బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.60
రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం
ఐదేళ్ల తరువాత భారీగా పెరిగిన ఉల్లి ధరలు
2022–23లో కర్నూలు జిల్లాలో 26,970
హెక్టార్లలో సాగు.. ఈ ఏడాది 8,153 హెక్టార్లతో సరి
వర్షాభావంతో గణనీయంగా పడిపోయిన విస్తీర్ణం
కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులలో ఉల్లి సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోవడం.. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అధిక వర్షాలకు పంట దెబ్బతినడం.. ఇతర దేశాలకు ఎగుమతులు పెరగడం వంటి పరిస్థితుల్లో ఉల్లి ధరలు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ఇప్పటికే రిటైల్ మార్కెట్లో రూ. 60కి పైగా ధర పలుకుతుండటంతో ఉల్లి కొనాలంటే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.
రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు నిషేధించి ధరలు తగ్గేలా కేంద్రం చర్యలు తీసుకోవడంతో పాటు నాఫెడ్ ఆధ్వర్యంలోని నిల్వలను కూడా మార్కెట్‌లోకి పంపితేనే ధరలు తగ్గు ముఖం పడతాయంటున్నారు.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణంలో ఉల్లి సాగవుతోంది. ఖరీఫ్, రబీ సీజన్లలో ఏటా 87,500 ఎకరాల్లో ఇక్కడి రైతులు ఉల్లి సాగు చేస్తుండగా.. 5.25 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఇప్పటివరకు కేవలం 20,382 ఎకరాల్లోనే ఉల్లి సాగు చేస్తుండగా.. ఐదేళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. దీంతో ఉత్పత్తి కూడా తగ్గుతోంది. రైతుల నుంచి మార్కెట్ యార్డుకు ఉల్లి రావడం భారీగా తగ్గింది.
నాలుగు రాష్ట్రాల్లో దెబ్బతిన్న పంట
ఉల్లి ధరలు పెరగడానికి మహారాష్ట్రలో గత నెలలో కురిసిన భారీ వర్షాలే కారణమని తెలుస్తోంది. జూలై 24, 25 తేదీల్లో కురిసిన వర్షాలకు ఆ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 50 శాతం పంట నష్టం వాటిల్లింది. ఒక్క నాసిక్ జిల్లాలోనే 48 వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేస్తారు. కేవలం ఆ జిల్లానుంచే సుమారు 7 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోంది. కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఉల్లి ఎక్కువగా సాగవుతుంది.
జూలై మూడు, నాలుగో వారంలో కురిసిన వర్షాలకు ఆ రాష్ట్రాల్లోనూ పంట బాగా దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఉల్లిలో తేమ శాతం, ఘాటు ఎక్కువ. వీటిని ఎక్కువ కాలం నిల్వ చేస్తే కుళ్లిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఏపీలో పండే ఉల్లిని ఉత్తర భారతదేశంలో పెద్దగా ఇష్టపడరు. అందుకే ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఈ ఉల్లిని విక్రయిస్తారు.
మిగిలిన రాష్ట్రాల్లో పండించే ఉల్లిలో తేమ శాతం, ఘాటు తక్కువ. వాటిని ఏడాది నుంచి రెండేళ్లపాటు నిల్వ చేయొచ్చు. అందుకే ఈ ఉల్లిని దేశీయంగా వినియోగించడంతోపాటు బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఏపీలో వర్షాభావంతో సాగు విస్తీర్ణం తగ్గిపోగా.. ఉత్తర భారతదేశంలో వర్షాలతో పంట దిగుబడులు తగ్గాయి. దీంతో మార్కెట్‌కు ఉల్లి రావడం లేదు. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి.
రూ.5 వేలకు చేరే అవకాశం
ఈ ఏడాది మే నెలలో క్వింటాల్ ఉల్లి ధర కనిష్టంగా రూ.316 ఉంటే.. గరిష్టంగా రూ.1,617 పలికింది. ప్రస్తుతం ఆ ధర రూ.3,700కు పెరిగింది. మార్కెట్లో నిల్వలు తగ్గిపోతుండటంతో సెప్టెంబరులో ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.4,500–రూ.5 వేల వరకూ చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
50 శాతం కొనుగోళ్లు తాడేపల్లిగూడెం నుంచే..
కర్నూలులో ఉత్పత్తి అయ్యే పంటలో 20 శాతం మాత్రమే కర్నూలు మార్కెట్ యార్డులో అమ్మకాలు జరుగుతాయి. మిగిలిన 80 శాతం పంటను తాడేపల్లిగూడెం, హైదరాబాద్, చెన్నైతో పాటు ఇతర రాష్ట్రాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. ఇక్కడ దళారులను నియమించుకుని, వారి ద్వారా రైతులకు ముందుగానే అప్పులు ఇచ్చి, పంట చేతికి రాగానే మార్కెట్ ధల ప్రకారం తమకే విక్రయించాలని ఒప్పందం చేసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వ్యాపారులు కర్నూలులో ఉత్పత్తి అయ్యే పంటలో 50 శాతం కొనుగోలు చేస్తారు. అక్కడి ప్రైవేట్ మార్కెట్‌లో విక్రయాలు సాగించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.
ఎగుమతులపై నిషేధం విధిస్తేనే ధరలకు కళ్లెం
ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం ముందస్తు చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఏర్పడింది. భారత్ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు ఉల్లిని దిగుమతి చేసుకుంటాయి. ప్రస్తుతం శ్రీలంకలో కిలో ఉల్లి రూ.120 నుంచి రూ.150 వరకూ ధర పలుకుతోంది. ఈ క్రమంలో ఎగుమతులు నిషేధించడంతో పాటు నాఫెడ్‌లోని నిల్వలను కేంద్రం మార్కెట్‌లోకి విడుదల చేస్తే ధరలు దిగొస్తాయని వ్యాపారులు చెబుతున్నారు.
2019లోఎన్నడూ లేనివిధంగా ఉల్లి ధర క్వింటాల్ రూ.13,010 పలికింది. అప్పట్లో రిటైల్‌లో కిలో ఉల్లి రూ.150కి చేరింది. వినియోగదారులు ఇబ్బంది పడకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేసి రైతు బజార్లలో కిలో రూ.25కే విక్రయించింది. ఇప్పుడు కూడా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వం రైతు బజార్లలో కిలో రూ.25కే విక్రయించాలని వినియోగదారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment