kharif
-
మెరిసిన వరి రైతు... మునిగిన పత్తి రైతు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆలోచన మారుతోంది. కష్టంతో కూడుకున్న వాణిజ్య పంటల కంటే సంప్రదాయ వరి సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులతో పెరిగిన సాగునీటి వనరులతోపాటు కష్టం, ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ అనే ఉద్దేశంతో వరి వైపు మళ్లుతున్నారు. దీనితో ఏటేటా రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరితోపాటు పత్తి కూడా ప్రధాన పంటగా కొనసాగుతోంది. కానీ పత్తి ధరలు పడిపోతుండటం, దాని సాగు ఖర్చు ఎక్కువగా ఉండటంతో ఆ రైతులు మెల్లగా వరి సాగు చేపడుతున్నారని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. పదేళ్ల క్రితం వరకు కరీంనగర్, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో సాగునీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో ఎక్కువగా పత్తిసాగు చేసేవారు. ఇప్పుడీ ప్రాంతాల్లో పత్తి తగ్గిపోయి, వరి పెరిగింది. ప్రస్తుతం నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో అధికంగా.. ఖమ్మం, వరంగల్‌లలో ఓ మోస్తరుగా పత్తి సాగు జరుగుతోంది. కానీ భవిష్యత్తులో ఈ జిల్లాల్లోనూ సాగు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి మాత్రమేకాకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు పట్ల కూడా రైతుల్లో ఆసక్తి తగ్గుతోందని పేర్కొంటున్నారు. ఈ ఏడాది మునిగిన పత్తి రైతు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 43.76 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 2022 సంవత్సరంతో పోలిస్తే ఇది సుమారు 7 లక్షల ఎకరాల మేర తక్కువ. కేంద్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్ధతు ధర రూ.7,521గా నిర్ణయించింది. కానీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహించడంతో రైతుకు గిట్టుబాటు ధర అందలేదు. సెప్టెంబర్ లో కురిసిన వర్షాలు, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పంట దిగుబడి కూడా తగ్గింది. పైగా పత్తి ధర తగ్గడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. రాష్ట్రంలోని పలు వ్యవసాయ మార్కెట్లలో పత్తి క్వింటాల్‌కు రూ.5,300 నుంచి రూ.7,000 వరకు మాత్రమే ధర పలికింది. దేశంలోనే మూడో స్థానం ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా 2.74 కోట్ల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. అత్యధిక సాగులో మహారాష్ట్ర, గుజరాత్ తొలి రెండు స్థానాల్లో.. తెలంగాణ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 1.60 కోట్ల టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. అందులో తెలంగాణలో 25.33 లక్షల టన్నుల మేర వస్తుందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఇన్నాళ్లూ ఒక ఏడాది ధర గిట్టుబాటు కాకపోయినా.. మరుసటి ఏడాదైనా అందుతుందన్న ఆశతో రైతులు పత్తి సాగును కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ గత రెండు, మూడేళ్లుగా తెలంగాణ రైతులు పత్తికి బదులు ఇతర పంటల వైపు చూస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.వరి దిగుబడి పెరగడంతో ఆనందం ఈ ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులకు వాతావరణం కూడా కలసి వచ్చి0ది. రాష్ట్రంలో సుమారు 66 లక్షల ఎకరాల్లో వరిసాగవగా.. అందులో 40 లక్షల ఎకరాల్లో సన్న రకాలు, 26 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు వేశారు. వరి కోతకు వచ్చే వరకు అకాల వర్షాల బాధలేకపోవడం, గతంతో పోలిస్తే చీడ, పీడలు, తెగుళ్లు తక్కువగా ఉండటంతో ఈసారి వరి దిగుబడి భారీగా పెరిగింది. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం వరి దిగుబడి 150 లక్షల మెట్రిక్ టన్నులకుపైనే. వరికి మద్దతు ధర రూ.2,320కాగా... నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో మేలు రకం సన్న ధాన్యాన్ని రూ.2,500 నుంచి రూ.3,000 ధరతో మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు చేశారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా బియ్యానికి పెరిగిన డిమాండ్‌తో ధరలు పెరిగాయి. ఇక 70 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కనీస మద్ధతు ధరకు తీసుకుంటుండటం, గతంలో కన్నా దిగుబడి పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రాలకు వచ్చే సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామనడంపైనా హర్షం వ్యక్తమవుతోంది. -
దిక్కులు చూస్తున్న దుక్కులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తీవ్ర ఒడిదుడుకుల మధ్య రైతన్నలు ఖరీఫ్ సాగు చేపట్టగా ముందస్తు రబీ ఏర్పాట్లు మందకొడిగా సాగుతున్నాయి. రైతన్న చేతికి ఇంతవరకూ పెట్టుబడి సాయం అందకపోవడం.. డిమాండ్ మేరకు విత్తనాలు, ఎరువులను సమకూర్చకపోవడం, ఇన్నాళ్లూ చేయి పట్టి నడిపించిన ఆర్బీకేలను ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దీనికి కారణం. ఒకపక్క ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి..! కానీ రెండో పంటకు నీరు అందుతుందనే భరోసాను ప్రభుత్వం కల్పించకపోవడంతో రైతన్న కదం తొక్కుతున్నాడు!! ప్రకృతి వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతల ఆశలను నీరుగార్చేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఖరీఫ్ సాగు ఆలస్యం కావడంతో ఆ ప్రభావం రబీ పంటల సాగుపై పడింది. గతేడాది ఈపాటికి 40 శాతానికి పైగా కోతలు పూర్తి కాగా ఈ ఏడాది 5–10 శాతం కూడా పూర్తి కాని పరిస్థితి నెలకొంది. రబీ సాగు కోసం ముందస్తుగా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. రెండో పంటకు నీరివ్వడంపై సర్కారు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో కృష్ణా జిల్లా సహా పలు చోట్ల రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది కనిష్టంగా సాగు..ఈ ఏడాది పెట్టుబడి సాయం లేక, సకాలంలో విత్తనం అందక, ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పించే నాథుడు లేక రబీ సాగు నత్తనడకన సాగుతోంది. 3.65 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని జిల్లాల నుంచి ఇండెంట్ రాగా ఇప్పటి వరకు కేవలం 1.41 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పొజిషన్ చేయగలిగారు. వాటిలో 1.12 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు సరఫరా చేశారు. ప్రధానంగా 2.64 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనం కావాలని రైతులు కోరగా 1.10 లక్షల విత్తనాన్ని మాత్రమే సరఫరా చేశారు. దీంతో ముందస్తు రబీ సాగు జరగని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది నవంబర్ 11 నాటికి అత్యల్పంగా 4.65 లక్షల ఎకరాల్లో మాత్రమే రబీ ప్రధాన పంటల సాగు కావడమే ఇందుకు నిదర్శనం. ఇదే పరిస్థితి కొనసాగితే సీజన్ ముగిసే నాటికి కనిష్ట స్థాయిలో రబీ పంటల సాగు నమోదయ్యే ప్రమాదం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఐదేళ్లూ.. సాధారణం కంటే మిన్నగారబీ సాధారణ సాగు విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది సాగు లక్ష్యం 57.50 లక్షల ఎకరాలు. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో కూడా 8.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాది రబీ సీజన్ ప్రారంభంలో వర్షాలు, వరదలతో నారుమళ్లు దెబ్బతిన్నప్పటికీ 80 శాతం సబ్సిడీపై వైఎస్ జగన్ ప్రభుత్వం విత్తనాలను సమకూర్చింది. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడం, సీజన్‌కు ముందుగానే పెట్టుబడి సాయంతో పాటు ఖరీఫ్‌లో దెబ్బతిన్న పంటలకు పంట నష్టపరిహారం అందించడం లాంటి చర్యల కారణంగా రైతులు రబీ సాగుకు ముందుకొచ్చారు. నవంబర్ 10వ తేదీ నాటికి 2019–20లో 18.45 లక్షల ఎకరాలు, 2020–21లో 15.85 లక్షల ఎకరాలు, 2022–23లో 16.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో విఫలంఖరీఫ్ సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలు కాగా ఈసారి అతి కష్టంమ్మీద 70 లక్షల ఎకరాల్లో సాగైంది. దాదాపు 16 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాని దుస్థితి నెలకొంది. సాగైన చోట్ల కూడా వర్షాలు, వరదలు, వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వానికి కొరవడిన ముందు చూపు కారణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక విఫలమైంది. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులు ముందస్తు రబీకి సిద్ధమైనప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన సహకారం లభించకపోవడంతో రెండో పంట సాగు కోసం దిక్కులు చూస్తున్నారు. -
మిల్లర్ల కతలు.. రైతుల వెతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు రైస్‌మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29న ప్రకటించిన ఖరీఫ్ ధాన్యం సేకరణ పాలసీ తమను నష్టాల పాలు చేస్తుందని వారు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దీనితో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం పడింది. కొనుగోలు కేంద్రాల్లోనే భారీగా ధాన్యం పోగుపడుతోంది. అకాల వర్షాలతో ఆ ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఏం చేయాలో పాలుపోక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. మిల్లర్ల విజ్ఞప్తులను తోసిపుచ్చడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎంఆర్ పాలసీ విషయంలో మిల్లర్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శలున్నాయి. సన్న ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయడానికి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ‘ఔటర్న్’ను సవరించాలని మిల్లర్లు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనితోపాటు మిల్లులు తమకు కేటాయించే ధాన్యానికి బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ముడి బియ్యం మిల్లర్లు పోరుబాట పట్టారు. నిజానికి ధాన్యం సేకరణ పాలసీ ప్రకటించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల మొదటి వారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. పరిశీలన జరిపిన ఉప సంఘం గత నెలాఖరులో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో ధాన్యం సేకరణ, రైతులకు బోనస్, అధికారుల బాధ్యతలను పేర్కొన్న సర్కారు.. మిల్లర్ల డిమాండ్లను పట్టించుకోలేదు. ‘ఔటర్న్’ తగ్గించాలనే డిమాండ్.. ఒక క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు వచ్చే బియ్యం, నూకల లెక్కను ‘ఔటర్న్’ అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఔటర్న్ ప్రకారం.. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) విధానం కింద మిల్లర్లకు చేరే ప్రతి 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, ఇతర అంశాల నేపథ్యంలో.. బియ్యం తక్కువగా వస్తుందని, నూకలు ఎక్కువగా వస్తాయని మిల్లర్లు చెప్తున్నారు. చాలా జిల్లాల్లో ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేస్తే.. 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు కలిపి 67 కిలోలు వస్తాయని వారు ప్రభుత్వంతో చర్చల సందర్భంగా వివరించారు. తమకు నష్టం కలిగించే ఈ ఔటర్న్ లెక్కను సరిదిద్దాలని కోరారు. మధ్యేమార్గంగా 62 కిలోల ఔటర్న్ నిర్ణయిస్తే.. నూకలను విక్రయించి, బియ్యన్నే అదనంగా ఎఫ్‌సీఐకి ఇస్తామని చెప్పారు. కానీ మిల్లర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. బ్యాంకు గ్యారంటీలపై విముఖత గతంలో ప్రభుత్వం మిల్లులకు నేరుగా ధాన్యాన్ని కేటాయించి, వారి నుంచి బియ్యాన్ని తీసుకునేది. ధాన్యం ఇచ్చినందుకు ఎలాంటి గ్యారంటీ అడిగేది కాదు. అయితే 2022–23 రబీలో మిల్లర్లు ధాన్యం మిల్లింగ్ చేయలేదంటూ సీఎంఆర్ బియ్యాన్ని పూర్తిగా అప్పగించలేదు. సుమారు రూ.7 వేల కోట్ల విలువైన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రికవరీ చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగు సంస్థలకు టెండర్లు ఇచ్చింది. అయినా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లేదా ఆ మేర విలువను మాత్రమే రికవరీ చేయగలిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ధాన్యం కేటాయింపుకోసం మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం తప్పనిసరి అని కొత్త పాలసీలో పొందుపరిచింది. ఇందులో కూడా నాలుగు కేటగిరీలను నిర్ణయించింది. గడువులోగా సీఎంఆర్ అప్పగిస్తూ, ఇప్పటివరకు డీఫాల్ట్ కాని మిల్లర్లకు కేటాయించే ధాన్యం విలువలో 10 శాతం బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటారు. అలాంటి మిల్లులు అతి తక్కువని సమాచారం. ఇక డీఫాల్ట్ అయి పెనాల్టీతో సహా సీఎంఆర్ అప్పగించిన మిల్లర్ల నుంచి 20శాతం, పెనాల్టీ పెండింగ్‌లో ఉన్న మిల్లర్ల నుంచి 25శాతం బ్యాంక్ గ్యారంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకుంటారు. మిల్లుల్లో ధాన్యం లేని, సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లను నాలుగో కేటగిరీగా నిర్ణయించి.. ధాన్యం కేటాయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నాలుగో కేటగిరీలో సుమారు 300 మంది మిల్లర్లు ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ బ్యాంకు గ్యారంటీ షరతులకు ముడి బియ్యం మిల్లర్లు అంగీకరించడం లేదు. దీనితో అధికారులు ఇప్పటికిప్పుడు కాకపోయినా 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని మిల్లర్ల నుంచి ‘అండర్ టేకింగ్’ తీసుకుంటూ ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. అండర్ టేకింగ్ ఇచ్చిన మిల్లర్లు తర్వాత తప్పనిసరిగా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి మిల్లర్లు ముందుకురావడం లేదని తెలిసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాల్లో అధికారులు రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని గోదాములకు పంపిస్తున్నారు. మిల్లింగ్ చార్జీల పెంపుపైనా అసంతృప్తి.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కస్టమ్ మిల్లింగ్ చార్జీలు క్వింటాల్‌కు రూ.110 నుంచి రూ.200 వరకు ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దొడ్డురకాలకు రూ.40, సన్నరకాలకు రూ.50కి మాత్రమే చార్జీలు పెంచిందని మిల్లర్లు అంటున్నారు. ఈ చార్జీలను కూడా సకాలంలో ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇచ్చిన బియ్యానికి మాత్రమే లెక్కకట్టి ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. ఇచ్చే అరకొర చార్జీలకు కూడా కోతలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.రూ.500 బోనస్, రేషన్‌షాపులకు సన్న బియ్యం ఎలా? రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రైతులు రాష్ట్రంలో భారీ ఎత్తున సన్నరకాల వరి సాగు చేశారని వ్యవసాయ శాఖ ప్రకటించింది. రైతుల సొంత అవసరాలు, బహిరంగ మార్కెట్లో విక్రయించే ధాన్యం పోగా.. కొనుగోలు కేంద్రాలకు ఏకంగా 50 లక్షల టన్నుల సన్నధాన్యం, 30 లక్షల టన్నుల వరకు దొడ్డు ధాన్యం వస్తుందని పౌర సరఫరాల సంస్థ అంచనా వేసింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్నధాన్యాన్ని మిల్లింగ్ చేయించి, ఆ సన్న బియ్యాన్ని జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. అలా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్న ధాన్యానికి సంబంధించి క్వింటాల్‌కు రూ.500 చొప్పున రైతులకు నేరుగా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కూడా. అయితే కొనుగోలు కేంద్రాలకు సన్నధాన్యం రాకపోవడం, మిల్లర్ల లొల్లి నేపథ్యంలో.. రైతులకు బోనస్ అందడం, రేషన్‌షాపుల్లో సన్న బియ్యం సరఫరా పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారాయి.రేపు రైస్ మిల్లర్ల భేటీ ఖరీఫ్ ధాన్యం మిల్లింగ్ సమస్యల విషయంలో చర్చించేందుకు రైస్ మిల్లర్లు మంగళవారం రోజున సమావేశం కానున్నారు. యాదాద్రి జిల్లా ఘట్కేసర్లో నిర్వహించే ఈ భేటీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రా, బాయిల్డ్ రైస్‌మిల్లుల నిర్వాహకులు హాజరుకావాలని రా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని తెలిపారు. నామమాత్రంగానే కొనుగోళ్లు రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నప్పటికీ.. ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లు బాగా తక్కువగా ఉండటం గమనార్హం. ఈ సీజన్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు కేవలం 20వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. అంతేకాదు ఇది కూడా దొడ్డురకం ధాన్యమేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. సన్నరకాల ధాన్యం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. కొనుగోళ్లు సరిగా లేక రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతున్నాయి. నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు తమ వంతు ఎప్పుడు వస్తుందో తెలియక పడిగాపులు పడుతున్నారు. ఇటీవలి అకాల వర్షానికి పెద్దపల్లి జిల్లాలో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. -
AP: 54 కరువు మండలాలు ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దుర్భిక్షం మొదలైంది. వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది. రాష్ట్రంలోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో నంబరు 15 జారీచేసింది. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ఈ మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపింది. 27 మండలాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు, 27 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. కలెక్టర్లు ఆయా జిల్లా గెజిట్లలో కరువు మండలాలను నోటిఫై చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. రాష్ట్రంలో తీవ్ర కరువు మండలాలు అనంతపురం జిల్లా: నార్పల, అనంతపురం శ్రీసత్యసాయి జిల్లా: తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపుల అన్నమయ్య జిల్లా: గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లె, టి సుండుపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, వీరబల్లె, తంబళ్లపల్లె, గుర్రంకొండ, కలకడ, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కురుబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లె.చిత్తూరు జిల్లా: పెనుమూరు, యాదమర్రి, గుడిపాల.కరువు మండలాలు కర్నూలు జిల్లా: కౌతాలం, పెద్దకడుబూరుఅనంతపురం జిల్లా: విడపనకల్, యాడికి, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, రాప్తాడు శ్రీసత్యసాయి జిల్లా: కనగానిపల్లి, ధర్మవరం, నంబుల పులకుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగి.చిత్తూరు జిల్లా: శ్రీరంగరాజపురం, చిత్తూరు, శాంతిపురం, రొంపిచర్ల, పూతలపట్టు, సోమల, పుంగనూరు, పలమనేరు, బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం. -
తగ్గిన ‘నానో’ ఎరువుల అమ్మకాలు
గత మూడేళ్లలో గణనీయంగా పెరిగిన నానో ఎరువుల అమ్మకాలు.. గత ఖరీఫ్ సీజన్ నుంచి భారీగా తగ్గాయి. సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా నానో బయోటెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో అభివృద్ధి చేసిన ఈ సూక్ష్మ ఎరువులను 2021లో భారత రైతులు ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) మార్కెట్లోకి తీసుకొచ్చింది. తొలుత యూరియా, ఆ తర్వాత నానో డీఏపీలను మార్కెట్లోకి తీసుకొచ్చిన ఇఫ్కో గత ఖరీఫ్ సీజన్ నుంచి నాలుగింతల నత్రజని (16 శాతం)తో సహా అధిక పోషక విలువలతో కూడిన నానో యూరియా ప్లస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వచ్చే సీజన్ నుంచి నానో జింక్, నానో కాపర్‌ను తీసుకొచ్చేందుకు సైతం ఏర్పాట్లు చేస్తోంది. – సాక్షి, అమరావతిఏపీలో తగ్గిన అమ్మకాలుగడచిన మూడేళ్లలో ఏపీలో ఇఫ్కో అవుట్‌లెట్స్‌తో పాటు ఆర్బీకేల ద్వారా 10.50 లక్షల బాటిళ్ల విక్రయాలు జరిగాయి. కాగా 2024–25 సీజన్ కోసం 10లక్షల నానో యూరియా, 4 లక్షల నానో డీఏపీ బాటిళ్లను ఇఫ్కో సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. వర్షాలు, వరదలు, వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్–2024లో అతికష్టమ్మీద 1.04లక్షల బాటిళ్ల నానో యూరియా ప్లస్, 48వేల నానో డీఏపీ బాటిళ్ల అమ్మకాలు జరిగాయి. కాగా వచ్చే రబీ సీజన్లో నానో యూరియా ప్లస్ 3లక్షల బాటిళ్లతో పాటు లక్ష బాటిళ్ల నానో డీఏపీని అందుబాటులో ఉంచేందుకు ఇఫ్కో ఏర్పాట్లు చేసింది. గడచిన మూడేళ్లుగా ఆర్బీకేల ద్వారా కూడా విక్రయాలు జరపగా, గడచిన ఖరీఫ్ సీజన్ నుంచి ఇఫ్కో అవుట్‌లెట్స్‌తో పాటు ఓపెన్ మార్కెట్ ద్వారా మాత్రమే నానో ఎరువులను అందుబాటులో ఉంచుతోంది. నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రైతులు, గ్రామీణ యువతకు కిసాన్ డ్రోన్స్ కూడా ఇస్తున్నారు. గతేడాది ఒక్కొక్కటి రూ.15లక్షల విలువైన ఈ వెహికల్తో కూడిన కిసాన్ డ్రోన్స్‌ను 75 మందికి అందజేశారు. ఈ ఏడాది మరో 70 మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.500 మిల్లీ లీటర్ల బాటిల్లో తీసుకొచ్చిన నానో యూరియా/డీఏపీలు 45 కిలోల సంప్రదాయ యూరియా, డీఏపీ బస్తాకు సమానం. బస్తా యూరియా ధర మార్కెట్లో రూ.266.50 ఉండగా, అదే పరిమాణంలో ఉన్న ఈ నానో యూరియాను రూ.225కే ఇఫ్కో అందుబాటులోకి తీసుకొచ్చింది. సంప్రదాయ డీఏపీ బస్తా మార్కెట్లో రూ.1,350 ఉండగా, నానో డీఏపీ బాటిల్ రూ.600కే తెచ్చింది. గడచిన మూడేళ్లలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా 2021–22 సీజన్లో 2.12 కోట్ల బాటిళ్లు, 2022–23లో 3.30 కోట్ల బాటిళ్ల అమ్మకాలు . దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల సాగు తగ్గడంతో 2023–24లో 2.04 కోట్ల నానో యూరియా, 44 లక్షల నానో డీఏపీ బాటిళ్ల విక్రయాలు జరిగాయి. 2024–25 సీజన్లో 4.60 కోట్ల నానో యూరియా, 2 కోట్ల నానో డీఏపీ బాటిళ్ల విక్రయాలు లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ఖరీఫ్ సీజన్లో కేవలం కోటి బాటిళ్ల నానో యూరియా ప్లస్, 43 లక్షల నానో డీఏపీ బాటిళ్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. తగ్గిన నానో విక్రయాలు.. -
ఖరీఫ్ ‘భరోసా’ బోల్తా
‘ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేం’.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం చేసిన ప్రకటన రైతులకు శరాఘాతమైంది. ఈ వానాకాలం సీజన్‌కు రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేసింది. – సాక్షి, హైదరాబాద్ ఆర్భాటంగా కేబినెట్ సబ్ కమిటీకాగా, జూలై 2వ తేదీన రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. అందులో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబులను సభ్యులుగా నియమించారు. అప్పటినుంచి 15 రోజుల్లోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వాలి. ఆ నివేదికపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. అసెంబ్లీ ఆమోదం తర్వాత మార్గదర్శకాలు జారీచేసి రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని సర్కారు ప్రకటించింది. సమావేశాలు పెట్టి.. అభిప్రాయాలు సేకరించి..జూలై 15వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. రైతు భరోసాపై అభిప్రాయాలు తీసుకున్నారు. ఆదిలాబాద్ సహా కొన్ని జిల్లాల్లోనూ అభిప్రాయాలు తీసుకున్నారు. జూలై 23వ తేదీ నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసా ఊసే ఎత్తలేదు. దీంతో మార్గదర్శకాలు ఖరారు కాలేదు. ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వబోమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం స్పష్టం చేయడంతో రైతులు కంగుతిన్నారు. రైతు భరోసాకు బదులుగా సన్న ధాన్యం పండించిన ప్రతి రైతుకు రూ.500 బోనస్ ఇస్తామని తుమ్మల ప్రకటించారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని తేల్చిచెప్పారు. కాగా, వరదలు, భారీ వర్షాలతో అన్నదాత కుదేలయ్యాడు. మరోవైపు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో లక్షలాది మంది రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేదు. ఖరీఫ్ ముగిసినా రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేస్తారన్న నమ్మకంతో రైతులున్నారు. చివరికి ఇలా జరగడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలక పథకానికి తొలి ఆటంకం..వాస్తవానికి సీజన్‌కు ముందే రైతు భరోసా ఇవ్వాలనేది పథకం ఉద్దేశం. రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు, కూలీల ఖర్చును పెట్టుబడి సాయం ద్వారా అందించాలన్నది దీని లక్ష్యం. 2018 నుంచి ఏటా రెండు సీజన్లలో నిరాటంకంగా కొనసాగిన ఈ పథకం ఈ వానాకాలం సీజన్లో మాత్రం తొలిసారిగా నిలిచిపోయింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పథకం ఆగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత యాసంగిలో రైతుబంధు పథకం కింద పాత పద్ధతిలోనే పెట్టుబడి సాయం చేశారు. కనీసం అలాగైనా ఈ వానాకాలం సీజన్‌కు ఇచ్చినా బాగుండేదని రైతులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా మొత్తాన్ని సీజన్‌కు ఎకరానికి రూ.7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇస్తామని చెప్పింది. ఈ వానాకాలం సీజన్ నుంచే అమలు చేస్తామని పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు నిబంధనలు పునఃసమీక్ష తర్వాత అర్హులకు రైతుభరోసా ఇస్తామని ప్రకటించింది. మార్గదర్శకాలు ఎలా ఉంటాయో..?ప్రభుత్వం ముఖ్యంగా రైతుభరోసాకు సీలింగ్ విధించాలన్న ఆలోచనలో ఉందని అంటున్నారు. అందరికీ కాకుండా ఐదు లేదా పదెకరాలకు దీనిని పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాగు చేసిన రైతులకు మాత్రమే ఇవ్వాలనేది ఉద్దేశం. గత యాసంగి సీజన్లో మొత్తం 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. అందులో ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మంది కాగా, వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుబంధు అందుకున్న వారిలో ఐదెకరాల్లోపు రైతులే 90.36 శాతం ఉండటం గమనార్హం.కాగా ఐదెకరాలకు పరిమితం చేస్తే 90 శాతం మందికి రైతుభరోసా ఇచ్చినట్లు అవుతుందనేది ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు. ఇక ఎకరాలోపున్న రైతులు 22.55 లక్షల మంది, ఎకరా నుంచి రెండెకరాల వరకున్న రైతులు 16.98 లక్షల మంది, రెండెకరాల నుంచి మూడెకరాల్లోపున్న వారు 10.89 లక్షల మంది, మూడెకరాల నుంచి నాలుగెకరాల్లోపున్న వారు 6.64 లక్షల మంది, నాలుగెకరాల నుంచి ఐదెకరాల్లోపున్న రైతులు 5.26 లక్షల మంది ఉన్నారు. ఇక 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య 5.72 లక్షల మంది కాగా.. వారి చేతిలో 31.04 లక్షల ఎకరాల భూమి ఉంది. పదెకరాల వరకు ఇస్తే, రైతు భరోసాకు వీరు కూడా తోడవుతారు. పీఎం కిసాన్ నిబంధనలను అమలు చేస్తే అనేక మందికి కోత పడుతుంది. భూములున్న ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు.. ఇలా చాలామందికి కోతపడే అవకాశాలున్నాయి. చివరికేం జరుగుతుందో చూడాలి. -
ఖరీఫ్ కుదేలు...సాగు.. బాగోలేదు
సాక్షి, అమరావతి: వ్యవసాయం దండగ అని చెప్పే చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో పంటల దుస్థితి ఏ విధంగా ఉంటుందో ఈ ఖరీఫ్ సీజన్ చెబుతోంది. చంద్రబాబు ప్రభుత్వం సాగులో రైతులకు అండగా ఉండకపోవడం.., విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించకపోవడం.., ఉన్న సౌకర్యాలను కూడా తొలగించడం, అతివృష్టి, అనావృష్టికి తగ్గట్లుగా పంటల ప్రణాళిక రచించకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయం దెబ్బతింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఓ వైపు అతివృష్టి, మరో వైపు అనావృష్టి అన్నదాతలను ఉక్కిరిబిక్కిరిచేయగా, వాటికి మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం వారిని కోలుకోలేని దెబ్బతీసింది. ఫలితంగా 85.65 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంతో ప్రారంభమైన ఈ సీజన్ చివరికి 69.70 లక్షల ఎకరాలకు పరిమితమైంది. ఎన్నడూ లేని రీతిలో 15.95 లక్షల ఎకరాలు సాగుకు దూరంగా ఉండిపోయాయి. ఆరు లక్షల ఎకరాల్లో పంటలు వర్షాలు, వరదలతో పనికిరాకుండా పోయాయి. వర్షాలు కురిసినా.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తొలకరిలో మంచి వర్షాలే కురవడంతో సాగుకు తిరుగుండదని రైతులు ఆశించారు. జూన్ నుంచి సెపె్టంబర్ మధ్య 574.70 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, రికార్డు స్థాయిలో 689 మిల్లీమీటర్లు కురిసింది. దీంతో రైతులు ఉత్సాహంగా పంటలు వేశారు. జూలై, సెపె్టంబర్లో భారీ వర్షాలు, వరదలతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరోపక్క తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాయలసీమలో రైతులను దెబ్బతీశాయి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకొనేందుకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, అందుకు తగిన సహకారంతో ముందుకు రావాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక లేకపోవడంతో లక్షలాది ఎకరాల్లో రైతులు సాగుకు దూరమయ్యారు. సాగైన ప్రాంతాల్లో సైతం ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చే పరిస్థితి లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు.లక్ష్యం కుదించినా.. సాగవని పంటలు గత ఏడాది సాగు కొంత తగ్గడంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు లక్ష్యాన్ని 89. 37 లక్షల ఎకరాల నుంచి 85.65 లక్షల ఎకరాలకు కుదించారు. అయినప్పటికీ లక్ష్యానికంటే తక్కువగా అతికష్టం మీద 69.71 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో సాగు లక్ష్యం 37.59 లక్షల ఎకరాలకు 24 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. ఒక్క జిల్లాలో కూడా లక్ష్యం మేరకు 100 శాతం విస్తీర్ణంలో పంటలు సాగవలేదు. ఖరీఫ్‌లో 39.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 34.62 లక్షల ఎకరాల్లోనే సాగైంది. రాష్ట్రవ్యాప్తంగా 4.88 లక్షల ఎకరాల్లో నాట్లే పడలేదు. వర్షాలు, వరదలకు మరో 5 లక్షల ఎకరాల్లో సాగైన పంట పూర్తిగా దెబ్బతింది. సజ్జలు, రాగులు, మొక్కజొన్న, కందులు, మినుము మాత్రమే ఆశాజనకంగా సాగయ్యాయి. ఆముదం, సోయాబీన్ మినహా ఇతర నూనె గింజలు, పత్తి సాగు గణనీయంగా తగ్గిపోయింది. మొత్తంగా ఆహార ధాన్యాల పంటలు 50 లక్షల ఎకరాల్లో, నూనె గింజలు 8.50 లక్షల ఎకరాల్లో, పత్తి 6.62 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. 167.15 లక్షల టన్నుల దిగుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. విస్తీర్ణం తగ్గడంతోపాటు వర్షాలు, వరదలు, తెగుళ్లతో 140 లక్షల టన్నులు కూడా రావడం కష్టమని అంచనా వేస్తున్నారు. ధాన్యం దిగుబడి లక్ష్యం 85.47 లక్షల టన్నులు కాగా, ఈసారి 70 లక్షల టన్నులు దాటదని చెబుతున్నారు. పత్తి, వేరుశనగ దిగుబడి సగానికి తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. రాయలసీమలో పరిస్థితి దయనీయం రాయలసీమ జిల్లాల్లో మెజార్టీ మండలాల్లో 60 రోజులకుపైగా చినుకు జాడలేదు. జూన్‌లో 7, జూలైలో 95, ఆగషు్టలో 76 మండలాల్లో లోటు వర్షపాతం నమోదయింది. జూలైలో 113 మండలాలు, ఆగస్టులో 244 మండలాల్లో వర్షాలే లేవు. దీంతో పంటల సాగు తగ్గిపోయింది. రాయలసీమలో 13.50 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన వేరుశనగ ప్రస్తుతం 6.25 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. 8 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన పత్తి 6 లక్షల ఎకరాలు మించలేదు. 4.39 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన వరి 3 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. ఇతర పంటల పరిస్థితీ ఇదే విధంగా ఉంది. సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల బోర్లన్నీ ఒట్టిపోయాయిు. ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సాగు దూరమైన చోట ప్రత్యామ్నాయ పంటలకు 70 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని అంచనా వేయగా, ప్రభుత్వం అతికష్టమ్మీద 24 వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేయగలిగింది. దీంతో రైతులకు ప్రత్యామ్నాయం కూడా లేకపోయింది. -
ఉల్లి రేటు.. మహా ఘాటు
కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులలో ఉల్లి సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోవడం.. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అధిక వర్షాలకు పంట దెబ్బతినడం.. ఇతర దేశాలకు ఎగుమతులు పెరగడం వంటి పరిస్థితుల్లో ఉల్లి ధరలు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ఇప్పటికే రిటైల్ మార్కెట్లో రూ. 60కి పైగా ధర పలుకుతుండటంతో ఉల్లి కొనాలంటే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు నిషేధించి ధరలు తగ్గేలా కేంద్రం చర్యలు తీసుకోవడంతో పాటు నాఫెడ్ ఆధ్వర్యంలోని నిల్వలను కూడా మార్కెట్లోకి పంపితేనే ధరలు తగ్గు ముఖం పడతాయంటున్నారు.సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణంలో ఉల్లి సాగవుతోంది. ఖరీఫ్, రబీ సీజన్లలో ఏటా 87,500 ఎకరాల్లో ఇక్కడి రైతులు ఉల్లి సాగు చేస్తుండగా.. 5.25 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఇప్పటివరకు కేవలం 20,382 ఎకరాల్లోనే ఉల్లి సాగు చేస్తుండగా.. ఐదేళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. దీంతో ఉత్పత్తి కూడా తగ్గుతోంది. రైతుల నుంచి మార్కెట్ యార్డుకు ఉల్లి రావడం భారీగా తగ్గింది. నాలుగు రాష్ట్రాల్లో దెబ్బతిన్న పంట ఉల్లి ధరలు పెరగడానికి మహారాష్ట్రలో గత నెలలో కురిసిన భారీ వర్షాలే కారణమని తెలుస్తోంది. జూలై 24, 25 తేదీల్లో కురిసిన వర్షాలకు ఆ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 50 శాతం పంట నష్టం వాటిల్లింది. ఒక్క నాసిక్ జిల్లాలోనే 48 వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేస్తారు. కేవలం ఆ జిల్లానుంచే సుమారు 7 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోంది. కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఉల్లి ఎక్కువగా సాగవుతుంది. జూలై మూడు, నాలుగో వారంలో కురిసిన వర్షాలకు ఆ రాష్ట్రాల్లోనూ పంట బాగా దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఉల్లిలో తేమ శాతం, ఘాటు ఎక్కువ. వీటిని ఎక్కువ కాలం నిల్వ చేస్తే కుళ్లిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఏపీలో పండే ఉల్లిని ఉత్తర భారతదేశంలో పెద్దగా ఇష్టపడరు. అందుకే ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఈ ఉల్లిని విక్రయిస్తారు. మిగిలిన రాష్ట్రాల్లో పండించే ఉల్లిలో తేమ శాతం, ఘాటు తక్కువ. వాటిని ఏడాది నుంచి రెండేళ్లపాటు నిల్వ చేయొచ్చు. అందుకే ఈ ఉల్లిని దేశీయంగా వినియోగించడంతోపాటు బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఏపీలో వర్షాభావంతో సాగు విస్తీర్ణం తగ్గిపోగా.. ఉత్తర భారతదేశంలో వర్షాలతో పంట దిగుబడులు తగ్గాయి. దీంతో మార్కెట్‌కు ఉల్లి రావడం లేదు. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. రూ.5 వేలకు చేరే అవకాశం ఈ ఏడాది మే నెలలో క్వింటాల్ ఉల్లి ధర కనిష్టంగా రూ.316 ఉంటే.. గరిష్టంగా రూ.1,617 పలికింది. ప్రస్తుతం ఆ ధర రూ.3,700కు పెరిగింది. మార్కెట్లో నిల్వలు తగ్గిపోతుండటంతో సెప్టెంబరులో ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.4,500–రూ.5 వేల వరకూ చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. 50 శాతం కొనుగోళ్లు తాడేపల్లిగూడెం నుంచే.. కర్నూలులో ఉత్పత్తి అయ్యే పంటలో 20 శాతం మాత్రమే కర్నూలు మార్కెట్ యార్డులో అమ్మకాలు జరుగుతాయి. మిగిలిన 80 శాతం పంటను తాడేపల్లిగూడెం, హైదరాబాద్, చెన్నైతో పాటు ఇతర రాష్ట్రాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. ఇక్కడ దళారులను నియమించుకుని, వారి ద్వారా రైతులకు ముందుగానే అప్పులు ఇచ్చి, పంట చేతికి రాగానే మార్కెట్ ధల ప్రకారం తమకే విక్రయించాలని ఒప్పందం చేసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వ్యాపారులు కర్నూలులో ఉత్పత్తి అయ్యే పంటలో 50 శాతం కొనుగోలు చేస్తారు. అక్కడి ప్రైవేట్ మార్కెట్లో విక్రయాలు సాగించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఎగుమతులపై నిషేధం విధిస్తేనే ధరలకు కళ్లెం ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం ముందస్తు చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఏర్పడింది. భారత్ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు ఉల్లిని దిగుమతి చేసుకుంటాయి. ప్రస్తుతం శ్రీలంకలో కిలో ఉల్లి రూ.120 నుంచి రూ.150 వరకూ ధర పలుకుతోంది. ఈ క్రమంలో ఎగుమతులు నిషేధించడంతో పాటు నాఫెడ్‌లోని నిల్వలను కేంద్రం మార్కెట్లోకి విడుదల చేస్తే ధరలు దిగొస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. 2019లోఎన్నడూ లేనివిధంగా ఉల్లి ధర క్వింటాల్ రూ.13,010 పలికింది. అప్పట్లో రిటైల్‌లో కిలో ఉల్లి రూ.150కి చేరింది. వినియోగదారులు ఇబ్బంది పడకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేసి రైతు బజార్లలో కిలో రూ.25కే విక్రయించింది. ఇప్పుడు కూడా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వం రైతు బజార్లలో కిలో రూ.25కే విక్రయించాలని వినియోగదారులు కోరుతున్నారు. -
వరద పోటు.. కరువు కాటు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ పక్క అతివృష్టి, వరదలు.. మరో ప్రాంతంలో అనావృష్టి. రెండూ రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. ఖరీఫ్ మొదలై 70 రోజులు దాటినా ఆశించిన స్థాయిలో పంటల సాగు లేదు. వేసిన పంటలు కొన్ని చోట్ల నీట మునగ్గా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండిపోతున్నాయి. ఈ విపత్కర సమయంలో రైతుకు అండగా నిలవాల్సిన సమయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో రైతాంగాన్ని మరింతగా ఊబిలోకి నెడుతోంది. ప్రభుత్వ అసమర్ధత కారణంగా ఈ ఖరీఫ్ సీజన్లో వ్యవసాయం కుదేలైపోయింది.రాష్ట్రంలో జూన్ నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు కురిసిన వర్షాన్ని పరిశీలిస్తే 286 మిలీమీటర్లు కురవాల్సి ఉండగా, ఇప్పటికే 370.4 మిల్లీమీటర్లు కురిసింది. అంటే 29.5 శాతం అధికం. రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లన్నీ నిండుగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగడం, వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నష్టం వాటిలింది. ఇదే సమయంలో రాయలసీమ జిల్లాల్లో, ప్రకాశం జిల్లాలో మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ జిల్లాల్లో చాలా చోట్ల గత 50 రోజులకు పైగా వర్షపు చుక్క లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ జిల్లాల్లో జూన్‌లో అధిక వర్షపాతం నమోదైనప్పటికీ, జూలై నుంచి ఈ నెల మొదటి వారం వరకు చుక్క వాన పడలేదు.2 లక్షల ఎకరాల్లో పంటలు వరద పాలుభారీ వర్షాలు, కృష్ణా, గోదావరి నదుల వరద ఉధృతికి ఇప్పటికే 2 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎర్ర కాలువకు పోటెత్తిన వరద రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఖమ్మం జిల్లాలో ప్రారంభమయ్యే ఈ కాలువ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకు, పెంటపాడు, అత్తిలి మండలాల్లోని 1.49 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తోంది. ఇటీవలి భారీ వర్షాలకు ఈ జిల్లాలో 13 వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వర్షాలు, వరదలతో ముంపు నీరు దిగే దారి లేక గోదావరి డెల్టాలో సాగు చేయలేక వేలాది ఎకరాలను రైతులు ఖాళీగా వదిలేస్తున్నారు. ఇప్పటికే 25 వేల ఎకరాలను సాగు చేయలేక ఖాళీగా వదిలేశారు.రాయలసీమలో 40 శాతానికి మించని సాగువర్షాభావ పరిస్థితుల వలన రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో సగటున 40 శాతానికి మించి పంటలు సాగవని పరిíస్థితి నెలకొంది. తిరుపతి, కర్నూల్లో ఒకింత మెరుగ్గా ఉంది. ప్రకాశం జిల్లాలో 19 శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగవగా, అన్నమయ్య జిల్లాలో 23 శాతం, వైఎస్సార్ జిల్లాలో 28 శాతం, చిత్తూరు జిల్లాలో 32 శాతం, అనంతపురంలో 40 శాతం, నంద్యాలలో 47 శాతం, శ్రీసత్యసాయి జిల్లాలో 50 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. రాయలసీమలో అత్యధికంగా సాగయ్యే వేరుశనగ పంట ఇప్పటి వరకు 40 శాతానికి మించలేదు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావంతో కనీస సాగు కూడా లేదు. అడపాదడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ పత్తి, కంది, జొన్న పంటల్లో ఎదుగుదల కన్పించడంలేదు. ఎకరాకు వేరుశనగకు రూ. 20 వేలు, కందికి రూ.10 వేలు, పత్తికి రూ.15 వేల చొప్పున ఇప్పటికే పెట్టుబడులు పెట్టారు. పంటలు ఎదుగూబొదుగూ లేకపోవడంతో పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి కన్పించడంలేదు. ప్రత్యామ్నాయంగా ఉలవలు, అలసంద, జొన్న, కొర్ర, పెసర నాటుకోవాలని శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. అదను దాటిపోవడంతో మెజార్టీ రైతులు ప్రత్యామ్నాయ పంటలూ వేయడంలేదు. పొలాల్ని ఖాళీగా వదిలేస్తున్నారు.ఆశనిపాతంలా ప్రభుత్వ నిర్ణయాలుఆపత్కాలంలో రైతులకు అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం అన్నదాతను మరింత కుంగదీసే నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కార్యక్రమాలకు బాబు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం చేస్తామంటూ సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. ప్రీమియం బకాయిలు చెల్లించకపోవడంతో ఖరీఫ్–2023 సీజన్‌కు సంబంధించి ప్రస్తుత సీజన్లో అందాల్సిన పంటల బీమా పరిహారమూ రైతులకు దక్కలేదు. మరొకపక్క పైసా భారం పడకుండా రైతులకు ఎంతో మేలు చేస్తున్న ఉచిత పంటల బీమాపైనా బాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ పథకాన్ని ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వరకు మాత్రమే అమలు చేస్తామని చెప్పడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కౌలు రైతులకు అండగా నిలుస్తున్న పంట హక్కు సాగుదారుల చట్టాన్ని చాప చుట్టేయాలని బాబు సర్కారు నిర్ణయించింది.ఆర్బీకేల ద్వారా ఎరువుల సరఫరా లేనట్టే..గత ఐదేళ్లుగా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) రైతాంగానికి అన్ని విధాలుగా అండదండగా నిలిచాయి. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్ర పరికరాలు అన్నీ గ్రామంలోనే ఆర్బీకేల ద్వారా అందేవి. దీంతో రైతులు ట్రాక్టర్లు, ఆటోలకు ఖర్చు పెట్టుకొని మండల కేంద్రాలు లేదా పట్టణాలకు వెళ్లి వీటిని తెచ్చుకోవాల్సిన వ్యయప్రయాసలు తప్పాయి. సమయానికి ఎరువులు, మందులు చల్లడంవల్ల పంటలకు మేలు కలిగేది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆర్బీకే వ్యవస్థను బాబు కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఈ కష్టకాలంలో రైతులకు వెన్నంటి నిలవాల్సిన ఆర్బీకే సిబ్బందిని మరుగుదొడ్ల సర్వే వంటి వ్యవసాయేతర పనులకు ఉపయోగిస్తోంది. సొసైటీలకు ప్రాధాన్యత ఇస్తూ ఆర్బీకేల ద్వారా ఎరువుల సరఫరా నిలిపివేయాలని ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ సీజన్ ప్రారంభమయ్యే సమయానికే 62 వేల టన్నుల ఎరువులను ఆర్బీకేలలో నిల్వ చేశారు. ఆ తర్వాత ఒక్క టన్ను కూడా కేటాయించబోమని ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఇప్పుడు అనేక ఆర్బీకేల్లో ఎరువులు దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఆర్బీకేల్లో ఉన్న కొద్దిపాటి ఎరువులను స్థానిక టీడీపీ నేతలు వారు చెప్పినవారికే ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో రైతులంతా గతంలోలా మండల కేంద్రాలు లేదా సమీపంలోని పట్టణాలకు పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాలు, పురుగు మందుల సరఫరాను కూడా బాబు ప్రభుత్వం నిలిపివేసింది. కనీసం రైతులు కోరుకున్న విత్తనాలను కూడా సరఫరా చేయడంలేదు. బీపీటీ 5204, జేఎల్‌జీ 384 వంటి విత్తన రకాలు బ్లాక్ మార్కెట్‌కి తరలిపోయాయి. దళారులు వీటిని ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తూ రైతును దోపిడీ చేస్తున్నా పట్టించుకునే వారు లేరు. సీజన్ ప్రారంభమై 70 రోజులైనా పూర్తి స్థాయిలో ఈ క్రాప్ నమోదు కాలేదు. సీసీఆర్సీ కార్డులు రెన్యువల్ చేసుకున్న కౌలు రైతులకు సరిపడిన మేరకు రుణ పరపతి కల్పించడంలేదు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను మొక్కుబడి తంతుగా మార్చేశారు. కరువుతో అల్లాడుతున్న రాయలసీమ జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలపై అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.» రాష్ట్రంలో ఖరీఫ్ సాగు లక్ష్యం 85.26 లక్షల ఎకరాలు» ఇప్పటి వరకు సాగైంది 40 లక్షల ఎకరాలు–49%» గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలోనే సాగైంది 39 లక్షల ఎకరాల్లో» 2022 ఖరీఫ్‌లో ఇదే సమయానికి సాగయింది 48 లక్షల ఎకరాల్లో» ప్రధానంగా వరి 48% సాగవగా, వేరుశనగ 40, పత్తి 55, కంది 57% విస్తీర్ణంలో సాగయ్యాయి.ఇది ‘అనంత’ వేదనఉమ్మడి అనంతపురం జిల్లాలో విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. జూన్‌లో 142 శాతం అధికంగా వర్షపాతం నమోదు కాగా, జూలైలో సాధారణం కంటే 61.8 శాతం, ఆగస్టులోæ 48.7 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. మొత్తంగా సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు సాధారణం కంటే 31.5 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. కానీ ఏకంగా 52 రోజులు వర్షమే లేకపోవడం జిల్లాలో వ్యవసాయాన్ని దెబ్బ తీసేసింది. ఐదు మండలాల్లో రెండు డ్రై స్పెల్స్ నమోదయ్యాయి. ఈ జిల్లాలో 3,46,733 హెక్టార్లు సాగు విస్తీర్ణం ఉండగా, ఇప్పటి వరకు 1,43,332 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. వేరుశనగ సాధారణ విస్తీర్ణం 1,97,884 హెక్టార్లు కాగా కేవలం 53,974 హెక్టార్లలో అంటే కేవలం 27.3 శాతం విస్తీర్ణంలో మాత్రమే సాగైంది. పత్తి 48,586 హెక్టార్లకు గాను 21,907 హెక్టార్లలో మాత్రమే సాగైంది. ప్రకాశం జిల్లాలోనూ ఇదే దుస్థితి. ఈ జిల్లాల్లో 3.87 లక్షల ఎకరాల సాగు లక్ష్యం కాగా, కేవలం 66 వేల ఎకరాల్లోనే సాగయింది.నారు వేసి వదిలేశాంఅల్లవరం మండలం రెల్లుగడ్డ గ్రామంలోని నాకున్న 4 ఎకరాల్లో ఈ ఏడాది ఖరీఫ్ పంటకు విత్తనాలు చల్లుకున్నాం. నారుమడి సిద్ధం చేసిన నాటి నుంచి నెలరోజులు వర్షం కురిసింది. ముంపునీరు దిగే పరిస్థితి కనిపించడంలేదు. భారీ వర్షాల కారణంగా రెల్లుగడ్డ గ్రామంల్లో సుమారు 200 ఎకరాల్లో ముంపు ఏర్పడి నారుమళ్లు పూర్తిగా కుళ్లిపోయాయి. ఖరీఫ్‌లో వరి నాట్లు వేసే పరిస్థితి లేదు. భారీ వర్షాలతో పంట ముంపు బారిన పడుతుండడంతో కనీసం పెట్టుబడి కూడా దక్కడంలేదు. అల్లవరం మండలంలో ముంపు సమస్య శాశ్వత పరిష్కారం లేకపోతే వ్యవసాయం చేయడానికి ఏ రైతూ ముందుకు రాడు. – మొల్లేటి రామభద్రరావు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాఆదుకొనే పరిస్థితులుకనిపించడంలేదుఎర్రకాల్వ వరదకు ఆరుగాలం శ్రమ వరదలో కొట్టుకుపోయింది. ఎకరాకు రూ.15 వేల ఖర్చు చేసి ఊడ్పులు ఊడ్చిన తర్వాత ముంపు వచ్చింది. నాలుగు రోజుల తర్వాత వరద తగ్గితే మళ్లీ నారుమడులు వేశాం. దమ్ము చేయించాం. దీనికి మరో ఐదు వేల రూపాయలు ఖర్చయింది. మొత్తం ఎకరాకు రూ.20 వేలు ఖర్చయ్యింది. ఒక్క ఆరుళ్ల గ్రామంలోనే వెయ్యి ఎకరాలకు ముంపు వచ్చింది. ప్రభుత్వం ఆదుకుంటే గట్టెక్కుతాం. కానీ ఆదుకొనే పరిస్థితులే కనిపించడంలేదు. – సతీష్, రైతు, ఆరుళ్ళ, ప.గోదావరి జిల్లాప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదీ?ప్రస్తుత ఖరీఫ్‌లో 4 ఎకరాల్లో వేరుశనగ, 4 ఎకరాల్లో కంది సాగు చేసా. ఇప్పటివరకు వేరుశనగ పంటకు రూ.60 వేలు, కందికి రూ.30 వేలు పెట్టుబడి పెట్టాను. వర్షాల్లేకపోవడంతో పంట ఎండిపోయింది. రూ.లక్ష పెట్టుబడి కోల్పోయాను. ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – నాగభూషణం, కదిరిదేవరపల్లి, అనంతపురం జిల్లాపెట్టుబడి సాయమైనా జమ చేయలేదుఖరీఫ్లో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఓ వైపు అధిక వర్షాలు, మరో వైపు వర్షాభావ పరిస్థితులు. ఇటువైపు పంటలు మునిగిపోతుంటే.. అటువైపు పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేయడంలేదు. ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీ అమలు చేయకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. – జి.ఈశ్వరయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
సాగుకు రూ.1.52లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వ్యవసాయానికి బడ్జెట్లో కేంద్రం పెద్దపీట వేసింది. బడ్జెట్‌కు సంబంధించిన తొమ్మిది ప్రాధాన్య అంశాల్లో వ్యవసాయ ఉత్పాదకతను ఒకటిగా చేర్చింది. మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్న పథకాలను కొనసాగిస్తూనే కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. సాగు ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా కేటాయింపులు జరిపింది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024–25బడ్జెట్ ప్రసంగంలోవెల్లడించారు. పరిశోధనలకు ప్రోత్సాహం‘వ్యవసాయ పరిశోధనలను సమగ్రంగాసమీక్షించడం ద్వారా ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుని అధిక ఉత్పాదకతనిచ్చే సరికొత్త వంగడాల దిశగా ప్రోత్సహిస్తాం. ఈ మేరకు నిధులు కూడా అందజేస్తాం. ప్రైవేటు రంగానికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పిస్తాం. ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యవసాయ రంగ నిపుణులు ఈ పరిశోధనలను పర్యవేక్షిస్తారు. 32 వ్యవసాయ అలాగే ఉద్యాన పంటలకు సంబంధించి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే, అధిక దిగుబడినిచ్చే 109 కొత్తవంగడాలను రైతులు సాగుచేసేందుకు వీలుగా విడుదల చేస్తాం. 10 వేల బయో ఇన్పుట్ రిసోర్స్ కేంద్రాలువచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను సర్టిఫికేషన్, బ్రాండింగ్‌తో కూడిన ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తాం. శాస్త్రీయ సంస్థలు, ఆసక్తి కలిగిన గ్రామపంచాయతీల ద్వారా దీనిని అమలుచేస్తాం. 10 వేల అవసరాధారిత బయో ఇన్పుట్ రిసోర్స్ కేంద్రాలు (సేంద్రియ ఎరువుల కేంద్రాలు) ఏర్పాటు చేస్తాం. సహకార సంఘాలు,స్టార్టప్‌లకు ప్రోత్సాహంఅధిక వినియోగ కేంద్రాలకు సమీపంలో భారీ స్థాయిలో కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లు అభివృద్ధి చేస్తాం. రైతు–ఉత్పత్తిదారు సంఘాలను ప్రోత్సహిస్తాం. అలాగే కూరగాయల సేకరణ, నిల్వ, మార్కెటింగ్‌తో సహా కూరగాయల సరఫరా వ్యవస్థల కోసం సహకార సంఘాలు, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం. పప్పు దినుసులు, నూనెగింజల్లో స్వయం సమృద్ధిపప్పు దినుసులు, నూనెగింజల్లో స్వయం సమృద్ధి సాధన దిశగా వాటి ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తాం. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన విధంగా వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు తదితర నూనెగింజలకు ‘ఆత్మనిర్భరత’ సాధన కోసం ఓ ప్రత్యేక వ్యూహానికి రూపకల్పన చేస్తాం. డిజిటల్ క్రాప్ సర్వేపైలట్ ప్రాజెక్టు విజయవంతమైన నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో..వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా రైతులు, వారి భూముల కోసం వ్యవసాయంలో డిజిటిల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) అమలు చేస్తాం. ఈ ఏడాది 400 జిల్లాల్లో డీపీఐ ద్వారా ఖరీఫ్ పంటల డిజిటల్ సర్వే నిర్వహిస్తాం. 6 కోట్ల మంది రైతులు, వారి భూముల వివరాలను రైతు, భూమి రిజిస్ట్రీల్లో పొందుపరుస్తాం. ఐదు రాష్ట్రాల్లో జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తాం.రొయ్యల ఉత్పత్తి ఎగుమతిరొయ్యల సాగు కేంద్రాల నెట్వర్క్ ఏర్పాటుకు ఆర్థిక సాయంఅందజేస్తాం. నాబార్డ్ ద్వారా రొయ్యల సాగు, శుద్ధి, ఎగుమతికి నిధులుఅందజేస్తాం.జాతీయ సహకార విధానంసహకార రంగ సర్వతోముఖాభివృద్ధికి వీలుగా జాతీయ సహకార విధానాన్ని కేంద్రం తీసుకువస్తుంది.వేగవంతమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పెద్దయెత్తున ఉపాధి కల్పన, అవకాశాలు లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందిస్తాం..’ అని ఆర్థికమంత్రి వెల్లడించారు.భూసారం పెంపు,జీవవైవిధ్యానికిదోహదంసుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రసాయన ఎరువులు, క్రిమిసంహారాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని కేంద్రం భావిస్తోంది. ప్రకృతి వ్యవసాయం భూసారాన్ని పెంచడమే కాకుండా జీవవైవిధ్యానికి దోహదపడుతుంది. రైతుల సాగు ఖర్చులు తగ్గేలా చేయడం ద్వారా వారి లాభదాయకతను పెంపొదిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రోత్సహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు వాతావరణ సూచనలు, పంటలకు సంబంధించిన సలహా సేవలు, మార్కెట్ ధరల గురించిన సమాచారం తెలుసుకునేందుకు ఈ డిజిటిల్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా వీలు కలుగుతుంది.యూరియాకు బడ్జెట్లో సబ్సిడీ తగ్గింపు సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో యూరియాకు సబ్సిడీ తగ్గింది. 2022–2023లో 1,65,217 కోట్లు సబ్సిడీపై ఖర్చు చేయగా, 2023–24లో రూ. 1,28,594 కోట్లకు తగ్గిపోయింది. 2024–25లో బడ్జెట్‌ను మరింత తగ్గించి 1,19,000 కోట్లు మాత్రమే కేటాయించారు. పోషకాధార ఎరువుల సబ్సిడీ కింద 2022–23లో రూ. 86,122 కోట్లు ఖర్చు చేయగా, 2024–25లో ఇంకా తగ్గించి రూ. 45,000 కోట్లు కేటాయించారు. అంటే కంపెనీలు పెంచే ఎరువుల ధరల భారాన్ని ఇకపై రైతులే భరించాల్సి ఉంటుందని రైతు నేతలు విమర్శిస్తున్నారు. అలాగే 2019 నుంచి కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయింపులు తగ్గిపోతూ వస్తున్నాయి. 2019–20 సంవత్సర మొత్తం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 5.44 శాతం కేటాయించగా, ఇప్పుడు 2024–2025లో໖ 3.15 శాతానికి పడిపోయింది. ఇక పంటల బీమా పథకానికి కూడా 2023–24లో రూ. 15,000 కోట్ల ఖర్చు అంచనా వేసిన ప్రభుత్వం ఈ ఏడాది దానిని రూ. 14,600 కోట్లకు తగ్గించింది. వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీకి 2023–24 లో రూ. 23,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం రూ. 22,000 కోట్లు మాత్రమే కేటాయించింది. మద్దతు ధరలకు చట్టబద్దత ఏదీ? కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక, తెలంగాణరాష్ట్ర కమిటీకనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కలి్పంచాలని కోరుతూ దేశవ్యాప్తంగా రైతులు గత ఏడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్ సందర్భంగా ఈ చట్టం ప్రస్తావన చేయలేదు. పైగా వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు కూడా తగ్గించింది. -
గుర్తుకొస్తున్నాయి...!
⇒ జగనన్న ప్రభుత్వంలో ఏటా ఖరీఫ్ ప్రారంభంలో రైతు భరోసా అందించి ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పింది. ఇంతవరకూ ఆ హామీకి అతీగతీ లేదు. వ్యవసాయానికి ఇదే అదును. ఈ సమయంలో చేతిలో సొమ్ములేక అప్పులు చేయల్సివస్తోంది. మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. – మిడితాన కన్నంనాయుడు, బాసూరు గ్రామం, పాలకొండ మండలం, పార్వతీపురం మన్యం⇒ వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారు. రైతు భరోసా పథకం రైతులకు ఎంతో చేదోడుగా నిలిచింది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అమలు చేయని రైతు భరోసా పథకాన్ని తెచ్చి అండగా నిలిచారు. పెట్టుబడుల కోసం కూటమి ప్రభుత్వం డబ్బులు ఎప్పుడిస్తుందో అంతుబట్టడం లేదు. –పోల్నాటి శ్రీనివాసరావు, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా⇒ వైఎస్ జగన్ క్రమం తప్పకుండా సాయం అందించి రైతులను ఆదుకున్నారు. ప్రభుత్వం మారాక ఇంతవరకు రైతు భరోసా పడలేదు. పెట్టుబడుల కోసం ఏం చేయాలో తోచడం లేదు. – పిప్పళ్ల వెంకటేశ్వరరావు, రైతు, పోతేపల్లి గ్రామం, బందరు మండలం, కృష్ణాజిల్లా⇒ గత ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభానికి ముందే మే నెలలో రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు. కొత్త ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. జూన్ ముగుస్తోంది. తక్షణం సాయం అందిస్తే బాగుంటుంది. –తోక కృష్ణ, రైతు, వెల్దుర్తిపాడు, పెనుగంచిప్రోలు మండలం⇒ ఖరీఫ్ ప్రారంభమై దాదాపు నెల కావస్తున్నా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందలేదు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి దిగులు లేకుండా సాగు చేసుకున్నాం. ఇప్పుడు సాగు ఖర్చుల కోసం అప్పులు చేయక తప్పడం లేదు. – సుంకుగారి భాస్కర్‌రెడ్డి, గోపాయపల్లె గ్రామం, రాజుపాలెం మండలం. వైఎస్సార్‌జిల్లా.⇒ వర్షాలు కురుస్తున్నాయి. ఆరుద్ర కార్తె కూడా వచ్చింది. పంటల సాగుకు ఇదే మంచి అదును. గత ప్రభుత్వంలో రైతు భరోసా ఠంఛనుగా అందేది. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రెండు వారాలు దాటినా రైతుభరోసా ఊసే ఎత్తడం లేదు. జగన్ మళ్లీ సీఎం అయి ఉంటే మాకు ఈ బాధలు ఉండేవి కావు. – కృష్ణారెడ్డి, రైతు, హస్తవరం, రాజంపేట మండలం, అన్నమయ్య జిల్లా⇒ గత ప్రభుత్వంలో ఏ సీజన్‌కు ఆ సీజన్లో రైతు భరోసా డబ్బులు మా బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత కేంద్రం నుంచి పీఎం కిసాన్ పథకం కింద రూ.2 వేలు మాత్రమే జమ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాలేదు. – రంగయ్య, రైతు, కమ్మవారిపల్లె, నంద్యాల జిల్లా ⇒ గత ప్రభుత్వంలో ఈ సమయానికి రైతు భరోసా అందించేవారు. ఆ సొమ్ము వ్యవసాయ పనులకు ఎంతో ఉపయోగపడింది. టీడీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయం రూ.20 వేలుకు పెంచినట్లు చెప్పినా ఇంతవరకు ఇవ్వలేదు. వ్యవసాయ పనుల సీజన్లో అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. – శ్రీకాంత్‌రెడ్డి, రైతు, పి.జలాలపురం, శింగనమల మండలం, అనంతపురం జిల్లా⇒వరి సాగు చేస్తా. గత ప్రభుత్వం రైతు భరోసాతో ఆదుకోవడంతో పెట్టుబడి కష్టాలు తొలగిపోయాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు సాయం అందలేదు. దీంతో మళ్లీ 2019 మునుపు పరిస్థితులు వస్తాయని భయంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు పెట్టుబడి సాయంతో ఆదుకోవాలి. లేదంటే ఈ ఏడాది సాగుకు దూరం కాక తప్పదు.– గుల్లేలు నారాయణరావు, మర్రిపుట్టు గ్రామం, గుల్లేలు పంచాయతీ, పాడేరు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా⇒ ఏటా మే నెలలో రైతు భరోసా డబ్బులు మా ఖాతాల్లో పడేవి. ఈ ఏడాది జూన్ వెళ్లిపోతున్నా ఇంకా అందలేదు. వర్షాలు పడుతున్నాయి. పెట్టుబడి సాయం ఇంతవరకూ అందలేదు. –పెచ్చెట్టి సుబ్బారావు, కౌలు రైతు, జిన్నూరు, పోడూరు మండలం, పశ్చిమగోదావరి జిల్లా⇒ ఏటా 5 ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేవాడిని. గత ప్రభుత్వం మే నెలలోనే రైతు భరోసా కింద రూ.5,500 ఖాతాల్లో జమ చేసేది. ఖరీఫ్ పెట్టుబడికి ఆ డబ్బులు ఉపయోగపడేవి. ఇప్పుడు ఇంతవరకు ఆ ఊసే లేదు. సకాలంలో రైతుకు సాయం అందకపోతే చాలా ఇబ్బందులు పడతారు. – వి. హరినాథరెడ్డి, రైతు, చెరువుమరవపల్లి, తలుపుల మండలం, శ్రీసత్యసాయి జిల్లా⇒ వరి, చెరకు సాగు చేస్తున్నా. జగన్ సీఎంగా ఉన్న కాలంలో సీజన్లో పెట్టుబడులకు సాయం అందించారు. రూ.20 వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎప్పుడు ఇస్తారో మాత్రం చెప్పడం లేదు. సకాలంలో అందించి రైతులను ఆదుకోవాలి. – కాండ్రేగుల కిరణ్‌కుమార్, రైతు, చూచుకొండ, మునగపాక, అనకాపల్లి జిల్లా⇒గతంలో రైతు భరోసా క్రమం తప్పకుండా అందింది. ఈ ఏడాది జూలై వస్తున్నా పెట్టుబడి సాయం అందక పోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉంది. – చిన్నభగవంతప్ప, రైతు, ఆరేకల్, ఆదోని మండలం -
Cabinet approves: వరికి మరో 117
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను 5.35 శాతం పెంచింది. అంటే క్వింటాల్‌కు రూ.117 చొప్పున పెరగనుంది. 2024–25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో క్వింటాల్ వరి ధాన్యాన్ని రూ.2,300కు కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం దేశంలో సరిపడా బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ ధాన్యానికి మద్దతు ధర పెంచడం గమనార్హం. త్వరలో జరగనున్న హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ పెంచినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్(సీఏసీపీ) సిఫార్సుల మేరకు 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. ఎంఎస్పీని సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,300కు, ‘ఎ’ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,320కు పెంచినట్లు వెల్లడించారు. కనీస మద్దతు ధర అనేది ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు అధికంగా ఉండాలని 2018 కేంద్ర బడ్జెట్లో తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించినట్లు చెప్పారు. ఇదే సూత్రాన్ని ఇప్పుడు అమలు చేసినట్లు పేర్కొన్నారు. పంటల ఉత్పత్తి వ్యయాన్ని సీఏసీపీ శాస్త్రీయంగా మదింపు చేసిందన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు → మహారాష్ట్రలోని వధవాన్‌లో రూ.76,200 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్టు అభివృద్ధి. ఈ ఓడరేవును ప్రపంచంలోని టాప్–10 ఓడరేవుల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ పోర్టులో 9 కంటైనర్ టెర్మినళ్లు ఉంటాయి. ఒక్కో టైర్మినల్ పొడవు వెయ్యి మీటర్లు. → రూ.2,869.65 కోట్లతో వారణాసిలోని లాల్‌బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు విస్తరణ. ఇందులో భాగంగా కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మిస్తారు. ఆప్రాన్, రన్‌వేను మరింత విస్తరిస్తారు. → సముద్ర తీరంలో పవన విద్యుత్ ప్రాజెక్టులకు రూ.7,453 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్). 500 మెగావాట్ల చొప్పున గుజరాత్లో ఒకటి, తమిళనాడులో ఒకటి పవన విద్యుత్ ప్రాజెక్టుల అమలు. → 2024–25 నుంచి 2028–29 దాకా రూ.2,254.43 కోట్లతో జాతీయ ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం(ఎన్ఎఫ్ఐఈఎస్) అమలు. ఇందులో భాగంగా ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి. నూతన క్యాంపస్‌లు, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ల నిర్మాణం. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ) ఏర్పాటు. -
జోరుగా విత్తన పంపిణీ
సాక్షి, అమరావతి: నైరుతి వచ్చేసింది. తొలకరి మొదలైంది. ఖరీఫ్ సాగు ఊపందుకుంటోంది. ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి కాస్త ఆలశ్యంగా ప్రారంభమైన విత్తనాల పంపిణీ ఇప్పుడు జోరందుకుంటోంది. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలతో పాటు వేరుశనగ విత్తనాల పంపిణీ జోరుగా సాగుతోంది. గిరిజన జిల్లాల్లో వరి విత్తన పంపిణీ ప్రారంభమైంది. ఈ నెల 15 వ తేదీ నుంచి మిగిలిన జిల్లాల్లో వరి, ఇతర విత్తనాల పంపిణీకి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తున్నాయి. సీజన్ ఏదైనా స్థానిక లభ్యతనుబట్టి సాగు విస్తీర్ణంలో 30 శాతం విత్తనాన్ని సబ్సిడీపై రైతులకు అందిస్తుంటారు.సబ్సిడీ విత్తనం కోసం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పడరాని పాట్లు పడేవారు. రోజుల తరబడి బారులు తీరి ఎదురు చూసేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. గడిచిన ఐదేళ్లుగా సీజన్‌కు ముందుగానే నాణ్యమైన, సర్టిఫై చేసిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా గ్రామాల్లోనే అందించడంతో రైతుల కష్టాలకు తెరపడింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 85.65 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 39.07 లక్షల ఎకరాల్లో వరి, 14.80 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.67 లక్షల ఎకరాల్లో పత్తి, 8.35 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయనున్నారు. ఖరీఫ్ సీజన్ కోసం 6,31,742 క్వింటాళ్ల విత్తనం అవసరం కాగా, 6,50,160 క్వింటాళ్లు అందుబాటులో ఉంది.2.99 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని 40 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. పెసర, మినుము, కంది విత్తనాలను 30 శాతం సబ్సిడీపై ఇస్తున్నారు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కొర్ర, రాగి, అండుకొర్రలు వంటి విత్తనాలను 50 శాతం రాయితీపై సరఫరా చేస్తున్నారు. జాతీయ ఆహార ధాన్యాల భద్రత పథకం అమలవుతున్న జిల్లాల్లో కిలోకి రూ.10 చొప్పున, ఇతర జిల్లాల్లో కిలోకి రూ.5 చొప్పున రాయితీతో వరి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. ఏజెన్సీ జిల్లాల్లో మాత్రం 90 శాతం సబ్సిడీపై వరితో సహా అన్ని రకాల విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే 3,15,928 క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. 48,177 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 2 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 67,617 క్వింటాళ్ల వరి, 84 క్వింటాళ్ల చిరుధాన్యాలు, కందులు, మినుములు, 50 క్వింటాళ్ల పెసర, రాజ్మా, నువ్వులు విత్తనాలను సిద్ధం చేశారు.విత్తనం కోసం 3.76 లక్షల మంది రైతులు నమోదుఆర్బీకేల ద్వారా విత్తనాలు కావాల్సిన రైతుల వివరాలను అన్ని జిల్లాల్లో నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 2,46,997 క్వింటాళ్ల విత్తనాల కోసం 3,75,583 మంది రైతులు ఆర్బీకేల్లో వివరాలు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 40 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు, 1,04,200 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తయింది.సరిపడా విత్తన నిల్వలుగతేడాది మాదిరిగానే సర్టిఫై చేసిన నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే పచ్చిరొట్టతో పాటు వేరుశనగ విత్తనం పంపిణీ జోరుగా సాగుతోంది. మిగిలిన విత్తనాలను జూన్ 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం.– ఎం.శివప్రసాద్, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థఏజెన్సీలో 7వేల క్వింటాళ్ల పంపిణీగిరిజన ప్రాంతాల్లో గతంలో ఏటా 2, 3 వేల క్వింటాళ్లకు మించి విత్తనాలను పంపిణీ చేయలేదు. ఈసారి రికార్డు స్థాయిలో 90 శాతం సబ్సిడీ విత్తనాల పంపిణీ జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ ఏడాది 7 వేల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేశారు. డిమాండ్‌ను బట్టి మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
92% మందికి ఇన్పుట్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: ఎన్నికల దృష్టితో కాకుండా అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా సంతృప్త స్థాయిలో లబ్ధి చేకూరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో కరువు, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన 92 శాతం మంది రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీని జమ చేసి ఆదుకుంది. 8.89 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి రూ.1,126.31 కోట్లు జమ చేయగా మరో 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంది.అది కూడా ఖాతాల వివరాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఆధార్ నంబర్లు సరిపోలకపోవడం లాంటి సాంకేతిక కారణాలతో జాప్యం జరుగుతోంది. బ్యాంకర్లు, అధికార యంత్రాంగం ఈ సమస్యను పరిష్కరించిన వెంటనే మిగిలిన అర్హులకూ ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటిని వక్రీకరిస్తూ పెట్టుబడి సాయం ఏమైపోయిందంటూ రామోజీ శోకాలు పెడుతున్నారు. ఒకపక్క ఈసీ ద్వారా అన్నదాతలకు సాయం అందకుండా అడ్డుపడ్డ చంద్రబాబు మరోవైపు ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్ ముగిసే లోగానే పరిహారం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా అండగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్–23లో ఏడుజిల్లాల పరిధిలోని 103 కరువు మండలాల్లో 14.24 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. 6.60 లక్షల మందికి రూ.847.22 కోట్ల కరువు సాయం చెల్లించాలని లెక్క తేల్చారు. గతేడాది రబీ ఆరంభంలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు 6.64 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లు తేలింది. దీనికి సంబంధించి 4.61 లక్షల మందికి రూ.442.36 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని అంచనా వేశారు.ఈ రెండు విపత్తుల్లోనూ 77 వేల మంది ఉండటంతో నష్టపోయిన వారి సంఖ్య మొత్తం 10.44 లక్షలుగా తేల్చారు. ఈమేరకు రూ.1,289.57 కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగా కోడ్ సాకుతో ఈసీని అడ్డంపెట్టుకుని చంద్రబాబు బృందం అడ్డుకుంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయిస్తే మే 10న జమ చేసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయినప్పటికీ ఈసీ తాత్సారం చేయడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందే. తుది జాబితాలు రాగానే మిగతా వారికీ..నష్టపోయిన 10.44 లక్షల మంది రైతులకు రూ.1,289.57 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ జమ చేయాల్సి ఉండగా ఆ ఖాతాల వివరాలను వ్యవసాయ శాఖ సీఎంఎఫ్ఎస్కు పంపించింది. అయితే 46,226 మంది రికార్డులు సరిగా లేవని వెనక్కి పంపారు. వీరికి రూ.57.15 కోట్లు జమ కావాల్సి ఉంది. మిగిలిన 9,97,925 మంది రైతులకు సంబంధించి రూ.1,232.43 కోట్లు జమ చేసేందుకు వ్యవసాయ శాఖ తిరిగి సీఎఫ్ఎంఎస్కు ప్రతిపాదనలు పంపింది.ఇందులో 8,89,784 మంది రైతులకు రూ.1,126.31 కోట్లు జమ అయింది. మరో 1,08,141 మందికి సంబంధించి రూ.106.12 కోట్లు సాంకేతిక కారణాలతో జమ కాలేదు. ఇలా 1.54 లక్షల మందికి రూ.163.27 కోట్లు జమ కావాల్సి ఉంది. బ్యాంక్ ఖాతా, ఆధార్ నెంబర్లు, రైతుల వివరాలు మిస్ మ్యాచ్ అయినట్టు గుర్తించడంతో ఆ వివరాలను జిల్లాలకు పంపి క్షేత్ర స్థాయి పరిశీలన జరుపుతున్నారు. జిల్లాల నుంచి తుది జాబితాలు రాగానే వారికి కూడా సొమ్ములు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.త్వరలో రబీ 2023–24 కరువు జాబితాలుదేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రబీ 2023–24 సీజన్లో కూడా కొనసాగాయి. ఆరు జిల్లాల్లో 87 మండలాల్లో కరువు ప్రభావం ఉన్నట్లు గుర్తించారు. 2.37 లక్షలమంది రైతులకు చెందిన 2.52 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేలింది.తుది జాబితాల రూపకల్పన జరగకుండా కోడ్ సాకుతో చంద్రబాబు బృందం అడ్డుకోగా ఇటీవలే పోలింగ్ ముగియడంతో ఈసీ అనుమతితో తుది నివేదిక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సోషల్ ఆడిట్, అర్జీల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ పూర్తిచేశారు. జిల్లాల నుంచి తుదిజాబితాలు రాగానే పెట్టుబడి రాయితీ విడుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాడు ప్రకటనలోనూ అంతులేని ఆలస్యం..చంద్రబాబు పాలనలో ఏటా కరువు కాటకాలే తాండవించడంతో సగటున 324 మండలాలు కరువు ప్రభావానికి గురయ్యాయి. ఖరీఫ్–2014లో 238, ఖరీఫ్–2015లో 359, ఖరీఫ్–2016లో 301, రబీ 2017–18లో 121, ఖరీఫ్–2018లో 347, రబీ 2018–19లో 257 మండలాల్లో కరువు విలయ తాండవం చేసింది. అయితే నాడు కరువు మండలాలను ఏ సీజన్‌కు ఆ సీజన్లో ప్రకటించిన దాఖలాలే లేవు. 2014 ఖరీఫ్‌లో కరువు వస్తే 2015 మార్చి 10 వరకు మూడుసార్లుగా కరువు మండలాలను నోటిఫై చేశారు.2015లో కరువు వస్తే నవంబరు నెలాఖరు వరకు ప్రకటించనే లేదు. 2016 ఖరీఫ్‌లో కరువు వస్తే 2017 ఫిబ్రవరి వరకు మూడు దఫాలుగా ప్రకటించారు. 2017 రబీలో కరువు వస్తే 2018 మార్చి నెలాఖరు వరకు మూడుసార్లు ప్రకటించారు. 2018 ఖరీఫ్‌లో కరువు వస్తే 2018 అక్టోబరు వరకు ఏకంగా ఐదు దఫాలుగా కరువు మండలాలను వెల్లడించారు. రబీ 2018–19లో కరువు వస్తే.. ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 2019లో కరువు మండలాలను ప్రకటించారు.రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన బాబునాడు 2014 ఖరీఫ్ కరువు సాయాన్ని చంద్రబాబు సర్కారు 2015 నవంబరు వరకు అందజేయలేదు. 2015 కరువు సాయం 2016 నవంబరులో విదిల్చింది. 2016లో కరువు వస్తే 2017 జూన్‌లో, 2017లో కరువు వస్తే 2018 ఆగస్టులో సరిపుచ్చారు. 2018లో కరువు వల్ల ఖరీఫ్‌లో రూ.1,832.28 కోట్లు, రబీలో రూ.356.45 కోట్ల పంటనష్టం జరిగితే చంద్రబాబు ప్రభుత్వం అందించిన సహాయం సున్నా. 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన నిర్వాకం చంద్రబాబుదే. తిత్లీ తుపాను బాధితులకు బాబు ఎగ్గొట్టిన రూ.182.60 కోట్ల పరిహారంతో సహా ఈ ఐదేళ్లలో 34.41 లక్షల రైతులకు రూ.3,261.60 కోట్ల పెట్టుబడి రాయితీని అందించి ఆదుకున్నది సీఎం జగన్ ప్రభుత్వమే.ఆ కథనాల్లో నిజం లేదు..ఖరీఫ్ 2023 కరువు, రబీ 2023–24లో మిచాంగ్ తుపానుకు సంబంధించి అర్హత పొందిన వారిలో ఇప్పటికే 8.89 లక్షల మందికి రూ.1,126.31 కోట్ల పెట్టుబడి రాయితీ జమచేశాం. మరో 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ చేయాల్సి ఉంది. సాంకేతిక సమస్యల్ని పరిష్కరించి త్వరలోనే వీరికి పరిహారం జమ చేస్తాం. 50 శాతం మందికి ఇంకా పరిహారం జమ కాలేదన్న కథనాల్లో వాస్తవం లేదు. ఇప్పటికే 92 శాతం మందికి జమ చేశాం. రబీ 2023–24 సీజన్లో కరువు నష్టానికి సంబంధించి తుది జాబితాల రూపకల్పన జరుగుతోంది. కలెక్టర్ల ఆమోదంతో తుది జాబితాలు రాగానే సకాలంలో పరిహారం జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయశాఖ -
ఖరీఫ్‌కు కొత్త వరి వంగడాలు సిద్ధం
సాక్షి, భీమవరం: ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో పంట తెగుళ్లు, వైపరీత్యాలను ఎదురొడ్డి నిలిచే ఆధునిక వంగడాల సాగు ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 300 వరి రకాలు సాగుచేస్తున్నప్పటికీ బీపీటీ 5204, ఎన్‌డీఎల్‌ఆర్ 7, స్వర్ణ, పీఏపీఎల్ 1100, ఆర్జీఎల్ 2537 వంటి కొన్ని రకాలు మాత్రమే తినడానికి అనువుగా ఉంటున్నాయి.ఈ సమస్యను అధిగమించేందుకు మరిన్ని రకాలను, అధిక పోషక విలువలు కలిగిన వాటిని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గత ఏడాది జూలై 19న విడుదల చేసింది. అందులో బీపీటీ 5204, ఎంటీయూ 1271, బీపీటీ 2846, బీపీటీ 2841, ఎన్‌ఎల్‌ఆర్ 3238 రకాలు ఉన్నాయి. వాటి వివరాలను మార్టేరు రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ (వరి) డాక్టర్ టి.శ్రీనివాస్ తెలిపారు. ఆయా రకాల వరి వంగడాలు, వాటి ప్రత్యేకతలు ఆయన తెలిపారు. ఎంటీయూ 1271 అధిక గింజలతో ఎక్కువ దిగుబడి ఇచ్చే సన్న రకం. పంట కాలం 140 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. పచ్చి బియ్యానికి అనుకూలం. బియ్యం పారదర్శకంగా ఉండి 69.7 శాతం నిండు గింజలు కలిగి అధిక దిగుబడి ఇస్తుంది. రైతు, మిల్లర్, సన్నగింజ ధాన్యం మార్కెట్‌కి అనుకూలమైన వెరైటీ. కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో సార్వాకు అనువైన రకం. దోమ, ఎండాకు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.8 టన్నుల నుంచి మూడు టన్నుల వరకు దిగుబడి వస్తుంది. బీపీటీ 2846 కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో బీపీటీ 5204కు దీటైన ప్రత్యామ్నాయంగా, భోజనానికి అనువుగా ఉంటూ అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్న గింజ రకం. మార్కెట్‌కు, వినియోగదారులకు అనువుగా ఉంటుంది. పంట కాలం 145 నుంచి 150 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. సన్నగింజ రకం. కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. గింజ మధ్యస్థ సన్నంగా ఉంటుంది. భోజనానికి అనుకూలమైన రకం. 65.2 శాతం నిండు గింజలు కలిగి మిల్లర్, మార్కెట్‌కు అనుకూలమైన వెరైటీ. అగ్గి తెగులు, మెడ విరుపు, పొట్ట కుళ్లు తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు మూడు టన్నుల దిగుబడి సామర్థ్యం కలిగి, రైతుకు మంచి ఆదాయం ఇస్తుంది. నేరుగా విత్తే విధానం, సేంద్రియ వ్యవసాయ విధానానికి అనువైన రకం. బీపీటీ 2841 అధిక ప్రొటీన్, జింక్, ఇతర పోషక విలువలు కలిగి, మధుమేహ రోగులకు భోజనానికి అనువైన నల్ల బియ్యపు రకం. బీపీటీ 5204 ప్రత్యామ్నాయంగా, భోజనానికి అనువుగా ఉంటూ అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్న గింజ రకం. పంట కాలం 130 నుంచి 135 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. 65.2 శాతం నిండు గింజలు కలిగి పచ్చి బియ్యానికి అనువుగా ఉంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి బాగుంటుంది. అగ్గి తెగులు, మెడవిరుపు, దోమ పోటును తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.4 టన్నుల దిగుబడి సామర్థ్యం కలిగి, రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం చేసే అన్ని ప్రాంతాలకూ అనువుగా ఉంటూ, డిజిటల్ మార్కెటింగ్‌లో కిలో సింగిల్ పాలిష్ బియ్యానికి రూ. 200 పైచిలుకు ధర పలికే అవకాశం ఉన్న రకం. ఎన్‌ఎల్‌ఆర్ 3238 అధిక జింక్ కలిగి ఉంటుంది. మధ్యస్థ సన్న గింజ రకం. 120 – 125 రోజుల కాల పరిమితి కలిగిన స్వల్పకాలిక వెరైటీ. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ చేనుపై మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. 62% నిండు గింజలు కలిగి, బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి అనువుగా ఉంటుంది. అగ్గి తెగులు, మెడ విరుపు తెగుళ్లను తట్టుకుంటుంది. తక్కువ నత్రజనితో (సిఫారసు చేసిన నత్రజనిలో 75%) సగటున ఎకరాకు 2.6 టన్నుల దిగుబడి ఇస్తుంది. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం చేసే అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటూ, డిజిటల్ మార్కెటింగ్‌కి అనువైన రకం.విత్తనాల కోసం వీరిని సంప్రదించవచ్చు అధిక శాతం విస్తీర్ణంలో కొత్త వెరైటీల సాగుకు కసరత్తు చేస్తున్నట్లు డా. టి.శ్రీనివాస్ తెలిపారు. ఎంటీయూ వరి రకాల విత్తనాల కోసం మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీడ్ ఆఫీసర్ డాక్టర్ పీవీ రమణారావు (ఫోన్ 94404 41922), బీపీటీ రకాల కోసం డాక్టర్ కృష్ణవేణి (ఫోన్ 94417 21120), ఎన్‌ఎల్‌ఆర్ రకాలకు డాక్టర్ శ్రీలక్ష్మి (ఫోన్ 98855 27227), వరి రకాల వివరాలు, సాగులో సందేహాల నివృత్తి కోసం డాక్టర్ టి.శ్రీనివాస్ (ఫోన్ 93968 48380) సంప్రదించాలని డా. టి.శ్రీనివాస్ వివరించారు.2023లో అఖిల భారత స్థాయిలో విడుదలైన వరి వంగడాలుఎంటీయూ 1275 పంట కాలం 135 నుంచి 140 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. గింజ మధ్యస్థ సన్నంగా ఉండి పచ్చి బియ్యానికి అనుకూలం. బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి అనువుగా ఉంటుంది. అగ్గి తెగులు, మెడ విరుపు, బ్యాక్టీరియా ఆకు ఎండు, గోధుమ రంగు మచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు మూడు టన్నుల దిగుబడి ఇస్తుంది.బీపీటీ 3050 కేంద్ర రకాల విడుదల కమిటీ ద్వారా గుజరాత్, మహారాష్ట్రలలో సాగు కోసం విడుదల చేసిన రకం. పంట కాలం 130 నుంచి 135 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి గింజ మొలకెత్తదు. కాండం ధృఢంగా ఉండి చేనుపై పడిపోదు. గింజ పొడవుగా లావుగా ఉండి అధిక బియ్యం రికవరీ కలిగిన రకం. అగ్గి తెగులు, మెడ విరుపు, గోధుమ రంగు మచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.4 నుంచి 2.6 టన్నుల దిగుబడి వస్తుంది. -
విత్తనాలు రెడీ
సాక్షి, అమరావతి: వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం సబ్సిడీ విత్తనాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పచ్చిరొట్ట, వేరుశనగ విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధం చేశారు. గురువారం నుంచే విత్తనాలు కోరే రైతుల వివరాల నమోదు మొదలవగా, 20వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. జూన్ 5వ తేదీ నుంచి వరి, ఇతర విత్తనాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన సబ్సిడీ విత్తనం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇండెంట్ మేరకు సేకరించిన విత్తనాలను మండల కేంద్రాల్లో నిల్వ చేశారు. అయితే.. పోలింగ్ ముగిసే వరకు పంపిణీ చేపట్టవద్దంటూ ఈసీ ఆంక్షలు విధించడంతో బ్రేకులు పడ్డాయి. పోలింగ్ ప్రక్రియ ముగియటంతో ఈసీ ఆంక్షలు సడలించింది. దీంతో విత్తనాల పంపిణీకి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థతో కలిసి వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.కేవీకే, ఏఆర్ఎస్లలో ఫౌండేషన్, సర్టిఫైడ్ సీడ్రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే), వ్యవసాయ పరిశోధనా స్థానాలు (ఏఆర్ఎస్) కేంద్రాల్లో 7,941.35 క్వింటాళ్ల వరి, 2,404.50 క్వింటాళ్ల వరి విత్తనాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సిద్ధం చేసింది. బ్రీడర్ సీడ్ కిలో రూ.77.80 చొప్పున, ఫౌండేషన్ సీడ్ (ఎన్‌డీఎల్‌ఆర్7) కిలో రూ.50 చొప్పున, సర్టిఫైడ్, నమ్మదగిన సీడ్ (ఎన్‌డీఎల్‌ఆర్–7) కిలో రూ.42 చొప్పున ధర నిర్ణయించి అందుబాటులో ఉంచారు. బీపీటీ 5204, 2270, 2782, 2595, 2846, 2841, ఎన్‌డీఎల్‌ఆర్ 8, ఎంటీయూ 1262, 1271, 1224, ఎంసీయూ103, ఆర్జీఎల్ 2537 వంటి ఫైన్ వెరైటీస్‌కు చెందిన ఫౌండేషన్ సీడ్ కిలో రూ.45, సర్టిఫైడ్ సీడ్ కిలో రూ.42, ఇతర వరి రకాల ఫౌండేషన్ సీడ్ కిలో రూ.40, సర్టిఫైడ్ సీడ్ కిలో రూ.38 చొప్పున ధర నిర్ణయించి రైతులకు అందుబాటులో ఉంచారు. కనీసం 25–30 కేజీల ప్యాకింగ్‌తో విత్తనం సిద్ధంగా ఉందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్టేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ శ్రీనివాస్ తెలిపారు.రూ.450 కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వంఖరీఫ్ కోసం 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్దం చేశారు. వీటిలో ప్రధానంగా 2.26 లక్షల క్వింటాళ్లు వరి, 2.99 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు ఉన్నాయి. గతంలో మాదిరిగానే 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు, 50 శాతం సబ్సిడీపై చిరుధాన్యాలు, 40 శాతం సబ్సిడీపై వేరుశనగ, నువ్వులు, 30 శాతం సబ్సిడీపై అపరాల విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. వరి విత్తనాలకు మాత్రం జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పరిధిలోని జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.1,000, మిషన్ పరిధిలో లేని జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.500 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో విత్తన పంపిణీ కోసం రూ.450 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. రూ.195 కోట్లను సబ్సిడీ రూపంలో భరించనుంది.ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభంఖరీఫ్ సీజన్‌కు సర్టిఫై చేసిన విత్తనాలను సిద్ధం చేశాం. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం ఆంక్షలు సడలించడంతో ఆర్బీకేల ద్వారా విత్తన పంపిణీకి చర్యలు చేపట్టాం. ఆర్బీకేల్లో రైతుల రిజిస్ట్రేషన్ మొదలైంది. – ఎం.శివప్రసాద్, ఎండీ, ఏపీ సీడ్స్పంపిణీకి విత్తనాలు సిద్ధంసీజన్కు ముందుగానే సర్టిఫై చేసిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాం. రైతుల ద్వారా సేకరించిన విత్తనంతో పాటు అవసరం మేరకు ఏపీ సీడ్స్ ద్వారా ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించి అగ్రి ల్యాబ్‌లలో వాటి నాణ్యతను ధ్రువీకరించిన తర్వాతే రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. – చేవూరు హరికిరణ్, ప్రత్యేక కమిషనర్, వ్యవసాయ శాఖ -
వానాకాలం సాగు..1.34 కోట్ల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం 1.34 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు పంటల ప్రణాళికను విడుదల చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి ఉంచనున్నారు. ఈ వానాకాలం అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, ఆ తర్వాత పత్తి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని పేర్కొంది. గతేడాది వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. ఈసారి 8 లక్షల ఎకరాల్లో అధికంగా పంటల సాగు జరుగుతుందని అంచనా వేసింది. » గతేడాది 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి 66లక్షల ఎకరాల్లో నాట్లు పడనున్నాయి. » గతేడాది 44.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకాగా, ఈసారి అదనంగా మరో 15.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేలా ప్రోత్సహించనున్నారు. » వరిసాగు కంటే పత్తినే ప్రోత్సహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అవసరమైతే వరిని తగ్గించి, పత్తినే 70 లక్షల ఎకరాలకు పెంచే ఆలోచన కూడా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం సాగుకనుగుణంగా విత్తన ప్రణాళికను కూడా వ్యవసాయశాఖ విడుదల చేసింది. ఈ వానాకాలం సీజన్‌కు 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించింది. » అత్యధికంగా 16.50 లక్షల క్వింటాళ్లు వరి విత్తనాలే కావడం గమనార్హం. పత్తి విత్తనాలు 54 వేల క్వింటాళ్లు అవసరం, సోయాబీన్ విత్తనాలు 1.49లక్షల క్వింటాళ్లు రైతులకు అందుబాటు లోకి తెస్తారు. మొక్కజొన్న విత్తనాలు 48 వేల క్వింటాళ్లు, కంది విత్తనాలు 16,950 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 13,800 క్వింటాళ్లు, పెసర విత్తనాలు 4,480 క్వింటాళ్లు సిద్ధం చేశారు.» జొన్న, సజ్జ, రాగి, మినుములు, ఆముదం, పొద్దు తిరుగుడు విత్తనాలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. కొంత మేరకు అందు బాటులో ఉంచామని, మిగిలిన వాటిని త్వరలో రైతులకు అందజేస్తామని అధికారులు వెల్లడించారు. » పత్తి విత్తనాలను పూర్తిస్థాయిలో ప్రైవేట్ కంపెనీలే అందుబాటులోకి తీసుకొస్తాయి. అయితే కొన్ని కంపెనీల విత్తనాలనే రైతులు కోరుకుంటారు. ఆ మేరకు ఆయా కంపెనీల విత్తనాలను అందుబాటులో ఉంచాలని కంపెనీలను వ్యవసాయశాఖ ఆదేశించింది.» ఈసారి 24.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వానాకాలం కోసం సిద్ధం చేయనున్నారు. అందు లో 10.40 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, 10 లక్షల మెట్రిక్ టన్నులు ఎన్పీకేను రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. -
అన్నదాతల్లో ఆనందం
సాక్షి, అమరావతి: ఎంతో శ్రమించి పండించిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజులోనే చెల్లింపులు జరపడంతో అన్నదాతల ఇళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికి గానూ వైఎస్ జగన్ ప్రభుత్వం మంగళవారం రూ.815 కోట్లు చెల్లించింది. దీంతో ఖరీఫ్‌లో సేకరించిన రూ.6,541.23 కోట్ల విలువైన ధాన్యానికి రూ.6,514.59 కోట్లు చెల్లించినట్లయ్యింది. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన మిగిలిన స్వల్ప మొత్తాన్ని కూడా పౌరసరఫరాల సంస్థ డీఎం అనుమతి రాగానే రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వం షెడ్యూల్ చేసింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దళారులు, మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను రక్షిస్తూ ఆర్బీకే స్థాయిలోనే సంపూర్ణ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేస్తోంది. ఖరీఫ్ సీజన్లో 29.93 లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసి.. 4.96 లక్షల మంది రైతులకు మద్దతు ధరను అందించింది. ఇలా ఈ ఐదేళ్లలో ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా రైతులకు సంపూర్ణ మద్దతు ధరను అందించిన ప్రభుత్వంగా రికార్డు సృష్టించింది. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తోంది. పెరిగిన ధాన్యం సేకరణ.. గత చంద్రబాబు ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఏడాదికి సగటున 56 లక్షల టన్నులు ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. అదే సగటు ప్రస్తుత ప్రభుత్వంలో 77 లక్షల టన్నులుగా ఉంది. దీనికి తోడు ఆర్బీకే పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వారి కల్లాల వద్దనే ధాన్యం సేకరణ చేపట్టింది. ఆర్బీకేల్లో.. ధాన్యం సేకరణకు అవసరమైన శాశ్వత ఏర్పాట్లు చేసింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా.. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే సీఎం జగన్ ప్రభుత్వంలో అదనంగా దాదాపు 20 లక్షల మంది రైతులకు సంపూర్ణ మద్దతు ధర దక్కింది. తడిచిన ధాన్యమూ కొనుగోలు.. అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా జయ రకం(బొండాలు/దుడ్డు బియ్యం) ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో జయ రకం పండించే రైతులు చాలా లాభపడ్డారు. ప్రకృతి విపత్తులు, అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని తెచ్చిన రైతులకు సైతం అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సైతం పక్కనపెట్టి తడిచిన ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో సేకరించి మరీ రైతులకు మద్దతు ధర అందించడంలో రికార్డు నెలకొల్పింది. ఆఫ్‌లైన్‌లో సేకరించిన ధాన్యాన్ని దూరాభారాలు చూడకుండా డ్రయ్యర్ సౌకర్యం, డ్రయ్యర్ ప్లాట్‌ఫాం ఉన్న మిల్లులకు తరలించి ఆరబోసి మరీ కొనుగోలు చేసింది. జగన్ ప్రభుత్వం అదనపు భారాన్నైనా మోసింది గానీ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చర్యలు చేపట్టింది. బాబు హయాంలో బకాయిలు.. చంద్రబాబు హయాంలో రైతులు ధాన్యం డబ్బుల కోసం అహోరాత్రులు ఎదురు చూడాల్సి వచ్చేది. రైతులు తాము కష్టపడి పండించిన పంటను ప్రభుత్వంపై నమ్మకంతో విక్రయిస్తే.. వారికి చెల్లించాల్సిన డబ్బులను సైతం చంద్రబాబు పక్కదారి పట్టించారు. ఇలా 2019 ఎన్నికలకు ముందు పౌరసరఫరాల సంస్థకు చెందిన రూ.4,838.03 కోట్లను వేరే కార్యక్రమాలకు మళ్లించి రైతులను నట్టేట ముంచారు. చివరకు సీఎం పదవి నుంచి దిగిపోతూ రూ.960 కోట్లు చెల్లించకుండా రైతులను మోసం చేశారు. సీఎం జగన్ వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వంలోని బకాయిలను కూడా తీర్చి.. పారదర్శక ధాన్యం కొనుగోలు విధానాన్ని తీసుకొచ్చారు. అదనంగా టన్నుకు రూ.2,523 గత ప్రభుత్వం పేరుకే ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. వారంతా రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ–క్రాప్ డేటా ఆధారంగా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరిస్తోంది. దీంతో మిల్లర్లు, దళారుల దందాకు చెక్‌పడింది. అలాగే రైతులపై ఆర్థిక భారం తగ్గించడంలో భాగంగా ప్రతి టన్ను ధాన్యం కొనుగోలులో రవాణా, హమాలీ, గోనె సంచుల వినియోగం నిమిత్తం రైతులకు రూ.2,523 అందిస్తోంది. గతంలో రైతులే సొంత ఖర్చులతో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే.. వాటిని ప్రభుత్వ వాహనాల్లో తరలించినట్టు రికార్డుల్లో నమోదు చేసి టీడీపీ నాయకులే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా మింగేశారు. -
దండిగా ధాన్యం.. నిండుగా నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం రైతులకు బాసటగా నిలుస్తోంది. ధాన్యం కొనుగోలులో సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు.. దేశంలోనే తొలిసారిగా రైతులకు గన్నీ, హమాలీ, రవాణా (జీఎల్టి) చార్జీల కింద టన్నుకు రూ.2523 అదనంగా చెల్లిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఖరీఫ్ 2023–24లో 4.97లక్షల మంది రైతుల నుంచి రూ.6,538 కోట్ల విలువైన 29.91లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. వీటిల్లో 4.36లక్షల మంది రైతులకు రూ.5700 కోట్ల మద్దతు ధర చెల్లించింది. మిగిలిన 61 వేల మంది రైతులకు రూ.838 కోట్లు అందించేందుకు వీలుగా నిధులను సమీకరించింది. ఆర్బీకేల్లో షెడ్యూల్ చేసిన వివరాల ప్రకారం వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో మద్దతు ధర మొత్తాన్ని జమ చేయనుంది. తద్వారా ఖరీఫ్ కొనుగోళ్లలో సంపూర్ణ చెల్లింపులను చేయనుంది. ఇక రబీ సేకరణకు సమాయత్తం ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తవడంతో ఏప్రిల్ మొదటి వారం నుంచి రబీ కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ సమాయత్తం అవుతోంది. రబీ సీజన్లో 25లక్షల టన్నులకుపైగా ధాన్యం వస్తుందని అంచనా వేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా గోనె సంచులు, హమాలీలు, రవాణా సదుపాయాలను కల్పించేలా క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. గోదావరి జిల్లాల్లో రబీలో సాగు చేసే జయరకం (దుడ్డు బియ్యం)ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు సేకరించనుంది. గతేడాది జయ రకం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించగా కేవలం 90వేల టన్నులు మాత్రమే వచ్చి ంది. ఈసారి 3లక్షల టన్నులు సేకరించేలా ప్రణాళిక రూపొందించింది. అయితే జయరకం ధాన్యాన్ని ప్రభుత్వం స్వయంగా మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండటం రైతులకు లాభసాటిగా మారింది. ఈ రకం ధాన్యం వినియోగం స్థానికంగా చాలా తక్కువ. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో దుడ్డు బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో గతంలో ప్రైవేటు వ్యాపారులు ఇచ్చి న రేటు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వ జోక్యంతో ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి దుడ్డు బియ్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 37.68 లక్షల మంది రైతులకు మద్దతు టీడీపీ ఐదేళ్లలో కేవలం 17.94లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. కానీ, సీఎం జగన్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. అంటే టీడీపీ హయాంలో కంటే 20లక్షల మంది రైతులకు అదనంగా సీఎం జగన్ ప్రభుత్వం మద్దతు ధర అందించింది. మొబైల్ బృందాలతో పరిశీలన.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దళారీ, మిల్లర్ల వ్యవస్థకు చెక్‌పెడుతూ ఆర్బీకేల కేంద్రంగా ఈ–క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం సేకరణ చేసి వాస్తవ రైతుకు సంపూర్ణ మద్దతు ధరను అందిచే పటిష్ట వ్యవస్థను తీసుకొచ్చారు. క్షేత్ర స్థాయికి ఆర్బీకే అసిస్టెంట్ వెళ్లి నాణ్యతను పరిశీలించడం, ఆన్లైన్లో ధాన్యం రైతు వివరాలు నమోదు, ట్రక్ షీట్ జనరేట్, చివరికి ధాన్యం తరలించాల్సిన మిల్లును కూడా ఆటోమేటిగ్గా ఎంపిక చేసే సాంకేతిక విధానాన్ని తీసుకొచ్చారు. లోడు పక్కదారి పట్టకుండా రవాణా వాహనాలకు జీపీఎస్‌ను సైతం అమర్చారు. మిల్లుల్లో ధాన్యం నాణ్యత సమస్యలను రైతులతో సంబంధం లేకుండా పరిష్కరించేందుకు కస్టోడియన్ అధికారులను నియమించారు. ప్రస్తుతం ఎన్నికల సమయం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే మండలానికి ఒక ప్రత్యేక మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేసి ధాన్యం రైతుల సమస్యలను పరిష్కరించేలా దృష్టి సారించారు. ప్రభుత్వ కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులతో పాటు స్థానికంగా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు. దిగుబడిలో 60 శాతం కొనుగోలు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా బీపీటీ, నెల్లూరు, స్వర్ణ రకాలను పండిస్తున్నారు. వీటికి జాతీయ, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంటుంది. ఇవి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కాకుండా బయటకు వెళ్లిపోతాయి. మిగిలిన రకాల ధాన్యా న్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఇలా.. ఏపీలో ధాన్యం దిగుబడుల్లో రైతుల అవసరాలకు నిల్వ చేసిన తర్వాత 60 శాతం పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. బాబు హయాంలో బకాయిలే! గతంలో రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, మిల్లర్లకు దోచిపెట్టేవారు. పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యక్షంగా రైతులు నష్టపోయేవారు. పైగా అప్పటి ఎన్నికల ముందు రైతులకు చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల ధాన్యం డబ్బులను చంద్రబాబు ప్రచార పథకాలకు మళ్లించడంతో సమయానికి డబ్బులు అందక రైతులు అల్లాడిపోయారు. చివరికి చంద్రబాబు దిగిపోతూ ఇంకా రూ.960 కోట్లు బకాయిలు పెట్టారు. వీటిని కూడా సీఎం జగన్ ప్రభుత్వమే చెల్లించింది. -
వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా
ఖలీల్‌వాడి/నిజామాబాద్ /కామారెడ్డి నెట్వర్క్: వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా అమలు చేస్తామని, ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురు వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వడగళ్ల వానలతో పంటలు దెబ్బ తిన్న రైతులను ఆదుకుంటామన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 40 వేల ఎకరాల వరకు నష్టం జరిగిందన్నారు. అధికారులు సర్వే పూర్తి చేసిన తర్వాత ఎకరానికి రూ.10 వేలు నష్ట పరిహారం అందిస్తామన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు ఆధికారంలో ఉన్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రుణమాఫీ, మహిళలకు జీరో వడ్డీ, దళితులకు మూడెకరాల పంపిణీ వంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ సర్కార్ రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. వీటికి రూ.60 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు. దీనికోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మహా అయితే ఒక సీటు రావొచ్చునని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అ«ధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎన్డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. రైతులు అధైర్యపడవద్దు : వడగళ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూర్, పెద్దవాల్గోట్ గ్రామాలు, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం లింగుపల్లి, భిక్కనూరు మండలం అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, జంగంపల్లి, బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామాల్లో పర్యటించారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
నేడు మూడో విడత రైతు భరోసా జమ
సాక్షి, అమరావతి: వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా కింద మూడో విడత పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో బుధవారం జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతోపాటు రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును సైతం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన 64.37 లక్షల రైతు కుటుంబాల ఖాతాలకు రూ.1,294.34 కోట్ల సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ.34,228 కోట్ల లబ్ధి ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఇచ్చిన మాట కంటే మిన్నగా చెప్పిన సమయానికి వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నాలుగేళ్ల పాటు ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 చొప్పున జమ చేసింది. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2 వేల చొప్పున 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాలకు రూ.1,078.36 కోట్లను బుధవారం జమ చేయనుంది. దేశంలో మరెక్కడా లేనివిధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్ (అటవీ), దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా ‘వైఎస్సార్ రైతు భరోసా‘ కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వంగా నిలిచింది. ఏటా రూ.12,500 చొప్పున ఐదేళ్లలో రూ.50 వేలు అందిస్తామన్న ఎన్నికల హామీకి మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున రూ.67,500 జమ చేసింది. బుధవారం అందిస్తున్న సాయంతో కలిపి రూ.34,288 కోట్లు జమ చేసినట్టవుతుంది. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని రాష్ట ప్రభుత్వం చెల్లిస్తోంది. రబీ 2021–22, ఖరీఫ్–2022లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు రూ.215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును బుధవారం జమ చేయనున్నారు. 2014–15 నుంచి 2018–19 వరకు పెండింగ్ పెట్టిన బకాయిలతో సహా బుధవారం అందిస్తున్న రూ.215.98 కోట్లతో కలిపి.. 57 నెలల్లో వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 84.66 లక్షల మంది రైతులకు అందించిన వడ్డీ రాయితీ మొత్తం రూ.2,050.53 కోట్లు అవుతోంది. తాజాగా జమ చేస్తున్న సాయంతో కలిపి 57 నెలల్లో రైతులకు వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1,84,567 కోట్ల సాయం అందించింది. -
నేటితో ముగియనున్న సీఎంఆర్ గడువు
సాక్షి, హైదరాబాద్: గతేడాది ఖరీఫ్‌నకు సంబంధించిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ బుధవారంతో ముగియనుంది. ఆ సీజన్లో మిల్లర్లు ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన బియ్యం బకాయిలు ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో కేంద్రాన్ని గడువు కోరవద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మిల్లర్లు, అధికారులపై ఒత్తిడి తెచ్చి 50 రోజుల్లో 20 ఎల్ఎంటీ మేర బియ్యం సేకరించింది. ఇంకా 2022–23 సీజన్‌కు సంబంధించి మరో 4.80 ఎల్ఎంటీ ఎఫ్‌సీఐకి రావాల్సి ఉన్నా, రైస్‌మిల్లర్లు డెలివరీ చేయడంలో విఫలమయ్యారు. కాగా సీఎంఆర్ డెలివరీ గాడిన పడుతున్న నేపథ్యంలో మరో నెలరోజుల గడువు పొడిగించాలని మిల్లర్లు కోరుతున్నారు. నెల రోజుల్లో పూర్తిస్థాయిలో బియ్యం ఎఫ్‌సీఐకి ఇస్తామని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులుగా అక్కడే ఉన్న సీఎంఆర్ గడువు పొడిగింపునకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కనీసం నెల రోజుల టైమ్ ఇస్తే.. గతేడాది ఖరీఫ్ సీఎంఆర్ బకాయిలు పూర్తిచేసే అవకాశం ఉంటుంది. లేకపోతే 4.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల వద్దనే ఉండిపోతుంది. దీని విలువ కనీసం రూ.1,872 కోట్లు ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రికవరీ చేయటం కూడా కష్టంగా ఉంటుంది. ఎఫ్‌సీఐకి బదులుగా సివిల్ సప్లయీస్ కోటా కింద తీసుకోవాల్సి వస్తుంది. కానీ సివిల్ సప్లయ్ తీసుకునేది లేదని చెప్పిన నేపథ్యంలో నెల రోజుల గడువు పెంచాలని భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. గత ఏడాది రబీ ధాన్యం వేలానికి... కాగా నిరుడు యాసంగి సీజన్‌కు సంబంధించిన బియ్యం బకాయిలు 32.74 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. అంటే 50 ఎల్ఎంటీ ధాన్యం గోడౌన్లలో ఉంది. ఇందులో 35 ఎల్ఎంటీ ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభు త్వం నియమించిన కమిటీ నిర్ణయించింది టెండర్లు కూడా ఆహ్వానించింది. కాగా ధాన్యం టెండర్లకు సంబంధించిన ప్రీ బిడ్డింగ్ సమావేశం బుధవారం పౌరసరఫరాలభవన్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కమిషనర్ డీఎస్.చౌహాన్ హాజరయ్యే అవకాశాలున్నాయి. -
సంతోషాల మకరందం.. పల్లెల్లో సంక్రాంతి శోభ
ఆనందాలు ముంగిళ్లలో రంగవల్లులై మెరిసినట్టు.. ఉత్సాహధ్వానాలు హరిదాసుల కీర్తనలై మార్మోగినట్టు.. సంక్షేమ సిరులు పాలపొంగళ్లై పొంగినట్టు.. ‘‘నవరత్నాలు’’ పొదిగిన నవ్వుల ఇంద్రధనస్సులు భోగిమంటల వెలుగులో దేదీప్యమానమై శోభిల్లినట్టు.. ధాన్యలక్ష్మి బసవన్నలతో కలిసి లయబద్ధంగా నర్తించినట్టు.. ప్రతిపతాక గగనాన పతంగులై సగర్వంగా రెపరెపలాడినట్టు.. ‘‘గడపగడపా’’ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతోంది. సంతోషాల ‘మకర’ందాలు గ్రోలుతోంది. పండగ కళతో ఉట్టిపడుతోంది. సాక్షి, అమరావతి: పల్లెలు సంక్రాంతి కాంతులతో తళుకులీనుతున్నాయి. దూరప్రాంతాల నుంచి బంధుమిత్రుల మిత్రుల రాకతో జన తరంగమై పరవళ్లు తొక్కుతున్నాయి. సంప్రదాయ కోడిపందేలు, ఎద్దుల ప్రదర్శనలకు సిద్ధమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయి పంటల దిగుబడులు రావడంతో కర్షకుల ఇంట ఆనందం తొణికిసలాడుతోంది. పెద్ద పండగను అట్టహాసంగా జరుపుకునేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. కొత్త దుస్తులు, కొత్తవస్తువుల కొనుగోళ్లకు తరలివెళ్తున్నారు. ఫలితంగా దుకాణాలు, షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తుండడంతో నిరుద్యోగ యువతలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటికే గ్రూప్–1, గ్రూప్–2, జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ లెక్చరర్స్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్స్తోపాటు ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్న పశుసంవర్ధక సహాయక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడంతోపాటు త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు సర్కారు ప్రకటించడంతో యువతరంలో కొత్త జోష్ కనిపిస్తోంది. సంక్షేమ ‘సిరి’నవ్వులు గడిచిన నాలుగున్నరేళ్లల్లో వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం రూ.2.46 లక్షల కోట్లు జమ చేసింది. దాదాపు ప్రతినెలా ఏదో పథకం రూపంలో ప్రభుత్వం చేయూతనివ్వడంతో పేదలు ఆర్థిక సాధికారత సాధించారు. పేదలతోపాటు మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగింది. ఫలితంగా ఇంటింటా చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయి. సేద్యలక్ష్మి కటాక్షం ఖరీఫ్ సీజన్ ఆరంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఆ తర్వాత మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు రైతన్నలను కలవరపెట్టినప్పటికీ సాగైన విస్తీర్ణంలో మాత్రం రికార్డు స్థాయి దిగుబడులు రావడం రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. వరి ఎకరాకు గతేడాది సగటున 30–35 బస్తాల దిగుబడి రాగా, ఈ ఏడాది ఏకంగా ఎకరాకు సగటున 35–40 బస్తాల దిగుబడి వచ్చింది. దీంతో రైతన్నల గాదెలన్నీ ధాన్యపురాశులతో నిండిపోయాయి. వాహనాల అమ్మకాల జోరు మరొక వైపు కొత్త అల్లుళ్ల రాకతో రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో పురోగతి నమోదవుతుందన్న విక్రయదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌కు ముందు ప్రతి నెలా దేశ వ్యాప్తంగా సగటున 18 లక్షల వాహనాలు అమ్ముడవుతుంటే కోవిడ్ తర్వాత పది లక్షలకు పడిపోగా, గతేడాది 12 లక్షల వాహనాలు అమ్మకాలు జరిగాయి. కాగా ఈ ఏడాది కనీసం 15 లక్షలకు పైగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. కార్ల అమ్మకాలు. కోవిడ్‌కు ముందు ప్రతి నెలా దేశ వ్యాప్తంగా 2.7 లక్షల కార్లు విక్రయం అవుతుంటే, ఆ తర్వాత 3.5 లక్షలకు చేరినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం 4లక్షలకు పైగా కార్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. వస్త్ర వ్యాపారంలో 20 శాతం వృద్ధి సంక్రాతి అమ్మకాల్లో వస్త్ర వ్యాపారం, ఎలక్ట్రానిక్స్ అమ్మకాలదే అగ్రస్థానంగా ఉంది. వస్త్ర వ్యాపారం గతేడాదితో పోలిస్తే 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం వృద్ధిని నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నారు. ళీ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈ సంక్రాంతికి రూ.వెయ్యి కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ♦ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వస్త్ర, బంగారం దుకాణాల ద్వారా రూ.300 కోట్ల మేర వ్యాపారం జరిగే అవకాశం నెలకొందని వ్యాపారులు చెబుతున్నారు. ♦ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భంగా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వస్త్ర, బంగారం, కిరాణా దుకాణాల్లో మొత్తం రూ.250 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని విక్రయదారుల అంచనా. వాణిజ్య కార్యకలాపాల్లో 25 శాతం వృద్ధిరేటు పొరుగు రాష్ట్రాలు, పట్టణాల నుంచి సొంతూళ్ల బాట పట్టే వారితో బస్సులు, రైళ్లు, విమానాలు కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాలతో వచ్చే ప్రయాణికులతో టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. కొత్త దుస్తులు, కొత్త వస్తువుల కొనుగోలుదారులతో అన్ని షాపులూ కిక్కిరిసిపోతున్నాయి. నూతన వస్త్రాల దగ్గర నుంచి కార్లు, బంగారం వరకు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు కొనుగోళ్లు చేస్తున్నారు. ఫలితంగా గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాల్లో 25 శాతానికి పైగా వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త అల్లుళ్లు, బంధువులతో కళకళ బంధువులు, కొత్త అల్లుళ్లతో పల్లెలు కళలాడుతున్నాయి. వారి కోసం సంప్రదాయ పిండివంటల తయారీ చేయడంతో ఇళ్లన్నీ ఘుమఘుమలాడుతున్నాయి. ముగ్గులు, వివిధ క్రీడా పోటీలు, బొమ్మల కొలువులతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది. కొన్ని చోట్ల పూర్వ విద్యార్థులంతా సమావేశాలు ఏర్పాటు చేసుకుని, నాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. కోనసీమ గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా జరిగే ప్రభల తీర్థాలు, సంప్రదాయ కోడి పందాలను చూడటానికి ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. -
Fact Check: తొందరపడి తప్పుడు రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సాధారణ విస్తీర్ణం 55.27 లక్షల ఎకరాలు. ఇప్పటి వరకు 18.84 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. రబీ సీజన్ అక్టోబర్ నుంచి డిసెంబర్ చివరి వరకూ వరినాట్లు వేస్తారు. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే జనవరి 15 వరకు వేసుకోవచ్చన్నది ఆచార్య ఏన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తల సూచన. సాధారణంగా ఖరీఫ్ వరికోతలు పూర్తయిన తర్వాత అదే పొలంలో జొన్న, నువ్వులు, కొర్ర పంటలను జనవరి నెలవరకు వేసుకోవచ్చు. ప్రాంతాల వారీగా చూస్తే కోస్తా జిల్లాల్లో ఖరీఫ్ వరి కోతలు పూర్తయిన తర్వాత అదే పొలంలో అపరాలు, మొక్కజొన్న, జొన్న, రాగి పంటలను డిసెంబర్ చివరి వరకూ వేయడం ఆనవాయితీ. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేరుశనగకు ప్రత్యామ్నాయంగా మినుములు, మేత మొక్కజొన్న, మేత జొన్న, మేత అలసంద డిసెంబర్ చివరి వరకూ విత్తుతారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వరికి ప్రత్యామ్నాయంగా శనగ, అపరాలు, ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న డిసెంబర్ చివరి వరకూ సాగు చేస్తారు. తిరుపతి జిల్లాలో మొక్క జొన్నకు ప్రత్యామ్నాయంగా సజ్జ, రాగి, కొర్ర పంటలను జనవరి 2వ వారం వరకు వేస్తారు. నెల్లూరు జిల్లాలో నువ్వులకు ప్రత్యామ్నాయంగా పెసర పంటను జనవరి 3వ వారం వరకు వేస్తారు. ఈ లెక్కన వచ్చే మూడు వారాల్లో వరి, జొన్న, రాగి, మొక్కజొన్న, అపరాలు, సజ్జ పంటల విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇంతలోనే రబీ విస్తీర్ణం 12 లక్షల ఎకరాలు తగ్గిందంటూ ఓ కథనాన్ని ఈనాడు వండి వార్చింది. అడ్డగోలు రాతలు... అబద్ధాలు వండివార్చడం... ప్రభుత్వంపై దుష్ప్రచారానికి పూనుకోవడం... ఇవి ఈనాడుకు అలవాటుగా మారింది. ఎంత చేస్తున్నా... ఏమీ చేయలేదన్నట్టు తప్పుడు కథనాలు అల్లడం రామోజీకి నిత్యకృత్య మైపోయింది. ఇప్పుడు తాజాగా రబీపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందంటూ మరో కట్టుకథ అచ్చేశారు. రబీ సీజన్ గడువు ఇంకా ముగిసి పోలేదు... ఇప్పటివరకూ పండిన పంటలపై ఇంకా లెక్క తేలలేదు. అయినా సాగు విస్తీర్ణం తగ్గిపోయిందంటూ అడ్డగోలు రాతలు. రబీ సాగుపై ఒక్కసారి కూడా సమీక్ష జరపలేదంటూ దొంగ ఏడుపులు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రత్యామ్నాయ పంటల రాయితీ విత్తనంపై సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతోందంటూ విషపు రాతలు. ‘రబీలోనూ సర్కార్ మొద్దు నిద్రే’ అంటూ వండివార్చిన ఈ అడ్డగోలు కథనంపై వాస్తవాలు ఒక్కసారి పరిశీలిద్దాం. నష్టపరిహారం పంపిణీకి చర్యలు ♦ ఖరీఫ్ పంట కాలంలో కరువు పరిస్థితులు, మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న çపంటలకు నష్టపరిహారం అందించేందు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ♦నష్టపోయిన రైతులకు మెరుగైన సాయం అందించాలన్న సంకల్పంతో నష్టపరిహారాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేంద్రం ఇచ్చే పెట్టుబడి రాయితీ కంటే మెరుగైన రీతిలో ఇచ్చేలా మార్పులు చేసింది. ♦ పంట నష్టం ప్రాధమిక అంచనా వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ల డంతో కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించి కేంద్రానికి నివేదిక కూడా సమర్పించాయి. ♦ ఖరీఫ్ సీజన్లో ప్రకటించిన కరువు మండలాల పరిధిలో పంట దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చేందుకు, కరువు, తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ♦ తుఫాన్ ప్రభావం వల్ల ధాన్యం రంగు మారినా, పాడైనా, తేమ శాతంలో నిబంధనలను సడలించి మరీ కొనుగోలుచేసింది. ఇలా డిసెంబర్ 1 నుంచి 14 వరకు తుఫాన్ తర్వాత నిబంధనలు సడలించి 12.70లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ♦ వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా రైతులను గందరగోళ పర్చేలా బురద రాతలు రాయడం ఈనాడుకే చెల్లింది. ఎప్పటికప్పుడు సాగుపై సమీక్షలు ♦ఈ సీజన్లో సాగు పరిస్థితులపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి నవంబర్ 3న, 23న వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులతో ఉన్నత స్థాయిలో సమీక్షించారు. ♦ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన కార్యదర్శి నవంబర్ 8న, ముఖ్యకార్యదర్శి నవంబర్ 9, 25, డిసెంబర్ 15న, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నవంబర్ 3, 17, 20, 29, డిసెంబర్ 18న సమీక్షించారు. ♦ శాస్త్రజ్ఞులు సిఫార్సు చేసిన ప్రత్యామ్నాయాలను రైతులు పాటించేందుకు వీలుగా నవంబర్ 10 నుంచి 28 వరకు జాయింట్ ఇరిగేషన్ – వ్యవసాయ అడ్వైజరీ బోర్డు సమావేశాలు నిర్వహించారు. ♦ దెబ్బతిన్న నారు మళ్ళు, లేత దశలో వున్న రబీ పంటలకు తిరిగి విత్తుకునేందుకు 80 శాతం రాయితీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాల (86వేల క్వింటాళ్లు) సరఫరాకు ఏర్పాటు చేశారు. ♦ ఇప్పటి వరకు 24 జిల్లాల్లోని అర్హులైన రైతులకు 31వేల క్వింటాళ్ల వరి, వేరుశనగ, శనగ, మినుములు, పెసర, నువ్వులు, ఉలవలు విత్తనాలను పంపిణీ చేశారు. ఇందుకోసం రూ.16.63 కోట్ల రాయితీ రూపంలో ప్రభుత్వం అందించింది. ♦ కానీ ఇవేవీ పట్టించుకోకుండా అసలు ప్రభుత్వం సమీక్షలే నిర్వక్షించలేదంటూ తప్పుడు ఆరోపణలు ఈనాడు చేసింది. ఖరీఫ్‌కు అనుకూలించని వర్షాలు ♦ ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌కు తీవ్ర జాప్యం ఏర్పడింది. సెప్టెంబర్ చివరి వరకు పంటలు వేసుకోవడం వల్ల, పంట కోతలు ఇç³్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దానివల్ల రబీ పంటల సాగులోనూ ఆలస్యం అయింది. ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 84.94 లక్షల ఎకరాలకు 61.70 లక్షల ఎకరాల్లోనే వేశారు. అంటే 23. 24లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. కానీ ఖరీఫ్‌లో 31 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదంటూ ఈనాడు ఆరోపించింది. ♦ ఖరీఫ్ సాగు చేయ లేని చోట ప్రత్యామ్నాయంగా వరి, మొక్క జొన్నతో పాటు చిరుధాన్యాలు, అపరాలు సాగు చేసేందుకు ముందుకొచ్చిన 1.16 లక్షల మంది రైతులకు 80 శాతం సబ్సిడీపై 30,977 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. ఇందుకోసం రూ.26.46 కోట్లు వెచ్చించారు. మరో వైపు రబీ ముందస్తు ప్రణాళికలో భాగంగా 2.70 లక్షల క్వింటాళ్ల శనగ, వేరుశనగ,వరి, మినుములు, పెసర పంటల విత్తనాలను సరఫరా చేశారు. -
రాష్ట్రంలోనూ పంటల బీమా!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా పథకాన్ని అమలు చేసే యోచనలో ఉంది. రైతు యూని ట్‌గా దీని రూపకల్పనకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చాక పంటల బీమా పథకంపై ఒక నిర్ణయానికి వస్తామని అధికారులు చెబుతున్నారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ పథకం అమలు జరిగేలా కార్యా చరణ ఉంటుందన్నారు. పంటల బీమా అమలు లోకి వస్తే ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగే రైతులకు ఆర్థికసాయం చేసేందుకు వీలుంటుంది. పంటల బీమాలో రైతులు కొంత ప్రీమియం భరిస్తే, ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో తన వాటాగా చెల్లి స్తుంది. పంటల బీమాను అమలు చేసే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఆ ప్రకారం కంపెనీలు పంట నష్టం జరిగితే రైతులకు పరిహారం ఇవ్వాలి. అయితే రైతులపై ఏమాత్రం ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే అంతా చెల్లిస్తేనే ప్రయోజన ముంటుందని అధికారులు అంటున్నారు. పంటల బీమా లేక రైతుల అవస్థ: కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంది. ఇది 2016–17 రబీ నుంచి ప్రారంభమైంది. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు. 2019–20 వరకు ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగింది. అయితే ఈ పథకం కంపెనీలనే బాగుపర్చుతుందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఫసల్ బీమా నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి విపత్తులకు పంట నష్టపోయిన రైతులు ఆర్థిక సాయం అందే అవకాశమే లేకుండా పోయింది. 2020–21 వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి 9 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 2021–22లోనూ 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ రైతులకు ఒక్కపైసా నష్టపరిహారం అందలేదు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో వడగళ్లు, భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం జరిగింది. దాదాపు 10 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేయగా, చివరకు వ్యవసాయశాఖ 2.30 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు తేల్చింది. ఎకరాకు ప్రభుత్వం రూ.10 వేల చొప్పున రైతులకు రూ. 230 కోట్లు పరిహారంగా ప్రకటించింది. ఇక మొన్నటికి మొన్న ఈ నెల మొదటివారంలో రాష్ట్రంలో తుపాను కారణంగా వివిధ రకాల పంటలకు దాదాపు 5 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. కానీ రైతులకు ఎలాంటి ఆర్థిక చేయూత అందలేదు. వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడంలోనూ విఫలమైంది. ఇలా ప్రతీ ఏడాది రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. పంటల బీమాతోనే రైతులకు మేలు ఫసల్ బీమాకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక పంటల బీమా పథకం ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న దానిపై గత ప్రభుత్వ హయాంలోనే కసరత్తు జరిగింది. గ్రామం యూనిట్‌గా కాకుండా రైతు యూనిట్‌గా దీనిని ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో విసిగివేసారి బయటకు వచ్చి, సొంత పథకాలను రూపొందించుకున్నాయి. బెంగాల్ ప్రభుత్వం విజయవంతంగా సొంత పథకాన్ని అమలు చేస్తుంది. అక్కడ అధ్యయనం చేసి, ఆ ప్రకారం ముందుకు సాగాలని అధికారులు అనుకున్నారు. కానీ ఏదీ ముందుకు పడలేదు. కేంద్ర ఫసల్ బీమా పథకం వల్ల కంపెనీలకు లాభం జరిగిందనేది వాస్తవమే కావొచ్చు. కానీ ఎంతో కొంత రైతులకు ప్రయోజనం జరిగిందని కూడా రైతు సంఘాలు అంటున్నాయి. ► 2016–17లో తెలంగాణలో వివిధ కారణాలతో 1.58 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీంతో 2.35 లక్షల మంది రైతులు రూ. 178 కోట్లు నష్టపరిహారం పొందారు. ► 2017–18లో వివిధ కారణాలతో 3.18 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో 4.42 లక్షల మంది రైతులు రూ. 639 కోట్లు పరిహారం పొందారు. ► 2018–19లో 1.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 2.2 లక్షల మంది రైతులు రూ. 570 కోట్ల పరిహారం పొందారు. ► 2019–20లో 2.1 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 3.24 లక్షల మంది రైతులు రూ. 480 కోట్ల పరిహారం పొందారు. ►ఫసల్ బీమా పథకం నుంచి తప్పుకున్న తర్వాత వ్యవసాయశాఖ నష్టం అంచనాలు వేయడం కూడా నిలిపివేసింది. దీంతో రైతులు నష్టపోతూనే ఉన్నారు.