Padipanta
-
సేంద్రియ సాగు మేలు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పంట సాగులో రైతులు రసాయన ఎరువులు వాడి లాభాల కంటే నష్టాలే చవిచూస్తున్నారు. అదే సేంద్రియ సాగుపై దృష్టి సారిస్తే మంచి దిగుబడి సాధించవచ్చు. వానపాముల వ్యర్థ పదార్థాలతో వర్మీకంపోస్టు ఎరువు తయారు చేసుకోవచ్చని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మోహన్‌దాస్ తెలిపారు. వర్మీకంపోస్టు తయారీ విధానం, వానపాముల అభివృద్ధి గురించి వివరించారు. వర్మీకంపోస్టు తయారీ విధానం కుళ్లిన వ్యవసాయ వ్యర్థాలను ఆహారంగా తీసుకొని వానపాములు వర్మీ కంపోస్టు తయారుచేస్తాయి. కుండీల్లో తయారైన కంపోస్టు సేకరించిన తర్వాత మరోసారి తయారు చేయాలి. అలా చేయాలంటే వానపాములు సమృద్ధిగా ఉండాలి. అనుకూల వాతావరణంలో వానపాములు వేగంగా పెరుగుతాయి. ఎలుకలు, తొండలు కప్పలు, పాములు, పందులు, చీమలు వంటి సహజ శత్రువుల నుంచి రక్షణ ఏర్పాట్లు తప్పని సరి. ఇంకా వానపాములను వేగంగా వృద్ధి చేయాలంటే ‘సీడ్’ తయారీపై దృష్టి పెట్టాలి. వ ర్మీకంపోస్టు తయారీ విధానం సుభమమే అయినా ‘సీడ్’ తయారీ మాత్రం శ్రద్ధతో చేయాల్సిన పని. నాలుగు కుండీల్లో వర్మీకంపోస్టు తయారు చేసే రైతులు వీటిలో కొంత భాగాన్ని సీడ్ తయారీకి వాడుకోవచ్చు. కంపోస్టు తయారీకి కుండీల్లో రెండు, మూడు అంగుళాల మేర ఎండిన డోక్కల, కొబ్బరి పొట్టు లాంటివి వేయాలి. దీనినే వర్మీ బెడ్ అంటాం. సాధారణంగా ఈ వర్మీబెడ్పై కుళ్లిన వ్యర్థాలు, మగ్గిన పేడ లాంటి వాటితో బెడ్ మొత్తం నింపి, గోనెలు కప్పి ప్రతీరోజు క్యాన్‌తో తడిపితే వర్మీకంపోస్టు తయారువుతుంది. దీనిని రెండు రోజులు ఆరబెట్టి (డీ-వాటరింగ్) అపై కంపోస్టు సేకరిస్తాం. ఇలా సేకరించే సమయంలో కంపోస్టుతోపాటుగా వానపాముల గుడ్లు కూడా బయటకు పోతుంటాయి. పరిమితంగానే వానపాములు కుండీల్లో మిగులుతాయి. అయితే ఈ విధానం సీడీ తయారీకి అనుకూలం కాదు. వానపాముల అభివృద్ధి ఇలా.. కుండీల్లో ‘వర్మీబెడ్’ వేసిన తర్వాత ఒక కుండీలో చిన్న భాగంలో ఎండిన పేడ చిన్నచిన్న ఉండలుగా బెడ్‌పై సమానంగా 1/2 అంగుళం ఎత్తున వేయాలి. రోజు క్యాన్‌తో బాగా తడిపి చదరపు మీటర్‌కు కేజీ వానపాముల విత్తనం చల్లాలి. తినే పదార్థం చాలా తక్కువగా ఉండడంతో కేవలం 20 రోజుల్లో వర్మీకంపోస్టు 1/2 అంగుళం ఎత్తున తయారవుతుంది. దీనిని సేకరించరాదు. దీనిపై మరో 1/2 అంగుళం ఎత్తున ఎండిన పేడ పలచగా వేసి తడపాలి. ఈసారి మరో పది రోజులల్లోనే వర్మీ కంపోస్టు తయారవుతుంది. ఇలా ప్రతీ పది రోజులకు 1/2 అంగుళం ఎత్తున పశువుల పేడ వేసి తయాైరె న ఎరువును ఎత్తకుండా ఉంచితే కుండీ పైభాగం వరకు చేరేందుకు సుమారు 70 రోజులు పడుతుంది. దీనిలో సమృద్ధిగా ‘కకూన్స్’ వానపాములు చిన్న పిల్లలు చాలా అధికంగా ఉంటాయి. దీనిని సేకరించి మరో కొత్త ప్రదేశంలో వర్మీ కంపోస్టు తయారీకి వినియోగించుకోవచ్చు. గమనించాల్సిన విషయాలివి.. {పతీ కకూన్కు (గుడ్లు) నాలుగు నుంచి ఆరు వానపాములు వస్తాయి. 90 రోజుల వయస్సు కలిగిన పెద్ద వానపాములు తన క్రైటెల్లం (గుడ్ల శేరు) నుంచి ప్రతి 15 రోజులకోకసారి ఒక కకూన్ విడుదల చేస్తుంది. 90 రోజుల తర్వాత నుంచి రెండేళ్ల వరకు ప్రతీ 15 రోజులకు ఒక కకూన్ చొప్పన సుమారు 168 నుంచి 252 వానపాములు పెరుగుతాయి. వీటిలో ప్రతీ వానపాము 90 రోజుల వయసు వచ్చిన తర్వాత మళ్లీ 168 నుంచి 252 రేట్లు పెరిగేందుకు దోహదపడతాయి. వీటి సంఖ్య అపరిమితంగా పెరిగిపోతుంది. ‘సీడ్’ పెద్దవి కాకుండా వేరే కుండీల్లోకి తరలించాలి. పెద్ద వానపాములు వలస (మైగ్రేషన్) తట్టుకోలేవు. చిన్నచిన్న పాములు, కకూన్స్ వల్ల ఇబ్బంది ఉండదు. వీటిని ప్లాస్టిక్ తొట్టెల్లో కూడా సేకరించి ఇతర ప్రాంతాలకు సైతం రవాణా చేయవవచ్చు. వానపాములు కకూన్స్ బాగా ఫలప్రదం. (హేచింగ్) కావడానికి ప్రతీ 30 రోజులకోసారి పశువుల మూత్రం 1:10 నిష్పత్తిలో నీరు కలిపి బెడ్స్‌పై గోనెలు తడపాలి. నీరు అధికంగా పోయకూడదు. గోనె తట్టును మాత్రమే తడిగా ఉండేటట్టు తడిపితే సరిపోతుంది. ఏడాది పొడుగునా కకూన్స్ ఉన్నా శీతాకాలంలో కకూన్స్ పెట్టేందుకు, అవి హెచ్ అయ్యేందుకు మరింత అనుకూలం. సీడ్ పెంచే కుండీలు ప్రతీ ఆరునెలలకోసారి శుభ్రం చేయాలి. వర్మీబెడ్ను కూడా మార్చి కుండీ రెండు రోజులు డ్రై (ఆరబెట్టాలి) చేయాలి. -
డ్రమ్ సీడర్‌తో వరిసాగు మేలు
డ్రమ్ సీడర్ గురించి.. ఈ పరిక రాన్ని ఫైబర్‌తో తయారు చేస్తారు. సుమారు 9-10 కిలోల బరువు ఉంటుంది. కావాల్సిన ప్రదేశానికి తీసుకెళే ్లందుకు వీలుగా ఉంటుంది. రెండు చక్రాలు ఇరుసు ద్వారా కలిసి ఉంటాయి. ఇరుసు మీద నాలుగు డ్రమ్ములు బిగించి ఉంటాయి. ప్రతి డ్రమ్ము 60 సెం.మీ చుట్టుకొలత, 27 సెం.మీ పొడవు కలిగి ఉండి, దానిపై 2 వరుసల్లో 9 మి.మీ వ్యాసం గల రంధ్రాలు, సాళ్ల మధ్య 20 సెం.మీ దూరం ఉంటుంది. విత్తనాలు వేసే సమయంలో మొక్కల మధ్య దూరాన్ని తగ్గించాలంటే రంధ్రాలను మూసేయవచ్చు. కానీ సాళ్ల మధ్య దూరం మాత్రం 20 సెం.మీ ఉంటుంది. ప్రతి డ్రమ్ము పైన విత్తనాలు వేసేందుకు, తీసేందుకు అనుకూలంగా మూత ఉంటుంది. డ్రమ్ సీడర్‌ను ఒక మనిషి సునాయసంగా పొలంలో లాగవచ్చు. డ్రమ్ సీడర్ ధర రూ.4,400 కాగా ప్రభుత్వం రైతులకు రూ.2,200కే అందజేస్తోంది. ఉపయోగాలు డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగుకు నార్లు పెంచుకోవాల్సిన అవసరం లేదు. నాటు వేసే పని లేదు. కాబట్టి నాటుకు అవసరమైన కూలీల ఖర్చును ఆదా చేయవచ్చు. సంప్రదాయ పద్ధతిలో వరి సాగుకు ఎకరానికి 25 నుంచి 30 కిలోల విత్తనం అవసరమవుతుంది. అదే డ్రమ్ సీడర్ పద్ధతిలో అయితే ఎకరానికి 8 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది. ఒక నిర్ధిష్ట దూరంలో డ్రమ్‌సీడర్ ద్వారా విత్తనం వేయవచ్చు. కాబట్టి గాలి, వెలుతురు బాగా ప్రసరించి చీడపీడల సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా సుడిదోమ ఉధృతి తక్కువగా ఉంటుంది. కలుపు నివారణకు వరిసాళ్ల మధ్య కోనో వీడర్(కలుపు తీసే యంత్రం) నడపవచ్చు. దీని ద్వారా కలుపును సేంద్రియ ఎరువుగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. అంతర కృషి వల్ల పిలకల శాతం బాగా పెరిగి అధిక దిగుబడి పొందవచ్చు. వర్షాలు కురవడం ఆలస్యమైనా, కాలువల ద్వారా నీటి విడుదల సకాలంలో జరగకపోయినా, ముదురు నార్లు నాటిన వరిలో దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. అలాంటి పరిస్థితుల్లో డ్రమ్‌సీడర్ పద్ధతిని అనుసరించవచ్చు. నాటు వేసిన వరి కన్నా 8 నుంచి 10 రోజులు ముందే డ్రమ్ సీడర్‌తో వేసిన వరి కోతకు వస్తుంది. విత్తనాల తయారీ.. శుద్ధి కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తుకునే వడ్లను ఒక గోనె సంచిలో నింపి వదులుగా ఉండేలా మూట కట్టి 24 గంటలపాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత నానిన వడ్లను బయటకు తీసి సన్న రకాలైతే 12 గంటలు.. లావు రకాలైతే 24 గంటలపాటు మండె కట్టాలి. మండె కట్టే విధానం ఇక్కడ చాలా కీలకమైనది. డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగుకు.. వరి విత్తనాల ముక్కు పగిలి తెల్ల పూత కొద్దిగా వస్తే సరిపోతుంది. మొలక ఎక్కువ వస్తే డ్రమ్ సీడర్లో విత్తనాలు పోసినప్పుడు రంద్రాల ద్వారా కిందకు రాలవు. తెల్ల పూత రంధ్రాల్లో చిక్కుకుని ఇరిగిపోతుంది. దీనివల్ల విత్తనాలు మొలకెత్తవు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. పొలం తయారీ పొలానికి కొద్దిగా నీరు పెట్టి భూమి బాగా గుల్లబారేలా దున్నుకోవాలి. బాగా చివికిన పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులను వేసుకోవాలి. విత్తనాలు వే యడానికి 15 రోజుల ముందు పొలాన్ని దమ్ము చేసి ఉంచాలి. ఆ తర్వాత విత్తనాలు వేసే నాలుగు రోజుల ముందు మరోసారి దమ్ము చేసి సమానంగా చదును చేయాలి. నీరు నిల్వ ఉంటే విత్తనం మురిగిపోతుంది. కాబట్టి మురుగు పోవడానికి తగిన ఏర్పాటు చేయాలి. నీటి వసతిని బట్టి డ్రమ్ సీడర్ ద్వారా వరి నాటుకోవచ్చు. -
విత్తనశుద్ధితో తెగుళ్లు దూరం
రాయికోడ్: రబీలో భాగంగా శనగ పంటలు సాగు చేసే వారు తప్పకుండా విత్తనశుద్ధి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి అభినాష్‌వర్మ రైతులకు సూచించారు. మండలంలోని పాంపాడ్ గ్రామంలో గురువారం నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో శనగ సాగుపై అన్నదాతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విత్తన శుద్ధి ద్వారా పంట తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని సూచించారు. మందుల వినియోగంలో విధిగా అధికారుల సూచనలు పాటించి పంటను కాపాడుకోవాలన్నారు. రసాయన ఎరువులను అధికంగా వాడితే నష్టం తప్పదని హెచ్చరించారు. అనంతరం రైతులు సాగు చేసిన శనగ పంటలను సందర్శించి పలు సూచనలు చేశారు. సమావేశంలో ఏఈఓ యాదయ్య, స్థానిక నాయకులు హన్మన్నపాటిల్, రైతులు గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అరటి సాగులో సస్యరక్షణ
నులి పురుగు బెడద వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు అరటికి నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. తేలికపాటి నేలల్లో ఉండే ఈ పురుగు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. వీటివల్ల వేర్లపై బుడిపెల వంటివి ఏర్పడుతాయి. ఉధృతి అధికంగా ఉంటే అరటి ఆకులు వాలిపోతాయి. అంచుల చివర్లు నల్లగా మారి మాడిపోతాయి. మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. పంటనాటే ముందు విత్తనశుద్ధి చేసుకుంటే పురుగును నివారించవచ్చు. నులి పురుగు ఆశించినట్లయితే 5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+ 2.5. మి.లీ మోనోక్రొటోఫాస్ లీటరు నీటిలో కలిపి మిశ్రమ ద్రావణం తయారు చేసుకోవాలి. మిశ్రమ ద్రావణంలో అరటి పిలకల దుంపలను ముంచి నాటుకోవాలి. అరటి పెరిగే దశలో పురుగుల నియంత్రణ కోసం కార్బోఫ్యురాన్ 3జీ గుళికలను మొక్కల దగ్గరగా వేయాలి. పంటల మార్పిడి వల్ల కూడా పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. ఆకుమచ్చ తెగులు దీని ప్రభావం వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. బూడిద రంగులో ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవిగా మారుతాయి. ఆకులు మాడిపోయి మొక్కలు గిడసబారుతాయి. తెగులు నియంత్రణ కోసం తోటల్లో నీరు నిల్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. తెగులు ఎక్కువగా ఉంటే 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల క్లోరోథలోనిల్ లీటరు నీటి చొప్పున కలపి పిచికారీ చేయాలి. అలాగే ఒక మి.లీ. ట్రైడిమార్ఫ్ లేదా ప్రొపికొనజోల్ లీటరు నీటి చొప్పున కలిపి రెండు మూడు సార్లు స్ప్రే చేయాలి. కాయముచ్చిక కుళ్లు అరటి కాయల చివర ముచ్చిక వద్ద నల్లగా మారి కుళ్లు మచ్చలు ఏర్పడుతాయి. తెగులు ఆశించిన కాయలను గుర్తించి తొలగించి తగులబెట్టాలి. నివారణ చర్యగా ఒక గ్రామం కార్బండజిమ్ లీటరు నీటిలో కలిపి అరటి గెలలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు స్ప్రే చేసి తెగులును అదుపు చేయవచ్చు. -
పాల దిగుబడిని పెంచుకోండిలా..!
సాధారణంగా 12 గంటల వ్యవధిలో పాలు పితుకుతుంటారు. చలికాలంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం 6 గంటలనుంచి 7 గంటల మధ్య, సాయంత్ర 4గంటల నుంచి 5గంటల మధ్య పాలు పితకడం మంచిది. శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి. అందుకోసం అదనపు ఆహారం అందజేయాలి. లేకపోతే పశువు మేత సరిగ్గా తినక పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. పశువులకందించే దాణలో పిండి పదార్థాలు అధికంగా, మాంసకృతులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. లూసర్న్వంటి పశుగ్రాసం సాగు చేపట్టి పశువులకు అందజేస్తే పాల దిగుబడి అధికంగా ఉంటుంది. వరికోతలు పూర్తవగానే మిగిలిఉన్న తేమతో జనుము వంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. శీతాకాలంలో ఎక్కువగా పశువులకు ఎదకు వచ్చి పొర్లుతాయి. పశువులను కనీసం రెండుమూడు సార్లైన ముందుభాగం, వెనుక భాగం పరిశీలించాలి. వెనుక భాగం పరిశీలిస్తే మూగ ఎదలో ఉన్న పశువులను గుర్తించడానికి వీలవుతుంది. గత ఎద పూర్తయిన తర్వాత 16-25 రోజుల వ్యవధిలో పశువుల ప్రవర్తనలో మార్పులు గుర్తించాలి. పాల ఉత్పత్తిలో తగ్గుదలను బట్టి ఎదను గుర్తించాలి. వెంటనే వీర్యదానం చేయించాలి. చలిగాలులు, మంచుకురవడం వల్ల పశువులకు న్యూమోనియా సోకే ప్రమాదం ఉంటుంది. గొంతువాపు, గిట్టలు మెత్తబడటం, మేత తినకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. పశువులను, దూడలను ఆరుబయట కట్టేయకూడదు. ఈదురు గాలులు నివారించడానికి వాతవరణంలో ఉష్ణాగ్రత 10 డిగ్రీల కంటే తక్కువైన సందర్భాల్లో పశువుల పాకలకు పరదాలు కట్టాలి. లేగదూడల వెంట్రుకలు చలికాలంలో కత్తిరించకూడదు. రోజూ రెండుసార్లు పశువుల పాకలను శుభ్రం చేయాలి. సోడా, కార్బోనెట్, 10 శాతం బ్లీచింగ్ పౌడరు వంటి క్రిమి సంహారక మందులు వాడాలి. నీటి తొట్టెలను వారానికోసారి శుభ్రం చేయాలి. వాటికి తరచూ సున్నం వేస్తుండటం మరవద్దు. దీంతో పశువులకు కావాల్సినంత కాల్షియం, ఖనిజ లవణాలు లభ్యమవుతాయి. పశువులకు రోజుకు 50 నుంచి 60 లీటర్ల నీరు అవసరం. శీతాకాలంలో రెండుమూడు సార్లు నీరు అందజేయాలి. తాగేందుకు నీరు పుష్కలంగా అందిస్తే పాల దిగుబడి బాగుంటుంది. పాలు పితకడానికి రెండు గంటల ముందు, పితికిన తర్వాత మరో గంటకు పశువులకు దాణ ఇవ్వాలి. -
పాటిస్తే మెళకువలు..పత్తిలో లాభాలు
మద్నూర్: జిల్లాలో ఈ ఏడాది యాభై వేల ఎకరాలలో పత్తి సాగైంది. ప్రస్తుతం చేతికందే దశలో ఉంది. ఈ సారి ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎకరాని కి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా 3 నుంచి 4 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రభుత్వ మద్ద తు ధర రూ.4050 ప్రకటించినా ఆశించిన స్థాయిలో పంట లేకపోవడం రైతులను ఆవేదన కలిగిస్తోంది. పత్తిలో తేమశాతం 8 ఉంటే ఈ ధర లభిస్తుంది. ఆపైన వచ్చిన ఒక శాతానికి రూ.40.50 పైసల చొప్పున కోత విధిస్తోంది. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రస్తుతం పత్తి కొనుగోలు చేస్తోంది. 12 శాతంలోపు వచ్చిన పత్తిని మాత్రమే వారు కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతం ఎక్కువ గా వచ్చిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకు ని రూ. 200 నుంచి రూ.300 వరకు నష్టపోతున్నా రు. వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ఎం డ అధికంగా ఉన్నప్పుడు పత్తి తీయెద్దు. ఆ సమయంలో ఎండుటాకులు, వ్యర్థ పదార్థాలు విరిగి పత్తిలో కలుస్తాయి. పొద్దున, సాయత్రం వేళల్లో వాతావరణం చల్లగా ఉన్నప్పుడే మాత్రమే తీయా లి. పత్తిని తీసేటప్పుడు అది పొడిగా ఉండాలి. వర్షం పడిన తర్వాత తీయొద్దు. పంటకు దిగుబడి బాగా రావాలంటే పత్తి తీయడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు (8886613150) సూచిస్తున్నారు. జాగ్రత్తలు పంట కాలంలో కనీసం మూడు నాలుగు సార్లు పత్తిని తీస్తారు. పూర్తిగా విచ్చుకున్న తర్వాతనే కాయల నుంచి పత్తిని ఏరాలి. ఏరిన తర్వాత మట్టిలో కుప్పలుగా పోయరాదు. పత్తిలో దుమ్ము ధూళీ, ఎరువులు,పురుగుల మందులు, పెట్రోలియం పదార్థాలు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం, చీడపీడల వల్ల పాడైన పత్తిని వేరుచేయాలి. దీన్ని మంచి పత్తిలో కలప కూడదు. మొదట మొక్కల కింద భాగం కాయల నుంచి తీయాలి. ఎందుకంటే ముందుగా పైభాగంలోని కాయల నుంచి తీస్తే కింది కాయల పత్తిలో చెత్తపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా చివరలో తీసే పత్తి కొంచెం నాసిరకంగా ఉంటుంది.కాబట్టి దాన్ని ప్రత్కేకంగా అమ్ముకోవాలి. పంట చివరికి వచ్చేసరికి మొక్కలో, నేలలోనూ పోషకాలు తగ్గడంతో పత్తి నాణ్యత లోపిస్తుంది. నిల్వ చేయాల్సిన పత్తిలో 12 శాతం కంటే తేమ ఎక్కువగా ఉంటే లోపల వేడి పెరిగి విత్తనంతో పాటు దూదిని కూడా పాడుచేస్తుంది. పత్తి తీసిన తర్వాత నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే పత్తి రంగుమారి నాణ్యత తగ్గుతుంది. పత్తిని వీలైనంత వరకు గదుల్లో గానీ, షెడ్లలో గానీ సిమెంట్ నేలమీద గానీ పరచాలి.పత్తి పూర్తిగా ఆరిన తర్వాతనే బోరాల్లో నింపి పొడిగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేయాలి. ఆరిన తర్వాతే తీయాలి వర్షానికి తడిసిన, మంచుబిందువులతో చల్లబడిని పత్తిని ఆరిన తర్వాతే సేకరించాలి. గింజ, దూదిపింజల్లో తేమశాతం లేదని నిర్దారణకు వచ్చిన తర్వాత తీయాలి. ఎక్కువ మంది రైతులు మంచులోనే పత్తిని సేకరిస్తారు. వర్షానికి తడిసిన పత్తిని మాత్రం ఎండకాసే సమయంలో, మంచు నీరు లేని సమయంలో తీయాలి. ఎక్కువ రోజులు వర్షానికి తడిస్తే గింజలు మొలకెత్తుతాయి. అలాంటి పత్తిని సేకరించిన తర్వాత మూడు రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన పత్తిని మూడు గంటలకోసారి తిరిగేయాలి. తేమ పూర్తిగా తగ్గిన తర్వాతే బోరే(సంచు)ల్లో నింపాలి. కొద్దిపాటి తడిసిన పత్తిలో ఎటువంటి నాణ్యత లోపాలు ఉండవు. తడిసిన పత్తిని ఆరబెట్టిన తర్వాత టార్పాలిన్ కవర్ కప్పేటప్పుడు పూర్తిగా కాకుండా గాలి తాకే విధంగా ఉండాలి. ఆవిరి వచ్చి తేమ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. -
తక్కువ ఖర్చు.. అధిక దిగుబడి
లక్సెట్టిపేట/జైపూర్ : ప్రస్తుత తరుణంలో వ్యవసాయం రైతులకు భారంగా మారుతోంది. పంటల సాగుకు పెట్టుబడిని తగ్గించుకుని ఉన్న వనరులతో పంటలు సాగు చేస్తే నష్టాలను అధిగమించి లాభాలు సాధించవచ్చని లక్సెట్టిపేట, జైపూర్ మండలాల వ్యవసాయాధికారులు ప్రభాకర్, సుధాకర్ వివరించారు. జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అధిక దిగుబడి వస్తుంది. పాత పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయాలంటే ఖరీఫ్ వరి కోసిన తర్వాత పొలాన్ని రెండుసార్లు దుక్కిదున్ని నీటిని బాగా పట్టించాల్సి వచ్చేది. తేమ తగ్గిన తర్వాత మక్కలు వేయాల్సి వచ్చేది. ఇదంతా జరగడానికి సుమారు 25 రోజుల సమయం వృథా అయ్యేది. జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయాలంటే వరి కోసిన తర్వాత దున్నకుండానే ఒకసారి నీళ్లు పట్టించి ఆరిన వెంటనే మక్కలు వేస్తే చాలు మొలకెత్తుతాయి. ఐదు రోజుల్లో మొలకెత్తి 60 రోజుల్లో అధిక దిగుబడితో పంట చేతికొస్తుంది. జీరోటిల్లేజ్ సాగు ద్వారా లాభాలు వరి పంట కోసిన తర్వాత పొలం దున్నకుండానే మొక్కజొన్న విత్తడాన్ని జీరో టిల్లేజ్ పద్ధతి అంటారు. నాణ్యమైన సంకర జాతి విత్తనాన్ని ఎంచుకోవాలి. దుక్కి దున్నాల్సిన పని లేకుండా సాగు చేయవచ్చు. దీని వల్ల ఎకరానికి సుమారు రూ.2వేల వరకు ఖర్చు తగ్గుతుంది. జీరో టిల్లేజ్ పద్ధతిలో దున్నడం, బోదెలు చేయడం ఉండదు. దీంతో రైతుకు ఒక ఎకరానికి రూ.1500-2000 వరకు ఖర్చు ఆదా అవుతుంది. నీటిని, పంట కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎకరం విస్తీర్ణంలో వరి సాగుకు సరిపడా సాగు నీటితో ఒకటిన్నర నుంచి రెండెకరాల మొక్కజొన్న పండించవచ్చు. వరి తర్వాత మొక్కజొన్న సాగు చేయడం వల్ల పంట మార్పిడితోపాటు చీడపీడల సమస్య తగ్గుతుంది. బయంత్ర పరికరాలతో దుక్కి చేయకపోవడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అధిక దిగుబడితోపాటు నాణ్యత గల మొక్కజొన్న పంట చేతికి వస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు విత్తడానికి వీలుగా ఖరీఫ్ వరిని కింది వరకు నేలకు దగ్గరగా కోయాలి. వరి కోసిన తర్వాత నేలలో తగినంత తేమ లేనట్లయితే ఒక తేలికపాటి నీటి తడి ఇచ్చి మొక్కజొన్న విత్తుకోవాలి. తాడును ఉపయోగించి వరుసకు వరుసకు మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. వరుసలను తూర్పు పడమరలుగా విత్తుకోవాలి. సస్యరక్షణ వరి మాగాణిల్లో భూమిని దున్నడం ఉండదు కనుక కలుపు ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు విత్తనం విత్తిన 48గంటల్లోపు ఎకరాకు కిలో అట్రాజిన్ 50శాతం పొడిమందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. వరి దుబ్బులు చిగురు వేయకుండా పారాక్యాట్ డైక్లోరైడ్ ఒక లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తేముందు పిచికారీ చేయాలి. అట్రాజిన్ మందు కలుపు రాకుండా నివారిస్తుంది. ప్యారాక్యాట్ డైక్లోరైడ్ కొయ్యకాల్లని మొలకెత్తకుండా చేస్తుంది. విత్తనం మొలకెత్తిన 25 నుంచి 30 రోజల వ్యవధిలో వెడల్పు ఆకు గడ్డి జాతి మొక్కల నివారణకు 2, 4డీ సోడియం సాల్ట్ 500 గ్రాములు 200లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. -
ఈ సమయం.. అగ్గికి అనుకూలం
ముందు జాగ్రత్త చర్యలు నత్రజని ఎరువును తక్కువగా వేయడం, పొటాష్ ఎరువును ప్రతిసారీ ఎకరాకు 15 కేజీల చొప్పున వినియోగించడం, పొలం గట్లపై కలుపు మొక్కలు, గరిక తొలగించడం, పొట్ట దశలో 50 శాతం, వెన్నుదశలో ఒకసారి ట్రైసైక్లోజోల్ పొడి మందు 100 గ్రాములను 100 లీటర్ల నీటికి లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేయాలి. అగ్గి తెగులు వ్యాప్తి ఇలా.. వాతావరణం చల్లగా ఉండి, గాలిలో తేమ ఎక్కువగా ఉంటే వరి ఆకుల అంచు వెంట ముదురు గోధమ రంగులో నూలుకండె ఆకారంలో, ఆకుల మధ్యలో బూడిద రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. ఈ లక్షణాలను అగ్గి తెగులు అంటారు. మంచు కురవడం, వర్షపు చిరు జల్లులు పడటం, నత్రజని ఎరువులు అధికంగా వాడటం వల్ల ఈ తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది. వెన్ను మొదటి భాగంలో కణుపుల వద్ద అగ్గి తెగులు వస్తే వెన్ను విరిగి కిందకు వాలిపోతాయి. గింజలు సరిగా పాలు పోసుకోకపోవడం వల్ల ఎక్కువ శాతం తాలు గింజలు ఏర్పడతాయి. సుడిదోమ, దోమపోటు గోధుమ రంగులో ఉన్న దోమలు గుంపులుగా నీటి పైభాగాన దుబ్బులపై ఉండి రసాన్ని పీల్చడం వల్ల ఆకు, మొక్కలు పసుపు రంగులోకి మారి క్రమంగా సుడులు సుడులుగా ఎండిపోతాయి. చిన్న చిన్న రెక్కలు గల పురుగులు పూతదశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. తల్లిపురుగులు ప్రత్యేక కాళ్ల నిర్మాణం వల్ల అవి ఒక మూలగా కదులుతాయి. అన్ని పురుగులు మూలగా తిరగడం వల్ల పైరు సుడులుగా చనిపోతుంది. అందుల్లే వీటిని సుడిదోమ అని అంటారు. పైరు వెన్ను దశలో 20 నుంచి 25 పురుగులు ఉన్నట్లయితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. పొలంలో నాట్లు వేసే సమయంలో ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ చొప్పున తూర్పు, పడమర దిశలో కాలిబాటలు వదలాలి. పొలంలో నీటి మట్టం ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడూ పొలాన్ని ఆరబెడుతూ ఉండాలి. చివరి దఫా ఎరువుల మోతాదుతో పాటు కార్భోప్యూరాన్ 3జీ పది కేజీలు లేక కార్భాఫ్ హైడ్రోక్లోరైడ్ 4జీ 8 కేజీల గుళికలు వాడాలి. కనీస ప్రమాద స్థాయిని గమనించిన వెంటనే క్రిమిసంహారక మందులైన ఇంనోఫెన్ప్రాజె 2.0 మి.లీ లేదా బూప్రోఫెజిమ్ 2 లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లే దా డైనటోఫ్యూరాన్ 0.5 గ్రాములను లీటరు నీటికి కలిపి దుబ్బు మొదళ్లకు తగిలేలా వృత్తకారంగా పొలం గట్ల నుంచి లోపలికి పిచికారీ చేస్తే దోమపోటు బారి నుంచి వరిపైరును సమర్థవంతంగా నివారించవచ్చు. నివారణ మార్గాలు అగ్గి తెగులు ఆశించిన వెంటనే ఐసోప్రొథియోలేన్ 1.5 మి.లీను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లోనే ఆకు ఎండు తెగులు, వెన్ను తీసిన పొలాల్లో మానిపండు తెగుళ్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆకు ఎండు తెగులు బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆకుల అంచుల వద్ద పసుపు రంగు మచ్చలు ఏర్పడి పైనుంచి కిందకు ఎండిపోతాయి. దీనికి ఎటువంటి నివారణ మందులు లేవు. నత్రజని ఎరువులను ఒకే సారి కాకుండా మూడు నుంచి నాలుగు దఫాలుగా వేయాలి. తెగులు 5 శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎరువులు వేయడం ఆపాలి. పొలంలో నీటిని తీసివేయాలి. పూతదశలో అండాశయం శిలీంద్రం వల్ల పసుపు పచ్చ ముద్దగా, ఆకుపచ్చ రంగులోకి మారి చివరకు నల్లబడి చిన్న చిన్న ఉండలుగా తయారవుతాయి. కార్బండిజమ్ ఒక గ్రాము లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 2.5 గ్రాములు లేదా ప్రొఫికోనజోల్ ఒక మి.లీ మందును లీటరు నీటికి కలిపి వెన్నులు పైకి వచ్చే దశలో పిచికారీ చేసుకోవాలి. -
సేద్యమేవ జయతే!
మూడెకరాల్లో పంటలతో యేటా రూ.2.5 లక్షల ఆదాయం ఆదర్శంగా నిలుస్తున్న చౌదర్పల్లి రైతు రాములు మండలంలోని చౌదర్‌పల్లికి చెందిన రాములుకు మూడు ఎకరాల పొలం ఉంది. రెండు బోరుబావుల్లోని కొద్దిపాటి నీటితో ఇంటి అవసరాలకు సరిపోను వరి పండిస్తున్నాడు. మిగతా పొలంలో బిందుసేద్యంతో కూరగాయలు పండిస్తున్నాడు. అక్షర జ్ఞానం లేని రాములు వ్యవసాయాధికారుల సూచనలను కచ్చితంగా పాటిస్తుంటాడు. ఏయే సీజన్లలో ఆయా కూరగాయలు పండిస్తున్నాడు. నిత్యం 5 నుంచి 10 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్కరికి రూ. 200 నుంచి రూ.250 వరకు కూలిడబ్బులు ఇస్తుంటాడు. దిగుబడులను సరూర్‌నగర్ రైతు బజారులో విక్రయిస్తుంటాడు. యేటా కూరగాయల విక్రయాలతో రూ.6 లక్షలు వస్తున్నాయి. ఇందులో పెట్టుబడులు, కూలీల ఖర్చులుపోను రూ. 2.5 లక్షలు మిగులుబాటవుతోందని చెబుతున్నాడు రాములు. రైతు సదస్సులన్నీ రాములు పొలంలోనే.. బిందుసేద్యంతో పలు రకాల కూరగాయలు పండిస్తూ.. రాములు మంచి లాభాలు పొందుతుండడంతో మిగతా గ్రామాల రైతులకు సూచనలు, సలహాలు తెలియజేయడానికి వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు తరచూ ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే సదస్సులు ఏర్పాటు చేస్తుంటారు. ‘మేం చదువుకున్నవాళ్లమైనా నీ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది’ అని రాములుతో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏడాది క్రితం అప్పటి ఉద్యాన శాఖ కమిషనర్ రాణీకుముదిని.. రాములు కూరగాయల పంటలు చూసి అభినందించారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఉద్యానశాఖ అధికారులు కనకలక్ష్మి, యాదగిరి, వ్యవసాయాధికారులు కవిత, సందీప్‌కుమార్, లక్ష్మణ్ తదితరులు రాములును ఆదర్శంగా తీసుకుని కూరగాయలు సాగు చేసుకోవాలని మిగతా గ్రామాల రైతులకు సూచిస్తున్నారు. ఇటీవల రాములు వ్యవసాయ పొలంలో సదస్సుకు వచ్చిన మైక్రో ఇరిగేషన్ ఏపీడీ హరిప్రసాద్‌రెడ్డి ఆయనను అభినందించారు. నిత్యం 12 గంటలు శ్రమిస్తూ.. టమాటా, చిక్కుడు, బెండ, దోస, కీర, దొండ, కాకర, వంగ, బీర, మిర్చి, పొట్లకాయ, దోస, మునగ పంటలను రాములు సాగు చేస్తున్నాడు. నిత్యం 12 గంటల పాటు శ్రమించడంతో పాటు రోజూ సరూర్‌నగర్ రైతు బజారుకు వెళ్లి కూరగాయల విక్రయించడం, మళ్లీ మధ్యాహ్నం వచ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతుంటాడు. -
వేరుశనగలో సస్యరక్షణ
ఆకు ముడత తామర పురుగులు, పచ్చ దోమలు ఆకుల కింది భాగన రసం పీల్చడం వల్ల ఆకులు ముడ్చుకుని మొక్కలు గిడస బారిపోతాయి. ఆకుల అడుగు భాగన గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. తామర పురుగు నివారణకు క్లోరో ఫిరిపాస్ 400 మిల్లీలీటర్లు ఒక లీటర్ వేపనూనెతో కలిసి 200 లీటర్లతో ఎకరానికి పిచికారి చేయాలి. పచ్చదోమ నివారణ కోసం డైమిదేమెట్ 400 మిల్లీలీటర్లు లేదా 300గ్రాముల ఎసిఫేట్ 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఎర్ర గొంగళి పురుగు లార్వ దశలో ఉండే పురుగులు ఆకుల్లో పత్రహరితాన్ని తింటాయి. ఎదిగిన పురుగులు ఆకులను తినేసి కొమ్మలను, మొదళ్లను మాత్రమే మిగుల్చుతాయి. వీటి నివారణకు ప్రధానంగా ఆముదం పంటను ఎరగా వేసి నివారించవచ్చు. లేదా డైమిదేమెట్ 400 మిల్లీ లీటర్లు లేదా 300గ్రాములు మోనోక్రోటోపాస్ 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేయాలి. వేరు పురుగులు ఇసుక నేల ల్లో ఈ పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. పురుగులు నేలపై నివసిస్తూ వేర్లను కొరికి వేయడం వల్ల మొక్కలు నిలువుగానే వాడి, ఎండిపోతాయి. వీటి నివారణకు 3జీ గుళికలను ఎకరానికి 10 కేజీలు చల్లాలి. తిక్క మచ్చ తెగుళ్లు తిక్కమచ్చ తెగుళ్లు వేరుశనగ పంటను 30 రోజుల నుంచి ఆశిస్తున్నాయి.ఆకుపై గుండ్రటి మచ్చలు ఏర్పడి గోధుమ రంగులోకి ఆకు మారుతుంది. దీని నివారణకు ఎకరానికి మ్యాంకోజెబ్ 400గ్రాములు, క్లోరోథలిన్ 400గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. వేరుకుళ్లు తెగుళ్లు పల్లిలో వేరుకుళ్లు తెగుళ్లు 30రోజుల నుంచి ఆశిస్తుంది. వేరుకుళ్లు తెగుళ్లకు వర్షభావ పరిస్థితులు అనుకూలం. మొదట కాండంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. త ర్వాత నలుపు రంగులోకి మారి వేరు కుళ్లిపోతుంది. నివారణకు ట్రైకోడర్మా పౌడర్‌ను చల్లాలి. లేదా మ్యాంకోజబ్ను 400 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి మొదళ్ల పై చల్లాలి. సకాలంలో తెగుళ్ల లక్షణాలను గుర్తించి నివారణ చర్యలు చేపడితే పంటలను కాపాడుకోవచ్చు. -
మురి‘పాలు’ కావాలంటే..!
చలికాలంలో పశువులపై దృష్టి సారించాలి యాజమాన్య పద్ధతులు పాటించాలి సమీకృత దాణా విడిగా ఇవ్వాలి శరీర ఉష్ణోగ్రత కోసం ప్రత్యేక ఆహారం ఇవ్వాలి సాధారణంగా 12గంటల వ్యవధిలో పాలు పితుకుతుంటారు. కానీ చలికాలంలో పగటిపూట సమయం తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో ఉదయం 6గంటల నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 4గంటల నుంచి 5గంటల మధ్య పాలు పితకడం మంచిది. శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూడాలి. శరీరం వేడిగా ఉండడానికి అదనపు ఆహారం ఇవ్వాలి. లేకపోతే మేత తినక పాల దిగుబడి తగ్గుతుంది. పశువులకు అందించే దాణాలో పిండి పదార్థాలు ఎక్కువగా, మాంసకృత్తులు తక్కువగా ఉండాలి. లూసర్న్, బర్సీం వంటి పశుగ్రాసాల సాగును చేపట్టి అధిక పాల దిగుబడి పొందాలి. వరి కోతలు పూర్తవగానే పొలంలో మిగిలి ఉన్న తేమతో జనుము వంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. శీతాకాలంలో ఎక్కువగా పశువులు ఎదకొచ్చి పొర్లుతాయి. కాబట్టి ప్రతిరోజు పశువులను కనీసం రెండు మూడుసార్లు ముందూ, వెనకా పరిశీలించాలి. పశువు వెనక భాగంలో పరిశీలిస్తే, మూగ ఎదలో ఉన్న పశువులను గుర్తించడం వీలవుతుంది. గత ఎద పూర్తయిన తర్వాత 16-25 రోజుల్లో పశువుల ప్రవర్తనలో మార్పు, పాల దిగుబడిలో తగ్గుదలను బట్టి ఎదను గుర్తించాలి. వెంటనే వీర్యదానం చేయించాలి. చలిగాలులు, మంచు కురవడం వల్ల న్యూమోనియా సోకే ప్రమాదం ఉంది. గొంతు వాపు, గిట్టలు మెత్తబడడం, మేత తినకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పశువులు, దూడలను ఆరుబయటే కట్టేయకూడదు. ఈదురుగాలిని నిరోధించడానికి వాతావరణంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువైన సందర్భాల్లో పాకల చుట్టూ పరదాలు కట్టాలి. లేగ దూడల వెంట్రుకలను శీతాకాలంలో కత్తిరించకూడదు. {పతి రోజు పశువులశాలను రెండు సార్లు శుభ్రం చేయాలి. సోడా కార్బోనేట్, 4 శాతం బ్లీచింగ్ పౌడర్ వంటి క్రిమిసంహారక మందులతో శుభ్రపరచాలి. నీటి తొట్లను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. తరుచూ వాటికి సున్నం వేస్తుంటే పశువులకు కాల్షియం, ఖనిజ లవణాలు లభ్యమవుతాయి. ఫంగస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. పశువులు తాగేందుకు రోజుకు 50-60 లీటర్ల నీరు అవసరం. శీతాకాలంలో 2-3 సార్లు తాగేందుకు నీరందించాలి. తాగేందుకు నీళ్లు పుష్కలంగా అందిస్తే పాల దిగుబడి బాగుంటుంది. పాలు పితికే గంట, రెండు గంటల ముందు లేదా పితికిన తర్వాత దాణా ఇవ్వాలి. -
వేరుశనగ కు తరుణమిదే..
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో వేరుశనగ పంట తీరప్రాంతంలో విస్తారంగా సాగు చేస్తారు. దర్శి, మార్కాపురం ఏరియాలో కూడా కొంత సాగు చేస్తుంటారు. ట్యాగ్-24, ధరణి రకం విత్తనాలు అనుకూలం. వీటినే జిల్లాల్లో రైతులు ఉపయోగిస్తున్నారు. ఇది నూనెగింజ పంటల్లో ప్రధానమైనది. డిసెంబర్ వరకు ఈ పంటను సాగు చేసుకోవచ్చు. రబీలో శనగ సాగుకు ఇదే అదును. ప్రస్తుతం శనగ సాగు చేయాలనుకునే రైతులకు జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త జీ రమేష్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మన వాతావరణ పరిస్థితికి అనువైన విత్తనాలు ఎంచుకుని, తగినంత మోతాదులో వేస్తే అధిగ దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు. అనుకూలమైన నేలలు ఇసుకతో కూడిన నేలలు, చెలక, ఎర్రగరప నేలలు శనగ సాగుకు అనుకూలంగా ఉంటాయి. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య గల నేలలు ఉత్తమమైనవి. ఎక్కువగా బంకమన్ను గల నల్లరేగడి నేలల్లో పంట వేయకూడదు. నేల తయారీ లోతుగా దుక్కి దున్నడం ద్వారా పంటను నష్టపరిచే చీడపీడల ఉధృతిని తగ్గించవచ్చు. విత్తే ముందు నేల మొత్తాన్ని దుక్కి దున్ని చదును చేయాలి. విత్తనాలు అరకలు లేదా ట్రాక్టర్ల సహాయంతో వేయవచ్చు. ట్రాక్టర్ యంత్రంతో వేయడం వల్ల కూలీ ఖర్చు తగ్గుతుంది. విత్తన మోతాదును మన ఎంపిక ప్రకారం వేసుకోవచ్చు. అంటే పలుచగా లేదా చిక్కగా విత్తనం విత్తుకోవచ్చు. విత్తన మోతాదు గింజ బరువు, విత్తే సమయాన్ని బట్టి విత్తన మోతాదు మారుతుంది. ఎకరానికి 60 నుంచి 70 కిలోల విత్తనం సరిపోతుంది. మన జిల్లాలో నేలలకు ట్యాగ్-24, ధరణి రకాలను ఉపయోగిస్తుంటారు. నీటి పారుదల కింద సాగు చేసే వారు సాళ్ల మధ్య 22.5 సెంటీమీటర్లు, విత్తనాల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉంచి విత్తుకోవాలి. విత్తనశుద్ధి కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా ఒక గ్రాము కార్బండిజమ్ పొడి మందును పట్టించాలి. కాండం కుళ్లు, వైరస్ తెగులు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేయాలి. వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి శుద్ధి చేయాలి. కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు విత్తనానికి రైజోబియం కల్చర్‌ను పట్టించాలి. మొదలు, వేరు, కాండం కుళ్లు తెగుళ్లు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడీని పట్టించాలి. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత శిలీంద్ర నాశనితో శుద్ధి చేయాలి. నిద్రావస్థను తొలగించడానికి.. నిద్రావస్థలో ఉన్న విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇథిరికలన్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి ద్రావణాన్ని తయారు చేసి అందులో 12 గంటలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఎరువుల వినియోగం భూసార పరీక్షను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించాలి. నత్రజని ఎకరాకు(యూరియా రూపంలో) 12 కిలోలు, భాస్వరం(సింగిల్ సూపర్‌ఫాస్పేట్ రూపంలో) 16 కిలోలు, జిప్సం 200 కిలోలు వినియోగించాలి. నీటి పారుదల కింద ఎకరానికి 200 కిలోల జిప్సం పూత సమయంలో మొక్కల మొదళ్ల దగ్గర చాళ్లలో వేసి కలుపు తీయాలి. అనంతరం మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. కలుపు నివారణ కలుపు మొలకెత్తక ముందే నశింపజేసే కలుపు నాశనులను వినియోగించాలి. పెండి మిథాలిన్ ఎకరానికి 1.5 లీటర్లు లేదా భ్యూటోక్లోరా మందు 1.5 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా రెండు లేక మూడు రోజుల వ్యవధిలో నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 25 రోజుల్లోగా గొర్రుతో అంతర కృషి చేయాలి. 45 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. 45 రోజుల తర్వాత ఏ విధమైన అంతర కృషి చేయకూడదు. అలా చేస్తే ఊడలు దెబ్బతిని దిగుబడి తగ్గుతుంది. విత్తిన 21 నుంచి 25 రోజులలోపు 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ఫిల్ 300 మిల్లీలీటర ్లను 200 లీటర్ల నీటిలో కలిపి సాళ్ల మధ్యలో కలుపు మీద పిచికారీ చేసి నాశనం చేయాలి. నీటి యాజమాన్యం తేలిక నేలల్లో సాగు చేసిన వేరుశనగకు 8 నుంచి 9 తడులు పెడితే సరిపోతుంది. ఊడలు దిగే దశ నుంచి కాండం ఊరే దశ వరకు నీరు సక్రమంగా తగిన మోతాదులో పెట్టుకోవాలి. -
భూమికి బలం.. పోషకాల యాజమాన్యం
జొన్న పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కిలో కలయదున్నాలి. రబీలో సాగు చేసే జొన్నకు ఎకరానికి 32-40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ నిచ్చే ఎరువుల్ని వేయాలి. నత్రజని ఎరువును రెండు సమభాగాలుగా అంటే విత్తేటప్పుడు , మోకాలు ఎత్తు పైరు దశలో వేయాలి. సిఫారసు చేసిన భాస్వరపు , పొటాష్ పూర్తి మోతాదును విత్తే సమయంలో వేయాలి. మొక్కజొన్న నీటి పారుదల కింద సాగు చేసి మొక్కజొన్నకు ఎకరానికి 80-100 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్ నిచ్చే ఎరువుల్ని వేయాలి. నత్రజనిని 4 సమ దఫాలుగా విభజించి వేయాలి. మొదటి దఫాను విత్తేటప్పుడు, రెండవ దఫాను విత్తిన 25-30 రోజులకు, మూడవ దఫాను 45-50 రోజులకు, నాలుగవ దఫాను 60-65 రోజుల మధ్య వేయాలి. సిఫారసు చేసిన భాస్వరపు పూర్తి మోతాదును విత్తే సమయంలోనే వేయాలి. సిఫారసు చేసిన పొటాష్ ఎరువును రెండు దఫాలుగా వేసుకోవాలి. సగభాగం విత్తే సమయంలోను, మిగిలిన సగభాగాన్ని విత్తిన నెలరోజులకు వేయాలి. భూమిలో జింక్ లోపముంటే ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేటును మూడు పంటలకు ఒకసారి వేయాలి. అదే జింకు లోప లక్షణాలు పంటపై కనిపించినట్లయితే 0.2 శాతం జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని(లీటరు నీటికి 2 గ్రా జింక్ సల్ఫేట్ ) వారానికి ఒకసారి చొప్పున 2,3 సార్లు పంటపై పిచికారి చేయాలి. శనగ శనగ సాగులో ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం , 16 కిలోల గంథకాన్ని ఇచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి. పెసర పెసర సాగులో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు వేసి దుక్కిలో బాగా కలియదున్నాలి. తర్వాత విత్తనం వేసే ముందు దుక్కిలో ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. వరి మాగాణుల్లో పెసర సాగు చేసేటప్పుడు ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. మినుము మినుము సాగులో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. విత్తటానికి ముందు ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు వేసి గొల్లతో కలియదున్నాలి. వరి మాగాణుల్లో మినుము సాగు చేసేటప్పుడు ఎరువులు వాడనవసరం లేదు. పొద్దుతిరుగుడు పొద్దుతిరుగుడు సాగులో ఎకరానికి 3 టన్నుల పశువుల ఎరువును విత్తటానికి 2-3 వారాల ముందు వేసుకోవాలి నీటి పారుదల కింద హైబ్రిడ్లను సాగు చేసినట్లయితే ఎకరానికి నల్లరేగడి నేలల్లో 30 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్లను ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని 3 దఫాలుగా విభజించి వేయాలి. వేయాల్సిన నత్రజని మోతాదులో సగభాగాన్ని మొదటి దఫా గా విత్తేటప్పుడు, నాలుగో వంతును రెండవ దఫాగా విత్తిన 30 రోజుల తరువాత మొగ్గ తొడిగే దశలో.. మిగి లిన నాలుగో వంతును మూడవ దఫాగా విత్తిన 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో వేసుకోవాలి. సిఫారసు చేసిన భాస్వరపు, పొటాష్ పూర్తి మోతాదులను ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి. సూక్ష్మ పోషకాలలో పొద్దుతిరుగుడు సాగుకు బొరాన్ అత్యంత ఆవశ్యకమైనది. పైరు పూత దశలో ఆకర్షక పత్రాలు తెరుచుకొన్నప్పుడు 0.2 శాతం బొరాక్స్( లీటరు నీటికి 2 గ్రా బొరాక్స్) మందు ద్రావణాన్ని ఎకరానికి 200 లీటర్ల చొప్పున పిచికారి చేసినట్లయితే గింజలు ఎక్కువగా తయారై, దిగుబడి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. లేదా ఆఖరి దుక్కలో ఎకరానికి 8 కిలోల బొరెక్ ఆమ్లాన్ని వేసుకోవాలి. గంధకం లోపించిన నేలల్లో ఎకరానికి 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో వేస్తే గింజలో నూనె శాతం పెరగడమే కాక అధిక దిగుబడులను సాధించవచ్చు( ఎకరానికి 55 కిలోల జిప్సం) -
ధాన్యం నిల్వ చేయండిలా..
మందమర్రి రూరల్ : ఖరీఫ్ ముగిసింది. ఇప్పుడిప్పుడే పంట చేతికి వస్తుంది. ఇంటికొచ్చిన ధాన్యాన్ని ఎలా భద్ర పర్చుకోవాలో తెలియక రైతులు తికమక పడుతుంటారు. ధాన్యాన్ని పండించడం ఒకత్తై దానిని నిల్వ చేయడం మరో ఎత్తు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే పండించిన పంటలో 10 శాతం నష్టపోయే ప్రమాదం ఉందని మండల వ్యవసాయ అధికారి సుజాత అంటున్నారు. ధాన్యాన్ని నిల్వ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ధ్యానం ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి అవసరాలు, విత్తనాలు, కూలీలు ఇలా సుమారు రెండేళ్ల వరకైనా ధాన్యాన్ని నిల్వ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతో నాణ్యత తగ్గుతుంది. ధాన్యం రంగు, రుచిలో తేడా వస్తుంది. ముఖ్యంగా వరి కోత సమయంలో గింజలో 20 శాతం తేమ ఉంటుంది. గింజలు ఆరిన మూడు నాలుగు రోజుల తర్వాత 3 నుంచి 6 శాతం తేమ తగ్గవచ్చు. ధాన్యంలో 14 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే బూజు పట్టే అవకాశం ఉంది. నిల్వ చేసే పద్ధతి సరిగా లేనప్పుడు కూడా ధాన్యానికి కీటకాలు ఆశించి నష్ట పరుస్తాయి. ఎలుకలు తినడమే కాకుండావాటి విసర్జనలు, వెంట్రుకలతో కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు 3 రకాల కీటకాలు నష్టం కలిగిస్తాయి. అవేంటంటే.. వడ్ల చిలుక ధాన్యానికి వడ్ల చిలుక ఆశిస్తే చెడు వాసన వస్తుంది. తల్లి కీటకం వడ్ల గింజలపై గుంపుగా లేదా విడిగా గుడ్లు పెడుతుంది. గుడ్డు పగిలి లార్వా (గొంగళి పురుగు) గింజలోపలికి తొలచుకొనిపోయి బియ్యపు గింజను తింటుంది. అనంతరం ప్యూపా దశ చేరకముందే పైపొట్టులో చిన్న రంధ్రం చేస్తుంది. ప్రౌఢ దశకు చేరిన తర్వాత ఆ రంధ్రం ద్వారా వడ్ల చిలుక బయటకు వస్తుంది. ఇది వ డ్ల మూటల మీద, గిడ్డంగి గోడల మీద కనిపిస్తుంది. ముక్క పురుగు ముక్క పురుగు పంట కోయడానికి ముందే నష్టం కల్గించడం ప్రారంభిస్తుంది. బియ్యంలో తెల్లని పరుగులుగా కనిపించేవి లార్వా దశలో ఉన్న ఈ కీటకాలే. తల్లి కీటకం వడ్ల గింజకు చిన్న రంధ్రం చేసి లోపల గుడ్ల పెట్టి తన నోటి నుంచి వెలుబడే కొవ్వు పదార్థంతో రంధ్రాన్ని మూసి వేస్తుంది. లార్వా, ప్రౌఢ దశలోని ముక్క పురుగు గింజలోపల బియ్యం తింటూ నష్టం కలిగిస్తుంది. ప్రౌఢ దశలోని కీటకం 3 మి.మీ పొడువు ఉంటుంది. ఇది ఎగరదు. నుసి పురుగు దీనిని పుచ్చపురుగు లేదా పెంకు పరుగు అంటారు. ఇది గొట్టపు ఆకారంలో చాలా చిన్నగా 3 మి.మీ. పొడవుంటుంది. ఫౌడ కీటకం గింజలకు నష్టం కలిగిస్తుంది. ఇది ప్రారంభ దశలో చెత్తను, తర్వాత గింజపై పొరను ఆతర్వాత లోపలి బియ్యపు గింజను తింటు తీవ్ర నష్టం కలిగిస్తుంది. లార్వా దశలో గింజ ముక్కలను తింటుంది. తక్కువ ధాన్యం నిల్వ ఉంచే పద్ధతులు తక్కువ ధాన్యాన్ని నిల్వ ఉంచాల్సి వస్తే అంటే ఒక్క సంవత్సరం 50 బస్తాలు నిల్వ ఉంచినప్పుడు వెదురు గాదెలు, సిమెంట్ గాదెలు, లోహపు గాదెలు పుసా బిన్స్‌ల ద్వారా నిల్వ ఉంచుకోవచ్చు. వెదురు గాదెలు ఈ గాదెలు వెదురుతో రెండు పొరల గోడలతో అల్లుతారు. రెండు గోడల మధ్యలో పాలిథిన్ కవర్ పెడతారు. దీనివల్ల తేమ, వర్షపు నీరులోనికి పోకుండా ఉంటుంది. బయట పేడతో అలుకుతారు. ఇది ఖర్చుతక్కువ. కానీ లోపాలు ఉంటాయి. లోహపు గాదెలు ఇనుము లేదా అల్యూమినియంతో 18 నుంచి 20 గెజ్ రేకుతో తయారు చేస్తారు. రెండు క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉంచాలంటే దీని తయారీకి సుమారుగా రూ.7000 వరకు ఖర్చవుతుంది. రూ.40 వేలతో తయారు చేయిస్తే 10 క్వింటాళ్ల ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ ఉంచుకోవచ్చు. ఈ గాదెల్లోకి నీరు, తేమ, ఎలుకలు, కీటకాలు చేరవు. వర్షపు నీరుకు తడవకుండా నెలమీద కొంత ఎత్తు దిమ్మ కట్టించి దానిపై ఉంచాలి. అంతే కాకుండా ఇటుకలతో కట్టిన నిర్మాణంలో కూడా 500 కిలోల నుంచి 4000ల కిలోల ధాన్యాన్ని దాచి ఉంచవచ్చు. గాదెల్లో నిల్వ చేసిన ధాన్యం కీటకాలు ఆశించకుండా రెండు శాతం వేపగింజల పొడి లేదా పనుపు కొమ్మల పొడి కలపడం మంచిది. 100 కిలోల ధాన్యానికి రెండు కిలొల చొప్పున వేపగింజలు పొడి లేదా పనుపు కొమ్ముల పొడి కలిపి నిల్వ చేస్తే 8 నెలల వరకు కీటకాలు ఆశించవు. కీటకాల నివారణకు ఇథైల్‌డైబ్రోమైడ్ అనే రసాయనం కూడా దొరుకుతుంది. ఇది చిన్న గొట్టంలో ప్యాక్ చేసి అమ్ముతారు. వాయువుకూడా బయటకుపోని కట్టుదిట్టమైన గాదెలలో దీనిని వాడవచ్చు. ఎక్కువ ధాన్యం నిల్వ చేసే పద్ధతులు అమ్మాలనుకునే ధాన్యాన్ని రైతులు ఎక్కువ ధర వచ్చే వరకు నిల్వ ఉంచుతారు. పెద్ద మొత్తంలో ధాన్యం నిల్వ ఉంచాల్సి వస్తే గోదాములు లేదా గిడ్డంగులను సిమెంట్ కాంక్రీటుతో నిర్మిస్తే పూర్తి రక్షణ ఉంటుంది. పాత ఇంటిలో అయితే కీటకాలు, తే మ, వర్షపు నీరులోనికి ప్రవేశించకుండా గోడలు, నెల పైకప్పులలో పగుళ్లు , రంధ్రాలు లేకుండా సిమెంట్‌తో పూడ్చి వేయాలి. ఎలుక కన్నాలను గాజు ముక్కలు, సిమెంటు కాంక్రీట్‌తో మూసివేయాలి, పక్షలు రాకుండా కిటికీలు, ఇనుప జాలీలు బిగించి దుమ్ముధూళీ లేకుండా శుభ్రం చేయాలి. ధాన్యం నిల్వకు కొత్త గోనే సంచులు ఉపయోగించాలి. ధాన్యం నింపే ముందు గోనె సంచుల మీద లోపల మలథాయన్ లేదా ఎండోసల్ఫాన్ ద్రావణం స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన మరునాడు వాటిని ఎండలో పెట్టాలి. ఏ విధమైన పురుగు మందు వడ్లకు కలుపరాదు. ఇది చట్టరీత్యానేరం. ఎలుకల నివారణకు చర్యలు గిడ్డంగి చుట్టూ పక్కల చెత్త లేకుండా ప్రతీరోజు తుడిచి శుభ్రం చేయాలి. ఎలుకలు గిడ్డంగిలోకి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రకాలైన బోనులు, బుట్టలు ఉపయోగించి ఎలుకలను చంపివేయాలి. ఒకే రకం బోనును ఎప్పుడు వాడకూడదు. గిడ్డంగి తలుపుల కింద భాగాలకు జింకు రేకులు అమర్చాలి. తూములు, రంధ్రాలకు వైర్‌మెష్ మూతలు అమర్చాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ధాన్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. -
బోదె పద్ధతిలో మొక్కజొన్న
ట్రాఫిక ల్టర్ సహజంగా రైతులు మొక్కజొన్న సాగు చేయడానికి పొలాలు దున్ని సాళ్లుగా చేసి సాళ్లలో విత్తనాలు చల్లి ఎదపెడతారు. ఇది పాత పద్ధతి. వర్షాలు అధికంగా కురిసినప్పుడు సాళ్లలో నీరు నిల్వ ఉండి విత్తనాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ . ఒకవేళ వర్షాలు తక్కువగా ఉంటే.. మొక్కలకు నీరందక చనిపోయే ప్రమాదం ఉంది. వీటిని అధిగమించడానికి బోదె పద్ధతి మొక్కజొన్న సాగులో ఇక్రిశాట్ ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఈ బోదెలు చేసే యంత్రాన్ని ట్రాఫికల్టర్ అంటారు. దీన్ని ట్రాక్టర్‌కు అమర్చి ఉపయోగించవచ్చు. బాడుగ భరించలేని రైతులు ఎడ్లతో లాగించి మొక్కజొన్న విత్తనాలు నాటుకోవచ్చు. ముందుగా బోదె పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయాలనుకున్న పొలాన్ని ఎంచుకుంటారు. ఈ పద్ధతికి నల్లరేగడి నేలలు బాగా అనుకూలమైనవి. చేను ఎటు వైపు నుంచి ఎత్తుగా ఉంది. ఎటు వైపునకు పల్లంగా ఉం దో చూసుకుని ట్రాక్టరుకు బోదెలు చేసే యంత్రాన్ని తగిలించి నేలను సరిచేస్తారు. బోదెల మధ్య 1.5 మీటర్లు ఖాళీ ఉండే విధంగా సాళ్లు ఏర్పాటు చేస్తారు. అధిక వర్షాలు పడినప్పుడు బోదెలపై ఉన్న నీరు సాళ్లలోకి జారిపోవడమేగాక, సాళ్లలో ట్రాక్టర్లు, ఎడ్లు, చక్రా లు నడవడానికి కూడా పనికి వస్తాయి. ఈ పద్ధతిలో బోదెపై మూడు వరుసలు వస్తాయి. ఎకరానికి 28 వేల మొక్కలు పడతాయి. 8 కిలోల విత్తనాలు సరిపోతాయి. బోదెలు చేసిన తర్వాత విత్తనాలను యంత్రంతోనే నాటుతారు. బోదె పద్ధతి వల్ల ఉపయోగాలు బోదె పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తే మామూలు విధానంలో కన్నా 20 శాతం అధికంగా దిగుబడి వస్తుందని ఇక్రిశాట్ పరిశోధనలో తేలింది. ఈ పద్ధతిలో మొక్కజొన్న, కంది, శనగ, వేరుశనగ, సోయాబీన్ సాగు చేసుకోవచ్చు. వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు పంట దెబ్బ తినకుండా బోదెలపైన ఉన్న నీరు వెంటనే సాళ్ల ద్వారా బయటకు వెళ్తుంది. వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు బోదెల్లో ఉన్న తేమ పంట దెబ్బతినకుండా కాపాడుతుంది. పొలం వాలు, ఎత్తు పల్లాలను కొలిచి బోదెలు చేసుకుంటాం కాబట్టి నేల కోతకు గురికాకుండా కాపాడుతుంది. బోదెల్లో నీరు ఇంకిపోయేలా చేయడం ద్వారా పంట బెట్టకు వచ్చే అవకాశం తక్కువ. =సాళ్ల మధ్య దూరం 18 అంగుళాలు ఉంటుంది. అదే మామూలు పద్ధతిలో సాగు చేస్తే 22 అంగుళాలు ఉంటుంది. దీని వల్ల స్థలం కలిసి వస్తుంది. బోదెలు పెరుగుతాయి. మొక్కల సంఖ్య పెరుగుతుంది -
చామంతులు.. ప్రగతి కాంతులు!
హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్(9705524169), శ్రీనివాస్‌లు మండల పరిధిలోని కొడిప్యాక శివారులో 10 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. సాగుకు యోగ్యం కావనుకున్న నేలలో చామంతి సాగు చేపట్టారు. మొత్తం భూమిలో చామంతికి సంబంధించిన మ్యారీగోల్డ్తోపాటు వివిధ రంగుల చామంతి పూలను సాగు చేస్తూ హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. మూడు నెలలకు కోతకు వచ్చే ఈ పంటను ప్రతినిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. తోట పనులను చూసుకునేందుకు నాయుడు అనే వ్యక్తిని నియమించారు. తరచూ వచ్చిపోతూ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అతనికి వివరిస్తుంటారు. ఎకరా భూమిలో సుమారు 10నుంచి 12వేల మొక్కలు సాగు చేయవచ్చన్నారు. ఒక చామంతి మొక్కను సీజన్‌ను బట్టి రూ.4 నుంచి రూ.12కు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. మూడు నెలల పాటు మొక్కను సంరక్షించేందుకు సుమారు రూ.40నుంచి రూ.50 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. మూడు నెలల తర్వాత ఒక మొక్క నుంచి కిలోన్నర నుంచి రెండు కిలోల దిగుబడి వస్తుందని తెలిపారు. ఇలా రెండు, మూడు పర్యాయాలు పువ్వులు చేతికి వస్తాయని చెప్పారు. కిలో పూలకు మార్కెట్లో స్థిరంగా రూ.40 నుంచి రూ.70 వరకు పలుకుతుందని తెలిపారు. దీపావళి, కార్తీకపౌర్ణిమ, బతుకమ్మ పండుగ తదితర సీజన్లలో వీటి ధర కిలోకు రూ.200 నుంచి రూ.300 వరకు కూడా పలుకుతుందన్నారు. డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్నందున కూలీల అవసరం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం చామంతి సాగు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని ఇతర ప్రాంతాలతో పాటు స్థానిక రైతులు కూడా తమ తోటను చూసేందుకు వస్తున్నారని తెలిపారు. సలహాల కోసం సంప్రదించాలన్నారు. -
మిరపకు వైరస్
ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో సాగు చేసిన మిరప తోటలకు వైరస్ తెగుళ్లు ఆశిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 25 వేల హెక్టార్లలో మిర్చిని సాగు చేశారు. భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, ఖమ్మం, ఇల్లెందు నియోజకవర్గాల్లో మిరప తోటలను అత్యధికంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం తోటలు పూత, కాత దశలో ఉన్నాయి. జిల్లాలో సాగు చేసిన మిర్చిని తెగుళ్లు ఆశించినట్లు జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. మిర్చికి ఆశించిన తెగుళ్ల నివారణ చర్యలను డాట్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జె.హేమంత్‌కుమార్ (99896 23813), శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.వెంకట్రాములు(89856 20346), డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు (8332951138) వివరించారు. ఆకుముడత తెగులు (జెమిని వైరస్) తెల్లదోమ ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించి మొక్కలు చిన్నవిగా మారి పైకి ముడుచుకొని పడవ ఆకారంలో ఉంటాయి. ఆకుల ఈనెలు ఆకుపచ్చగాను, ఈనెల మధ్య లేత ఆకుపచ్చగా లేదా పసుపు పచ్చరంగు కలిగి ఉండి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఆకుల మీద బొబ్బలుగా ఏర్పడి ముడుచుకుంటాయి. కుకుంబర్ మొజాయిక్ వైరస్ ఈ వైరస్ పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. నల్లని మసి లేదా బూజు ఆకులు, కాయలపై కనిపిస్తాయి. మొక్కలు గిడసబారి ఎదుగుదల లోపిస్తుంది. ఆకుల్లో పత్రహరితం కోల్పోయి, ఆకారం మారిపోయి కొనలు సాగి మొజాయిక్ లక్షణాలు కనిపిస్తాయి. పూత, కాత ఉండదు. దీనివల్ల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. మొవ్వకుళ్లు తెగులు (పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్) ఇది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నారుమళ్లు సాలు తోటల్లోనూ ఆశించి మొవ్వ లేదా చిగురు భాగం ఎండిపోతుంది. కాండంపై నల్లని నిర్దిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేణ చారలుగా మారుతాయి. ఆకులపై వలయాలుగా నైక్రోటిక్ మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. నివారణ చర్యలు గట్లమీద వైరస్ క్రిములకు స్థావరాలైన కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. పొలం చుట్టూ 2-3 వరుసల జొన్న లేదా మొక్కజొన్నను రక్షణ పంటగా వేసుకోవాలి. సేంద్రియ ఎరువులు వాడి సమతుల్య ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలి. విత్తనం ద్వారా వ్యాపించే వైరస్ తెగుళ్ల నివారణకు ట్రైసోడియం ఆర్థోపాస్పేట్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. తెగుళ్లను వ్యాప్తిచేసే రసంపీల్చు పురుగులను సమర్థవంత ంగా నిర్మూలించాలి. వైరస్ తెగులు సోకిన మొక్కలను పీకి కాల్చి వేయాలి. గ్రీజు లేదా ఆయిల్ పూసిన పసుపు రంగు అట్టలను పొలంలో అక్కడక్కడ ఉంచితే తెల్లదోమ ఉధృతిని తెలుసుకొని కొంతవరకు వాటిని నివారించవచ్చు. పేనుబంక నివారణకు 2 గ్రాముల ఎసిఫేట్, లేదా 2 మి.లీ మిథైల్ డెమటాన్ లేదా 0.25 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు నివారణకు ఎసిఫేట్ 2 గ్రాములు లేదా 2 మి.లీ ప్రాపోనిల్ లేదా 0.25 మి.లీ స్పైనోసాడ్ లేదా 2 గ్రాముల డెపైన్థియోరాన్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు 5 శాతం వేప గింజల కషాయాన్ని లేదా ఎకరానికి 300 గ్రాముల ఎసిఫేట్ లేదా ట్రైజోఫాస్ 250 మి.లీ లేదా ఎసిటామిప్రిడ్ 60 గ్రాములు లేదా థయోమిథాక్సమ్ 40 గ్రాముల మందులను మార్చి మార్చి 7-10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. -
జాతి కొద్ది పాలు..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దానికి అనుగుణంగా పాడిపరిశ్రమ పెట్టుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సహాన్ని ఇస్తుంది. అయితే డెయిరీ పెట్టే రైతులు ఎలాంటి పశువులు కొనాలి.. ఏం చూడాలి..ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో డ్వామా సహాయ సంచాలకులు మధుసూదనరావు వివరిస్తున్నారు. కృత్రిమ పాల దిగుబడితో ఎందరో అనారోగ్యానికి గురవుతున్న ఈ రోజుల్లో స్వచ్ఛమైన పాల విక్రయం ద్వారా మంచి లాభాలు అర్జించవచ్చు. ఇందుకోసం ఆరోగ్యవంతమైన పశువులను ఎంచుకోవాలి. ‘పిండి కొద్ది రొట్టే.. జాతి కొద్ది పాలు’ అన్నారు. మేలుజాతి పశువులతోనే మంచి పాల దిగుబడి వస్తుంది. తద్వారా పాడి పరిశ్రమ లాభసాటిగా సాగుతుంది. కొనే ముందు జాగ్రత్తలివి.. పశువును కొనుగోలు చేసే ముం దు శరీర లక్షణాలు, వాటి పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి పాడిపశువుల ఎంపిక చేసుకోవాలి వీలైనంత వరకూ ఏ ప్రాంతంలో డెయిరీఫాం పెట్టాలనుకుంటున్నారో, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న డెయిరీఫారంలో అమ్మకానికి ఉంటే అట్టి పాడి పశువులను కొనడం మంచిది. ఎందుకనగా, ఇతర రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, కేరళ నుంచి తెచ్చిన పాడిపశువులు మంచివే. కానీ ఆ పశువులు అక్కడి మేతకు అలవాటు పడి ఉంటాయి. వాటికి అనుగుణంగా దాణా, నిర్వహణ లేకుంటే దూడలు చనిపోవడం, పాల ఉత్పత్తి తగ్గిపోతాయి. కొన్ని రోజుల వరకు అక్కడ అలవాటు పడిన మేతతోపాటు మనకు అందుబాటులో ఉన్న దాణా కూడా అందించాలి. ఇవి గమనించాలి దూర ప్రాంతాల పశువలను కొనే ముందు వాటి, జాతి రికార్డులు చూడడం మంచిది పాడిపశువులు నిండుగా చురుకగా ఉండాలి {తికోణాకారంలో ఉండి, చర్మం పలుచగా, మృదువుగా ఉండాలి మెడ పొట్టిగా, డొక్కులు నిండుగా పొదుగు విస్తరించి ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు. నాలుగు చనుకట్లు సమానంగా ఉండాలి, కాళ్లు , కాలిగిట్టలు ధ్రుడంగా కనిపించాలి. బెదరకుండా ఎవరు పాలు పితికినా ఇచ్చేలా ఉండాలి నవంబర్, డిసెంబర్ నెలల్లో పాడిపశువులు కొనుగోలు చేసేందుకు అనువైన సమయం. కొనుగోలు చేసే ముందు ఎన్నో ఈతనో గమనించి 4 ఈతల లోపు పశువులే కొనాలి. పాడిపశువు కొనాలనుకుంటే రెండు మూడురోజులు దగ్గర ఉండి పాల ఉ త్పత్తిని రెండుపూటల గమనించాలి. ముందు నుంచే గడ్డి పెంచుకోవాలి డెయిరీ ఫాం పెట్టే ముం దు 3 నెలల ముందు నుంచే పశుగ్రాసం పెంపకం చేపట్టాలి. తృణజాతి, గడ్డిజాతి గ్రాసాలు సిద్ధం చేసుకొన్న తర్వాతే పశువులు తెచ్చుకోవాలి. సంకరజాతి ఆవు రోజు కు 8 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తుంది. ముర్ర జాతి గేదె అయితే 8 నుం చి 10 లీటర్ల పాలిస్తాయి. ఈనిన గేదె, ఆవు దూడ తో కొనడం మంచిది. పశువు కొనేందుకు వెళ్లినప్పుడు ఆ పాడిపశువు నిర్వహణ ఎలా ఉంది అనేది గమనించాలి. అదే పద్ధతి కొనసాగించడం పాల ఉత్పత్తి నిలకడగా ఉండడానికి దోహద పడుతుంది. వాహనంలో తీసుకువచ్చేటప్పుడు జాగ్రత్తలివి.. దూర ప్రాంతం నుంచి తీసుకువచ్చేటప్పుడు రవాణా సమయంలో వాహనాన్ని ఆపి, పశువులను దించి కొంత దూరం నడిపించాలి నీరు, దాణా పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల కాళ్ల మధ్య వాహనంలో వరిగడ్డి మందంగా పరిచి వాహనంలోపలి అంచులకు గడ్డితో నింపిన సంచులను వేలాడదీయాలి. {పయాణంలో రాపిడివల్ల గాయాలు కాకుండా చూడాలి. పశువుల మధ్యలో వెదురుకర్రలు కట్టి తలభాగంపైన ఉండేలా చూడాలి. వేసవిలో అయితే రాత్రి ప్రయాణం చేయ డం మంచిది.రవాణా బీమా చేయించాలి. మంచిపాడి పశువు కొనుగోలు ఎంతముఖ్యమో కొన్న పశువును క్షేమంగా ఇంటికి చేర్చడం కూడా అంతే ముఖ్యం. పాడిపశువుల కొనుగోలు, రవాణాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటే పాడిపశువు, డెయిరీఫాంలో కాసుల కురిపించే కనక మహాలక్ష్మీ కాగలదనడం నిర్వివాదాంశం. -
‘పాడిపై దృష్టి సారించాలి’
నందిపేట : సహకార సంఘాలు పాడిపై దృష్టి సారించి, లాభాలు ఆర్జించాలని జిల్లా సహకార అధికారి శ్రీహరి సూచించారు. గురువారం డొంకేశ్వర్ సొసైటీలో 61వ జాతీయ సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు సేవలందించడంతో పాటు వ్యాపారంలో నిజామాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాలో సహకార సంఘాల పనితీరు బాగుందన్నారు. సొసైటీలను మరింత లాభాల బాటలో నడిపించేందుకు పాలక వర్గాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా సొసైటీ పరిధిలోని గ్రామాలలో రైతుల నుంచి పాలను సేకరించడం, వే బ్రిడ్జిలను నెలకొల్పడంలాంటి వ్యాపారాలను చేపట్టాలన్నారు. వారానికోసారి ఆర్థిక లావాదేవీలను సరిచూసుకోవాలని సూచించారు. బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. అనంతరం వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో డివిజనల్ సహకార అధికారి మనోజ్ కుమార్, సొసైటీ చైర్మన్ భోజారెడ్డి, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, డెరైక్టర్లు సాయరెడ్డి, నరేందర్, రాజన్న, భూమేశ్, గంగారెడ్డి, సొసైటీ కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అనగనగా శనగ..
ఒంగోలు టూటౌన్ : శనగ సాగును రైతులు దాదాపు పక్కన పెట్టేశారు. పంట వేసేందుకు ఏ రైతూ ధైర్యం చేయడం లేదు. వ్యవసాయ శాఖ విత్తనాలు సరఫరా చేస్తున్నా.. రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. కారణం.. మూడేళ్లుగా గిట్టుబాటు ధర దక్కక.. పండించిన శనగలన్నీ గోడౌన్లలో పేరుకుపోవడమే. దాదాపు 17.50 లక్షల క్వింటాళ్ల నిల్వలు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్నాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పి.. 4 నెలలు కావస్తోంది. ఇంత వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో శనగ పంట అంటేనే రైతులు బెంబేలెత్తుతున్నారు. గతంలో రబీ సీజన్లో శనగ పంటను ఇబ్బడిముబ్బడిగా సాగు చేశారు. 2013-14 రబీలో కూడా 69,465 హెక్టార్లలో శనగ సాగయింది. ప్రస్తుత రబీ సీజన్లో 88,817 హెక్టార్లలో సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 2,349 హెక్టార్లకే పరిమితమైంది. అంటే మూడు శాతం మాత్రమే పంట సాగయింది. 62 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టగా.. 25 వేల క్వింటాళ్లు మాత్రమే పొజిషన్లో ఉంచారు. వీటిలో ఇప్పటి వరకు కేవలం 2,500 క్వింటాళ్ల శనగ విత్తనాలనే రైతులు రాయితీపై కొన్నారు. జిల్లాలోని 56 మండలాల్లో వ్యవసాయశాఖ ద్వారా విత్తనాలు సరఫరా చేస్తున్నా శనగలు తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదని వ్యవసాయ శాఖ జేడీ జే మురళీకృష్ణ తెలిపారు. రైతులంతా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారని జేడీఏ పేర్కొన్నారు. ఎక్కువగా యూకలిప్టస్, మిర్చి, మినుము, అలసంద, మొక్కజొన్న, జొన్న లాంటి పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారని ఆయన వివరించారు. జిల్లాలో పంటల సాగు 32 శాతం ‘జిల్లాలో ఇప్పటి వరకు మిరప 7,914 హెక్టార్లు, అలసంద 5,356 హెక్టార్లు, జొన్న 5,865 హెక్టార్లు, మొక్కజొన్న 2,145 హెక్టార్లలో సాగు చేశారు. వీటితో పాటు వరి 28,080 హెక్టార్లు, రాగి 42 హెక్టార్లు, వేరుశనగ 74 హెక్టార్లు, నువ్వులు 2,853 హెక్టార్లలో వేశారు. పత్తి రబీలో 1352 హెక్టార్లకు గాను 50 హెక్టార్లు, పొగాకు 36,983 హెక్టార్లలో సాగయింది. ఇంకా ఉల్లి, పసుపు, చెరకు, పెసర, చిరుధాన్యపు పంటలతో కలిపి మొత్తం ఇప్పటి వరకు 1,10,004 హెక్టార్లలో పంటలు వేశారు. రబీ సాగు సాధారణ విస్తీర్ణం 3,44,321 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 32 శాతం పంటలు వేశారని’ జేడీఏ వెల్లడించారు. ప్రస్తుత సీజన్లో పొద్దుతిరుగుడు విత్తనాలు 870 క్వింటాళ్లు, మొక్కజొన్న 1,648 క్వింటాళ్లు, జొన్న 500 క్వింటాళ్లు, ఆముదం 200 క్వింటాళ్లు, నువ్వుల విత్తనాలు 95 క్వింటాళ్లను రైతులకు అందుబాటులో ఉంచామని, ఇంకా రైతులకు రాయితీపై విత్తనాలు అందజేస్తామని స్పష్టం చేశారు. విత్తనాల ధరను బట్టి కిలోకు రూ.25 రాయితీ ఇస్తామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో భూములు పదునెక్కాయని, సాగు విస్తీర్ణం ఇంకా పెరుగుతుందని జేడీఏ తెలిపారు. -
బిందుసేద్యంతో సాగునీరు ఆదా
యాచారం: నీటి వనరులున్న ప్రతి రైతు బిందుసేద్యం ద్వారా పంటలు సాగు చేసుకోవాలని, తక్కువ నీటి వాడకంతో మూడింతల పంటలు తీయవచ్చని మైక్రో ఇరిగేషన్ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ హరిప్రసాద్‌రెడ్డి సూచించారు. గురువారం మండల పరిధిలోని చౌదర్పల్లిలో బిందుసేద్యం వాడకంపై కాశమల్ల రాములు వ్యవసాయ క్షేత్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కాల్వల ద్వారా నీటిని పారించడం వంటి పద్ధతుల వల్ల నీరు వృథా కావడంతో పాటు తక్కువ పొలంలో పంటలు సాగు చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అదే బిందుసేద్యం పద్ధతుల్లో తక్కువ నీటితో మూడింతల పొలంలో పంటలు తీయవచ్చని సూచించారు. ఆధునిక పద్దతుల్లో వ్యవసాయ చేస్తేనే రైతులకు ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన రైతులు బిందు సేద్యం కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సదస్సు అనంతరం బిందుసేద్యం పరికరాలు సరఫరా చేసే జైన్ కంపెనీ ప్రతినిధులు ఫ్లోరైడ్ వల్ల బిందు పరికరాల్లో చేరే వ్యర్థాన్ని తొలగించే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్, ఇబ్రహీంపట్నం డివిజన్ ఉద్యాన శాఖ క్షేత్రస్థాయి అధికారి యాదగిరి, ఇబ్రహీంపట్నం డివిజన్ మైక్రో ఇరిగేషన్ రాజేష్‌కుమార్, సర్పంచ్ గౌర నర్సింహ, ఎంపీటీసీ సభ్యుడు కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ శ్రీధర్‌గౌడ్, రైతులు శ్రీకాంత్‌రెడ్డి, విష్ణు, బుగ్గరాములు పాల్గొన్నారు. -
ప్రణాళికాబద్ధంగా సాగితే.. పౌల్ట్రీ లాభమే!
మోమిన్‌పేట: కోళ్ల పెంపకం వైపు గ్రామీణ ప్రాంతాల్లోని యువరైతులు దృష్టి సారిస్తున్నారు. ముందస్తు ప్రణాళికతో 40 రోజుల్లోనే లాభాలు పొందవచ్చంటున్నారు. ప్రణాళిక ప్రకారం చేస్తే ఎంత లాభం వస్తుందో ప్రణాళిక లేకుండా పెంపకం చేపడితే అంత నష్టం వస్తుందంటున్నారు. కోడిపిల్లలు, మందులు, దాణాలను పలు కంపెనీలు రైతులకు అందజేస్తున్నాయి. కేవలం పెంపకం బాధ్యతలనే రైతులకు అప్పగిస్తున్నాయి. వాటిపై కమీషన్ కింద రైతులకు డబ్బులు ఇస్తున్నారు.మండల పరిధిలోని చీమల్‌దరి, టేకులపల్లి, ఏన్కతల, మల్‌రెడ్డిగూడెం, ఎన్కేపల్లి, కేసారం, మోమిన్‌పేట, దుర్గంచేర్వు, బూర్గుపల్లి తదితర గ్రామాలలో ఇప్పటికే సుమారు 26 మంది యువ రైతులు కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. బ్యాంకులు రుణ సౌకర్యాన్ని కల్పిస్తే ఎక్కువ మొత్తంలో పెంపకాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. షెడ్ల నిర్మాణం.. మూడు వేల బ్రాయిలర్ కోళ్ల పెంపకానికి శాశ్వత షెడ్డు నిర్మాణానికి దాదాపు రూ.5.50 లక్షలు అవసరమవుతాయి. మరో రూ.లక్షతో నీటి తొట్లు తదితర సామగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కోడి పిల్లల కొనుగోలు మూడు వేల కోడి పిల్లల కొనుగోలుకు మార్కెట్‌ను బట్టి రూ.90 వేలు అవసరమవుతాయి. ఒక్కో కోడిపిల్ల సగటున మూడు కిలోల నుంచి నాలుగు కిలోల దాణా తింటుంది. కిలో దాణా రూ.35. కాగా కోడి ఒక్కటి 40 రోజుల్లో రూ.180 నుంచి రూ.190 వరకు దాణా తింటుంది. మందులు, కూలీలు, విద్యుత్ బిల్లులతో పాటు ఒక్కో కోడికి 40 రోజులలో సగటున రూ.210 ఖర్చవుతాయని రైతులు పేర్కొంటున్నారు. మార్కెట్లో కిలో కోడి రూ.90కి అమ్ముడు పోతే మంచి లాభాలు వస్తాయని రైతులు పేర్కొంటున్నారు. 40 రోజులు దాటితే దాణా ఖర్చు పెరిగి నష్టాలు వస్తాయని రైతులు తెలిపారు. మార్కెటును దృష్టిలో పెట్టుకొని రైతులు వెంకటేశ్వర, సుగుణ కంపెనీలకు లీజుకు ఇస్తున్నారు. దాణా, మందులు, కోడిపిల్లలు కంపెనీ వారు ఇస్తే కూలీలు, విద్యుత్ బిల్లులను యజమాని భరించాల్సి ఉంటుంది. ఇలా ఇవ్వడం బాగానే ఉందని రైతులు పేర్కొంటున్నారు. -
పట్టుదలే.. పెట్టుబడి!
మండల పరిధిలోని బోక్కస్‌గాంకు చెందిన జార పోతిరెడ్డి, సావిత్రి దంపతుల కుమారుడు సంగారెడ్డి అధికారుల సాయంతో వర్మీ కంపోస్టు ఎరువులను తయారు చేస్తున్నాడు. రసాయన మందులు వద్దు సేంద్రియ ఎరువులే ముద్దు అనే సూత్రాన్ని పాటిస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నాడు. గ్రామ శివారులో ఇతనికి రెండు చోట్ల 4.26 ఎకరాలు భూమి ఉంది. వ్యవసాయమే జీవనాధారంగా సాగుతూ ఆదర్శ రైతుగా కూడా గుర్తింపు పొందాడు. వ్యవసాయం పట్ల ఆసక్తితో వానపాములతో ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టాడు. జేడీఏతోపాటు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, అధికారుల మన్ననలు పొందుతున్నాడు. ప్రారంభంలో కష్టాలు... వానపాములతో ఎరువుల తయారీ ప్రారంభ దశలో నెలకొన్న ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంగారెడ్డి అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. ఏడాది క్రితం వర్మీయాచర్ కోసం ఏర్పాటు చేసిన షెడ్డు గాలివాన బీభత్సంతో ధ్వంసమైంది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ, రూ.1 లక్ష వరకు సొంత డబ్బులు నష్టపోయాడు. అయినా ధైర్యం కోల్పోకుండా మరోసారి షెడ్డును నిర్మించుకున్నాడు. అప్పటి నుంచి తిరిగి వెనక్కి చూడలేదు. వర్మీ ఎరువు తయారీ విధానం... వర్మీయాచర్ యూనిట్ విలువ రూ.2 లక్షలు ఉంటుంది. దీనికి ప్రభుత్వం 50శాతం సబ్సిడీ ఇస్తుంది. మిగతా ఖర్చును రైతు భరించాల్సి ఉంటుంది. షెడ్డు, 5 బెడ్లు, ఎరువుల నిల్వకు గోదాం నిర్మించాలి. 54 అడుగుల పొడవు, 27 అడుగులు వెడల్పు షెడ్డు నిర్మించాలి. అందులో 50 అడుగుల పొడవు, 4 అడుగులు వెడల్పు, ఒక అడుగు ఎత్తున 5 బెడ్లు నిర్మించాలి. ఒక్కో బెడ్లో 20 కిలోల చొప్పున వానపాములు (ఐదు బెడ్లలో కలిపి క్వింటాలు) వేయాలి. వీటికి ఆహారంగా వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు, చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థాలు వేయాలి. మూడు నెలల్లో ఎరువు తయారవుతుంది. వానపాముల ఎరువుల సరఫరా కోసం వ్యవసాయ శాఖ అధికారులు రైతు సంగారెడ్డికి ఆర్డరు ఇచ్చారు. 126 బెడ్లకు సరిపోయేన్ని వానపాములను పంపిణీ చేసేందుకు ఆయన శ్రమిస్తున్నాడు. సొంత పొలంలో వర్మీ ఎరువుల వాడకం... వానపాములతో తయారు చేసిన ఎరువులను సంగారెడ్డి ఇతర రైతులకు సరఫరా చేస్తున్నాడు. సొంత భూమిలో క్రమంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ వర్మీకంపోస్టునే వాడుతున్నాడు. ఖరీఫ్‌లో ఒక ఎకరం కావేరి కేవీ 21 రకం వరి సాగు చేశాడు. మరో 20 గుంటల్లో సాయిరాం సన్న రకం వరి వేశాడు. మరి కొంత మొక్కజొన్న, కూరగాయలు సాగు చేపట్టాడు. వీటన్నింటికీ తన షెడ్లో తయారైన ఎరువులనే వినియోగిస్తున్నాడు. దిగుబడులు ఆశాజనకం గా ఉన్నాయి. వర్మీకంపోస్టు, సేంద్రియ ఎరువులతో సంగారెడ్డి పండించిన కూరగాయలు, బియ్యాన్నే ఇంట్లో వాడుతున్నాడు. ఇతను పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేం దుకు పలువురు ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. వర్మీ ఎరువులు తీసుకెళ్లేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు బోక్కస్‌గాంకు వస్తున్నారు. వ ర్మీఎరువును రూ.6 కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపాడు. ఇప్పటి వరకు తాను రూ.1 లక్ష వరకు లాభం పొందానని చెప్పాడు. వ్యవసాయం ఉన్న మక్కువతో తన రెండో కొడుకు విష్ణువర్ధన్‌రెడ్డిని అగ్రీకల్చర్ డిప్లొమా చదివించాడు. వర్మీయూనిట్లను ఏర్పా టు చేసుకునే వారికి సలహాలిస్తానని చెప్పారు. -
జీవాలతో జీవానోపాధి
నిజామాబాద్ వ్యవసాయం:నిజామాబాద్ జిల్లాకేంద్రానికి చెందిన బైర సుభాష్ ఉన్నత చదువులు చదివారు. ఉపాధి కోసం హైదరబాద్‌తో పాటు వివిధ దేశాలకు వెళ్లారు. అలా సింగపూర్ వెళ్లినప్పుడు ఆయన ఓ గోట్ డెయిరీని చూశారు. బర్రెలు, ఆవుల డెయిరీల గురించే తెలిసిన ఆయన దాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఆ దేశంలో పాల కోసం మేకలను పెంచుతారు. అయితే మనదేశంలో మేకలు, గొర్రెల మాంసానికి మంచి డిమాండ్ ఉంటుందన్న విషయాన్ని గ్రహించారు. అలా సుభాష్ స్వదేశానికి తిరిగి వచ్చి నాలుగేళ్ల క్రితం డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామ శివారులో సుమారు 25ఎకరాల్లో గొర్రెలు, మేకల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వాటికి కావల్సిన దాణాను సైతం స్వయంగా సమకూర్చుకుంటున్నారు. పెట్టుబడి గొర్రెల పెంపకం కేంద్రానికి కావల్సిన పెట్టుబడి, ఖర్చులు, ఆదాయం వివరాలను సుభాష్ వివరించారు. మొత్తం పెట్టుబడి రూ.12లక్షలు అవసరం ఉంటుంది. రూ.3లక్షలు పెడితే.. మిగితా రూ.9లక్షలు బ్యాంకు రుణం ఇస్తుంది. దీనికి రూ.రెండున్నర లక్షలు సబ్సిడీని జాతీయ పశుగణాభివృద్ధి సంస్థ(నేషనల్ లైవ్ స్టాక్మిషన్) ద్వారా వస్తుంది. ఏర్పాటు చేయడానికి స్థలం వంద ఆడ గొర్రెలు, ఐదు మగ గొర్రెలు(పొట్టేళ్లు) కలిపి ఒక యూనిట్ అంటారు. వీటికి మూడు ఎకరాల స్థలం కావాలి. ఇందులో రెండు ఎకరాల్లో గడ్డిజాతి పశుగ్రాసం, ఎకరంలో పప్పుజాతి పశుగ్రాసం పెంచాలి. ఖర్చు పెంపకం కేంద్రం నడపడానికి ఇద్దరు కార్మికులు అవసరం. వీరికి నెలకు రూ.6వేల చొప్పున ఇద్దరికి కలిపి రూ.12వేలు అవుతుంది. పశుగ్రాసం పెంపకం కోసం రూ.6వేలు, ఆరోగ్య సంబంధ టీకాలు, మందుల కోసం రూ.6వేలు, మిశ్రమ దాణా కోసం రూ.15వేలు. మొత్తం ఒక నెలకు రూ.39వేలు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన 8 నెలలకు మొత్తం రూ.3లక్షల 12వేలు ఖర్చు. లాభాలు పుట్టిన గొర్రె పిల్లలను 8 నెలలు పెంచాలి. ఈ 8 నెలల్లో దాదాపుగా 30 కిలోల బరువు పెరుగుతుంది. ఒక్కో కిలోకు రూ.250 చొప్పున 30కిలోలకు రూ.7500 వస్తాయి. వంద గొర్రెలను పెంచితే అందులో పదిశాతం మృతిచెందినా దాదాపు 81పిల్లలు ఉంటాయి. 8 నెలల తర్వాత అవి 30 కిలోల బరువు అవుతాయి. ఈలెక్కన 81 గొర్రెలకు 2,430 కిలోల మాంసం అవుతుంది. దీన్ని కిలో రూ. 250 చొప్పున విక్రయిస్తే రూ. 6లక్షల 7వేల 5వందలు వస్తాయి. ఇందులో నుంచి పెట్టుబడి రూ.3లక్షల 12వేలు తీసివేస్తే.. రూ.2లక్షల 95వేల 5వందలు మిగులుతాయి. ఇది 8 నెలల ఆదాయం. -
పత్తిలో బోరాన్ లోపం
పర్చూరు : పత్తి పంటలో బోరాన్ లోపం ఎక్కువగా ఉందని ఒంగోలు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త జీ రమేష్ తెలిపారు. పర్చూరు మండలంలోని నూతలపాడు, పర్చూరు, నాగులపాలెం, బోడవాడ, ఉప్పుటూరు గ్రామాల్లో పత్తి, పొగాకు, మిరప పంటలను ఆయన బుధవారం పరిశీలించారు. పంటలను ఆశించిన తెగుళ్లను ఎలా నివారించుకోవాలో శాస్త్రవేత్త రమేష్ రైతులకు వివరించారు. ‘పత్తిలో బోరాన్ లోపాన్ని అధిగమించేందుకు బోరాక్స్ లేదా ఫార్ములా 4 మందును 1.5 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చే యాలి. రసం పీల్చే పురుగులు ఉధృతంగా ఉన్నాయి. వాటి నివారణకు అక్తరా లేదాప్త్రెడ్ 100 మి.లీ మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. మిరపలో ఆకుమచ్చ తెగులు, తెల్లదోమ ఎక్కువగా ఉంది. ఆకు మచ్చతెగులు నివారణకు స్కోర్ 100 మి.లీ లేదా సాఫ్ పావు కిలో మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చే సుకోవాలి. తెల్లదోమ నివారణకు ట్త్రెజోఫాస్ పావు లీటరు+నువాన్ 200 మి.లీ మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. మిరపలో పైముడత నివారణకు ఇమిడా ఒక మి.లీ మందును లీటరు నీటికి, కింది ముడత నివారణకు ఓమైట్ 2 మి.లీ మందును లీటరు నీటికి కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. మినుములో పల్లాకు తెగులు సోకిన మొక్కలను తొలగించాలి. పల్లాకు తెగులు ఉధృతంగా ఉంటే ట్త్రెజోఫాస్ లేదా నువాన్ను అధికారుల సూచన మేరకు పిచికారీ చేయాలి. పొగాకులో లద్దెపురుగు నివారణకు లార్విన్ లేదా రీమాన్ పావు లీటరు మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. పంటల పరిశీలనలో ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ వరప్రసాద్, పర్చూరు ఏడీఏ కే కన్నయ్య, ఏఓ గౌతమ్ ప్రసన్న, టెక్నికల్ ఏఓ సుమతి పాల్గొన్నారు.