ఉల్లిపైనే ఆశలు!
ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు.. తల్లికూడా చేయదంటారు. అంటే దీన్ని తీసుకోవడం ఎంత ఆరోగ్యదాయకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిల్లాలోనే ఈ పంట సాగుకు పేరుగాంచినది మనూరు మండలం. ఇక్కడ చాలా మంది రైతులు ప్రతిఏటా ఉల్లిని విస్తారంగా పండిస్తారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా సంప్రదాయంగా ఇది కొనసాగుతోంది. ప్రతీ గ్రామంలో 100 హెక్టార్లకుపైగానే ఈ పంట సాగవుతోంది. అయితే దీని సాగులో పాటించాల్సిన మెలకువలు, జాగ్రత్తలపై ఏఓ శ్రీనివాస్‌రెడ్డి (సెల్: 9676606020) అందించిన సలహాలు, సూచనలు...
పంట సాగుకు ముందు విత్తనశుద్ధిని విధిగా పాటించాలి.
దీనివల్ల చీడపీడల నుంచి రక్షణ పొందవచ్చు.
కిలో విత్తనానికి 1గ్రాము కొర్బండిజం, 2.5గ్రాముల మ్యాంగోజబ్‌ను కలిపి శుద్ధి చేసుకోవాలి.
ఉల్లినారు వేసే సమయంలో 20 నుంచి 30 రోజుల ముందు ఒక్క అంగుళం ఎత్తులో మట్టి బెడ్డును ఏర్పాటు చేసుకోవాలి.
ఈ బెడ్డు 10 నుంచి 15గజాల పొడవు ఉండాలి.
బెడ్డుపైన ఆకులు, అములు వంటి చెత్త వేసి కాల్చివేయాలి. దీంతో బెడ్డుపైన ఉన్న శిలీంద్రాలు, బ్యాక్టీరియా చనిపోతాయి.
అనంతరం బెడ్డును నీటితో తడిపి ఉల్లి విత్తనాలు చల్లుకోవాలి.
ఒక్క ఎకరాకు నాలుగు కిలోల ఉల్లి విత్తనాలు వేసుకోవాల్సి ఉంటుంది.
పైన పేర్కొన్న విధంగా ఎన్ని ఎకరాలు వేస్తే అన్ని బెడ్లు వేసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో నారుకు నీటి తడులు అందించాలి.
సాగు నేలను సిద్ధం చేసుకోండిలా...
ఉల్లినారు చేతికి వచ్చిన సమయంలో సాగు నేలను సిద్ధం చేసుకోవాలి.
ఇందులో భాగంగా ఒక్క ఎకరాకు ఒక కిలో డీఏపీ, 30 కిలోల పొటాష్, 25 కిలోల యూరియా చల్లిన తరువాత భూమిని చదనుగా దున్ని మడులను సిద్ధం చేసుకోవాలి.
నాట్లు వేసే ఒకరోజు ముందు మడులను నీటితో తడపాలి.
అనంతరం నారును నాటేయాలి. 5 నుంచి 7 రోజుల అనంతరం మడులలో నెర్రెలుబారిన తర్వాత తిరిగి నీటిని వదలాలి.
కలుపు నివారణ
పంట నాటిన తర్వాత 20 నుంచి 25 రోజుల అనంతరం మొదటి కలుపు తీయాలి.
కలుపు నివారణకు గాను ఎకరాకు 200 మిల్లీలీటర్ల ఆక్సాడయాక్సిన్‌ను పిచికారీ చేసుకోవాలి.
ఈ మందు పిచికారీ చేసే సమయంలో భూమి తేమగా ఉండాలి.
అనంతరం 30 నుంచి 35 రోజుల మధ్య రెండోసారి కలుపు తీసి ఎకరాకు 35 కిలోల యూరియా చల్లి నీటిని అందించాలి.
40 నుంచి 45 రోజుల్లో మూడోసారి కలుపు తీసి 30 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ చల్లితే పంట ఏపుగా పెరుగుతుంది.
ప్రత్యేక జాగ్రత్తలు
90 రోజుల్లో పంట చేతికి వస్తుంది.
పంటను తీయడానికి వారం రోజుల ముందు మడులకు నీరు పారించొద్దు.
దీంతో ఉల్లిగడ్డ దిగుబడి, బరువు పెరుగుతుంది.
మళ్ల నుంచి తొలగించిన ఉల్లిని చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. లేక చెట్టు నీడ అయిన ఫర్వాలేదు. దీంతో ఉల్లి కుళ్లి పోకుండా ఉంటుంది.
వారం రోజుల్లో మార్కెట్‌కు తరలించుకోవచ్చు. లేకుంటే గిడ్డంగులకు తరలించి నిల్వ ఉంచుకోవచ్చు. మార్కెట్ రేటును బట్టి రైతులు ఉల్లిని విక్రయించుకోవచ్చు.
తెగుళ్ల నివారణ
ఉల్లి పంటకు రసం పీల్చే పురుగు బెడద ఉంటుంది.
దీని నివారణకు గాను ఎకరాకు 1లీటర్ నీటిలో 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ మందును కలిపి పిచికారీ చేయాలి. లేదా ఒక లీటరు నీటిలో 1మి.లీ. టిప్రోనిల్‌ను కలిపి స్ప్రే చేయాలి.
లీటరు నీటిలో 3గ్రాముల చొప్పున ఎం.45 మందును కలిపి కొట్టినా పురుగును నివారించవచ్చు.
రసం పీల్చే పురుగు బెడద మరీ ఎక్కువగా ఉంటే 30నుంచి 45రోజుల మధ్య 10లీటర్ల నీటిలో 6 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును స్ప్రేచేయాలి.
ఎకరా భూమిలో దాదాపు 80నుంచి 90 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వంద క్వింటాళ్ల వరకు తీయొచ్చు.