ఈ–నామ్ సర్వర్ పనిచేయక ఆలస్యంగా టెండర్లు
కర్నూలు మార్కెట్‌లో పంటను అమ్ముకోవాలంటే చుక్కలే
రోడ్లపైనే నిలిచిపోతున్న ఉల్లి లోడు వాహనాలు
రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డుల్లోనూ ఇదే సమస్య
పట్టించుకోని ప్రభుత్వం
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ–నామ్‌కు గ్రహణం పట్టింది. నాలుగు రోజులుగా సర్వర్ పనిచేయక వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు స్తంభించిపోయాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
గతంలో సాంకేతిక సమస్య ఏర్పడితే ఒకటి లేదా రెండు రోజుల్లో పరిష్కారమయ్యేది. తొలిసారి నాలుగు రోజులుగా సర్వర్ మొండికేయడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఈ–నామ్ సాంకేతిక సమస్య కారణంగా ఉల్లి మినహా ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి.
రేయింబవళ్లు యార్డుల్లోనే నిరీక్షణ
ప్రస్తుతం ఉల్లి ధరలు ఆశాజనకంగా ఉండటంతో వారం రోజుల ముందే పంటను కోసి రైతులు మార్కెట్‌కు తెస్తున్నారు. ఫలితంగా మార్కెట్‌కు ఉల్లి వెల్లువెత్తుతోంది. విక్రయాలు ఒకరోజు ఆలస్యమైతే ధర పడిపోతుందేమోనన్న భయం రైతులను వెంటాడుతోంది.
ఇదే సందర్భంలో ఈ–నామ్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా మాన్యువల్‌గా టెండర్లు వేస్తున్నారు. టెండర్లు వేసే ప్రక్రియ పూర్తయి.. ధరలు ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా పంటను అమ్ముకుని ఇంటికి వెళ్లాలంటే రైతులు రేయింబవళ్లు మార్కెట్ యార్డులోనే నిరీక్షించాల్సి వస్తోంది.
నిత్యం 20 వేల టన్నులు రాక
రాష్ట్రంలో ఉల్లి క్రయవిక్రయాలకు ఏకైక ఆధారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ మాత్రమే. పశి్చమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉల్లి క్రయవిక్రయాలు జరుగుతున్నా.. అది పూర్తిగా ప్రైవేట్ మార్కెట్. కర్నూలు మార్కెట్ ప్రభుత్వం అ«దీనంలో ఉన్నందున రైతులు 60 శాతం పంటను కర్నూలు మార్కెట్‌కే తీసుకొస్తారు.
ఉమ్మడి కర్నూలుతో పాటు అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికే ఉల్లిని తీసుకొచ్చి విక్రయిస్తారు. ఈ ఏడాది మొదటి నుంచి ఉల్లి ధరలు మెరుగ్గా ఉండటం వల్ల సాగు పెరిగింది. 2023 ఖరీప్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాఓ 39,431 ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా.. ఈ ఏడాది 43,875 ఎకరాల్లో సాగైంది. ఎకరాకు సగటున 5 టన్నుల చొప్పున ఈ ఏడాది 2,19,375 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా.
ఉల్లి పంటను కోసి రబీ పంటగా శనగ విత్తుకోవాలనే ప్రయత్నాల్లో రైతులు ఉన్నారు. మరోవైపు పెరిగిన ధర ఎక్కడ పడిపోతుందోనన్న భయంతో వారం, 10 రోజుల ముందుగానే పంటను కోసి మార్కెట్‌కు తెస్తున్నారు. దీంతో కర్నూలు మార్కెట్‌కు ఉల్లి పోటెత్తుతోంది. రికార్డు స్థాయిలో రోజుకు 20 వేల క్వింటాళ్లు వస్తుండటం విశేషం. గతంలో అత్యధికంగా రోజుకు 8 వేల క్వింటాళ్ల వరకే వచ్చేది.
ఎటూ చూసినా ఉల్లి వాహనాలే
మార్కెట్ యార్డు విస్తీర్ణం 26 ఎకరాలు. మార్కెట్ మొత్తం ఉల్లి పంటతో నిండిపోయింది. మ్యాన్యువల్ టెండర్ల కారణంగా ధరల నిర్ణయం ఆలస్యమవుతోంది. కాటాల్లోనూ జాప్యం జరుగుతోంది. కొనుగోలు చేసిన ఉల్లిని బయటకు తరలించేందుకు తగినన్ని లారీలు లభ్యం కావడం లేదు. దీంతో యార్డులోని స్థలమంతా ఉల్లి వాహనాలతో నిండిపోయింది.
అమ్ముకోవడానికి తెచ్చిన ఉల్లి వాహనాలు రోడ్లపైనే నిలిచిపోతున్నాయి. అన్ని ప్రధాన రహదారుల్లో కిలోమీటర్‌కు పైగా ఉల్లి వాహనాలు బారులు తీరి ఉండిపోతున్నాయి. ఆ వాహనాలు అతి కష్టం మీద మార్కెట్‌లోకి వెళితే స్థలం దొరకడం లేదు. మరోవైపు అన్‌లోడ్ చేయడానికి హమాలీలు ఉండటం లేదు. పంటను అమ్ముకోవాలంటే తలప్రాణం తోకకు వస్తోందని రైతులు వాపోతున్నారు.
రాష్ట్రమంతటా ఈ–నామ్ సమస్యే
గతంలో ఈ–నామ్‌లో ఎటువంటి సమస్య ఏర్పడినా యుద్ధప్రాతిపదిక పరిష్కరించేవారు. తొలిసారిగా రోజుల తరబడి సాంకేతిక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ సమస్య ఒక్క కర్నూలు మార్కెట్‌కే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లతోపాటు దేశవ్యాప్తంగా ఈ–నామ్ విధానం అమలవుతున్న అన్ని మార్కెట్లలో ఇదే సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వాలు మొద్దు నిద్ర నటిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే తొలిసారి
ఈ–నామ్ అమల్లోకి వచ్చి ఏళ్లు గడుస్తోంది. ఎప్పుడు సమస్య వచ్చినా ఒకటి, ఒకటిన్నర రోజుల్లోనే పరిష్కారమయ్యేది. మొదటిసారిగా రోజుల తరబడి సమస్య ఉండిపోయింది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే. ఇది రైతులకు శాపంగా మారింది. ఉల్లి మినహా అన్నిరకాల పంట క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఇది రైతులకు ఇబ్బందిగా మారింది. – కట్టా శేఖర్, అధ్యక్షుడు, కమీషన్ ఏజెంట్ల సంఘం, కర్నూలు
రైతులకు నరకమే
పంటను అమ్ముకోవడానికి వచ్చిన రైతులకు నరకం చూపిస్తున్నారు. పంటను ఆమ్ముకునేందుకు వస్తే.. మార్కెట్‌లోకి ప్రవేశించేందుకే తల ప్రాణం తోకకు వస్తోంది. ఈ–నామ్ సర్వర్ పనిచేయకపోవడంతో మ్యాన్యువల్‌గా టెండర్ వేయడం వల్ల ఆలస్యమవుతోంది. ధరలను ప్రకటించే సరికి సాయంత్రమైంది. పంటను అమ్ముకుని ఇంటికి వెళ్లేది ఎప్పుడో తెలియడం లేదు. సర్వర్ సమస్య ఏర్పడినపుడు సత్వరం పరిష్కరించేందుకు యంత్రాంగం ఉండాలి. – తిప్పారెడ్డి, బేతపల్లి, దేవనకొండ మండలం
Comments
Please login to add a commentAdd a comment