వ్యవసాయంలో.. ఆవుసాయం! | cow helping in agriculture | Sakshi
Sakshi News home page

వ్యవసాయంలో.. ఆవుసాయం!

Published Thu, Nov 13 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

cow helping in agriculture

విచ్చలవిడిగా వాడుతున్న రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వల్ల సాగు ఖర్చు విపరీతంగా పెరిగి రైతులు నష్టాల పాలవుతున్నారని స్తంభాద్రిరెడ్డి అన్నారు. భూసారాన్ని పెంచడం, ఆచ్ఛాదన (మార్చింగ్), సహజ వనరులతో కషాయాలను తయారు చేసుకుని పిచికారీ చేయడం వల్ల పంట ఉత్పత్తులు విషతుల్యం కావన్నారు.

 రసాయన ఎరువులు వాడిన ధాన్యాన్ని తినడం వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ట్రస్టు వ్యవ స్థాపకులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. అన్నదాతలకు తమ వంతు సాయంగా ఏదైనా చేయాలనే తలంపుతో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ మోహనయ్య, వ్యవసాయశాఖ రిటైర్డ్ అసిస్టెంట్ డెరైక్టర్ సుధాకర్, జాన్‌లు పుడమి పుత్రులకు సాగుపై సలహాలు, సూచనలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ పిండి కనకయ్య పాల్గొన్నారు.

 భూసారం పెంపునకు
   పచ్చిరొట్ట, సేంద్రియ ఎరువులు వాడాలి.
  జీవన ఎరువులు, ఘన, ద్రవ ఎరువులు తయారు చేసుకోవాలి.
  పొలాల్లో చెరువు మట్టిని  వేసుకోవాలి.
  అంతర పంటలు సాగు చేయాలి.  
 భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులను రక్షించుకునేందుకు పంట వ్యర్థాలను వాడటంతో పాటు మిశ్రమ పంటలు సాగు చేయాలి.
  చీడపీడలు సోకిన చేలపై ఆవు పెడ, మూత్రంతో కొన్ని మిశ్రమాలు కలుపుకొని నిమ్మాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్రి అస్త్రం, భీజామృతం, పుల్లటి మజ్జిగ, సొంటి పాల కషాయం తయారు చేసుకోవాలి.
 
కషాయాల తయారీ  జీవామృతం...
 5 కిలోల ఆవు పేడను పల్చటి గుడ్డలో కట్టి 200 లీటర్ల నీటిలో 5 లీటర్ల ఆవు పంచకం, 50గ్రాముల సున్నం, గుప్పెడు మట్టిని కలిపి 12 గంటల వరకు నానబెడితే ఎకరాకు కావాల్సిన జీవామృతం సిద్ధమవుతుంది. వరి, ఉల్లి, మిరప, టమాట, వంగ తదితర పంటలు వేసుకునే ముందు విత్తనాలను వీటిలో ముంచి విత్తుకుంటే తెగుళ్లను బాగా తట్టుకుంటాయి.  

 ఘన జీవామృతం
 పంటకు కావలసిన సూక్ష, స్థూల పోషకాలు అందించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. 10 కిలోల ఆవు పేడ, 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పు దినుసులు (రైతులు పండించినవి), గుప్పెడు మట్టిని ఆవు మూత్రంతో తడిపి 7 రోజుల పాటు నీడలో ఆరబెడితే ఘనజీవామృతం రెడీ అవుతుంది. 20 కిలోల ఘన జీవామృతాన్ని ఆవు పేడతో కలిపి దుక్కిలో వేసుకోవాలి. పంట వేసిన నెల నుంచి రెండు నెలల కాలంలో సాళ్ల మధ్య వేయాలి.

 ద్రవ జీవామృతం...
 పంటకు అవసరమైన పోషకాలను అందజేయడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. 10 కిలోల ఆవు పేడ, 5 లీటర్ల గోవు మూత్రం, 200 లీటర్ల నీటిలో 2 కిలోల బెల్లం, 2 కిలోల రైతులు పండించిన పప్పు దినుసులు, గుప్పెడు మట్టిని కలిపి 4 రోజులు పులియబెట్టాలి. దీనిని డ్రిప్పు ద్వారా, స్పే చేయడం ద్వారా పంటలకు అందించవచ్చు.

 నిమ్మాస్త్రం...
 రసం పీల్చే పురుగు, చీడపీడల నివారణకు బా గా పనిచేస్తుంది. 10 కిలోల వేపాకును మెత్తగా రుబ్బి 10 లీటర్ల గోమూత్రం, 2 కిలోల ఆవు పేడను 200 లీటర్ల నీటిలో కలిపి 48 గంటలు ఆరబెట్టి పంటలపై పిచికారీ చేసుకోవాలి.

 బ్రహ్మాస్త్రం...
 పంటలను తిని నష్టం చేసే పురుగుల నివారణకు దీన్ని వాడొచ్చు. 10 లీటర్ల ఆవు మూత్రం, 3 కిలోల వేప ఆకు, 2 కిలోల సీతాఫల ఆకులు, 2 కిలోల ఆముదం ఆకులు, 2 కిలోల కత్తెర ఆకులు, 2 కిలోల బొప్పాయి ఆకు, 2  కిలోల ఉమ్మెత్త ఆకులు, 2 కిలోల జామ, 2 కిలోల వయ్యారిభామ ఆకులను మెత్తగా నూరి నీటిలో ఉడికించాలి. ఎకరాకు 2.5 లీటర్లు, 100 లీటర్ల నీటికి కలుపుకుని పిచికారీ చేయాలి.

 అగ్ని అస్త్రం...
 కాండం, కాయతొలుచు పురుగు నివారణకు దీన్ని వాడాలి. మట్టి కుండను తీసుకుని 15 లీటర్ల ఆవు మూత్రం, 1 కిలో వెల్లుల్లి, 500 గ్రాముల పచ్చిమిర్చి, 500 గ్రాముల వేపాకు, పొగాకును వేసి వేడి చేయాలి. పురుగు ఆశించిన పంటకు 100 లీటర్ల నీటికి 3 లీటర్ల మిశ్రమాన్ని కలిపి పంటపై స్ప్రే చేసుకోవాలి.

 పుల్లటి మజ్జిగ...
 ఆకు మచ్చ, కాయమచ్చ, బూజు తెగులు నివారణకు ఉపకరిస్తుంది. 6 లీటర్ల పుల్లటి మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లను 100 లీటర్ల నీటిలో కలిపి మూడు రోజులు పులియబెట్టాలి. పురుగు ఆశించిన పంటను 20, 40 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

 సొంటి పాల కషాయం...
 అన్ని రకాల తెగుళ్ల నివారణకు దీన్ని వాడుకోవచ్చు. 200 గ్రాముల సొంటిని మెత్తగా నూరి నీటిలో మరిగించాలి. 2 లీటర్ల ఆవు పాలు లేదా మజ్జిగలో వేసి రెండిటికి కలిపి మరిగించాలి. అదే రోజు పంటపై పిచికారీ చేయాలి.

 పంచగవ్య...
 మొక్కలు ఆరోగ్యంగా పెరిగి తెగుళ్ల దాడిని తట్టుకునేందుకు వాడాలి. 5 కిలోల ఆవుపేడ, 3 లీటర్ల గోమూత్రం, 2 లీటర్ల ఆవుపాలు, 2 లీటర్ల పెరుగు, 500 గ్రాముల నెయ్యి, 1 కిలో వేరుశనగ పట్టీలు, 12 మాగిన అరటిపండ్లు, 3 లీటర్ల కొబ్బరి నీళ్లు, 3 లీటర్ల చెరుకు రసం, లేదా బెల్లం, 3 లీటర్ల కల్లును కలిపి ప్లాస్టిక్ డ్రమ్ములో 20 రోజులు పులియనివ్వాలి. 100 లీటర్ల నీటిలో మిశ్రమాన్ని కలిపి 20 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పిచికారీ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement