
ఇంటిని పచ్చని పంటలు, మొక్కలతో నందన వనంగా మార్చిన విశ్రాంత ప్రధానోపాధ్యాయిని ఆహారమే ఆరోగ్యం అనే సూత్రాన్ని నమ్మి.. ఇంటినే ఆరోగ్యదాయక పంటలు, మొక్కలతో నందన వనంగా మార్చారు మచిలీపట్నానికి చెందిన ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుని. ఆమే ఎండీ ముంతాజ్‌బేగం.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హైనీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయునిగా 2019లో ముంతాజ్‌బేగం ఉద్యోగ విరమణ చేశారు. సేంద్రియ ఇంటిపంటల సాగు ద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి దోహదం చేస్తుందని ఆమె ఆచరణాత్మకంగా చాటి చెబుతున్నారు. తాను మొదట ఆచరించి, తర్వాత ఇతరులకు చెప్పాలన్నా వ్యక్తిత్వం ఆమెది.
ఇంటి నుంచి వచ్చే చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తూ మొక్కలకు వేసి పెంచుతూ అధిక ఫలసాయాన్ని పొందుతున్నారు. మునగాకు, బెల్లం కలిపి నీళ్లలో నానబెట్టి మొక్కలకు పోయటం.. పొగాకును నీళ్లలో వేసి రెండు, మూడు రోజులు నానబెట్టి మొక్కల వేర్లకు వేస్తే మట్టి ద్వారా వచ్చే తెగుళ్లు నివారించవచ్చని ఆమె తెలిపారు.
పెసలు, మినుము, ఉలవలు, బార్లీ, నువ్వులు నానబెట్టి గ్రైండ్ చేసి నీళ్లలో కలిపి మొక్క వేళలో వేస్తే, మంచి దిగుబడి వస్తుందని ఆమె చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే మొక్కలకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నారు. ఆరోగ్యదాయకంగా పెంచుకున్న కూరగాయలు, పండ్లు తింటే ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి కూడా తప్పించుకోవచ్చని ఆమె ఘంటాపధంగా చెబుతున్నారు. సేంద్రియ ఇంటిపంటలు ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.
మానసిక, శారీరక ఆరోగ్యం
ముంతాజ్ ఇంటి ఆవరణలో, మిద్దెపై ఎన్నో రకాల కూరగాయలు, పండ్ల మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుతూ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవటంతో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. మొక్కలను సంరక్షిస్తే మానసిక, శారీరక ఆరోగ్యం పొందవచ్చునని ఆమె చెబుతున్నారు.
మామిడి, జామ, అరటి, డ్రాగన్, చెర్రీ, వాటర్ యాపిల్, నేరేడు, అంజూర, ఫ్యాషనఫ్రూట్, పీ నట్ బటర్, బొప్పాయి పండ్ల మొక్కలతో పాటు ΄పాలకూర, చుక్కకూర, ఆకుకూరల మొక్కలతోపాటు వంగ, టమాట, అలసంద, మునగ, అరటి, మల్బరీ ఆకులతోపాటు వంద రకాల క్రోటస్‌ను ఆమె తమ ఇంటి ఆవరణలో, మేడపైన పెంచుతున్నారు.
మొక్కలే ప్రాణం.. ఇంటిపంటల ధ్యానం!
మొక్కలే ప్రాణంగా ప్రతి రోజు నా దినచర్య ఉంటుంది. రోజు మూడు, మూడున్నర గంటలు వీటి సంరక్షణ కోసం వెచ్చిస్తుంటాను. మొక్కలను సంరక్షిస్తే సమాజం ఆరోగ్యం బాగుంటుందని, భవిష్యత్తు మన చేతిలోనే ఉందనేది అందరికీ తెలియజేయాలనేదే నా తపన. ముఖ్యంగా కూరగాయలు, పండ్ల తొక్కలు, ఇతర సేంద్రియ చెత్తను మునిసి΄ాలిటీ వారికి ఇవ్వకుండా, ఇంటిపట్టునే కం΄ోస్టు ఎరువుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. నర్సరీ నుంచే పిల్లలకు మొక్కలను పెంచటంపై అవగాహన కల్పిస్తే మంచి భవిష్యత్తు సమాజాన్ని సృష్టించుకోవచ్చు.
– ఎండీ ముంతాజ్ బేగం, ఇంటి పంటల సాగుదారు, విశ్రాంత ప్రధానోపాధ్యాయిని, మచిలీపట్నం
– అంబటి శేషుబాబు, సాక్షి, చిలకలపూడి (మచిలీపట్నం).
(చదవండి: ఎదురు లేని వెదురు)
Comments
Please login to add a commentAdd a comment