దేశవ్యాప్తంగా బీటీ పత్తి రైతులు గులాబీ రంగు పురుగు, ఇతర చీడపీడల బెడదతో తల్లడిల్లుతున్నారు. బీటీ పత్తి పురుగుమందుల వాడకాన్ని, పెట్టుబడులను తగ్గిస్తుందని ఆశించారు. అనుకున్నదొకటి. అయ్యిందొకటి. కరువు కాటకాలు, చీడపీడల ధాటికి బీటీ పత్తి విఫలం కావటంతో రైతులు అప్పులపాలై, ఆత్మహత్యల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో కలుపు మందులను తట్టుకుంటుందన్న నెపంతో, మరో జన్యుమార్పిడి పత్తి రకం లక్షలాది హెక్టార్లలోకి అక్రమంగా చొరబడింది. ఆలస్యంగా కళ్లు తెరచిన కేంద్ర ప్రభుత్వం జీవవైవిధ్యాన్ని హరించే ఈ విత్తనాలను సహించవద్దని రాష్ట్రాలకు సూచించింది..
♦ అమెరికన్ హైబ్రిడ్‌లు/ జన్యుమార్పిడి పత్తి విత్తనాలపైనే గత కొన్నేళ్లుగా మన రైతులు ఆధారపడుతున్నారు. సంక్షోభంలోకి నెట్టిన వీటిని వదిలేయాల్సిన సమయం వచ్చిందా?
♦ మరుగున పడిన దేశీ పత్తి రకాలే ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. చీడపీడల బెడద లేని, కరువు కాటకాలను దీటుగా తట్టుకొనే దేశీ పత్తి రకాలను తిరిగి నెత్తికెత్తుకోవటమే.. మన రైతులకు ఆర్థికపరంగా, మన భూములకు పర్యావరణపరంగా శ్రేయస్కరమా?
♦ ఇంతకీ ప్రస్తుతం దేశీ పత్తి సాగు చేస్తున్న రైతులు సంతోషంగానే ఉన్నారా? ఖాదీ వస్త్రాలకు ప్రజాదరణ ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నంలో భాగమే ఈ కథనం. దేశీ పత్తి రైతులను, పరిరక్షకులను ప్రపంచ సేంద్రియ మహాసభలో ‘సాగుబడి’ ఇటీవల పలుకరించింది..
పత్తి సాగుకు, ఖాదీ వస్త్రాల ఉత్పతికి భారతీయ ఉపఖండం అనాదిగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. పత్తి ‘గాస్సిపియం’ కుటుంబానికి చెందినది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 పత్తి జాతులుండగా, జి.అర్బోరియం, జి.హెర్బాసియం, జి.హిర్సుటమ్, జి.బార్బడెన్స్ అనే 4 జాతులు మాత్రమే సాగులో ఉన్నాయి. ఇందులో జి.అర్బోరియం, జి.హెర్బాసియం భారతీయ లేదా దేశీ పత్తి జాతులు(మిగతావి అమెరికన్ జాతులు). ఇవి సన్నని పొట్టి పింజ రకాలు. భారతీయ చేనేత కళాకారులు నేసిన మేలైన వస్త్రాలు పూర్వం ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేవి.
అమెరికన్ పత్తి దురాక్రమణ..
పత్తిని శుద్ధి చేసి నూలును తయారు చేయటం, చేనేత మగ్గాలపై బట్ట నేసే సాంకేతిక కళా నైపుణ్యంలో భారతీయులకు మరెవరూ సాటి రారు. ఆంగ్లేయులకు బొత్తిగా తెలియని కళ ఇది. భారతీయ చేనేత వస్త్రాలను 1721వ సంవత్సరంలో బ్రిటిష్ పాలకులు నిషేధించారు. అయినా 1820వ సం. వరకూ ఎగుమతులు కొనసాగాయి. మాంచెస్టర్ తదితర ప్రాంతాల్లో 18వ శతాబ్దం తొలి నాళ్ల నుంచి స్పిన్నింగ్ మిల్లులు నిర్మించటం ప్రారంభమైంది. స్పిన్నింగ్ యంత్రాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకొని బ్రిటన్‌లో స్పిన్నింగ్ మిల్లులను నెలకొల్పారు. అమెరికన్ పత్తి రకాలు.. పొడుగు పింజతో కూడిన పత్తినిస్తాయి. కాబట్టి, ఆ పొడుగు పింజ పత్తితో నూలు తయారు చేయడానికి అనుగుణంగా రూపొందించిన యంత్రాలవి.
అయితే, యుద్ధం కారణంగా అమెరికా నుంచి పత్తి దిగుమతులు దెబ్బతినటంతో బ్రిటిష్ పాలకుల దృష్టి భారత్‌పై పడింది. జి.హిర్సుటమ్ జాతికి చెందిన అమెరికన్ పత్తి విత్తనాలను భారతీయ రైతులకు ఇచ్చి సాగు చేయించటం ప్రారంభించింది. క్రమంగా దేశమంతటా అమెరికన్ పత్తి రకాల సాగు విస్తరించింది. ఇక్కడి నుంచి పత్తిని తీసుకెళ్లి బ్రిటన్‌లో తయారు చేసిన వస్త్రాలను.. ఇక్కడికి తెప్పించి అమ్మేవారు. అందువల్లే స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీ విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపు ఇవ్వాల్సి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతీయ ప్రభుత్వాలు కూడా దేశీ పత్తి రకాలు కొరగానివని భావించి, అమెరికన్ పత్తి రకాలను ప్రోత్సహించాయి. పొడుగు పింజ కలిగి ఉండే అమెరికన్ పత్తికి తగిన మిల్లులను ఏర్పాటు చేయించాయి. దీంతో దేశీ పత్తి విత్తనాలు కనుమరుగయ్యాయి.
కొండపత్తి, పలమనేరు, జయధర్..
మన దేశంలోని వివిధ వ్యవసాయక వాతావరణ ప్రాంతాలకు అనువైన అనేక దేశీ పత్తి రకాలు పూర్వం నుంచే, ముఖ్యంగా వర్షాధారంగా, సాగులో ఉన్నాయి. బీటీ పత్తి నేపథ్యంలో వీటి సాగు విస్తీర్ణం 2%కి తగ్గింది. కొన్ని సంస్థలు, కొందరు రైతులు సాగు చేస్తూ, సంరక్షిస్తుండబట్టి దేశీ పత్తి రకాలు అక్కడక్కడయినా పొలాల్లో కనిపిస్తున్నాయి. దేశీ పత్తి రకాలు మన మెట్ట భూములకు బాగా అనువైనవని తెలిసినప్పటికీ ప్రభుత్వ రంగంలో పరిశోధనలకు విధానపరమైన ప్రోత్సాహం కరువైంది.
బీటీ పత్తితో కల చెదిరిన చాలా మంది రైతులు ఇప్పుడు దేశీ పత్తి రకాల వైపు మళ్లే అవకాశాలున్నాయని భారత్ బీజ్ స్వరాజ్ మంచ్‌కు చెందిన దేశీ పత్తి పునరుజ్జీవనోద్యమకారులు ఆశిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ‘సహజ సమృద్ధ’, చెన్నైకి చెందిన ‘తుల’, మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన గ్రామ సేవా మండల్ (ఆచార్య వినోబా భావే దీన్ని నెలకొల్పారు) వంటి స్వచ్ఛంద సంస్థలు సుమారు ఎనిమిది దేశీ పత్తి రకాలను రైతులతో ఇప్పటికీ సాగు చేయిస్తూ, సంరక్షిస్తున్నాయి. వీటిలో ‘కొండపత్తి’ కూడా ఒకటి.
ఈ పత్తితోనే శ్రీకాకుళం జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పొందూరు ఖద్దరు వస్త్రాలను నేస్తున్నారు. దూది నుంచి వస్త్రం తయారు చేసే వరకు ఏ దశలోనూ యంత్రాలు వాడకుండా వృత్తి కళాకారులే అన్ని పనులూ తరతరాలుగా నైపుణ్యంతో కొనసాగిస్తుండటం విశేషం. చిత్తూరు జిల్లాలో పుట్టిన ‘పలమనేరు’ రకం మహారాష్ట్రలో సాగులో ఉంది. జయధర్ పత్తిని కర్ణాటకలో సహజ సమృద్ధ సంస్థ సాగు చేయిస్తున్నది. తమిళనాడులో కరువు పీడిత ప్రాంతాల్లో కరుంగన్ని పత్తిని ‘తుల’ సాగు చేయిస్తున్నది. ప్రభుత్వం దేశీ పత్తి రకాలపై దృష్టి సారిస్తే పునర్‌వైభవం తేవచ్చు. రైతుకు భరోసాగా నిలవొచ్చు.
దేశీ పత్తిని పునరుద్ధరించక తప్పదు!
విషతుల్యమైన బీటీ కాటన్ విఫలమైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ గులాబీ పురుగు పంటను తినేస్తోంది. రైతుల ఆత్మహత్యల్లో 85% దీనివల్లే. కలుపుమందులను తట్టుకునే(హెర్బిసైడ్ టాలరెంట్–హెచ్.టి.) జన్యుమార్పిడి పత్తి మరింత ప్రమాదకరం(దీన్నే బీటీ–3 అని, గ్లైసెల్ పత్తి అని పిలుస్తున్నారు). దీని వల్లే అమెరికాలో ‘సూపర్ వీడ్స్’ కొరకరాని కొయ్యలుగా తయారయ్యాయి.
మన పత్తి ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతున్నా, ప్రభుత్వం ఇప్పటికీ తోసిపుచ్చుతూనే ఉంది. దేశీ పత్తి రకాలు వాతావరణ మార్పులను, చీడపీడలను తట్టుకుంటాయి. సాగు నీరు అక్కర్లేదు. ఇప్పుడున్న మిల్లులకు దేశీ పత్తి సరిపడదు. కానీ, గాంధీ మార్గంలో ఖాదీ వస్రాల తయారీకి బాగా ఉపయోగపడుతుంది. విదర్భలో సేంద్రియ దేశీ పత్తి సాగులో మేం రైతులకు శిక్షణ ఇచ్చాం. విత్తనాలిచ్చి సాగుచేయిస్తున్నాం. ఆ పత్తిని కొని అన్ని పనులూ చేతులతోనే చేయించి ఖాదీ వస్త్రాన్ని తయారు చేస్తున్నాం. ప్రభుత్వం ఎందుకు చేయకూడదు? – డా. వందనా శివ, నవధాన్య, డెహ్రాడూన్
దేశీ రకాలతోనే పత్తికి పూర్వవైభవం!
భారత్‌లో పత్తి పంట భవిష్యత్తంతా మనవైన దేశీ (ఆసియా) పత్తి వంగడాలకు మళ్లీ పూర్వవైభవం తేవటంలోనే ఉందని నా ప్రగాఢ విశ్వాసం. వినగానే సాధ్యమేనా అనిపిస్తుంది కానీ, లోతుగా ఆలోచిస్తే భవిష్యత్తు దేశీపత్తిదేనని అర్థమవుతుంది. స్వాతంత్య్రం వచ్చే నాటికి పత్తి విస్తీర్ణంలో 97.5% దేశీ రకాలే సాగులో ఉన్నాయి. బీటీ పత్తి ధాటికి ఇది 2%కి తగ్గింది. దేశీ పత్తి రకాలు చౌడు నేలలు, పెద్దగా సారం లేని తేలిక నేలలు, ఎడారి, చలకా నేలల్లో గడ్డు పరిస్థితులను తట్టుకుంటాయి కాబట్టే భారతీయ రైతులు పూర్వకాలం నుంచీ వీటిని ఇష్టంగా సాగు చేశారు. అమెరికన్ పత్తి జాతుల్లో ఏ ఒక్కటి కూడా ఇటువంటి నేలల్లో పెరగలేవు.
కాయతొలిచే గులాబీ పురుగుతో సహా ఏ రకమైన పురుగులనైనా, తెగుళ్లనైనా దేశీ రకాలు తట్టుకుంటాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండానే స్థిరంగా మంచి దిగుబడులు ఇవ్వగలవు. బీటీ పత్తి హైబ్రిడ్లను అస్థిరమైన రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయటం వల్ల చీడపీడల బెడదతో ఖర్చు భారం అంతకంతకూ పెరిగిపోతున్నది. రైతుల నికరాదాయం బాగా తగ్గి, సంక్షోభంలోకి కూరుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా 60% పత్తి సాగు నీటివసతి లేని మెట్ట పొలాల్లోనే జరుగుతున్నది. సుస్థిర వ్యవసాయ పద్ధతుల్లో తక్కువ ఖర్చుతోనే దేశీ పత్తి రకాల సాగుతో స్థిరమైన దిగుబడులు పొందవచ్చు.
అయినా, భారత్‌లో దేశీ పత్తి పరిశోధనలపై తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతుండటం దురదృష్టకరం. కానీ, అమెరికన్ హైబ్రిడ్ల కన్నా మెరుగైన రెండు దేశీ వంగడాలను నాందేడ్ ఎం.ఎ.యు. పర్బని శాస్త్రవేత్తలు ఇటీవల రూపొందించటం విశేషం. తగిన ప్రభుత్వ విధానాన్ని రూపొందించుకోవాలి. ఇప్పటికైనా మేలుకుంటే దేశీ పత్తికి బంగారు భవిష్యత్తు తథ్యం. భారత్‌లో పర్యటించిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. – డా. కేశవ్ క్రాంతి, పూర్వ సంచాలకులు, కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ, నాగపూర్, అధిపతి, సాంకేతిక సమాచార విభాగం, అంతర్జాతీయ పత్తి సలహా సంఘం, వాషింగ్టన్, అమెరికా Tel +1-202-292-1687 (Direct), 1-202-463-6660 x122 (Main), Fax +1-202-463-6950, http://www.icac.org
ఎప్పుడేమౌతుందోనన్న భయం లేదు..!
నాకు 16 ఎకరాల నల్లరేగడి పొలం ఉంది. 35 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. పూర్వం నుంచి జయధర్ దేశీ పత్తిని సాగుచేసేవాడిని. జయధర్ పత్తి సాగు విస్తీర్ణం తగ్గి కొనేవాళ్లు లేక.. నాలుగేళ్లు బీటీ పత్తి పండించా. బీటీ పత్తి సాగు చాలా ఖర్చుతో కూడినది మాత్రమే కాదు, మహా యాతనతో కూడిన పని. బీటీ వేశామంటే రసాయనిక ఎరువులు కచ్చితంగా వేయాల్సిందే. పురుగుల బెడద చాలా ఎక్కువ. పంట ప్రతి దశలోనూ విసుగు–విరామం లేకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక పురుగుమందు చల్లుతూ ఉండాల్సిందే. రైతును ప్రశాంతంగా ఉండనివ్వదు. ఎప్పుడు ఏం ముంచుకొస్తుందోనని భయంతో గడపాల్సి ఉంటుంది.. జయధర్ పత్తి అలాకాదు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు అక్కర్లేదు.
ఎటువంటి చీడపీడలూ రావు. నిశ్చింతగా సాగు చేయొచ్చు. ఎకరానికి ఏడాదికి రెండు బండ్ల పశువుల ఎరువు వేస్తే చాలు. పనులన్నీ మా కుటుంబ సభ్యులమే చేసుకుంటాం. జయధర్ పత్తి సాళ్ల మధ్య అడుగున్నర దూరం ఉంచుతాం. మధ్యలో ధనియాలు, శనగ అంతరపంటలుగా పండిస్తున్నాను. ఎకరానికి 2.5 క్వింటాళ్ల జయధర్ పత్తి, క్వింటా శనగలు, క్వింటా ధనియాలు పండుతాయి. ధనియాల పంటకు మాత్రమే 3 దఫాలు పంచగవ్య, అవసరాన్ని బట్టి పంచపత్ర కషాయం పిచికారీ చేస్తా. అంతే. పత్తిపైన చల్లేదేమీ లేదు. రూ. 40 వేల వరకు నికరాదాయం వస్తుంది. మా వూళ్లో మరెవరూ వేయకపోయినా జయధర్ పత్తిని నేను వేస్తున్నాను. క్వింటా పత్తిని రూ. 5 వేలకు సహజ సమృద్ధ వాళ్లు కొంటున్నారు.
– కాట్రహెళ్లి కల్లప్ప(097391 91437) ఉత్తంగి(హూవినహడగలి), బళ్లారి తాలూకా, కర్ణాటక
సేంద్రియ దేశీ పత్తి నుంచి ఖాదీ దుస్తుల వరకు..!
ఆచార్య వినోబా భావే 1930లో స్థాపించిన సంస్థ మా ‘గ్రామ్ సేవా మండల్’. గత 30 ఏళ్లుగా దేశీ పత్తి రకాలను రైతులతో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయిస్తూ పరిరక్షిస్తున్నాం. వారి నుంచి పత్తిని మార్కెట్ ధరకన్నా 20% అధికంగా చెల్లించి కొనుగోలు చేస్తాం. చరఖాతో సుమారు వెయ్యి మంది మహిళలు దేశీ పత్తి నుంచి నూలును తయారు చేస్తారు. వెయ్యి మీటర్ల దారాని(గుండి)కి రూ. 4.50 చొప్పున చెల్లిస్తాం. ఆ నూలుతో అన్ని వయసుల వారికీ ఉపయోగపడే ఖాదీ వస్త్రాలను తయారు చేసి.. మాకున్న 3 దుకాణాల ద్వారా విక్రయిస్తున్నాం.
సేంద్రియ సాగులో వర్షాధారంగా ఎర్రభూమిలో ఎకరానికి రెండు క్వింటాళ్లు, నల్లరేగడి భూముల్లో 3–4 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తున్నది. క్వింటాలుకు ఈ ఏడాది రూ. 6 వేలకు కొనుగోలు చేస్తున్నాం. అనుమోలు, ఏకే7, వైధవి అనే సహజ బ్రౌన్ కాటన్ (సీఐసీఆర్), శుభ్ర, కొమోలి అనే సర్జికల్ కాటన్ దేశీ రకాలను ప్రస్తుతం వంద మంది రైతులతో సాగు చేయిస్తున్నాం. మా దగ్గర చిత్తూరు జిల్లాకు చెందిన ‘పలమనేరు’ పత్తి రకం కూడా ఉంది. పొడుగు పింజ, పెద్ద గింజ రకం ఇది. గోంగూర, మొక్కజొన్న, అలసంద, బంతి వంటి పంటలను పత్తిలో అంతర/ఎర పంటలుగా సాగు చేయిస్తున్నాం. పప్పుధాన్య పంటలతో పంట మార్పిడి తప్పనిసరిగా పాటిస్తే పత్తి సాగులో సమస్యలు ఉండవు. గ్రామస్వరాజ్యం సాధన కృషిలో భాగంగా సేంద్రియ పత్తి నుంచి ఖాదీ వస్త్రాలు, సేంద్రియ గానుగ నూనెల ఉత్పత్తిపై కూడా శిక్షణ కూడా ఇస్తాం.
– వసంత్ ఫుటానె (094229 58767), గ్రామ్ సేవా మండల్, గోపురి, వార్థా, మహారాష్ట్ర www.gramsewamandal.org/
‘పలమనేరు’ రకం దేశీ పత్తి సాగు చేస్తున్నా!
నేను స్వతహాగా చార్టర్డ్ ఎకౌంటెంట్‌ని. గత ఐదేళ్లుగా ఆ పని మానేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. తమిళనాడు వ్యవసాయ వర్సిటీ వెబ్‌సైట్‌లో చెప్పిన పద్ధతులను తొలుత అవలంబించా. తర్వాత సుభాష్ పాలేకర్ పద్ధతిని అనుసరిస్తున్నా. మాకు 19 ఎకరాల పొలం ఉంది. పలమనేరు రకం దేశీ పత్తిని ఒక ఎకరంలో, అనుమోల్ దేశీ పత్తి(అంతరపంటలుగా గోంగూర, కంది) మరో ఎకరంలో ఈ ఏడాదే సాగు చేస్తున్నా.
సజ్జ, రాగులు, మిర్చి, అల్లం, ఉల్లి, కంది, పెసర, మొక్కజొన్న, జొన్న, కూరగాయలు సాగు చేస్తున్నా. 1.5 ఎకరంలో సీతాఫలం, మూడెకరాల్లో ఆరెంజ్ తోటలను సాగు చేస్తున్నా. వంట గదిలో అవసరమైన వాటిలో 80% పంటలను పండిస్తున్నా. మాకు చిన్న దాల్ మిల్లుంది. చిన్న ట్రాక్టర్‌ను నేనే స్వయంగా నడుపుతూ పొలం పనులు చేస్తా. అవగాహనతో కొద్ది విస్తీర్ణంలో సాగు చేస్తే దేశీ పత్తి సాగు మంచిదే. ఖాదీ వస్త్రాల తయారీకి దోహదపడటం చేయదగిన పని. సబ్సిడీలు కాదు, మంచి ధర ఇస్తే చాలు. – అశ్విని ఔరంగాబాద్‌కర్ (098905 15814), వార్ధా, మహారాష్ట్ర
మా పత్తితోనే ఖాదీ వస్త్రం నేయించా..!
మా వారు ఇంజినీరు. నేను ఐదేళ్లుగా పదెకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. గత ఏడాది ఎకె7 సూటి రకం పత్తిని ఎర్ర నేలలో సాగు చేశా. ఖర్చు రూ. 3 వేల లోపే అయ్యింది. రెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పత్తిని అమ్మలేదు. గ్రామ్ సేవా మండల్‌కు తీసుకువెళ్లి ఖాదీ వస్త్రాలను నేత నేయించుకున్నాను. ఈ సంవత్సరం శుభ్ర రకం దేశీ పత్తిని ఎకరంలో వేశా. 5 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావచ్చు. వేరుశనగ, నువ్వులు, పసుపు, కంది, బఠాణీ, గోంగూర పంటలు సాగు చేస్తున్నా.
గోంగూర కాయల రెబ్బలతో జామ్, షర్బత్, పచ్చడి తయారు చేసి తెలిసిన వాళ్లకు, చుట్టుపక్కన వాళ్లకు అమ్ముతున్నాను. గోంగూర గింజల నుంచి గానుగలో నూనె తీయించి, వంట నూనెగా వాడుతున్నాం. ఒకే పంటను కాకుండా అనేక పంటలు కలిపి సాగు చేయటం ముఖ్యం. ఒకటి పోయినా మరొకటైనా పండుతుంది. జీవామృతం, అవసరం మేరకు దశపర్ణి కషాయం వాడతాం. రసాయనాలు అసలు వాడం. ఈ రోజుల్లో ఏది పండించినా రూపం మార్చి(వాల్యూ ఎడిషన్ చేసి) అమ్మితే తప్ప వ్యవసాయం గిట్టుబాటు కాదు.
– కీర్తి మంగ్రూల్కర్(095525 56465), వార్ధా, మహారాష్ట్ర
–పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment