఉండే దాని విత్తనాన్ని ఉదాహరణగా తీసుకున్నాడు. మంచికి బదులు చెడు జరిగితే....? దాని విపరిణామాలు కూడా అంతకన్నా తీవ్రంగా ఉంటాయి. ఊరగాయలో, ఆవకాయలో... ఇలా అన్నిట్లో ఇమిడేందుకు వంటింటికొచ్చే ఆవాల్లో ఏముందో! విత్తన జన్యు సంకరం ఎలా చేశారో? తింటే ఏం జబ్బులొస్తాయో? తెలియని పరిస్థితి ఉంటే సగటు మనిషి పరిస్థితేంటి? ఇవేవీ పట్టించుకోకుండా జన్యుమార్పిడి పంటల పరీక్షలకు తెరలేపుతున్నారు. వేమన చెప్పిన చిన్న చిన్న విత్తనాలనే ఆలంబన చేసుకొని మొత్తం వ్యవసాయ రంగాన్ని, ఉత్పత్తి వ్యవస్థల్ని గుప్పిట పట్టాలని చూస్తు న్నాయి కార్పొరేట్ శక్తులు. దేశ వ్యవసాయం భవిత గురించి ఆలోచించని ప్రభుత్వాలు వాటికి వంత పాడుతూ, పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తు న్నాయి. తెలుగు నేలను విత్తన భాండాగారం చేస్తామంటూనే, మొత్తంగా విత్తనోత్పత్తి, ఆహారోత్పత్తి వ్యవస్థలను అతి కొన్ని కార్పొరేట్ల నియంత్రణలోకి బదలాయించడానికి శ్రీకారం చుడుతున్నాయి. జన్యుమార్పిడి పంటల సాగు క్షేత్ర పరీక్షలకు అనుమతి, మేధో సంపత్తి హక్కుల దారాదత్తం, విత్తనంపై పెత్తనం, ఎరువులు, పురుగు మందుల మార్కెట్‌పై గుత్తాధిపత్యం, తద్వారా మొత్తం వ్యవసాయోత్పత్తులపైనే నియంత్రణ... ఇదీ వరుస! ఇది సమస్య కున్న ఒక పార్శ్వమే! మరోవంక ఇవి జీవభద్రత ధ్రువీకరణ జరగని జన్యు మార్పిళ్లయినందున, జన్యువులు బాహ్య వాతావరణంలోకి వచ్చి జన్యు కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉంది. అది మనుషులపైనా, ఇతర జీవులపైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆరోగ్యపరమైన ఎన్నో విపరిణామాలకు దారితీస్తోంది. చూడటానికిది శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని అధునీకరించడంగా, మెరుగైన విత్తనాభివృద్ధిగా అనిపిస్తుంది. కానీ ఇందులో అనేకానేక మతలబులుంటాయని రైతు సంఘాలు, పర్యావరణ వేత్తలు హెచ్చ రిస్తున్నారు. తగు నియంత్రణ వ్యవస్థలు లేకుండా జన్యుమార్పిడి పంటలకు, వాటి క్షేత్ర పరీక్షలకు పచ్చజెండా ఊపొద్దని హెచ్చరిస్తున్నారు. మన దేశంలో వేల ఏళ్లుగా రైతులే ప్రత్యేక శ్రద్ధతో, తగు ఎత్తుగడలతో విత్తనాన్ని వృద్ధి చేసుకుంటున్న సంప్రదాయిక విధానాలకిది గొడ్డలిపెట్టు. బయోటెక్నాలజీ ముసుగులో విత్తనం కార్పొరేట్ల చేతుల్లోకి పోతే భవిష్యత్తులో వ్యవసాయం దుర్భరమే! తొందరపాటెందుకు? జన్యుమార్పిడి బీటీ పత్తి సాగులోని మన చేదు అనుభవాల దృష్ట్యానైనా ప్రభు త్వాలు జాగ్రత్త వహించాలని నిపుణుల సూచన. ఎన్డీఏ ప్రభుత్వమే 2002లో అనుమతించిన బీటీ పత్తి రైతాంగాన్ని నిలువునా ముంచింది. ఆంధ్రా, తెలంగాణ, మరఠ్వాడాలో జరిగిన అత్యధిక రైతు ఆత్మహత్యలకు బీటీ పత్తే కారణం. విత్తనాలపై బహుళజాతి సంస్థలకు మేధో సంపత్తి హక్కులు (పేటెంట్స్) ఉండటం వల్ల రైతులు ప్రతిసారీ రాయల్టీ చెల్లించాల్సిన పరిస్థితి. బీటీ పత్తి సాగులోకి వచ్చిన కొద్ది కాలానికే స్థానిక, సంప్రదాయ విత్తనాలన్నీ మాయమయ్యాయి. దీంతో ఆ విత్తనాలపైనే రైతాంగం ఆధారపడాల్సిన, బోలెడంత డబ్బు వెచ్చించాల్సిన దుర్గతి. పోనీ, దిగుబడి సుస్థిరంగా, హెచ్చుగా ఉందా? అదీ లేదు! మొదట్లో దిగుబడులు పెరిగినా, కాలక్ర మంలో తగ్గినట్టు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) లెక్కలే చెబుతు న్నాయి. 2001-02 నుంచి 2004-06 వరకు బీటీ పత్తి 6% వరకున్నపుడు దిగుబడి 69% పెరిగింది. 2005-06 నుంచి 2007-08 వరకు బీటీ పత్తి సాగు 62% పెరిగినపుడు దిగుబడి 17% పడిపోయింది. 2008-09 నుంచి 2012- 13 వరకు బీటీ పత్తి సాగు శాతం 94% పెరిగినపుడు దిగిబడి 10% తగ్గి పోయింది. కాకపోతే అది కాయతొలిచే పురుగును పరిహరించడం వల్ల పంట నాశనం తగ్గిన మేరకు మాత్రమే అదనపు దిగుబడి లభించింది. పైగా, జన్యు సంకరం వల్ల పక్వానికొచ్చినప్పుడు కాయలోకి చేరాల్సిన విషరసాయనం ఆకులు, కొమ్మలు, కాండం సహా మొక్కకంతటికీ విస్తరించిన జాడలున్నాయి. ఆకులు మేసిన మేకలు, ఇతర పశువులు మరణించిన రుజువులున్నాయి. ఇక ఇప్పుడైతే, కాయతొలిచే పురుగు రోగనిరోధకత పెరిగి, యధేచ్ఛగా కాయను తినేస్తోంది! ఈ లోగా విత్తనంపై పెత్తనం కంపెనీకి దక్కింది. సంకర విత్తనమై నందున నిర్దిష్ట ఎరువులు, పురుగు మందుల మార్కెట్‌పై గుత్తాధిపత్యం లభించింది. పంట ఉత్పత్తి వ్యయం పెరిగి, దిగుబడి, ధర రెండూ రాక రైతు నిలువునా మోసపోతున్నాడు. ఇంతకుమించిన దుష్ఫలితాలు ఆహార పంటలకూ దాపురిస్తే ఇక రైతు పరిస్థితి ఏమిటన్నది వేయి రూకల ప్రశ్న! ఆహారోత్పత్తి పెరగాల్సిందే, కానీ... ప్రపంచవ్యాప్తంగా జనాభా వృద్ధిని బట్టి ఆహారోత్పత్తి ఎన్నో రెట్లు పెరగాల్సి ఉంది. అది జరిగితేనే ఈ శతాబ్దాంతానికి ఆకలి బాధ తీరుతుంది. నిజమే. కానీ దీని ఆధారంగా ఆహార అవసరాలు తీర్చడానికి జన్యుమార్పిడే మార్గ మనడం తప్పు. తగిన పరీక్షలు జరక్కుండా, జీవభద్రతను ధ్రువీకరించ కుండా జరిగే జన్యుమార్పిళ్ల వల్ల ప్రయోజనాల కన్నా అనర్థాలే ఎక్కువని శాస్త్రీ యంగా రూఢి అయిన విషయం. 'ఇప్పుడు పంట పరీక్షకే అనుమతి అడుగు తున్నాం కదా!' అంటారు. క్షేత్ర పరీక్ష ప్రమాదకరమైందనే ప్రపంచంలోని మెజారిటీ దేశాలు నిషేధించాయి. ఈయూలోని పలు దేశాలు, అమెరికాలో గోధుమ సహా క్షేత్ర పరీక్షల్ని, స్థూలంగా జన్యు మార్పిళ్లను నిషేధించారు. ఈ పరీక్షల వల్ల జన్యు వైవిధ్యం సంకరమౌతుంది. ఫలితంగా జీవవైవిధ్యం, బతుకు వైవిధ్యమే సరిదిద్దలేనంతగా దెబ్బతింటోంది. మన దేశంలో జన్యు కాలుష్యాన్ని ఆపే, నియంత్రించే పద్ధతులు లేనందున క్షేత్ర పరీక్షలకు అను మతించకూడదని 'హరిత విప్లవ'ప్రముఖుడు స్వామినాథనే అన్నారు. బీటీపై శాస్త్రవేత్తలతో సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీదీ అదే అభిప్రాయం. క్షేత్ర పరీక్షల వల్ల జన్యుకాలుష్య ప్రమాదముంది, అదే జరిగితే ప్రకృతి సహజ విత్తనాలు కలుషితమై, తిరిగి ‘సహజ’ స్థితికి రాలేని పరిస్థితు లేర్పడతాయని పేర్కొంది. జీవ భద్రత ముఖ్యం, భవిష్యత్ తరాల ఆహారాన్ని కలుషితం కానీకుండా కాపాడేందుకు అవసరమైన శాస్త్ర సాంకేతికత పెరిగే వరకు జన్యుమార్పిడి క్షేత్ర పరీక్షలు వద్దు, ల్యాబ్‌కే పరిమితం చేయాలని సుప్రీంకోర్టుకు నివేదించింది. పార్లమెంట్ స్థాయీ సంఘం కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. అవసరాలకు సరిపడా ఆహారోత్పత్తి పెంచడా నికి ఎన్నో ప్రత్యామ్నాయాలున్నాయి. పట్టణీకరణ, ఎడారీకరణ, భూక్షయం, ఉప్పుకొట్టుకుపోవడం, నీటి లభ్యత లేకపోవడం తదితర కారణాల వల్ల దేశంలో సాగుభూమి తగ్గుతోంది. ప్రభుత్వ విధానాల్లో లోపాల వల్ల విచ్ఛల విడిగా భూవినియోగ మార్పిళ్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్ది, సాగు విస్తీర్ణం పెంచాలి. ప్రపంచం ఆదర్శంగా భావించే ఇజ్రాయల్ టెక్నాలజీ ఆహారోత్పత్తుల్ని గణనీయంగా పెంచింది. కానీ వారు జన్యుమార్పిళ్లకు వెళ్లక పోవడాన్ని గమనించాలి. విశ్వవ్యాప్తంగా ఏటా 33% నుంచి 42% ఆహారం తిండిగింజలు, తయారైన ఆహారం వృధా అవుతోంది. దీన్ని కట్టడి చేయాలి. మేథో సంపత్తి హక్కులు విత్తనంపై కాదు... సంకర పరచిన జన్యువులపైనే తప్ప విత్తనంపై మేధోసంపత్తి (పేటెంట్) హక్కులు జన్యుమార్పిడి పరీక్షలు నిర్వహిస్తున్న బహుళ జాతి కంపెనీలకు దక్కవు. కానీ, వారు విత్తనాలపై హక్కులున్నట్టు వ్యవహరిస్తున్నారు. టర్మినే షన్ విత్తనాల్ని ఉత్పత్తి చేస్తూ, ఏటా రైతులు విత్తనాల కోసం తమ వద్దకే వచ్చేలా చేస్తున్నారు. ఈ ప్రక్రియపై, పదజాలంపై సర్వత్రా విమర్శలు రావ డంతో, తమ ఆధిపత్యం కొనసాగింపునకు దొంగ దారులు వెతుకుతున్నారు. ఇప్పుడు ఆవాల్లో 'మేల్ స్టెర్లైడ్' విత్తనం తెస్తున్నారు. అంటే, ఒకసారి విత్తిన తర్వాత తిరిగి విత్తనోత్పత్తి జరుగదు. మళ్లీ పంట కోసం రైతు సదరు కంపెనీ దగ్గరకు రావాల్సిందే! పేరు వేరే తప్ప వ్యవహారం ఒక్కటే! హక్కుల స్పృహ అధికంగా ఉండే అభివృద్ధిచెందిన దేశాల్లోనే రైతులు, ఉద్యమకారులు వీరి ఆగడాల్ని నియంత్రించలేకపోతున్నారు. కెనడాలో సేంద్రియ పద్ధతిన పంట సాగుచేస్తున్న ఓ రైతు క్షేత్రంలోకి చొరబడి, దౌర్జన్యంగా శాంపిల్స్ సేకరించి, 'మేం సంకరపరచిన జీన్స్‌ను వినియోగిస్తున్నావంటూ' బహుళజాతి విత్తన కంపెనీ తెగబడింది 'మీరు సృష్టించిన జన్యుకాలుష్యం వల్ల అలా జరిగిందే తప్ప, నేను పనిగట్టుకొని చేసింది కాదు, మీ వల్లే నాకు నష్టం జరిగింద'ని రైతు ఎంత వాదించినా సదరు బహుళజాతి కంపెనీ కేసును అత్యున్నత న్యాయస్థానానికి ఈడ్చి మరీ పరిహారం వసూలు చేసింది. అలా అక్కడ దాదాపు 1,100 మంది రైతులపై ఇప్పుడు కేసులున్నాయి! జన్యుమార్పిళ్ల దుష్ఫరిణామాలపై పరీక్షలు జరుగకుండేలా ఈ బడా కంపెనీలు వ్యవహారం నడుపుతాయి. జన్యు కాలుష్యపు తిండి వల్ల క్యాన్సర్ కంతి ఏర్పడ్డట్టు ఇటాలి యన్ శాస్త్రవేత్త 'సెరాలినీ'ఎలుకలపై జరిపిన ప్రయోగంలో వెల్లడైంది. శాంపిల్ తప్పని సదరు కంపెనీలు వాదించినా చివరకాయన వాదనే నెగ్గింది. ఎవరి ప్రయోజనాల కోసం? రాష్ట్రాల అనుమతితో జన్యుమార్పిడి క్షేత్ర పరీక్షలు జరుపుకోవచ్చని కేంద్రం లోని జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జీఈఏసీ) సూత్రప్రాయ సమ్మ తిని తెలిపింది. వరి, పత్తి, గోదుమ, మొక్కజొన్న, వేరుశనగ, బంగాళ దుంప... ఇలా పన్నెండు పంటల విషయంలో ఈ వెసులుబాటునిచ్చింది. కానీ, వాటిని ససేమిరా అనుమతించేది లేదని తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. రాష్ట్రాల నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) తప్పనిసరి. జన్యుమార్పిళ్ల క్షేత్ర పరీక్షలకు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అంగీకారాన్ని తెలిపాయి. ఈ విషయమై నివేదికను ఇవ్వాల్సిందిగా కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. కంపెనీలతో మాటా-మంతీ అయ్యాకే కంటి తుడుపు కమిటీ వేశారనే విమర్శలూ ఉన్నాయి. విత్తనాల ద్వారా మొత్తం వ్యవసాయాన్ని చెరబట్ట చూస్తున్న బహుళజాతి హిరణ్యాక్షుల్ని నియంత్రించ డానికి తెలుగునాట ఉద్యమం తప్పదేమోనని వ్యవసాయ, పర్యావరణ నిపు ణులంటున్నారు. 'రైతులు, తోటమాలీల చేతిలో విత్తనం, వారి నిర్వహణలో భూమి ఉన్నంతవరకు ప్రపంచంలో ఆకలి బాధలుండవు'అని పర్యావరణ కార్యకర్త, విత్తనోద్యమనేత వందనాశివ అన్న మాటలు అక్షర సత్యాలు. ఈమెయిల్: dileepreddy@sakshi.com వ్యాసకర్త: దిలీప్ రెడ్డి -
బీటీకి దీటుగా!
* సాధారణ రకాల పత్తితోనూ మంచి దిగుబడులు * ఫలితాలిచ్చిన ‘హై డెన్సిటీ ప్లాంట్ సిస్టమ్’ సాగుపద్ధతి.. 6 జిల్లాల్లో 348 ఎకరాల్లో సాగు * వర్షాధార తేలిక నేలల్లో మామూలు పత్తిరకాల సాగే మేలు.. * బీటీకి ప్రత్యామ్నాయంగా హెచ్‌డీపీఎస్ సాగుకు సిఫారసు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: సాగు పద్ధతిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే చాలు.. బీటీ పత్తికి దీటుగా మామూలు పత్తి రకాలతోనూ చక్కని దిగుబడి సాధించవచ్చని తేలింది. అంతేకాదు.. వర్షాధారంగా సాగయ్యే తేలికపాటి నేలల్లో బీటీ రకాల సాగుకన్నా సాధారణ రకాల పత్తి సాగే రైతుకు ‘మినిమం గ్యారంటీ’గా ఉంటుందని ఇటీవల రాష్ట్రంలో జరిపిన సాగు ప్రయోగాల్లో తేటతెల్లమైంది. కేవలం మొక్కల సాంద్రతను పెంచడం ద్వారానే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. బీటీ హైబ్రిడ్ రకాలు నీటి సౌకర్యమున్న లోతైన నల్లరేగడి భూములకు అనువైనవి. వర్షాధారంతో కూడుకున్న తేలికపాటి భూముల్లో సాగుకు అంత అనువైనవి కావు. అయినప్పటికీ సరైన ప్రత్యామ్నాయాలు లేనందున మన రైతులు తేలికపాటి నేలల్లోనూ వర్షాధారంగా బీటీ పత్తిని సాగు చేస్తూ నష్టపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారాలకోసం ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్’(సీఐసీఆర్) నేతృత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ గుంటూరు, ప్రకాశం, కర్నూలు, మహబూబ్‌నగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 348 ఎకరాల్లో మామూలు రకాల(నాన్ బీటీ) పత్తిని రైతులతో సాగుచేయించింది. ఇందుకోసం మొక్కల సాంద్రత పెంపు పద్ధతి (హై డెన్సిటీ ప్లాంట్ సిస్టమ్-హెచ్‌డీపీఎస్)ని అనుసరించింది. తేలిక నేలలు ఎక్కువకాలం తేమను నిలుపుకోలేవు. నేలలో ఉన్న తేమను గరిష్టంగా ఉపయోగించుకుంటూ నీటిఎద్దడిని తట్టుకునే స్వల్పకాలిక వంగడాలైన సీఐసీఆర్‌కు చెందిన ‘సూరజ్’, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవిష్కరించిన ‘ఎన్డిఎల్హెచ్-1939’ రకాలను సాగుకు ఎంపిక చేసుకున్నారు. నేలలో తేమను పూర్తిగా ఉపయోగించుకునేలా మొక్కల సాంద్రతను ఎకరాకు గరిష్టంగా పెంచారు. మొక్కల సాంద్రత పెంచడంతో కలుపు సమస్య చాలావరకు తగ్గింది. జూన్ చివరివారంలో కొన్నిచోట్ల, జూలై చివరివారంలో మరి కొన్నిచోట్లా విత్తనం వేశారు. పంట పెరుగుదల క్రమాన్ని వ్యవసాయ అధికారులు నిరంతరం సమీక్షించారు. పంట మొదటి కోతల దశలో అధిక వర్షాలవల్ల దిగుబడి కొంత తగ్గింది. అయితే మొత్తంమీద ఫలితాలు బీటీ పత్తికి దీటుగా ఉన్నాయి. దిగుబడి 6 నుంచి 10 క్వింటాళ్ల వరకూ వస్తుందని అంచనా. రైతుల సంతృప్తి... కొత్త పద్ధతిలో పత్తి సాగు చేసిన రైతులు దిగుబడులపై సంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కల సాంద్రతకు సంబంధించి 45ఁ10, 60ఁ10, 60ఁ30, 70ఁ30, 90ఁ30 సెంటీమీటర్ల దూరం పాటిస్తూ చేసిన ప్రయోగాల్లో ఎక్కువమంది రైతులు సాలుకు సాలుకు మధ్య దూరం 60 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య దూరం 30 సెంటీమీటర్లు(60ఁ30) ఉంటే కలుపుతీతకు, పత్తి తీతకు అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ దూరాన్ని పాటిస్తే ఎకరానికి మొక్కల సాంద్రత 30 వేలు ఉంటుంది. బీటీ పత్తి సాగులో మొక్కల సాంద్రత ఎకరానికి 7,500 మాత్రమే(ప్రస్తుతం బీటి పత్తి సాగులో 90ఁ60 సెంటీమీటర్ల దూరాన్ని పాటిస్తున్నారు) ప్రతికూల పరిస్థితుల్లోనూ ‘మినిమం గ్యారంటీ’.. మామూలు రకాల పత్తి సాగులో మొక్కల సాంద్రత పెంచడం వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చీడపీడల దాడికి గురైనా సగటున ఒక మొక్క నుంచి ఐదారు పత్తి కాయలు వస్తే చాలు. ఒక్కో కాయలోని పత్తి 5 గ్రాములనుకుంటే ఒక్కో మొక్కనుంచి దాదాపు 30 గ్రాముల పత్తి వస్తుంది. ఎకరాలో 30 వేల మొక్కలు ఉన్నప్పుడు దిగుబడి ఎకరాకు తొమ్మిది క్వింటాళ్ల వరకూ సాధించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు ఈ ప్రయోగాలద్వారా నిగ్గుతేల్చారు. దీనికితోడు రైతు ఏటా పత్తి విత్తనాలను కొనుక్కునే అవసరమూ ఉండదు. ఈ ఏడాది జరిపిన క్షేత్రస్థాయి ప్రయోగాత్మక సాగులో.. వరుస వర్షాలవల్ల సకాలంలో కలుపు తీయలేకపోయారు. పైరు ఆకుమచ్చ తెగులుకు గురైంది. అయితే రసంపీల్చు పురుగుల ఉధృతి బీటీ పత్తిలోకన్నా తక్కువే. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా ‘హెచ్‌డీపీఎస్’ సాగు ఫలితాలిచ్చింది. ప్రస్తుతం పత్తి రెండు, మూడో తీత దశల్లో ఉంది. ఎకరాకు 6 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రానుంది. ఈ ప్రయోగ ఫలితాలను విశ్లేషించిన వ్యవసాయశాఖ వర్షాధారంగా తేలికపాటి భూముల్లో బీటీ పత్తి సాగు కన్నా, మామూలు పత్తి రకాలను ఎక్కువ సాంద్రతతో సాగుచేయడం ద్వారానే రైతుకు లాభదాయకమని తేల్చింది. భవిష్యత్తులో బీటీకి ప్రత్యామ్నాయంగా ‘హెచ్‌డీపీఎస్’ పద్ధతిలో సాధారణ పత్తి రకాల సాగును వ్యవసాయశాఖ సిఫారసు చేయనుంది. -
బీటీ పత్తి సాగుపై మళ్లీ ప్రయోగం
గజ్వేల్, న్యూస్‌లైన్: బీటీ పత్తి విత్తనాలన్నీ ఒకే రకమైన ఫలితాలనిస్తాయనే విషయాన్ని మరింత సమర్థంగా చాటిచెప్పేందుకు జిల్లాలో ఆత్మ(అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ), వ్యవసాయశాఖ మరోసారి ప్రయోగానికి సిద్ధమయ్యాయి. గతేడాది చేపట్టిన కార్యక్రమానికి కొంత భిన్నంగా ముందుకుసాగుతున్నారు. గతంలో ఒక గ్రామంలో అయిదుగురు రైతుల పొలాలను ఎంపిక చేసుకుని ప్రయోగాన్ని నిర్వహిస్తే ప్రస్తుతం ఒకే రైతు చేనులో అయిదు రకాల విత్తనాలను సాగుచేయిం చారు. జిల్లాలో ప్రతి ఏటా 1.30 లక్షల హెక్టార్లకు పైగానే పత్తి సాగవుతోంది. రైతులు బ్రాండెడ్ పేరిట ఒకే రకమైన పత్తి విత్తనాల కోసం ఎగబడటం వల్ల ప్రతి సీజన్లో తీవ్ర కొరత తలెత్తుతోంది. దీంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బీటీ పత్తి విత్తనాలన్నీ ఒకే రకమైన ఫలితాలనిస్తాయనే విషయం తెలియక కంపెనీల ప్రచారంతో ఒకే రకానికి ఎగబడటం వల్ల ఈ పరిస్థితి నెలకొంటోంది. జిల్లాలో గత ఖరీఫ్‌లో 4 లక్షలకుపైగా బీటీ విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో కావేరి, నూజివీడు, అజిత్, మార్వెల్ తదితర 35 కంపెనీల నుంచి సుమారు 3.5 లక్షలకు పైగా విత్తన ప్యాకెట్లు విడుదలైతే ఓ ప్రధాన కంపెనీ మాత్రం కేవలం 15 వేల ప్యాకెట్లను మాత్రమే మార్కెట్లోకి విడుదల చేసింది. ఫలితంగా రైతులు ఆ కంపెనీ విత్తనాల కోసం ఎగబడ్డారు. సాధారణంగా రూ.930కి విక్రయించాల్సిన విత్తన ప్యాకెట్ కొరత కారణంగా వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తెరతీశారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.3 వేలకుపైగా విక్రయించి లక్షలు దండుకున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మ, వ్యవసాయశాఖ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ రకాల విత్తనాలను వేసిన పత్తి క్షేత్రాలపై అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే మెదక్ జిల్లాలో గజ్వేల్ మండలం రిమ్మనగూడలో పలువురు రైతుల భూముల్లో నాలుగైదు రకాలకు చెందిన విత్తనాలను సాగు చేయించి అన్నీ ఒకే రకమైన ఫలితాలనిస్తాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఈ ప్రయోగ ఫలి తాలను కరపత్రాల ద్వారా 2013 మే నెలలో నిర్వహించిన రైతు చైతన్య సదస్సుల్లో రైతులకు సమర్థంగా వివరించగలిగారు. మారుతున్న రైతుల ఆలోచనాసరళి.. జిల్లాలో ఈసారి 1.30 లక్షల హెక్టార్లకుపైగా పత్తి సాగయ్యే అవకాశమున్నదని వ్యవసాయశాఖ ఖరీఫ్ ఆరంభంలో భావించింది. ఇందుకోసం 6.16 లక్షల విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. 35 రకాల కంపెనీలకు విక్రయాలకు సంబంధించి వ్యవసాయశాఖ అనుమతినిచ్చారు. ప్రతి ఏటా సమస్యగా మారే ఓ ప్రధాన కంపెనీ విత్తనాలు జిల్లాకు ఈసారి 38,799 ప్యాకెట్లు కేటాయిం చారు. స్టాకు కొరత లేదు. మూడేళ్లుగా ఈ ప్యాకెట్లను రెట్టింపు, ఆపైన ధరలకు విక్రయించేవారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. ఈ కంపెనీకి చెందిన మూడు రకాల ప్యాకెట్లలో ఒక రకాన్ని రూ.930కు, మరో రెం డు రకాల ప్యాకెట్లను ఎమ్మార్పీ కంటే రూ.50 తక్కువగా విక్రయించారు. రైతుల ఆలోచనా విధానంలో మార్పు రావడంతో కోట్ల రూపాయల బ్లాక్ మార్కెట్‌కు తెరపడింది. ఈసారి కూడా ప్రయోగానికి శ్రీకారం.... బీటీ పత్తి విత్తనాలన్నీ ఒకే రకమైన ఫలితాలనిస్తాయనే విషయాన్ని మరోసారి చాటి చెప్పడానికి ఆత్మ, వ్యవసాయ శాఖలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే గజ్వేల్, స దాశివపేట, దుబ్బాక మండలాల్లో ఒక్కో రైతు కు చెందిన అయిదెకరాల పొలాన్ని ఎం పిక చేసి వాటిల్లో అయిదు రకాల కంపెనీలకు చెం దిన విత్తనాలను సాగు చేయించారు. గజ్వేల్ మండలం రిమ్మనగూడలోని కామేపల్లి హరిబాబుకు చెందిన అయిదెకరాల చేనులో పారస్ కంపెనీకి చెందిన బ్రహ్మ, మైకో కంపెనీకి చెం దిన కనక్, లక్ష్మీ కంపెనీకి చెందిన నక్ష, కావేరికి చెందిన జాదు, ప్రభాస్‌కు చెందిన మార్వెల్ రకాలను ఒక్కో రకాన్ని ఒక్కో ఎకరా చొప్పున సాగు చేశారు. వీటి ప్రయోగ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.