సాక్షి, అమరావతి: కనుచూపు మేరలో ఎక్కడ చూసినా ఎండిన పైర్లు, బీడు భూములే. తినడానికి మేత దొరక్క బక్కచిక్కిన పశువులు.. మైళ్ల దూరం నుంచి బిందెల్లో నీరు మోసుకెళుతున్న మహిళలు... వ్యవసాయం సాగక, పనుల్లేక పొట్ట చేతపెట్టుకుని బతుకు జీవుడా అంటూ వలసబాట పట్టిన రైతన్నలు, వ్యవసాయ కూలీలు.. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కడా చూసినా ఇలాంటి దయనీయ దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. సాధారణంగా జూన్–సెప్టెంబరు మధ్య ఖరీఫ్ సీజన్‌లోనే కరువు తీవ్రత కనిపిస్తుంది. ఈ ఏడాది రబీ సీజన్‌లోనూ దుర్భిక్షం తాండవిస్తుం డడం గమనార్హం. సాధారణంగా వేసవిలో నీటికోసం రైతులు బోర్లు వేస్తుంటారు. ప్రస్తుతం వేసవి కాకపోయినా నీటి దొరక్కపోవడంతో పంటలను, తోటలను కాపాడుకోవడానికి అప్పులు చేసి మరీ బోర్లు వేస్తున్నారు. అనంతపురం, కర్నూలు, వైస్సార్, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 800 నుంచి 1,000 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీటి జాడ కనిపించడం లేదు. గతేడాది డిసెంబరు 27వ తేదీన రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం 35.62 అడుగులు కాగా, ప్రస్తుతం 42.12 అడుగులకు పడిపోయింది.
రబీ ఆశలూ అడియాసలు
ఖరీఫ్‌లో కరువు కాటు వల్ల పంటలు పోగొట్టుకుని అప్పులపాలైన రైతులు రబీలోనైనా ఎంతో కొంత పంటలు పండుతాయని ఆశపడ్డారు. పెట్టుబడుల కోసం అప్పులు చేసి పంటలు సాగు చేశారు. అక్టోబరులో పంటలు విత్తిన తర్వాత వర్షాలు పడలేదు. తుపాన్ల సీజన్‌గా పేరొందిన రబీలోనూ ఏకంగా12 జిల్లాల్లో కరువు మేఘాలు కమ్ముకున్నాయి. డిసెంబరు ముగుస్తున్నా నీటి తడి లేక రబీలోనూ పంటలన్నీ మాడిపోతున్నాయి. ఖరీఫ్‌లోనూ, ప్రస్తుత రబీలోనూ వేరుశనగ కంది, పత్తి, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, ఉల్లి పైర్లు పొలాల్లోనే మలమలా మాడిపోయాయి. పెట్టుబడులు మట్టిపాలయ్యాయి.రైతన్నలపై అప్పుల భారం పెరిగింది. పైర్లు ఎండిపోవడంతో రైతులు పొలాల్లో పశువులను మేపుతున్నారు. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో వాడిపోయిన పంటలను దున్నేస్తున్నారు. కబేళాలకు తరలుతున్న పశువులునాలుగేళ్లుగా వరుస కరువులతో చితికిపోయిన అన్నదాతలు, వ్యవసాయ కూలీలు ఈ రబీపై పెట్టుకున్న ఆశలు కూడా అడియాశలయ్యాయి. ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేయడంతో కరువు తీవ్రత మరింత పెరిగింది. భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. పశుగ్రాసం లేక పశువులు బక్కచిక్కిపోతుండటంతో పాడిపై ఆధారపడిన రైతుల పరిస్థితి దీనంగా మారింది.చాలామంది మరోదారి లేక పశువులను కబేళాలకు అమ్మేస్తున్నారు.
పరాయి రాష్ట్రాల్లో బతుకు పోరాటం
రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం కుటుంబాలతో సహా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. అనంతపురం జిల్లా నుంచి కేరళ, కర్ణాటకకు వలసలు భారీగా పెరిగాయి. వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి, గాలివీడు, సుండుపల్లి, లక్కిరెడ్డిపల్లి ప్రాంతాల పేద రైతులు, కూలీలు ఎక్కువగా బెంగళూరులో పనుల వెతుక్కుంటున్నారు. కర్నూలు జిల్లా నుంచి ఎక్కువగా హైదరాబాద్‌కు వలస వెళుతున్నారు. వలస వెళ్తున్న వారితో రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లు నిత్యం కిటకిటలాడుతున్నాయి. పనిచేసే శక్తి ఉన్నవారు వలసబాట పట్టడంతో చాలా గ్రామాల్లో వృద్ధులు మాత్రమే కనిపిస్తున్నారు.
బాధితులను ఆదుకోవడానికి చేతులు రాని ప్రభుత్వం
రాయలసీమ జిల్లాల్లో ప్రధాన పంట అయిన వేరుశనగ ఖరీఫ్ సీజన్‌లో పూర్తిగా నేలపాలైంది. రబీలో వేసిన శనగ, కంది, మినుము, పెసర పంటలు కూడా వర్షాభావం వల్ల ఎండిపోయాయి. టమోటా, మిరప, బెండ, వంగ తోటలు కూడా నీరులేక వాడిపోయాయి. తమ పరిస్థితి ఏటేటా దిగదుడుపుగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువు కాటేస్తున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదని వాపోతున్నారు. అప్పులు ఎలా తీర్చాలో, కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక రైతులు మానసికంగా కుంగిపోయి, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఖరీఫ్‌లో 450కి పైగా మండలాల్లో కరువు ఉన్నప్పటికీ ప్రభుత్వం 316 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించి చేతలు దులుపుకుంది. దుర్భిక్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పైసా కూడా పెట్టుబడి రాయితీ ఇవ్వలేదు. రబీలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించలేదు. రెయిన్ గన్‌తో పంటలను రక్షించామని గతంలో గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం ఈసారి ఆ ఊసే ఎత్తలేదు.
12 జిల్లాల్లో కరువు విలయ తాండవం
రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోంది. అక్టోబరు ఒకటో తేదీతో ఆరంభమైన రబీ సీజన్‌లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లోనూ దుర్భిక్షం తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకూ కురవాల్సిన కనీస సగటు సాధారణ వర్షంతో పోల్చితే సగం కూడా కురవకపోవడం గమనార్హం. కర్నూలు జిల్లాలో అయితే కురవాల్సిన దానిలో కేవలం 29 శాతం మాత్రమే కురిసింది. రాష్ట్రంలో ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 279.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 121.2 మిల్లీమీటర్లు మాత్రమే (57 శాతం తక్కువ) నమోదైంది. సాధారణం కంటే కోస్తాంధ్రలో 54 శాతం, రాయలసీమలో 62 శాతం సగటు లోటు వర్షపాతం రికార్డయింది. ఇవన్నీ అధికారిక గణాంకాలే కావడం గమనార్హం.
ముప్పావు ప్రాంతంలో దుర్భిక్షమే
రబీలోనే కాదు అంతకు ముందు ఖరీఫ్ సీజన్ నుంచి కరువు తిష్ట వేసింది. జూన్ 1వ తేదీతో ఆరంభమైన ఖరీఫ్ సీజన్ ఇప్పటివరకూ నమోదైన అధికారిక వర్షపాతం గణాంకాల ప్రకారం.. 480 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అంటే రాష్ట్రంలో 72 శాతం ప్రాంతంలో కరువు తాండవిస్తోంది.
అప్పులు ఎలా తీర్చాలో...
‘‘ఇంతటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. సాగు చేసిన పంటలన్నీ కళ్ల ముందే ఎండిపోయాయి. రబీలో రూ.3 లక్షల ఖర్చు పెట్టి 18 ఎకరాల్లో శనగ పంట వేశా. వర్షాల్లేక పంటంతా ఎండిపోయింది. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదు’’
– తేనేశ్వరరెడ్డి, రైతు, కోడుమూరు, కర్నూలు జిల్లా
ప్రభుత్వం ఆదుకోవడం లేదు
‘‘రూ.లక్ష ఖర్చు పెట్టి 8 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశా. విత్తనాలు వేసే సమయంలో కురిసిన వాన తప్ప తర్వాత చినుకు పడలేదు. జొన్న పంటంతా ఎండిపోయింది. వానల్లేక ప్రతిఏటా పంటలు ఎండిపోతుండడంతో నష్టాలే మిగులుతున్నాయి. ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోవడం లేదు’’
– విష్ణువర్దన్‌రెడ్డి, రైతు, ప్యాలకుర్తి, కర్నూలు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment