Chemical fertilizers
-
మరో ‘డిజిటల్’ వ్యూహం
ఒక్కో పదం వెనుక ఒక వ్యూహం ఉంటుంది. ఆలోచన ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం ప్రకృతితో కూడిన వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయం రసాయన రహిత వ్యవసాయం. జీరో బడ్జెట్ వ్యవసాయం పెట్టుబడి ఖర్చు లేని వ్యవసాయం. హరిత విప్లవ వ్యవసాయం రసాయనాలతో, హైబ్రిడ్ విత్తనాలతో కూడిన వ్యవసాయం. పారిశ్రామిక వ్యవసాయం పరిశ్రమ స్థాయిలో ఉత్పాదకత మీద దృష్టి పెట్టే వ్యవసాయం. మరి, డిజిటల్ వ్యవసాయం అంటే ఏమిటి? సమాచారంతో కూడిన వ్యవసాయం. జ్ఞానం, విజ్ఞానం, నైపుణ్యం కాకుండా సమాచారం సేకరించి ఇచ్చే ప్రక్రియలతో కూడిన వ్యవసాయం. రైతు జ్ఞానాన్ని, నైపుణ్యాలను కాలరాసే పెట్టుబడిదారుల వ్యూహంలో డిజిటల్ వ్యవసాయం ఒక సాధనం.హరిత విప్లవం ఒక ప్యాకేజీ. హైబ్రిడ్ విత్తనాలు వేస్తే రసాయన ఎరువులు వాడాలి. రసాయన ఎరువులు వాడితే చీడపీడ, పురుగు పుట్రకు రసాయనాలు పిచికారీ చెయ్యాలి. ఇవన్నీ చేయాలంటే డబ్బు ఉండాలి. అంటే బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకోవాలి. డిజిటల్ వ్యవసాయం కూడా అలాంటి ఒక ప్యాకేజీ. బడా కంపెనీలు గుత్తాధిపత్యం సాధించడమే లక్ష్యం. రైతుల స్వావలంబనను దెబ్బ కొట్టడమే ఎజెండా. ఆహార ఉత్పత్తి పెరిగి మిగులు ఏర్పడింది అంటున్నారు. ఒక వైపు అందరికి ఆహారం దొరకని పరిస్థితులలో ఆహారం మిగిలింది అని చెప్పడంలోనే డొల్లతనం బయటపడింది. ఆహార ఉత్పత్తి ఖర్చులు పెరిగి ధర రాని పరిస్థితులలో ఒకవైపు రైతు ఉంటే, అధిక ధరలకు కొనలేని స్థితిలో సగం దేశ జనాభా ఉన్నది. రైతుల ఆదాయం పెరగాలంటే పంటలకు, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కావాలి. ప్రభుత్వం కూడా అంగీకరిస్తున్నది. గిట్టుబాటు ధర కొరకు కనీస మద్దతు ధర పెంచమంటే మాత్రం ఒప్పుకోవడం లేదు. మార్కెట్లను ప్రైవేటు పరం చేసి, పెద్ద కొనుగోలు కంపెనీలు వస్తేనే గిట్టుబాటు ధర వస్తుంది అని ప్రభుత్వం నమ్మబలుకుతున్నది. అదే నిజమైతే అమె రికాలో, ఐరోపా దేశాలలో ఆ వ్యవస్థ ఉన్నది. అయినా అక్కడి రైతులు గిట్టుబాటు ధర కోసం పోరాడుతున్నారు. ఆధునిక వ్యవసాయం ద్వారా భారతదేశం అద్భుతమైన విజ యాలు సాధించింది. దురదృష్టవశాత్తూ చిన్న, సన్నకారు రైతులు అట్టడుగున ఉన్నారు. గడిచిన దశాబ్దంలో వ్యవసాయ కుటుంబాల సగటు అప్పు ఐదు రెట్లు పెరిగింది. 1995 నుండి దాదాపు 3,00,000 కంటే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భారత వ్యవసాయంలో ఉన్న సంక్లిష్టత దృష్ట్యా, ఏ ఒక్క విధాన మార్పు లేదా సాంకేతిక మార్పుతో చిన్న రైతుల ఆదాయాన్ని పెంచడం, భారత వ్యవసాయంలో పోటీని బలోపేతం చేయడం వంటి ద్వంద్వ లక్ష్యాలు సాధ్యం కావు. కానీ డిజిటల్ వ్యవసాయమే అన్నింటికీ పరిష్కారంగా ప్రభుత్వం భావిస్తున్నది.చిన్న రైతులకు ఆదాయం పరమార్థం కనుక ఉత్పత్తి–కేంద్రీకృత మౌలిక వసతుల కల్పన నుండి మార్కెట్–కేంద్రీకృత మౌలిక సదుపా యాలకు మారడం, డిజిటల్ వ్యవసాయం ప్రధాన లక్ష్యం. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే భారతదేశంలో కూడా మొబైల్ ఫోన్ గ్రామీణ కుటుంబాల జీవితాలను మార్చింది. బిహార్‌లో గొర్రెలు అమ్ముకునే మహిళ ఫోను ఉపయోగించి వాటిని డిజిటల్ వేదికల ద్వారా అమ్ముకుంటున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలలో, తయారు చేస్తున్న విధానాలలో, పని తీరులో డేటా డిజిటల్ పద్ధతులు పాటిస్తున్నాయి. ఇదివరకు, సమాచార సేకరణలో ఏ సమాచారం అనే ప్రశ్న వచ్చేది. ఇప్పుడు సమాచారం దేనికి అనే ప్రశ్న వస్తున్నది.కేంద్ర ప్రభుత్వం, బడా పారిశ్రామిక సంస్థలు, అంతర్జాతీయ కంపెనీలు, విదేశీ పెట్టుబడిదారులు, దేశీయ టెక్ కంపెనీలు అన్నీ కలిసి డిజిటల్ టెక్నాలజీల ద్వారా తమ వ్యాపారం పెంచుకోవడం కోసం సమాచారాన్ని ఒక వ్యాపార వస్తువుగా మలిచే ప్రక్రియను డిజిటల్ వ్యవసాయంగా ప్యాకేజీ చేసి ఊదరగొడుతున్నారు. ఒకవైపు మార్కెట్లో చిన్న రైతులకు డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలు అంటూ, ఇంకొక వైపు ఉత్పత్తి దశలలో రైతుల మీద ఆధిపత్యం సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఇక్రిశాట్’ సహకారంతో బహుళ జాతి సంస్థ మైక్రోసాఫ్ట్ ‘ఏఐ’ విత్తే యాప్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా రైతులకు నాట్లకు సరైన తేదీలు, నేల సారం బట్టి ఎరువుల ఉప యోగం, వాడాల్సిన విత్తనాల సలహాలను పంపింది. నిత్యం వ్యవసాయం చేసే రైతులకు ఎప్పుడు ఏమి విత్తాలి వంటి సలహాలు ఇస్తుంది. రైతులకు తెలవదా? సలహాలు ఇవ్వాలంటే ఈ యాప్‌కు ప్రాథమిక సమాచారం కావాలి. ఆ సమాచారం ఒక ఒప్పందం ద్వార ప్రభుత్వం నుంచి ఎప్పుడో తీసుకున్నారు. ఇక ఇందులో రైతు పాత్ర ఉండదు. వాళ్ళు చెప్పింది చేయడమే!ఈ యాప్ కొనసాగాలంటే ఆ సలహాలు కొనేవాడు కావాలి. చిన్న రైతు కొంటే అదనపు పెట్టుబడి ఖర్చు. చిన్న రైతు కొనలేడు, కొనడు కాబట్టి ప్రభుత్వ నిధులు వాడి తమ వ్యాపారం పెంచుకుంటారు. వీళ్ళకు ఎరువులు, విత్తనాలు, క్రిమికీటక నాశక రసాయనాల కంపెనీలతో మార్కెట్ ఒప్పందాలు ఉండే అవకాశం ఉంది. ఒక విధంగా వ్యవసాయ ఇన్పుట్ మార్కెట్లో ఇంకొక మధ్య దళారీ వ్యవస్థను పెంపొందిస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు విక్ర యించడానికి, మధ్యవర్తులను తగ్గించడానికి, వ్యాపారంలో పారదర్శ కతను పెంచడానికి ఒక ఆన్లైన్ డిజిటల్ వేదిక (ఈ–నామ్) రూపొందించడానికి భారత ప్రభుత్వం 2016 నుంచి కృషి చేస్తోంది. వ్యవ సాయ మార్కెట్లో రైతులకు, వ్యాపారులకు, కొనుగోలుదారులకు మధ్య ఆన్లైన్ ట్రేడింగ్‌ను సులభతరం చేయడానికి ఈ వేదికను తయారు చేస్తున్నారు. రైతు తన పంటకు మెరుగైన ధరను కనుగొ నడంలో ఇది సహాయపడుతుంది. అయితే, ఇది గిట్టుబాటు ధర కాదు. స్థానిక రసాయనాల దుకాణాల నుంచి అప్పు తీసుకుని పంట అమ్మే పరిస్థితి నుంచి రైతులను విముక్తులను చేసి, ఉత్తమ ధరకు పంటలను విక్రయించేందుకు ఇవి ఉపయోగపడతాయని అంటున్నారు. పబ్లిక్ రంగానికి చెందిన బ్యాంకులు అప్పులు సరళంగా ఇచ్చే వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా, ప్రైవేటు రుణ వ్యవస్థకు ఊతం ఇస్తున్నారు. ప్రైవేటు అప్పులు సులభంగా అందుకోవడానికి మాత్రమే ఈ వేదికలు ఉపయోగపడతాయి. ఏ రాయి అయితే ఏమి పండ్లు ఊడగోట్టుకోవడానికి అన్న చందంగా స్థానిక వడ్డీ వ్యాపారి నుంచి డిజిటల్ వడ్డీ వ్యాపారి చేతిలో రైతులు పడతారు. డ్రోన్ ద్వారా పంట పొలాలలో చేసే విన్యాసాలు కూడా డిజిటల్ వ్యవసాయ ప్రతిపాదనలలో భాగమే. ఎరువులు చల్లవచ్చు, విత్తనాలు చల్లవచ్చు, నాటవచ్చు, క్రిమినాశక రసాయనాలు పిచికారీ చేయ వచ్చు. పైనుంచి క్రిమికీటకాలు, కలుపు ఫోటోలు తీసి యాప్‌లో పెడితే, ఏ రసాయనం పిచికారీ చెయ్యాలి అని సలహా వస్తుంది. ఆ సలహా మేరకు ఎక్కడ పురుగు ఉందో అక్కడ దాని మీదనే రసాయనం పిచికారీ చేయవచ్చు, ఇత్యాది పనులు డ్రోన్ల ద్వారా చేసి, అధిక దిగుబడులు, అధిక ఆదాయం చిన్న, సన్నకారు రైతులు పొందుతారని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే, ఒక్కొక్క డ్రోన్ కొరకు రూ.7 నుంచి 8 లక్షల వరకు ఆయా డ్రోన్ కంపెనీలకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఈ పథకం పేరు డ్రోన్ దీదీ (డ్రోన్ అక్క). రైతు రోజుకు కేవలం రూ.27 సంపాదిస్తున్నాడని వాపోతున్న ప్రభుత్వం నేరుగా రైతుకు ఇచ్చేది కేవలం రూ.2 వేలు మాత్రమే. డ్రోన్ కంపెనీలకు లక్షల సబ్సిడీ ఇవ్వడానికి మాత్రం సంకోచించడం లేదు.భారత వ్యవసాయంలో రైతు సంక్షోభంలో ఉన్నాడని ఒప్పుకొంటున్న ప్రభుత్వం మార్పుకు ప్రతిపాదిస్తున్న, నిధులు ఇస్తున్న పథ కాలు రైతు మీద ఉత్పత్తి ఖర్చు ఇంకా పెంచే విధంగా ఉంటున్నాయి. ఖర్చుకూ, ఆదాయానికీ మధ్య వ్యత్యాసం తగ్గించే ప్రయత్నం కాకుండా రైతును వ్యవసాయం నుంచి దూరం చేసే ప్రతిపాదనలు డిజిటల్ వ్యవసాయం దార్శనిక విధానాలలో ఉన్నాయి. డిజిటల్ వ్యవసాయంలో రైతు దగ్గర సమాచారం తీసుకుని, రైతుకే సలహాలు ఇచ్చే ప్రక్రియలు అనేకం ఉన్నాయి. పాత తప్పిదాల నుంచి తప్పించుకుని, రైతులకు చూపే కొత్త ఆశలకు ప్రతి రూపం డిజిటల్ వ్యవసాయం. రసాయన ఎరువులు, జన్యుమార్పిడి విత్తనాలు, ప్రమాదకర కీటక నాశక రసాయనాల వ్యాపారం పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తున్న వాహనం డిజిటల్ వ్యవసాయం.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
'ఇండ్ గ్యాప్' సాగు బాట.. రసాయనాల్లేని పంట!
రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన పంట దిగుబడులు పండించి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇండియా గుడ్ అగ్రికల్చర్ ్రపాక్టీసెస్ (ఐ.జి.ఎ.పి.– ఇండ్ గ్యాప్) మంచి ఫలితాలనిస్తున్నాయి. అనేక మంది రైతులు గ్యాప్ పద్దతులకు అనుగుణంగా ఆహార పంటలు పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని దశల వారీగా తగ్గిస్తూ, రసాయనిక అవశేషాల్లేని నాణ్యమైన, అధిక పంట దిగుబడుల ఉత్పత్తి సాధించటం ఇండ్ గ్యాప్ పద్ధతిలో ముఖ్యమైన అంశం.తుంగభద్ర సేంద్రియ వ్యవసాయ ధాన్య విత్తన రైతుల పరస్పర సహాయ సహకార సంఘంలో సభ్యులైన రైతులు గ్యాప్ పద్ధతులను ఆచరిస్తూ ఆదర్శంగా నిలిచారు. 2023–24లో కర్నూలు జిల్లాలోని సీ.బెలగల్ మండలం కొండాపురం (రంగాపురం), గుండ్రేవుల గ్రామాల్లోని 50 మంది రైతులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. గ్యాప్ పద్ధతులనుపాటిస్తూ బీపీటీ 5204 రకం వరి పంటను సాగు చేశారు. రైతులు ఒక్కొక్కరు అరెకరం నుంచి మూడు ఎకరాల వరకు మొత్తం 24.09 హెక్టార్లలో గ్యాప్ పద్దతులకు అనుగుణంగా వరి పండించారు.గ్యాప్ నిబంధనల ప్రకారం వరి సాగు పూర్తిగా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో జరిగింది. 10–15 రోజులకోసారి డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించి రైతులకు గ్యాప్ పద్దతులపై అవగాహన కల్పించారు. కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, సి.బెలగల్ ఏవో మల్లేష్ యాదవ్, జిల్లా వనరుల కేంద్రం అధికారులు ప్రతి పొలంబడికి వెళ్లి పంటలను పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తూ వచ్చారు.కొండాపురం, గుండ్రేవుల గ్రామాల్లోని 50 మంది రైతుల్లో ప్రతి రైతు 100 శాతం గ్యాప్ పద్దతులుపాటించారు. నాట్లకు ముందు సామూహికంగా పచ్చి రొట్ట ఎరువు పంట సాగు చేసి, పూత దశలో పొలంలో కలిపి దున్నేశారు. ఎకరాకు 3–4 టన్నుల పశువుల ఎరువు వేసుకున్నారు. కొందరు రైతులు వేపచెక్క, వర్మీ కంపోస్టు కలిపి వేసుకున్నారు. పురుగుల బెడదను తగ్గించుకునేందుకు ఎకరాకు 5–6 లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా రసాయనిక వ్యవసాయం చేసే రైతులు ఈ ్రపాంతంలో ఎకరానికి 6–8 బస్తాల రసాయనిక ఎరువులు వేస్తూ ఉంటారు.గ్యాప్ పద్ధతిలో 4 బస్తాల వరకు రసాయనిక ఎరువులు, అనుమతించిన కొన్ని పురుగుమందులను తగు మోతాదులో మాత్రమే ఉపయోగిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. పంట సాగు కాలంలో ఏపీ ఆర్గానిక్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ అధికారుల బృందం మూడు దఫాలు పరిశీలించింది. వరి కోతలు పూర్తి కాగానే మూడు శ్యాంపుల్స్ సేకరించి గుంటూరులోని వ్యవసాయ శాఖ ల్యాబ్‌కు పంపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో రసాయనిక అవశేషాల ప్రభావం జీరో ఉన్నట్లు స్పష్టం కావడంతో సర్టిఫికేషన్ అథారిటీ ఈ సొసైటీ రైతులకు ఉమ్మడిగా ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్‌ను 2024 జనవరిలో జారీ చేసింది. ఆ తర్వాత రైతులు వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి బియ్యాన్ని మంచి ధరకు అమ్ముకున్నారు.దిగుబడితో పాటు ధరా ఎక్కువే!అతిగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి ధాన్యం పండించిన రైతులు బియ్యం క్వింటాలు రూ.5,500 ప్రకారం విక్రయించుకుంటే, ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్ పొందిన సహకార సంఘం రైతుల బియ్యానికి రూ.7,000 ధర లభించింది. మామూలుగా అయితే వరి సాగులో ఎకరాకు సగటున రూ. 45 వేల వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. ఇండ్ గ్యాప్ పద్ధతిలో ఖర్చు రూ.28 వేలు మాత్రమే. సగటున ఎకరాకు ధాన్యం దిగుబడి 2.51 క్వింటాళ్లు అదనంగా వచ్చింది. మొత్తం 50 మంది రైతులు 24.09 హెక్టార్లలో 102.9 టన్నుల దిగుబడి సాధించి రూ. 71 లక్షల ఆదాయం పొందారు. సాధారణ రసాయనిక వ్యవసాయ రైతులతో పోల్చితే ఇది రూ. 14.4 లక్షల అధికం కావటం విశేషం. ఈ స్ఫూర్తితో తుంగభద్ర సహకార సంఘం రైతులు ఈ ఏడాది కూడా గ్యాప్ పద్ధతిలోనే వరి సాగు కొనసాస్తున్నారు. – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్)నికరాదాయం పెరిగింది..8 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా. నేను 2.75 ఎకరాల్లో ఇండ్ గ్యాప్ పద్ధతిలో వరి సాగు చేశాను. మిగతా పొలంలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న పంటలు సాధారణ పద్ధతిలోనే పండిస్తున్నాను. సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తల సూచనలు చాలా ఏళ్లుగాపాటిస్తుండటంతో గ్యాప్ పద్ధతిని అనుసరించటం నాకు సులువైంది.వేప చెక్కను ఎక్కువగా వినియోగించడం, గో ఆధారిత పద్దతులుపాటించడం వల్ల పంట భూముల్లో సూక్ష్మ జీవులు విశేషంగా అభివృద్ది చెంది వరి పంట ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. కెమికల్స్ వాసన లేకుండా వరి పండించాను.మామూలుగా అయితే ఎకరాకు వరి సాగులో రూ.45–50 వేల వరకు పెట్టుబడి వ్యయం వస్తుంది. గ్యాప్ పద్ధతులుపాటించడం వల్ల ఎకరాకు రూ.28 వేలు చొప్పున 2.75 ఎకరాల్లో రూ. 77 వేలు ఖర్చయింది. 41 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. మిల్లింగ్ చేయగా 27 క్వింటాళ్ల బియ్యం వచ్చాయి. కర్నూలు తీసుకెళ్లి క్వింటా రూ.7,000కు అమ్మాను. క్వింటాకు రూ. వంద రవాణా ఖర్చు వచ్చింది. రూ.1.09 లక్షల నికరాదాయం వచ్చింది. మా సంఘంలోని 50 మంది రైతుల్లో క్వింటా బియ్యం రూ.7,500కి అమ్మిన వాళ్లూ కొందరు ఉన్నారు. ఈ ఏడాది కూడా గ్యాప్ పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నాం. – పి.మధుసూదన్‌రెడ్డి (94900 96333), రైతు, కొండాపురం, సీ.బెలగల్ మండలం, కర్నూలు జిల్లాఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్‌కు శ్రీకారం..ఇండ్ గ్యాప్ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులకు దేశంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. మన దేశంలో అమలయ్యే గ్యాప్ పద్ధతులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యు.సి.ఐ.) ‘ఇండ్ గ్యాప్’ సర్టిఫికేషన్‌ను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం 2023–24 ఖరీఫ్ నుంచి ఏపీ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ సంస్థ ద్వారా ఈ ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్ వ్యవస్థ రైతులకు దేశంలోనే తొలిగా అందుబాటులోకి తెచ్చింది. 2023–24లో ఏపీలోని ప్రతి జిల్లాలో పైలెట్ ్రపాజెక్టు కింద ఒక పంటను గ్యాప్ పద్ధతిలో పొలంబడిలో భాగంగా సాగు చేయించడం విశేషం.ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్న అనేక సహకార సంఘాలు, ఎఫ్.పి.సి.లు వ్యవసాయ శాఖ పొలంబడి కార్యక్రమం ద్వారా ఇండ్ గ్యాప్ పద్ధతులను అనుసరించి లబ్ధిపొందటం విశేషం. విత్తన ధృవీకరణ సంస్థ ద్వారా ఉత్పత్తులపై పరీక్షలు చేయించి రైతులకు ఈ సర్టిఫికేషన్ ఇస్తారు. తద్వారా రైతులు మంచి మార్కెట్ ధరకు విక్రయించి మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. దిగుబడులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా క్రమంగా కెమికల్ వాడకాన్ని తగ్గిస్తూ.. అదే సమయంలో సేంద్రియం వైపు మళ్లే విధంగా రైతుల్లో అవగాహన కల్పించడం గమనార్హం.ఇవి చదవండి: పిల్లల నుంచి పోషణ కోసం.. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించవచ్చా? -
సంపూర్ణ జీవితం
భట్టి విక్రమార్క కథలో, విక్రమార్కుడి బుద్ధి కుశలతను మెచ్చి, వెయ్యేళ్లు పరిపాలించే సింహాసనాన్ని బహూకరిస్తాడు ఇంద్రుడు. అంటే వెయ్యేళ్ల ఆయువు. మరి నా సంగతేమిటని విక్రమార్కుడిని అడుగుతాడు సోదరుడు భట్టి. అన్నింటికీ వెన్నంటి ఉండే భట్టి సంగతి మరిచేపోయాడు విక్రమార్కుడు. దాంతో భట్టి ఆవేశంతో కాళికాదేవి తపస్సు చేసి, రెండు వేల ఏళ్లు బతికే వరం పొందుతాడు. మరి నా సంగతేమిటని అడుగుతాడు విక్రమార్కుడు. ఇద్దరు కలిసి కదా బతకాలి! అప్పుడు ఆలోచన చేస్తారు. సింహాసనం మీద వెయ్యేళ్లు కూర్చుని కదా పాలించమన్నది... అంటే అది ఆయువు పరిమితి కాదు, రాజ్యపాలన పరిమితి. అందుకే ఆరు నెలలు రాజ్య పాలన, ఆరు నెలలు అరణ్యవాస పథకం వేస్తారు. అలా భట్టి విక్రమార్కులు ఇద్దరూ రెండు వేల ఏళ్లు బతుకుతారు. ఒక్క భట్టి విక్రమార్కులేనా? రామాయణంలో దశరథుడు వేల ఏళ్లు బతికాడు. ఎందరో మునులు, రుషులు వేల ఏళ్లు తపస్సులోనే గడిపి ఎన్నో శక్తులు సాధించిన కథలున్నాయి. ఎప్పటికీ చనిపోని వరాలు పొందిన రాక్షసులు ఎందరో మన పురాణాల్లో ఉన్నారు. ఎప్పటికీ బతికివుండేలా దేవతలు అమృతాన్ని సేవించారు. చనిపోయినవాళ్లను అట్టే మళ్లీ పునర్జీవింపజేసే సంజీవని కథలు, గాయాలన్నీ మానిపోయి దృఢకాయులయ్యే లేపనాల గాథలు మనకున్నాయి. వేల ఏళ్లు బతకడం అంటే దాదాపుగా చావు లేకపోవడమనే! జీవితానికి అంతం పలికే చావు అనేదాన్ని తప్పించే అన్ని ప్రయత్నాలనూ మనిషి కనీసం కథల్లోనైనా, కలల్లోనైనా చేశాడనుకోవచ్చు.ఎప్పటికైనా చచ్చిపోతామనే వాస్తవం మనిషిని కలవరపెడుతుంది. సమస్త మానవాళి గురించి కాకపోయినా, కనీసం తన అయినవారు తనకు కాకుండాపోతారన్న చింత ఉండటంతోపాటు తానూ ఒకరోజు ఈ భూమ్మీద శూన్యంగా మిగిలిపోతాడన్నది జీర్ణం చేసుకోలేని చేదుమాత్ర. అన్ని మతాలూ మరణానంతర జీవితాలను వాగ్దానం చేయడంలో అందుకే విజయం సాధించి ఉంటాయి. చచ్చాక ఏమీ లేదు అనుకోవడం కంటే, ఆ పైనెక్కడో మళ్లీ బతుకుతాం అనేది ఒక ఊరట. అదే సమయంలో చిట్టచివర చావు అనేది ఉంటుందని తెలియడం కొంతమందికి ఒక రిలీఫ్ కూడా. లేకపోతే ఎంతకాలం ఈ రోజువారీ సంకెళ్ల లాంటి వ్యవహారాలను లాక్కురావడం? అందుకే మన పెద్దలు మళ్లీ పుట్టుక లేని ముక్తిని కోరుకున్నారు కాబోలు.సృష్టిలోని ప్రతి జీవికీ ఒక ఆయుఃప్రమాణాన్ని నిర్దేశించిన ప్రకృతి, మనిషికి 120 ఏళ్లు ఇచ్చింది. శతమానం భవతి అని పెద్దలు దీవిస్తుంటారుగానీ, దాన్ని నూరేళ్లు అనికాక, పూర్ణాయువుతో బతకమని దీవించడంగా అర్థం చేసుకోవచ్చు. అర్ధంతరంగా మరణించడం ఆ ప్రకృతి వరాన్ని పాడుచేసుకోవడమే. అర్ధంతర మరణం ఆధునిక మానవుడికి సంభవించడానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు ఉన్నాయి. మృత్యువును, రోగాలను మోసం చేసి దీర్ఘకాలం బతగ్గలమా? మన ఆయుఃప్రమాణం కంటే చాలా ఏళ్ల పాటు బతకడాన్ని నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు సాధ్యం చేయనున్నాయా? మనిషి శాశ్వతత్వాన్ని సాధించగలడా? మన ఫిజియాలజీని మార్పు చేయడం ద్వారా జీవితకాలాన్ని పొడిగించవచ్చా? ఇలాంటి ప్రశ్నలను నోబెల్ పురస్కారం అందుకున్న వెంకీ రామకృష్ణన్ తన ‘వై వి డై: ద న్యూ సైన్స్ ఆఫ్ ఏజింగ్ అండ్ ద క్వెస్ట్ ఫర్ ఇమ్మోర్టాలిటీ’ పుస్తకంలో చర్చించారు. మనిషి శరీరం కోటానుకోట్ల కణాల నిర్మితం. ప్రతి కణంలో ఉండే డీఎన్ ఏ ప్రతిరోజూ లక్ష మార్పులకు గురవుతుంది. డీఎన్ ఏను నాలుగక్షరాల వర్ణమాలలో రాసిన సుదీర్ఘమైన కోడ్ అనుకుంటే, నెమ్మదిగా దాని కార్యకలాపంలో అంతరాయం రావడమే ముదిమి రావడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 బయోటెక్ కంపెనీలు ముదిమి, జీవితకాల పొడిగింపు మీద పని చేస్తున్నాయి. ‘యవ్వనంలో ఉన్నప్పుడు ధనికులం కావాలనుకుంటాం; ధనికులం అయ్యాక యవ్వనాన్ని కోరుకుంటాం. యవ్వనాన్ని కొనలేకపోయినా, కనీసం దానిమీద పరిశోధనలనైనా (ఏజింగ్ రీసెర్చ్) ధనికులు కొంటున్నా’రంటారు వెంకీ రామకృష్ణన్ . ఒకవేళ శాస్త్ర పరిశోధనలు ముదిమిని ఆపడంలో విజయం సాధించినా ఆ ఫలితాలు సంపన్నులకు తప్ప పేదవాళ్లకు తేలిగ్గా అందుబాటులోకి రావని చెబుతారు.ఈ శాస్త్రాలు, పరిశోధనలతో నిమిత్తం లేకుండా; ధనిక, పేద అనే తేడా లేకుండా జీవితాన్నే ఒక సాధనగా మలుచుకున్న కొన్ని ప్రాంతాల్లో మనుషులు సంపూర్ణ ఆయువును అనుభవిస్తున్నారు. ఒకినావా (జపాన్ ), సార్డీనియా (ఇటలీ), నికోయా (కోస్టా రికా), ఇకారియా (గ్రీస్), లోమ లిండా (కాలిఫోర్నియా, అమెరికా)... లాంటి ప్రదేశాల్లో ఎక్కువమంది వందేళ్లు బతకడమో, దీర్ఘకాలం బతకడమో కనబడుతుంది. ఇలాంటి ప్రదేశాలు ప్రపంచంలో ‘బ్లూ జోన్స్’గా నిలుస్తున్నాయి. ‘లివ్ టు 100: సీక్రెట్స్ ఆఫ్ ద బ్లూ జోన్స్’ డాక్యుమెంటరీ ప్రయోక్త డాన్ బ్యూట్నర్... ఈ బ్లూ జోన్స్ అని నామకరణం చేయడమే కాకుండా, వాళ్ల దీర్ఘాయువు రహస్యాలను పరిశోధించారు. శారీరక కార్యకలాపాలు, తక్కువ ఒత్తిడి, స్థానికంగా దొరికే ఆహారాన్ని వినియోగించడం, బలమైన కుటుంబ, సామాజిక సంబంధాలు వీరిని ఆరోగ్యవంతులుగా ఉంచుతున్నాయని బ్యూట్నర్ చెబుతారు. రసాయనిక ఎరువులు వేయని పంటలు, 95 శాతం మొక్క ఆధారిత ఆహారం, ఎనభై శాతం మాత్రమే తిని కడుపులో కొంత ఖాళీ ఉంచుకోవడంతోపాటు, జీవితానికి ఒక ఉద్దేశం ఉంచుకోవడం వారిని ఉత్సాహవంతులుగా ఉంచే అదనపు విషయాలు. వెంకీ రామకృష్ణన్ అయినా, బ్లూ జోన్స్ శతాధికులైనా మనిషి ఆరోగ్యానికి కీలకమని చెప్పేవి మూడు: ఆహారం, వ్యాయామం, నిద్ర. ఇవైతే మన చేతిలోనే ఉన్నాయి. -
ప్రకృతి సాగుకు ప్రాధాన్యం
రైతుల్ని నూరు శాతం ప్రకృతి సాగుబాట పట్టించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తొలి దశలో జిల్లాకు ఒక మండలాన్ని ప్రకృతి సాగులో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మండలాల్లో రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించే సన్న, చిన్నకారు రైతులను సంఘటితం చేసి వారికి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగుచేస్తే కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తారు. కావాల్సిన ఇన్పుట్స్ తయారీలో రైతులకు శిక్షణ కూడా ఇవ్వడంతోపాటు సాగులో మెళకువలు నేర్పుతూ అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తారు. దశలవారీగా మండలంలో ప్రతి ఒక్కరూ ప్రకృతి సాగు చేపట్టేలా చర్యలు తీసుకుంటారు. మార్కెటింగ్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, సైన్స్, పరివర్తన, యాజమాన్యం, సర్టీఫికేషన్, స్థానిక విలువ జోడింపు, వ్యవస్థాగత పరిశ్రమలు ఇలా అన్ని విభాగాలలో ఆ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతారు. ఆదర్శ మండలాల్లో పౌష్టికాహారం అవసరమయ్యే వారందరికీ నూటికి నూరు శాతం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ప్రతి గ్రామంలో ప్రకృతి ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం ద్వారా పౌష్టికాహార లోపంతో బాధపడే వారి ఆహారంలో వాటిని భాగమయ్యేలా చూస్తారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అధ్యయనం చేస్తారు. మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులు పండించిన ప్రకృతి ఉత్పత్తులను స్థానికంగా అమ్ముకునేలా చర్యలు తీసుకుంటారు. తొలుత గ్రామస్తులకు మంచి ఆహార ఉత్పత్తులు అందించేలా ప్రోత్సహిస్తారు. – సాక్షి, అమరావతి జిల్లాకో మండలం చొప్పున ఎంపిక 100% ప్రకృతి సాగుతో ఆదర్శ మండలంగా అభివృద్ధిఏడాది పొడవునా ఆదాయంవచ్చేలా పంటల ప్రణాళిక పాయింట్ పర్సన్లుగా సెర్ప్ఏపీఎంలు, సీసీలు రైతులే విక్రయించుకునేలా.. దళారుల పాత్ర లేకుండా రైతులే స్వయంగా పంట ఉత్పత్తులను రాష్ట్ర, జాతీయస్థాయి మార్కెట్లలో నేరుగా విక్రయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తారు. వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రైతులు పంట ఉత్పత్తుల్ని విక్రయించుకుని అదనపు ఆదాయం పొందేలా చూస్తారు. ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే పలువురు రైతులు ఏడాది పొడవునా పంటల సాగు ద్వారా ప్రతినెలా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేలా ఏటీఎం (ఎనీ టైం మనీ) తరహా మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఇదే మోడల్‌ను రాష్ట్రమంతా విస్తరించే దిశగా చర్యలు చేపట్టారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు బాధ్యతలు ఇందుకు సంబంధించిన కీలక బాధ్యతలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు ప్రభుత్వం అప్పగించింది. సెర్ప్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం), కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ సీసీలు ఈ ప్రాజెక్టులో పాయింట్ పర్సన్‌గా వ్యవహరిస్తారు. వీరి సమన్వయంతో రైతు సాధికార సంస్థ సిబ్బంది ఎంపిక చేసిన మండలాల్లో సన్న, చిన్నకారు రైతులను గుర్తించి వారిని ప్రకృతి సాగు వైపు మళ్లించేందుకు అవసరమైన చేయూత ఇస్తారు. పాయింట్ పర్సన్స్‌గా ఎంపికైన ఏపీఎం, సీసీలకు రాష్ట్ర స్థాయిలో రెండ్రోజుల శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపికైన మండలాలివీ.. ఈ ప్రాజెక్ట్ కోసం పాతపట్నం (శ్రీకాకుళం), జీఎల్ పురం (పార్వతీపురం మన్యం), వేపాడ (విజయనగరం), పద్మనాభం (విశాఖపట్నం), చీడికాడ (అనకాపల్లి), పాడేరు (అల్లూరి), ప్రత్తిపాడు (కాకినాడ), ఐ.పోలవరం (కోనసీమ), గోకవరం (తూర్పు గోదావరి), పాలకొల్లు (పశ్చిమ గోదావరి), జీలుగుమిల్లి (ఏలూరు), బాపులపాడు (కృష్ణా), రెడ్డిగూడెం (ఎన్టీఆర్ ), కొల్లిపర (గుంటూరు), బెల్లంకొండ (పల్నాడు), మార్టూరు (బాపట్ల), కొత్తపట్నం (ప్రకాశం), దగదర్తి (నెల్లూరు), రామచంద్రపురం (తిరుపతి), శాంతిపురం (చిత్తూరు), చిన్నమందెం (అన్నమయ్య), పెండ్లిమర్రి (వైఎస్సార్), మడకశిర (శ్రీ సత్యసాయి), రాప్తాడు (అనంతపురం), ఓర్వకల్లు (కర్నూలు), ప్యాపిలి (నంద్యాల) మండలాలను ఎంపిక చేశారు. ప్రకృతి సాగులో ఆదర్శం జిల్లాకో మండలాన్ని ఎంపిక చేసి ప్రకృతి సాగులో ఆదర్శంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ సిద్ధం చేశాం. సెర్ప్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నాం. తొలుత సిబ్బందికి, ఆ తర్వాత రైతులకు శిక్షణ ఇస్తాం. సాగులో అవసరమైన చేయూత అందిస్తాం. – బీవీ రామారావు, సీఈవో, రైతు సాధికార సంస్థ -
మద్దతు ధరతోనే వైవిధ్యం సాధ్యం
అవసరానికి మించి ఎరువులను వాడడం వల్ల నేలలోని పోషకాలు క్షీణిస్తున్నాయి. వృద్ధులైన వాళ్లు ప్రమాదకరమైన స్టెరాయిడ్లపై బతుకుతున్నట్లు ఉందిప్పుడు నేల పరిస్థితి. దేశంలో హరిత విప్లవం మొదలైన రాష్ట్రాల్లో రైతులు పంట మార్పిడి పద్ధతిని వదిలేశారు. ఈ పద్ధతి నేల, నీరు, ఎరువులను సమతుల పద్ధతిలో ఉపయోగించుకునేందుకు ఉద్దేశించినది. దాన్ని వదిలి, వరి లేదా గోధుమ పంటలకే పరిమితమయ్యారు. వైవిధ్యభరితమైన ఇతర పంటలను సాగు చేయకపోతే రసాయన ఎరువులు, నీటిపై మరింత ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితులు వస్తాయి. రైతులు మారాలంటే వారి పంటలకు కనీస మద్దతు ధర లభించాలి. రసాయనిక ఎరువులకు దీటుగా దిగుబడి ఇవ్వగల సమర్థమైన సహజ ఎరువుల ఉత్పత్తికి ప్రాధాన్యమివ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పీఎం–ప్రణామ్ పేరుతో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. వ్యవసాయం కోసం ప్రత్యామ్నాయ పోషకాల వాడకాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. పర్యావరణానికి హాని కలిగిస్తున్న రసాయన ఎరు వుల స్థానంలో సేంద్రీయ, జీవ సంబంధిత ఎరువులను వాడే మంచి ఉద్దేశంతో మొదలైందీ పథకం. అవసరానికి మించి ఎరువులను వాడటం వల్ల నేలలోని పోషకాలు క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం హరిత విప్లవం మొదలైన పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోనే తీవ్రంగా ఉండటం గమనార్హం. వృద్ధులైన వాళ్లు ప్రమాదకరమైన స్టెరాయిడ్లపై బతుకుతున్నట్లు ఉందిప్పుడు ఈ రాష్ట్రాల్లోని నేల పరిస్థితి. పని జరుగుతూంటుంది కానీ, నేల డొల్లగా మారిపోతూ ఉంటుంది. నేల సామర్థ్యం, పంట దిగుబడులు క్రమేపీ తగ్గిపోతాయి. మిగిలిన రాష్ట్రాల్లోనూ నేల పరిస్థితి ఇలాగే ఉందనడంలో సందేహం ఏమీ లేదు. ప్రమాదకరమైన రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ, జీవ సంబంధిత ఎరువులను వాడేందుకు ప్రభుత్వం పీఎం–ప్రణామ్ పథకాన్ని ప్రారంభించడం ఆహ్వానిందగ్గ పరిణామమే. కానీ, అమ లుకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. మొదటిది, ఈ పథకానికి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం. ప్రస్తుతం రైతులకు అందించే ఎరువుల సబ్సిడీలోంచే ఈ పథకానికి కావాల్సిన మొత్తాలను సర్దుకోవాలి. ఇందుకు తగ్గట్టుగా సహజసిద్ధమైన ఎరువు లను వాడేలా రైతులను ప్రోత్సహించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని కేంద్రం ఆశిస్తోంది. ఇలా మిగిల్చిన ఎరువుల సబ్సిడీ మొత్తంలో యాభై శాతాన్ని కేంద్రం రాష్ట్రాలకు అందివ్వనుంది. ఈ మొత్తాలతో సహజ ఎరువులపై అవగాహన పెంచడం, ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేపట్టాలి. రాష్ట్రాలకు ఈ మార్పును సమర్థంగా అమలుచేయగల సత్తా ఉందా? భారీ స్థాయిలో సహజ ఎరువులు వాడేలా చేయగలదా? అలాంటి సూచనలు ఇప్పటికైతే ఏమీ కనిపించలేదు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్’ గత ఏడాది విడుదల చేసిన నివేదిక ప్రకారం, సహజ ఎరువుల రంగం పూర్తిగా నిరక్ష్యానికి గురైంది. నియంత్రణల్లేవు. అసంఘటితంగా ఉంది. కేంద్రం సహజ ఎరువులను ప్రోత్సహించేందుకు అందిస్తున్న నిధులు చాలావరకూ మురిగిపోతున్నాయి. సహజ ఎరువుల ఉత్పత్తి కూడా తక్కువగా ఉంది. పైగా ఉత్పత్తి అవుతున్న వాటి నాణ్యత కూడా నాసిగా ఉంది. చాలా రాష్ట్రాల్లో తగిన పరిశోధనాశాలలూ లేవు. ప్రాంతీయ స్థాయిలోని ఆర్గానిక్ ఫార్మింగ్ లాబొరేటరీలను కూడా 2019–20 సంవత్సరంలో వాటి సామర్థ్యంలో మూడో వంతు మాత్రమే వినియోగించుకున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. బయో ఫర్టిలైజర్ నమూనాల పరీక్షలు ఏటికేడాదీ పెరగాల్సింది పోయి తగ్గిపోతున్నాయి. 2013–14లో ఏడాదికి 654 నమూనాలు పరీక్షిస్తే, 2019–20లో ఈ సంఖ్య 483కు పడిపోయింది. అదే సమయంలో ఈ పరీక్షలను తట్టుకుని వాడకానికి సిద్ధమైన ఎరువుల శాతం ఒకటి నుంచి 44 శాతం కావడం గమనార్హం. అంటే నకిలీ బయో ఫర్టిలైజర్లు పెరిగిపోయాయన్నమాట. పీఎం – ప్రమాణ్ పథకం మొత్తం రైతులు సహజ ఎరువుల వాడకానికి మొగ్గు చూపుతారన్న అంచనాపై మొదలైంది. లాభాలు లేని పక్షంలో రైతులు వీటి వాడకానికి ఎందుకు మొగ్గు చూపుతారన్న ప్రశ్నకు సమాధానం లేదు. సహజ ఎరువుల వాడకం వల్ల మట్టి ఆరోగ్యం పెరగాలి. సాగు, పంట ఖర్చులు తగ్గాలి. దిగుబడులు పెర గాలి. తద్వారా ఆదాయమూ ఎక్కువ కావాలి. ఇప్పటివరకూ ఒక స్థాయి జీవనశైలిని అలవర్చుకున్న రైతులు ఇప్పుడు తక్కువ ఆదాయం, దిగుబడి వస్తుందంటే సహజ ఎరువులవైపు మళ్లే అవకాశా లుండవు. అందుకే ప్రభుత్వం సహజ ఎరువుల లాభాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. ఉత్పత్తి, సరఫరాల సామర్థ్యాలను కూడా పెంచు కోవాలి. రసాయనిక ఎరువులకు దీటుగా దిగుబడి ఇవ్వగల సమర్థ మైన, నాణ్యమైన సహజ ఎరువుల ఉత్పత్తికి ప్రాధాన్యమివ్వాలి. ఇవన్నీ చేసినప్పటికీ నేల సారాన్ని పెంచేందుకు, పునరుజ్జీవింప చేసేందుకు పీఎం – ప్రణామ్ సరిపోదు. ఎందుకంటే దేశంలో మట్టి సారం అంతగా దిగజారిపోయింది. రసాయనిక ఎరువుల వాడకంతో పాటు, అతిగా సాగు చేయడమూ దీనికి కారణం. దేశంలో హరిత విప్లవం మొదలైన రాష్ట్రాల్లో రైతులు పంట మార్పిడి పద్ధతిని ఎప్పుడో వదిలేశారు. ఈ పంట మార్పిడి పద్ధతి నేల, నీరు, ఎరువులను సమతుల పద్ధతిలో ఉపయోగించుకునేందుకు ఉద్దేశించినది. దాన్ని వదిలే సుకుని వరి లేదా గోధుమ పంటలకు మాత్రమే పరిమితమయ్యారు! అప్పట్లో ప్రభుత్వానికి ఈ రెండు ధాన్యాల అవసరం ఎక్కువగా ఉండింది కాబట్టి ఆ పంటలు ఎక్కువ పండించేలా రైతులను ప్రోత్సహించింది. మొక్కజొన్న, చిరుధాన్యాలతో పోలిస్తే ఈ రెండు పంటలకూ నీటి అవసరం చాలా ఎక్కువ. వరి, గోధుమలను ఎక్కువగా ఉత్పత్తి చేయడమంటే నదీ, భూగర్భ జలాలను అతిగా వాడుకోవడమే. దీనివల్ల నీటి లవణత కూడా పెరిగి పోషకాలు తగ్గి పోతాయి. అంటే ఈ సమస్య మూలం వరి, గోధుమల సాగులోనే ఉందన్నమాట. నైట్రోజన్ , ఫాస్పరస్, పొటాషియం, సేంద్రీయ కర్బనం, జింక్, ఐరన్ , మాంగనీస్ వంటి పోషకాలన్నీ కూడా తుడిచి పెట్టుకుపోతున్నాయి. రైతులు వరి, గోధుమ పంటల సాగును తగ్గించుకుని వైవిధ్యభరితమైన ఇతర పంటలను సాగు చేయకపోతే రసాయన ఎరువులు, నీటిపై వారు మరింత ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితులు వస్తాయి. రైతులు మారాలంటే వారి పంటలకు కనీస మద్దతు ధర లభించాలి. ఏడు రకాల ధాన్యాలు, ఐదు పప్పులు, ఏడు నూనె గింజలు, నాలుగు వాణిజ్యం పంటలకు కేంద్రం ఏటా కనీస ధరను నిర్ణయిస్తూంటుంది. ఈ పంటలన్నింటినీ ప్రభుత్వమే కొనుగోలు చేయనవసరం లేనప్పటికీ వాటికి కనీస మద్దతు ధరను నిర్ణయించడం అవసరం. హరియాణాలో ఇటీవల పొద్దుతిరుగుడు సాగు చేసే రైతులు ఆందోళనకు దిగారు. కేంద్రం క్వింటాల్‌కు రూ.6,400 కనీస మద్దతు ధర నిర్ణయించినా, ప్రైవేట్ వ్యాపారులు రూ.4,200కు మించి చెల్లించడం లేదన్నది రైతుల ఆరోపణ. ఇంకోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలు కొనుగోలు చేయడం నిలిపివేసింది. ఈ విషయమై రైతులు ఆందోళనకు దిగడంతో రాష్ట్ర ప్రభుత్వం పొద్దుతిరుగుడు పంటను క్వింటాల్‌కు రూ.4,800 ధర చెల్లించేందుకు ఒప్పుకుంది. కనీస మద్దతు ధరకు, ఈ మొత్తానికి ఉన్న తేడాను తగ్గించేందుకు ప్రతి క్వింటాల్‌కు అదనంగా ఇంకో వెయ్యి రూపాయలు చెల్లించేందుకు సరేనంది. అయినప్పటికీ ఈ మొత్తం కనీస మద్దతు ధర కంటే ఆరు వందల రూపాయలు తక్కువగా ఉండటం గమనార్హం. రైతులు దీనికీ ఒప్పుకోకుండా చండీగఢ్ –ఢిల్లీ రోడ్డుపై ధర్నాకు దిగారు. ఆఖరుకు ప్రభుత్వం ధర ఇంకో రెండు వందల రూపాయలు పెంచింది. ఈ విషయంలో రైతులను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వారు తమ పొలాల్లో వేర్వేరు పంటలు వేసేందుకు సిద్ధంగానే ఉన్నారు. పొద్దు తిరుగుడు పంటనే తీసుకుంటే, 2018–19లో కేవలం 9,440 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతూండగా, 2020–21కి ఇది 12,290 హెక్టా ర్లకు పెరిగింది. ఆ తరువాతి సంవత్సరం 13,020 హెక్టార్లకు, 2022– 23 నాటికి 14,160 హెక్టార్లకు పెరగడం గమనార్హం. ప్రభుత్వం కనీస మద్దతు ధరను రైతులకు ఆకర్షణీయంగా ప్రకటించగలిగితే పొద్దుతిరు గుడు సాగు మరింత ఎక్కువగా జరిగేందుకు అవకాశముంది. అలాగే మొక్కజొన్న, చిరుధాన్యాల సాగు కూడా ఊపందుకుంటుంది. అరుణ్ సిన్హా వ్యాసకర్త ‘ఎగైనెస్ట్ ద ఫ్యూ: స్ట్రగుల్స్ ఆఫ్ ఇండియాస్ రూరల్పూర్’ గ్రంథ రచయిత (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
పుడమి తల్లికి తూట్లు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : పుడమి తల్లి నిస్సారంగా మారిపోతోంది. చాలాకాలంగా నత్రజని, భాస్వరం, పొటాషియం తదితర రసాయన ఎరువులకు తోడు పురుగు మందులు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పంటల దిగుబడిని పెంచుకోవడానికి, క్రిమిసంహారానికి మోతాదుకు మించి వాడుతున్న రసా యన ఎరువులు, మందుల కారణంగా సారవంతమైన నేల కాస్తా గుల్ల అవుతోంది. రసాయన ఎరువుల వాడకం పుడమి కాలుష్యంతో పాటు, వాయు, నీటి కాలుష్యానికి కూడా దోహదపడుతోంది. ఒక టన్ను రసా యన ఎరువులను వినియోగిస్తే.. అందులో కేవలం మూడున్నర క్వింటాళ్ల రసాయన ఎరువులను మాత్రమే పంటలు స్వీకరిస్తాయని, మిగిలిందంతా పుడమిలోకి ఇంకిపోవడం, వర్షాలు పడినప్పుడు చెరువులు, నదులు, వాగులు, ఇతర నీటి వనరుల్లోకి వెళ్లిపోవడం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాలతో పోల్చిచూస్తే..మన దేశంలో వీటి విని యోగం తక్కువగా ఉన్నా.. ప్రస్తుతం వాడుతున్న ఈ రసాయన ఎరువుల వల్ల పర్యావరణంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఆర్గానిక్‌తో మేలు.. ♦ దిగుబడి పెంచుకోవడానికి వినియోగించే ఎరువుల్లో ఆర్గానిక్, ఇనార్గానిక్ అనే రెండు రకాలు ఉన్నాయి. ఆర్గానిక్ ఎరువులు ప్రకృతి సిద్ధమైనవి. పంట వ్యర్థాలు, మొక్కలు, జంతువుల వ్యర్థాలు, మునిసిపల్ వ్యర్థాల నుంచి వచ్చే ఎరువులను ఆర్గానిక్ ఎరువులుగా పరిగణిస్తారు. ఆర్గానిక్ ఎరువుల వాడకం వల్ల భూసారం పెరగడంతో పాటు, వాన పాములు, సూక్ష్మజీవుల పునరుత్పత్తికి దోహద పడుతుంది. ఇక రసాయనాలను వినియోగించి తయారు చేసేవే ఇనార్గానిక్ ఎరువులు. పంటల ఎదుగుదలకు నత్రజని ఉపయోగపడుతుంది. ఫాస్ఫేట్ మొక్కలకు ముఖ్యమైన పోషక విలువలను అందిస్తుంది. వీటితో పాటు పొటాషియం భూమిలో నీటి సామర్థ్యాన్ని, భూ సాంద్రతను పెంచుతాయనే వాదన ఉన్నా.. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలోని ఆమ్లాలు చర్మంపైన, శ్వాసపైనా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. సేంద్రీయ సేద్యం పెరుగుతున్నా దేశంలో సేంద్రీయ సేద్యం పెరుగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించే గణాంకాలు చెబు తున్నా.. రసాయన ఎరువుల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలి గించే అంశం. మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు రసాయన ఎరువుల వాడకంలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ ఎరువులు భూమిలో ఉండే సూక్ష్మక్రిములను చంపే యడంతో భూమి తన సారాన్ని కోల్పోతోందని నిపుణులు చెబుతున్నారు. పంటల దిగు బడి కోసం శాస్త్రీయ ఎరువులు వినియోగించకుండా కేవలం రసాయన ఎరువులు, పురుగుమందులు వాడటం వల్ల భూసారం తగ్గి, తదనంతర కాలంలో పంటల దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దశాబ్ద కాలంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం దాదాపు 50% మేరకు పెరిగినట్లు అగ్రికల్చర్ ఇన్పుట్ సర్వే వెల్లడిస్తోంది. చైనాలో హెక్టార్‌కు 13.06 కిలోలు చైనా ఒక హెక్టార్‌కు 13.06 కిలోల పురుగు మందులు వాడుతుంటే, జపాన్ 11.85 కిలోలు, బ్రెజిల్ 4.57 కిలోలు వినియోగిస్తున్నాయి. లాటిన్ అమెరికా దేశా ల్లోనూ ఇలాంటి మోతాదుల్లోనే వినియోగిస్తున్నారని సమాచారం. మన దేశంలో అత్యధికంగా పంజాబ్‌లో ప్రతి హెక్టార్‌కు 0.74 కిలోలు వినియోగిస్తున్నారు. పంజాబ్, హరియాణాలు పంటల దిగుబడి కోసం అత్యధికంగా రసాయన ఎరువులు వినియోగి స్తున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హరియాణాలో 0.62 కిలోలు, మహారాష్ట్రలో 0.57 కిలోలు, కేరళలో 0.41 కిలోలు, ఉత్తరప్రదేశ్‌లో 0.39 కిలోలు, తమిళనాడులో 0.33 కిలోల రసాయన ఎరువులు వాడుతున్నారు. జాతీయ సగటు 0.29 కిలోలుగా ఉంది. జాతీయ సగటు కంటే తెలుగు రాష్ట్రాల్లో వినియోగం తక్కువగా ఉన్నట్లు ఆ గణాంకాలు పేర్కొంటున్నాయి. యూరియానే అత్యధికం.. ఎరువుల్లో యూరియా వినియోగం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. రైతులు అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, ఒక బస్తా యూరియా వేయాల్సిన చోట పంట ఎదుగుదల, దిగుబడి కోసం రెండు మూడు బస్తాలు వినియోగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల కంటే దీని ధర తక్కువగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం సైతం యూరియాపై ఎక్కువ సబ్సిడీ ఇవ్వడం వల్ల రైతులు ఎక్కువగా యూరియా వినియోగిస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. యూరియాపై కేంద్రం దాదాపు 75 శాతం మేరకు సబ్సిడీ అందిస్తుంటే.. డీఏపీ లాంటి ఎరువులపై 35 శాతం మాత్రమే ఇస్తోంది. భూసార పరీక్షల ఆధారంగా వాడాల్సి ఉన్నా.. భూసార పరీక్షల నిర్వహణ ద్వారా ఏయే భూములకు ఎలాంటి పోషకాలు కావాలి, అవి ఏయే రసాయన ఎరువుల్లో ఉంటాయో తెలుసుకుని, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వాడాల్సి ఉన్నా.. రైతులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. తమకు తెలిసిన ఎరువులను యథేచ్ఛగా వాడుతున్నారు. తద్వారా ఒక్కోసారి ఆశించిన స్థాయిలో దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి, వరి, గోధుమ, చెరకు పంటలకు ఎక్కువగా పురుగుల మందులు వాడుతున్నారు. పంజాబ్‌లో కేన్సర్, కిడ్నీ సంబంధిత సమస్యలు రసాయన ఎరువుల అధిక వినియోగంతో ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో నష్టాలు పెరుగుతున్నాయి. ప్రత్యక్షంగా చూస్తే.. నత్రజని కాలుష్యం పెరగడం వల్ల ఆహార ఉత్పత్తుల ద్వారా కేన్సర్, కిడ్నీ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. పంజాబ్‌లో ఈ సమస్య తీవ్రస్థాయికి చేరింది. కొంతకాలం ఎరువుల వినియోగం తర్వాత భూమి లోపల ఉండే బ్యాక్టీరియా చచ్చిపోయి, కార్బన్, మినరల్స్ వంటివి పోయి ఈ రసాయనాలే డామినేట్ చేస్తాయి. మొక్కకు సహజ సిద్ధమైన బలం చేకూరకుండా నేరుగా రసాయనాలే ప్రభావితం చేస్తాయి. పంటల వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. రెండు, మూడు పంటలు వచ్చే ఉమ్మడి నల్లగొండ పరిధిలోని మిర్యాలగూడ, తదితర ప్రాంతాల్లో వరి పొలాల్లో విపరీతంగా యూరియా ఇతర రసాయనాల వినియోగం కారణంగా నేల మొత్తం రసాయనాలే నిండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమస్యను అధిగమించాలంటే రసాయనేతర ఎరువులైన ఆవు, ఇతర జంతువుల పేడ, గృహాల నుంచి వచ్చే చెత్తతో తయారుచేసిన ఎరువుల వినియోగం పెంచాలి. – డా. దొంతి నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు, పాలసీ అనలిస్ట్ రసాయన, సేంద్రీయ కాంబినేషన్ మంచిది రసాయన ఎరువుల అధిక వాడకం వల్ల భూమి తన నిజ స్వరూపం, సారాన్ని కోల్పోతుంది. భూమిలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా చనిపోతాయి. ఎరు వులు వాడితే మొక్కల్లో నీటి నిల్వశాతం కూడా తగ్గు తుంది. వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. మొక్క కు రసాయన ఎరువు, సేంద్రీయ ఎరువులు కాంబినేషన్‌గా అందించాలి. ఉదాహరణకు మొత్తం పది బస్తాల ఎరువులు వినియోగిస్తామను కుంటే.. అందులో ఆరు బస్తాలు రసాయన ఎరువులు, 4 బస్తాల సేంద్రీయ ఎరువులు ఉండేలా చూడాలి. దీనితో సమతుల్యత ఉంటుంది. పురుగుల మందుల వల్ల బీపీ, షుగర్, కిడ్నీ పేషంట్లు పెరుగుతున్నారు. – కె.రాములు ఎండీ, ఆగ్రోస్ లిమిటెడ్ సబ్సిడీలు తగ్గించుకునేందుకే.. కేంద్ర ప్రభుత్వం పీఎం ప్రణామ్లో భాగంగా ఎరువుల వినియోగం తగ్గించడం ద్వారా రైతులకిచ్చే సబ్సిడీలు కూడా తగ్గిస్తోంది. శ్రీలంక తరహాలో సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సహించాలని చూస్తోంది. సేంద్రీయ, రసాయన ఎరువులు కలగలిపి ఉపయోగించడం ద్వారా సేంద్రీయ వ్యవసాయం చేయాలి. కానీ ఒక్క సేంద్రీయ లేదా రసాయన ఎరువుల వాడకంతో పంటలు పండవు. చైనా, అమెరికాతో పోల్చితే భారత్‌లో తక్కువగానే ఎరువులు వాడుతున్నారు నిజమే. అయితే చైనాలో హెక్టార్‌కు 80 క్వింటాళ్లు, అమెరికాలో 60 క్వింటాళ్లు పండిస్తున్నారు. కానీ మన దేశంలో 25 క్వింటాళ్లే దిగుబడి వస్తోంది. 1991లో మనం ఎగుమతులు చేసే దశ నుంచి, ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులు సహా, పాలు, పాల ఆధారిత ఉత్పత్తులు, మాంసం, నూనెలు, పప్పుధాన్యాలు, పంచదార వంటివి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ దిగుమతులకు డంపింగ్ కేంద్రంగా మారింది. భారత్‌లో ఉత్పత్తులను దెబ్బతీసి దిగుమతులపై ఆధారపడేలా చేసే ధనిక దేశాల ప్రయత్నాలకు కేంద్రం లొంగిపోతోందనడానికి ఇదో ఉదాహరణ. – సారంపల్లి మల్లారెడ్డి, రైతుసంఘం నేత, వ్యవసాయ నిపుణులు -
అధిక ఎరువులు వాడితే అనర్థమే
నవాబుపేట: రసాయన ఎరువులు అధికంగా వాడితే అనర్థమే అని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా దిగుబడి తగ్గి, పెట్టుబడులు పెరుగుతాయని అంటున్నారు. సాధారణంగా నేల స్వభావం, భూసారాన్ని బట్టి ఎరువులు వాడాలి. కానీ రైతులంతా ఒకే రకమైన ఎరువులను వినియోగిస్తున్నారు. వరి సాగులో ఎకరాకు 50కేజీల డీఏపీ, 100 కేజీల యూరియా వాడాలి. కానీ రైతులు ఎకరాకు రెండు బస్తాలకు తగ్గకుండా డీఏపీ వేస్తున్నారు. పైరు నాటే సమయంలో బస్తాకు అదనంగా 25 కేజీల పొటాష్‌ను కలిపి వేయాల్సి ఉన్నా రైతులు వేయడం లేదు. వరికి యూరియాను నాలుగు సార్లు వాడాలి. వాడిన ప్రతి సారి 30 కేజీల చొప్పున వాడాలి. పొట్టదశలో యూరియాకు 25 కేజీల పొటాష్‌ను కలిపి వాడాలి. అయితే రైతులు చాలా వరకు నాటిన 20 రోజులకు 50 కేజీలు, మధ్యలో 50 కేజీలు వాడుతున్నారు. ఇక పత్తి పంట విషయానికి వస్తే విత్తేకంటే ముందే ఎకరాకు మూడు నాలుగు అంగుళాల లోతున పడేలా 50 కేజీల డీఏపీ వాడాలి. అయితే వర్షాధారంగా సాగు చేసే పంటల్లో విత్తనాలు మొలుస్తాయో లేదోనని పత్తి విత్తేటప్పుడు ఎరువులు వేయడం లేదు. కనీసం 25సెం.మీ. లోతులో భూమిలో పదును ఉండేలా వర్షం పడినప్పుడు ఎరువుతో పాటు పత్తి గింజలు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. పత్తితో పాటు అన్ని ఖరీఫ్ పంటలకు 50 కేజీల వరకు మాత్రమే డీఏపీ వాడాలి. అయితే రైతులు పైరు ఎదుగుదల దశలో రెండు మూడు బస్తాలు వరకు డీఏపీని పై పాటుగా చల్లుతున్నారు. దీని వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. పోషకాలు ఉన్న కాంప్లెక్స్ ఎరువులు రెండు బస్తాలు వాడితే సరిపోతుంది. అధిక భాస్వరంతో నష్టం అధిక మోతాదులో భాస్వరం వాడడం వల్ల దిగుబడులపై క్రమంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలి రెండేళ్ల పాటు దిగుబడులు బాగా వచ్చినా ఆ తర్వాత ఎరువులు వాడినా దిగుబడులు రానంతగా నేల దెబ్బతింటుంది. భాస్వరం భూమి లోపలి పొరల్లో నిల్వ ఉండి నేల గట్టిగా మారి పంటలకు నష్టం కలిగిస్తుంది. సమతూల్యత ఏది? ప్రతి మొక్కకూ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం. రైతులు అవగాహన లోపంతో కొన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల్లో ఉండని పోషకాలను అదనంగా చేర్చి వాడాల్సిన విషయం రైతులకు తెలియదు. ఉదాహరణకు 28 – 28 – 0, డీఏపీలోను పొటాష్ ఉండదు. ఈ ఎరువులు వినియోగించినప్పుడు పైరు ఎదుగుదల దశలో పైపాటుగా యూరియాను వాడాలి. దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నా పైపాటుగా కూడా వాడుతుండడంతో ఎరువుల్లో పోషకాలు సరిగ్గా మొక్కకు చేరక వృథా అవుతున్నాయి. సూక్ష్మ పోషకాల అవసరాన్ని రైతులు గుర్తించకపోవడంతో పంటల్లో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. సేంద్రియ ఎరువులు తప్పని సరి రైతులు రసాయన, సేంద్రియ ఎరువులు సగం మోతాదులో వాడాల్సి ఉంది. కేవలం రసాయన ఎరువులే వాడటం వల్ల భూ సారం తగ్గిపోయి నిస్సారంగా మారుతుంది. మొదట్లో బాగానే దిగుబడులు వచ్చినా క్రమంగా భూ సారం తగ్గి దిగుబడులు రావు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల బరువు నేలలు గుళ్ల బారి వేర్లు చక్కగా పెరగటానికి సహాయపడుతుంది. అవగాహన కల్పిస్తున్నాం ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మోతాదుకు మించి ఎరువులు వాడడం వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తున్నాం. ఏ పంటకు ఏ సమయంలో ఎంత ఎరువు వాడాలి అనేది తెలిస్తే పంట దిగుబడిలో ప్రయోజనం కనిపిస్తుంది. ఆ దిశగా రైతులకు సూచనలు ఇస్తున్నాం. అంతేకాకుండా భూసార పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నాం. – ప్రసన్నలక్ష్మి, ఏఓ -
PM PRANAM: రసాయన ఎరువులకు ‘పీఎం–ప్రణామ్’తో చెక్!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అంతేకాకుండా రసాయన ఎరువులపై సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రధానమంత్రి ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ (పీఎం–ప్రణామ్) యోజనను తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరగడం, వాటిపై రాయితీలు మోయలేని భారంగా మారుతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్సిడీల భారం రూ.2.25 లక్షల కోట్లు! దేశంలో రసాయన ఎరువుల వాడకం ప్రతి ఏటా విపరీతంగా పెరిగిపోతోంది. 2017–18లో వినియోగం 5.28 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా, 2021–22 నాటికి 6.40 కోట్ల మెట్రిక్ టన్నులకు (21శాతం) పెరిగింది. ఇందులో యూరియా వినియోగం 2017–18లో 2.98 కోట్ల మెట్రిక్ టన్నుల నుంచి 2021–22 నాటికి ఏకంగా 3.56 కోట్ల మెట్రిక్ టన్నులకు (19.64 శాతం) చేరుకుంది. అలాగే డీఏపీ వినియోగం 98.77 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1.23 కోట్ల మెట్రిక్ టన్నులకు (25.44 శాతం) పెరిగింది. ఇతర ఎరువుల వినియోగం సైతం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. దానికి అనుగుణంగానే సబ్సిడీల భారం పెరుగుతూ వస్తోంది. 2020–21లో సబ్సిడీల భారం రూ.1.27 లక్షల కోట్లు కాగా, 2021–22 నాటికి రూ.1.62 లక్షల కోట్లకు చేరింది. 2022–23 నాటికి రూ.2.25 లక్షల కోట్లు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే ‘పీఎం–ప్రణామ్’ పథకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మిగిలే నిధులతో పథకం అమలు ‘పీఎం–ప్రణామ్’ కింద కేంద్ర సర్కారు ఎలాంటి ప్రత్యేక బడ్జెట్ కేటాయించదు. వివిధ కేంద్ర పథకాల కింద ఉన్న ఎరువుల సబ్సిడీలను ఆదా చేయడం ద్వారా మిగిలే నిధులతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. మిగులు నిధుల్లో 50 శాతం సొమ్మును రాష్ట్రాలకు గ్రాంట్‌గా అందిస్తుంది. ఈ గ్రాంట్‌లో 70 శాతం నిధులను గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో ప్రత్యామ్నాయ ఎరువులు, ప్రత్యామ్నాయ ఎరువుల ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు వినియోగించవచ్చు. మిగిలిన 30 శాతం నిధులను రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై రైతుల్లో అవగాహన కల్పించిన పంచాయతీలకు, రైతు సంఘాలకు, స్వయం సహాయక సంఘాలకు బహుమతులు ఇవ్వడానికి, ఇతర ప్రోత్సాహకాలకు ఉపయోగించుకోవచ్చు. పీఎం–ప్రణామ్ యోజనకు సంబంధించిన లక్ష్యాలపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. రాష్ట్రాల అభిప్రాయాలు పూర్తిగా తెలుసుకున్నాక తుది ముసాయిదాను సిద్ధం చేయనుంది. -
సేంద్రీయ సేద్యం.. రసాయన ఎరువులకు స్వస్తి
రసాయనిక ఎరువులు, పురుగు మందులతో పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న పంట నాణ్యత.. రైతులను సంప్రదాయ సేద్యంపై వైపు నడిపిస్తోంది. సహజ సిద్ధ (ఆర్గానిక్) పంట ఉత్పత్తులకు మార్కెట్లోనూ మంచి డిమాండ్ఉండడం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండడంతో రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులకు లాభాసాటిగా ఉండాలనే లక్ష్యంతో ప్రకృతి సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం సైతం తోడ్పాటును అందిస్తోంది. పెట్టుబడులు తగ్గడంతో పాటు అధిక దిగుబడులతో జిల్లాలో ఏటా సహజ సేద్యం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. విడవలూరు/నెల్లూరు(సెంట్రల్): ప్రకృతి వ్యవసాయం లాభసాటిగా మారడంతో రైతులకు వరంగా మారింది. ప్రస్తుతం రసాయనిక ఎరువుల ధరలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతుండడంతో సాగు పెట్టుబడి అధికం అవుతుంది. పంట నాణ్యత లేకపోవడంతో దళారుల దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో సత్ఫలితాలు వస్తుండడం, సేంద్రియ సేద్య (ఆర్గానిక్) ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్, రేటు లభిస్తుండడంతో రైతులు సైతం ఆ తరహా సేద్యంపై ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సేంద్రియ సేద్యాన్ని ప్రభుత్వం ప్రోత్సాహం అందించడంతో జిల్లాలో ఏటేట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. 67 వేల ఎకరాల్లో సాగు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయానికి మహిళా రైతులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. విడవలూరు, వింజమూరు తదితర మండలాల్లో మహిళా రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. వీరు ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేయడంతో గతంలో వీరికి ఆదర్శ మహిళా రైతుగా బిరుదులు కూడా దక్కాయి. జిల్లాలో ఈ ఏడాది 53,764 మంది రైతులు 67,356 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 46 మండలాల్లో 222 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్ర«ధానంగా ఆత్మకూరు, ఉదయగిరి, కావలి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ తరహా సాగు విస్తీర్ణం పెరిగింది. 18 రకాల పంటలు జిల్లాలో ఎక్కువగా 18 రకాల పంటలను ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువగా పండిస్తున్నారు. ప్రధానంగా వరి పంట అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. వరితో పాటు జొన్నలు, సజ్జలు, రాగులు, మినుములు, కందులు, పెసలు, పిల్లిపిసర, జనుము, జీలుగ, మొక్కజొన్న, కొర్రలు, గోగులు, గోరుచిక్కుళ్లు, కాకర, బీర, సొరకాయలు, బెండ, టమాటాలు ఎక్కువగా వీటిని ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నారు. 110 గ్రామాల ఎంపిక ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎడగారులో వరి సాగు పండించేందుకు జిల్లాలో 110 గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు బీజామృతం (విత్తన శుద్ధి), జీవామృతం (పంట సత్తువ), నీమామృతం (గుడ్డు దశ నాశనం), బ్రహ్మాస్త్రం (లబ్ధిపురుగు నివారణ) అగ్నాస్త్రం (అగ్గి తెగులు నివారణ) అజోల్లా (నత్రజని అందించడం) వంటి వాటిపై అవగాహన కల్పించడంతో పాటు వాటి తయారీ విధానం, వాడుక విధానాన్ని తెలుపుతున్నారు. ప్రకృతి వ్యవసాయమే అనివార్యం ఈమె పేరు రొడ్డా వెంగమ్మ. ఊటుకూరు సర్పంచ్, వింజమూరు మండలం. ఈమె 5 ఎకరాల్లో మామిడి తోట, 5 ఎకరాల్లో వరి, అర ఎకరాలో కంది, అర ఎకరాలో కూరగాయలను పండిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులతో సాగు చేయడంతో పెట్టుబడులు పెరిగి, ఆర్థికంగా నష్టపోయారు. దీంతో ఆమె ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించారు. తొలుత కొంత సేంద్రియ విధానంలో సాగు చేసి సత్ఫలితాలు సాధించారు. దీంతో పూర్తిగా ప్రకృతి సేద్యం చేయడం ద్వారా ఖర్చులు తగ్గించుకున్నారు. అధిక దిగుబడులతో రాబడి పెరిగిందని చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన అన్ని రకాల కషాయాలను స్వయంగా తయారు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. మూడేళ్ల నుంచి వరి పంట సాగు ఈమె పేరు చౌటూరు రమణమ్మ, విడవలూరు. ఈమె తనకున్న రెండు ఎకరాల సొంత పొలంలో వరి సాగు చేస్తున్నారు. గిరిజన మహిళ కావడంతో పెద్దగా విద్యను అభ్యసించలేదు. ఈమె కూడా అందరిలాగే రసాయనిక ఎరువులు, పురుగు మందులతో సాగు చేసింది. పెద్దగా రాబడి లేకపోవడంతో సాగు కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయంపై అంతపట్టు లేకపోయినప్పటికీ, ప్రకృతి సేద్యంతో ఖర్చులు తగ్గుతాయని, రాబడి పెరుగుతుందని ప్రకృతి సేద్యం సిబ్బంది సూచనలతో ఆ వైపు అడుగులు వేసింది. వారి పర్యవేక్షణలో మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం ద్వారానే వరి సాగు చేస్తున్నారు. దీంతో ఈమెకు ఉత్తమ మహిళా రైతుగా బిరుదు లభించింది. అవగాహన కల్పిస్తున్నాం ప్రకృతి వ్యవసాయం సాగుపై జిల్లా వ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయం సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రైతులు కూడా సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అన్ని విధాలుగా రైతులకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. – ప్రభాకర్, ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ చాలా బాగుంది ప్రకృతి వ్యవసాయం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాను. వరితో పాటు, ఇతర పంటలను సాగు చేస్తున్నాను. పంటకు పోషకాలు అందించేందుకు అవసరమైన ప్రకృతి పరమైన పోషకాలు సిద్ధం చేసుకోవడం, వాటిని తయారు చేసుకోవడం కొంచెం కష్టంగా ఉన్నా.. ఖర్చులు భాగా తగ్గుతున్నాయి. అధిక దిగుబడులతో లాభాలు వస్తున్నాయి. – ఇందకూరు అనిల్‌రెడ్డి, రైతు, అశ్వనీపురం, ఆత్మకూరు మండలం -
సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం: మంత్రి సింగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కంపెనీల లాబీయింగ్ కారణంగా వ్యవసాయ క్షేత్రాల్లో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం పెరిగిందని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. తద్వారా మనిషికి ఆరోగ్యకరమైన ఆహారం అందడం లేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2017 నుంచి ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని చెప్పారు. గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యుడు గోరటి వెంకన్న అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 2017–18 నుంచి 2019–20 వరకు రాష్ట్రంలో 29,200 ఎకరాల విస్తీర్ణం కలిగిన 584 క్లస్టర్లలో సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. 2021–22 సంవత్సరానికి గాను జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 250 ఎకరాల చొప్పున 750 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయానికి ప్రతిపాదించామన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటివరకు బడ్జెట్లో రూ. 7,201.57 కోట్లు కేటాయించగా, రూ. 2,598.19 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. రైతు వేదికల ద్వారా సేంద్రియ వ్యవసాయంపై రైతాంగానికి అవగాహన, శిక్షణ కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. సవరించిన పేస్కేళ్ల అమలు: మంత్రి సబిత యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోర్టు కేసుల కారణంగా ఆగినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జనవరి 2016 నుంచి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని బోధనా సిబ్బందికి సవరించిన యూజీసీ వేతన స్కేళ్లను అమలు చేసేందుకు ప్రభుత్వం 2019లోనే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 3,350 మంది సిబ్బందికి పెన్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. మిగతా వారికి ఇచ్చేందుకు సర్కార్‌ను గ్రాంట్ అడిగినట్లు వివరించారు. అంతకుముందు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో కలిపి 3,000 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 2017లోనే 1,061 పోస్టుల భర్తీకి జీవో ఇచ్చినప్పటికీ అమలు కాలేదని వివరించారు. కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్లను బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చి ఏడాదైనా అమలు కాలేదని, కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి 10 శాతం పన్నును ఆదాయపన్ను శాఖ వసూలు చేయడాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు అకాడమీ స్కాంలో నిధుల రికవరీ చేయాలి: ఎంఎస్ ప్రభాకర్ తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్లను తస్కరించిన స్కాంలో నిందితులను అరెస్టు చేయడమే కాకుండా నిధులను రికవరీ చేయాలని సభ్యుడు ఎం.ఎస్.ప్రభాకర్ కోరారు. అవసరమైతే నిందితులపై పీడీ యాక్ట్ పెట్టాలని సూచించారు. అందుకు మంత్రి మహమూద్ అలీ స్పందిస్తూ నిందితుల నుంచి నిధులను రికవరీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. గిరిజన తెగలకు... ఆదిలాబాద్‌లో గిరిజన తెగల్లో ఒకటైన మన్నెవర్లను కొలవర్లుగా మార్చారని, అయితే మన్నెవర్లుగా ఉన్నప్పుడు వారికి లభించిన లబ్ధి ఇప్పుడు అందడం లేదని సభ్యుడు పురాణం సతీష్ సభ దృష్టికి తెచ్చారు. 55 వేల మంది మన్నెవర్లు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సైనిక సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని టి.జీవన్‌రెడ్డి కోరారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, దసరా సెలవుల్లో బడులను సంస్కరించాలని ఆయన సూచించారు. -
సాగు సమస్యలకు ప్రకృతి సేద్య పిత భాస్కర్ సావే సూచనలివే!
భారతీయ ప్రకృతి సేద్య సంస్కృతికి ఊపిర్లూదిన అతికొద్ది మహారైతుల్లో భాస్కర్ సావే ఒకరు. ఆరేళ్ల క్రితం 2015 సెప్టెంబర్ 24న తన 93వ ఏట ఆ మహోపాధ్యాయుడు ప్రకృతిలో కలసిపోయినా.. ఆయన వదలివెళ్లిన ప్రకృతి సేద్య అనుభవాలు రైతు లోకానికి ఎప్పటికీ దారి దీపం వంటివే! రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడే వ్యవసాయం హింసాయుతమైనదని అంటూ.. అహింసాయుతమైన ప్రకృతి సేద్యాన్ని అక్కున చేర్చుకున్నారు సావే. ప్రకృతి సేద్య గాంధీగా పేరుగాంచిన సావేను మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్మరించుకోవటం మరో విశేషం. ప్రకృతి వ్యవసాయ మహాపాధ్యాయుడిగానే కాక, స్వతహాగా తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన సాధించి చూపిన సుసంపన్న ప్రకృతి సేద్య ఫలాల గురించి మననం చేసుకోవటం స్ఫూర్తిదాయకం. ‘వన్ వరల్డ్ అవార్డ్ ఫర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ పురస్కారంతో అంతర్జాతీయ సేంద్రియ సేద్య ఉద్యమాల సమాఖ్య (ఐఫోమ్) 2010లో ఆయనను సత్కరించింది. ‘హరిత విప్లవం’ దుష్ఫలితాలపై ఆయన 15 ఏళ్ల క్రితం రాసిన బహిరంగ లేఖలు చాలా ప్రాచుర్యం పొందాయి. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి (స్వచ్ఛంద సంస్థల నిరసనలు, బహిష్కరణల నడుమ) ‘ఆహార వ్యవస్థల పరివర్తనా శిఖరాగ్రసభ–2021’ను ఇటీవల నిర్వహించిన నేపథ్యంలో.. ఇప్పటికీ, ఎప్పటికీ రైతులకు అనుసరణీయమైన (రైతులు, ప్రజలు, జంతుజాలం, భూగోళం మేలు కోరే) భాస్కర్ సావే ఎలుగెత్తి చాటిన ప్రకృతి సాగు పద్ధతి గురించి వివరంగా తెలుసుకుందాం.. భాస్కర్ సావే సన్నిహిత సహచరుడు భరత్ మన్సట రచన ‘ద విజన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్’ నుంచి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం.. భాస్కర్ సావే భావాలకు, ఆచరణకు నిలువెత్తు నిదర్శనం ఆయన బిడ్డలా సాకిన 14 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ‘కల్పవృక్ష’. పశ్చిమ తీరాన కోస్టల్ హైవేకి దగ్గరలో గుజరాత్‌లోని వల్సద్ జిల్లా దెహ్ర గ్రామంలో ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ఉంది. 10 ఎకరాల్లో (45 ఏళ్ల నాటి) పండ్ల తోట.. భాస్కర్ సావే పచ్చని సంతకంలా విరాజిల్లుతూ ఉంది. ఎన్నో జాతుల సమాహారంగా ఉండే ఈ తోటలో కొబ్బరి, సపోట చెట్లు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. 2 ఎకరాల్లో సీజనల్ పంటలను పంటల మార్పిడి పద్ధతిలో సాగు చేస్తున్నారు. మిగతా రెండెకరాల్లో కొబ్బరి నర్సరీని నిర్వహిస్తున్నారు. ఒక్క దిగుబడే కాదు (పంటల దిగుబడి, పోషకాల నాణ్యత, రుచి, జీవవైవిధ్యం, పర్యావరణ సుస్థిరత, నీటి సంరక్షణ, విద్యుత్తు వినియోగ సామర్థ్యం, ఆర్థిక లాభదాయకత వంటి) ఏ కోణంలో చూసినా.. రసాయనిక వ్యవసాయ క్షేత్రం కన్నా ‘కల్పవృక్ష’ మిన్నగానే ఉంటుంది. బయటి నుంచి తెచ్చి వాడేవి దాదాపు ఏమీ ఉండవు. ఖర్చు (ఇందులో కూడా చాలా వరకు కోత కూలి ఉంటుంది) చాలా తక్కువ. ‘కల్పవృక్ష’ సుసంపన్నత కల్పవృక్ష క్షేత్రంలోకి అడుగుపెట్టగానే ‘సహకారమే ప్రకృతి మౌలిక సూత్రం’ వంటి ఎన్నో సూక్తులు భాస్కర్ సావే భావాలకు ప్రతిరూపంగా సందర్శకులకు కనిపిస్తాయి. ప్రకృతి, వ్యవసాయం, ఆరోగ్యం, సంస్కృతి, ఆథ్యాత్మికతలకు సంబంధించిన సావే ప్రజ్ఞను ఇవి చాటుతుంటాయి. కల్పవృక్ష క్షేత్రం.. ఆహారోత్పత్తి సామర్థ్యానికి దానికదే సాటి. ఏడాదికి ఒక్కో కొబ్బరి చెట్టు 350 నుంచి 400 కాయల దిగుబడినిస్తుంది. 45 ఏళ్ల క్రితం నాటిన సపోటా చెట్టు ఒక్కోటి ఏటా 300 కిలోల పండ్లనిస్తుంది. పండ్ల తోటలో కొబ్బరి, సపోటాతోపాటు అరటి, బొప్పాయి, వక్క, ఖర్జూరం, మునగ, మామిడి, పనస, తాటి, సీతాఫలం, జామ, చింత, వేపతోపాటు అక్కడక్కడా వెదురు, కరివేపాకు, తులసి, మిరియాలు, తమలపాకు, ప్యాషన్ ఫ్రూట్ తీగ జాతులు కూడా వత్తుగా ఉంటాయి. పదెకరాల్లో 150 క్వింటాళ్ల దిగుబడి తోట అంతటా వత్తుగా పెరిగే రకరకాల చెట్ల కింద రాలిన ఆకులు కొన్ని అంగుళాల మందాన పరచుకొని నేలతల్లికి ఆచ్ఛాదన కల్పిస్తూ ఉంటాయి. ఎండ నేలను తాకే పరిస్థితి ఉండదు. సూక్ష్మ వాతావరణం నెలకొనటం వల్ల వానపాములు, సూక్ష్మజీవరాశి నేలను నిరంతరం సారవంతం చేస్తూ ఉంటాయి. ఎండ, వాన, చలి నుంచి నేలను ఆకుల ఆచ్ఛాదన కాపాడుతూ ఉంటుంది. ‘ఏ రైతైతే తన పొలం మట్టిలో వానపాములు, సూక్ష్మజీవరాశి చక్కగా వృద్ధి చెందేలా జాగ్రత్త తీసుకుంటారో.. ఆ రైతు తిరిగి పురోభివృద్ధిని పుంజుకున్నట్లే’ అంటారు భాస్కర్ సావే. నేలకు ఇలా రక్షణ కల్పిస్తూ రసాయనాలు వాడకుండా శ్రద్ధగా సాకుతూ సుసంపన్నం చేయటాన్నే ప్రకృతి వ్యవసాయ మార్గం అని ఆయన వివరించేవారు. పదెకరాల తోటలో ఎకరానికి ఏడాదికి 150 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి తీస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఆహారంలో వుండే పోషకాల సాంద్రత రసాయనిక వ్యవసాయంలో పండించిన పంటలో కన్నా ఎక్కువగా ఉంటాయి. రెండెకరాల్లో సీజనల్ పంటలు రెండెకరాల్లో దేశవాళీ ‘నవాబీ కోలం’ అనే రుచికరమైన, ఎత్తయిన వరి పంటతోపాటు, అన్ని రకాల పప్పుధాన్యాలు, చలికాలంలో గోధుమ, కూరగాయలు, దుంప పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఈ పంట దిగుబడులతోనే భాస్కర్ సావే కుటుంబం, అతిథుల ఆహారపు అవసరాలు పూర్తిగా తీరుతాయి. బియ్యం మిగిలితే బంధు మిత్రులకు కానుకగా ఇస్తూ ఉంటారు. రసాయనిక సేద్యాన్ని వదలి రైతులు సేంద్రియ / ప్రకృతి వ్యవసాయం చేపట్టిన తర్వాత ఏటేటా నేల సారం పెరుగుతూ ఉండే కొద్దీ పంట దిగుబడులు మెరుగుపడుతూ ఉంటాయి. ప్రకృతి సేద్య మెళకువలు పాటిస్తే కొన్ని ఏళ్లలో భూమి సంపూర్ణ స్వయం పోషకత్వాన్ని సంతరించుకుంటుంది. కలుపు తీవ్రత తగ్గుతుంది. 2–3 ఏళ్ల తర్వాత కలుపు తీయాల్సిన అవసరం ఉండదు. అప్పటివరకు కలుపు మొక్కల్ని కోసి ఆచ్ఛాదనగా వేస్తూ పోవాలి. ‘అన్నపూర్ణమ్మ తల్లి ఆశీస్సులతో ప్రకృతి వ్యవసాయం ప్రతి జీవికీ సమృద్ధిగా ఆహారాన్ని అందిస్తుంది’ అంటారు భాస్కర్ సావే! సాగు సమస్యలు సావే అనుభవాలు వ్యవసాయంలో రైతులంతా సాధారణంగా ముఖ్యమైన సమస్యలుగా భావించే అంశాలు ఐదు.. దుక్కి, భూసారాన్ని పెంపొందించే ఎరువులు, కలుపు, నీరు, చీడపీడల నుంచి పంటలను కాపాడుకునే పద్ధతులు. ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతే ఏ విధంగా చూసినా రైతుకు, ప్రజలకు, భూగోళానికి, జంతుజాలానికి మేలు చేకూర్చుతుందని మనసా వాచా కర్మణా నమ్మే దిగ్గజ రైతు భాస్కర్ సావే భావాలు విభిన్నంగా ఉంటాయి.. ►దుక్కి పండ్ల తోటల్లో మొక్కలు నాటేటప్పుడు మాత్రమే ఒక్కసారి దుక్కి చేయటం తప్ప తర్వాత ఇక తవ్వే అవసరమే లేదు. ఆకులు అలములు నేలను కప్పి ఉంచేలా ఆచ్ఛాదన నిరతరం ఉండేలా చూడాలి. పండ్ల తోట ఎన్నేళ్లున్నా ఇంకేమీ చెయ్యనవసరం లేదు, దిగుబడులు పొందటం తప్ప. అయితే, విత్తనాలు వేసిన కొద్ది నెలల్లో దిగుబడినిచ్చే సీజనల్ పంటల పరిస్థితి వేరు. వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనె గింజ పంటల విషయంలో ప్రతి పంట కాలంలోనూ తేలికపాటి దుక్కి చేయాల్సి వుంటుంది. అందుకే.. తోటల సాగుకు ‘ప్రకృతి వ్యవసాయ పద్ధతి’ పూర్తిగా తగినదని భావించే భాస్కర్ సావే.. సీజనల్ పంటల సాగును ‘సేంద్రియ వ్యవసాయం’గా చెప్పేవారు. ►కలుపు కలుపు తీయకూడదు అనేది భాస్కర్ సావే అభిప్రాయమే కాదు అనుభవం కూడా. కలుపు మొక్కలను పూర్తిగా పీకేసి లేదా కలుపు మందు కొట్టేసి పొలంలో పంట మొక్కలు తప్ప కలుపు మొక్కలు అసలు కనపడకుండా తుడిచిపెట్టడం సరికాదు. పంట మొక్కల కన్నా ఎక్కువ ఎత్తులో కలుపు మొక్కలు పెరిగి, పంటలకు ఎండ తగలకుండా అడ్డుపడే సంకట స్థితి రానివ్వకూడదు. ఆ పరిస్థితి వస్తుందనుకున్నప్పుడు కలుపు మొక్కలను కత్తిరించి, అక్కడే నేలపై ఆచ్ఛాదనగా వేయటం ఉత్తమ మార్గం అని భాస్కర్ సావే భావన. ►నీటి పారుదల భూమిలో తేమ ఆరిపోకుండా చూసుకునేంత వరకు మాత్రమే పంటలకు నీరు అవసరమవుతుంది. తోటల్లో అనేక ఎత్తులలో పెరిగే వేర్వేరు జాతుల మొక్కలు, చెట్లను వత్తుగా పెంచాలి. పొలాల్లో మట్టి ఎండ బారిన పడకుండా ఆచ్ఛాదన చేసుకుంటే నీటి అవసరం చాలా వరకు తగ్గిపోతుంది. ►సస్యరక్షణ మిత్రపురుగులే ప్రకృతిసిద్ధంగా శతృపురుగులను అదుపులో ఉంచుతాయి. రసాయనాలు వాడకుండా బహుళ పంటలను సాగు చేస్తూ ఉంటే.. భూమి సారవంతమవుతూ చీడపీడలను నియంత్రించుకునే శక్తిని సంతరించుకుంటుంది. అయినా, చీడపీడలు అసలు లేకుండా పోవు. నష్టం కనిష్ట స్థాయిలో ఉంటుంది. మరీ అవసరమైతే, వేప ఉత్పత్తులు, నీటిలో కలిపిన దేశీ ఆవు మూత్రం వంటి ద్రావణాలు పిచికారీ చేస్తే చాలు. అసలు ఇది కూడా అవసరం రాదు అని భాస్కర్ సావే తన అనుభవాలు చెబుతారు. రసాయనిక సేద్యంలో పనులన్నీ తనే భుజాన వేసుకొని రైతు కుదేలైపోతూ ఉంటే.. ప్రకృతి సేద్యంలో ప్రకృతే చాలా పనులు తనంతట తాను చూసుకుంటుంది కాబట్టి రైతుకు సులభమవుతుంది. భూమి పునరుజ్జీవం పొందుతుంది అంటారు సావే సాధికార స్వరంతో! చదవండి: 7 యేళ్లలో 17 లక్షలు సంపాదించిన రైతు.. ఏం పండించాడో తెలుసా? -
ఖరీఫ్ సాగు పండుగే!
సాక్షి, అమరావతి: రానున్న ఖరీఫ్–2021 సీజన్లో అవసరాలకు సరిపడా ఎరువులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పంటల సాగు లక్ష్యం, నేలల్లో పోషకాల లభ్యతను బట్టి ఖరీఫ్ సీజన్‌కు 21.7 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా 20.45 లక్షల మెట్రిక్ టన్నులు అందించడానికి కేంద్రం అంగీకరించింది. అయితే రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువులను వినియోగించేలా వారిని చైతన్యపర్చాలని సూచించింది. ఈ మేరకు ఖరీఫ్–2021 సీజన్లో సాగు లక్ష్యం, భూసార పరిస్థితులు, ఎరువుల డిమాండ్, తదితర అంశాలపై గురువారం ఢిల్లీలో వివిధ రాష్ట్రాల వ్యవసాయ కమిషనర్లు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ కార్యదర్శి, ఎరువుల విభాగం ఇన్చార్జ్ నీరజ సుదీర్ఘంగా చర్చించారు. వివిధ రాష్ట్రాల్లో భూసార పరీక్షలననుసరించి నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం (ఎన్పీకే), సూక్ష్మపోషకాల లభ్యత ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్లలో వినియోగాన్ని బట్టి వివిధ రాష్ట్రాలకు అవసరమైన యూరియా, డీ అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ), మ్యూరిట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ), సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ (ఎస్ఎస్పీ), కాంప్లెక్స్ ఎరువులపై ఆరా తీశారు. 73.70 శాతం నేలల్లో నత్రజని లోపం రాష్ట్రంలో 73.70 శాతం నేలల్లో నత్రజని, 14.90 శాతం నేలల్లో భాస్వరం, 11.40 శాతం నేలల్లో పొటాష్, 35 శాతం నేలల్లో జింక్, 24 శాతం నేలల్లో ఐరన్, 17 శాతం నేలల్లో బోరాన్, 14 శాతం నేలల్లో మాలిబ్డినం తక్కువగా ఉన్నట్టు భూసార పరీక్షల ఆధారంగా గుర్తించామని అరుణ్‌కుమార్ వివరించారు. ఖరీఫ్– 2020లో 18.37 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగం కాగా, రానున్న ఖరీఫ్‌లో 2.08 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం అదనంగా కేటాయిస్తోందన్నారు. ఖరీఫ్–2021 లక్ష్యం 58.79 లక్షల హెక్టార్లు మన రాష్ట్రానికి సంబంధించి ఖరీఫ్–2021లో 58.79 లక్షల హెక్టార్లలో సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ కేంద్రానికి వివరించారు. ప్రధానంగా వరి 16.190, వేరుశనగ 7.45, పత్తి 6.24, కంది 2.70, కూరగాయలు 2.65, మిరప 1.80, మొక్కజొన్న 1.14 లక్షల హెక్టార్లలో, మినుము 41 వేలు, జొన్న 36 వేలు, రాగి 33 వేలు, పెసర 27 వేలు, నువ్వులు 18 వేలు, పొద్దుతిరుగుడు 3,700 హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. -
విషం పండిస్తున్నామా...?
జిల్లాలో పంటలు విస్తారంగా పండిస్తున్నారు. వాటి దిగుబడి పెరగడానికి లక్షలాది బస్తాల రసాయనిక ఎరువులు కుమ్మరిస్తున్నారు. తెగుళ్లు ఆశించకుండా ఇబ్బడి ముబ్బడిగా పురుగుమందులు స్ప్రే చేస్తున్నారు. ఇలా పండించే పంట కాస్తా విషతుల్యం చేస్తున్నారు. సేంద్రియంపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా... ఎందుకో మారలేకపోతున్నారు. విజయనగరం ఫోర్ట్: రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం పెరుగుతోంది. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడం లేదు. సాగువిస్తీర్ణానికి సరి సమాన స్థాయిలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వినియోగిస్తున్నారు. చిన్న సమస్యకూ రసాయనిక మందులే విరుగుడుగా భావిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు కాస్త ఆలస్యంగా పడటం వల్ల కొన్ని ప్రాంతాల్లో నాట్లు ఆలస్యంగా వేశారు. దీనివల్ల పంట ఎదుగుదల కోసం రైతులు ఎరువులను అధికంగా వినియోగించారు. పంటలకు తెగుళ్లు ఆశించడంతో పురుగుమందులను అధికంగా వినియోగించారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో లక్ష 90 వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, చెరకు తదితర పంటలు సాగు చేశారు. వాటికి 12.39 లక్షల బస్తాల ఎరువులను రైతులు వినియోగించారు. అంతేగాదు... 1.60 లక్షల లీటర్ల పురుగుమందులను వాడారు. తెగుళ్ల నివారణకు పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం, వేప కషాయం, వేపనూనె వంటి వాటితో తక్కువ ఖర్చుతో నివారించవచ్చు. కాని చాలా మంది రైతులు అవగాహన లేక రసాయనిక ఎరువులు, పురుగు మందులనే వినియోగిస్తున్నారు. రైతులు పంట దిగుబడి పెంచేందుకు పోటీపడి నారుమడి నుంచి పంటకోత దశ వరకు ఎకరానికి 4 నుంచి 5 బస్తాల వరకు రసాయనిక ఎరువులు, 2 లీటర్ల వరకు పురుగు మందులు వాడుతున్నారు. ఇలా మొత్తం ఎరువులు, పురుగుమందులకోసం దాదాపు రూ.150 కోట్లు వరకు వెచ్చించారు. సేంద్రియంపై పెరగని ఆసక్తి.. రైతాంగంలో ఒకప్పుడు ఉండే సహనం... ఆసక్తి ఇప్పుడు సన్నగిల్లుతోంది. ఒకప్పుడు పూర్తిగా గెత్తం వంటివాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవా రు. కానీ సునాయాసంగా మార్కెట్లో లభ్యమ య్యే ఎరువులను కొనుగోలు చేసి వేసేస్తున్నారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే సేంద్రియ ఎరువులుగానీ... తెగుళ్ల నివారణకోసం తయారయ్యే ద్రావణాల జోలికి పోవడం లేదు. దీనికి కాస్తంత శ్రమపడాల్సి రావడమే కారణం. వాస్తవానికి ర సాయనిక ఎరువుల వినియోగంవల్ల ఏడాదికేడాదికీ భూసారం తగ్గిపోతోంది. దిగుబడిపై దాని ప్రభావం చూపుతోంది. అయినా రైతాంగం మా త్రం రసాయనికంపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. సేంద్రియమే మేలు.. పంటలకు ఆశించే తెగుళ్లు, పురుగులను సేంద్రియ ఎరువుల ద్వారా కూడ నివారించవచ్చు. ప్రకృతిలో దొరికే వేపగింజలతో చేసే వేపకషాయం, పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం, వేపనూనె తయారీకి అతి తక్కువ ఖర్చు వుతుంది. వీటిని వినియోగించి తెగుళ్లను సమర్థంగా నివారించవచ్చు. వర్మీకంపోస్టు, అజొల్లా వంటివి వేసి కూడా పంటలను పండించవచ్చు. దీనివల్ల పంటలు ఆరోగ్యకరంగా ఉంటాయి. వాటి ఉత్పత్తులకు మంచి డి మాండ్ ఉంటుంది. – టి.ఎస్.ఎస్.కె.పాత్రో, వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి -
‘రసాయన’ సాగు వీడితేనే మేలు
వాతావరణం గతి తప్పడానికి వ్యవసాయ విధానమే ప్రబలమైన కారణమని గుర్తించడంతో ప్రపంచం తాను అనుసరిస్తూ వస్తున్న వ్యవసాయ విధానంలో మార్పుకోసం ప్రయత్నిస్తూ వస్తోంది. సురక్షితమైన, ప్రకృతి సహజ పద్ధతుల్లో పండించిన ఆహారం కోసం ఇప్పుడు ప్రపంచం పిలుపునిస్తోంది. భారీ సబ్సిడీలను గుమ్మరించడమే వ్యవసాయంలో విధ్వంసానికి కారణం. ప్రపంచం తెలీకుండానే దీనికి మూల్యం చెల్లిస్తోంది. అందుకే సహజ వ్యవసాయ విధానాలవైపుగా ప్రభుత్వ వ్యవసాయ యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించాలి. ప్రతి ఏటా ఎరువులకు ఇస్తున్న సబ్సిడీలను క్రమంగా తగ్గించుకునే చర్యలు చేపట్టాలి. ఇలాంటి మార్పును ప్రారంభించాలంటే, మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు రసాయన ఎరువులను పూర్తిగా దూరం పెట్టేలా తమ పరిశోధనా కార్యక్రమాలను పూర్తిగా రీడిజైనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచం రసాయన వ్యవసాయ పద్ధతుల నుంచి బయటపడాల్సిన తరుణం ఆసన్నమైంది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచం అనుసరిస్తున్న సాంద్ర వ్యవసాయ విధానాలు 25 శాతం గ్రీన్ హౌస్ ఉద్గారాలకు కారణమై వ్యవసాయ సంక్షోభాన్ని తీవ్రతరం చేయడమే కాకుండా, ప్రకృతి వనరుల పునాదిని భారీగా దెబ్బతీస్తూ వచ్చాయి. వాతావరణం గతి తప్పడానికి వ్యవసాయ విధానమే ప్రబలమైన కారణమని గుర్తించడంతో ప్రపంచం తాను అనుసరిస్తూ వస్తున్న వ్యవసాయ విధానంలో నెమ్మదిగా అయినప్పటికీ మార్పుకోసం ప్రయత్నిస్తూ వస్తోంది. సురక్షితమైన, ప్రకృతి సహజ పద్దతుల్లో పండించిన ఆహారం కోసం ఇప్పుడు యావత్ ప్రపంచం పిలుపునిస్తోంది. వ్యవసాయాన్ని చుట్టుముడుతున్న పర్యావరణ సంక్షోభానికి పునాది ఏదంటే, వ్యవసాయంలో భారీ సబ్సిడీలను గుమ్మరించడమే. ప్రపంచం తెలీకుండానే దీనికి మూల్యం చెల్లిస్తోంది. ప్రపంచ సైంటిస్టులు, నిపుణులు, ఆర్థిక వేత్తలతో కూడిన ఫుడ్ అండ్ ల్యాండ్ యూజ్ కొయిలిషన్ (ఎఫ్ఓఎల్యూ) సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకా రం, మానవ ఆరోగ్యం, సహజ వనరులు, పర్యావరణంపై అపారమైన ‘రహస్య వ్యయం’ కారణంగానే చౌక ఆహారం అందుబాటులోకి వస్తోంది. చౌక ఆహారం 12 లక్షల కోట్ల డాలర్ల విలువైనదిగా (చైనా జీడీపీతో సమానం) పరిగణిస్తున్నప్పటికీ ఆహార వాణిజ్యం ఇలాగే హార లేమితో ఇబ్బంది పడుతుందని ఈ సర్వే హెచ్చరించింది. వ్యవసాయ సంక్షోభానికి దారితీసిన కారణాలను పరిశీలించిన ఈ నివేదిక తక్షణం చేపట్టాల్సిన పది పరివర్తనా చర్యలను సూచించింది. పెరుగుతున్న పోషకాహార లేమి లేక ‘నిగూఢ ఆకలి’ అనేది సహజ వనరుల విధ్వంసం, వాతావరణ ఉత్పాతం ఫలితంగా సంభవించిన విషాద పరిణామంగానే చెప్పాలి. ఇది పర్యావరణ ఆత్మహత్యకు తక్కువేమీ కాదు. ‘ఆహారాన్ని, భూ వినియోగాన్ని మార్చివేసేందుకు పది సంక్లిష్ట పరివర్తనలను అభివృద్ధి చేయడం’ అనే పేరుతో వచ్చిన మరో నివేదిక.. ఆహార ఉత్పత్తిపై ఏటా 700 బిలి యన్ డాలర్లు ఖర్చుపెడుతున్నారని అంచనా వేసింది. అయితే వ్యవసాయానికి ప్రపంచవ్యాప్తంగా అందిస్తూ వస్తున్న సబ్సిడీల పరిమాణాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టసాధ్యం కాబట్టి ఆహారోత్పత్తికి సంబంధించిన గణాంకాలు ఇంకా ఎక్కువే ఉండవచ్చని నిపుణుల వ్యాఖ్య. నన్ను ఒక విషయంలో స్పష్టత ఇవ్వనీయండి. అదేమిటంటే, ఈ సబ్సిడీలన్నీ రైతులకు చేరలేదన్నదే. ప్రత్యక్ష నగదు మద్దతుతో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా సబ్సిడీల రూపంలో రైతుల చేతికి వస్తున్నది చాలా చిన్న మొత్తమేనని చెప్పాలి. ఉత్పత్తిదారు సబ్సిడీ సమతుల్యత (పీఎస్‌యూ) ప్రాతిపదికన నిర్వహించిన మరొక అధ్యయనం రైతులకు ప్రపంచ వ్యాప్తంగా లభించిన సబ్సిడీ మద్దతు కొలమానాలను అంచనా వేసింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వాణిజ్య మండలి ఓఈసీడీ (ఆర్థిక సహకారం, అభివృద్ది సంస్థ), చైనా కలిసి 2016–17లో ఒక్కొక్కటి వరుసగా 235 బిలియన్ డాలర్లు, 232 బిలియన్ డాలర్లను వార్షిక సబ్సిడీ కింద రైతులకు అందజేశాయని ఈ అధ్యయనం అంచనా. 2005 డిసెంబర్లో జరిగిన హాంకాంగ్ మినిస్టీరియల్ సమావేశంలో ప్రపంచ వాణిజ్య సంస్థ తొలి పదేళ్ల వ్యవసాయ ఒప్పందంపై సమర్పించిన నివేదిక ప్రధాన రచయితగా నా అంచనా ప్రకారం, వ్యవసాయ సబ్సిడీల్లో 80 శాతం వరకు నిజమైన రైతులకు కాకుండా ప్రపంచమంతటా వ్యవసాయ వాణిజ్య కంపెనీలకే అందాయి. 2005లో సంపన్న దేశాలు ఇచ్చిన 360 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ సబ్సిడీల స్థితిగతులను ప్రపంచ వాణిజ్య సంస్థ పరిశీలించింది. ప్రధానంగా ఎగుమతి ఆధారిత వ్యవసాయంలో భాగంగా ఈ సబ్సిడీల్లో అధికభాగం నేల సారాన్ని ధ్వంసం చేసి, భూగర్భ జలాన్ని కలుషితం చేసిన సాంద్ర వ్యవసాయ విధానాలకు ఉపయోగించారు. పైగా పశుపోషణకు, పామాయిల్ తోటలకు, బయో–ఫ్యూయల్ పంటలను పెంచడానికి, ఇండస్ట్రియల్ లైవ్‌స్టాక్ పెంపకానికి, పర్యావరణాన్ని కలుషితం చేయడమే కాకుండా జీవవైవిధ్యతను నాశనం చేసి అనారోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేసిన ఆహార ప్రాసెసింగ్, వాణిజ్య విధానాలకు ఈ సబ్సిడీలను ఉపయోగించడం గమనార్హం. సంవత్సరానికి దాదాపు 700 బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ వ్యవసాయ సబ్సిడీల్లో కేవలం ఒక శాతం మాత్రమే పర్యావరణ హితమైన వ్యవసాయ విధానాలకు అందటం విచారకరం. భారతదేశంలో కూడా వార్షికంగా అందచేస్తున్న సబ్సిడీ మద్దతులో ఒక్కటంటే ఒక్క శాతం మాత్రమే పునరుత్పాదక వ్యవసాయానికి లేక సహజ, సమగ్ర వ్యవసాయానికి అందించారు. పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాలకు చాలా తక్కువ మొత్తం సబ్సిడీలు మాత్రమే అందిస్తున్నారని ఫుడ్ అండ్ ల్యాండ్ యూజ్ కొయిలేషన్ సంస్థ ప్రిన్సిపల్ జెరెమీ ఒప్పెన్హైమ్ తెలియజేశారు. ఇకనైనా సానుకూల ఫలితాలను తీసుకొచ్చే రంగాలకు సబ్సిడీలను మళ్లించాల్సి ఉందని చెప్పారు. దీనికి సంబంధించి పలు సవాళ్లు ఉన్నాయి. కానీ సరైన దిశగా చిన్ని అడుగులు వేయడం మొదలుపెడితే అది సురక్షిత ఆహార వృద్దిలో గణనీయ పరివర్తనకు దారితీస్తుంది. రసాయన ఎరువులనుంచి రైతులు వైదొలగాలని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు కానీ ఉన్నట్లుండి అలాంటి చర్యలు చేపడితే హరిత విప్లవం ద్వారా దేశం సాధించిన ప్రయోజనాలన్నీ ఒక్కసారిగా స్తంభించిపోతాయని శాస్త్ర ప్రపంచం భావిస్తోంది. దీనికి బదులుగా నేచుర్ పత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకారం చైనా రసాయనాల వాడకాన్ని 15 శాతానికి తగ్గించడం ద్వారా వరి, గోధుమ, మొక్కజొన్న వంటి పంటల్లో సగటున 11 శాతం మేరకు ఆహార పంటల ఉత్పత్తిలో పెరుగుదల సాధించిందని తెలుస్తోంది. అయితే సంవత్సరాలపాటు 14 వేల వర్క్‌షాపులు నిర్వహించడం, 65 వేల బ్యూరోక్రాట్లను, టెక్నీషియన్లను, వెయ్యి మంది పరిశోధకులను సమన్వయం చేసినటువంటి సుదీర్ఘమైన దృఢదీక్షా వైఖరి కారణంగానే చైనాలో ఇంతటి మార్పు సంభవించింది. పైగా 2020 సంవత్సరం లోపు ఎరువులు, పురుగుమందుల సబ్సిడీని జీరో స్థాయికి తీసుకొస్తానని చైనా ప్రకటించింది. అలాంటప్పుడు చైనా విధానాన్ని భారత్ కూడా అవలంబించి సహజ వ్యవసాయ విధానాలవైపుగా ప్రభుత్వ వ్యవసాయ యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించాలి. అదే సమయంలో ప్రతి ఏటా ఎరువులకు ఇస్తున్న సబ్సిడీలను క్రమంగా తగ్గించుకునే చర్యలు చేపట్టాలి. ఎరువుల సబ్సిడీలపై కోత విధించడంతోపాటు చైనా పంటల మార్పు, పంటల అవశేషాలను తిరిగి ఉపయోగించుకోవడం, నేల సారాన్ని కాపాడటం వంటి వాటిని ప్రోత్సహిస్తూ వచ్చింది. హరిత విప్లవం సమయంలో విజయవంతంగా అమలు చేసిన వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రాలను ఊతంగా తీసుకున్న చైనా తాజాగా కనీసం 40 స్వావలంబనా వ్యవసాయ క్షేత్రాలను ఏర్పర్చగలిగింది. పైగా పంటపొలాలను రసాయన సేద్యానికి దూరంగా ఉంచడంలో చిత్తశుద్ధితో వ్యవహరించింది. అదేసమయంలో పంజాబ్, హరియాణా రాష్ట్రాలు నీటిని తాగేసే రకం పంటలను పండించడం ద్వారా తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ప్రావిన్స్‌లో నీటివినియోగాన్ని తగ్గించడంలో విశేషంగా కృషి చేసిన రైతులకు ప్రోత్సాహకరంగా 500 మిలియన్ల ఆసీస్ డాలర్ల నిధిని ఏర్పర్చింది. మరి వరికి బదులుగా తక్కువ నీటిని వినియోగించే రైతులకు పంజాబ్‌లో కూడా ఇలాంటి ఉద్దీపన ప్యాకేజీలను ఎందుకు అందించకూడదు? పరిశ్రమలకు రూ. 1.45 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వగలిగినప్పుడు మన రైతులకు కూడా అలాంటి ఆర్థిక సహాయ ప్యాకేజీ ఇవ్వకపోవడంలో ఎలాంటి హేతువూ నాకు కనిపించడం లేదు. అయితే ఇలాంటి మార్పును ప్రారంభించాలంటే, మన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు రసాయన ఎరువులను పూర్తిగా దూరం పెట్టేలా తమ పరిశోధనా కార్యక్రమాలను పూర్తిగా రీడిజైనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మన ఆలోచనా విధానంలో మార్పు ఎంతో అవసరం. దీనికి కాస్త సమయం అవసరమవుతుంది కానీ అసాధ్యమేమీ కాదు. అదే సమయంలో వ్యవసాయానికి బడ్జెటరీ మద్దతును పర్యావరణ అనుకూల వ్యవసాయ వ్యవస్థల వైపుకు మళ్లించడం ఎంతో అవసరం. ప్రపంచ స్థాయిలో ఎఫ్ఓఎల్యూ నివేదిక కనీసం 500 బిలియన్ డాలర్ల మేరకు వ్యవసాయ సబ్సిడీలను రక్షణాత్మక వ్యవసాయం వైపు, దారిద్య్రాన్ని తొలగించడం, పర్యావరణ పునరుద్దరణ వైపు మళ్లించాలని పేర్కొంది. ఇది పెద్ద మొత్తమే కానీ కచ్చితంగా ఇది సాధించదగిన లక్ష్యమే మరి. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ :hunger55@gmail.com -
సేంద్రియ సాగు ఆచరణ సాధ్యమే!
సాక్షి, హైదరాబాద్: ‘సేంద్రియ పద్ధతిలో సుస్థిర సాగు ఆచరణ సాధ్యమనే విషయం మా అనుభవంలో వెల్లడైంది. భూవిస్తీర్ణంతో సంబంధం లేకుండా సన్న, చిన్నకారు రైతులు కూడా సేంద్రియ పద్ధతులు అవలంభించాలి. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించేందుకు బహుళజాతి కంపెనీ(ఎంఎన్సీ)లు అడ్డుపడుతున్నాయి. ప్రభుత్వపెద్దలు, అధికారుల అవినీతి వల్లే రసాయన ఎరువుల సబ్సిడీ విధానాలు కొనసాగుతున్నాయి. ప్రైవేటు, బహుళజాతి కంపెనీలకు ఇష్టారీతిన భూసంతర్పణ జరగకుండా సమగ్ర విధానాలు, చట్టాలు అవసరం’అని శ్రీలంక పార్లమెంటు సభ్యుడు అతురలియే రతన తెరో అన్నారు. బౌద్ధ సన్యాసి, వ్యవసాయదారు కూడా అయిన రతన తెరో బుద్ధ జయంతి జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ‘సేంద్రియ వ్యవసాయం’దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతపై ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి: మీ రెండురోజుల రాష్ట్ర పర్యటనలో గమనించిన అంశాలేమిటి? రతన: శ్రీలంక, తెలంగాణ నడుమ చరిత్ర, సంస్కృతి, ఆహారం, వ్యవసాయం, వాతావరణం తదితరాల్లో అనేక సారూప్యతలు ఉన్నాయి. పదేళ్లుగా మార్కెట్ ఎకానమీకి అనుగుణంగా శ్రీలంక సాగు విధానాలను మార్చుకుంటోంది. తెలంగాణ కూడా అదే మార్గంలో నడుస్తోంది. సాక్షి: వ్యవసాయరంగం పరంగా శ్రీలంకలో ఎలాంటి విధానాలు అమల్లో ఉన్నాయి. రతన: 2015 జనవరిలో శ్రీలంకలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన అధ్యక్షుడు సుస్థిర వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించారు. వ్యవసాయం, ఇతర అనుబంధ శాఖల పనితీరును సమీక్షించి అగ్రికల్చర్ వేస్టేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు, తేయాకు, దాల్చిన చెక్క ఆధారిత ఎగుమతులు, వరి, కూరగాయలు, కొబ్బరి తదితర వ్యవసాయ ఆధారిత అంశాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చి, నన్ను సలహాదారుగా నియమించారు. సాక్షి: ప్రభుత్వాలు రసాయన ఎరువులపై సబ్సిడీలు ఇస్తున్న నేపథ్యంలో సుస్థిర వ్యవసాయం సాధ్యమేనా? రతన: మొదట్లో రసాయన ఎరువులపై సబ్సిడీలు ఎత్తేసి, రైతులకు నేరుగా డబ్బులు ఇవ్వడం ద్వారా సేంద్రియ ఎరువుల వినియోగం పెరిగేలా ప్రోత్సహించాం. రసాయన ఎరువుల దిగుమతి, పంపిణీలో అవినీతికి అలవాటు పడిన అధికారులు, నేతల ఒత్తిడితో తిరిగి రసాయన ఎరువులపై పాత విధానాలకే ప్రభుత్వం మొగ్గు చూపింది. సాక్షి: ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ విధానంలో సుస్థిర వ్యవసాయం సాధ్యమేనా? రతన: మూడేళ్ల అనుభవంలో సుస్థిర వ్యవసాయం సాధ్యమనే విషయం తేటతెల్లమైంది. తేయాకు, కూరగాయల పంటల సాగులో ఈ విధానం అనుసరించేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ విషయంలో తెలంగాణ రైతులు కూడా మమ్మలను ఆదర్శంగా తీసుకోవచ్చు. అయితే సరైన ప్రభుత్వ విధానాల ద్వారానే సేంద్రియ వ్యవసాయం సాధ్యమవుతుంది. సాక్షి: రైతులను సేంద్రియ సాగు దిశగా మళ్లించడం సాధ్యమవుతుందా? రతన: ప్రభుత్వ నిర్ణయాలు స్థిరంగా లేనంతకాలం ఏ రైతు కూడా తనంత తానుగా సేంద్రియ సాగు వైపు మారలేడు. రసాయన ఎరువుల వినియోగానికి అలవాటు పడిన రైతులు.. ఎక్కువ దిగుబడి కోణంలోనే చూస్తున్నారు. కానీ పర్యావరణం, మానవ ఆరోగ్యంపై రసాయన ఎరువులు చూపుతున్న దుష్ప్రభావాలను పట్టించుకోవడం లేదు. అనుభవంతో చెప్తున్నాం. సేంద్రియ సాగు విధానాలు మాత్రమే అన్ని విధాలుగా శ్రేయస్కరం. సాక్షి: ఆర్గానిక్ సర్టిఫికేషన్‌పై అవగాహన లేని రైతులు ఉత్పత్తులను విక్రయించడంలో పడుతున్నఇబ్బందులకు పరిష్కారమేంటి? రతన: ప్రభుత్వాలు మొదట సమగ్రమైన భూచట్టాలు రూపొందించి, బహుళజాతి కంపెనీలు, ప్రైవేటు వ్యక్తులకు భూములు కట్టబెట్టకుండా విధానాలు రూపొందించాలి. క్షేత్ర స్థాయిలో రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి, వారి వ్యవసాయ ఉత్పత్తులు ‘ఆర్గానిక్’వే నంటూ క్షేత్రస్థాయి అధికారుల ద్వారా ధ్రువీకరణపత్రాలు ఇవ్వాలి. -
తెల్లదోమను తట్టుకున్న కొబ్బరి తోట
కోనసీమ పొత్తిళ్లలో పంటలను రూగోస్ తెల్లదోమ చావు దెబ్బ తీస్తోంది. అమెరికా నుంచి కేరళ, తమిళనాడు మీదుగా మన రాష్ట్రంలోకి వచ్చిన ఈ కొత్తరకం తెల్లదోమ పూర్తి పేరు వలయాకారపు తెల్లదోమ లేదా సర్పిలాకార తెల్లదోమ (రుగోస్ స్పైరలింగ్ వైట్ఫ్లై). గత ఏడాది నుంచి కొబ్బరి రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని వేలాది ఎకరాల కొబ్బరి తోటలు దీని బారిన పడి విలవిల్లాడుతున్నాయి. గాలి ద్వారా, అంటు మొక్కల ద్వారా వ్యాపించే ఈ తెల్లదోమ అంతటితో ఆగలేదు. ఆయిల్ పామ్, అరటి, మామిడి, కరివేపాకు, జామ తోటలనూ చుట్టేస్తోంది. రామాఫలం, పనస మొక్కలను, కడియం నర్సరీల్లో పూల మొక్కలను సైతం ఆశిస్తోంది. దీన్ని అరికట్టడానికి శాస్త్రవేత్తలు నానా తంటాలు పడుతున్నా అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. రసాయనిక పురుగుమందులు వాడితే ఫలితం ఉండకపోగా ప్రతికూల ఫలితాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. తోటల్లో బదనికలు వదలడం ద్వారా జీవనియంత్రణ పద్ధతులను అవలంబించడమే మార్గమని సూచిస్తున్నారు. అయితే, తమిళనాడుకు చెందిన కొబ్బరి రైతు అరుసు అనుభవం భిన్నంగా ఉంది. తమ వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఉన్న రసాయనిక సేద్యం జరుగుతున్న తోటలన్నీ తెల్లదోమతో 100% దెబ్బతింటే.. తన చెట్లకు 10%కి మించి నష్టం జరగలేదని పచ్చగా అలరారుతున్నాయని ఆయన తెలిపారు. ఇంతకీ ఆయన విజయరహస్యం ఏమిటి? ఆ వివరాలు.. ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం. జీవామృతం, గార్బేజ్ ఎంజైమ్, అగ్నిహోత్రంతో కూడిన ప్రకృతి సేద్యమే తన తోట పచ్చగా నిలబడటానికి కారణమని తమిళనాడుకు చెందిన కొబ్బరి రైతు అరుసు సగర్వంగా చెబుతున్నారు. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి 20 కిలోమీటర్ల దూరంలో గల తన గురుకృప గ్రీన్ ఫామ్‌లో మూడు, నాలుగేళ్లుగా ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు అనుబంధంగా ఉన్న వ్యవసాయ విభాగం నిపుణులు ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలో రైతులకు శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తుంటారు. ఆమె అందించిన సమాచారం ప్రకారం.. అరుసు కొబ్బరి తోట పరిసరాల్లోని ఇతర కొబ్బరి తోటలను రూగోస్ తెల్లదోమ తీవ్రంగా దెబ్బతీసింది. మంగు కారణంగా ఆకులు నల్లగా మారి రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తెల్లదోమ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే కొందరు రైతులు కొబ్బరి చెట్లు కొట్టేసి వరి సాగు ప్రారంభించారు. అయితే, పక్కనే ఉన్న అరుసుకు చెందిన కొబ్బరి తోట మాత్రం పచ్చగా అలరారుతోంది. ఈ తోటకు కూడా రూగోస్ తెల్లదోమ సోకింది. అయితే, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నందున నష్టం 10 శాతానికే పరిమితమైందని ఉమమహేశ్వరి తెలిపారు. అరుసు అనుసరిస్తున్న సాగు పద్ధతి అరుసు కొబ్బరి చెట్లకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడటం లేదు. పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. కొబ్బరి చెట్ల మొదళ్లకు చుట్టూ ఎండు ఆకులతో ఆచ్ఛాదన కల్పిస్తున్నారు. చెట్ల మొదళ్లకు దూరంగా చుట్టూ గాడి తీసి నీటితో పాటు 15 రోజులకోసారి జీవామృతం ఇస్తున్నారు. పండ్లు, కూరగాయ తొక్కలను మురగబెట్టి తయారు చేసుకున్న గార్బేజ్ ఎంజైమ్‌ను లీటరుకు 100 లీటర్ల నీరు కలిపి వారానికోసారి పిచికారీ చేస్తున్నారు. ఆవు పేడ పిడకలతో రోజూ అగ్నిహోత్రం నిర్వహిస్తున్నారు. తద్వారా హానికారక వాయువులు తోట దరి చేరకుండా ఉంటాయని ఉమామహేశ్వరి(90004 08907) తెలిపారు.] జీవామృతం, గార్బేజ్ ఎంజైమే కాపాడుతున్నాయి ప్రకృతి వ్యవసాయంలో బెంగళూరు తదితర చోట్ల శిక్షణ పొందాను. కొబ్బరి, అరటి తోటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మూడు, నాలుగేళ్లుగా సాగు చేస్తున్నాను. మా ప్రాంతంలో తెల్లదోమ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నేను మాత్రం జీవామృతం, గార్బేజ్ ఎంజైమ్‌ను మాత్రమే వాడుతున్నాను. మా పొరుగు తోటల్లో తెల్లదోమ తీవ్రత 100% ఉంటే నా తోటలో కేవలం 10%కి పరిమితమైంది. మా కొబ్బరి చెట్లు చాలా ఆరోగ్యంగా, పచ్చగా కనిపిస్తుండటం చూసి ఈ ప్రాంత రైతులు ఆశ్చర్యపోతున్నారు. జీవామృతం, గార్బేజ్ ఎంజైమ్‌లే నా తోటను రక్షిస్తున్నాయని నేను భావిస్తున్నాను. తెల్లదోమ ఆశించినప్పటికీ తీవ్రత పది శాతానికి మించి లేదు. చెట్లు బలంగా, ఆరోగ్యంగా ఉన్నాయి. మా కొబ్బరి చెట్ల ఆకులు ఎండాకాలంలో కూడా రాలిపోవు. ప్రకృతి వ్యవసాయం వల్ల కాయల బరువు కూడా 350 గ్రాముల నుంచి 500 గ్రాములకు పెరిగింది. అరుసు (97509 29185) (తమిళంలో మాత్రమే మాట్లాడగలరు), కొబ్బరి రైతు, పొలాచ్చి,కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు ఇన్పుట్స్: ఎన్. సతీష్‌బాబు, సాక్షి, అమలాపురం జీవ నియంత్రణే మేలు ►మిత్రపురుగులు ►బదనికలు ►గంజి ద్రావణం ►ఫంగస్ ►కొబ్బరి, ఆయిల్‌పామ్, అరటి పంటలలో, ఈ దోమ ఆశించిన తోటల్లో పసుపురంగు జిగురు అట్టలను కట్టాలి. పసుపురంగుకు ఆకర్షించే ఈ పురుగు అట్టలకు అంటుకుని చనిపోతోంది. అట్టలు ఏర్పాటు చేయడం వల్ల పురుగు ఉంటే దాని ఆచూకీని కనిపెట్టే అవకాశముంది. ►పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లార్వా (పిల్ల), ప్యూపా (నిద్రావస్థ) దశలకు సంబంధించి ఎన్కార్సియా గ్వడలోపే జాతి బదనికలు తోటల్లో వదలాల్సి ఉంది. తమిళనాడు ప్రాంతం నుంచి అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు మిత్రపురుగులను తీసుకు వచ్చి దోమ ఉన్న తోటల్లో వదులుతున్నారు. ►తెల్లదోమ వల్ల వచ్చే మసిమంగు నివారణకు ఒక శాతం గంజి ద్రావణాన్ని మసి ఆశించిన మొక్కలపై భాగాలపై పిచికారీ చేయాలి. లేదా ఉధృతంగా మంచినీటిని ఆకుల మీద పడేలా చేయాలి. ఇలా చేస్తే నల్లని మసిమంగు వదిలిపోతుంది. ►వేప నూనెను ప్రతీ పదిహేను రోజులకు మొక్క ఆకు అడుగుభాగం తడిచేలా పిచికారీ చేయాల్సి ఉంది. ఒక్క శాతం వేప నూనెకు పది గ్రాముల డిటర్జెంట్ పౌడరు కలిపి పిచికారీ చేయాల్సి ఉంది. ►వేప నూనెకు ప్రత్యామ్నాయంగా అంబాజీపేట ఉద్యాన పరిశో«ధనా స్థానం ఐసోరియా ఫ్యూమోసోరోసే ఫంగస్‌ను ఆకుపై పిచికారీ చేయాలి. ఈ ఫంగస్‌ను తయారు చేసుకోవడం ఎలాగో రైతులకే నేర్పిస్తున్నాం. ►కొత్తగా డైకోక్రై సా ఆస్టర్ మిత్రపురుగులను తోటల్లో విడుదల చేయాల్సి ఉంది. తెల్లదోమ గుడ్డు, పిల్ల పురుగు దశలో తెల్లదోమను ఈ మిత్రపురుగు తింటుంది. ►దోమ ఆశించిన తోటలు, నర్సరీల నుంచి మొక్కలు తెచ్చుకోకూడదు. డా. ఎన్.బి.వి.చలపతిరావు (98497 69231), ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగం), కొబ్బరి పరిశోధనా కేంద్రం, అంబాజీపేట, తూ.గో. జిల్లా -
అపార్ట్‌మెంట్‌పైనే ‘అమృత్’ పంటలు!
ఈ నెల 5న ప్రపంచ భూముల దినోత్సవం సందర్భంగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు పండించుకుంటూనే భూసారాన్ని పెంపొందించుకుంటున్న అన్నదాతలతోపాటు.. మన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న డాక్టర్ మేధా శ్రీంగార్‌పురే అనే సిటీ ఫార్మర్కు కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం.. ఎందుకంటే.. పంట భూములకు దూరంగా కాంక్రీటు అరణ్యంలో నివాసం ఉంటున్న ఆమె తమ వంటింటి వ్యర్థాలను, చెరకు పిప్పిని ఉపయోగించి తమ అపార్ట్మెంటు మేడ పైనే ఆమె ‘అమృత్ మిట్టి’ని తయారు చేస్తున్నారు. అత్యంత సారవంతమైన అమృత్ మిట్టితో అద్భుత పోషక విలువలున్న సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను అనేక ఏళ్లుగా పండించుకొని తింటూ ఆరోగ్యంగా, మహానగర జీవులకు ఆదర్శప్రాయంగా జీవిస్తున్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌పై చెత్త భారాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతున్నారు. అంతేకాదు, ఆవు పేడ – మూత్రంలతో ద్రవ రూప ఎరువు ‘అమృత్ జల్’ను తయారు చేసుకొని వాడుతూ అమృతాహారాన్ని పండించుకుంటున్నారు. కూరగాయలు.. పండ్లు.. ముంబై నగరంలోని మాజ్గవ్ టెర్రస్ అనే సొసైటీలోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో దంత వైద్యురాలు మేధా శ్రీంగార్‌పురే రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఆమె తమ అపార్ట్మెంట్ భవనం టెర్రస్‌పైనే సిటీ ఫార్మింగ్ చేస్తున్నారు. తన ఇంట్లోని కిటికీలతోపాటు ముఖ్యంగా టెర్రస్‌ను 150 నుంచి 200 రకాల మొక్కలతో నందనవనంగా మార్చారు. ప్రస్తుతం పండ్లలో జామపండ్లు, సీతఫలం, చెర్రీ పండ్లు, బత్తాయి పండ్లు ఇలా అనేక రకాల పండ్ల చెట్లతోపాటు ఆకు కూరలు, సీజనల్ కూరగాయలు, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు, మునగకాయలు, పలు రకాల మిరపకాయలు, పుష్పాలు ఇలా అనేక రకాలు ఆమె ఇంటిపంటల్లో కనిపిస్తున్నాయి. ఇతర భవనాల టెర్రస్లపైనా... మాజ్‌గావ్ టెర్రస్ సొసైటీలో అన్ని భవనాలూ నాలుగు అంతస్తులవే ఉన్నాయి. డా. మేధా ఉండే భవనం టెర్రస్‌పై ఇంటిపంటల సాగులో మంచి ఫలితాలు కన్పించడంతో ఇతర భవనాల వారు కూడా వారి వారి టెర్రస్లపైనా మొక్కలు నాటేందుకు ఆసక్తిచూపారు. రసాయనాలు లేకుండా పండే కూరగాయలను తింటే ఎంతో రుచితోపాటు మాటల్లో చెప్పలేని ఆరోగ్యం, ఆనందం కలుగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం రెండు గంటలు.. శని, ఆదివారాలలో 4 గంటల సమయం కేటాయిస్తున్నా. ఇదంతా చేయడానికి శ్రద్ధ చాలా అవసరం అంటారు డా. మేధా. అపార్ట్మెంట్లో అందరి అనుమతితోనే.. వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన సహజ సేంద్రియ ఎరువు ‘అమృత మిట్టి’ మా ఇంట్లో చాలా పోగైంది. దీన్ని ఏమి చేయాలని ఆలోచించగా టెర్రస్‌పై కూరగాయ మొక్కలు పెంచవచ్చన్న ఆలోచన వచ్చింది. అంతే భవనంలోని అన్ని అంతస్తులలో నివసించే వారిని సంప్రదించి లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకున్నా. సొసైటీ బాధ్యులతో చర్చలు జరిపి అన్ని అనుమతులు పొంది టెర్రస్‌పై అయిదేళ్ల కిందట సేంద్రియ పంటలు పెంచడం ప్రారంభించా. ఆ కొత్తలోనే అర్బన్ లీవ్స్ ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో పాల్గొని అనేక మెళకువలు తెలుసుకున్నా. అర్బన్ లీవ్స్‌కు వాలంటీర్‌గా సేవలందించడంతో అనుభవపూర్వకంగా చాలా విషయాలు తెలిసివచ్చాయి. దీంతో రెండేళ్లలోనే టెర్రస్‌పై పెంచిన మొక్కలు చక్కని దిగుబడినివ్వటం ప్రారంభమైంది. . – డా. మేధా శ్రీంగార్‌పురే (98695 48090), మాజ్‌గావ్ టెర్రస్ సొసైటీ, ముంబై ముంబైలో అర్బన్ లీవ్స్ సంస్థ టెర్రస్‌పై నెలకొల్పిన ఒక కమ్యూనిటీ గార్డెన్ – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై -
అతికించేద్దాం.. ఆదా చేద్దాం..
ఓ చిన్న ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు. కృపా వారణాసి విషయంలో ఆరేళ్ల క్రితం ఇదే జరిగింది. బోలెడంత డబ్బు పెట్టి కొనే టమాటా కెచప్ చివరి బొట్టును కూడా వాడుకునేందుకు ఈయన ఓ వినూత్నమైన ప్లాస్టిక్ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. కెచప్ బాటిల్లోంచి చివరి బొట్టు సులువుగా జారిపోయే వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది కూడా. ఆ తరువాత ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని కంపెనీలు వాడుకోవడం మొదలుపెట్టాయి. లిక్వీ గ్లైడ్ పేరుతో కృపా వారణాసి స్థాపించిన కంపెనీ కోటింగ్‌లు, ప్యాకేజింగ్ మొదలుకొని వైద్య పరికరాలు.. ఆఖరికి చమురు పైపుల్లోపలకూ చేరిపోయాయి. దీనికీ చారాణా కోడికి.. సంబంధం ఏమిటని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాం. 10% పురుగుల మందుల వాడకంతో... పంటలు ఏపుగా పెరగాలని రైతులు పురుగుల మందులను అవసరానికి మించి వాడుతున్నారని శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. అవగాహన రాహిత్యమనండి.. పంట ఏపుగా పెరగాలన్న ఆకాంక్ష కానివ్వండి.. రైతు తమ అలవాట్లను మార్చుకున్నది లేదు. అయితే ఓ చిన్న ఐడియాను అమల్లోకి తెస్తే కేవలం 10% పురుగు మందులతోనే మంచి దిగుబడులు సాధించవచ్చని కృపా వారణాసి గుర్తించారు. అదేంటంటే పురుగుల మందులు ఆకులకు అంటుకు పోయేలా చేయడం!. నీళ్లు, నీళ్లు కలిపిన పురుగుల మందులు వరితోపాటు గోధుమ, ఉల్లిపాయ, క్యాబేజీ వంటి పంటల ఆకులకు అస్సలు అంటుకోవు. ఇలాకాకుండా.. పురుగుల మందుల తయారీలో మార్పులు చేసి ఇవి ఆకులకు అతుక్కునేలా చేస్తే ఖర్చు కలిసొస్తుందని కృపా వారణాసి చెబుతున్నారు. హైదరాబాద్, జునాగఢ్‌లో పరిశీలన.. ఆకులకు అతుక్కునే పురుగుల మందు తయారీకి కృపా వారణాసి ప్రయత్నాలు ఐదేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయి. మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని ‘టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్’అందించిన నిధులతో కృపా పరిశోధనలు ప్రారంభించారు. మహేర్ దామక్ అనే పరిశోధక విద్యార్థితో కలసి హైదరాబాద్, జునాగఢ్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థం చేసుకున్నారు. 250 కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఏటా వాడుతున్న పురుగుల మందు (కిలోల్లో) 25 కోట్లు కొత్త పద్ధతి అమల్లోకి వస్తే వాడకం (కిలోల్లో) ‘‘చారాణా కోడికి.. బారాణా మసాలా’’ అని సామెత! ఏ విషయంలోనైనా అవసరానికంటే ఎక్కువ వాడకూడదన్నది అర్థం! వ్యవసాయంలో పురుగుల మందు వాడకానికి ఇది అచ్చుగుద్దినట్లు సరిపోతుంది! కానీ గత్యంతరం లేక మందులను విపరీతంగా వినియోగిస్తున్నారు! ఇకపై మాత్రం అలా కాదు.. థ్యాంక్స్ టు కృపా వారణాశి! -
వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించే మొక్కజొన్న!
పరస్పర ఆధారితంగా జీవించడమే ప్రకృతిలో అత్యద్భుతమైన సంగతి. సూక్ష్మజీవులు, మొక్కలు ఇచ్చి పుచ్చుకోవటం ద్వారా సజావుగా జీవనం సాగించడం విశేషం. మెక్సికో దేశంలో సియెర్ర మిక్సె అనే ఒక దేశవాళీ మొక్కజొన్న రకం.. తన పెరుగుదలకు అవసరమైన నత్రజనిని.. మేలుచేసే సూక్ష్మజీవరాశి ద్వారా సమకూర్చుకుంటూ.. సమస్యాత్మక నేలల్లోనూ నిక్షేపంగా చక్కని దిగుబడినిస్తోందని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. మొక్కజొన్న మొక్క కాండం కణుపుల వద్ద వేర్లు(ఏరియల్ రూట్స్) వంటివి పెరుగుతూ ఉంటాయి. కొన్ని మొక్కజొన్న జాతుల్లో బయట ఉండే ఈ వేర్లు పొడుగ్గా పెరిగి, భూమిలోకి చొచ్చుకెళ్తాయి కూడా. మొక్క పడిపోకుండా ఉండటానికి, నీటి తేమను అదనంగా గ్రహించడానికి ఇవి ఉపయోగపడుతుంటాయి. అయితే, తాజా పరిశోధనలో తేలిందేమంటే.. మెక్సికోలోని ఓక్సక దగ్గర ఒక ప్రాంతంలో నత్రజని లోపించిన నేలల్లో దేశవాళీ రకం మొక్కజొన్న మొక్కలు రసాయనిక ఎరువులు పెద్దగా వాడకపోయినా లేదా అసలు వాడకపోయినా నిక్షేపంగా పెరుగుతూ చక్కగా దిగుబడినిస్తున్నాయి. దీనిపై కాలిఫోర్నియా యూనివర్సిటీ(డేవిస్)కు చెందిన ప్రొ. అన్ బెన్నెట్, అల్లెన్ వాన్ డెన్జ్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు సుదీర్ఘ పరిశోధన జరిపిన తర్వాత ఇటీవల నిర్ధారణకు వచ్చిందేమంటే.. సూక్ష్మజీవుల ద్వారా ఈ మొక్కజొన్న మొక్కలు నత్రజనిని అసాధారణంగా గ్రహిస్తున్నాయని! మొక్కజొన్న మొక్కల కాండానికి ఉన్న కణుపుల దగ్గర గాలిలో తేలాడుతుండే వేర్లు(ఏరియల్ రూట్స్) ఒక రకమైన జిగురు వంటి తీపి ద్రవాన్ని స్రవిస్తుంటాయి. తద్వారా మేలు చేసే సూక్ష్మజీవరాశిని ఇవి ఆకర్షిస్తున్నాయి. మేలు చేసే సూక్ష్మజీవులు ఈ తీపి ద్రవాన్ని ఆహారంగా స్వీకరించి జీవిస్తూ.. అందుకు ప్రతిగా వాతావరణంలోని నత్రజనిని గ్రహించి మొక్కజొన్న మొక్క కణజాలానికి అందిస్తూ రుణం తీర్చుకుంటున్నాయి. 29–82% వరకు నత్రజనిని ఈ సూక్ష్మజీవులు మొక్కజొన్న మొక్కలకు అందిస్తున్నాయని తేలింది. పప్పుధాన్య పంటలు తమ వేరు వ్యవస్థలోని మేలు చేసే సూక్ష్మజీవుల ద్వారా వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తున్నాయని మనకు తెలుసు. అయితే, ఏకదళ జాతికి చెందిన మెక్సికోకు చెందిన మొక్కజొన్న నత్రజనిని వాతావరణం నుంచి గ్రహిస్తుండటం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరచిన వాస్తవం! ప్రధాన ఆహార పంటయిన మొక్కజొన్న సాగులో శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేసిన రసాయనిక ఎరువులను ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా వాడుతున్న నేపథ్యంలో.. అసలు నత్రజని ఎరువులు వేయనవసరం లేని మొక్కజొన్న రకాలను, ఆ మాటకొస్తే జొన్న రకాలను సైతం సృష్టించడం సాధ్యపడవచ్చని ప్రొఫెసర్ బెన్నెట్, ఆయన సహచర శాస్త్రవేత్తలు ఉత్సుకతతో భావిస్తున్నారు. ‘కొన్ని దేశవాళీ మొక్కజొన్న రకాలు కొన్నిటికి వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించే శక్తి ఉన్న విషయం మాకు కొత్తేమీ కాదు. అయితే, సియెర్ర మిక్సె రకం దేశీ మొక్కజొన్నకు ఆ లక్షణం ఉంది? ఆ మొక్కకు అవసరమయ్యే నత్రజనిని సూక్ష్మజీవ రాశి ద్వారా ఎంతమేరకు వాస్తవంగా గ్రహిస్తున్నదీ నిర్ధారించుకోవడానికి, అనేక విభాగాల శాస్త్రవేత్తలు కలిసి పనిచేస్తే, మాకు పదేళ్లు పట్టింది’ అని ప్రొ. బెన్నెట్ అన్నారు. -
అజొల్లాతోనే దేశీ వరి సాగు!
హరిత విప్లవం రాకతో దేశీ వంగడాలు, పద్ధతులు, పంటల వైవిధ్యం ప్రాభవాన్ని కోల్పోయాయి. సంకరజాతి వంగడాలు, రసాయనిక ఎరువులు, పురుగుమందుల రాకతో తొలినాళ్లలో కళ్లు చెదిరే దిగుబడులు వచ్చాయి. కానీ కాలక్రమంలో తిరిగి సేంద్రియ విధానంలో సంప్రదాయ వంగడాల సాగే రైతుకు ఆశాదీపం అంటున్నారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అనుపమ్ పాల్. కేవలం అజొల్లాతోనే దేశీ వరి వంగడాల సాగును చేపట్టవచ్చని ఆయన అంటున్నారు. దేశీ వరి వంగడాలతో దిగుబడులు తక్కువనే విస్తృత ప్రచారంతో వాటి ఊసే రైతులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈ దశలో పశ్చిమ బెంగాల్‌లోని ఫూలియా వ్యవసాయ శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనుపమ్ పాల్ దేశీ వరి వంగడాల పరిరక్షణకు నడుం బిగించారు. 400 రకాలకు పైగా సంప్రదాయ వరి వంగడాలను సేకరించి, సాగు చేస్తూ సంరక్షిస్తున్నారు. తద్వారా ఈ వంగడాలను తిరిగి రైతులకు అందిస్తున్నారు. కేవలం అజొల్లాతోనే సేంద్రియ విధానంలో దేశీ వరి వంగడాల సాగుపై రైతులకు శిక్షణ నిస్తున్నారు. నదియా జిల్లాలోని ఫులియా వద్ద గల వ్యవసాయ శిక్షణా కేంద్రంలో 400 రకాల సంప్రదాయ వరి వంగడాలను సాగు చేస్తున్నారు. 15 రోజుల నారును పొలంలో నాటుకుంటారు. అంతకు ముందునుంచే విడిగా మడుల్లో నిల్వ కట్టిన నీటిలో అజొల్లా అనే నాచును పెంచుతూ ఉంటారు. నాట్లు వేసుకున్న 25 రోజులు తర్వాతనే వరి పొలంలో నీటిపైన అజొల్లా చల్లుతారు. ఇతరత్రా ఎలాంటి రసాయన ఎరువులే కాదు సేంద్రియ ఎరువులు పంటలకు అందించరు. గాలిలో 78 శాతం ఉండే నత్రజనిని అజొల్లా గ్రహించి, మొక్కలకు అందిస్తుంది. పులియా వ్యవసాయ క్షేత్రంలోని మాగాణి భూమిలో ప్రధాన పోషకాలు చాలా తక్కువగా ఉన్నాయట. పీహె చ్ 7 శాతం, సేంద్రియ కర్బనం 0.6–0.8 వరకు ఉంది. రసాయనాలు వాడకపోవడం వల్ల నేల సారవంతమై.. సంప్రదాయ వంగడాలతో మంచి దిగుబడులు రావటం విశేషం. డాక్టర్ అనుపమ్ పాల్ ఇలా అంటారు.. ‘మేము పూలియాలోని వ్యవసాయ శిక్షణ కేంద్రంలో సంప్రదాయ వరి వంగడాలను సాగు చేస్తున్నాం. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు, ఇతర సేంద్రియ ఎరువులు వాyýటం లేదు. కేవలం అజొల్లాను మాత్రమే ఎరువుగా వాడుతున్నాం. ఎకరాకు 32 బస్తా(75 కిలోలు)ల ధాన్యం దిగుబడి వస్తోంది. గత పదిహేనేళ్లుగా ఇదే విధానంలో వరిని సాగు చేస్తున్నాం. దేశీ వరి వంగడాలను కేవలం దిగుబడి కోణంలో మాత్రమే చూడకూడదు. ‘ఐలా’ తుపాను సృష్టించిన విలయాన్ని కూడా తట్టుకొని నిలబడటం కేవలం సంప్రదాయ వరి రకాలకు మాత్రమే సాధ్యమైంది. 90–110 రోజుల్లోనే కోతకు వచ్చే స్వల్పకాలిక సంప్రదాయ వరి వంగడాలు వెయ్యి వరకు ఉన్నాయి. ఒక కొత్త వంగడాన్ని అభివృద్ధి చేస్తే దాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు చాలా డబ్బు ఖర్చు చేస్తారు. విస్తృత ప్రచారం కల్పిస్తారు. కానీ వీటిలో ఏ ఒక్క రకం కూడా పోషకాలు, పంట నాణ్యత, నాణ్యమైన గ్రాసం, తీవ్ర ప్రతికూల పరిస్థితులను తట్టుకోవటం వంటి అంశాల్లో సంప్రదాయ వంగడాలకు సాటి రాగలవి లేవు. సంప్రదాయ వరి వంగడాల విలువను, ఆవశ్యకతను గుర్తెరిగిన రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తున్నాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా 26 విత్తన కేంద్రాలను దీనికోసం ఏర్పాటు చేశాం. సంప్రదాయ వరి వంగడాలను సాగు చేయటం, వాటి జన్యువులను గుర్తించటం, విత్తనోత్పత్తిని చేపట్టటం వంటి పనులను ఆటవిడుపుగానో వినోదం కోసమో మేము చేయటం లేదు. విజ్ఞాన శాస్త్రం, జీవ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వంగడాల కన్నా సంప్రదాయ వంగడాలు అనేక అంశాలలో మెరుగైనవి కాబట్టే వాటిపై మేం దృష్టి సారించాం’ అన్నారు డా. అనుపమ్ పాల్. -
16 పోషకాలనిచ్చే సమృద్ధ ఎరువు
పంట పొలంలో వేసిన రసాయనిక ఎరువులు 30% మాత్రమే పంటలకు ఉపయోగపడతాయి. మిగిలిన 70% వృథాయే. ఈ రసాయనాల వల్ల భూసారం దెబ్బతింటుంది. అంతేకాదు.. భూమిలో ఉండి పంటలకు, రైతులకు మేలు చేసే జీవాలు చనిపోతాయి. పంటల దిగుబడి ఊహించనంతగా తగ్గిపోతుంది. ఇది గ్రహించిన కొందరు రైతులు ఇష్టపడి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. వర్మీ కంపోస్టు(జెర్రెల ఎరువు), పెంట(పశువుల) ఎరువు, కంపోస్టు మొదలైనవి తమ వీలును బట్టి పంటలకు వాడుతున్నారు. అయితే, ఇలా ఏదో ఒక ఎరువు వేస్తే మన పంటలకు సరైన పోషకాలు అందక ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నారు. సేంద్రియ పంటలకు అవసరమైన ముఖ్యమైన 16 పోషకాలను అందించే ‘సమృద్ధ ఎరువు’ను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, డీడీఎస్–కృషి విజ్ఞాన కేంద్రం వాడుకలోకి తెచ్చాయి. సమృద్ధ ఎరువులో 16 పోషకాలు.. టన్ను వర్మీ కంపోస్టును పొలంలో వేస్తే సుమారు 15 కిలోల నత్రజని, 3 కిలోల భాస్వరం, 5 కిలోల పొటాష్ లభిస్తుంది. వర్మీ కంపోస్టుతోపాటు పిడకల/పశువుల/పెంట ఎరువు, మేకల ఎరువులను 3:3:4 నిష్పత్తిలో కలిపి వేసినట్టయితే భూమికి అధిక పోషకాలు అందుతాయి. అంటే.. 3 టన్నులు వర్మీకంపోస్టు, 3 టన్నుల పిడకల ఎరువు, 4 టన్నుల మేకల ఎరువు కలిపితే 10 టన్నుల సమృద్ధ ఎరువు తయారవుతుంది. టన్ను సమృద్ధ ఎరువును వేస్తే.. 385 కిలోల సేంద్రియ కర్బనం, 18.6 కిలోల నత్రజని, 5.8 కిలోల భాస్వరం, 10.1 కిలోల పొటాష్ నేలకు అందుతాయి. సమృద్ధ ఎరువు మొత్తం 16 రకాల బలాల(పోషకాల)ను అందిస్తుంది. పంటకు తోడ్పడే సూక్ష్మజీవరాశి పుష్కలంగా ఉండటం వల్ల పూత, కాత బాగా వస్తుంది. భూసారాన్ని పెంపొందిస్తుంది. ఇసుక భూములకు కూడా నీటిని పట్టుకునే గుణం పెరుగుతుంది. భూమి మెత్తగా అయి, గాలిని పీల్చుకునే గుణం పెరుగుతుంది. దీన్ని వేయడం వల్ల చౌడు తగ్గి పంటలు బాగా వస్తాయి. సమృద్ధ ఎరువు ప్రభావం భూమిపై 2–3 ఏళ్ల వరకు ఉంటుంది. ప్రతి ఏటా ఎరువు ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉండదు. దీనితో పండించిన పంట ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. రుచిగా ఉంటుంది. మంచి ధర పలుకుతుంది. వివరాలకు.. డీడీఎస్–90003 62144, డీడీఎస్–కృషి విజ్ఞాన కేంద్రం–90104 96756 -
‘లాబ్’తో నారు.. లాభాల జోరు!
ఈ అభ్యుదయ రైతు పేరు గుదేటి సుబ్బారెడ్డి (43). గుంటూరు జిల్లా చుండూరులో మూడేళ్ల క్రితం అరెకరం పాలీహౌస్ నిర్మించి బంతి నారు పెంచి కర్ణాటకకు ఎగుమతి చేస్తున్నారు. 18–24 రోజులు పెంచి.. ఏడాదికి 10 బ్యాచ్‌ల బంతి నారును బెంగళూరు తదితర ప్రాంతాలకు పంపుతున్నారు. గతంలో రసాయనిక ఎరువులు వాడే వారు. న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివశంకర్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా(లాబ్)ను పరిచయం చేసిన తర్వాత మెరుగైన ఫలితాలు పొందుతున్నాడు.అర లీటరు లాబ్ ద్రావణాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి టన్ను కొబ్బరిపొట్టుపై చల్లుతారు. పాలీహౌస్‌లోని ట్రేలలో కొబ్బరిపొట్టును నింపి బంతి విత్తనం వేస్తారు. 15 రోజుల మొక్కలకు చీడపీడలు సోకకుండా.. లీటరు నీటికి 3 ఎం.ఎల్. కానుగ నూనెను కలిపి ఒకసారి పిచికారీ చేస్తారు. ఏడాదికి 50 లక్షల బంతి మొక్కలను ఎగుమతి చేస్తున్నానని.. మొక్క రూ.2.50 చొప్పున అమ్ముతున్నానని సుబ్బారెడ్డి తెలిపారు. రసాయనిక ఎరువులు వాడినప్పటì తో పోల్చితే.. లాబ్ వాడకం వల్ల మొక్కలు ఆరోగ్యంగా, పచ్చగా పెరుగుతున్నాయి. రెండు రోజులు ముందుగానే మొక్కలు సిద్ధమవుతున్నాయి. త్వరగా మెత్తబడకుండా తాజాగా ఉంటున్నాయని, ఖర్చు కూడా పది శాతం తగ్గిందని సుబ్బారెడ్డి(99632 93921) సంతోషంగా చెప్పారు. పాలీహౌస్ పక్కనే ఎకరంన్నర నిమ్మ తోటలో కూడా లాబ్ ద్రావణాన్ని వాడుతున్నారు. నిమ్మకాయల నాణ్యత పెరిగిందని ‘సాక్షి సాగుబడి’తో ఆయన చెప్పారు. గోంగూర మొక్కలు.. గోంగూరను విత్తనం వేసి పెంచాల్సిన అవసరం లేదు. పీకిన గోంగూర మొక్కలనే మార్కెట్లో కొంటారు కదా? ఆకులను కోసుకున్న తరువాత, ఆ మొక్కలను ఇలా తిరిగి పెరట్లోనో, కుండీల్లోనో, మిద్దె తోటల్లోనో నాటుకోవచ్చు. అవసరానుగుణంగా నీరు చల్లాలి. మళ్లీ వేరూనుకొని చిగురిస్తాయి. కొంతకాలానికి తిరిగి ఆకును ఇస్తాయి. – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోట నిపుణులు -
పొలం ఎడారవుతోంది!
తెలంగాణ రాష్ట్రంలో 31.34% భూమి పడావు పడి ఎడారిగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో 14.35%పంట భూమి ఎడారిగా మారింది.భూమికి ఎటువంటి ఆచ్ఛాదనా లేక వర్షాలకు భూమి పైపొర కొట్టుకుపోవటం, చెట్టు చేమ నశించటం ఇందుకు మూల కారణాలు. సాగులో ఉన్న పొలాలు జీవాన్ని కోల్పోతున్నాయి. పంట పొలాలు క్రమంగా గడ్డి కూడా మొలవని ఎడారైపోతున్నాయి. నీటి వనరులు బొత్తిగా లోపించి, పచ్చదనం, జీవరాశి కనుమరుగైన భూమి ఎడారిగా మారినట్లు లెక్క. ప్రపంచవ్యాప్తంగా 33% పంట భూములు ఇప్పటికే ఎడారిగా మారాయి. మన దేశంలో 32.87 కోట్ల హెక్టార్ల పొలం ఉంటే.. ఇందులో 9 కోట్ల 64 లక్షల హెక్టార్ల భూమి పంటల సాగుకు ఎంతమాత్రం పనికిరాకుండా పోయిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2003–05 నుంచి 2011–13 మధ్యకాలంలోనే 18 లక్షల 70 వేల హెక్టార్ల భూమి పంటలకు పనికిరాకుండా పోయింది. ► భూమి ఎడారిగా మారటానికి అనేక కారణాలున్నాయి. గత ఏడాది ‘ఇస్రో’ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన దేశంలో 1.12% సాగు భూములు, ముఖ్యంగా సాగు నీటి సదుపాయం ఉన్న డెల్టా భూములు, చౌడుబారిపోయాయి. రసాయనిక ఎరువులు అతిగా వాడటం వల్ల లేదా పర్యావరణ సమస్యల కారణంగా నేలపైకి లవణాలు ఎక్కువగా చేరటమే ఇందుకు కారణం.? ► వాన నీటి కోత కారణంగా సుమారు 11% భూమి ఎడారిగా మారుతున్నది. ► అడవుల నరికివేత, పోడు వ్యవసాయం, చెట్టు చేమను అతిగా కొట్టివేయటం వంటి పనుల వల్ల సుమారు 9 శాతం భూమి ఎడారిగా మారుతున్నది. ► తీవ్రమైన గాలుల వల్ల భూమి పైపొర గాలికి కొట్టుకుపోవటం, ఇసుక తెన్నెలు ఇతర ప్రాంతాల్లోకి వచ్చి పడటం వల్ల సుమారు 5.55% భూమి జీవాన్ని కోల్పోతున్నది. ► పచ్చని పంట భూములను విచక్షణారహితంగా నివాసప్రాంతాలుగా మార్చటం, గనుల తవ్వకానికి వాడటం వల్ల సుమారు 1% భూమి సాగుకు దూరమవుతున్నది. ఇతర కారణాలతో మరో 2% భూమి ఎడారి అవుతున్నది. ► 2030 నాటికి కొత్తగా సెంటు భూమి కూడా ఎడారిగా మారకుండా చేయగలగాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా నిర్దేశించింది. అయినా.. దీన్ని అడ్డుకోవటంలో దేశాలు విఫలమవుతుండటం విషాదకర వాస్తవం. ► యుద్ధప్రాతిపదికన ప్రతి పొలంలో 50 మీటర్లకు ఒక చోట వాలుకు అడ్డంగా కందకాలు తవ్వటం.. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను, మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రోత్సహించటం ద్వారా ఎడారీకరణను, నీటి కరువును 5 ఏళ్లలో అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. – సాగుబడి డెస్క్ -
మట్టే మన ఆహారం!
మన పంట భూముల్లో మట్టి ఎంత సజీవంగా, సారవంతంగా ఉంటుందో మనం తినే ఆహారం కూడా అంత ఆరోగ్యదాయకంగా, సకల పోషకాలతో కూడి ఉంటుందని చెబుతున్నారు ప్రముఖ సాయిల్ మైక్రో బయాలజిస్ట్, ఎకో సైన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ (చెన్నై) అధినేత డా. సుల్తాన్ ఇస్మాయిల్. రసాయనిక వ్యవసాయంతో భూమి కోల్పోయిన సారాన్ని తిరిగి సహజసిద్ధంగా పెంపొందించడానికి.. భూమి కోతను, భూతాపం పెరుగుదలను అరికట్టడానికి పంట పొలాల్లోకి స్థానిక జాతుల వానపాములను తిరిగి ఆహ్వానించటం అత్యుత్తమ పరిష్కారమని ఆయన చెప్పారు. పంటలకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల వాడకం పూర్తిగా నిలిపివేసి.. పశువుల పేడ, మూత్రాలను నీటితో కలిపి పొలంలో పారించడం ద్వారా స్థానిక జాతుల వానపాములను తిరిగి సాదరంగా ఆహ్వానించవచ్చని, భూసారాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ సమ్మేళనంలో ఆయన భూసారం పెంచుకునే మార్గాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ► భూగోళం విస్తీర్ణంలో 75% నీరు, 25% భూమి ఉంది. ఈ భూమిలో సగం మనుషులకు పనికిరాదు. పనికొచ్చే భూమిలో.. 75% భూమి మాత్రమే సాగుయోగ్యమైనది. అంగుళం పైమట్టి(టాప్ సాయిల్) ఏర్పడటానికి 250 ఏళ్లు పడుతుంది. కాబట్టి, మట్టి వానకు గాలికి కొట్టుకుపోకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ► భూమిలో 45% ఖనిజాలు, 25% గాలి, 25% నీరు ఉంటాయి. భూమి సారవంతంగా ఉండాలంటే కనీసం 5% సేంద్రియ పదార్థం(ఆర్గానిక్ కార్బన్) ఉండాలి (ఇందులో 80% జీవనద్రవ్యం, 10% వేర్లు, 10% సూక్ష్మజీవరాశి ఉండాలి). కానీ, మన దేశ పంట భూముల్లో సేంద్రియ పదార్థం 0.4% మాత్రమే ఉంది. ► మట్టిలో ఏయే పోషకం ఎంత మోతాదులో ఉన్నదో(సాయిల్ ఫెర్టిలిటీని) చూడటం రసాయనిక ఎరువులు వాడే రైతులకు అవసరం.. అయితే, రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతులు మొత్తంగా నేలతల్లి సమగ్ర ఆరోగ్యాన్ని(సాయిల్ హెల్త్‌ని) కంటికి రెప్పలా కనిపెట్టుకొని ఉండాలి. ► నేలపైన పడిన ఎండిన గడ్డీ గాదాన్ని, రాలిన కొమ్మా రెమ్మలను సూక్ష్మజీవులు, చెద పురుగుల సాయంతో కుళ్లింపజేయటం.. విత్తనాలను మాత్రం కుళ్లబెట్టకుండా మొలకెత్తించటం నేలతల్లి విజ్ఞతకు, విచక్షణకు నిదర్శనం. ► వర్మీకంపోస్టు తయారు చేసే టబ్/కంటెయినర్‌కు పైన చిన్న బక్కెట్ వేలాడగట్టి చుక్కలు,చుక్కలుగా నీరు పడేలా ఏర్పాటు చేస్తే.. ఆ టబ్/కంటెయినర్ కిందికి వచ్చే పోషక ద్రవమే వర్మీవాష్. దీన్ని పంటలపై చల్లితే మంచి దిగుబడులు వస్తాయి. ► పెద్ద చెట్టు దగ్గర కర్బన నిల్వలు మెండుగా ఉంటాయి. దగ్గర్లో ఉండే మొక్కలు, చిన్న చెట్ల వేరు వ్యవస్థతో పెద్ద చెట్లు తమ వేరు వ్యవస్థలోని మైసీలియా వంటి శిలీంధ్రాల ద్వారా సంబంధాలను కలిగి ఉంటుంది. చిన్న చెట్లు బలహీనంగా ఉన్నప్పుడు.. పెద్ద చెట్లు కర్బనాన్ని భూమి లోపలి నుంచే శిలీంద్రాల ద్వారా చిన్న చెట్లకు అందిస్తాయి. రాలిన చెట్ల ఆకుల్లో సకల పోషకాలుంటాయి. వీటిని తిరిగి భూమిలో కలిసేలా చేయాలి. తగులబెట్టకూడదు. ఎండిన ఆకుల్లో కర్బనం ఉంటుంది, ఆకుపచ్చని ఆకుల్లో నత్రజని ఉంటుంది. ► మన దేశంలో 500 జాతుల వానపాములు ఉన్నా.. వీటిలో ముఖ్యమైనవి మూడే స్థానిక జాతులు: భూమి పైనే ఉండేవి, భూమి లోపల ఉంటూ రాత్రిపూట బొరియలు చేసుకుంటూ పైకీ కిందకు తిరిగేవి, భూమి అడుగున ఉండేవి. స్థానిక జాతుల వానపాముల ద్వారా వర్మీ కంపోస్టును తయారు చేసి పంటలకు వాడొచ్చు. కర్బనంతో కూడిన మట్టిని, పేడను తిని.. దాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో నత్రజనిని జోడించి.. పోషకాలతో కూడిన పదార్థాన్ని వానపాములు విసర్జిస్తాయి. ► నేలపైన ఆవు పేడ కల్లు వేసిన తర్వాత ఆ పేడ చెక్కుచెదరకుండా పిడక మాదిరిగా ఎండిపోతే దాని కింద ఉన్న భూమి నిర్జీవమైపోయిందని గ్రహించాలి. అలా కాకుండా.. పేడ కల్లు చివికినట్లు అయిపోయి, దాని అడుగున బొరియలు ఉంటే.. ఆ భూమి సారవంతంగా ఉన్నదని అర్థం. ► దేశీ జాతుల ఆవులు, ఇతర పశువుల కొట్టం(షెడ్)ను నీటితో కడిగి శుభ్రం చేసినప్పుడు పేడ, మూత్రం కలిసిన నీరు బయటకు వెళ్లిపోతుంది. దీన్ని వృథాగా పోనీయకుండా.. ఒక గుంతలోకి పట్టి ఉంచుకోవాలి. ఈ నీటిని 10%, బోరు నీరు 90% కలిపి పొలానికి పారించాలి. మట్టిలో సూక్ష్మజీవరాశి, వానపాముల సంతతి పెరిగి భూమి సారవంతమవుతుంది. ► రాత్రి వేళల్లో వానపాములు భూమికి బొరియలు చేస్తాయి. ఈ బొరియల ద్వారా వాన నీరు, ప్రాణవాయువు వేర్లకు, భూమిలోపలి జీవరాశికి అందుతాయి. ► బరువైన యంత్రాలు పొలంలో తిరిగితే భూమి చట్టుబడిపోతుంది. భూమిలో సూక్ష్మజీవరాశి, వానపాములు, ఇతర చిరుజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ► వానపాములు మన పంట భూముల్లో మళ్లీ తారాడేలా చేయటం(రీవార్మింగ్) ద్వారా భూమి ఆరోగ్యాన్ని.. తద్వారా సేంద్రియ ఆహారం ద్వారా మనుషుల, పశువుల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. పనిలో పనిగా భూతాపాన్ని(గ్లోబల్ వార్మింగ్‌ను) నిలువరించవచ్చు! www.erfindia.org. సేకరణ: పంతంగి రాంబాబు సాగుబడి డెస్క్ -
అక్రమాలకు ఎరువు!
► ఈ–పోస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీ ఒట్దిదే ►ఏప్రిల్ నుంచి ఇదిగో అదుగో అంటూ హడావుడి ► జిల్లాకు అవసరమైన మిషన్లు 819.. వచ్చింది 60 ► డీబీటీకి కంపెనీల మొకాలడ్డు ► ఖరీఫ్ మొదలయినా అతీగతీ లేని నూతన విధానం కర్నూలు(అగ్రికల్చర్): రసాయన ఎరువుల పంపిణీలో ప్రయివేట్ డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన డైరెక్టు బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) విధానం అభాసు పాలవుతోంది. ఎరువుల కంపెనీలే ఈ విధానానికి మోకాలడ్డుతున్నట్లు తెలుస్తోంది. ఎరువుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు కంపెనీలకు మింగుపడటం లేదు. ఈ నేపథ్యంలోనే డీబీటీ విధానంపై ఆసక్తి చూపని పరిస్థితి కనిపిస్తోంది. మొదట్లో ఫర్టిలైజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆ తర్వాత మొబైల్ ఫర్టిలైజర్ మానిటరింగ్ సిస్టమ్ అమలులోకి వచ్చింది. అయితే ఈ విధానాలు అక్రమాలను అరికట్టలేకపోయాయి. హోల్‌సేల్ డీలర్లు ఆడింటే ఆట.. పాడిందే పాటగా వ్యాపారం సాగింది. డిమాండ్‌ను బట్టి అడ్డూఅదుపు లేకుండా బ్లాక్‌లో విక్రయించడం, ఇక్కడ డిమాండ్ లేకపోతే ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలించడం జరుగుతోంది. కేవలం 2 గదుల ఇంటిని అద్దెకు తీసుకొని ఒక్క బస్తా ఎరువును దించకుండానే కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్న హోల్‌సేల్ డీలర్లు జిల్లాలో చాలా మంది ఉన్నారు. ర్యాక్ పాయింట్ నుంచే ఎరువులను అక్రమంగా తరలిస్తుండటం గమనార్హం. జిల్లాకు ఇస్తున్న ఎరువులు ఇక్కడే వినియోగిస్తున్నారా.. ఏఏ రైతు ఎన్ని బస్తాలు కొన్నారనే వివరాలు అధికారుల వద్ద అందుబాటులో లేకపోవడం అక్రమాలకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డీబీటీ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. జిల్లాకు 819 ఈ–పోస్ మిషన్లు అవసరం.. వచ్చింది 60 మాత్రమే.. మొదటి దశ కింద జిల్లాలో హోల్‌సేల్ డీలర్లకు ఈ–పోస్ మిషన్ల ద్వారా ఎరువులు మే నుంచి పంపిణీ చేయతలపెట్టారు. జిల్లాకు 819 ఈ–పోస్ మిషన్లు అవసరం అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎరువుల కంపెనీలే వీటిని సరఫరా చేయాల్సి ఉంది. జిల్లాకు క్రిబ్కో కంపెనీ 598, ఎంసీఎఫ్‌ఓల్ కంపెనీ 136, పీపీఎల్ 22, జువారి కంపెనీ 28, ఎంఎఫ్ఎల్ 11, ఆర్సీఎఫ్ 24 ప్రకారం ఈ–పోస్ మిషన్లను సరఫరా చేయాల్సి ఉంది. సరఫరా అయిన ఎరువులను రైతులు కొనుగోలు చేస్తేనే కంపెనీలకు సబ్సిడీ జమ అవుతుంది. కొనకపోతే సబ్సిడీ వచ్చే అవకాశం లేదు. దీంతో డీబీటీ అమలుకు కంపెనీలే సహకరించడం లేదనే విమర్శలు వ్యక్తమతున్నాయి. ఖరీఫ్ మొదలయినా ఇప్పటి వరకు కేవలం 60 ఈ–పోస్ మిషన్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఎరువుల పంపిణీలో అక్రమాలు యథావిధిగా కొనసాగే అవకాశం ఏర్పడింది. ఖరీఫ్ సీజన్‌కు 3,38,077 టన్నుల ఎరువులు అవసరం ఖరీఫ్ సీజన్లో దాదాపు 6.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఇందుకు యూరియా 1,13,312 టన్నులు, డీఏపీ 65,600, ఎంఓపీ 16432, కాంప్లెక్స్ ఎరువులు 1,42,733 టన్నులు మొత్తంగా 3,38,077 టన్నుల ఎరువులు అవసరం అవుతాయి. ప్రతి ఏటా 25 శాతం ఎరువులు ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలుతున్నాయి. డీబీటీ విధానం వల్ల అక్రమాలకు తావుండదు. ఈ–పోస్ మిషన్లలో అందరి ఆధార్ డేటా, వెబ్‌ల్యాండ్ డేటాను లోడ్ చేస్తారు. రైతు ఈ మిషన్‌పై వేలిముద్ర వేయడంతో ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ పంటలకు ఎన్ని బస్తాల ఎరువుల అవసరం అనేది వస్తుంది. రైతు ఎరువులు కొనుగోలు చేసిన వెంటనే ఏ కంపెనీ ఎరువులు ఎన్ని బస్తాలు తీసుకున్న వివరాలు ఆన్లైన్లో వెంటనే కేంద్రానికి వెళ్తాయి. దీన్ని బట్టి కేంద్రం సబ్సిడీ విడుదల చేస్తుంది. డీబీటీ విధానం వల్ల కంపెనీలకు గండి పడే ప్రమాదం ఉండటంతో జిల్లాకు ఈ–పోస్ మిషన్లను సరఫరా చేయడంలో జాప్యం జరుగుతోంది. ఈ పరిస్థితి ఒక్క కర్నూలు జిల్లాలోనే కాదు.. ఇతర జిల్లాల్లోనూ ఉంది. జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటే తప్ప ఈ–పోస్ మిషన్లు జిల్లాకు వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. -
కలుపును, తెగుళ్లను జయించిన రైతు!
- లోతైన అవగాహనతో ప్రకృతి సేద్యం.. చీడపీడలు, తెగుళ్ల ఊసే లేదు. - కలుపు నిర్మూలించకుండా.. ఖర్చు లేకుండా భేషుగ్గా మినుము సాగు - ఎకరాకు నాలుగు క్వింటాళ్ల దిగుబడి జీవావరణ వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడుకునే ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ.. కలుపును, తెగుళ్లను సునాయాసంగా జయిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న విలక్షణ ఆదర్శ రైతు తిలక్. చిన్న ప్రాణికి కూడా హాని తలపెట్టకుండా.. రూపాయి ఖర్చు లేకుండా.. పంటలు పండిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అధిక దిగుబడులు సాధించి వ్యవసాయ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నారు. అంతేనా.. పల్లెల్లోనూ అంతరించిపోతున్న అనేక జీవ జాతులకు తన వ్యవసాయ క్షేత్రాన్ని చిరునామాగా మార్చారు. మనుషులకు మాత్రమే కాదు ఈ భూమ్మీద ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉందని విశ్వసిస్తారు ప్రకృతి వ్యవసాయదారు నల్లమోతు వెంకట లోకమాన్య బాల గంగాధర్ తిలక్. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం ఆయన స్వగ్రామం. వివిధ రకాల జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు.. ఎన్నో రకాల ప్రాణుల సహజీవనంతోనే, జీవవైవిధ్యంతోనే వ్యవసాయానికి మనుగడ అనే ఆయన బలమైన నమ్మకం వమ్ముకాలేదు. 30 ఎకరాల మాగాణిలో ఈ ఏడాది రబీలో మినుమును సాగు చేశారు. సస్యరక్షణ, యాజమాన్య పద్ధతుల్లో కొత్త పంథాను అనుసరించి గడ్డు పరిస్థితుల్లోనూ మంచి దిగుబడులు సాధించారు. ఒకవైపు చీడపీడలు, తెగుళ్లతో జిల్లా వ్యాప్తంగా మినుము పంట తుడిచిపెట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లోనూ తిలక్ మంచి దిగుబడులు సాధించటం విశేషం. పంటలను కలిపి సాగుచేస్తేనే కలిమి.. ‘మోనోకల్చర్ (పొలంలో మొత్తంలో ఒకే ఒక పంటను సాగు చేసే) పద్ధతి వల్లే జీవవైవిధ్యం నశించిందని అవగాహన చేసుకున్న తిలక్ మిశ్రమ పంటల సాగును చేపట్టారు. ఒక్క పంటకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి ఇతర పంటలకు కలుపు మొక్కలకు స్థానం లేకుండా చే యటం వల్ల జీవ వైవిధ్యం నశించింది. అనేక జాతులకు చెందిన ప్రాణులు, మొక్కలు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది’ అంటారు తిలక్. అందుకే తిలక్ మినుము, జొన్న, సజ్జ, జనుము పంటలను కలిపి మిశ్రమ పంటలుగా సాగు చేశారు. వరి కోతలు పూర్తయ్యాక పదునులో ఎల్బీజీ మినుము రకాన్ని ఎకరాకు 13 కిలోల చల్లుకున్నారు. పంటతో పాటే పెరిగి పెద్దవయినా కలుపు మొక్కలను నిర్మూలించే ప్రయత్నం చేయలేదు. ‘రసాయన ఎరువులు వాడి భూమిలోని సూక్ష్మజీవులను, క్రిమి సంహారకాలను పిచికారీ చేసి పురుగులను చంపటం, కలుపు మందులు వాడి రకరకాల మొక్కలను నిర్మూలించటం వల్ల ప్రాణికోటికి తీరని నష్టం జరుగుతోంది. జీవావరణ వ్యవసాయంలో పంట మొక్కలు, కలుపు మొక్కలు, జీవులు ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తాయి. పరస్పరం సహాయం చేసుకుంటాయి. అన్ని రకాల జీవులకు ఆశ్రయం ఉంటుంది. వీటివల్ల పంటలకు ఎలాంటి నష్టం లేకున్నా పనిగట్టుకొని నిర్మూలించాల్సిన అవసరం లేదు. ప్రకృతే వాటిని సహజ పద్ధతుల్లో అదుపు చేస్తుంది’ అంటారు తిలక్. అందుకే మినుము సాగులో ఆయన ప్రకృతి సేద్య పద్ధతులకు పెద్ద పీట వేశారు. దీనికి నిదర్శనమా అన్నట్టు వ్యవసాయ క్షేత్రం చుట్టూ అనేక పక్షి జాతులు ఆశ్రయం ఏర్పరుచుకున్నాయి. నాలుగు రకాల పంటలను కలిపి సాగు చేయటం వల్ల మిత్ర పురుగులు పొలంలోకి వచ్చాయి. పంటలకు హాని చేసే చీడపురుగులను అదుపు చేశాయి. పొలం గట్ల వెంబడి జనుమును కంచెపంటగా సాగు చేశారు. జనుము మొక్కల నుంచి వచ్చే వాసనకు మినుమును ఆశించి నష్టపరిచే పురుగులు దూరంగా పోతాయి. జనుము పైరు పసుపు రంగులో ఉండటం వల్ల మిత్ర పురుగులను ఆకర్షించింది. ఇవి చీడపీడలను అదుపులో ఉంచుతాయి. అంతేకాదు జనుము మొక్కల వేర్లు భూమిలో విడుదల చే సే ద్రవాలు ప్రధాన పంటకు పోషకాలను అందిస్తాయి. కలుపు మొక్కలతో సహజంగా తెగుళ్ల నివారణ ‘పంటలకు సోకే తెగుళ్లకు కొన్ని రకాల శిలీంధ్రాలు కారణం. అయితే భూమిలో నివసించేlకొన్ని రకాల శిలీంధ్రాలు వీటిని అదుపు చేస్తాయి. వీటిలో పంట మొక్కలకు మంచి చేసేవీ ఉంటాయి. రసాయన శిలీంధ్ర నాశనుల పిచికారీ వల్ల మంచి చేసే శిలీంధ్రాలు మరణిస్తున్నాయి. దీనివల్ల తెగుళ్ల వ్యాప్తి విపరీతంగా పెరిగి ఏం చేయాలో అర్థం కాక రైతులు, శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు’ అంటారు తిలక్. కృష్ణా తదితర కోస్తా జిల్లాల్లో ఈ సీజన్లో సాగు చేసిన మినుములో పల్లాకు, తలమాడు, మొవ్వకుళ్లు వంటి పలు రకరకాల వైరస్ తెగుళ్లు విజృంభించాయి. వీటి నివారణకు రకరకాల ఖరీదైన రసాయనిక పురుగు మందులను పిచికారీ చేసినా ఫలితం లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. తిలక్ మాత్రం ఎలాంటి మందులు, కషాయాలు పిచికారీ చే యలేదు. పదునులో విత్తనాలు చల్లుకున్నారు. 75 రోజులకు పంట చేతికొచ్చేదాక ఎలాంటి తడి ఇవ్వలేదు. మధ్యలో వర్షం పడలేదు అయినా మంచి దిగుబడులు చేతికిరావటం విశేషం. ఒక్కో మొక్కకు 20–25 కాయలు కాశాయి. బంగారు తీగ, తలతిప్ప కాయ, టపాకాయల చెట్టు వంటి కలుపు మొక్కలు అధికసంఖ్యలో ఉన్నా వాటిని కూడా అధికమించి మినుము పైరు బాగా పెరిగింది. కలుపు మందులు వాడకపోవటం, కలుపును నిర్మూలించే ప్రయత్నం చేయకపోవటం వల్లనే మినుము పంటను ఎలాంటి తెగుళ్లు ఆశించలేదని తిలక్ చెప్పారు. మినుములు ఎకరాకు 4 క్వింటాళ్లు, సజ్జలు 40 కిలోలు, ఉలవలు 30 కిలోలు దిగుబడి వచ్చింది. జనుమును పశువుల మేతగా వాడుతున్నారు. రసాయన సేద్యంలో ఎరువులు, కలుపు మందులు, పురుగుమందులు పిచికారీకి ఖర్చు ఎక్కువవుతోంది. దిగుబడి ఎక్కువగా వచ్చినా ఫలితం రైతుకు దక్కటం లేదు. దీంతో రైతు ఎంత కష్టం చేసినా లాభం కళ్లజూడలేకపోతున్నాడు. గతేడాది సాగు చేసిన పంట నుంచే విత్తనాన్ని తయారు చేసుకున్నాడు. పంటను అమ్మితే వచ్చిన ఆదాయం మొత్తం రైతుకే మిగులుతుంది. గతేడాది ఖరీఫ్ వరిసాగులోనూ తిలక్ మంచి దిగుబడులు సా«ధిస్తున్నారు. ఎంటీయూ 1061రకం వరిని సాగు చేశారు. కలుపును నిరోధించేందుకు పంట వ్యర్థాలతో వేసవిలో ఆచ్ఛాదన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని ఆచరించటంతో ఆకుముడత, దోమ, పొడ తెగులు వరిని ఆశించలేదు. వర్షాభావం, నీటి ఆలస్యం విడుదల కారణంగా 50రోజుల పాటు ఏర్పడిన బెట్టను కూడా వరిపైరు తట్టుకొంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎకరానికి 35 బస్తాల దిగుబడి సాధించటం విశేషం. నారు మడి పెంపకం, నాట్లు వేయటం, కలుపు తీత, కోత, నూర్పిడి వంటి పనులకు మాత్రమే ఖర్చయింది. తొలకరిలో జీలుగును సాగు చేస్తారు. పొలంలో తిరిగే పాములను చంపరు. ఆదాయంతో పాటు పర్యావరణ పరిరక్షణకు జీవవైవిధ్య వ్యవసాయమే సరైన మార్గమని.. మిశ్రమ పంటల సాగుతోనే రైతుకు కలిమి బలిమి అని నిరూపిస్తున్నారు బాలగంగాధర్ తిలక్. – అయికా రాంబాబు, సాక్షి,గుడ్లవల్లేరు, కృష్ణా జిల్లా కలుపును అదుపు చేస్తే చాలు..! రసాయన సేద్యం సకల జీవులను కకావికలు చేసింది. ఎన్నో ప్రాణులు అంతరించిపోవటానికి పరోక్షంగా కారణమయింది. రసాయనిక ఎరువులు, కలుపు మందులు, పురుగు మందుల వాడకంతో భూసారం క్షీణిస్తోంది. మనుషులకు కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. కలుపును దుంపనాశనం చేస్తేనే పంటలు పండుతాయనే భ్రమలను రైతులు వీడాలి. కలుపును నాశనం చేయాల్సిన అవసరం లేదు. మిశ్రమ పంటలు, అంతర పంటలు, కంచె పంటల సాగుతో కలుపును అదుపులో ఉంచితే చాలు. ఖర్చు ఉండదు, పర్యావరణానికి హాని ఉండదు. పంట దిగుబడులకు కూడా ఢోకా ఉండదు. – నల్లమోతుల బాలగంగాధర్ తిలక్ (99498 28578),సీనియర్ ప్రకృతి వ్యవసాయదారుడు,కౌతవరం, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లా -
కూలీల్లేకుండా పన్నెండెకరాల్లో పండ్ల సాగు!
- జీవామృతం, దశపత్ర కషాయాలతోనే సాగు - పనులన్నీ స్వయంగా రైతు సోదరులిద్దరే చేసుకుంటున్న వైనం - ఏడాదికి ఎకరా సాగు ఖర్చు రూ. 2 వేలకన్నా తక్కువే! -12 ఎకరాల పండ్ల తోట నుంచి ఏటా రూ. 3.25 లక్షల నికరాదాయం రసాయనిక ఎరువులు, పురుగుమందుల పేరిట వేలకు వేలు వెచ్చిస్తూ కూడా.. దిగుబడి లేక, ఆదాయం రాక కుంగిపోతున్న పండ్ల తోటల రైతులకు అప్పలస్వామి, నాగేశ్వరరావు సోదరుల ఉమ్మడి ప్రకృతి సేద్య ప్రస్థానం ఒక చక్కని పాఠం. తోటను అనుదినం కనిపెట్టుకొని ఉండి, స్వయంగా చెమటను చిందిస్తున్నారు. కూలీల అవసరం కూడా లేకుండా రైతు కుటుంబాలు అత్యంత తక్కువ ఖర్చుతో పండ్ల తోటను నిర్వహించడం ఎలాగో వీరు నిరూపిస్తున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి సేద్యాన్ని కొత్తపుంతలు తొక్కిస్తూ.. మట్టిని నమ్ముకున్న రైతులకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. పన్నెండెకరాల పండ్ల తోటను నామమాత్రపు ఖర్చుతో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కొరిపల్లి అప్పలస్వామి, నాగేశ్వరరావు సోదరులు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వెదురుపాక ఆయన స్వగ్రామం. వీరలంకపల్లి శివారు రామకృష్ణా గార్డెన్స్‌లో గత పదేళ్లుగా 12 ఎకరాలలో పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. అది తెల్ల గరప భూమి. రెండు బావులు, ఒక బోరు ఉన్నాయి. మొక్కలు నాటిన మొదట్లో నాలుగేళ్లు రసాయనిక సేద్య పద్ధతులను అనుసరించారు. 30 బస్తాల వరకు రసాయనిక ఎరువులు వేసేవారు. రూ. 50 వేల వరకు ఖర్చు చేసి రసాయనిక పురుగుల మందులు చల్లేవారు. అలా కొన్ని మొక్కలు చనిపోవటం, మొక్కల పెరుగుదల నిలిచిపోవటంతో నాలుగేళ్ల తర్వాత అప్పలస్వామి సోదరులు ప్రకృతి సేద్యం వైపు మళ్లారు. గోమూత్రం, పేడతో వ్యవసాయం చేయడం ఏమిటని చుట్టుపక్కల రైతులు వేళాకోళం చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. తొలినాళ్లలో మామిడి, జీడిమామిడి మొక్కలు మాత్రమే ఉన్నాయి. క్రమేణా సపోటా, నారింజ, బత్తాయి, పంపర పనస, పనస, నిమ్మ, దానిమ్మ, జామ, నేరేడు, పైనాపిల్, కొబ్బరి, ఉసిరి, బాదం, సీతాఫలం, రామఫలం, దబ్బ, అంజూర, డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరం వంటి పలు పండ్ల జాతులను ప్రకృతి సేద్యపద్ధతిలో సాగు చేస్తున్నారు. విత్తనాలు లేని నేరుడు, తేనె రుచిలో ఉండే కేరళ పనస, కూరల్లో వాడే సదా పనస.. పులుపు, పీచు ఎక్కువగా ఉండే పచ్చడి మామిడి వంటి ప్రత్యేక రకాల పంటలను సైతం సాగు చేస్తున్నారు. ఏడాదికి ఎకరా సాగు ఖర్చు రూ. 2 వేలు! దాదాపు పన్నెండెకరాల పండ్ల తోటలను ఈ రోజుల్లో నామమాత్రపు ఖర్చుతో సాగు చేయటం అంటే మాటలు కాదు. రసాయన ప్రకృతి సేద్య పద్ధతుల్లో సుదీర్ఘ అనుభవాలతో రాటు తేలిన అప్పలస్వామి సోదరులు ప్రత్యేక పంథాను అనుసరించారు. ప్రకృతి సేద్యం ప్రారంభించినప్పటి నుంచి రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవామృతాన్ని చెట్లకు అందిస్తున్నారు. జీవామృతాన్ని అప్పలస్వామే స్వయంగా తయారు చేస్తారు. తన పొలంలో 200 లీటర్ల సామర్థ్యం గల ఆరు ప్లాస్టిక్ డ్రమ్ములను ఏర్పాటు చేసుకొని.. వాటిల్లో జీవామృతం తయారు చేసుకుంటారు. వారంలో ఆరు రోజులు రోజుకొక డ్రమ్ములోని జీవామృతాన్ని పండ్ల మొక్కలకు పోస్తారు. ఖాళీ అయిన డ్రమ్ములో తిరిగి కొత్తగా జీవామృతం కలుపుతూ ఉంటారు. ఏడాదిలో నికరంగా పది నెలల పాటు చెట్లకు జీవామృతం అందిస్తారు. డ్రమ్ము జీవామృతం తయారీకి పది కిలోల తమ నాటు ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రంతోపాటు కిలో బెల్లం, కిలో శనగపిండి వాడతారు. ఏడాదికి 3 క్వింటాళ్ల శనగపిండి అవసరమవుతుంది. రూ. 16,500 ఖర్చవుతుంది. కిలో నల్ల బెల్లం రూ. 15 చొప్పున ఆరు నెలలకు సరిపడా 180 కిలోల బెల్లానికి రూ. 2,500 వరకు ఖర్చవుతుంది. మరో ఆరు నెలలు బెల్లానికి బదులు తోటలో మిగల పండిన మామిడి, సపోటా పండ్లను జీవామృతం తయారీలో వాడతారు. రూ. 3 లక్షలకు పైగా నికరాదాయం... వీరి తోటలో సపోటా, కొబ్బరి, నిమ్మ, మామిడి చెట్ల నుంచి పండ్ల దిగుబడి వస్తోంది. సపోటా కాయ రూ. 5 చొప్పున అమ్ముతున్నారు. ఏడాదికి రూ. లక్ష ఆదాయం వస్తోంది. కొబ్బరిలో ఏడాదికి రూ. 50 వేల ఆదాయం వస్తోంది. ఎకరాకు 20 మామిడి చెట్లున్నాయి. రసాయన సేద్యంలో పండించిన కాయలు ఒక్కోటి రూ. 15 చొప్పున విక్రయిస్తుండగా ప్రకృతి సేద్యంలో పండించిన వాటిని కాయ రూ. 40 చొప్పున విక్రయిస్తున్నారు. ఏడాదికి రూ. 2 లక్షల ఆదాయం లభిస్తోంది. మొత్తం 12 ఎకరాల సాగుకు అయ్యే రూ. 25 వేల ఖర్చు పోను.. రూ. 3.25 లక్షల నికరాదాయాన్ని అప్పలస్వామి ఆర్జిస్తున్నారు. ప్రయాస లేని మార్కెటింగ్.. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన నాణ్యమైన పండ్లు కావడంతో స్థానికంగానే వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. ఇవి రుచి బావుండటం, కాయలు పెద్దగా ఉండటంతోపాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. పండ్ల నాణ్యతను గుర్తించిన వినియోగదారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అడపాదడపా హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే, నిమ్మకాయలను మాత్రం మార్కెట్లో మామూలు కాయలతో పాటే సాధారణ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని అప్పలస్వామి తెలిపారు. నిమ్మకాయలు ఇతర పండ్లలా విడిగా రుచి చూసేవి కాకపోవటంతో.. ఆర్గానిక్ అన్నా ప్రత్యేకంగా కొనేందుకు ఎవరూ ముందుకు రావటం లేదని ఆయన చెప్పారు. ఆ క్షేత్రం.. ప్రయోగాలకు ఆలవాలం.. మామిడి మొక్కలు గుప్పెడు లావు వూరే వరకు కర్రతో ఊతం ఏర్పాటు చేశారు. మామిడి చెట్టుకు కొమ్మలు అస్తవ్యస్తంగా పెరగనిస్తే.. చెట్టు కాండం లావు వూరదు. దీన్ని నివారించేందుకు ఐదడుగుల మేర ఎలాంటి కొమ్మలు ఉంచరు. యాభై ఏళ్లు పెరిగిన మామిడి చెట్టును అమ్ముకుంటే.. కలప ద్వారానే రైతుకు రూ. లక్ష ఆదాయం వస్తుందని అప్పలస్వామి చెప్పారు. ఈ తోటలో 20 ఏళ్ల పనస చెట్టుకు నాలుగేళ్ల నుంచి కాపు పూర్తిగా నిలిచిపోయింది. చెట్టును నరికివేయాలనుకున్న పరిస్థితుల్లో స్నేహితుడి సూచన మేరకు.. ఇసుక నింపిన 5 బస్తాలను చెట్టు కొమ్మలపై ఉంచారు. దాంతో కాపు వచ్చి 13 కాయలు కాశాయి. ఈ ఏడాది దీనిపై మరింత పరిశోధన చేయనున్నట్టు ఆయన తెలిపారు. తోటలో ప్రత్యేకంగా పెంచిన గిరిపుష్పం (గ్లైరీసీడియా) చెట్ల కొమ్మలను నరికి చెట్ల పాదుల్లో ఆచ్ఛాదనగా వేస్తారు. దీనివల్ల పాదుల్లో తేమ నిల్వ ఉంటుంది. నత్రజని తదితర పోషకాలతో కూడిన ఆకులు భూమిలో కలిసిపోయి భూసారాన్ని పెంపొందిస్తాయి. తన ఆవులు, గిత్తలను రోజుకో చెట్టుకు చొప్పున కట్టేసి ఉంచుతారు. వాటి పేడ, మూత్రం పాదుల్లో పడి చెట్లకు మంచి ఎరువుగా ఉపయోగపడుతున్నది. ఈ పద్ధతిని అనుసరిస్తున్నందు వల్ల పండ్ల చెట్లకు ప్రత్యేకంగా ఘన జీవామృతం తయారు చేసి వేయాల్సిన అవసరం లేదని అప్పలస్వామి చెప్పారు. సూక్ష్మజీవుల కోసం శాస్త్రీయ సంగీతం..! భూమికీ ప్రాణం ఉంటుంది. సుఖం, దుఃఖం, సంతోషం, బాధ వంటి భావోద్వేగాలుంటాయన్నది అప్పలస్వామి ప్రగాఢ నమ్మకం. పొలంలో మైక్ ఏర్పాటు చేసి ప్రవచనాలు, భగవద్గీత, శాస్త్రీయ సంగీతాన్ని వినిపిస్తున్నారు. దీనివల్ల మట్టిలోని సూక్ష్మజీవులు చైతన్యవంతమై భూమిలో జీవం తొణికిసలాడుతుందని ఆయన అంటారు. తద్వారా పంట దిగుబడులు కూడా పెరుగుతున్నాయంటారు అప్పలస్వామి. చినజీయర్‌స్వామి, ప్రకృతి వ్యవసాయంపై ప్రభుత్వ సలహాదారు పి.విజయ్‌కుమార్, అప్పలస్వామి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి అభినందించారు. ప్రకృతి వ్యవసాయంపై నెల్లూరు, తిరుపతికి చెందిన రైతులకు ఈ తోటలో శిక్షణ ఇవ్వడం విశేషం. - లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, కాకినాడ ఇన్పుట్స్: కోన శ్రీనివాస్, సాక్షి, గోకవరం, తూ. గో. జిల్లా అతి తక్కువ ఖర్చు ఇలా సాధ్యం.. ఏడాదికి పదిసార్లు జీవామృతం, దశపత్ర కషాయాలను పిచికారీ చేస్తారు. విడతకు 5 లీటర్ల చొప్పున ఏడాదికి 50 లీటర్ల పెట్రోలుకు గాను రూ. 3,500 ఖర్చవుతుంది. శనగపిండి, బెల్లం, పెట్రోల్ అన్నింటికీ కలిపి పన్నెండెకరాల పండ్ల తోటకు ఏడాదికి రూ. 22,500 ఖర్చవుతుంది. అంటే ఏడాది సాగు ఖర్చు ఎకరాకు రూ. 2 వేల క న్నా తక్కువేనన్నమాట! ఒక మనిషి రోజుకొక టీ తాగడానికి ఏడాదికి హీన పక్షం రూ. 2 వేలకు పైగా ఖర్చవుతుంది. ఈ పరిస్థితుల్లో సాగు వ్యయాన్ని ఒడుపుగా తగ్గిస్తూ పన్నెండెకరాల్లో పండ్ల తోటలను అప్పలస్వామి సోదరులు పొందికగా సాగు చేస్తుండడం విశేషం. మొక్కల వయసును బట్టి చెట్టుకు 5-10 లీటర్ల చొప్పున జీవామృతం పోస్తారు. ఇలా 12 ఎకరాల తోటలోని మొక్కలన్నింటికి ఒక విడత జీవామృతం పోయటానికి నెల సమయం పడుతుంది. రసాయన సేద్యంలో ఎంత లేదన్నా ఎకరాకు ఎరువులు, పురుగుమందులకు ఏడాదికి రూ. 10 వేలకు తక్కువ ఖర్చు కాదు. జీవామృతం తయారీకి అవసరమైన గట్టు మన్ను, ఆవు పేడ, మూత్రం పొలంలోనే లభిస్తాయి. 50 కిలోల బెల్లం, శనగ పిండిని కొనుగోలు చేస్తారు. నాణ్యమైన శనగ పిండి కోసం శనగపప్పును కొని మర పట్టిస్తారు. విడతకు ఎకరాకు చీడపీడల నివారణకు 200 లీటర్ల జీవామృతం, 10 లీటర్ల గో మూత్రం, 5 లీటర్ల దశపత్ర కషాయం కలిపి... చెట్లు మొత్తం తడిచేలా పిచికారీ చేస్తారు. చెట్లు పూత, కాత మీదున్నప్పుడు 15 రోజులకోసారి పిచికారీ చేస్తారు. మిగిలిన రోజుల్లో మాత్రం చీడపీడలు, తెగుళ్లు ఆశించినప్పుడు మాత్రమే పిచికారీ చేస్తారు. తోటలో ఏ పనైనా స్వయంగానే.. జీవామృతం మొక్కలకు బకెట్లతో స్వయంగా అప్పలస్వామే పోస్తారు. పిచికారీ కూడా స్వయంగా తానే చేస్తారు. పొలానికి నీరు పారగట్టటం, కాయలు కోయటం, కషాయాల తయారీ వంటి పనులను తమ్ముడు నాగేశ్వరరావుతో కలిసి స్వయంగా చేసుకుంటారు. కూలీలను పెట్టరు. మరీ అవసరమైతే ఇంటి ఆడోళ్లు పనుల్లో సహాయ పడతారని అప్పలస్వామి తెలిపారు. ఉచిత విద్యుత్ కావటంతో కరెంటు బిల్లు కట్టే అవసరం లేదు. పొలాన్ని దున్నాల్సిన అవసరం లేదు. పెరిగిన గడ్డిని ఎప్పటికప్పుడు ఆవులు మేసేస్తుంటాయి. దీంతో దుక్కికి అయ్యే ట్రాక్టర్ / అరకల ఖర్చు తప్పింది. పెట్టుబడి లేని ప్రకృతి సేద్యంలో పండ్ల దిగుబడి, రుచి పెరిగింది! రసాయన సేద్యంలో కన్నా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేపట్టాకే దిగుబడితో పాటు కాయల రుచి పెరిగింది. ఖర్చు పెద్దగా లేదు. రసాయన వ్యవసాయంలో వచ్చే పంట ఉత్పత్తులతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఆసుపత్రులు, వైద్యులు డబ్బుగడిస్తున్నారు. ప్రకృతి సేద్యాన్ని ఆచరిస్తే రైతు కుటుంబాలకు, ప్రజలకు హాస్పిటళ్ల గుమ్మం తొక్కే అవసరం ఉండదు. రసాయనాలతో పండించిన ఆహారం తిన్న మనిషిలాగే చెట్లకు కూడా రసాయనిక ఎరువులు, పురుగుమందుల వల్ల జబ్బు చేస్తుంది. కానీ, చెట్లు చెప్పలేవు.. మనిషి చెపుతాడు.. అంతే తేడా! - కొరుపల్లి అప్పలస్వామి (96661 50374) ప్రకృతి వ్యవసాయదారుడు, వెదురుపాక, గోకవరం మండలం, తూ.గో. జిల్లా -
పొలం గట్లపై ఆపరేషన్ ఆకర్ష్!
- మిత్రపురుగుల సాయంతో సేంద్రియ సేద్యంలో చీడపీడల నివారణ - మిత్రపురుగులను ఆకర్షించడానికి పొలం గట్లపై పొద్దుతిరుగుడు, జొన్న, మొక్కజొన్న, బంతి మొక్కల సాగు - సత్ఫలితాలిస్తున్న ఎన్.ఐ.పి.హెచ్.ఎం. (హైదరాబాద్) పరిశోధనలు - వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలతోపాటు.. రైతు బృందాలకూ మాతృభాషలోనే ఉచిత శిక్షణ పొలంలో ఏదో ఒకే పంటను వేసి.. రసాయనిక ఎరువులు అసలు వాడకుండా పంట పండించడం.. రసాయనిక పురుగుమందులు అసలు చల్లకుండా చీడపీడలను అదుపులో ఉంచడం కత్తి మీద సాము వంటిది. అయితే, పొలం చుట్టూ గట్లపైన కొన్ని రకాల మొక్కలు పెంచి మిత్రపురుగులకు ఆశ్రయం కల్పిస్తే.. సేంద్రియ సేద్యంలోనూ చీడపీడల బెడదను విజయవంతంగా అధిగమించవచ్చని హైదరాబాద్‌లోని జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ (ఎన్.ఐ.పి.హెచ్.ఎం.) నిపుణులు రుజువు చేశారు. వరి, పత్తి, మిరప, వంగ, బెండ, వేరుశనగ వంటి పంటలను ఆశించే చీడపీడలను మిత్రపురుగుల సైన్యంతో సమర్థవంతంగా మట్టుబెట్టవచ్చని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. నిపుణులు భరోసా ఇస్తున్నారు. పంటకు తగిన పూల మొక్కలను గట్లపైన వరుసలుగా పెంచడం ద్వారా చీడపీడల సమస్య తీరడమే కాకుండా.. తేనెటీగల వల్ల పంట దిగుబడులు కూడా పెరిగాయంటున్నారు. వర్మీ కంపోస్టు, జీవన ఎరువులు, జీవ రసాయనాలతోపాటు మిత్రపురుగుల ముట్టడిలో సేంద్రియ సేద్యం చేస్తే రైతుకు దిగుబడులపై దిగులే ఉండదని ఎన్.ఐ.పి.హెచ్.ఎం.లో మొక్కల ఆరోగ్య నిర్వహణ విభాగం సంచాలకులు డాక్టర్ కె. విజయలక్ష్మి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ సంస్థ జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ (ఎన్.ఐ.పి.హెచ్.ఎం.). దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఉంది. వర్మీ కంపోస్టు మాదిరిగానే జీవన ఎరువులు, జీవ రసాయనాలను రైతులు స్వయంగా తయారు చేసుకునేలా శిక్షణనివ్వడం.. పొలాల నాలుగు వైపులా గట్ల మీద పూలు పూచే కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా మిత్రపురుగులను పెంచి పోషించడం.. తద్వారా చీడపీడలను ప్రకృతిసిద్ధంగానే అదుపులో ఉంచడం (ఈ ప్రక్రియనే ‘ఎకలాజికల్ ఇంజినీరింగ్’ అని పిలుస్తున్నారు)పై గత రెండేళ్లుగా ఎన్.ఐ.పి.హెచ్.ఎం. క్షేత్రస్థాయి పరిశోధనలు చేస్తోంది. ఈ పరిశోధనలు సత్ఫలితాలనిస్తున్నాయని, తేనెటీగల రాకతో దిగుబడులూ పెరుగుతున్నాయని ఎన్.ఐ.పి.హెచ్.ఎం.లో మొక్కల ఆరోగ్య నిర్వహణ విభాగం సంచాలకులు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. మిత్రపురుగుల సేవలు పొందేది ఇలా.. ఒక పంటను సాగు చేసే పొలం చుట్టూ గట్ల పైన పూత ద్వారా మిత్రపురుగులను ఆకర్షించే కొన్ని రకాల మొక్కలను వరుసలుగా సాగు చేయాలని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. చెబుతోంది. పొలంలో మిశ్రమ పంటలు కాకుండా.. ఏదో ఒకే పంట సాగు చేస్తున్నప్పటికీ.. పొలం చుట్టూ గట్లపైన పూల మొక్కల పెంపకంతో మిత్రపురుగులను ఆకర్షించి చీడపీడలను నివారించవచ్చన్నది ‘ఎకలాజికల్ ఇంజినీరింగ్’ మూలసూత్రం. ఎర పంటలు, కంచె పంటల లక్ష్యం వేరు. ‘ఎకలాజికల్ ఇంజినీరింగ్’ లక్ష్యం వేరు. ఇందులో అన్ని రకాల పంటలకూ గట్లపై నాటేందుకు ఒకే రకం పూజాతి మొక్కలు సరిపోవు. పంటలను బట్టి గట్లపై వేసే పూజాతి మొక్కలను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గట్టు 2 అడుగుల వెడల్పు ఉండాలి. పంట వేయడానికి 15 రోజులు ముందే గట్లపై వరుసలుగా ఈ మొక్కలు వేసుకోవాలి. మిత్రపురుగులకు ఎక్కువ కాలంపాటు మకరందాన్ని, పుప్పొడిని అందించే పొద్దుతిరుగుడు, మొక్కజొన్న వంటి పూజాతి మొక్కలను గట్లపై వేసుకోవడానికి ఎంపిక చేసుకోవాలి. వేరుశనగ, బెండ, టమాటా, కంది, పత్తి, వంగ పంటలతోపాటు అత్యధికంగా పురుగుమందులు చల్లే మిరప పంటను కూడా ఈ పద్ధతిలో విష రసాయనాలు వాడకుండా సాగు చేయవచ్చని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. అనుభవంలో తేలింది. అంతేకాదు.. పూలున్న చోటకు తేనెటీగలు ఎక్కువ వస్తాయి. తద్వారా పరపరాగ సంపర్కం ఎక్కువగా జరిగి పంట దిగుబడులు పెరుగుతున్నాయని రుజువైంది. టమాట, బెండ పంటల్లో ఈ విధంగా గత ఏడాదికన్నా ఈ ఏడాది తమ ప్రదర్శన క్షేత్రంలో 50 శాతం దిగుబడి పెరిగిందని డా.విజయలక్ష్మి తెలిపారు. వేరుశనగలో పేనుబంక, తామర పురుగులకు ఎరపంటగా అలసంద ఎకరానికి 200 మొక్కల చొప్పున పొలంలో విత్తడం ద్వారా సత్ఫలితాలు వచ్చాయి. శనగపచ్చపురుగు నివారణకు ఎకరానికి 200 ఆముదం మొక్కలను పొలంలో అక్కడక్కడా వేసుకోవాలి. వరిలో సుడిదోమ నష్టం బాగా తగ్గింది.. మన దేశంలో వరిలో సుడిదోమ వల్ల 30-40 శాతం వరకు దిగుబడి నష్టం జరుగుతోంది. ఎన్.ఐ.పి.హెచ్.ఎం.లో వరి పొలం చుట్టూ పొద్దుతిరుగుడు, బంతి వంటి మొక్కలు వేసినప్పుడు సుడిదోమ నష్టం 10%కి తగ్గిందని డా. విజయలక్ష్మి తెలిపారు. అయితే, పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయని, జనుము, బెండ, పెసర వంటి మొక్కలను సైతం ప్రయోగాత్మకంగా సాగు చేసి చూస్తున్నామన్నారు. నల్లగొండ జిల్లా కంపాసాగర్‌లో, కృష్ణా జిల్లా గరికపాడులో రైతుల పొలాల్లో ఈ ఖరీఫ్‌లో అధ్యయనం చేస్తున్నామని, ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. వరిలో మొదటి 40 రోజుల వరకు పురుగుమందులు వాడకూడదన్నది తమ అభిమతమన్నారు. అప్పటి వరకు వరి మొక్క కొత్త పిలకలు వేస్తూ, తనకు తాను నిలదొక్కుకోగలిగే రోగనిరోధక శక్తి కలిగి ఉంటుందన్నారు. రసాయనిక ఎరువులు వాడకుండా పంటలు సాగు చేయడం.. రసాయనిక పురుగుమందులు వాడకుండా పకడ్బందీగా సస్యరక్షణ చర్యలు చేపట్టి ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయానికి దోహదపడుతున్న ఎన్.ఐ.పి.హెచ్.ఎం. శాస్త్రవేత్తలను అభినందించాల్సిందే. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చైనా, వియత్నాంలోనూ.. ‘ఎకలాజికల్ ఇంజినీరింగ్’ ద్వారా పంటల్లో చీడపీడలను చైనా, వియత్నాం వంటి దేశాల్లోనూ అదుపు చేస్తున్నారు. చైనాలో రసాయనిక పురుగుమందులతో వరిలో సుడిదోమ అదుపులోకి రాలేదు. మిత్రపురుగులను ఆకర్షించే నువ్వు మొక్కలను వరి పొలం గట్లపై వరుసలుగా సాగు చేశారు. అప్పుడు సుడిదోమ పూర్తిగా అదుపులోకి వచ్చింది. వియత్నాంలోనూ వరి పొలాల చుట్టూ గట్లపై పూజాతి మొక్కలను పెంచుతున్నారు. చామంతి, బంతి, పొద్దుతిరుగుడు మొక్కలను దగ్గర దగ్గరగా 3 వరుసల్లో సాగు చేస్తూ చీడపీడలను అదుపులో ఉంచుతున్నారు. ప్రకృతి సేవల ద్వారా చీడపీడలను ఇలా అదుపు చేస్తున్న రైతులను ప్రోత్సహించడం కోసం వియత్నాం ప్రభుత్వం 2015 జనవరి నుంచి ప్రత్యేక నగదు పారితోషికాలను (ఎకరానికి రూ. 400 నుంచి 500 వరకు) అందిస్తుండడం విశేషం. తెలుగు రాష్ట్రాల రైతులకు 3 రోజుల ఉచిత శిక్షణ జాతీయ స్థాయి సంస్థ అయిన ఎన్.ఐ.పి.హెచ్.ఎం. పర్యావరణ హితమైన సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై శాస్త్రవేత్తలతోపాటు రైతులకు కూడా శిక్షణ ఇస్తున్నది. వర్మీకంపోస్టులో ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రం, సూడోమోనాస్ బాక్టీరియా కలిపి సేంద్రియ ఎరువు తయారు చేసుకోవడం.. పొటాష్, ఫాస్పేటులను మొక్కలకు అందుబాటులోకి తెచ్చే జీవన ఎరువులను, జీవ రసాయనాలను రైతు స్థాయిలో అభివృద్ధి చేసుకోవడం, మిత్రపురుగుల సంతతిని పెంపొందించే చర్యలపై శిక్షణ ఇస్తారు. కనీసం 20 మంది రైతులు బృందంగా ఏర్పడి, తమను 040- 24015932 నంబరులో సంప్రదిస్తే 3 రోజులపాటు శిక్షణ ఉచితంగా ఇస్తామని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. మొక్కల ఆరోగ్య నిర్వహణ విభాగం సంచాలకులు డాక్టర్ కె. విజయలక్ష్మి తెలిపారు. అయితే, భోజన ఖర్చులు రైతులే భరించాల్సి ఉంటుందన్నారు. ఇటీవల గుంటూరు ప్రాంత రైతులకు మిరప, పొగాకు సాగులో శిక్షణ ఇచ్చామన్నారు. కేరళ, తమిళనాడుల నుంచి అత్యధిక సంఖ్యలో శాస్త్రవేత్తలు, రైతులు శిక్షణ పొందుతున్నారని ఆమె తెలిపారు. -
తగ్గుతున్న భూసారం
పెరుగుతున్న కాలుష్యం విచక్షణారహితంగా రసాయన ఎరువుల వాడకమే కారణం బయోపెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్పై దృష్టి సారించడం అవశ్యం గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ సలహాలు, సూచనలు గజ్వేల్ :రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలను విచక్షణారహితంగా వాడుతుండంటం వల్ల భూముల్లో రసాయనిక చర్య జరిగి ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు లోపిస్తున్నాయి. దీనివల్ల పంటలపై తెగుళ్లు దాడిచేసి దిగుబడులు తగ్గిపోతాయి. భారీ పెట్టుబడులు పెట్టినా పంటలు పండక రైతులు నష్టాలపాలవ తారు. అంతేకాక అహారపదార్థాల్లో పోషకవిలువలు తగ్గిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో రైతులు బయోఫర్టిలైజర్స్పై దృష్టిసారించడం మంచింది. నాణ్యమైన కంపెనీలకు చెందిన బయో ఉత్పత్తులను ఎంపిక చేసుకొని యాజ మాన్య పద్ధతులను పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ (సెల్.నం 7288894469) సూచిస్తున్నారు. గతంలో రసాయనిక ఎరువులు రైతులకు ఎక్కువగా అందుబాటులో ఉండేవి కావు. అధిక దిగుబడులకోసం పశువుల ఎరువులను వినియోగించేవారు. అంతేకాక కానుగ, వేప, పాలకొడిసె, తంగేడు ఆకులను పొలంలో తొక్కేవారు. దీంతో భూమి సారవంతం కావడమే కాకుండా పంటలపై తెగుళ్లు, పురుగులు ఆశించేవి కావు. రసంపీల్చే పురుగులను నివారించడం కోసం సంధ్యవేళల్లో పొలాల వద్ద అగ్గి కుంపట్లు వేసేవారు. ప్రస్తుతం పంటల సాగు విషయంలో రైతులు రసాయన ఎరువుల వాడకంపై ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది. అంతేకాక భూమిలో రసాయన చర్య జరిగి ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మపోషకాల లోపం ఏర్పడుతోంది. దీని వల్ల కాంప్లెక్సు ఎరువు వేసినా ఆశించిన ఫలితం ఉండటం లేదు. సూక్ష్మ పోషకాల లోపం ఉన్నా మొక్క ప్రధాన పోషకాలను తీసుకోదు. ఈ ప్రభావం దిగుబడులపై చూపుతుంది. అంతే కాక తెగుళ్లు పంటలపై దాడిచేయడానికి ప్రధాన కారణం ఇదే. సహజ సస్యరక్షణ చర్యలు వరి నాట్లువేసిన మూడు రోజుల తర్వాత నాచు మొక్కలను పెంచితే మొక్కలకు అవసరమయ్యే నత్రజనిని అందిస్తుంది. గాలిలో ఉన్న నైట్రోజన్‌ను గ్రహించే తత్వం ఈ మొక్కలకుంటుంది. జీవంతో కూడిన నాచుమొక్కలను తెచ్చి పొలంలో నాలుగు దిక్కుల వేస్తే 15 రోజుల్లో మొత్తం పారుతుంది. దీనివల్ల కొంతమేరకు కలుపు మొక్కలను కూడా నివారించవచ్చు. అలాగే వరి మాగాణుల్లో అపరాలు, జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి కలియదున్నటం ద్వారా భూసారం పెరగటమే కాక సుమారు 20నుంచి 25 శాతం నత్రజని, భాస్వరం, పొటాష్‌ను ఆదా చేయవచ్చు. పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ల ఎరువులను వాడినట్లయితే భూసారం పెరిగి అధిక దిగుబడులు వస్తాయి. మొగిపురుగు నివారణ చర్యలు సహజంగా పాలకొడిసె ఆకును చిన్నగా తరిగి పొలంలో వేసినట్లయితే మొగిపురుగు నశిస్తుంది. లేదా అగ్ని అస్త్రంతో నివారించవొచ్చు. దీనిని రైతులు ఇంటి వద్దనే తయారు చేసుకోవచ్చు. ఒక పాత్రలో 10లీటర్ల గోమూత్రం తీసుకొని ఇందులో కిలో పొగాకు ముద్ద, 5కిలోల వేపాకు ముద్ద, కిలో పచ్చిమిరపకాయల ముద్ద, అరకిలో వెల్లుల్లి ముద్ద వేసి పాత్రపై మూత పెట్టి నాలుగుసార్లు పొంగువచ్చేట్లు ఉడికించాలి. అనంతరం దానిని 48గంటల వరకు చల్లార్చాలి. చివరకు ఒక గుడ్డతో వడగట్టి డబ్బాలో వేసి భద్రపరుచుకోవాలి. పురుగు ఆశించినప్పుడు ఎకరానికి 100లీటర్ల నీటికి 2 నుంచి మూడు లీటర్ల అగ్ని అస్త్రం కలిపి పిచికారి చేస్తే మొగిపురును అరికట్టవచ్చు. పచ్చపురుగు, లద్దెపురుగు నివారణ ఈ పురుగుల నివారణ కోసం నీమ్ ఆయిల్‌ను పిచికారి చేయాలి. దీనివల్ల మొక్క ఆకు చేదెక్కడం వల్ల పురుగులు వాటిని ఆశించవు. పురుగులు ఉత్పత్తి చేసిన గుడ్లపై ఈ ద్రావణం చల్లడం వల్ల అవి కుళ్లిపోతాయి. అంతేకాక ఈ ద్రావణం పడటం వల్ల ఆడపురుగులు గుడ్లుపెట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయి. కొన్ని పురుగులు బతికున్నా పంటకు ఎలాంటి నష్టం ఉండదు. లేదా పచ్చపురుగు, రబ్బరు పురుగులను సేకరించి బాగా నూర్పిడి చేసి దానిలో కొంత వైరస్ కలిపి పిచికారి చేయడం వల్ల పురుగులన్నీ నశించిపోతాయి. రసంపీల్చే పురుగుల నివారణ చర్యలు 5కిలోల పచ్చివేపాకును తెచ్చి బాగా నూర్పిడి చేయాలి. లేదా 5కిలోల ఎండు వేపాకులు, కాయల పొడిని 100లీటర్ల నీళ్లలో వేసి 5లీటర్ల గోమూత్రం, కిలో ఆవుపేడ కలపాలి. ఈరకంగా కలిపిన దానిని 24 గంటల వరకు మూసి ఉంచి తర్వాత గుడ్డతో వడకట్టాలి. ఆ తర్వాత పంటలకు పిచికారి చేస్తే రసం పీల్చే పురుగలను నివారించవచ్చు. ఆకుమచ్చ, కాయమచ్చ బూజు తెగుళ్ల నివారణ ఎకరాకు 100లీటర్ల నీళ్లలో పుల్లటి మజ్జిగను కలిపి పిచికారి చేస్తే ఈ తెగుళ్లను నివారించవొచ్చు. నాలుగురోజులు బాగా బ్యాక్టీరియా వచ్చే విధంగా ఉంచిన తర్వాత మజ్జిగా తయారు చేసి పిచికారి చేయాలి. ఇలా ప్రతి పురుగుకు రసాయన మందులను వినియోగించకుండానే నివారించవచ్చు. నాణ్యమైన ఉత్పత్తల ఎంపికే కీలకం రసాయన ఎరువుల స్థానంలో బయోపెస్టిసైడ్స్ తయారు చేసి కొన్ని ప్రైవేటు కంపెనీలు మార్కెట్లో రైతులకు అందుబాటులోకి తెచ్చారు. సుమారుగా అన్ని పురుగులకు, తెగుళ్లకు బయోపెస్టిసైడ్స్ ప్రస్తుతం అన్ని ఫర్టిలైజర్స్ దుకాణాల్లో రైతులకు లభిస్తున్నాయి. అంతేకాక రసాయన ఎరువులతో సరిసమానంగా ఫలితాలను సూచిస్తున్నాయి. రసాయన ఎరువులు వాడితే పురుగులు అప్పటికప్పుడు నశించిపోతాయి. మళ్లీ కొద్దిరోజుల తర్వాత పంటలను ఆశించే అవకాశం ఉంది. బయోపెస్టిసైడ్స్‌ను వాడటం వల్ల సుమారుగా నెలవరకు ఆ పంటపై ఎలాంటి పురుగులు ఆశించవు. బయో ఉత్పత్తుల పేరిట కొన్ని నాణ్యతలేని కంపెనీలు పుట్టుకొచ్చి రైతులు మోసం చేస్తున్న సంఘటనలు లేకపోలేదు. రైతులు నాణ్యమైన కంపెనీలపై అవగాహన పెంచుకొని వాటినే వాడాలి. -
తెలంగాణకు ‘రసాయన’ ముప్పు!
♦ వ్యవసాయశాఖ మంత్రి పోచారం ♦ రాంపూర్‌లో ‘మన తెలంగాణ - మన వ్యవసాయం’ ప్రారంభం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రానికి రసాయన ఎరువుల వాడకం వల్ల ప్రమాదం పొంచి ఉందని, ఇకనైనా సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రసాయనిక ఎరువుల వాడకంలో మన రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని, మొదటి స్థానంలో పంజాబ్ ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా నవీ పేట మండలం రాంపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకంలో మొదటి స్థానంలో ఉన్న పంజాబ్‌లో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని, పంజాబ్ నుంచి ఢిల్లీకి చికిత్స నిమిత్తం రోగులు రైలులో వెళ్లగా ఆ రైతులకు క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్ అని పేరొచ్చిందని చెప్పారు. భూసార పరీక్షలపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. రాష్ట్రంలోని కోటి ఎకరాల భూమికి 10 లక్షల యూనిట్లుగా విభజించి భూసా ర పరీక్షలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. భూసార పరీక్ష అనంతరం రైతులకు భూసార మట్టి పరీక్షా పత్రాన్ని అందిస్తామని తెలిపారు. -
‘జీరో బడ్జెట్’ సేద్యంతోనే స్వావలంబన!
♦ హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ వెల్లడి ♦ రసాయనిక వ్యవసాయం అన్నివిధాలా వినాశకరం ♦ జీరోబడ్జెట్ సేద్యంతోనే అధికోత్పత్తి.. ఆరోగ్యం కూడా సాక్షి, హైదరాబాద్: రసాయనిక ఎరువులు, పురుగు మందులతో వ్యవసాయం భారత జాతికి వినాశకరమని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ అన్నారు. రసాయనిక వ్యవసాయం వల్ల పంట భూములు నిస్సారమవడంతోపాటు, ప్రజలు కేన్సర్ వంటి భయంకర వ్యాధుల పాలవుతున్నారన్నారు. గో ఆధారితంగా సాగే జీరో బడ్జెట్ వ్యవసాయంతోనే గ్రామస్వరాజ్యం, స్వావలంబన, రైతు సౌభాగ్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో ‘సేంద్రియ వ్యవసాయంతో రైతు సౌభాగ్యం’ అనే అంశంపై ఏకలవ్య ఫౌండేషన్, జాతీయ మెట్టపంటల పరిశోధనా సంస్థ(క్రీడా), ఎన్ఐఆర్డీ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సులో శనివారం ఆచార్య దేవ్ వ్రత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రసాయనిక అవశేషాలున్న ఆహారం స్లోపాయిజన్‌గా మారి జాతిని రోగగ్రస్తంగా మారుస్తోందని అంటూ.. నానాటికీ ఆసుపత్రులు, వైద్యుల సంఖ్యకన్నా రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోందన్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థకు సేద్యం ఆధారమైతే, సేద్యానికి అవే మూలాధారమన్నారు. తాను 27 ఏళ్లుగా స్వయంగా గో ఆధారిత వ్యవసాయం చేస్తూ, రసాయనిక వ్యవసాయదారులకన్నా అధికంగా దిగుబడి పొందుతున్నాన న్నారు. కురుక్షేత్ర (హర్యానా)లోని గురుకులంలో 150 ఎకరాల్లో పండించిన పంటలతో 1,700 మంది విద్యార్థులకు ఏ లోటూ లేకుండా ఆరోగ్యవంతమైన దేశీ ఆవు పాలను, ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. ఉప్పు, లోహాలు తప్ప మరేమీ బయటి నుంచి కొనాల్సిన అవసరం లేని జీరోబడ్జెట్ వ్యవసాయంతోనే రైతు సౌభాగ్యం సాధ్యమవుతుందని ఆచార్య దేవ్ వ్రత్ స్పష్టం చేశారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయడంలో ఎదురవుతున్న సమస్యలపై రైతులు, వ్యాపారులు, స్వచ్ఛంద కార్యకర్తలు, శాస్త్రవేత్తలు ఈ సదస్సులో చర్చించి రానున్న మూడేళ్లలో చేపట్టే కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తారని ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ పి.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. సేంద్రియ సేద్యాన్ని దేశవ్యాప్తం చేయడంతోపాటు, ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థను అమల్లోకి తెచ్చినప్పుడే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి భాగయ్య అన్నారు. ‘క్రీడా’ డెరైక్టర్ శ్రీనివాసరావు, ఎన్ఐఆర్డీ డెరైక్టర్ జనరల్ డబ్ల్యూఆర్ రెడ్డి, మహారాష్ట్రకు చెందిన కన్హెరి స్వామి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘ఎరువుల అధిక వినియోగంతో సిరులు కురిపించిన పంజాబ్, హర్యానా పంట భూములు క్రమంగా బంజరు భూములుగా మారాయి. ఈ నేపథ్యంలో రసాయన ఎరువుల ఉత్పత్తి, దిగుమతులు తగ్గించాలని నిర్ణయించాం. అదే సమయంలో ఇక్కడి ఎరువుల తయారీ పరిశ్రమను కాపాడతాం’ అని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ స్పష్టం చేశారు. ఫ్ట్యాప్సీ ఆధ్వర్యంలో మంగళవారం పారిశ్రామికవేత్తలతో జరిగిన ముఖాముఖిలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ‘ప్రస్తుతం దేశంలో 310 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, 90 లక్షల టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో చెత్త నుంచి కంపోస్ట్ ఎరువు తయారు చేసి రైతులకు ఉచితంగా అందించాలని నిర్ణయించాం. మీరూ అదే దిశగా పనిచేస్తే ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సుముఖంగా వుందని’ ఎరువుల పరిశ్రమల ప్రతినిధులకు స్పష్టం చేశారు. ‘గ్యాస్‌ను దేశానికి పైపులైను ద్వారా రప్పించి, రసాయన ఎరువులను ఉత్పత్తి చేసి సబ్సిడీలు ఇవ్వడం వ్యయ ప్రయాసలతో కూడుకుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ లభ్యత వున్న ఇరాన్ నుంచి ఎరువుల దిగుమతి కోసం త్వరలో ఒప్పందం కుదుర్చుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని’ మంత్రి వెల్లడించారు. తద్వారా ఎరువులపై 80 శాతం మేర సబ్సిడీ ఇచ్చేందుకు వీలవుతుందన్నారు. ప్లాస్టిక్ పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ‘ప్లాస్టిక్ పరిశ్రమను దేశీయంగా ప్రోత్సహించేందుకు ముడి సరుకు దిగుమతులపై సుంకాన్ని 5 నుంచి 7 శాతానికి పెంచాం. ప్రస్తుతం దేశంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ సంస్థలు 27 వుండగా, మూడేళ్లలో 40కి పెంచుతాం. మొత్తం 100 సంస్థలు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుతో పాటు ప్లాస్టిక్ పాలసీపైనా కసరత్తు చేస్తున్నాం’ అని కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ ప్రకటించారు. బల్క్‌డ్రగ్ తయారీ కోసం త్వరలో ప్రత్యేక పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. పెన్‌గంగా, ప్రాణహిత ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతి మెరుగవుతుందన్నారు. డిసెంబర్ ఐదున దేశంలోని ఎంపిక చేసిన 5 జిల్లాల్లో రైతులకు మట్టి నమూనా విశ్లేషణలకు సంబంధించిన కార్డులు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. రుణమాఫీ హామీ టీఆర్ఎస్దే: కిషన్‌రెడ్డి రైతులకు లక్ష కోట్లు రుణమాఫీ చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, ఇప్పుడు మోదీ ప్రభుత్వం సహాయం చేయడం లేదని చెప్తోందని బీజేపీ శాసనసభా పక్షం నేత కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఓ వైపు కొత్త పరిశ్రమలు వస్తుండగా, పాతవి ఎందుకు మూ త పడుతున్నాయో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. ఎరువులు, ప్లాస్టిక్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ఫ్ట్యాప్సీ అధ్యక్షుడు వెన్నం అనిల్‌రెడ్డి వివరించారు. సమావేశంలో ఫ్ట్యాప్సీ ఉపాధ్యక్షులు రవీంద్రమోడీ, గౌర శ్రీనివాస్ పాల్గొన్నారు. చట్టసభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు! చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నామని కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ చెప్పారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన మహిళా మోర్చా సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలోనూ, పురోగతిలోనూ మహిళల పాత్ర చాలా కీలకమన్నారు. మహిళా సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దీనికి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుగుతున్నాయన్నారు. బేటీ బచావో-బేటీ పడావో పథకం ద్వారా బాల్య దశ నుంచి మహిళలకు బాసటగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా గంగారాం వివరించారు. తెలంగాణలోనే మహిళల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తరపున తగిన చర్యలను తీసుకుంటామన్నారు. మగవారితో సమానంగా మహిళా రైతులకు రుణాలను అందిస్తామని గంగారాం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మాట్లాడారు. -
మిత్రపురుగులే ఈ రైతన్న సైన్యం!
♦ మిత్రపురుగులను పెంచి.. తోటల్లో వదలడం ద్వారా చీడపీడల నియంత్రణ ♦ రెండేళ్లుగా రసాయనిక ఎరువులు, పురుగు మందుల్లేని సేద్యం.. ♦ 8 ఎకరాల మామిడి తోటలో ఏడాదికి రూ. 8 లక్షల ఆదాయం ♦ సంప్రదాయ సాగుబాటలో విశ్రాంత మండల విద్యాధికారి అశోక్ కుమార్ బడిలో పాఠాలు నేర్పిన చేతులు ఇప్పుడు సాగుబడిలో నాగలి పట్టాయి. సాగు చే యాలన్న తపనతో కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన అశోక్ కుమార్ ఎనిమిదెకరాల పొలం కొన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత మామిడి మొక్కలు నాటారు. మొదట్లో అందరిలాగే రసాయనిక పద్ధతుల్లోనే వ్యవసాయం చేశారు. ఫలితంగా అధిక ఖర్చు.. అయినా వీడని చీడపీడల బెడద.. అరకొర దిగుబడి! ఏం చేయాలో పాలుపోని అటువంటి పరిస్థితుల్లో హైద్రాబాద్‌లోని జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ (ఎన్.ఐ.పి.హెచ్.ఎం) ఆయనకు అండగా నిలిచింది. వ్యవసాయ విద్యార్థిగా మారి రసాయనిక ఎరువులు, పురుగు మందుల్లేకుండా సేద్యం చేసే పద్ధతులు నేర్చుకున్నారు. సొంతంగా జీవన ఎరువులను తయారు చేసుకొని వాడుతూ, మిత్రపురుగుల్ని స్వయంగా పెంచి, తోటలోకి వదలడం ప్రారంభించారు. తద్వారా తక్కువ ఖర్చుతో లాభదాయకంగా పంటలు పండిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన కొక్కు అశోక్ కుమార్ 39 ఏళ్లపాటు విద్యాశాఖలో ఉపాధ్యాయునిగా, మండల విద్యా శాఖాధికారిగా పనిచేశారు. విశ్రాంత జీవన కాలంలో వ్యవసాయం చేయాలన్న తపనతో ఉద్యోగ విరమణకు ముందే మల్యాల మండలం ఓబులాపూర్ వద్ద ఎనిమిదెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమి అంతా రాళ్లు, రప్పలు, పొదలతో నిండి ఉండేది. ఉద్యోగ విరమణ చేశాక ఆ భూమిని చదును చేయించి మామిడి మొక్కలు నాటారు. అధిక దిగుబడుల కోసం రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల్ని వినియోగించారు. మామిడి వేర్లు తేలేటట్టు ట్రాక్టర్‌తో ఐదు నుంచి ఆరుసార్లు దున్నించేవారు. ఈ పద్ధతుల్లో సాగుచేయడంతో మామిడి తోటకు కొమ్మ తొలిచే పురుగు, ఆకుమచ్చ వంటి రకరకాల చీడపీడలు తోటను తీవ్రంగా నష్టపరిచాయి. దీంతో, అశోక్ కుమార్ తన తోటలోని మామిడాకులను తీసుకొని జగిత్యాలలోని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానానికి వెళ్లారు. అక్కడి అధికారులు హైదరాబాద్‌లోని జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ(ఎన్.ఐ.పి.హెచ్.ఎం.)కు తీసుకెళ్లి చూపించమని సూచించారు. దీంతో ఆ మామిడాకుల్ని ఎన్.ఐ.పి.హెచ్.ఎం.కు తీసుకెళ్లి శాస్త్రవేత్తలకు చూపించారు. వ్యవసాయంలో సాధారణంగా రైతులు చేస్తున్న తప్పిదాలేమిటి? తక్కువ ఖర్చుతో చక్కని పంట దిగుబడుల కోసం ఏమేమి చేయాలన్న అంశాలను వివరించారు. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి? ప్రకృతి సమతుల్యత దెబ్బతింటున్నది? పంటలకు హాని చేసే పురుగులు ఎలా మొండిగా తయారవుతున్నాయి? పంటకు లాభం చేసే మిత్రపురుగులు పురుగుమందుల వల్ల ఏవిధంగా నశిస్తున్నాయి? వంటి విషయాలతో పాటు, జీవన ఎరువులను ఎలా తయారు చేయాలి? ఎలా వాడాలి... వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం ఎన్.ఐ.పి.హెచ్.ఎం.కు చెందిన శాస్త్రవేత్తలు అశోక్ కుమార్‌కు రెడ్ విడ్బగ్స్, బ్రేకాన్స్.. వంటి ఒక్కో జత మిత్ర పురుగుల్ని ఉచితంగా అందించారు. అప్పట్నుంచీ ఈ మిత్ర పురుగులను ఆయన లార్వా దశ నుండి ఎగిరేంత వరకు ఇంటి దగ్గరే పెంచుతున్నారు. బియ్యంలో ఉండే కొక్కు పురుగులు, కుళ్లిన పండ్లు, కూరగాయల్లో ఉండే పురుగులను మిత్రపురుగులకు ఆహారంగా వేస్తున్నారు. మిత్రపురుగులు కొద్ది రోజుల్లోనే వందలాది గుడ్లు పెడుతుంటాయి. ఇలా.. ఏడాదిలోనే కోటానుకోట్ల మిత్రపురుగులను సంతానోత్పత్తి ద్వారా వృద్ధి చేస్తుంటాయి. భూమి పైన పెరిగే మిత్ర పురుగులు నశించకుండా ఉండాలన్న లక్ష్యంతో ఏడాదికి ఒకసారి మాత్రమే తోటను దున్నుతున్నారు. మిత్రపురుగుల కోసం తోట చుట్టూ బంతి మొక్కలు, రకరకాల పూల మొక్కలు పెంచుతున్నారు. భూసారం పెంపు కోసం... భూసారం పెంపు కోసం సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. పెసర, కంది, మినుములు, ఉలవలు, జనుము, జీలుగ విత్తనాల్ని వర్షాలు కురియగానే తోటలో చల్లుతారు. అవి మొలకెత్తి, ఎండిపోయేంత వరకు అలాగే వదిలేస్తారు. భూమి పైన సజీవ ఆచ్ఛాదన (లైవ్ మల్చింగ్)గా కూడా ఈ ద్విదళ మొక్కలు పనిచేస్తాయి. ప్రకృతిసిద్ధంగానే నత్రజని తదితర పోషకాలను అందించడంలో సజీవ ఆచ్ఛాదన ఉపయోగపడుతోంది. ఈ విధంగా అశోక్‌కుమార్ తన తోటలో రసాయనిక ఎరువులు, పురుగుల మందులపై పెట్టే ఖర్చును ఏటా రూ.2 లక్షల వరకు ఆదా చేస్తున్నారు. వర్మీ కంపోస్టు, వర్మీ వాష్.. మామిడి చెట్లకు వర్మీ కంపోస్టు వేయడంతోపాటు వర్మీ వాష్‌ను పిచికారీ చేస్తారు. పశువుల పేడతో వర్మీ కంపోస్టు తయారు చేసి మొక్కలకు వేస్తున్నారు. ఇందుకోసం దేశవాళీ ఆవును కూడా కొనుగోలు చేశారు. 15 రోజులకోసారి జీవామృతం వాడుతున్నారు. జీవామృతం తయారీలో బెల్లానికి బదులు రాలిన మామిడి కాయలను వాడుతున్నారు. గత రెండేళ్లుగా ప్రకృతికి అనుగుణమైన సేద్య పద్ధ్దతులు పాటించడంతో మామిడి దిగుబడులు పెరిగాయని ఆయన తెలిపారు. గత ఏడాది రూ. 4 లక్షల ఆదాయం వచ్చిందని, ఈ ఏడాది రూ. 10 లక్షల వరకు రావచ్చని అశోక్ కుమార్ (98661 92761) అంచనా వేస్తున్నారు. ఎన్.ఐ.పి.హెచ్.ఎం.లో జరిగే రైతులు, శాస్త్రవేత్తల శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొని అశోక్ కుమార్ తన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. ఆయన మామిడి తోటను పరిశీలించేందుకు రైతులతోపాటు శాస్త్రవేత్తలు కూడా వస్తుంటారు. తన దగ్గరకు వచ్చే వారందరికీ వివరాల్ని ఓపిగ్గా చెబుతుంటారు. మిత్ర పురుగులను, జీవన ఎరువులను తయారీకి అవసరమైన బ్యాక్టీరియాను వారికి అందిస్తుంటారు. - పన్నాల కమలాకర్ రెడ్డి, జగిత్యాల, కరీంనగర్ జిల్లా రైతుల బృందాలకు ఎన్ఐపీహెచ్ఎంలో ఉచిత శిక్షణ రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా.. జీవన ఎరువులు, మిత్రపురుగుల తోడ్పాటుతో.. స్వల్ప ఖర్చుతో.. ప్రకృతికి అనుగుణమైన సేద్యం చేయాలనుకునే రైతులకు ఎన్.ఐ.పి.హెచ్.ఎం. 3 రోజుల పాటు ఉచితంగా రెసిడెన్షియల్ శిక్షణా శిబిరాలను తెలుగులో నిర్వహిస్తుంటుంది. 30-40 మంది రైతులు బృందంగా ఏర్పడి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఎన్.ఐ.పి.హెచ్.ఎం. శాస్త్రవేత్తలను సంప్రదించవచ్చు. -
ప్రకృతి సేద్యంలో ప్రకాశిస్తున్న యువ కిరణం
తొలిపంటలోనే అధిక దిగుబడి! రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వల్ల పెట్టుబడి పెరుగుతున్నా నికరాదాయం తగ్గిపోతుండడంతో సాగు నానాటికీ కష్టతరమవుతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పలువురు రైతులు ప్రకృతి సేద్యం చేపట్టి రాణిస్తున్నారు. పాలేకర్ వద్ద శిక్షణ పొందిన పలువురు యువ రైతులు దేశవాళీ ఆవులను సమకూర్చుకొని ప్రకృతి వ్యవసాయంలో చక్కని ఫలితాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు. సేద్యాన్ని ఆశావహమైన వృత్తిగా మలచుకుంటూ తోటి రైతాంగంలో స్ఫూర్తిని నింపుతున్న యువ రైతుల్లో పంచలింగాల సూర్యప్రకాశ్‌రెడ్డి ఒకరు. వ్యవసాయ సంక్షోభానికి సరైన పరిష్కారం- సేద్య పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవడంలోనే ఇమిడి ఉందని సూర్యప్రకాశ్‌రెడ్డి అనుభవం చాటిచెబుతోంది. ‘జీవించు.. ఇతరులను జీవించనివ్వు’ ఇదీ ప్రకృతి సూత్రం. ఈ సూత్రాన్ని మనసా వాచా కర్మణా నమ్మి ధైర్యంగా ముందడుగేసిన రైతు బతుకూ పచ్చగా ఉంటుంది. విద్యాధిక యువ రైతు పంచలింగాల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రకృతి సేద్య అనుభవాలే అందుకు నిదర్శనం. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం తాపలకొత్తూరు గ్రామం ఆయన స్వగ్రామం. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ(వృక్షశాస్త్రం) చదివిన సూర్యప్రకాశ్ తర్వాత ఒక రసాయనిక ఎరువుల కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేశాడు. తమకున్న పదెకరాల తేలికపాటి భూమికి డ్రిప్ సదుపాయం ఏర్పాటు చేసుకొని సూర్యప్రకాశ్ తండ్రి రాఘవరెడ్డి, సోదరుడు రాజశేఖరరెడ్డి రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో చీనీ(బత్తాయి), వేరుశనగ తదితర పంటలు పండించేవారు. ఎప్పటికప్పుడు నిపుణుల సూచనల మేరకు అందుబాటులోకి వచ్చిన కొత్త ఉత్పాదకాలను వాడినప్పటికీ.. ఖర్చుకు తగిన ఆదాయం రాకపోగా నానాటికీ పరిస్థితి దిగజారుతుండడం సూర్యప్రకాశ్‌ను కలవరపరచింది. ఈ పూర్వరంగంలో సాగును గిట్టుబాటుగా మార్చుకునే లక్ష్యంతో ప్రత్యామ్నాయ సేద్య పద్ధతులపై దృష్టి సారించాడు. యువ రైతు జీవితాన్ని మార్చేసిన శిక్షణ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమకారుడు సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ గ్రంథాలను అధ్యయనం చేశాడు. 2013లో మహబూబ్‌నగర్‌లో పాలేకర్ శిక్షణా తరగతులకు హాజరై లోతుపాతులను ఆకళింపుచేసుకున్నాడు. రోజుకు 10 గంటల చొప్పున ఐదు రోజులు కొనసాగిన ఈ శిక్షణ అతని జీవితాన్నే మార్చేసిందంటే అతిశయోక్తి కాదు. నవంబర్ నుంచి ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టాడు. నాలుగు దేశవాళీ ఆవులను కొనుగోలు చేసి వాటి మూత్రం, పేడతో బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం తయారుచేసుకొని వాడుతున్నారు. చీడపీడల అదుపునకు నిమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయాలను పాలేకర్ సూచించిన ప్రకారం స్వంతంగా తయారుచేసుకొని వాడుతున్నాడు. తొలి ఏడాదే గణనీయమైన ఫలితాలు సాధించి గ్రామంలో రైతులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అధిక దిగుబడి.. అధిక నికరాదాయం.. తండ్రి 11 ఏళ్లనాడు మూడెకరాల్లో నాటిన చీనీ తోటను 2013 నవంబర్ నుంచి సూర్యప్రకాశ్ ప్రకృతి సేద్యంలోకి మార్చారు. బత్తాయిలో కాకర, అలసంద పంటలను అంతర పంటలుగా వేశారు. 3,500 లీటర్ల ట్యాంకులో జీవామృతాన్ని తయారు చేసి, డ్రిప్ ద్వారా పంటలకు సరఫరా చేస్తున్నారు. 2014లో 18 టన్నుల బత్తాయి పండ్ల దిగుబడి ద్వారా రూ. 2.25 లక్షల ఆదాయం వచ్చింది. జీవామృతం తదితరాల తయారీ, కూలీలు, రవాణా చార్జీలు, పిచికారీలకు కలిపి రూ. 25 వేల ఖర్చు పోగా.. రూ. 2 లక్షల నికరాదాయం వచ్చిందని సూర్యప్రకాశ్‌రెడ్డి ఆనందంగా చెప్పారు. గతంలో రసాయన ఎరువులు, పురుగుమందులు వాడినప్పుడు రూ. 90 వేలు ఖర్చయినా.. దిగుబడి 15 టన్నులకు మించలేదు. తొలి పంటలోనే సత్ఫలితాలు కనిపించడంతో సూర్యప్రకాశ్‌కు ప్రకృతి సేద్యం దిగుబడి, ఆదాయాల పరంగా అనుసరణీయమేనన్న భరోసా కలిగింది. ప్రస్తుతం బత్తాయిలో అంతరపంటగా కాకర, అలసంద వేశారు. వేసవిలో మునగ, బొప్పాయి అంతరపంటలుగా వేయాలనుకుంటున్నారు. అరటిలో అంతర పంటగా వేరుశెనగ గత జూన్‌లో మూడెకరాల్లో అరటి నాటారు. అంతరపంటగా వేరుశెనగ ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేసి 24 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. వేరుశనగ పప్పు క్వింటా రూ. 5,350ల ధర పలికింది. ఆ తర్వాత రెండో అంతరపంటగా పప్పు దోసను కేవలం రూ. వెయ్యి ఖర్చుతో సాగు చేసి రూ. 18 వేల ఆదాయం పొందారు. అరటి మరో 3 నెలల్లో గెలలు వేయనుంది. ముప్పావు ఎకరంలో పత్తిని పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేసి 5 క్వింటాళ్ల దిగుబడి పొందారు. తమ ప్రాంతంలో తేలికపాటి నేలలో కరువు పరిస్థితుల్లో ఈ దిగుబడి తక్కువేమీ కాదని ఆయన అన్నారు. ఇంటి అవసరాల కోసం కొద్ది విస్తీర్ణంలో గోధుమ సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులు పూర్తిగా మానేసి క్రమం తప్పకుండా డ్రిప్ ద్వారా జీవామృతం ఇస్తున్నందు వలన భూమిలో వానపాములు, మేలుచేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది పంటలకు సహజ పోషకాలను అందిస్తున్నాయని సూర్యప్రకాశ్ తెలిపాడు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే రైతు తనకు ఎన్నో ఏళ్లుగా అలవాటైన సాగు పద్ధతి నుంచి, అది ఎంత నష్టదాయకంగా ఉన్నా, కొత్త పద్ధతిలోకి మారటం అంత తేలిక కాదు. కానీ, సాగు పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవడం తప్ప సంక్షోభం నుంచి బయటపడే మారో మార్గం లేదని ప్రపంచ వ్యవసాయ, ఆహార సంస్థ(ఎఫ్ఏఓ) మొత్తుకుంటున్నది. ఉన్నత విద్యావంతుడైన సూర్యప్రకాశ్ వంటి యువ రైతుల చొరవ వల్ల ఈ మార్పు దిశగా వడివడిగా అడుగులు పడే అవకాశం ఉంది. - గవిని శ్రీనివాసులు, కర్నూలు వ్యవసాయం ప్రకృతి సేద్యాన్ని ప్రభుత్వం గుర్తించి, ప్రోత్సహించాలి రసాయనిక ఎరువులు, పురుగుమందులతో సేద్యం కొనసాగించలేని సంక్షోభ పరిస్థితి వచ్చింది. తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలనిస్తున్న గోఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. రైతులకు సబ్సిడీపై దేశవాళీ ఆవులను పంపిణీ చేయాలి. ఏ పంటలనైనా సాగు చేయొచ్చు. విద్యాధిక యువతకూ ఉద్యోగం కంటే ప్రకృతి సేద్యమే మిన్న. ప్రకృతి సేద్యన్ని విస్తృతంగా రైతులకు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నాం. ఈ ఉద్దేశంతోనే కర్నూలులో మార్చిలో పాలేకర్ ఆధ్వర్యంలో రైతు శిక్షణ శిబిరం నిర్వహించాం. - పంచలింగాల సూర్యప్రకాష్‌రెడ్డి (96038 34633), తాపలకొత్తూరు, క్రిష్ణగిరి మండలం, కర్నూలు జిల్లా -
సేంద్రియ సాగు మేలు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పంట సాగులో రైతులు రసాయన ఎరువులు వాడి లాభాల కంటే నష్టాలే చవిచూస్తున్నారు. అదే సేంద్రియ సాగుపై దృష్టి సారిస్తే మంచి దిగుబడి సాధించవచ్చు. వానపాముల వ్యర్థ పదార్థాలతో వర్మీకంపోస్టు ఎరువు తయారు చేసుకోవచ్చని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మోహన్‌దాస్ తెలిపారు. వర్మీకంపోస్టు తయారీ విధానం, వానపాముల అభివృద్ధి గురించి వివరించారు. వర్మీకంపోస్టు తయారీ విధానం కుళ్లిన వ్యవసాయ వ్యర్థాలను ఆహారంగా తీసుకొని వానపాములు వర్మీ కంపోస్టు తయారుచేస్తాయి. కుండీల్లో తయారైన కంపోస్టు సేకరించిన తర్వాత మరోసారి తయారు చేయాలి. అలా చేయాలంటే వానపాములు సమృద్ధిగా ఉండాలి. అనుకూల వాతావరణంలో వానపాములు వేగంగా పెరుగుతాయి. ఎలుకలు, తొండలు కప్పలు, పాములు, పందులు, చీమలు వంటి సహజ శత్రువుల నుంచి రక్షణ ఏర్పాట్లు తప్పని సరి. ఇంకా వానపాములను వేగంగా వృద్ధి చేయాలంటే ‘సీడ్’ తయారీపై దృష్టి పెట్టాలి. వ ర్మీకంపోస్టు తయారీ విధానం సుభమమే అయినా ‘సీడ్’ తయారీ మాత్రం శ్రద్ధతో చేయాల్సిన పని. నాలుగు కుండీల్లో వర్మీకంపోస్టు తయారు చేసే రైతులు వీటిలో కొంత భాగాన్ని సీడ్ తయారీకి వాడుకోవచ్చు. కంపోస్టు తయారీకి కుండీల్లో రెండు, మూడు అంగుళాల మేర ఎండిన డోక్కల, కొబ్బరి పొట్టు లాంటివి వేయాలి. దీనినే వర్మీ బెడ్ అంటాం. సాధారణంగా ఈ వర్మీబెడ్పై కుళ్లిన వ్యర్థాలు, మగ్గిన పేడ లాంటి వాటితో బెడ్ మొత్తం నింపి, గోనెలు కప్పి ప్రతీరోజు క్యాన్‌తో తడిపితే వర్మీకంపోస్టు తయారువుతుంది. దీనిని రెండు రోజులు ఆరబెట్టి (డీ-వాటరింగ్) అపై కంపోస్టు సేకరిస్తాం. ఇలా సేకరించే సమయంలో కంపోస్టుతోపాటుగా వానపాముల గుడ్లు కూడా బయటకు పోతుంటాయి. పరిమితంగానే వానపాములు కుండీల్లో మిగులుతాయి. అయితే ఈ విధానం సీడీ తయారీకి అనుకూలం కాదు. వానపాముల అభివృద్ధి ఇలా.. కుండీల్లో ‘వర్మీబెడ్’ వేసిన తర్వాత ఒక కుండీలో చిన్న భాగంలో ఎండిన పేడ చిన్నచిన్న ఉండలుగా బెడ్‌పై సమానంగా 1/2 అంగుళం ఎత్తున వేయాలి. రోజు క్యాన్‌తో బాగా తడిపి చదరపు మీటర్‌కు కేజీ వానపాముల విత్తనం చల్లాలి. తినే పదార్థం చాలా తక్కువగా ఉండడంతో కేవలం 20 రోజుల్లో వర్మీకంపోస్టు 1/2 అంగుళం ఎత్తున తయారవుతుంది. దీనిని సేకరించరాదు. దీనిపై మరో 1/2 అంగుళం ఎత్తున ఎండిన పేడ పలచగా వేసి తడపాలి. ఈసారి మరో పది రోజులల్లోనే వర్మీ కంపోస్టు తయారవుతుంది. ఇలా ప్రతీ పది రోజులకు 1/2 అంగుళం ఎత్తున పశువుల పేడ వేసి తయాైరె న ఎరువును ఎత్తకుండా ఉంచితే కుండీ పైభాగం వరకు చేరేందుకు సుమారు 70 రోజులు పడుతుంది. దీనిలో సమృద్ధిగా ‘కకూన్స్’ వానపాములు చిన్న పిల్లలు చాలా అధికంగా ఉంటాయి. దీనిని సేకరించి మరో కొత్త ప్రదేశంలో వర్మీ కంపోస్టు తయారీకి వినియోగించుకోవచ్చు. గమనించాల్సిన విషయాలివి.. {పతీ కకూన్కు (గుడ్లు) నాలుగు నుంచి ఆరు వానపాములు వస్తాయి. 90 రోజుల వయస్సు కలిగిన పెద్ద వానపాములు తన క్రైటెల్లం (గుడ్ల శేరు) నుంచి ప్రతి 15 రోజులకోకసారి ఒక కకూన్ విడుదల చేస్తుంది. 90 రోజుల తర్వాత నుంచి రెండేళ్ల వరకు ప్రతీ 15 రోజులకు ఒక కకూన్ చొప్పన సుమారు 168 నుంచి 252 వానపాములు పెరుగుతాయి. వీటిలో ప్రతీ వానపాము 90 రోజుల వయసు వచ్చిన తర్వాత మళ్లీ 168 నుంచి 252 రేట్లు పెరిగేందుకు దోహదపడతాయి. వీటి సంఖ్య అపరిమితంగా పెరిగిపోతుంది. ‘సీడ్’ పెద్దవి కాకుండా వేరే కుండీల్లోకి తరలించాలి. పెద్ద వానపాములు వలస (మైగ్రేషన్) తట్టుకోలేవు. చిన్నచిన్న పాములు, కకూన్స్ వల్ల ఇబ్బంది ఉండదు. వీటిని ప్లాస్టిక్ తొట్టెల్లో కూడా సేకరించి ఇతర ప్రాంతాలకు సైతం రవాణా చేయవవచ్చు. వానపాములు కకూన్స్ బాగా ఫలప్రదం. (హేచింగ్) కావడానికి ప్రతీ 30 రోజులకోసారి పశువుల మూత్రం 1:10 నిష్పత్తిలో నీరు కలిపి బెడ్స్‌పై గోనెలు తడపాలి. నీరు అధికంగా పోయకూడదు. గోనె తట్టును మాత్రమే తడిగా ఉండేటట్టు తడిపితే సరిపోతుంది. ఏడాది పొడుగునా కకూన్స్ ఉన్నా శీతాకాలంలో కకూన్స్ పెట్టేందుకు, అవి హెచ్ అయ్యేందుకు మరింత అనుకూలం. సీడ్ పెంచే కుండీలు ప్రతీ ఆరునెలలకోసారి శుభ్రం చేయాలి. వర్మీబెడ్ను కూడా మార్చి కుండీ రెండు రోజులు డ్రై (ఆరబెట్టాలి) చేయాలి. -
వ్యవసాయంలో.. ఆవుసాయం!
విచ్చలవిడిగా వాడుతున్న రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వల్ల సాగు ఖర్చు విపరీతంగా పెరిగి రైతులు నష్టాల పాలవుతున్నారని స్తంభాద్రిరెడ్డి అన్నారు. భూసారాన్ని పెంచడం, ఆచ్ఛాదన (మార్చింగ్), సహజ వనరులతో కషాయాలను తయారు చేసుకుని పిచికారీ చేయడం వల్ల పంట ఉత్పత్తులు విషతుల్యం కావన్నారు. రసాయన ఎరువులు వాడిన ధాన్యాన్ని తినడం వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ట్రస్టు వ్యవ స్థాపకులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. అన్నదాతలకు తమ వంతు సాయంగా ఏదైనా చేయాలనే తలంపుతో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ మోహనయ్య, వ్యవసాయశాఖ రిటైర్డ్ అసిస్టెంట్ డెరైక్టర్ సుధాకర్, జాన్‌లు పుడమి పుత్రులకు సాగుపై సలహాలు, సూచనలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ పిండి కనకయ్య పాల్గొన్నారు. భూసారం పెంపునకు పచ్చిరొట్ట, సేంద్రియ ఎరువులు వాడాలి. జీవన ఎరువులు, ఘన, ద్రవ ఎరువులు తయారు చేసుకోవాలి. పొలాల్లో చెరువు మట్టిని వేసుకోవాలి. అంతర పంటలు సాగు చేయాలి. భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులను రక్షించుకునేందుకు పంట వ్యర్థాలను వాడటంతో పాటు మిశ్రమ పంటలు సాగు చేయాలి. చీడపీడలు సోకిన చేలపై ఆవు పెడ, మూత్రంతో కొన్ని మిశ్రమాలు కలుపుకొని నిమ్మాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్రి అస్త్రం, భీజామృతం, పుల్లటి మజ్జిగ, సొంటి పాల కషాయం తయారు చేసుకోవాలి. కషాయాల తయారీ జీవామృతం... 5 కిలోల ఆవు పేడను పల్చటి గుడ్డలో కట్టి 200 లీటర్ల నీటిలో 5 లీటర్ల ఆవు పంచకం, 50గ్రాముల సున్నం, గుప్పెడు మట్టిని కలిపి 12 గంటల వరకు నానబెడితే ఎకరాకు కావాల్సిన జీవామృతం సిద్ధమవుతుంది. వరి, ఉల్లి, మిరప, టమాట, వంగ తదితర పంటలు వేసుకునే ముందు విత్తనాలను వీటిలో ముంచి విత్తుకుంటే తెగుళ్లను బాగా తట్టుకుంటాయి. ఘన జీవామృతం పంటకు కావలసిన సూక్ష, స్థూల పోషకాలు అందించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. 10 కిలోల ఆవు పేడ, 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పు దినుసులు (రైతులు పండించినవి), గుప్పెడు మట్టిని ఆవు మూత్రంతో తడిపి 7 రోజుల పాటు నీడలో ఆరబెడితే ఘనజీవామృతం రెడీ అవుతుంది. 20 కిలోల ఘన జీవామృతాన్ని ఆవు పేడతో కలిపి దుక్కిలో వేసుకోవాలి. పంట వేసిన నెల నుంచి రెండు నెలల కాలంలో సాళ్ల మధ్య వేయాలి. ద్రవ జీవామృతం... పంటకు అవసరమైన పోషకాలను అందజేయడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. 10 కిలోల ఆవు పేడ, 5 లీటర్ల గోవు మూత్రం, 200 లీటర్ల నీటిలో 2 కిలోల బెల్లం, 2 కిలోల రైతులు పండించిన పప్పు దినుసులు, గుప్పెడు మట్టిని కలిపి 4 రోజులు పులియబెట్టాలి. దీనిని డ్రిప్పు ద్వారా, స్పే చేయడం ద్వారా పంటలకు అందించవచ్చు. నిమ్మాస్త్రం... రసం పీల్చే పురుగు, చీడపీడల నివారణకు బా గా పనిచేస్తుంది. 10 కిలోల వేపాకును మెత్తగా రుబ్బి 10 లీటర్ల గోమూత్రం, 2 కిలోల ఆవు పేడను 200 లీటర్ల నీటిలో కలిపి 48 గంటలు ఆరబెట్టి పంటలపై పిచికారీ చేసుకోవాలి. బ్రహ్మాస్త్రం... పంటలను తిని నష్టం చేసే పురుగుల నివారణకు దీన్ని వాడొచ్చు. 10 లీటర్ల ఆవు మూత్రం, 3 కిలోల వేప ఆకు, 2 కిలోల సీతాఫల ఆకులు, 2 కిలోల ఆముదం ఆకులు, 2 కిలోల కత్తెర ఆకులు, 2 కిలోల బొప్పాయి ఆకు, 2 కిలోల ఉమ్మెత్త ఆకులు, 2 కిలోల జామ, 2 కిలోల వయ్యారిభామ ఆకులను మెత్తగా నూరి నీటిలో ఉడికించాలి. ఎకరాకు 2.5 లీటర్లు, 100 లీటర్ల నీటికి కలుపుకుని పిచికారీ చేయాలి. అగ్ని అస్త్రం... కాండం, కాయతొలుచు పురుగు నివారణకు దీన్ని వాడాలి. మట్టి కుండను తీసుకుని 15 లీటర్ల ఆవు మూత్రం, 1 కిలో వెల్లుల్లి, 500 గ్రాముల పచ్చిమిర్చి, 500 గ్రాముల వేపాకు, పొగాకును వేసి వేడి చేయాలి. పురుగు ఆశించిన పంటకు 100 లీటర్ల నీటికి 3 లీటర్ల మిశ్రమాన్ని కలిపి పంటపై స్ప్రే చేసుకోవాలి. పుల్లటి మజ్జిగ... ఆకు మచ్చ, కాయమచ్చ, బూజు తెగులు నివారణకు ఉపకరిస్తుంది. 6 లీటర్ల పుల్లటి మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లను 100 లీటర్ల నీటిలో కలిపి మూడు రోజులు పులియబెట్టాలి. పురుగు ఆశించిన పంటను 20, 40 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. సొంటి పాల కషాయం... అన్ని రకాల తెగుళ్ల నివారణకు దీన్ని వాడుకోవచ్చు. 200 గ్రాముల సొంటిని మెత్తగా నూరి నీటిలో మరిగించాలి. 2 లీటర్ల ఆవు పాలు లేదా మజ్జిగలో వేసి రెండిటికి కలిపి మరిగించాలి. అదే రోజు పంటపై పిచికారీ చేయాలి. పంచగవ్య... మొక్కలు ఆరోగ్యంగా పెరిగి తెగుళ్ల దాడిని తట్టుకునేందుకు వాడాలి. 5 కిలోల ఆవుపేడ, 3 లీటర్ల గోమూత్రం, 2 లీటర్ల ఆవుపాలు, 2 లీటర్ల పెరుగు, 500 గ్రాముల నెయ్యి, 1 కిలో వేరుశనగ పట్టీలు, 12 మాగిన అరటిపండ్లు, 3 లీటర్ల కొబ్బరి నీళ్లు, 3 లీటర్ల చెరుకు రసం, లేదా బెల్లం, 3 లీటర్ల కల్లును కలిపి ప్లాస్టిక్ డ్రమ్ములో 20 రోజులు పులియనివ్వాలి. 100 లీటర్ల నీటిలో మిశ్రమాన్ని కలిపి 20 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పిచికారీ చేయాలి. -
‘సేంద్రియం’ వైపు చూపు..
‘‘సాధారణంగా పంటల సాగులో రైతులు రసాయన ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ ఎరువుల ప్రభావం ఆయా పంటలపై ఉంటోంది. రసాయన ఎరువుల ప్రభావంతో భూమిలో సారం తగ్గిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండిస్తే భూసా రం పెరుగుతుందని, అలా పండించిన పంట లు ఆరోగ్యానికీ మంచివని పేర్కొంటున్నారు. నేను సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలని నిర్ణయించుకున్నాను. ఏడాది క్రితమే ఈ నిర్ణయానికి వచ్చాను. రుద్రూర్‌లోని కృషి విజ్ఞా న కేంద్రం శాస్త్రవేత్తల సలహాలు తీసుకున్నాను. అంబం(ఆర్) రోడ్డు సమీపంలో ఎకరం 30 గుంటల భూమి ఉంది. ఆ భూమిలో ప్రయోగాత్మకంగా కూరగాయల సాగు ప్రారంభించాను. ఆరు నెలల క్రితం సొంతంగా అభ్యుదయ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశాను. వంకాయ, బీరకాయ, బెండకాయ, టమాట, చెర్రి టమాట, కీరదోస, కాకర, సోరకాయ పండిస్తున్నాను. కూరగాయలను అరకిలో, కిలో చొప్పున ప్యాక్ చేసి విక్రయిస్తున్నాను. ఎందరు వారించినా.. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తాననగానే తెలిసిన వారు వారించారు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. కూరగాయలను ఎక్కువ ధరకు అమ్మాల్సి వస్తుందని, నష్టపోతావని పేర్కొన్నారు. అయినా నేను వెనుకంజ వేయలేదు. లాభమైనా.. నష్టమైనా.. అనుభవించాలని నిర్ణయించుకుని ముందుకే సాగాను. మా నాన్న రాజారాం మాజీ వైస్ ఎంపీపీ. ఆయనను ఒప్పించి సేంద్రియ పద్ధతు ల్లో కూరగాయల సాగు మొద లు పెట్టాను. పొలంలో బిందు సేద్యం పరికరాలను ఏర్పాటు చేశాను. మల్చింగ్ పద్ధతిని అవలంబిస్తున్నాను. డ్రిప్ కోసం ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ అందించింది. రూ. 12 వేలు ఖర్చయ్యాయి. మిత్రులు చెప్పినట్లుగానే పెట్టుబడి ఖర్చు ఎక్కువైంది. సాధారణ పద్ధతులకంటే దిగుబడి కూడా తక్కువగానే వస్తోంది. దీంతో మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకు కూరగాయలు అమ్మా ల్సి వస్తోంది. సాధార ణ పద్ధతుల్లో పండించి న కూరగాయలకంటే కిలోకు రూ. 10 నుంచి రూ. 15 ఎక్కువ ధర తీసుకుంటున్నాను. మొదట్లో ఎక్కువ ధర చెల్లించడానికి ప్ర జలు వెనుకంజ వేశారు. అయితే ఇప్పు డు ఆ సమస్య లేదు. ఆరోగ్యానికి ప్రాధాన్య త ఇచ్చేవారు సేంద్రి య పద్ధతుల్లో సాగు చేసిన కూరగాయలు కొనుగోలు చేస్తుండడంతో డిమాండ్ బాగానే ఉంది. ధర ఎక్కువైనా.. కొనుగోలు చేస్తున్నారు. మార్కెటింగ్.. వ్యవసాయ క్షేత్రం వద్దే కాకుండా సమీప గ్రామాల్లో జరిగే సంతలకు కూరగాయలను తీసుకెళ్లి విక్రయిస్తున్నాను. డిమాండ్ బాగానే ఉంది. బోధన్ పట్టణానికి చెందిన కొందరు వైద్యులు ఇక్కడి నుంచి కూరగాయలను తీసుకెళ్తున్నారు. చాలా మంది రెగ్యులర్‌గా మా వద్దే కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. చెర్రి టమాట ధర కిలో రూ. 60, కీరదోస కిలో రూ. 40గా నిర్ణయించాను. ఏడాది వరకు ధరలో మార్పుండదు. ఇతర కూరగాయలను మార్కెట్ ధర కంటే 10 నుంచి 15 శాతం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాను. నెలకు రూ. 25 వేలనుంచి రూ. 30 వేల ఆదాయం వస్తోంది. సేంద్రియ పద్ధతుల్లో పంటల సాగును ప్రోత్సహించడమే నా ధ్యేయం. పలువురు రైతులు ఈ పద్ధతిలో కూరగాయల సాగుకు ముందుకు వస్తున్నాను. త్వరలో నా మిత్రులు మూడెకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేయనున్నారు’’ అని రామరాజు వివరించారు. -
పశువుల పేడ, వేపపిండే పెట్టుబడి
కందుకూరు: ప్రస్తుతం రైతులు అధిక దిగుబడులు పొందాలనే తలంపుతో ఇష్టానుసారంగా రసాయన ఎరువులు, క్రిమిసంహార మందులు వాడుతూ పంటలు పండిస్తున్నారు. దీంతో మనం తినే ఆహారం కలుషితంగా మారి రోగాల బారిన పడుతున్నాం. ఈ విధానాన్ని మార్చాలనే సంకల్పంతో మొదట తన ఇంటి అవసరాలకు పండించే వరిని ఎలాంటి రసాయన, క్రిమి సంహారక మందులు వినియోగించకుండా పండిస్తున్నాడు కందుకూరుకు చెందిన టంకరి యాదగిరిరెడ్డి. రెండేళ్లుగా ఇదే విధానంలో వరి సాగు చేస్తూ ఇంటి అవసరాలకు ఉపయోగించుకుంటున్నాడు. ఎకరా విస్తీర్ణంలో హంస రకం వరి సాగును కేవలం పశువుల పేడ, వేప పిండితో పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో చేపట్టాడు. ఎకరాకు పది ట్రాక్టర్ల ఎరువుతో పాటు, వేప గింజల్ని కొనుగోలు చేసి పిండి చేసుకుని నాలుగు సంచుల పిండిని వాడుతున్నాడు. నాట్లు వేయడానికి, కలుపు తీయడం, నూర్పిడి చేయడానికి తప్ప ఎలాంటి ఖర్చు లేదంటున్నాడు. పంటపై ఇంత వరకు ఎలాంటి తెగుళ్లు, పురుగులు సోకలేదంటున్నాడు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకపోవడంతో మిత్ర పురుగులు బాగా వృద్ధి చెంది తెగుళ్లు రాకుండా నివారిస్తున్నాయంటున్నాడు. సాధారణ సాగు కంటే కొద్దిగా దిగుబడి తక్కువ వచ్చినా గింజ నాణ్యంగా ఉంటుందని, బియ్యంలో నూకలు రావని అంటున్నాడు. దిగుబడి తగ్గినా, ఖర్చులు తక్కువ కావడం, పంట నాణ్యంగా ఉండటం కలిసి వస్తుందంటున్నాడు. ప్రస్తుతం వరి పంట ఆ విధానంలో సాగు చేస్తున్నానని, విడతల వారీగా మిగతా పంటల వైపు దృష్టి సారిస్తున్నానని, అందరు రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలనేది తన కోరిక అంటున్నాడీ రైతు. -
రసాయన ఎరువుల వాడకానికి స్వస్తి
ఘన జీవామృతం.. దుక్కిలో ఎకరాకు వంద కిలోల ఘన జీవామృతాన్ని వేస్తే డీఏపీలాంటి ఎరువుల అవసరం ఉండదు. ట్రాక్టర్ పశువుల పేడలో 50 లీటర్ల ఆవు మూత్రం, 16 కిలోల బెల్లం, 16 కిలోల శనగపిండి, 4 కిలోల పుట్ట మట్టిని బాగా కలిపి పైన నీళ్లు కొద్దిగా చల్లి 15 రోజుల పాటు మాగపెట్టాలి. ఆ తర్వాత ఆ ఎరువును ఉపయోగించుకోవచ్చు. జీవామృతాన్ని రెండు కిలోల చొప్పున బెల్లం, శనగపిండి, 5 నుంచి పది కిలోల ఆవు పేడ, 5 నుంచి 10 లీటర్ల ఆవు మూత్రం, పిడికెడు పుట్టమట్టిని 200 లీటర్ల నీటిలో కలిపి ఉదయం సాయంత్రం కలుపుతూ రెండు రోజులు నానబెట్టాలి. దానికి మరో 200 లీటర్ల నీరు కలుపుకోవాలి. మూడో రోజు నుంచి 15 రోజుల్లోపు వాడుకోవాలి. ఆ జీవామృతాన్ని పైరుపై పిచికారీ చేయడానికి లీటర్ నీటికి 20 మి.లీ. కలుపుకోవాలి. దీంతో చీడపీడలు దరిచేరవు. మొక్కకు 10 మి.లీ. చొప్పున నేరుగా పోసుకోవచ్చు. దీంతో యూరియా అవసరమే ఉండదు. పదిహేనురోజులకోసారి పైరుపై పిచికారీ చేసుకోవడంతో పాటు మొక్కకు నేరుగా ఇదే తరహాలో అందిస్తే పంట దిగుబడి ఆశించిన విధంగా వస్తుంది. బంతి పూల వంటి పంటకు ఎకరాకు 15 రోజులకు వెయ్యి లీటర్ల జీవామృతం సరిపోతుంది. వరి పైరుకు 600 లీటర్ల జీవామృతాన్ని నెలకోసారి నీటి ద్వారా పారిస్తే సరిపోతుంది. అవసరాన్ని బట్టి అగ్నిఅస్త్రం, పుల్లటి మజ్జిగను పైరుపై పిచికారీ చేయాలి. ఐదెకరాల్లో ఏడాదికి రూ.3 లక్షల ఆర్జన.. సచివాలయ విశ్రాంత ఉద్యోగి వెంకటేశ్వరరావుకు మా గ్రామంలో వ్యవసాయ పొలం ఉంది. ఆయన సూచనలతో రెండేళ్ల నుంచి సేంద్రి య సాగు చేపట్టాను. చాలా బాగా అనిపించింది. ఖర్చులు తగ్గాయి. ఇప్పుడు 5 ఎకరాల్లో ఏడాదికి పెట్టుబడి పోను రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నాను. ఒక దేశీయ ఆవుతో 5 ఎకరాల్లో ఈ తరహా సాగు చేపట్టవచ్చు. చాలా సులభమైన విధానం ఇది. చాలా మందిని ప్రోత్సహిస్తున్నాను. అధికారుల ప్రోత్సాహంతో డ్రమ్ సీడర్‌తో వరి సాగు చేస్తున్నాను. ఆయా పద్ధతులను ఇతర రైతులకు చూపిస్తున్నాను. -
నకిలీ ఎరువులను గుర్తించండిలా..
శామీర్‌పేట్: ఇటీవల కురిసిన వర్షాలతో పైర్ల ఎదుగుదల కోసం రైతులు రసాయన ఎరువులు చల్లుతున్నారు. వీటిలో నకిలీ ఎరువులను ఎలా గుర్తించాలి. ఎరువుల కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై రైతులకు శామీర్‌పేట్ మండల వ్యవసాయ అధికారి విజయలక్ష్మి కొన్ని సూచనలు, సలహాలు అందజేశారు. సాధారణంగా మార్కెట్లో దొరికే 14:28:14, 15:15:15, 17:17:17, 19:19:19, 24:24:0 28:28:0 తదితర ఎరువుల్లో కల్తీని గుర్తించేందుంకు ఒక చెంచా ఎరువును 5 మిల్లీలీటర్ల పరిశుభ్రమైన నీటిలో వేసి బాగా కలిపితే అడుగున మడ్డి చేరితే కల్తీ జరిగిందని గుర్తించవచ్చు. కాంప్లెక్స్ ఎరువుల తయారీదారులు ఎరువుల మూల పదార్థాలను తగ్గించేందుకు ఇసుక రేణువులను కలుపుతారు. ఎరువుల పరీక్ష సమయంలో ఇసుక రేణువులు పాత్ర అడుగు భాగానిక చేరితే కల్తీ ఎరువుగా గుర్తించాలి. {పభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లో ఎరువులు కొనుగోలు చేయాలి. బిల్లును తీసుకుని భద్రపర్చాలి. ఎరువుల్లో ఇతర పదార్థాలు కనిపిస్తే దానిని కల్తీ ఎరువుగా గుర్తించాలి. 5 మిల్లీ లీటర్ల పరిశుభ్రమైన నీటిలో ఒక చెంచా ఎరువును వేసి బాగా కదిపి తరువాత స్వచ్ఛమైన ద్రావణంగా తయారయితే అది నాణ్యమైన ఎరువుగా గుర్తించవచ్చు. యూరియా, అమోనియం క్లోరైడ్ ఎరువులకు 10 మిల్లీలీటర్ల నీటిని వినియోగించాలి. డీలర్ బుక్‌లో రైతు తప్పనిసరిగా సంతకం చేయాలి. మిషిన్ కుట్టు ఉన్న బస్తాను మాత్రమే తీసుకోవాలి. చేతి కుట్టు ఉన్నట్లయితే దానిపై సీసంతో సీలు ఉందో లేదో చూడాలి. బస్తాపై ప్రామాణిక పోషకాలు, ఉత్పత్తిదారుడి వివరాలను చూడాలి. ఎరువుల బస్తాను తూకం వేసిన అనంతరం తీసుకోవాలి. చిరిగిన కుట్లు వేసిన బస్తాలను తీసుకోవద్దు. అందమైన ప్యాకింగ్‌కు ఆకర్షితులు కాకుండా వ్యవసాయాధికారుల సిఫారస్ చేసిన మందులనే కొనుగోలు చేయాలి. -
బెట్టను తరిమేద్దామిలా..
ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాధారం కింద నాలుగు లక్షలకు పైగా హెక్టార్లలో పంటలు వేశారు. ఇందులో ప్రధానమైనవి పత్తి, వేరుశనగ, కంది, ఆముదం, ఉల్లి, మొక్కజొన్న. జూన్, జూలై నెలల్లో అప్పుడప్పుడు వర్షాలు కురిసినా ఆగస్టు నెలలో మొండికేశాయి. గత 20 రోజులగా చినుకుజాడ కరువైంది. దీంతో పైర్లన్నీ ఎండిపోతున్నాయి. అయితే కొద్దిపాటి శ్రమ తీసుకుంటే బెట్ట నుంచి వీటిని వారం నుంచి పది రోజుల వరకు కాపాడుకోవచ్చని డాట్ సెంటర్ ముఖ్యశాస్త్రవేత్త డాక్టర్ సరళమ్మ తెలిపారు. ఆలోపు వర్షాలు పడితే తిరిగి కోలుకుంటాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో బెట్ట నుంచి పైర్లకు ఉప శమనం కలిగించవచ్చని వివరించారు. నెర్రెలను పూడ్చాలి.. వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటంతో సాగు భూముల్లో నెర్రెలు(పగుళ్లు) వస్తున్నాయి. ఇవి వస్తే భూమిలోని తేమ ఆవిరి రూపంలో బయటికి వెళుతుంది. ఉన్న తేమ కూడా బయటికి పోతే పంటలకు మరింత ప్రమాదకరం. నెర్రెలు వచ్చినప్పుడు రైతులు అంతర కృషి చేయాలి. దీంతో తేమ బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. అంతర కృషి అంటే సాళ్ల మధ్య గొర్రుతో దున్నాలి. లేదా నాగలితో దున్నవచ్చు. ఇలా చేయడం వల్ల నైలను పూడ్చినట్లు అవుతుంది. ఆవిరి రూపంలో తేమ బయటికి వెళ్లదు. దీంతో పంటలను కొద్ది రోజుల పాటు బెట్ట నుంచి కాపాడుకోవచ్చు. పై పాటుగా రసాయన ఎరువులు పిచికారీ చేయాలి.. ఖరీఫ్‌లో వర్షాధారం కింద వేసిన పంటలన్నీ ప్రస్తుతం 30 నుంచి 60 రోజుల దశలో ఉన్నాయి. ఇప్పటికే మొక్కజొన్న పూర్తిగా ఎండిపోయింది. కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ రైతులు ప్రయత్నించాలి. రసాయన ఎరువులైన 19:19:19 లేదా 17:17:17 లేదా డీఏపీ పది గ్రాములు లీటరు నీటికి కలిపి ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వర్షాలు పడేంత వరకు వారం నుంచి పది రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. బెట్ట నుంచి పంటలకు ఉపశమనం కల్పించుకోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. పిచికారీ కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో చేసుకోవడం మంచిది. చీడ, పీడలను ఇలా నివారించుకోవాలి... బెట్ట పరిస్థితుల కారణంగా పంటలకు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంది. వీటిని కూడా నివారించుకోవాలి. డోన్, పత్తికొండ, దేవనకొండ తదితర ప్రాంతాల్లో వేరుశనగ పంటల్లో బెట్ట కారణంగా ఆకుముడుత తెగులు ఎక్కువగా కనిపిస్తోంది. దీనిని నివారణకు క్లోరో ఫైరిపాస్ 2 ఎంఎల్, నువాన్ ఒక ఎంఎల్, లేదా ఎసిపేట్ 1.5 గ్రాములు, నువాన్ 1 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రత్తి, ఆముదం పంటల్లో ఆకు తొలిచే పురుగు కనిపిస్తోంది. దీని నివారణకు క్వినాల్ పాస్ లేదా మోనోక్రోటోఫాస్ 2 ఎంఎల్ లేదా ఎసిపేట్ 1.5 గ్రాములు, వేపనూనె 5 ఎంఎల్ లీటరు నీటికి కలిపి ఎకరాకు 200 ద్రావణాన్ని పిచికారీ చేయాలి బెట్టకారణంగా టమాటలో పూత, పిందె రాలుతోంది. దీని నివారణకు ఫ్లోనోఫిక్స్ 1ఎంఎల్ 4ః5 లీటర్ల నీటికి కలిపి ఐదు రోజులకోసారి పిచికారీ చేయాలి పత్తిలో పిండినల్లి అనే తెగులు కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితుల్లో ఇది వస్తోంది. దీని నివారణకు 2 ఎంఎల్ ప్రొఫినోపాస్, 5 ఎంఎల్ వేపనూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. -
మట్టే బంగారం !
* రసాయనిక ఎరువులకు బదులు మట్టినే ఎరువుగా వాడుతున్న దానిమ్మ రైతులు * సాగు ఖర్చు తగ్గడంతోపాటు పర్యావరణానికీ మేలు * ఎకరానికి 3-3.5 టన్నుల నాణ్యమైన దిగుబడి * విస్తరిస్తున్న చింతల వెంకటరెడ్డి సాగు పద్ధతి పంట పండాలంటే ఏదో ఒక ఎరువు వేయక తప్పదు. ఎరువు అంటే.. చటుక్కున స్ఫురించేది రసాయనిక ఎరువే! అంటే రసాయనిక ఎరువులు చల్లకుండా పంట పండిందంటే ఇప్పటికీ ఆశ్చర్యపడే వాళ్లున్నారు. అటువంటిది.. చెంచాడు రసాయనిక ఎరువు వాడకుండా, వర్మీ కంపోస్టు కూడా వాడకుండా కేవలం తమ దానిమ్మ తోటలో సాళ్ల మధ్యలో నుంచి పొడి మట్టిని తీసి.. ప్రతి పది రోజులకోసారి ఎరువుగా వేస్తూ బంగారు పంటలు పండిస్తున్న రైతులున్నారు! ఇది వినడానికి ఆశ్చర్యం గానో, అతిశయోక్తిగానో అనిపించవచ్చు కానీ.. ముమ్మాటికీ నిజం! రైతు కుటుంబంలో పుట్టిన కొలను ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి అన్నదమ్ములు. వరి, కూరగాయ రైతులైన వీరి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్వెల్లి. అదే మండలం రేగడి దోస్వాడ గ్రామంలో ఏడాదిన్నర క్రితం నుంచి దానిమ్మ తోటను సాగు చేస్తున్నారు. ఒక్క స్పూను రసాయనిక ఎరువు వేయకుండా చక్కని పంట దిగుబడి పొందుతున్నారు. 25 ఎకరాల చెల్క(ఎర్ర) భూమిని సాగులోకి తెచ్చి, గత ఏడాది జనవరి 18న భగువ రకం మొక్కలు ఎకరానికి 320 చొప్పున నాటి డ్రిప్ అమర్చారు. ప్రతి 10-12 రోజులకోసారి ఆ పొలంలోని సాళ్ల మధ్యలో కల్టివేటర్‌తో దున్ని.. ఆ పొడి మట్టినే దానిమ్మ మొక్కలకు ఎరువుగా వాడుతూ వచ్చారు. మొక్కకు అటొక డ్రిప్పరు, ఇటొక డ్రిప్పరు ఉంటుంది. ప్రతి డ్రిప్పర్ దగ్గర ఒక్కో తడవకు కిలో- కిలోన్నర మట్టిని వేస్తున్నారు. తోట ఎంతో ఆరోగ్యంగా పెరిగింది. ఒక చెంచా కూడా రసాయనిక ఎరువులు, వర్మీ కంపోస్టు వాడలేదని తోటను కంటికి రెప్పలా కాపాడుతున్న యువ రైతు సుధాకర్‌రెడ్డి తెలిపారు. అయితే, రెండు సార్లు పశువుల ఎరువు వేశామన్నారు. ఎకరానికి గత ఏడాది అక్టోబర్‌లో 2 టన్నులు, ఈ ఏడాది జూన్‌లో మరోసారి 3 టన్నుల చొప్పున పశువుల ఎరువు వేశామని, ద్రవరూప ఎరువులు కూడా వాడలేదన్నారు. అయితే, చీడపీడలు రాకుండా క్రిమిసంహారక మందులు, శిలీంద్రనాశనులు మాత్రం మామూలుగానే వాడామని తెలిపారు. ఎర్రని రంగు, తీపి, నాణ్యత.. జనవరిలో నాటిన మొక్కలను గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో బెట్ట గట్టారు(డ్రైస్పెల్). ఆకు రాలడం కోసం ఈ ఏడాది జనవరి 17న ఎత్రిల్ పిచికారీ చేసి, ఐదు రోజుల తర్వాత నుంచి నీటి తడులివ్వడం ప్రారంభించారు. ఈ నెల 1వ తేదీ నుంచి దానిమ్మ పండ్ల కోతకు శ్రీకారం చుట్టారు. చక్కని సైజు, ఎర్రని రంగు, తీపి, నాణ్యతలతో కూడిన దానిమ్మ పంట దిగుబడి రావడం చూపరులను ఆశ్చర్యచకితులను చేసింది. మొక్కకు 80 నుంచి 100 కాయల వరకు కాయడంతో కొమ్మలు నేల మీదకు వంగడంతో.. వెదురు కర్రలు పాతి తాళ్లతో పైకి ఎత్తి కట్టారు. ఎకరానికి మూడు- మూడున్నర టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. దానిమ్మ కాయ బరువు సాధారణం కంటే 10 శాతం అధికంగా ఉందని, తొక్క మందంగా ఉండడం వల్ల నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని సుధాకర్‌రెడ్డి అన్నారు. వెంకటరెడ్డి స్ఫూర్తితో.. సికింద్రాబాద్‌లోని ఓల్డ్ అల్వాల్‌కు చెందిన రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి కొన్నేళ్ల క్రితమే పొడి మట్టిని ఎరువుగా వాడి పంటలు పండించవచ్చనే సరికొత్త పద్ధతిని కనుగొన్నారు. రసాయనిక ఎరువులతోపాటు పురుగుమందులు కూడా వాడకుండా వరి, గోధుమ, కూరగాయలు సాగు చేశారాయన. భూమి(కనీసం అడుగు) లోపలి నుంచి తీసి ఎండబెట్టిన పొడి మట్టినే పది రోజులకోసారి ఎరువుగా వాడి ఈ పంటలు పండించడం ఆయన ప్రత్యేకత. అధికాదాయాన్నిచ్చే పంటయిన ద్రాక్ష సాగులో మాత్రం క్రిమిసంహారక మందులు, శిలీంద్ర నాశనులు యథావిధిగా వాడుతూ.. రసాయనిక ఎరువులకు బదులుగా పొడి మట్టినే ఎరువుగా వేస్తున్నారు. ఈ సాగు పద్ధతిపై 70 దేశాల్లో పేటెంట్ హక్కులను సైతం పొందారు(పూర్తి వివరాలను 07-04-2014 నాటి ‘సాగుబడి’ పేజీలో ప్రచురించాం). మరో 300 ఎకరాల్లోనూ.. అధికాదాయాన్నిచ్చే ఉద్యాన పంటల్లో ఒకటైన దానిమ్మ సాగులోనూ ఈ పద్ధతిని అనుసరించి పంటలు పండించడంలో ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి సోదరులు ముందంజ వేశారు. అల్వాల్‌కు చెందిన శంకర్‌రెడ్డి తదితరుల బృందం రంగారెడ్డి జిల్లాలోని వివిధ చోట్ల మరో 300 ఎకరాల్లో దానిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. వీరు కూడా గత ఏడాది నుంచి రసాయనిక ఎరువులకు బదులుగా మట్టి ఎరువునే వాడి.. ఎకరానికి మూడు టన్నులకు పైగా దిగుబడి సాధిస్తుండడం విశేషం. రసాయనిక ఎరువులు కొనే పని తప్పడంతో ఈ రైతులకు సాగు ఖర్చులు బాగా తగ్గాయి. పంటలకు వేసే రసాయనిక ఎరువుల వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలవనరులు కూడా కలుషితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాగు ఖర్చులు తగ్గించు కోవ డంతోపాటు పర్యావరణ పరిరక్షణకూ దోహద పడే విధంగా ఈ రైతులు పొడి మట్టినే ఎరువుగా వాడుతూ.. చక్కని దిగుబడులు సైతం తీయడం సంతోషదాయకం. వెంకటరెడ్డి చూపిన వెలుగుబాటలో మరికొందరు రైతులు పయనించడం par శుభసూచకం.ఙ- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు: ఎం.అనిల్ కుమార్ ఫస్ట్ మాకూ నమ్మకం లేకుండె..! వెంకటరెడ్డి గారి సూచనల మేరకు.. కేవలం పొడి మట్టినే ఎరువుగా వేసి పండించాం. రసాయనిక ఎరువుల అవసరం లేదని రుజువైంది. వట్టి మట్టితో పంట పండుతుందా? అని ఫస్ట్ మాకూ నమ్మకం లేకుండె. ఒకటి రెండు సార్లు మట్టి వేసిన తర్వాత పంట బాగుండడంతో నమ్మకం కుదిరింది. తెగుళ్లు, బ్యాక్టీరియా జబ్బులు రాలేదు. 180-300 గ్రాముల కాయలున్నాయి. రసాయనాలు వాడకపోవడం వల్ల రంగు, నాణ్యత, నిగారింపు వచ్చాయి. చూడ్డానికొచ్చిన రైతులు తలా ఒక మాట చెప్పినా.. వెంకటరెడ్డి గారి మీద నమ్మకంతో కొనసాగించి.. మంచి ఫలితం పొందడం ఆనందంగా ఉంది. ఇతర రైతులూ ఈ పద్ధతిని ఆచరించవచ్చు. - కొలను ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి(99089 34648), దానిమ్మ రైతులు, రేగడి దోస్వాడ, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా ఇప్పుడేమంటారు? మంచి యాజమాన్య మెల కువలు పాటిస్తారు కాబట్టి వెంకటరెడ్డి పొలంలో మట్టిని ఎరువుగా వాడినా పంటలు పండుతున్నాయని శాస్త్ర వేత్తలు అంటుండేవాళ్లు. ఇప్పుడు పలువురు రైతులు ఈ పద్ధతిలో చక్కగా దానిమ్మ పండించి చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజం నిలకడ మీదే తెలుస్తుంది. పొడి మట్టిలో సకల పోషకాలు నిక్షిప్తమవుతాయి. ఈ మట్టికి నీరు తగిలినప్పుడు పోషకాలు విడుదలై పంటలకు అందుతున్నాయి.. అంతే! - చింతల వెంకటరెడ్డి(98668 83336), రైతు శాస్త్రవేత్త, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్ 300 ఎకరాల్లో పండిస్తున్నాం! 10 మంది రైతులం కలిసి 300 ఎకరాల్లో దానిమ్మ సాగు చేస్తున్నాం. వెంకటరెడ్డి చెప్పింది చెప్పినట్లు చేస్తున్నం. ఎకరానికి 3 టన్నులకు పైగా దిగుబడి వస్తుండడంతో సంతోషంగా ఉంది. కాయ బరువు 10% ఎక్కువగా ఉంది. కొనుగోలుదారులు తూకం చూసుకుం టున్నారు. ఫ్రిజ్‌లో పెట్టకపోయినా 10 రోజులు ఈ కాయలు చెక్కుచెదరడం లేదు. - పెద్ది శంకర్‌రెడ్డి, దానిమ్మ రైతు, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్ -
సేంద్రియ ఎరువులతో అధిక లాభాలు
నర్సాపూర్ రూరల్: రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకాన్ని తగ్గించేందుకు ఇందిర క్రాంతి పథం సభ్యులు కృషి చేస్తున్నారు. రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు, వేపపిండి, కషాయాన్ని రైతులకు అందుబాటులో ఉంచారు. మండలంలోని రుస్తుం పేట ఇందిర క్రాంతి పథం సభ్యులు రెండేళ్ల క్రితం నాన్ఫెస్టిసైడ్ మేనేజ్మెంట్ (ఎన్‌పీఎం)ను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఐకేపీ సభ్యులు పూర్తిగా రసాయన ఎరువులు వాడకుండా క్రిమి సంహారక ఎరువుల కోసం వేప కషాయం లాంటి మందులను వాడుతూ పంటలను సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో రెండేళ్ల ను ంచి రసాయన ఎరువుల వాడకం బాగా తగ్గిపోయింది. సేంద్రియ ఎరువులు, క్రిమి కీటకాల నాశనానికి వేపపిండి, వేప కషాయం వాడిన రైతులందరూ మంచి దిగుబడి సాధించడంతో మిగతాగ్రామాల రైతులు కూడా సేం ద్రియ ఎరువులు వాడేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో రుస్తుంపేట ఎన్‌పీఎం గ్రామ కోర్డినేటర్ పి. శేఖర్ ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం రుస్తుంపేట ఐకేపీ కేంద్రంలో రైతులకు కావాల్సిన సేంద్రియ ఎరువులు, వేపపిండి, వేప కషాయం అందుబాటులో ఉంచారు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల పెట్టుబడి తగ్గడంతో పాటు మంచి దిగుబడులు సాధించుకునేందుకు అవకాశం ఉందని ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు. వేపపిండి కిలో రూ.12, వేప కషాయం లీటరు రూ. 200కు విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు. వరి నాటు సమయంలో, ఇతర పంటలు సాగు చేసుకునే ముందు రైతులు వేపపిండిని విస్తీర్ణాన్ని బట్టి చల్లుకోవాల్సి ఉంటుందని ఐకేపీ సిబ్బంది చెప్పారు. పంట ఎదిగే సమయంలో క్రిమి కీటకాలు సోకకుండా వేప కషాయాన్ని పిచికారి చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. -
ప్రకృతి మెచ్చిన గిరిజనులు !
జీవితం: మనిషి మనుగడకు ప్రకృతే ఆధారం. ప్రకృతి కరుణిస్తేనే మన జీవనం.. ప్రకృతి కన్నెర్ర జేస్తే కాక తప్పదు నాశనం.. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. కానీ ఏం చేస్తాం? చెట్లు నరుక్కుంటూ పోతాం... పొలాలపై రసాయనాలు చల్లి సారం పోయేలా చేస్తాం... ఉన్న నీటిని కాపాడుకోం. లేని నీటి కోసం భూమిలోతుల్లోకి తవ్వుకుంటూ వెళ్లిపోతాం ! దీనికి భిన్నమైన స్టోరీ ఒకటి చెప్పే అవకాశం వచ్చింది మాకు. అదే ఈ కథనం. ఓసారి అరుణాచల ప్రదేశ్‌లోని జైరో తండాకు వెళ్లండి. మీకు జీవితాలు స్వచ్ఛంగా కనిపిస్తాయి. ఏముందక్కడ అనే ఒకే ప్రశ్నకు అనేక జవాబులు దొరుకుతాయి. ప్రకృతిపై వారి ప్రేమను, వారిపై ప్రకృతి ఆప్యాయతను చూడాలంటే అదే మంచి చోటు. మన మూలాలు గుర్తుచేసుకునే చోటు. ఈశాన్య భారతంలో అపాతని గిరిజన తెగది ఓ ప్రత్యేక జీవితం. కాలం ఎంత మారినా వాళ్లు మారరు. ప్రకృతిని ప్రేమిస్తారు. ప్రకృతే దేవుడంటారు. సూర్యచంద్రులనే దేవుళ్లుగా కొలుస్తారు. వారిది గుడ్డి నమ్మకం కాదు, ఎందుకంటే ప్రకృతిని నమ్మి బతుకుతున్న వారికి మనకంటే ఎక్కువే ప్రకృతి నుంచి లభిస్తోంది. వారి వ్యవసాయ విధానం సిరులు పండిస్తోంది. శాస్త్రవేత్తలకు కూడా పాఠాలు నేర్పుతోంది. జైరో ఓ చిన్న లోయ ప్రాంతం. అక్కడ అపాతని తెగకు చెందిన గిరిజనులు నివసిస్తుంటారు. వీళ్లందరి జీవనాధారం వ్యవసాయమే. అక్కడ ప్రధానంగా పండేది వరి. వాళ్లకు బోర్లు లేవు, బావుల్లేవు. పక్కనే ఉండే అడవిలో కుంటలు, సెలయేళ్ల నుంచి ఓ మోస్తరుగా నీళ్లు వస్తుంటాయి. ఆ తక్కువ నీటితోనే ఏడాది పొడవునా వ్యవసాయం చేస్తారు. ‘తక్కువ నీరు-ఎక్కువ పంట’ వారి నినాదం. ఒక్క నీటి చుక్కను కూడా వృథా చేయరు. వరి పంట మధ్యలో కాలువలు తీసి ఆ కాలువల్లో నిలిచే నీటిలో చేపలు పెంచుతారు. ఇది వీరు నేర్చిన వినూత్న పద్ధతి. పంటలో వచ్చే పురుగులు ఈ చేపలకు ఆహారంగా కూడా ఉపయోగపడుతుంటాయి. అంతేకాదు, వరి పొలంలో మడులకు మధ్య గట్లుంటాయి కదా... అలాంటి పెద్ద గట్లపై జొన్నలు వంటి అంతర పంటలు కూడా వేస్తారు. అంటే ఒకే పంట కాలంలో మూడు ఉత్పత్తులు. మడుల్లో నీరు చేపల కాలువల ద్వారా అటూ ఇటూ మళ్లించడం ద్వారా పంటలోని చాలా క్రిమికీటకాలను చేపల తింటాయి. వారింత వరకు ఎటువంటి రసాయన ఎరువులు వాడలేదు. ట్రాక్టరుతో సహా ఏ యంత్రాన్నీ వాడరు. ఇవేవీ వాడకుండా ఎకరా పొలంలో మన తీసే దిగుబడి కంటే రెండు రెట్ల ఎక్కువ పంట తీస్తారట. ఇది ఐరాస అనుబంధ సంస్థ యునెస్కోను ఆకర్షించింది. వారు వీరి జీవన విధానానికి ప్రత్యేక గుర్తింపునిచ్చారు. సూర్యచంద్రుల్ని, ప్రకృతిని కొలిచే ఆ గిరిజనులు చెట్లను ఎపుడూ దేనికీ నరకరు. అడవి పచ్చగా ఉంటే పొలానికి నీళ్లు వస్తాయన్నది వారి నమ్మకం. ఇంతవరకు అయితే వారి నమ్మకాన్ని అడవి తల్లి ఏనాడూ వమ్ము చేయలేదు. రైస్ బీర్ స్పెషల్: ‘రైస్ బీర్’ అనే పేరుతో ఇక్కడ ఒక ద్రావకం దొరుకుతుంది. దానిని సొంతంగా గిరిజనులే తయారుచేస్తారు. అది తాగితే..ఆరోజు ఇంకేం తినాల్సిన అవసరం ఉండదు. అంత శక్తినిస్తుందట ఈ పానీయం. ఇందులో వాడే ‘టాప్యో’ అనే సాల్ట్‌లో ఔషధ గుణాలుంటాయి. ఇది గొంతు వాపుతో పాటు కొన్ని వ్యాధులకు విరుగుడుగా పనిచేస్తుంది. ఈశాన్య ప్రాంతం కావడంతో ఇక్కడ త్వరగా పొద్దు పొడుస్తుంది. సాయంత్రం 4-5 కల్లా చీకటి పడుతుంది. తెల్లవారున ఐదుకే సూర్యుడు వస్తాడు. ఏటా మార్చిలో ఇక్కడ ఓ ఉత్సవం జరుగుతుంది. అపుడు చుట్టుపక్కలున్న అపాతని తెగ ప్రజలంతా ఇక్కడికి వస్తారు. ఆ సమయంలో ఇంటికెవరు వచ్చినా మంచి ఆతిథ్యం ఇస్తారు. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా పరిశీలించదగ్గ, అనుసరించదగ్గ సంస్కృతుల జాబితాలో అపాతని తెగ జీవన శైలిని చేర్చింది! వినూత్నం... వారి జీవితం వ్యవసాయంలో మాత్రమే కాదు.. జీవన శైలిలోనూ వీరిది భిన్నమైన దారే. కొన్ని మైళ్ల దూరంలోనే నాగరిక లోకం అందుబాటులో ఉంది. వారికి టీవీ తెలుసు, ట్రాక్టరు తెలుసు, కొత్త ఉత్పత్తులన్నీ తెలుసు. కానీ దానికి వారెన్నడూ ప్రభావితం కారు. తిండి, వేషధారణ, సంప్రదాయాలు... అన్నింట్లోనూ తమ ఉనికి చాటుకుంటున్నారు. పొలాల మధ్య, అడవిలో ఉండే ఈ జైరో ప్రజలు ఇంటికి ఇటుక వాడరు. మొత్తం వెదురుతోనే కట్టుకుంటారు. ఈ తెగ ఆభరణాలు, ముఖ్యంగా ఆడవారి ముక్కు పుడక ప్రత్యేకం. వస్త్రధారణ కూడా కాస్త భిన్నమే. వీరికి వ్యవసాయంతో పాటు వెదురు బుట్టల అల్లిక కూడా ఓ ఆదాయ వనరు. -
‘బీజామృతం’ తయారీ ఎలా?
ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడం కాబట్టి సాధ్యమైనంత వరకు నాటు లేదా దేశవాళీ విత్తనాలనే వాడుకోవాలి. మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవడంతోనే సరిపోదు.. దాన్ని సరిగ్గా శుద్ధి చేసి విత్తుకున్నప్పుడే చీడపీడల బెడద లేకుండా పంట, దిగుబడి బాగుంటాయి. విత్తనాలను ‘బీజా మృతం’తో శుద్ధి చేయడం ముఖ్యమైన అంశం. ‘బీజామృతం’ తయారీకి కావలసిన పదార్థాలు: నీరు 20 లీటర్లు + ఆవు మూత్రం 5 లీటర్లు + ఆవు పేడ 5 కిలోలు + పొడి సున్నం 50 గ్రాములు, పొలం గట్టు మీద మట్టి దోసెడు. తయారు చేసే విధానం: తొట్టిలో 20 లీటర్ల నీరు పోసి.. ఆవు పేడను పల్చటి గుడ్డలో మూట కట్టి 12 గంటల సేపు నీటిలో ఉంచాలి. ఠీ ఒక లీటరు నీటిని వేరే పాత్రలో తీసుకొని అందులో 50 గ్రాముల సున్నం కలిపి ఒక రాత్రంతా ఉంచాలి. ఠీ రెండో రోజు ఉదయాన్నే నానబెట్టిన పేడ మూటను చేత్తో పిండి.. సారాన్ని నీటి తొట్టిలో కలపాలి. ఠీ పేడ నీళ్లున్న తొట్టిలో పొలం గట్టు మట్టిని పోసి కర్రతో కలియతిప్పాలి. ఠీ 5 లీటర్ల ఆవు మూత్రాన్ని, సున్నపు నీటిని పేడ నీరున్న తొట్టిలో పోసి.. కలిసే వరకు తిప్పితే.. బీజామృతం సిద్ధమైనట్లే. విత్తనాలను ప్లాస్టిక్ కాగితంపై పోసి తగినంత బీజామృతం పోసి కలపాలి. విత్తనాలకు బీజామృతం బాగా పట్టిన తర్వాత.. విత్తనాలను కొద్దిసేపు నీడన ఆరబెట్టుకొని విత్తుకోవచ్చు. నారును, మొక్కలను కూడా బీజామృతంలో ముంచి నాటుకోవచ్చు. -
నాడేపు కంపోస్టు నిర్మాణాలపై నిర్లక్ష్యం
బేల, న్యూస్‌లైన్ : వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సహజ ఎరువుల వినియోగాన్ని పెంచడానికీ ప్రభుత్వం ఉపాధిహమీ పథకంలో మంజూరు చేస్తున్న నాడేపు కంపోస్టు నిర్మాణాలపై నిర్లక్ష్యమే కొనసాగుతోంది. ఇవి ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు(బీసీ) అర్హులైన రైతులకు మాత్రమే మంజూరు చేస్తారు. వీటితో సహజ ఎరువుల తయారీతో, వ్యవసాయంలో ఖర్చుల తగ్గుదలతో నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు. దీని కోసం మొత్తంగా అంచనా విలువ నిధులు రూ.15,262 ఉంటాయి. ఇందులో ఇటుకలు, కంకర, ఇసుక, ఇతర సామగ్రి కోసం రూ.6వేల వరకు కేటాయింపు ఉండగా, మిగతా 52 పని దినాలకు కూలి(3 ఏళ్లకు) కోసం నగదు చెల్లింపు ఉంటుంది. ఈ పనిదినాల కేటాయింపు రోజులు ఇలా.. బెడ్ కోసం 1, పైకప్పు కోసం 6, మరో 5రోజులు వర్మీ కంపోస్టు ఎరువు తయారీ(ఏడాదికి 3 సార్లు చొప్పున) కేటాయింపు ఉంటుంది. ఇందులో గోడ నిర్మాణం మినహాయించి, మిగతా సదరు రైతు గానీ, ఇతర కూలీలలతో పని చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మండలంలోని సిర్సన్న, సాంగిడి గ్రామాల్లోనే ఈ నిర్మాణాలు ఆగస్టులో ప్రారంభం కాగా, ఇప్పటికీ 16 పూర్తయినట్లు తెలిసింది. వీటన్నింటికీ డ్వామా అధికారుల నిర్లక్ష్యంతో, పూర్తిస్థాయిలో నగదు చెల్లింపులు ఇప్పటికీ జరుగలేదు. దీంతో ఈ నిర్మాణాలు చేయించడంలో టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉదాసీనత చూపినట్లు తెలిసింది. తద్వారా రైతులు సైతం ఆసక్తి చూపకపోవడంతో, నాడేపు కంపోస్టు నిర్మాణాలపై తీవ్ర నిర్లక్ష్యమే ఉన్నదని తెలుస్తోంది. దీంతో మిగతా గ్రామాల్లో ఈ నిర్మాణాలపై రైతులకు తెలియని పరిస్థితి నెలకొంది. నాడేపు కంపోస్టు నిర్మాణం ఇలా.. నాడేపు కంపోస్టు నిర్మాణాన్ని సదరు రైతు వ్యవసాయ చేస్తున్న చేను శివారులో నిర్మించుకోవాల్సి ఉంటుంది. ముందుగా 3 మీటర్ల పొడవు, 1.80 మీటర్ల వెడల్పుతో భూమిలో 6 ఇంచుల లోతును తవ్వి, సీసీ బెడ్ వేయాల్సి ఉంటుంది. దీనిపై 0.9 మీటర్ల(3 అడుగులు) ఇటుకతో రంధ్రాల గోడ నిర్మాణం(గాలి ప్రసారం కోసం) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గోడపై తాత్కాలిక పైకప్పు(తీసేటట్టు వీలుగా) నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. సహజ ఎరువుల తయారీ ఇలా.. ఈ నాడేపు కంపోస్టు నిర్మాణంలో ఏడాదికి 3 సా ర్లు సహజ ఎరువులు తయారు చేయాల్సి ఉం టుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత పశువుల పేడ, ఆకులు, చేన్లలో వ్యవసాయ వృథాను ఒక అడుగు మేర వేయాలి. తర్వాత ఇదంతా తడిసేటట్లు సరిపడా మోతాదులో నీళ్లు చల్లాలి. ఇదివరకే చేపట్టిన ప్రక్రియను మరో 2 సార్లు చేపడితే, నాడేపు కంపోస్టు నిర్మాణం పూర్తిగా నిండిపోతుంది. దీనిపై పైకప్పు వేసుకున్నట్లయితే, అప్పటికే నిర్మించి ఉన్న రంధ్రాల గోడ ద్వారా గాలి ప్రసారంతో సహజ ఎరువు తయారీ అవుతుంది. ఇంతే కాకుండా.. ఇప్పటికే పశువుల పే డ, ఆకులు, చేన్లలో వ్యవసాయ వృథాతో నిండి ఉన్న దానిపై వానపాములు వేసి, పైకప్పు వేసుకున్నట్లయితే కొన్ని రోజులకే ఁవర్మీ కంపోస్టు* సైతం తయారీ అవుతుంది. ఇలా తయారైన సహజ సిద్ధమైన ఎరువులను చేన్లలో వేసుకుంటే, రసాయన ఎరువుల వాడకం తగ్గించవచ్చు. సహజ ఎరువుల్లోని పోషకాలతో సారవంతమైన నేల తయారీ, పంట ఎదుగుదల ఉండి, నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. తద్వారా వ్యవసాయ పనుల్లో రైతులకు ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ఈ విషయమై ఈజీఎస్ ఏపీవో సంగీతను ‘న్యూస్‌లైన్’ ఫోన్లో వివరణ కోరగా.. సిర్సన్న లో మూడింటివీ, సాంగిడిలో కొన్నింటివీ చెల్లిం పులు యాక్సిస్ బ్యాంకు బయోమెట్రిక్ విధానం తో నిలిచాయని తెలిపారు. ఇదీ త్వరలోనే పరి ష్కారం అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. -
ప్రకృతి నేర్పేదే నిజామైన జ్ఞానం
ప్రకృతి వ్యవసాయ విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తున్న కర్ణాటక రైతు కిష్టప్ప చెరకులో ఎకరానికి రూ. 4.8 లక్షల ఆదాయం బహువార్షిక, ఏకవార్షిక పంటలతో ‘పంటల అడవి’కి రూపకల్పన భూమిలో జీవనద్రవ్యం(హ్యూమస్) పెరిగితేనే దిగుబడి పెరిగేది.. ప్రకృతి నేలకు అమర్చిన సహజ కవచ కుండలమే సారం. సారంలేని నేల ప్రాణం లేని దేహం లాంటిది. అజ్ఞానంలోనో, తెలియని అమాయకత్వంలోనో ఇవాళ మన దేశీయ వ్యవసాయం రసాయనాల వలయంలో చిక్కుకుపోయింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా అసలు మొక్క ఎదగదని, పంట పండదని బలంగా నమ్మేటంత దుస్థితిలోకి రైతు కూరుకుపోయాడు. ప్రకృతితో కలిసి సాగాల్సిన రైతు ప్రకృతికి విరుద్ధంగా ప్రయాణించి సేద్య పద్మవ్యూహంలో ఒంటరి అభిమన్యుడిలా నిస్సహాయంగా మిగిలిపోయాడు. చివరకు నిరాశా నిస్పృహల్లో దిక్కుతోచక ఆత్మహత్యల ఉరితాళ్లకు వేలాడుతున్నాడు. వ్యవసాయం గుండెల మీద కుంపటిలా మారి అన్నదాతను ‘అంతరించిపోయే జాతుల జాబితా’లోకి చేరుస్తున్న ఈ పాపకాలంలో.. బన్నూర్ కిష్టప్పలాంటి రైతులు మండుటెండలో చిరుజల్లులా మనల్ని పలకరిస్తుంటారు. సేద్యంపై.. అంతిమంగా జీవితంపై.. కొత్త ఆశను కల్పిస్తుంటారు. కర్ణాటకలోని మైసూర్ దగ్గర మాండ్యా జిల్లాలోని బన్నూర్ గ్రామానికి చెందిన కిష్టప్ప వ్యవసాయ సంక్షోభానికి ప్రకృతి వ్యవసాయమే పరిష్కారంగా ఆవిష్కరిస్తూ.. ముందుకు సాగుతున్నాడు. 2006లో రెండెకరాలతో మొదలైన ఆయన ప్రయాణం ఇవాళ 24 ఎకరాలకు విస్తరించింది. ప్రకృతి వ్యవసాయ వైభవాన్ని కళ్లారా చూడ్డానికి వచ్చే రైతులు కిష్టప్ప క్షేత్రంలో ప్రతి రోజూ కనిపిస్తారు. ఆయన అనుభవాల సారమిది... ‘‘మొదట్లో నేను వ్యవసాయంలో రసాయనాలు వాడేవాణ్ణి. మేమిక్కడ ఎక్కువగా చెరకు, ధాన్యం, అరటి పెంచేవాళ్లం. చెరకు పండించాలంటే ఎనిమిదేళ్ల క్రితం రూ. 25 వేల నుంచి 30 వేలు ఖర్చవుతూ ఉండేది. అరటికీ అంతే. మధ్యమధ్యలో పంటకు తెగుళ్లు.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోయేది. అన్నీ పూర్తయ్యాక చూస్తే వచ్చేది కూడా వడ్డీ కట్టడానికి సరిపోయేది. ఇలా జరుగుతూ ఉంటే ఏం చెయ్యాలో తెలీక రైతులు ఆత్మహత్యల బాట పట్టేవారు. ఈ బాధలకు ఏదో ఒక పరిష్కారం కనిపెట్టాలని నేను ప్రయత్నిస్తూ ఉండేవాడిని. అప్పుడు కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం నాయకుడు కే ఎస్ పుట్టన్నయ్య రైతులు చస్తే దేశం కూడా చచ్చినట్లే.. అందువల్ల మీరెవరూ చావకండి. ఎన్ని అప్పులున్నా నిదానంగా తీర్చుకుందాం అని చెప్పి, మహారాష్ట్ర నుంచి సుభాష్ పాలేకర్‌ను తీసుకువచ్చి హుబ్లీలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. అప్పుడక్కడ పాలేకర్ గారు ఒకే ఒక్క పశువుతో 30 ఎకరాల్లో వ్యవసాయం చేయొచ్చన్నారు. పంటల్ని ఎలా పెంచాలో, ఏం చేయాలో ఆయన దగ్గర తెలుసుకొని ఇక్కడికి వచ్చి.. ఆచరించడం మొదలు పెట్టాను. కేవలం పది కేజీల పేడ, పది లీటర్ల పశువుల మూత్రం. రెండు కేజీల పప్పుల పిండి, రెండు కేజీల నల్లబెల్లం, గుప్పెడు మట్టిని తీసుకొని 200 లీటర్ల నీటిలో కలియబెట్టి జీవామృతం తయారుచేసి పంటలకు అందించాను. దాంతో నాణ్యమైన దిగుబడి సాధించాను. ఇక్కడ ఏమీ ఖర్చు పెట్టకుండానే పంట లభిస్తుంది. అన్నిటికంటే జీరో బడ్జెట్ వ్యవసాయంలో పనివాళ్ల అవసరం కేవలం పది శాతం. నీటి అవసరం ఇరవై శాతం మాత్రమే. మొక్కలు అడవిలో సహజంగా ఎలా పెరుగుతాయో అలాగే ఇక్కడ కూడా పెరుగుతున్నాయి. ఎలాంటి చీడపీడలూ రావు. ఈ పద్ధతిలోనే నేనిక్కడ బాసుమతి ధాన్యం పండిస్తున్నాను. ఈ లోకల్ వెరైటీ పంట కాలం 145 రోజులు. ఎలాంటి రసాయనాలు లేకుండా కేవలం జీవామృతం వేసి నాటాం.. దిగుబడిని పెంచేది జీవనద్రవ్యమే! దిగుబడి పెరగాలంటే చేయాల్సిందల్లా నేలలో అంతకంతకూ జీవనద్రవ్యాన్ని (హ్యూమస్) పెంచుకుంటూ పోవడమే. ఆకులు, అలములు, గడ్డీ గాదం వంటి వ్యర్థాలను కుళ్లబెట్టడం ద్వారా మేం జీవనద్రవ్యాన్ని పొలంలోనే పెంపొందిస్తున్నాం. దీనివల్ల ఎలాంటి చీడపీడలు లేకుండా నాణ్యమైన పంట దిగుబడులు వస్తున్నాయి. నిరంతరంగా ఆదాయం కూడా లభిస్తోంది. మట్టిలో ఉన్న ప్రతి కిలో జీవనద్రవ్యం రోజుకు 6 లీటర్ల నీటిని వాతావరణం నుంచి పీల్చుకుంటుంది. అయితే, రసాయన వ్యవసాయంలో జీవనద్రవ్యాన్ని మనమే పాడుచేస్తాం. పంట పూర్తయ్యాక గడ్డీగాదానికి నిప్పు పెట్టి దాన్ని పాడుచేస్తాం. బయటి నుంచి రసాయనిక ఎరువులు తెచ్చి వేస్తాం. తద్వారా పంటని పెంచుకుంటాం. దీనివల్ల రైతుకు ఖర్చులు ఎక్కువైనా.. పంటలకు తెగుళ్లొచ్చి పంటా సరిగ్గా చేతికి రాదు. భూమీ పాడౌతుంది. సహజంగా అడవుల్లో పెరిగే చెట్ల నుంచి పూలు, కాయలు, ఆకులు.. వాటంతట అవే రాలిపోయి కుళ్లి జీవనద్రవ్యంగా మారి.. పునర్వినియోగం అవుతుంటాయి. ఇక్కడ పొలంలో కూడా అలాగే జీవనద్రవ్యం తయారవడం వల్ల పంటలు బాగా పండుతున్నాయి. పోషకాలన్నీ భూమిలోనే ఉన్నాయి..! రసాయనాలు, ఎరువులు ఎక్కువ వేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పిన మాటలను మనం నమ్ముతూ వచ్చాం. అదంతా అబద్ధం. మా దగ్గర పంట ఇంత నాణ్యంగా రావడానికి కారణం పంచభూతాలైన సూర్యకిరణాలు, గాలి, నీరు, ఆకాశం, భూమి! చెట్లు పంచభూతాలను ఉపయోగించుకొని కిరణజన్య సంయోగ క్రియ జరుపుతుంది. ఇది ప్రతి రోజూ జరిగే పని. వంద గ్రాముల ఆహారం తయారవడానికి 98.5% మేరకు కావాల్సింది కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్. మిగిలిన 1.5% మేరకు మాత్రమే నత్రజని, భాస్వరం, పొటాష్ (ఎన్పీకే), లఘు పోషకాలు, సూక్ష్మపోషకాలు అవసరం. కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ వాతావరణం ద్వారా ఉచితంగానే లభిస్తాయి. మిగిలిన ఒకటిన్నర శాతం పోషకాలతోనే ఇబ్బంది. మీ భూమిలో సూక్ష్మపోషకాలు లేవు తీసుకొచ్చి వెయ్యండి.. ఇంకేదో చాలినంత లేదు తెచ్చి వెయ్యండి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. కానీ, ప్రకృతి వ్యవసాయంలో మనం వీటిని ఎక్కడి నుంచీ తెచ్చి వేయనక్కరలేదు. అవన్నీ కూడా మన భూమిలోనే ఉన్నాయి. మట్టిలో ఉన్న పోషకాలను మొక్కలు ఉపయోగించుకోగలిగే రూపంలో లేవు. వీటిని వేళ్లు ఉపయోగించుకోగలిగే రూపంలోకి మార్చి అందించేది వానపాములు, సూక్ష్మజీవులు. అయితే, మనం ఏం చేస్తున్నాం? రసాయనాలు వేసి చంపేస్తున్నాం. మనం ఏమి చెయ్యాలంటే.. ఈ 1.5% పోషకాంశాలను జీవామృతం ద్వారా అందించాలి. జీవామృతం తయారీకి వాడే పేడలో గ్రాముకు 300 నుంచి 500 కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులున్నాయి. దాన్ని నీరు, మూత్రంలో వేసి కలియబెట్టినప్పుడు సూక్ష్మజీవులు ఇరవై నిమిషాల్లో రెట్టింపవుతూ ఉంటాయి. ఒక రోజుకి లెక్కలేనన్ని సూక్ష్మజీవులు అభివృద్ధి అవు తాయి. జీవామృతం ఎరువు కాదు, కేవలం కల్చర్(తోడు వంటిది). పాలల్లో మజ్జిగ తోడేస్తే పెరుగు అవుతున్నట్లే.. జీవామృతం భూమిలో వేస్తే భూమిలోకి మేలుచేసే సూక్ష్మజీవులు కోటాను కోట్లు చేరి పంటలకు పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. పొటాష్ మొదలైనవన్నీ కూడా ఇక్కడే నేలలో అందు బాటులోకి వస్తాయి. కేవలం జీవామృతం ఒకటి వెయ్యగానే మొక్కకు కావలసినవన్నీ లభించవు. బీజామృతంతో విత్తన శుద్ధి, నేలతల్లికి ఆచ్ఛాదన, నీటి తడులు ఇవ్వడంలో మెలకువ పాటించడం.. ప్రకృతి వ్యవసా యంలో ఇవి కూడా ముఖ్యమే. ఈశాన్య, నైరుతి సాళ్లతో మేలు పంట పొలంలో సాళ్లను తూర్పు, పశ్చిమం వైపుగా నాటమని కొందరు చెబుతుంటారు. అయితే, సూర్యుడి కిరణాలు ఈశాన్యంలో మొదలై నైరుతి దిశగా వస్తాయి. ఆరు నెలలు దక్షిణాయనం, మరో ఆరు నెలలు ఉత్తరాణయణం. సాళ్లని ఈ విధంగా దున్నడం వల్ల దక్షిణాయన కాలంలో పంట మొక్కల ఆకులపై ఒక వైపు మాత్రమే సూర్యకిరణాలు పడతాయి. మరోవైపు ఆకులపై సూర్యకిరణాలు పడవు. అలాగే ఉత్తరాయన కాలంలో సూర్యుడు పయనిస్తున్నప్పుడూ అంతే. ఒక వైపే కిరణాలు పడతాయి. తూర్పు, పశ్చిమ దిక్కులుగా సాళ్లు ఉంటే.. సూర్యకిరణాలు పడకపోవడం వల్ల ఏ కాలంలోనైనా సగం వైపు ఆకులు ఆహారాన్ని తయారు చేయలేవు. అందువల్ల దిగుబడి తగ్గుతుంది. రైతుకు సరిగ్గా ఆదాయం రాదు. అందువల్ల, ఈశాన్య, నైరుతి సాళ్లు వెయ్యడమే సరైనది. ఇలా చేయడం వల్ల పంటలపై సూర్యకిరణాలు ఏ కాలంలోనైనా సరిగ్గా పడి .. ఒక పిలకరావలసిన చోట వంద పిలకలు వచ్చాయి. సూర్యకిరణాలు, గాలి, వెలుతురు సరిగ్గా అందడం వల్లే కదా ఇదంతా అయ్యింది? నూటికి 98.5% మేరకు కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్, సూర్యకిరణాలు అందేలా చూడాలి. అంతే. ఇందులో నేను చేసిందేమీ లేదు. సహజ వనరుల్ని ఉపయోగించుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. దాంతో పంటంతా సహజంగా ఎదుగుతోంది. అందుకే అంటాను ప్రకృతి నేర్పేదే నిజమైన విజ్ఞానం. సుభాష్ పాలేకర్ నిజమైన విజ్ఞానాన్ని పంచుతున్నారు. దాన్ని నా పొలంలో ప్రయోగాత్మకంగా చేసి చూపించాను. అందుకే అమృతం లాంటి పంటలు పండుతున్నాయి. ప్రస్తుతం మనం భారీగా ఖర్చుపెట్టి మరీ రసాయనాలు వేసి భూమిని, అలా పండించిన ఆహారం తిని ఆరోగ్యాన్నీ పాడు చేసుకుంటున్నాం. కానీ, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంతో పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ సాగు పద్ధతిని రైతులందరూ అనుసరిస్తే వ్యవసాయం, భూమి, పరిసరాలు, ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. ఇది రైతులకు చాలా సులభంగా, లాభదాయకంగా ఉంటుంది. మనందరం చేయి చేయి కలిపి సాగుదాం. ఒక ఆకుపచ్చ ప్రపంచాన్ని సృష్టిద్దాం..’’ (చిరునామా: కిష్టప్ప, బన్నూర్, మైసూర్ జిల్లా, కర్ణాటక. మొబైల్: 08805 87545) ఫొటోలు, సంభాషణ : కె.క్రాంతికుమార్‌రెడ్డి 5 దొంతర్ల నమూనా.. ‘పంటల అడవి’! రైతులు అప్పులు చేసి, ఆత్మహత్యల పాలవుతుంటుంటే.. నగరాల్లో ప్రజలు ‘హత్య’లకు గురవుతున్నారు! ఎలాగంటే.. నగర ప్రజలు విషపూరిత ఆహారాన్ని తింటూ అనారోగ్యానికి గురై జబ్బులపాలై మరణిస్తున్నారు. ఈ మరణాలన్నీ వ్యవసాయ రసాయనాలు చేస్తున్న హత్యలే. వీటిని ఆపాలంటే మనం నేలతల్లిని కాపాడుకోవలసి ఉంది. మనం ఆచరిస్తున్న రసాయనిక వ్యవసాయ పద్ధతుల వల్ల పంటలకు చీడపీడలు వస్తున్నాయి. విపరీతంగా పురుగుమందులు కొట్టాల్సివస్తోంది. ఖర్చు మోపెడై రైతు పూర్తిగా దెబ్బతింటున్నాడు.. దీనికి పరిష్కారంగా పాలేకర్ పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంలో ‘5 దొంతర్ల పంటల నమూనా’ను రూపొందించారు. ఈ పొలం అడవిని పోలి ఉంటుంది. పెద్ద చెట్లు, మధ్యరకం చెట్లు, పొదలు, మొక్కలు, తీగజాతులు పొలంలో కలిసి పెరుగుతుంటాయి. అడవుల్లో పెద్ద చెట్టు పెరుగుతుంది. దాన్ని అనుసరించి మధ్యరకం చెట్టు పెరుగుతుంది. పొదలు పెరుగుతాయి. తీగలూ, గరికా పెరుగుతాయి. అదేమాదిరిగా అన్ని రకాల చెట్లని సహజీవనం చేయించే విధంగా పాలేకర్ ఈ పంటల నమూనాను రూపొందించారు. ఈ చెట్లన్నీ పొలంలో పక్కపక్కనే ఉండి అంగుళం భూమి కూడా వృథా కాకుండా వినియోగించుకుంటున్నాయి. ఈ పద్ధతిలో తెగుళ్ల సమస్య తక్కువ. కొబ్బరి చెట్టు నుంచి ఇంకో కొబ్బరి చెట్టుకు మధ్య దూరం 36 అడుగులు. వీటి మధ్యన 136 మొక్కల్ని నాటించాం. ఇప్పుడు మా దగ్గర ధాన్యం, చెరకు, కొబ్బరి, వక్క, అరటి, కోకో, కాఫీ, బత్తాయి, నారింజ.. గ్లైరిసీడియా(గిరిపుష్పం), వెనిలా మొదలైన పంటలున్నాయి. తద్వారా సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుంది. భూమిలో సూక్ష్మజీవరాశి మనుగడకు ఇది చాలా అవసరం. ఏడాది పొడవునా ఎంతోకొంత ఫలసాయం వస్తూనే ఉంటుంది. . అంతర పంటల ద్వారా ఖర్చులొచ్చేస్తాయి..! మేం మొదట్లో రసాయనిక ఎరువులు, పురుగుమందులతో చెరకు సాగు చేసేవాళ్లం. రసాయనిక పద్ధతిలో చెరకు నాటడానికి ఎకరానికి 4 టన్నుల విత్తనం కావలసొచ్చేది. ఇక రసాయ నిక ఎరువులకు రూ. పది వేలు, విత్తనాలతో పాటు మొత్తంగా రూ. 40 వేలు ఖర్చవుతుండేది. అంతా చేస్తే చివరికి 40 నుంచి 50 టన్నుల చెరకు పండేది. కానీ, చివరికి ఏమీ మిగిలేది కాదు. అంతా జీరో. అందువల్ల పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని మేం మొదలుపెట్టాం. మాది కేవలం జీరో బడ్జెట్ వ్యవసాయం. ఒకే ఒక పశువుతో 30 ఎకరాల వ్యవసాయం చెయ్యవచ్చు. అదీ జీవామృతం సహకారంతోనే. ఇందులో ఎకరానికి కేవలం ఒక్క టన్ను విత్తనం చాలు. చెరకు గణుపు గణుపునకూ మధ్య రెండడుగులు, సాలు సాలుకూ మధ్య 8 అడుగుల దూరం ఉండాలి. మధ్యలో అంతరపంటలుగా ఉల్లి, మిరప, అలసందలు (బొబ్బర్లు), కూరగాయలు వంటి స్వల్పకాలిక పంటల్ని పెంచుతాం. ఈ పద్ధతిలో నాటే ప్రతి చెరకు గణుపునకు వంద పిలకలు వస్తాయి. మనకి ఇందులో ఎకరానికి 200 టన్నుల వరకు దిగుబడి తీయవచ్చని పాలేకర్ చెబుతారు. ఇప్పుడు మాకు 60 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. బెల్లం ఆడించి అమ్ముతున్నా. రసాయనిక వ్యవసాయంలో టన్ను చెరకు నుంచి 95-100 కిలోల బెల్లం ఉత్పత్తి అవుతుంటే.. ప్రకృతి వ్యవసాయంలో పండించిన చెరకు టన్నుకు 120 కిలోల చొప్పున దిగుబడి వస్తోంది. ఎకరానికి రూ. 4.8 లక్షల ఆదాయం వస్తోంది. ఈ పద్ధతిలో దిగుబడి అంతకంతకూ పెరుగుతుంటే.. రసాయన పద్ధతిలో దిగుబడి అంతకంతకూ తగ్గుతూ పోతోంది. చెరకు మధ్యలో ఉల్లి, బొబ్బర్లు, మిరప, బంతిపూలు.. కూరగాయలు పెంచడం ద్వారా కూలీల ఖర్చులు వచ్చేస్తాయి. ఇక చెరకు నుంచి వచ్చే ఆదాయం మనకు బోనస్‌గా మిగులుతుంది. అందుకే ఈ పద్ధతిని మేం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అని గర్వంగా చెబుతాం. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ప్రోత్సహించే ఏక పంట పద్ధతి (మోనోక్రాప్ సిస్టమ్) వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. రకరకాల పంటలు ఒకే పొలంలో వేస్తే ఆరోగ్యంగా పెరుగుతాయి.. -
ప్రకృతి వ్యవసాయంతో.. లాభాల పంట!
ప్రకృతిని ప్రేమిస్తే ఫలాలందిస్తుంది! రసాయనిక ఎరువులు, పురుగు మందులకు పూర్తిగా స్వస్తి {పసాద్ చదివింది ఇంజనీరింగ్.. చేస్తున్నది ప్రకృతి వ్యవసాయం ‘నీరు అతి మృదువైనది అయితే అది గండశిలా పర్వతాలను పగలదోసుకు దాటగలదు. నేల అట్టడుగు పొరల వరకు చీల్చుకొని చేరగలదు. మృదుత్వం కాఠిన్యతపై ఆధిక్యత సాధించగలదనడానికి ఇది ఉదాహరణ’ అంటాడు చైనా తత్వవేత్త లావోజు. మనిషి, మాట మృదువుగా కనిపించే చిత్తూరు జిల్లా మదనపల్లె ఎంసీవీ ప్రసాద్‌కు ఈ మాటలు వర్తిస్తాయి. వ్యవసాయం ఏళ్లనాటి శని అని భావిస్తున్న రోజుల్లో చదివిన ఇంజనీరింగ్ చదువును వ్యవసాయానికి వర్తింపజేస్తూ.. సాగు బతుకుకు భరోసాగా నిలుస్తుందని చాటాడు. ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ఉద్యమస్థాయికి తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేస్తూ పెట్టుబడిలేని వ్యవసాయ విధానంతో లాభాల సాగుకు దారులేస్తున్నాడు. ప్రసాద్ సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. ఇంజనీరింగ్ చదివిన ఏ కుర్రాడైనా కార్పొరేట్ సంస్థలు అందించే వేతన ప్యాకేజీని తన ప్రతిభకు కొలమానంగా చూసుకుంటాడు. అయితే, రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన ప్రసాద్‌కు తండ్రి వారసత్వంగా వ్యవసాయం అంటే మమకారం అబ్బింది. భూమి తల్లి అంటే ఆయనకు తగని మమకారం. తండ్రి పద్మానాభరెడ్డి వ్యవసాయంలో దిట్ట. మొట్టమొదట మదనపల్లెకు టమాటొ పంటను పరిచయం చేసిన వ్యక్తి. తండ్రి బాటలోనే వారసత్వంగా అందిన 80 ఎకరాల పొలంలో సాగు చేస్తున్నారు. వ్యవసాయంలోనే దేశ ఆర్థిక మూలాలున్నాయని గట్టిగా నమ్మిన వ్యక్తి. అందుకే తన తండ్రి పద్మనాభరెడ్డి స్ఫూర్తితో సాగు ప్రారంభించారు. సేద్యంలో అడుగు మొదలు పెట్టిన తరువాత ఎదురవుతున్న ఆటుపోట్లను దృఢచిత్తంతో ఎదుర్కొంటూనే.. సాధించిన ఫలితాలను మదింపు వేసుకుంటే రసాయనిక వ్యవసాయంలోనే ఎక్కడో తేడా ఉందని భావించి ప్రత్యామ్నాయాలను అన్వేషించారు. ఆ సమయంలో 2008లో వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్(మహారాష్ట్ర) తిరుపతిలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ విధానంపై నిర్వహించిన శిక్షణా శిబిరానికి ప్రసాద్ హాజరయ్యారు. ఈ విధానాన్ని ఆకళింపు చేసుకొని సంతృప్తిగా ప్రకృతి వ్యవసాయం చేసు ్తన్నారు. భార్య యోగిత, స్నేహితుడు గుణశేఖర్రెడ్డి తోడ్పాటుతో మిరప, టొమాటొ, క్యాప్సికం, వంగ, మొక్కజొన్న, వేరుశెనగ, కందులు, మినుములు పండిస్తున్నారు. దవనం, నిమ్మగడ్డి సాగు చేసి వాటితో సుగంధ తైలం ఉత్పత్తి చేసి, ఎగుమతి చేస్తున్నారు. ఎకరానికి 48 బస్తాల ధాన్యం దిగుబడి 2008కి ముందు రసాయనిక ఎరువులు, పురుగు మందులకు ప్రసాద్‌కు ఏటా రూ. పది లక్షలు ఖర్చయ్యేవి. ప్రకృతి వ్యవసాయానికి మారి జీవామృతం తదితరాలు వాడుతున్నందున పెట్టు బడులు గణనీయంగా తగ్గాయి. వరిలో ఎకరానికి తొలుత 37 బస్తాల దిగుబడి రాగా, తర్వాత 48కి పెరిగింది. ఈ ప్రాంతంలో రసాయనిక ఎరువులతో సాగుచేస్తున్న టొమాటొ 2 నెలలు కాపునిస్తుండగా ప్రసాద్ పొలంలో 3 నెలలకుపైగా నాణ్యమైన దిగుబడి వస్తోంది. రెట్టింపైన సుగంధ తైలం దిగుబడి లాభసాటిగా ఉండే దవనం, నిమ్మగడ్డి వంటి పంటల వైపు ప్రసాద్ దృష్టి సారించారు. రసాయనిక ఎరువులతో సాగు చేసినప్పుడు టన్ను దవనం నుంచి ఒక కిలో సుగంధ తైలం దిగుబడి వచ్చేది. ప్రకృతి సేద్య విధానానికి మారిన తరువాత దవనం నుంచి టన్నుకు సుమారు 2.2 కిలోల తైలం దిగుబడి వస్తోంది. అత్యధిక విస్తీర్ణంలో దవనం సాగు చేసి సుగంధ తైలాలను ఉత్పత్తి చేసినందుకు 2005లో అప్పటి రాష్ట్రపతి కలామ్ చేతుల మీదుగా సీఎస్ఐఆర్ ఉన్నతి అవార్డు అందుకున్నారు. ఆ తరువాత అనేక సంస్థలు ప్రసాద్‌కు అవార్డులతో సత్కరించాయి. మధుమేహ నివారణ ఔషధాలలో వాడే సెలేషియా పంటను టకామా కంపెనీ(జపాన్)తో ఒప్పందం మేరకు ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. జన్యుమార్పిడి, హైబ్రిడ్ విత్తనాల అవసరం లేదని నమ్మే ప్రసాద్ దేశవాళీ విత్తనాలనే వాడుతూ ఉంటారు. 8 దేశీ జాతుల ఆవులనూ మక్కువతో పెంచడం విశేషం. - ఎం.చంద్రమోహన్, న్యూస్‌లైన్, మదనపల్లె సిటీ, చిత్తూరు జిల్లా ప్రకృతి వ్యవసాయమే సంక్షోభానికి పరిష్కారం వ్యవసాయ రంగంలో సంక్షోభం పరిష్కారమవ్వాలంటే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులతో సాంద్ర వ్యవసాయం మాని ప్రకృతి వ్యవసాయం చేయడమే మార్గం. ఈ విధానంలో నేలలో సూక్ష్మజీవులు, వానపాములు వృద్ధి చెంది పోషకాలను పుష్కలంగా అభివృద్ధి చేస్తాయి. నేలకు నీటి తేమను పట్టి ఉండే సామర్ధ్యం పెరుగుతుంది. 700 అడుగుల బోర్ వేస్తేనే తప్ప నీటి చుక్క జాడ దొరకని ప్రాంతంలో వ్యవసాయం లాభసాటిగా చేయగలగడంలో ఉన్న రహస్యం ఇదే. - ఎంసీవీ ప్రసాద్ (94401 68816), చిన్నతి ప్పసముద్రం, మదనపల్లె, చిత్తూరు జిల్లా -
వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభ
బళ్లారి (తోరణగల్లు), న్యూస్‌లైన్ : మానవ శరీరంలోని వివిధ భాగాలు, అవిపనిచేసే తీరుతెన్నులను విద్యార్థి బృందం వివరించారు. మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడిన ఆహార ధాన్యాలను భుజించడం వల్ల కలిగే అనారోగ్య పరిణామాల మరో విద్యార్థి బృందం వివరిస్తోంది. నాడు దేశస్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులతో పోరాడి అశువులు బాసిన దృశ్యాలను కళ్లకు కట్టినట్లుగా మరికొంత మంది చిన్నారులు ప్రదర్శించారు. ఇవి నగరంలోని సత్య ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలోని దృశ్యాలు. ఇటు విద్యార్థులను తల్లిదండ్రులను ఆకట్టుకొంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా అన్ ఎయిడెడ్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు మర్రిస్వామిరెడ్డి, పాఠశాల అధ్యక్షురాలు బి.కె. రాధ ప్రారంభించారు. ప్రదర్శనలో సుమారు 500 మంది విద్యార్థులు 150 ప్రదర్శనలు చేశారు. విద్యార్థులు సందర్శనకు శుక్రవారం కూడా వీలుకల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.కె. శ్రీనివాసరావు, కె.శ్రీనివాస్, మాధవరాజ్, ఐషా, విద్యార్థులు పాల్గొన్నారు. -
కిచెన్ గార్డెన్
ఇంటిపంట రసాయన ఎరువులతో పండించే కాయగూరలు తింటూ మనం ఎదుర్కొంటున్న ఆరోగ్యసమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనీసం ఆకుకూరలైన సేంద్రీయ ఎరువులతో పండించుకుని తినే భాగ్యం మనకు లేదా? అని ఆలోచించేవారు చాలామంది ఉన్నారు. అలాంటివారికి కిచెన్గార్డెనింగ్ చాలా సాయపడుతుంది. ఓ నాలుగు మట్టి కుండీలు, ఆకుకూరల విత్తనాలు చేతిలో ఉంటే ఎంచక్కా మీరే స్వయంగా సేంద్రీయ పంటలు పండించుకోవచ్చు. ఆకుకూరలతో ఆరంభం... ఒకటి లేదా రెండు కుండీలతో ఆకుకూరల సాగు సరదాగా మొదలు పెట్టొచ్చు. ఆకుకూరలకు ఆరు అంగుళాల కన్నా లోతు మట్టి అవసరం లేదు. వెడల్పు ఎక్కువ, ఎత్తు తక్కువ ఉండే కుండీలు/ట్రేలు/మడులలో ఆకుకూరలు ఎంచక్కా సాగు చేయొచ్చు. మొదట.. ఎర్రమట్టి, చివికిన పశువుల ఎరువు / వర్మీకంపోస్టు సమపాళ్లలో కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోండి. కొబ్బరి పొట్టు, వేపపిండి కొంచెం కలిపితే మంచిది. కుండీ అడుగున బెజ్జం మీద కుండ పెంకులు లేదా రాళ్లతో కప్పండి(ఈ బెజ్జం పూడిపోకుండా ఉంటేనే.. అదనపు నీరు బయటకుపోతుంది. కుండీలో నీరు నిలబడితే మొక్కకు నష్టం). ఆ తర్వాత కుండీ అడుగున అంగుళం మందాన ఎండు ఆకులు వేసి.. పైన మట్టి మిశ్రమం పోయండి. మట్టి నింపిన రోజే విత్తనాలు చల్లకండి. నీరు పోస్తూ ఒకటి, రెండు రోజులు కుండీ సాగు సిద్ధమయ్యాక.. విత్తనాలు చల్లండి లేదా మొక్కలు నాటండి. ఏ కాలమైనా... విత్తనాలు లేవా? పర్లేదు. పోపు డబ్బాలో మెంతులు ఉన్నాయి కదా? మెంతి కూర ఎంత ఆరోగ్యమో మీకు తెలుసు కదా! గుప్పెడు మెంతులు తీసుకొని కుండీలో చల్లండి. వాటిపైన పల్చగా మట్టి వేసి.. నెమ్మదిగా నీటిని చిలకరించండి. మొక్కలు మొలిచే వరకూ తడి ఆరకుండా చూడండి. మొలకలొచ్చే వరకు పైన ఎండు ఆకులు కప్పితే మరీ మంచిది. కుండీలో/ట్రేలో మట్టి ఏకాలంలోనైనా తడీపొడిగా ఉండాలి. నీరు నిలవ కూడదు.. అంతే! వారం/పది రోజుల్లో ముచ్చటైన బేబీ మెంతి కూర పచ్చగా పలకరిస్తుంది! మెంతికూర ఒక్కటేనా? పాలకూర, చుక్కకూర.. ఒకటేమిటి ఆకుకూరలేవైనా.. ఏ కాలంలోనైనా సాగు చేయొచ్చు. అలాగే కొత్తిమీర పెంచుకోవాలంటే కూడా ఇదే పద్ధతిని అనుసరించాల్సిందే. అయితే ధనియాలను యథాతథంగా చల్లకూడదు. బాగా పలుకులుగా నలిచి ఆ తర్వాత చల్లాలి. చేత్తో నలిపితే ధనియంలోని గింజ బయటకు రాదు, ధనియాలను నేల మీద వేసి గట్టి అట్టముక్కతో నలపాలి. - పంతంగి రాంబాబు, ‘సాక్షి’ స్పెషల్ డెస్క్ -
చిన్న రైతే పెద్ద దిక్కు!
వివరం మానవుల జీవితాన్ని సులభసాధ్యంగా, భద్రంగా, మరింత ఆనందమయంగా మార్చిన విజ్ఞాన ధారలు అనేకం. వాటిల్లోకెల్లా ముఖ్యమైనది వ్యవసాయ విజ్ఞానమే. మానవ నాగరికత చరిత్రే వ్యవసాయ చరిత్ర కూడా. వ్యవసాయ విజ్ఞానాన్ని సంతరించుకోనంత కాలం మనుషులు సంచార జీవనమే సాగించారు. విత్తనాలు చల్లి పంటలు పండించడం, జంతువులను మచ్చిక చేసుకొని ఉపయోగించుకోవడం మొదలైనప్పుడే స్థిర జీవనానికి పునాది పడింది. వ్యవసాయం తెలియకపోయి ఉంటే అసలు పట్టణాలు, నగరాలకు పుట్టుకే లేదు. డిసెంబర్ 23 ‘కిసాన్ దివస్’ (రైతు దినోత్సవం) సందర్భంగా వ్యవసాయం గురించి ఓసారి అవలోకిస్తే... సుమారు 10 వేల ఏళ్ల క్రితం వ్యవసాయం తొలిగా పశ్చిమాసియా, ఈజిప్టు, భారత్ తదితర ప్రాంతాల్లో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఎవరికి తోచిన పద్ధతిలో వారు పంటలు పండించడం మొదలైంది. రకరకాల ప్రయోగాలు చేసి సంప్రదాయ విజ్ఞానాన్ని ప్రోదిచేసిన అలనాటి రైతులే తొలి వ్యవసాయ శాస్త్రవేత్తలు. సింధు తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో నీటిపారుదల వ్యవస్థ ప్రారంభం కావడంతో పాడి, పంటల సాగు ప్రత్యేక జీవన విధానంగా వేళ్లూనుకొని వ్యవసాయ సంస్కృతి వెల్లివిరిసింది. దండయాత్రలు, వాణిజ్య కార్యకలాపాల వల్ల వ్యవసాయ పద్ధతులూ వ్యాప్తిచెందాయి. మానవాళికి ఇప్పుడు తిండిపెడుతున్న చాలా వంగడాలు పూర్వీకులు పెట్టిన భిక్షే! పారిశ్రామిక వ్యవసాయం- పర్యవసానాలు లిపి పుట్టక ముందునుంచే వేలాది ఏళ్ల చరిత్ర కలిగిన వ్యవసాయం వేల ఏళ్ల పాటు ప్రకృతికి అనుగుణమైన రీతిలో స్థానిక వనరులతోనే సాగింది. గత శతాబ్దంలోనే పారిశ్రామిక రూపం సంతరించుకుంది. 1913లో జర్మనీలో వాణిజ్యపరంగా అమ్మోనియా ఎరువు తయారీతో వ్యవసాయ పారిశ్రామీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ‘హరిత విప్లవం’ రాకతో రసాయనిక పురుగుమందులు, కలుపుమందులు, హైబ్రీడ్ వంగడాలు, ఒకే రకం పంటను విస్తారంగా సాగు చేయడం, యంత్రాల వినియోగంతో సాంద్ర వ్యవసాయం (ఇంటెన్సివ్ ఫార్మింగ్) జోరందుకుంది. జన్యుమార్పిడి సాంకేతికత రంగప్రవేశంలో వ్యవసాయ రంగం పూర్తిగా బహుళజాతి కంపెనీల రాజ్యంగా మారిపోయింది. అత్యధిక జనులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగించే దేశాల్లో సాగు రంగాన్ని ఆధునికత, అభివృద్ధి పేరిట పారిశ్రామిక వ్యవసాయం విధ్వంసకరమైన మలుపు తిప్పింది. వ్యవసాయ సంస్కృతిని వాణిజ్య దృష్టి కమ్మేసింది. ‘హరిత విప్లవం’ పరాయి దేశం నుంచి తిండిగింజలు తెచ్చుకొని కడుపు నింపుకునే దుస్థితి నుంచి భారతీయులను బయటపడేసిన మాట నిజం. అయితే, వ్యవసాయంలో వాడుతున్న రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు నేలను, నీటిని, పర్యావరణాన్ని.. చివరకు తల్లి పాలను కూడా విషపూరితం చేశాయి. రైతుల ఉసురు తీస్తున్న సంక్షోభం రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో వాణిజ్య విస్తరణ ప్రయత్నాల్లో భాగంగా పారిశ్రామిక వ్యవసాయ పద్ధతులను విదేశీ కంపెనీలు వ్యవసాయాధారిత దేశాల నెత్తిన రుద్దాయి. వ్యవసాయ ఉత్పాదకాలు అమ్ముకొని పబ్బం గడుపుకునే ఈ కంపెనీల ధోరణికి భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాల పాలకులు నేటికీ దాసోహమంటున్నారు. కాయకష్టంతో స్వేదం చిందించి ధాన్యపు రాశులు పండించే రైతులు కంపెనీల నుంచి ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు తదితర ఉత్పాదకాలన్నీ కొని వాడే వినియోగదారులుగా మిగిలి.. అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోయారు. సాగు ఖర్చుల్లో సగాన్ని అదనంగా జోడించి వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటుధర కల్పిస్తే తప్ప రైతు బతుకుబండి సాగదని డా. ఎమ్మెస్ స్వామినాథన్ సారథ్యంలోని జాతీయ రైతుల కమిషన్ సిఫారసు చేసి ఏడేళ్లు దాటుతున్నా అతీ గతీ లేదు. అస్థిర వ్యవసాయ పద్ధతులు, వనరులకు కంపెనీలపైనే పూర్తిగా ఆధారపడడం, మార్కెట్ సదుపాయ లేమి, ప్రభుత్వ విధాన లోపం.. ఆసరాగా సంక్షోభ రాకాసి తెగబలిసిపోయింది. మన దేశంలో 2.5 లక్షలకు పైగా అమాయక రైతుల ఉసురు తీసింది. వ్యవసాయం అనగానే అప్పులు, ఆత్మహత్యలే చప్పున మదిలో మెదులుతాయి. కానీ నిజానికి ఈ ఆర్థిక ఉపరితలం అడుగున పంట పొలంలో పర్యావరణ సంక్షోభం బుసలు కొడుతోంది. భూసారం సర్వనాశనమైంది. పద్ధతి ఏదైనా.. ప్రకృతే ప్రాణం! పద్ధతి ఏదైనా ప్రకృతికి అనుకూలమైన రీతిలో పంటలు పండించడమే వ్యవసాయ సంక్షోభానికి అసలు పరిష్కార మన్న సత్యానికి మన కళ్ల ముందే పచ్చని ఆనవాళ్లున్నాయి. సేంద్రియ వ్యవసాయం, నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్(ఎన్‌పీఎం), పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం, శ్రీవరి సాగు, పర్మాకల్చర్, బయోడైనమిక్ వ్యవసాయం.. పేరు ఏదైనా ప్రకృతి ఒడిలో సుస్థిర పద్ధతులతోనే వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని చాటి చెబుతున్న వారికి కొదవ లేదు. తక్కువ ఖర్చుతో విష వలయం నుంచి బయటపడుతున్న రైతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నారు. ఇది నిస్సందేహంగా కారు చీకట్లో కాంతి రేఖే! అన్నం పెడుతున్నది చిన్న రైతులే! అపసవ్య విధానాల వల్ల నలిగిపోతున్న రైతుల్లో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఈక్రమంలో ఐక్యరాజ్యసమితి 2014ను ‘అంతర్జాతీయ చిన్న, సన్నకారు రైతుల సంవత్సరం’గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల చిన్న, సన్నకారు రైతులున్నారు. 60 కోట్ల భారతీయ రైతుల్లో 80 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. ఇంటిల్లిపాదీ కాయకష్టం చేసే చిన్న రైతు కుటుంబాల సాగులోనే మన దేశంలోని 83శాతం భూకమతాలున్నాయి. అయినా.. చిన్న, సన్నకారు రైతులు పాలకుల నిరాదరణకు గురవుతున్నారు. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ప్రసిద్ధ స్వచ్ఛంద సంస్థ ‘ఈటీసీ గ్రూప్’ ప్రపంచ ఆహార భద్రతపై ఆశ్చర్యకరమైన నిజాలను ఇటీవల క్రోడీకరించింది. ప్రపంచవ్యాప్తంగా చిన్న కమతాల్లో పేద రైతు కుటుంబాల ద్వారా 30 శాతం వ్యవసాయ వనరుల ఖర్చుతో 70 శాతం జనాభాకు సరిపోయే ఆహారం పండుతోంది. పెద్ద కమతాల్లో, భారీ యంత్రాలతో జరుగుతున్న రసాయనిక వ్యవసాయం ద్వారా 70 శాతం వ్యవసాయ వనరుల ఖర్చుతో 30 శాతం జనాభాకి సరిపోయే ఆహారం మాత్రమే పండుతోంది! 70-80 శాతం సాగు భూమిలో రసాయనిక సాంద్ర వ్యవసాయానికి 70 శాతం సాగునీటిని, 80 శాతం శిలాజ ఇంధనాన్ని వాడుతున్నారు. 44-57 శాతం వ్యవసాయ కర్బన ఉద్గారాలు ఈ పొలాల నుంచే వెలువడుతున్నాయి. ఈ పొలాల విస్తరణ కోసం ప్రతి ఏటా కోటి 30 లక్షల హెక్టార్ల అడవులను నరికివేస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో అమ్ముడవుతున్న ఆహారం అంతా ఈ పొలాల్లో పండిందే. ప్రపంచవ్యాప్తంగా సాగు భూమిలో 20-30 శాతం మాత్రమే చిన్న, సన్నకారు రైతుల చేతిలో ఉంది. దాదాపు 20 శాతం శిలాజ ఇంధనం, 30 శాతం సాగునీటితో ఏకకాలంలో ఎక్కువ రకాల పంటలను వీళ్లు పండిస్తున్నారు. ఈ ఆహారంలో 85 శాతం ఆయా దేశ ప్రజలే వినియోగిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు విపరీతంగా వాడుతూ వ్యవసాయాన్ని యథాతథంగా కొనసాగిస్తే ఏమవుతుంది? వ్యవసాయం మరింత భారమై రైతులు, గ్రామీణులు చాలా ఎక్కువగా పట్టణాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. 2030 నాటికి పట్టణ జనాభా 70 శాతం పెరుగుతుంది. ఊబకాయం బాధితుల సంఖ్య రెట్టింపవుతుంది. ఆహారపు అవసరం 50 శాతం, నీటి అవసరం 30 శాతం పెరుగుతాయి. వ్యవసాయ ఉద్గారాలు ఇప్పటికన్నా 60 శాతం పెరుగుతాయి. ఆ మేరకు పెనుతుపానులు, కరువు కాటకాలు ఎక్కువ అవుతాయి. విత్తనాలు దాచుకొని వాడుకునే హక్కు అంతరిస్తుంది. విత్తనాలన్నీ బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యంలోకి వెళ్తాయి. అలాకాకుండా.. చిన్న, సన్నకారు రైతులకు ఆదాయ భద్రత కల్పించి, పర్యావరణ హితమైన వ్యవసాయానికి, పరిశోధనలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకొని, గ్రామీణులకు సక్రమంగా భూమి హక్కులు కల్పిస్తే 2030 నాటికి పరిస్థితి ఎలా ఉంటుంది? రైతులు సుభిక్షంగా ఉంటారు. 80-90 శాతం పంటల విత్తనాలు కంపెనీల చేతుల్లోకి వెళ్లకుండా రైతుల చేతుల్లోనే ఉంటాయి. జనాభాలో 50 శాతం లేదా అంతకన్నా ఎక్కువ గ్రామాల్లోనే హాయిగా ఉండొచ్చు. ఆహార సార్వభౌమత్వం వల్ల వ్యవసాయక జీవవైవిధ్యం పెంపొందుతుంది. పౌష్టికాహారం, ఆహార లభ్యత రెట్టింపవుతాయి. ఊబకాయుల సంఖ్య తగ్గుతుంది. ఉద్గారాలు కనీసం 60 శాతం తగ్గుతాయి. నీటి అవసరం 50 శాతం తగ్గుతుంది. వ్యవసాయంలో శిలాజ ఇంధనాల వాడకం 75-90 శాతం తగ్గుతుంది. మనకున్న ముఖ్యమైన పంటలు వంద. ఇందులో 71 పంటల్లో ఫలదీకరణ తేనెటీగల ద్వారానే జరుగుతుంటుంది. మానవాళి ఆహార భద్రతతో ముడిపడి ఉన్న తేనెటీగలు పురుగుమందుల వల్ల నశిస్తున్నాయి. కాబట్టి, వ్యవసాయ పద్ధతులను ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవడమే శ్రేయస్కరం. ‘ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధికి దోహదపడుతున్న చిన్న రైతులు, జాలర్ల పాత్రను గుర్తించి, వారికి వెన్నుదన్నుగా నిలవాలి. వ్యవసాయ రంగంలో ప్రాధాన్యతలను పునర్ నిర్వచించుకోవాల్సిన తరుణం ఇది. అంతర్జాతీయ సమాజం ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు’ అని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ డెరైక్టర్ జనరల్ జాక్యూస్ డియుఫ్ పిలుపునిచ్చారు. రైతు బాంధవుడు, మాజీ ప్రధాని చరణ్‌సింగ్ స్మృత్యర్థం ఆయన జన్మదినం సందర్భంగా డిసెంబర్ 23న ఏటా జాతీయ రైతు దినోత్సవం(కిసాన్ దివస్) జరుపుకుంటున్నాం. కొత్త ఏడాదిలో ‘అంతర్జాతీయ చిన్న, సన్నకారు రైతుల సంవత్సరం’ జరుపుకోబోతున్నాం. ఇప్పుడైనా బడుగు రైతులను వ్యవసాయం నుంచి బయటకు నెట్టే విధానాలకు విడనాడి.. వారికి గట్టి భరోసానిచ్చే పనులకు శ్రీకారం చుడితే ఎంతో బాగుంటుంది. పంతంగి రాంబాబు, ‘సాక్షి’ స్పెషల్ డెస్క్ క్యూబా.. ఓ వెలుగు బాట! సోవియట్ యూనియన్ అంతరించిన తర్వాత 1990 అనంతర కాలంలో క్యూబా తీవ్ర ఆహార సంక్షోభంలో చిక్కుకుంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో అనివార్య పరిస్థితుల్లో క్యూబా సేంద్రియ వ్యవసాయం చేపట్టింది. రైతుల పరిజ్ఞానానికి పెద్ద పీట వేసి సంక్షోభాన్ని అధిగమించింది. క్యూబా జనాభా 80 శాతం నగరాలు, పట్టణాల్లోనే ఉంటున్నారు. గ్రామాల్లో ఆహారాన్ని పండించడానికి రసాయనిక ఎరువులు, తరలించడానికి ఇంధనం కూడా కొరతే. దీంతో, సమస్య ఉన్న చోటే పరిష్కారం వెదికారు. పట్టణాలు, నగరాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను కూడా పంట పొలాలుగా మార్చారు. ఎక్కువ మంది మనుషులు ఉన్న చోటే ‘కొత్త పంట భూముల’ను సృష్టించారు. 1994లో ‘అర్బన్ అగ్రికల్చర్’ కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి అందర్నీ పనిలోకి దించారు. సహకార సంఘాలు కీలక పాత్ర పోషించాయి. క్యూబా సాధించిన తొలి విజయం ఇదే. ఎత్తు మడులు, కంటెయినర్లలో స్థానిక వనరులతోనే వర్మీ కంపోస్టు తయారు చేసుకొని అన్ని రకాల పంటలూ పండించారు. పరిశోధనలకు పదును పెట్టి మంచి దిగుబడులు సాధించారు. 1989 తో పోల్చితే 2003 నాటికి రసాయనిక ఎరువుల వాడకం 90శాతం, పురుగుమందులు 93 శాతం తగ్గింది. ఒకప్పుడు ఆహార కొరతతో నకనకలాడిన పట్టణాల నుంచే ఇప్పుడు గ్రామాలకు కూరగాయలు, పండ్లు పంపిస్తున్నారు! అన్నదాతల ఆత్మహత్యలకు ఎల్లల్లేవు! అన్నదాతలపై వల్లమాలిన నిర్లక్ష్యం.. ఆత్మహత్యలు.. అభివృద్ధి చెందుతున్న మన దేశానికే పరిమితం కాదు. సంపన్న దేశమైన ఫ్రాన్స్‌లోనూ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. 2007-2009 మధ్య కాలంలో కనీసం 500 మంది ఫ్రెంచ్ రైతులు ఆర్థిక కారణాల రీత్యా బలవన్మరణం పాలయ్యారు. వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గడం, ఐరోపా దేశాల కూటమి నుంచి సహాయం కొడిగట్టడం ఫ్రాన్స్ రైతులను కుంగదీశాయి. పాలకులు మౌలిక సమస్యలను పట్టించుకోకుండా ప్యాకేజీల వంటి పైపూత పరిష్కారాలతో పబ్బం గడుపుకుంటున్న ఫలితమే ఈ దుర్గతి. ఇక మన దేశంలో జాతీయ నేర నమోదు సంస్థ గణాంకాల ప్రకారం.. 1995-2012 మధ్యలో 2,84,694 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో తెలుగు రైతులు 35,898 మంది. మన రాష్ట్రంలో 2011లో 2,206 మంది, 2012లో 2,572 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 9% వృద్ధి సాధిస్తున్నప్పుడు కూడా దేశంలో ఏటా 17,000 మంది రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. 2014ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిన్న, సన్నకారు రైతుల సంవత్సరంగా ప్రకటించింది