నిషేధం ఉన్నప్పటికీ జన్యుమార్పిడి వంగ పంట హర్యానాలో సాగులో ఉన్న విషయం కలకలం రేపింది. అనుమతి లేని కలుపు మందును తట్టుకునే బీటీ పత్తి కొన్ని లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చినట్టుగానే నిషిద్ధ జన్యుమార్పిడి వంగ పంట కూడా పొలాల్లోకి వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్ల క్రితం బీటీ వంగ రకాన్ని ప్రైవేటు కంపెనీ తయారు చేసినప్పుడు దేశవ్యాప్తంగా అప్పటి పర్యావరణ మంత్రి జయరామ్ రమేశ్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే.. వ్యతిరేకత వెల్లువెత్తింది. అంతటితో బీటీ వంగపై కేంద్రం నిషేధం విధించింది. పదేళ్ల తర్వాత ఈ వంగడం రైతు పొలంలో కనిపించడం ఏమాత్రం సమర్థనీయంగా లేదు. కాయతొలిచే పురుగును తట్టుకుంటుందని చెబుతున్న బీటీ వంగను ఫతేబాద్‌లో ఒక రైతు సాగు చేస్తున్నట్టు వెల్లడైంది. బస్టాండ్ల దగ్గరల్లో విత్తనాల దుకాణాల్లో విత్తనం కొన్నట్లు ఆ రైతు చెబుతున్నారు.
మన దేశంలో నిషేధించిన మూడేళ్ల తర్వాత 2013లో బంగ్లాదేశ్ ప్రభుత్వం బీటీ వంగ సాగును అనుమతించింది. మొదట్లో కొన్నాళ్లు కాయతొలిచే పురుగును తట్టుకున్న బీటీ వంగ, ఆ తర్వాత తట్టుకోలేకపోతున్నదని సమాచారం. అక్రమ పద్ధతుల్లో బీటీ వంగ వంగడాన్ని రైతులకు అందిస్తుండడంపై జన్యుమార్పిడి వ్యతిరేక వర్గాలు మండిపడుతున్నాయి. ‘మనకు 3,000కు పైగా వంగ రకాలు ఉన్నాయి. బీటీ వంగ పండించడం మొదలు పెడితే ఈ సంప్రదాయ వంగడాలన్నీ జన్యుకాలుష్యానికి గురవుతాయి. వంగ పంటలో జీవవైవిధ్యం అడుగంటిపోతుంది. పత్తిలో జరిగింది ఇదే..’ అని కోలిషన్ ఫర్ ఎ జీఎం ఫ్రీ సంస్థ ప్రతినిధి శ్రీధర్ రాధాకృష్ణన్ అన్నారు. అధికారులు బీటీ వంగ సాగవుతున్న పొలాల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలి. నిషిద్ధ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనిపెట్టాలి. జన్యుమార్పిడి బీటీ పత్తి మొక్కలను ధ్వంసం చెయ్యాలి. నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించడంతోపాటు నిషిద్ధ విత్తనాలు రైతులకు అంటగడుతున్న కంపెనీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
‘ఎందరు రైతులు సాగు చేస్తున్నారో..’
ఫతేబాద్‌లో రైతు సాగు చేస్తున్న వంగ తోట నుంచి నమూనాలను సేకరించి న్యూఢిల్లీలోని జాతీయ మొక్కల జన్యువనరుల బ్యూరో(ఎన్.బి.పి.జి.ఆర్.)కు పరీక్షల నిమిత్తం పంపామని, పది రోజుల్లో ఫలితం వెలువడుతుందని హర్యానా ఉద్యాన శాఖ డైరెక్టర్ జనరల్ అర్జున్ సింగ్ శైని తెలిపారు. ‘ఇది బీటీ వంగే అని తేలితే దాన్ని అరికట్టడానికి చాలా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ పొలంలో పంటను ధ్వంసం చేయాలి. ఆ విత్తనాలు రైతు చేతికి ఎవరెవరి చేతులు మారి వచ్చాయన్నది నిగ్గుతేల్చాల్సి ఉంటుంది. బీటీ వంగ అక్రమంగా సాగవుతుండడమే నిజమైతే దేశంలో ఇంకా ఎంత మంది రైతుల దగ్గరకు ఈ విత్తనాలు చేరాయో కనిపెట్టాల్సి ఉంటుంది’ అని శైని అన్నారు.
బీటీ వంగ, నాన్ బీటీ వంగ
జన్యుమార్పిడి వంగ అక్రమ సాగుతో కలకలం
Published Tue, May 7 2019 5:37 AM | Last Updated on Tue, May 7 2019 5:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment