మెక్సికో దేశవాళీ మొక్కజొన్న పొత్తులు, తీపి ద్రవాన్ని స్రవిస్తున్న మొక్కజొన్న ‘ఏరియల్ వేర్లు’
పరస్పర ఆధారితంగా జీవించడమే ప్రకృతిలో అత్యద్భుతమైన సంగతి. సూక్ష్మజీవులు, మొక్కలు ఇచ్చి పుచ్చుకోవటం ద్వారా సజావుగా జీవనం సాగించడం విశేషం. మెక్సికో దేశంలో సియెర్ర మిక్సె అనే ఒక దేశవాళీ మొక్కజొన్న రకం.. తన పెరుగుదలకు అవసరమైన నత్రజనిని.. మేలుచేసే సూక్ష్మజీవరాశి ద్వారా సమకూర్చుకుంటూ.. సమస్యాత్మక నేలల్లోనూ నిక్షేపంగా చక్కని దిగుబడినిస్తోందని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. మొక్కజొన్న మొక్క కాండం కణుపుల వద్ద వేర్లు(ఏరియల్ రూట్స్) వంటివి పెరుగుతూ ఉంటాయి. కొన్ని మొక్కజొన్న జాతుల్లో బయట ఉండే ఈ వేర్లు పొడుగ్గా పెరిగి, భూమిలోకి చొచ్చుకెళ్తాయి కూడా. మొక్క పడిపోకుండా ఉండటానికి, నీటి తేమను అదనంగా గ్రహించడానికి ఇవి ఉపయోగపడుతుంటాయి.
అయితే, తాజా పరిశోధనలో తేలిందేమంటే.. మెక్సికోలోని ఓక్సక దగ్గర ఒక ప్రాంతంలో నత్రజని లోపించిన నేలల్లో దేశవాళీ రకం మొక్కజొన్న మొక్కలు రసాయనిక ఎరువులు పెద్దగా వాడకపోయినా లేదా అసలు వాడకపోయినా నిక్షేపంగా పెరుగుతూ చక్కగా దిగుబడినిస్తున్నాయి. దీనిపై కాలిఫోర్నియా యూనివర్సిటీ(డేవిస్)కు చెందిన ప్రొ. అన్ బెన్నెట్, అల్లెన్ వాన్ డెన్జ్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు సుదీర్ఘ పరిశోధన జరిపిన తర్వాత ఇటీవల నిర్ధారణకు వచ్చిందేమంటే.. సూక్ష్మజీవుల ద్వారా ఈ మొక్కజొన్న మొక్కలు నత్రజనిని అసాధారణంగా గ్రహిస్తున్నాయని!
మొక్కజొన్న మొక్కల కాండానికి ఉన్న కణుపుల దగ్గర గాలిలో తేలాడుతుండే వేర్లు(ఏరియల్ రూట్స్) ఒక రకమైన జిగురు వంటి తీపి ద్రవాన్ని స్రవిస్తుంటాయి. తద్వారా మేలు చేసే సూక్ష్మజీవరాశిని ఇవి ఆకర్షిస్తున్నాయి. మేలు చేసే సూక్ష్మజీవులు ఈ తీపి ద్రవాన్ని ఆహారంగా స్వీకరించి జీవిస్తూ.. అందుకు ప్రతిగా వాతావరణంలోని నత్రజనిని గ్రహించి మొక్కజొన్న మొక్క కణజాలానికి అందిస్తూ రుణం తీర్చుకుంటున్నాయి. 29–82% వరకు నత్రజనిని ఈ సూక్ష్మజీవులు మొక్కజొన్న మొక్కలకు అందిస్తున్నాయని తేలింది. పప్పుధాన్య పంటలు తమ వేరు వ్యవస్థలోని మేలు చేసే సూక్ష్మజీవుల ద్వారా వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తున్నాయని మనకు తెలుసు.
అయితే, ఏకదళ జాతికి చెందిన మెక్సికోకు చెందిన మొక్కజొన్న నత్రజనిని వాతావరణం నుంచి గ్రహిస్తుండటం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరచిన వాస్తవం! ప్రధాన ఆహార పంటయిన మొక్కజొన్న సాగులో శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేసిన రసాయనిక ఎరువులను ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా వాడుతున్న నేపథ్యంలో.. అసలు నత్రజని ఎరువులు వేయనవసరం లేని మొక్కజొన్న రకాలను, ఆ మాటకొస్తే జొన్న రకాలను సైతం సృష్టించడం సాధ్యపడవచ్చని ప్రొఫెసర్ బెన్నెట్, ఆయన సహచర శాస్త్రవేత్తలు ఉత్సుకతతో భావిస్తున్నారు. ‘కొన్ని దేశవాళీ మొక్కజొన్న రకాలు కొన్నిటికి వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించే శక్తి ఉన్న విషయం మాకు కొత్తేమీ కాదు. అయితే, సియెర్ర మిక్సె రకం దేశీ మొక్కజొన్నకు ఆ లక్షణం ఉంది? ఆ మొక్కకు అవసరమయ్యే నత్రజనిని సూక్ష్మజీవ రాశి ద్వారా ఎంతమేరకు వాస్తవంగా గ్రహిస్తున్నదీ నిర్ధారించుకోవడానికి, అనేక విభాగాల శాస్త్రవేత్తలు కలిసి పనిచేస్తే, మాకు పదేళ్లు పట్టింది’ అని ప్రొ. బెన్నెట్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment