నిరాశే!
నిరాశే!
Published Tue, Sep 12 2017 11:20 PM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM
- రైతులను ఆదుకోని ఖరీఫ్
- 20 మండలాల్లో లోటు వర్షపాతం
- జూన్‌లో వేసిన పత్తి పంటకు అపార నష్టం
– ముందుకు సాగని వరి
– వెలవెలబోతున్న చెరువులు, కుంటలు
కర్నూలు(అగ్రికల్చర్)/ కోడుమూరు రూరల్ ఖరీఫ్ సీజన్ రైతులను నిరాశపరుస్తోంది. ఆగస్టు నుంచి ఆశాజనకంగానే వర్షాలు కురుస్తున్నా పలు మండలాల్లో లోటు వర్షపాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జూన్ నుంచి ఈ నెల 12 వరకు నమోదయిన వర్షపాతాన్ని పరిశీలిస్తే 20 మండలాల్లో ఖరీఫ్ పంటల పరిíస్థితి నిరాశాజనకంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. పత్తి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. జిల్లాలో పత్తి భారీగానే సాగైనప్పటికీ జూన్‌లో వేసిన పంట వర్షాభావం వల్ల పూర్తిగా ఎత్తిపోయింది. వరి సాగులోనూ పురోగతి లేదు. మొత్తమ్మీద చూస్తే ఖరీఫ్ పరిస్థితి మెరుగ్గా లేదనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది.
ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 6,36,403 హెక్టార్లు. ఇప్పటి వరకు 4,86,556 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. అంటే మొత్తం విస్తీర్ణంలో 76శాతం మాత్రమే పంటలు వేసినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికీ బీడు ఉన్న భూముల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు 100 శాతం సబ్సిడీపై విత్తనాల పంపిణీకి చర్యలు తీసుకున్నా రైతుల నుంచి స్పందన కరువైంది. ఇప్పటికే అదను దాటిపోవడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ముందుకు రావడం లేదు. ఆగస్టు నుంచి పలు ప్రాంతాల్లో ఆశాజనకంగానే వర్షాలు పడుతున్నాయి. అయినప్పటికీ పత్తికొండ, డోన్, పాణ్యం, ఎమ్మిగనూరు, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో చెరువులు, కుంటలు మాత్రం నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. జూన్ నుంచి ఈ నెల 12 వరకు జిల్లా సాధారణ వర్షపాతం 376.9 మి.మీ ఉండగా.. 358.4 మి.మీ నమోదైంది. 4.9 శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. మండలాల వారీగా పరిశీలిస్తే 20 ప్రాంతాల్లో లోటు వర్షపాతం ఉంది. దీన్నిబట్టి కరువు పరిస్థితులు పూర్తిగా తొలగిపోలేదనే చెప్పాలి.
8 మండలాల్లో అధిక వర్షపాతం
జిల్లాలోని కేవలం ఎనిమిది మండలాల్లోనే అధిక వర్షపాతం నమోదయింది. అవుకు, డోన్, గూడూరు, మహనంది, పగిడ్యాల, ఓర్వకల్, వెలుగోడు, బనగానపల్లి మండలాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదు కాగా..మరో 26 మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయి.
పత్తి రైతుకు కష్టకాలం
ఈ ఏడాది పత్తి రైతులకు నష్టాలు తప్పడం లేదు. గత ఏడాది పత్తికి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు పోటీ పడి ఈసారి పంట సాగు చేశారు. జిల్లాలో పత్తి సాధారణ సాగు 2,08,221 హెక్టార్లు ఉండగా.. ఇప్పటికే 2,24,482 హెక్టార్లలో వేశారు. ఇందులో జూన్ నెలలోనే దాదాపు 70 వేల హెక్టార్లలో పంట సాగైంది. జూలైలో వర్షాలు బాగా పడిఉంటే ఈ పంట కాసులు కురిపించేదే! కానీ ఆ నెలలో వర్షాలు లేక పంటకు తీవ్ర నష్టం కలిగింది. ఆగస్టులో వర్షాలు పడినప్పటికీ జూన్‌లో వేసిన పంట కోలుకోలేదు. దీంతో దేవనకొండ, కోడుమూరు, కర్నూలు, కల్లూరు, ప్యాపిలి, ఆలూరు తదితర మండలాల్లో జూన్‌లో వేసిన పత్తి పంటను తొలగించి రబీలో శనగ పంట వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 50 వేల హెక్టార్లలో పత్తి పంటను తొలగిస్తున్నారు.
వరిసాగు ప్రశ్నార్థకమే
జిల్లాలో వరి సాగు ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పుడిప్పుడే కాలువలకు నీళ్లు వదులుతున్నా ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని నీటిపారుదల, వ్యవసాయాధికారులు స్పష్టం చేస్తున్నారు. వరి సాగు చేసుకుంటే కీలకమైన సమయంలో నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 76,474 హెక్టార్లు ఉండగా.. ప్రస్తుతానికి 16,305 హెక్టార్లలో మాత్రమే వేశారు. కేసీ కెనాల్, ఎల్‌ఎల్‌సీలకు నీళ్లు వదిలినప్పటికీ ఆరుతడి పంటలే శరణ్యమవుతున్నాయి. దీనికితోడు వరి సాగుకు అదను కూడా దాటుతోంది. ఈ నెల 15 వరకే వరి నాట్లు వేసుకోవచ్చని, ఆ తర్వాత వేయడం మంచిది కాదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
Advertisement
Advertisement