Subsistence
-
హాయిగా ఊళ్లోనే ఉపాధి... ఇక ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా...
కూలీలకు ఉన్న ఊళ్లోనే ఉపాధి పనులను ప్రభుత్వం కల్పిస్తోంది. తద్వారా పొట్ట చేతపట్టుకుని నగరాలకు వలస వెళ్లే బాధ తప్పింది. మండు వేసవిలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం వేళల్లో మాత్రమే పని చేసేలా వెసులుబాటు కల్పించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కూలీల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఉపాధి కూలీల జీవనానికి భరోసా ఇచ్చింది. లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరింది. అధికార యంత్రాంగం నిర్విరామ కృషి ఫలితంగా ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. సాక్షి, చిత్తూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. పారదర్శకంగా పనులు చేపడుతూ కూలీల జీవనానికి భరోసా ఇచ్చింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్థానం దక్కడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో జరిగిన పనులు, లబ్ధిదారులకు అందుతున్న నగదుపై నిర్వహించిన సోషల్ ఆడిట్లో ఏపీ పనితీరును కేంద్రం ప్రశంసించింది. కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పథకాన్ని క్షేత్రస్థాయిలో ఈ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లోని 31 మండలాల్లో ఉపాధి హామీ పనులు పక్కాగా సాగుతున్నాయి. మూడేళ్లలో 5.5 లక్షల పనిదినాలు జిల్లా వ్యాప్తంగా 1,50,682 కుటుంబాల నుంచి 74,059 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. 2019 ప్రారంభం నుంచి ఈ ఏడాది జూన్ 10 వరకు 5,43,81,511 పనిదినాలను కల్పించారు. ఇందుకు గాను రూ.1971.31 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 2021–22లో 20,393 కుటుంబాలు 100 రోజులపాటు పనులకు హాజరయ్యారు. ఇక 2022–23 ఏడాది ఏప్రిల్ వరకు 13.19 శాతం వరకు వంద రోజుల పనిదినాలు పూర్తి చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కూలీలకు రోజువారి వేతనం సగటున రూ.251 అందుతోంది. ఉపాధి పనుల్లో జాబ్‌కార్డుపై నమోదైన ఒక కుటుంబానికి ఏడాదికి కనీసం వంద పనిదినాలు కల్పించాలన్నదే ప్రభుత్వ ఆశయం. కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్నా వారికి కనీసం వంద పనిదినాలు కల్పిస్తారు. పల్లెల్లో పచ్చదనం ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనుల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచే పనులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. మొక్కలు నాటేందుకు గోతులు తీయటం నుంచి మొక్కలు నాటి వాటి సంరక్షణ వరకు అన్నీ కూలీలే పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల చాలా గ్రామాల్లో పచ్చదనం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక పనిచేసిన వెంటనే కూలీలకు సకాలంలో వేతనాలను చెల్లిస్తున్నారు. మెరుగైన వసతులు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధి కూలీలకు మెరుగైన వసతులు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశంలో నీడ, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో గ్రామీణ ప్రజలు ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. కలెక్టర్ హరి నారాయణన్ క్షేత్రస్థాయిలో అమలవుతున్న ఉపాధి హామీ పనులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తూ పనుల్లో పారదర్శకతను అమలు చేస్తున్నారు. పని అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే పనులు కల్పిస్తున్నారు. వారి జీవనోపాధికి తోడ్పాటునందిస్తున్నారు. ఆదుకున్న ఉపాధి ఎండలు మండిపోతున్నాయి. పనులు చేయలేకపోతున్నాము. ఇదే సమయంలో ఉపాధి పనులు కల్పించడంతో పట్టణాలకు వలస వెళ్లాల్సిన బాధ తప్పిపోయింది. ప్రభుత్వం ఉదయం 10 గంటల్లోపే పనులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అనంతరం పశుపోషణతో మెరుగైన జీవనం సాగిస్తున్నాం. –కుప్పయ్య, గొల్లపల్లె యాదమరి మండలం రోజుకు రూ.250 పనులు లేని కాలంలోనే రోజుకు రూ.250 సంపాదించుకునే ఉపాధిని ప్రభుత్వం కల్పించింది. నిత్యం పట్టణానికి వెళ్లే అవస్థ తప్పింది. ఇంటి దగ్గర పశువులను చూసుకునే వారు లేక ఇబ్బందులు పడుతున్నాను. ఉపాధి పనుల వల్ల కూలీ వస్తోంది. మిగిలిన సమయంలో సొంతపనులూ చేసుకుంటున్నాం. – నాగమ్మ, విజయపురం పని కల్పించటమే ధ్యేయం జిల్లా వ్యాప్తంగా అడిగిన వారందరికీ పని కల్పించేలా చర్యలు చేపట్టాము. ఉపాధి పనుల్లో జిల్లాను రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నాం. అడిగిన వారికి జాబ్‌కార్డులను ఇస్తున్నాము. వేసవిని దృష్టిలో ఉంచుకుని కూలీలకు వసతులు కల్పిస్తున్నాము. – హరి నారాయణన్, కలెక్టర్, చిత్తూరు జిల్లా (చదవండి: పవన్ కల్యాణ్ జనసేన జనం కోసమా.. చంద్రబాబు కోసమా..?) -
నాయి బ్రాహ్మణులకు రూ.10వేలు అడ్వాన్స్
సాక్షి, విజయవాడ : దేవాలయాలలో పనిచేసే క్షురకులు(నాయి బ్రాహ్మణులకు) రూ. 10వేలు అడ్వాన్స్‌గా ఇస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కరోనా తీవ్రత దృష్యా దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో దేవాలయాలలో భక్తులకు శిరోముండనం చేస్తూ జీవనం సాగిస్తున్న క్షురకులు ఉపాధి లేక అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. రాష్ట్రంలోని ఎనిమిది ప్రముఖ దేవాలయాలలో పని చేస్తున్న 517 మంది, 80 చిన్న దేవాలయాలలో 451 మంది కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 968 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం వీరికి ఉపాధి లేని కారణంగా కేశఖండన శాల జేఏసీ ఆర్ధికంగా ఆదుకోవాలని అభ్యర్థన చేశారు. వీరి అభ్యర్థన మేరకు క్షురకుడు ఏ దేవాలయంలో పనిచేస్తాడో ఆ దేవాలయం నుంచి ప్రభుత్వం రూ. 10వేలు అడ్వాన్సుగా చెల్లింస్తుంది. పరిస్థితులు చక్కబడిన తరువాత ఈ మొత్తాన్ని నెలవారీ సులభ వాయిదాల్లో సంబంధిత దేవాలయానికి జమ చేయడం జరుగుతుందన్నారు. దీని వలన రాష్ట్రంలోని 968 మంది క్షురకులు లబ్ధి పొందగలుగుతారని వెల్లంపల్లి తెలిపారు. (లాక్డౌన్.. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు) ('పచ్చడి మెతుకులు తిని అయినా బతుకుదాం') -
గల్ఫ్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, తాడేపల్లిగూడెం : గల్ఫ్ దేశాలు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టిం మాణిక్యాలరావు అన్నారు. బుధవారం స్థానిక కార్యాలయం వద్ద జరిగిన గల్ఫ్ హెల్ప్‌లో పలువురు మాణిక్యాలరావుకు వినతులు అందించారు. కొవ్వూరుకు చెందిన జి.నాగేశ్వరరావు జీవనోపాధి నిమిత్తం మూడేళ్ల క్రితం సౌదీ అరేబియా దేశం వెళ్లగా, అక్కడ అనారోగ్యం కారణంగా జూలై 4న మృతి చెందాడని, మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని మృతుని సోదరుడు ముత్యాలరావు వినతిపత్రం అందించాడు. ఘంటావారిగూడెం గ్రామానికి చెందిన తన తల్లి ఎస్.నాగమణి పది నెలల క్రితం కుటుంబ అవసరాల నిమిత్తం కువైట్ వెళ్లిందని, ఆమెతో ఎక్కువ పనిచేయించుకుంటూ జీతం ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నారని, తన తల్లిని స్వదేశం రప్పించాలని కుమార్తె జ్యోతి వినతిపత్రం అందించింది. భీమవరానికు చెందిన వీరమళ్ల దేవి రెండేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం సౌది అరేబియా దేశానికి వెళ్లగా అగ్రిమెంట్ ప్రకారం రెండేళ్ల తరువాత ఇండియాకు పంపాల్సి ఉన్నా ఇండియాకు పంపడం లేదని, తన కుమార్తెను ఇండియాకు రప్పించాలని తండ్రి జి.సోమేశ్వరరావు వినతిపత్రం సమర్పించారు. మాణిక్యాలరావు మాట్లాడుతూ భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి న్యాయం జరిగే విధంగా చూస్తానని బాధితులకు వివరించారు. -
మత్స్యకారుల ఆశలపై యుద్ధమేఘాలు...?
ఎచ్చెర్ల క్యాంపస్: జీవనోపాధి కోసం వలస వెళ్లిన మత్స్యకారులు పాకిస్తాన్‌కు బందీలుగా మారారు. వారి విడుదల కేంద్ర హోం, విదేశాంగ శాఖల జోక్యంతోనే సాధ్యం. చెరలో ఉన్న గంగపుత్రుల విడుదలకు ప్రయత్నాలు జరుగుతుండగా.. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం వారి కుటుంబ సభ్యుల ఆశలపై నీళ్లు చల్లింది. తమ వారు ఇంత తొందరగా వస్తారో రారోనని వారిలో ఆందోళన తీవ్రమైంది. గుజరాత్ రాష్ట్రం వీరావల్‌లో చేపల వేటకు వెళ్లి పొరపాటున పాకిస్తాన్ జలాల్లో ప్రవేశించిన మత్స్యకారులు చెరశాల పాలయ్యారు. గత ఏడాది నవంబర్ 27న ఈ సంఘటన జరిగింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వీరి తప్పు లేదని తెలిపింది. భారత రాయబార కార్యాలయం వీరి విడుదలకు ప్రయత్నిస్తోంది. పరిస్థితి సానుకూలంగా మారింది. తాము క్షేమంగా ఉన్నామని బందీలుగా ఉన్న మత్స్యకారులు రాసిన ఉత్తరాలు ఈ నెల 2న కుటుంబ సభ్యులకు చేరాయి. దీంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తమ వారి కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో గత కొద్ది రోజులుగా సరిహద్దులో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో బందీలుగా ఉన్న మత్స్యకార కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పాక్ చెరలో ఉన్న 22 మందిలో మన జిల్లాకు చెందిన వారు 15 మంది ఉన్నారు. వీరిలో శ్రీకాకుళం పట్టణానికి చెందిన వారు ఒకరు కాగా, ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం, బడివానిపేట, తోటపాలెం పంచాయతీలకు చెందిన వారు 14 మంది ఉన్నారు. ఎలాంటి అవరోధం లేకుండా తమ వారు స్వస్థలాలకు చేరుకోవాలని వారి కుటుంబ సభ్యులు వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదని వేడుకుంటున్నారు. అనుకూల వాతావరణం ఉండేది మత్స్యకారులు పాకిస్తాన్‌కు చిక్కిన సమయంలో అనుకూల వాతావరణం ఉండేది. ఫిబ్రవరి మొదటి, రెండు వారాల్లో విడుదలవుతారనుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్య తీసుకు వెళ్లాం. బందీలుగా ఉన్న వారి నుంచి ఈ నెల 2న ఉత్తరాలు అందాయి. పాకిస్తాన్ భద్రత దళాలు దర్యాప్తు త్వరితగతిన పూర్తిచేస్తే విడుదల సాధ్యమయ్యేది. –మూగి రామారావు,మత్స్యకార యూనియన్ నాయకులు, డి.మత్స్యలేశం -
కమ్ముకున్న కరువు మేఘాలు
సాక్షి, అమరావతి: కనుచూపు మేరలో ఎక్కడ చూసినా ఎండిన పైర్లు, బీడు భూములే. తినడానికి మేత దొరక్క బక్కచిక్కిన పశువులు.. మైళ్ల దూరం నుంచి బిందెల్లో నీరు మోసుకెళుతున్న మహిళలు... వ్యవసాయం సాగక, పనుల్లేక పొట్ట చేతపెట్టుకుని బతుకు జీవుడా అంటూ వలసబాట పట్టిన రైతన్నలు, వ్యవసాయ కూలీలు.. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కడా చూసినా ఇలాంటి దయనీయ దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. సాధారణంగా జూన్–సెప్టెంబరు మధ్య ఖరీఫ్ సీజన్లోనే కరువు తీవ్రత కనిపిస్తుంది. ఈ ఏడాది రబీ సీజన్లోనూ దుర్భిక్షం తాండవిస్తుం డడం గమనార్హం. సాధారణంగా వేసవిలో నీటికోసం రైతులు బోర్లు వేస్తుంటారు. ప్రస్తుతం వేసవి కాకపోయినా నీటి దొరక్కపోవడంతో పంటలను, తోటలను కాపాడుకోవడానికి అప్పులు చేసి మరీ బోర్లు వేస్తున్నారు. అనంతపురం, కర్నూలు, వైస్సార్, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 800 నుంచి 1,000 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీటి జాడ కనిపించడం లేదు. గతేడాది డిసెంబరు 27వ తేదీన రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం 35.62 అడుగులు కాగా, ప్రస్తుతం 42.12 అడుగులకు పడిపోయింది. రబీ ఆశలూ అడియాసలు ఖరీఫ్‌లో కరువు కాటు వల్ల పంటలు పోగొట్టుకుని అప్పులపాలైన రైతులు రబీలోనైనా ఎంతో కొంత పంటలు పండుతాయని ఆశపడ్డారు. పెట్టుబడుల కోసం అప్పులు చేసి పంటలు సాగు చేశారు. అక్టోబరులో పంటలు విత్తిన తర్వాత వర్షాలు పడలేదు. తుపాన్ల సీజన్‌గా పేరొందిన రబీలోనూ ఏకంగా12 జిల్లాల్లో కరువు మేఘాలు కమ్ముకున్నాయి. డిసెంబరు ముగుస్తున్నా నీటి తడి లేక రబీలోనూ పంటలన్నీ మాడిపోతున్నాయి. ఖరీఫ్‌లోనూ, ప్రస్తుత రబీలోనూ వేరుశనగ కంది, పత్తి, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, ఉల్లి పైర్లు పొలాల్లోనే మలమలా మాడిపోయాయి. పెట్టుబడులు మట్టిపాలయ్యాయి.రైతన్నలపై అప్పుల భారం పెరిగింది. పైర్లు ఎండిపోవడంతో రైతులు పొలాల్లో పశువులను మేపుతున్నారు. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో వాడిపోయిన పంటలను దున్నేస్తున్నారు. కబేళాలకు తరలుతున్న పశువులునాలుగేళ్లుగా వరుస కరువులతో చితికిపోయిన అన్నదాతలు, వ్యవసాయ కూలీలు ఈ రబీపై పెట్టుకున్న ఆశలు కూడా అడియాశలయ్యాయి. ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేయడంతో కరువు తీవ్రత మరింత పెరిగింది. భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. పశుగ్రాసం లేక పశువులు బక్కచిక్కిపోతుండటంతో పాడిపై ఆధారపడిన రైతుల పరిస్థితి దీనంగా మారింది.చాలామంది మరోదారి లేక పశువులను కబేళాలకు అమ్మేస్తున్నారు. పరాయి రాష్ట్రాల్లో బతుకు పోరాటం రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం కుటుంబాలతో సహా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. అనంతపురం జిల్లా నుంచి కేరళ, కర్ణాటకకు వలసలు భారీగా పెరిగాయి. వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి, గాలివీడు, సుండుపల్లి, లక్కిరెడ్డిపల్లి ప్రాంతాల పేద రైతులు, కూలీలు ఎక్కువగా బెంగళూరులో పనుల వెతుక్కుంటున్నారు. కర్నూలు జిల్లా నుంచి ఎక్కువగా హైదరాబాద్‌కు వలస వెళుతున్నారు. వలస వెళ్తున్న వారితో రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లు నిత్యం కిటకిటలాడుతున్నాయి. పనిచేసే శక్తి ఉన్నవారు వలసబాట పట్టడంతో చాలా గ్రామాల్లో వృద్ధులు మాత్రమే కనిపిస్తున్నారు. బాధితులను ఆదుకోవడానికి చేతులు రాని ప్రభుత్వం రాయలసీమ జిల్లాల్లో ప్రధాన పంట అయిన వేరుశనగ ఖరీఫ్ సీజన్లో పూర్తిగా నేలపాలైంది. రబీలో వేసిన శనగ, కంది, మినుము, పెసర పంటలు కూడా వర్షాభావం వల్ల ఎండిపోయాయి. టమోటా, మిరప, బెండ, వంగ తోటలు కూడా నీరులేక వాడిపోయాయి. తమ పరిస్థితి ఏటేటా దిగదుడుపుగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువు కాటేస్తున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదని వాపోతున్నారు. అప్పులు ఎలా తీర్చాలో, కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక రైతులు మానసికంగా కుంగిపోయి, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఖరీఫ్‌లో 450కి పైగా మండలాల్లో కరువు ఉన్నప్పటికీ ప్రభుత్వం 316 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించి చేతలు దులుపుకుంది. దుర్భిక్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పైసా కూడా పెట్టుబడి రాయితీ ఇవ్వలేదు. రబీలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించలేదు. రెయిన్ గన్‌తో పంటలను రక్షించామని గతంలో గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం ఈసారి ఆ ఊసే ఎత్తలేదు. 12 జిల్లాల్లో కరువు విలయ తాండవం రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోంది. అక్టోబరు ఒకటో తేదీతో ఆరంభమైన రబీ సీజన్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లోనూ దుర్భిక్షం తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో ఇప్పటివరకూ కురవాల్సిన కనీస సగటు సాధారణ వర్షంతో పోల్చితే సగం కూడా కురవకపోవడం గమనార్హం. కర్నూలు జిల్లాలో అయితే కురవాల్సిన దానిలో కేవలం 29 శాతం మాత్రమే కురిసింది. రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటివరకూ 279.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 121.2 మిల్లీమీటర్లు మాత్రమే (57 శాతం తక్కువ) నమోదైంది. సాధారణం కంటే కోస్తాంధ్రలో 54 శాతం, రాయలసీమలో 62 శాతం సగటు లోటు వర్షపాతం రికార్డయింది. ఇవన్నీ అధికారిక గణాంకాలే కావడం గమనార్హం. ముప్పావు ప్రాంతంలో దుర్భిక్షమే రబీలోనే కాదు అంతకు ముందు ఖరీఫ్ సీజన్ నుంచి కరువు తిష్ట వేసింది. జూన్ 1వ తేదీతో ఆరంభమైన ఖరీఫ్ సీజన్ ఇప్పటివరకూ నమోదైన అధికారిక వర్షపాతం గణాంకాల ప్రకారం.. 480 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అంటే రాష్ట్రంలో 72 శాతం ప్రాంతంలో కరువు తాండవిస్తోంది. అప్పులు ఎలా తీర్చాలో... ‘‘ఇంతటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. సాగు చేసిన పంటలన్నీ కళ్ల ముందే ఎండిపోయాయి. రబీలో రూ.3 లక్షల ఖర్చు పెట్టి 18 ఎకరాల్లో శనగ పంట వేశా. వర్షాల్లేక పంటంతా ఎండిపోయింది. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదు’’ – తేనేశ్వరరెడ్డి, రైతు, కోడుమూరు, కర్నూలు జిల్లా ప్రభుత్వం ఆదుకోవడం లేదు ‘‘రూ.లక్ష ఖర్చు పెట్టి 8 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశా. విత్తనాలు వేసే సమయంలో కురిసిన వాన తప్ప తర్వాత చినుకు పడలేదు. జొన్న పంటంతా ఎండిపోయింది. వానల్లేక ప్రతిఏటా పంటలు ఎండిపోతుండడంతో నష్టాలే మిగులుతున్నాయి. ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోవడం లేదు’’ – విష్ణువర్దన్‌రెడ్డి, రైతు, ప్యాలకుర్తి, కర్నూలు జిల్లా -
కిరాయి
ఆ రోజు నా ఆటోతో దూరప్రాంతం కిరాయికి వెళ్ళాను. డ్రాపింగ్ మాత్రమే, వెయిటింగ్ లేదు. మనసంతా ప్రశాంతంగా ఉంది. లోకల్ ఆటోస్టాండ్‌లో ఉంటే పొద్దస్తమానం గడబిడే. సీరియల్ ఎప్పుడొస్తుందో తెలియదు. కడుపులో ఆకలి చచ్చిపోతుంది. అసలు ఆటోవాళ్ళ బతుకే ఓ విచిత్ర యుద్ధం. విపక్షమైన ఆర్టీసీ వాళ్ళతోనే కాక స్వపక్షమైన ఆటోవాళ్ళతోనూ పోరాడాలి. పొద్దస్తమానం పైచేయి సాధిస్తేనే చేతిలో చిల్లిగవ్వలుంటాయి. ఇక బ్రేక్ ఇన్స్పెక్టరొక పద్మవ్యూహం. చిక్కకపోతే సంతోషిస్తాం, చిక్కితే చితికిపోతాం. రోడ్ ట్యాక్స్‌లతో పాటు అనధికార ట్యాక్‌లు సైంధవుల్లాంటి ట్రాఫిక్ కానిస్టేబుళ్ళకు కట్టాలి. ఆటో విడి పరికరాల ధరలు విరుగుడులేని విషంలా మంటపెడుతుంటాయి. ఏ ఆటోవాడైనా అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడని టీవీలో కనబడితే చాలు అనుమానపు చూపులు, అవమానపు మాటలు ఎదుర్కోవాలి. ఆ మధ్యాహ్నం పాసింజర్లను దింపేసి రోడ్డుపక్క తోపుడు బండి దగ్గర టీ తాగుతూ వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా పాసింజర్లు ఫుల్‌గా తగలాలని కోరుకుంటుండగా నాకు వినబడిందా వాక్యం. ‘అయ్యా కిరాయికొస్తావా?’ తిరిగి చూస్తే ముసలావిడ. బలం కోల్పోయిన ఒంటితో బక్కగా బొమికల బొమ్మలా ఉంది.‘ఎంతమంది?’ ఉత్సాహంగా అడిగాన్నేను.శవాన్ని తీసుకెళ్ళాలి బలహీనమైన గొంతుతో చెప్పిందామె.శవం అనగానే జంకినా జవసత్త్వాలు తెచ్చుకున్నాను. కొన్నిసార్లు నిర్ణయానికి ఈ జన్మ కూడా చాలదు, కొన్నిసార్లు మాత్రం సెకను చాలు.‘పదండి’ అని ఆటోస్టార్ట్ చేసి ధర్మాసుపత్రికి పోనిచ్చాను. మామూలుగా వంద రూపాయలు తీసుకునేది, శవం అంటే వెయ్యవుతుంది. కిరాయి రెండువేలకి ఒప్పుకుంది.మా ఆవిడెప్పుడూ దెప్పి పొడుస్తుంది.‘ఆ అరవిందన్నయ్యను చూడండి. చేతికి బ్రాస్లెట్ చేయించుకున్నాడట! వాళ్ళావిడకు నెక్లెస్ చేయిస్తానన్నాడట! మీరూ ఉన్నారు.ఎందుకూ? ఎప్పుడూ ఆ ఐదొందలే తెస్తుంటారు’ అని ఎప్పుడూ దీర్ఘాలు తీస్తుంది.అరవింద్ గాడు నా ఫ్రెండ్ అండ్ అంబులెన్స్ డ్రైవర్ .నెలరోజుల క్రితం నేను ఆటో కొన్నప్పుడే చెప్పాడు. ‘అసలే నువ్వు మెతక మనిషివి.పాసింజర్లు ఎంతిచ్చినా తీసుకుంటావు. డిమాండ్ చెయ్యాల్రా, దబాయింపు కావాల్రా. నా అనుభవాలే ఇప్పుడు నీ అనుభవాలుగా చేసుకో’ అని రోజంతా క్లాస్ పీకాడు.ధర్మాసుపత్రి దగ్గరకొచ్చాం. మాకు ముందే ఆసుపత్రికి అంబులెన్స్‌లో యాక్సిడెంట్ కేసొకటి వచ్చింది. చెయ్యి విరిగిన తను మిన్ను విరిగి మీద పడ్డట్టు అరుస్తున్నాడు. డాక్టర్ గారు లేరు. ఎప్పుడొస్తారో తెలియదని నర్సు ప్రథమ చికిత్స మొదలెట్టింది. డాక్టరుకో ప్రైవేటు హాస్పిటల్ ఉందని తరువాత తెలిసింది నాకు. హాస్పిటల్ కి మూలన మార్చురీ రూమ్, పక్కన పోస్ట్ మార్టమ్ రూమ్ దగ్గర బయట పడుకోబెట్టి ఉందో కుర్రాడి శవం. కొంచెం దూరంగా కానిస్టేబుల్ కూర్చున్నాడు. ఆటో దిగి ముసలావిడ గబగబా నడుస్తూ ఆ శవం దగ్గరికెళ్ళి తన కొంగుతో కుర్రాడి శవం మీద ఈగల్ని తోలూతూ కుర్చుంది. నేను కానిస్టేబుల్ దగ్గరికెళ్ళి నమస్తే చెప్పి ఈ దారుణం ఎలా జరిగిందో ఎంక్వైరీ మొదలెట్టాను.ఈ కుర్రాడు కరంటు లైన్ మేన్ దగ్గర హెల్పర్. విద్యుత్ స్టేషన్లో లైన్ కటింగ్ తీసుకుని స్తంభం మీద కరంటు ఆపించి ఈ కుర్రాణ్ణి రిపేర్ నిమిత్తం స్తంభం పైకి ఎక్కించారు. ఆపరేటర్లు డ్యూటీలు మారి ఆ వచ్చిన ఆపరేటర్ కరెంటు లైన్ ఆన్ చేసాడు. ఈ కుర్రాడు స్తంభం మీదే గిలగిలలాడి చచ్చిపోయాడు. కేసు ఫైలయ్యింది. పోస్ట్ మార్టమ్ చెయ్యాలి అని ఏదో సర్వసాధారణ విషయంలా చెప్పాడు కానిస్టేబుల్. సాయంత్రమవుతోంది. చెయ్యి విరిగిన యాక్సిడెంట్ కేసు అప్పటిదాకా అరిచి నొప్పి అలవాటయ్యి ఊరుకున్నాడు. వ్యవస్థ మీద విరక్తితో కూడిన నవ్వొకటొచ్చింది. ఇక్కడ ఈవిడ్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, పలకరించిన వాళ్ళు లేరు. ధర్మాసుపత్రుల్లో ధర్మం లేదు. డబ్బు అనే ధనాత్మక శక్తి మనదగ్గరుంటే కార్పొరేట్ హాస్పిటళ్ళు కార్పెట్లు తెరచి మరీ వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తారు. చీకటి చిక్కగా మారుతుంది. ఆలస్యమవుతున్న కొద్దీ నాకు ఆనందంగా ఉంది. వెయిటింగ్‌తో నా కిరాయి మరింత పెరుగుతుంది. ఆవిడ వైపు నడిచాను. కిరాయి మూడు వేలని చెప్పాను. తనలో తానే కుమిలిపోతూ కన్నీరు పెట్టుకుందావిడ. నేను కరిగిపోతున్నా లేని కాఠిన్యాన్ని తెచ్చుకున్నాను. ఆటోవాళ్ళ కాలగమనంలో ఇలాంటివి కోకొల్లలు.అర్ధరాత్రప్పుడు పోలీస్ జీపొచ్చింది. కానిస్టేబుల్ జీప్ దగ్గరకు పరిగెత్తాడు. ఏవో కాగితాలు తెచ్చి ఆవిడతో వేలిముద్రలు వేయించుకున్నాడు. డాక్టర్ పోస్ట్‌మార్టమ్ చేసిన తరువాత శవాన్ని తీసుకెళ్ళాలన్నాడు. బతికే ఉన్న కొడుకుని కత్తులతో కోస్తారేమోనన్న భ్రాంతిలాంటి భయంతో ఆమె పోస్ట్‌మార్టమ్ వద్దని వేడుకుంది. చట్టం తమ చుట్టమే కాబట్టి పోస్ట్‌మార్టమ్ చెయ్యకుండానే చేశారన్న డాక్టర్ రిపోర్టుకు తాము ఒప్పుకోడానికి పదివేలిమ్మన్నాడు. అంత ఇచ్చుకోలేమని వ్యధాభరిత çహృదయంతో చెప్పిందావిడ. బేరసారాలు సాగించి కానిస్టేబుల్ ఐదువేలకి తేల్చి, డబ్బు తీసుకుని జీపు దగ్గరికెళ్ళాడు. ఇప్పుడు నేను కూడా కిరాయి తేల్చుకోవాలి. అరవింద్ పాఠాలు నా చెవుల్లో మార్మోగుతూనే నేనే అరవిందయ్యాను. ఆటో కిరాయి నాలుగు వేలు ఇమ్మని, ఇష్టం లేకపోతే వెయిటింగ్ ఛార్జీ మూడువేలివ్వండి వెళ్ళిపోతానన్నాను. ఆమె విలవిలలాడినట్టు కనిపించింది. జీవనోపాధి కోసం జంతువులా ప్రవర్తించాననిపించింది. మాటల మంత్రాలతో మమేకమై మానవత్వాన్ని మరిచిపోయానా! ఆవిడేదో అనబోయింది. అరవింద్ నాలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేశాడు. మళ్ళీ నాలో పశుత్వం పైకొచ్చింది. ససేమిరా కుదరదన్నాను. ఆవిడ మౌనంగా తల దించుకుంది. రాత్రి పరిగెడుతోంది. ఆవిడ కళ్ళకు కునుకు రావట్లేదు, కన్నీళ్ళొస్తున్నాయి. అరవింద్ గాడింట్లో కొన్న ఎల్ఈడీ టీవీని చూసి మా కాలనీ మొత్తం ఎంత గొప్పగా చెప్పుకుందో! డబ్బుని మాత్రమే మనిషికి ప్రామాణికంగా చూస్తుందీ లోకం. ఆకలి కంటే గొప్ప శత్రువు, డబ్బుకంటే గొప్ప మిత్రుడు లేరు. డబ్బువల్ల వచ్చే సుఖాలు తలుచుకుంటుంటేనే ఎంత సుఖంగా ఉందో! ఆ సుఖాలే అందమైన జ్ఞాపకాలుగా మారతాయి. లేకపోతే బతుకంతా ఓ పీడకలే. సుషుప్తిలో నిద్రపోతున్న కోరికలు ఒళ్ళు విరుచుకుని లేచి నిలబడ్డాయి. కోరికల కొలిమిలో కాలిపోతున్నాను. రోజుకు ఐదొందలు సంపాదించే నేను ఇప్పుడు నాలుగు వేలు సంపాదించబోతున్నాను. ఆ డబ్బు మా ఆవిడకిస్తే ఎంత సంబరపడుతుందో! ఇది విని అరవింద్ గాడు నన్నెంతలా అభినందిస్తాడో! అన్న ఆలోచనలతో, ఆనందంతో ఆ రాత్రి ఆవిడతో పాటు నేనూ నిద్రపోలేదు.తెల్లవారుఝూమున ఇద్దరు వ్యక్తులొచ్చారు. డాక్టర్లకి పోస్ట్‌మార్టమ్ హెల్పర్లమని చెప్పారు. చెరో ఐదొందలివ్వండి. మందు వెయ్యకపోతే ఈ శవాన్ని పోస్ట్‌మార్టమ్ రూమ్ కి తీసుకెళ్ళలేం అని అదో ఆనవాయితీగా చెప్పారు. నేనామె వైపు వకాల్తా పుచ్చుకుని పోస్ట్‌మార్టమ్ వద్దని పోలీసులకు డబ్బులిచ్చాంగా అని నిద్రపోతున్న కానిస్టేబుల్ వైపు చూశాను. ‘పోలీసుల వాటా వేరు, డాక్టర్ల వాటా వేరు. ఇంతకు మించి మీకు చెప్పక్కర్లేదనుకుంటా’ అని తల్లిదండ్రుల ఆస్తిని పిల్లలు పంచుకోవడం సహజం అన్నట్టు చెప్పాడు అందులో ఒకాయన. ఆవిడను మభ్యపెట్టి వాళ్ళు మద్యానికి డబ్బులు పట్టుకుపోయారు. తూర్పుకి తొలి వెలుగు తగిలింది. సూర్యుడు కూడా ఈమెను బాధ పెట్టడానికే వస్తున్నట్టు నాకనిపించింది. చాలాసేపటి తరువాత ఇందాకటి జంటలో ఒకాయన మళ్ళీ వచ్చాడు. డాక్టర్ తరపున వాదానికి దిగాడు. పోస్ట్ మార్టమ్ చెయ్యకుండానే రిపోర్ట్ ఇచ్చేయడానికి పెద్ద మొత్తం అడిగాడు. ఆవిడ భయపడిపోయింది. అంత ఇచ్చుకోలేనని బతిమాలింది. కొంత ఇచ్చుకుంటానని బేరమాడింది. చివరికి పోలీసులకిచ్చినంత ఫైనలయ్యింది. డబ్బు తీసుకెళ్ళి కాగితాలు తీసుకొచ్చి ఈవిడ వేలిముద్రలు వేయించుకుని శవాన్ని తీసుకెళ్ళొచ్చన్నాడు. తను వెళ్ళిపోయాడు. తన పని కూడా అయిపోయినట్టు పోలీసూ వెళ్ళిపోయాడు. నేను,ఆమె,శవం మిగిలాం. శవాన్ని ఆటోలో పెట్టడానికి సాయం పట్టడానికి కూడా ఆమెకి ఎవరూ లేరు. సహాయం లేని బాధామయ జీవితం. ఒంటరితనం, నిస్సహాయత బాధను అనేక రెట్లు పెంచుతాయి. సానుభూతి చూపించడానికి దేశంలో 130 కోట్లమంది ప్రజలున్నారు, సాయం చెయ్యడానికి మాత్రం ఒక్కడూ లేడు. శవం చుట్టూ దుప్పటి చుట్టి ఆటోలో పెట్టడానికి సహాయం చేశాను. ఆమె కళ్ళతో కృతజ్ఞతా భావం చూపింది.నాలుగ్గంటల్లో గమ్యం చేరతాం. ఉదయం తొమ్మిదయ్యింది. త్వరగా టీ తాగి త్వరత్వరగా ఇంటి ఆదుర్దాతో ఆటోస్టార్ట్ చేశాను. శవమైన కుర్రాడి తలను ఆమె ఒడిలో పడుకోబెట్టుకుని కూర్చుంది. రెండు గంటల ప్రయాణం తరువాత బైపాస్ లో పెద్ద ధర్నాతో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాం. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పైన ఎండ మాడ్చేస్తుంది, లోపల ఆకలి దంచేస్తుంది. అదే అదనుగా హోటల్ కెళ్ళి భోంచేసి వచ్చాను. ఆటోలో మాత్రం ఒళ్ళో నిద్రపోతున్న పిల్లాడికి నిద్రాభంగం అవుతుందేమోనని కాళ్ళు కదల్చకుండా ఉన్న ఆమెని చూశాను. ఒళ్ళు గగుర్పొడిచింది. ఎండ వేడిమికి ఆమె ఒళ్ళంతా వర్షధారల్లా చెమట. నా ఊహ నిజమే, సూర్యుడు కూడా ఆమెను హింసిస్తున్నాడు. నాకు తెలిసి ఆమె నిన్న మధ్యాహ్నం అన్నం మెతుకు ముట్టినట్టు నేనెరుగను. అన్నం తినమని అడిగాన్నేను. తల అడ్డంగా ఊపింది. అసలు ఆమె మనలో లేదు. నా అజ్ఞానానికి నవ్వొచ్చింది. నిజానికి అమ్మ కడుపు తృప్తిగా నిండేది బిడ్డ భోంచేశాకే గదా! ఉద్యమకారుల వైపు చూశాను. అంతలోనే మట్టిపిడతలో బంధించిన భూతం బయటపడ్డట్టు నాలో అంతర్లీనంగా ఉన్న రాక్షసుడు బయటకొచ్చాడు. సాయంత్రం దాకా ధర్నా పూర్తయ్యేలా లేదు. ఆటో వెయిటింగ్ ఛార్జి ఇంకో వెయ్యి పెరుగుతుందని ఆమెతో అన్నాను. మారు మాట్లాడలేదామె. ఎవరో తప్పు చేస్తే ఆ శిక్ష ఇలాంటోళ్ళు అనుభవించాలి. సాయంత్రం మూడు గంటలకు ట్రాఫిక్ క్లియరయ్యింది. ఆమె వంక చూసాను. ఆ గుండెల్లో ధైర్యం లేదు,దిగులు మాత్రమే ఉంది.ఈ జన్మకు ఆ దిగులు పుట్టిన శరీరంలో ఆనందం ఉండదు. ఆటో అద్దంలో నుండి ఆమెని చూశాను. ఆమె చూపులు ముందుకు చూస్తున్నా లోచూపు మాత్రం ఎటో ఉంది. దేవుడ్ని క్షమించమని వేడుకున్నాను. అయినా దేవుడి గురించో, దేశం గురించో ఆలోచిస్తే మనం బతకలేం, సుఖంగా ఉండలేం అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. అణాకాసు లేనోళ్ళదెప్పుడూ అరణ్యరోదనే. వినే వాడుండడు. విన్నా ఆలోచించే వాడుండడు. ఆలోచించినా ఆదరించే వాడుండడు.అడవి గుండా ప్రయాణం.సాయంత్రం నీరెండ, నిశ్శబ్దం. మట్టి రోడ్డులో ఆటో పాకుతోంది. చాలా దూరం ప్రయాణించాక ఐదారు పాకలున్న గూడెం దగ్గర ఆటో ఆపమంది. తురాయి చెట్టున్న పాక నీడలో చిన్న అరుగు పక్కన ఒక మంచం వాల్చి వచ్చింది. ఈలోగా చుట్టుపక్కల పాకలోళ్ళు పోగయ్యి శవాన్ని మంచం మీద పడుకోబెట్టారు. శోకాలు మిన్నంటాయి. శవం చెడిపోతుండడంతో కాసేపటికే శవాన్ని దహనానికి తీసుకెళ్ళిపోయారు. ముసలావిడ్ని ఓదార్చి ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు.ఇంకో మంచం మీద కూర్చున్న నాకు నవ్వారు ముడులు గుచ్చుతున్నాయి.పేడతో అలికిన అరుగు వాసన కొడుతోంది. ఎర్రబడ్డ కళ్ళతో ముసలావిడ డబ్బులు తీసి నా చేతికిచ్చింది. లెక్కబెడితే మూడువేలొచ్చాయి. సహజత్వం గొంతును నొక్కిపడుతున్నా కృత్రిమ కోపం కట్టలు తెచ్చుకుంది. ‘ముష్టి ఏమైనా వేస్తున్నావా?’ అని గట్టిగా అరిచాను. మూడువేలు మంచం మూలకి విసిరి కొట్టాను. ఆవిడ వణికింది. ‘అడివి మీద కడుపునింపుకొనే వోళ్ళం. దయ సూపయ్యా..’ అని దీనంగా అంది.అసలేమీ లేదు అనే వాళ్ళ దగ్గరే అంతా ఉంటుందని నా అనుమానం. పిల్లల్ని పెంచే స్థోమత లేనప్పుడు కనకూడదు అన్నాను కర్కశంగా.కనిపించని కత్తేదో ఆవిడ మెడనరాలు తెంపేసినట్టు తల దించుకుంది. నెత్తిమీద నుండి స్నానం చేసినట్టు ఆవిడకు చెమటలు కారిపోతున్నాయి.కత్తికంటే కంఠ ధ్వని ఎంత దారుణంగా గాయపరుస్తుందో నాకప్పుడే తెలిసింది. అయినా నాలో అరవింద్ ఆనందపడ్డాడు. వాడి ఆనందమే కానీ ఈవిడ విషాదం నాకక్కర్లేదనిపించింది. నేను అరిస్తే ఆమె నిస్సహాయంగా ఉండడం తప్ప మారు మాట్లాడదని నాకు తెలుసు. ఆలోచించే అవకాశం ఇవ్వకూడదని అరిచినట్టు మాట్లాడడం మొదలు పెట్టాను. నాకు తెలిసి నాకంటే ముందు విధి ఈమెకు పుట్టుక నుండి మాట్లాడే అవకాశం ఇవ్వలేదనుకుంటున్నాను.కాసేపటి తరువాత ఆవిడ తలెత్తి ‘రెక్కాడితే గానీ,డొక్కాడని బతుకులు మాయి.. కనికరించయ్యా’ అని పాదాలు పట్టుకోబోయింది.నా ఆశల చెట్టు ఎవరో నరికేసినట్టు నేను దూరంగా జరిగి ‘నువ్వెన్ని నాటకాలు ఆడినా ఐదువేలకి రూపాయి తక్కువైనా తీసుకోను’ అని కుత్తుక మీద కత్తి పెట్టినట్టు చెప్పాను. ఇంకిపోయిన ఆవిడ కళ్ళ నుండి సెల ఉబుకుతోంది. పైట కొంగుతో ముఖమంతా తుడుచుకుని ఇప్పుడే వస్తానని పక్కనున్న గుడిసెల వైపుకెళ్ళింది.నాలో రాజీకి తెచ్చాననే రాక్షసత్వం చల్లబడింది. ఎక్కడో అప్పు పుట్టిందనుకుంటా... నేను విసిరేసిన మూడువేలు ఏరుకొచ్చి రెండు వేలు కలిపి వణుకుతున్న చేతులతో నా చేతిలో పెట్టింది. ఆ డబ్బును నా చేతుల్లోకి తీసుకోగానే పెద్ద సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న ఆనందంతో ఆటో ఎక్కాను. చెమటకు చల్లగాలి తగిలి హాయిగా ఉంది.నెమ్మదిగా కోపంతో పాటు గుండెవేగం తగ్గింది. ‘అయ్యా పొద్దుబోయింది. అడివి మా సెడ్డది. ఈ రాతిరికి ఈడే పొడుకుని పొద్దెక్కాక పోదువు’ అంది ముసలావిడ. అదేమీ పట్టించుకోకుండా ఆటో స్టార్ట్ చేశాను. స్టార్టవలేదు. చీకటిని చూసి ఆటో భయపడ్డట్టుంది.అడవి మధ్యలో దారిలో ఎక్కడన్నా ఇలానే మొరాయిస్తే... నా పరిస్థితి తలుచుకుని నాకే భయమేసింది. ఆటో దిగి అడవిని చూశాను. చీకటిని మింగి ఆకలి తీరక నోరు తెరుచుక్కూచ్చున్నట్టుంది. ఉండిపోతానన్నాను.అరుగు మీద కూర్చున్నాను.ముసలమ్మ పక్క గుడిసెలకెళ్ళి పుట్టగొడుగులు, పచ్చి జీడి గింజలు పట్టుకొచ్చింది. ఇంట్లోంచి వెదురు బియ్యం తీసుకొచ్చి తురాయి చెట్టు కింద పొయ్యి వెలిగించింది. మంట వెలుగులో తురాయి పూలు కళ్ళెర్రజేసి నన్ను చూస్తున్నాయి.చూస్తుండగానే చలి నాలో ఆకలిలా పెరిగిపోయింది. ఒంటిమీద రెండు చెంబుల నీళ్ళు పోసుకొచ్చేసరికి దాదాపు సగం ప్రాణం పోయింది. విప్పిన బట్టలే కట్టుకుని గుడిసెలో కెళ్ళాను. పాక చూరుకు లాంతరు వేలాడుతోంది. విందులో వెలుగుకి కూడా వాటా కావాలని లాంతర్లో జ్వాల నాలుక ఆడిస్తుంది. ఆకలి మీద ఎంత తిన్నా ఆహారపు రుచికి ఆకలి చావట్లేదు. ముసలమ్మ దగ్గర కూర్చుని అన్నం మెతుకంత కోపం కూడా లేకుండా కొడుక్కి పెట్టినట్టు వద్దన్నా వడ్డిస్తోంది.మంచం మీద దుప్పటి దులిపి రగ్గూ ఇచ్చింది. నేను తినగా మిగిలిన అన్నం తిని ముసలమ్మ చీరకొంగు కప్పుకుని పడుకుంది. భుక్తాయాసం తీరాక చలి చుట్టుముట్టింది. రగ్గులో దూరి భుజాలెగరేశాక మంచానికి కొంచెం దూరంగా పడుకున్న ఆమె కనబడింది. దీపపు వెలుగులో ముడతలు పడిన ముఖంలో జీవం లేదు. ఆ దేహంలో ప్రాణముందంటే దేవుడి ముందైనా లేదనగలం. ఆ దేహంలో మానవత్వం లేదంటే దేవుడిని ఎదిరించైనా కాదనగలం. అరవింద్ , నా ఇల్లాలు నన్ను హీరో వర్షిప్ ముంచేస్తున్న దృశ్యాలు కరిగిపోతున్నాయి. నా అంతర్లీన ప్రపంచంలో ఎవరో నాటిన విత్తనాలు ఇంత బలంగా వేళ్ళూనుకున్నాయేమిటి? మాటల కాఠిన్యానికి మెరుగులు దిద్దుకుంటూ ముచ్చట పడిపోయానేమిటి?! పదిరోజుల్లో సంపాదించే డబ్బు అన్యాయంగా రెండ్రోజుల్లో జలగలా ఆమె రక్తం పీల్చి సంపాదించాను.వేడికి వెన్న తగిలినట్టు కరగడం మొదలయ్యాను.ఆమె ముఖం నేను రోజూ మొక్కే దేవత దగ్గర నా పాపపు భారం పెంచేసింది. తప్పు చేసేశాను. దిద్దుకోవాలి.నా ఆత్మ నా మీదే తిరగబడుతోంది. ప్రపంచంలో ఇంతకన్నా మనిషి మీద గొప్ప తిరుగుబాటు ఇంకొకటి ఉండదు. నా మనసు నుండి అరవిందుని తోసేశా... మేకపోతు గాంభీర్యాన్ని కూడా.ఎక్కడో మర్యాదస్తులకు దూరంగా...రాత్రిని కప్పుకున్న పాకలో... గొడ్డుచలి నుండి దూరంగా జరగడానికి కప్పుకోవడానికి ఏమీ లేని జీవిలో అమ్మను చూసినప్పుడు నాలోంచి నేను విడిపోయాను. బతికుండగానే నేను పునర్జన్మెత్తాలనిపించింది. ఓ నిర్ణయానికొచ్చాను.జీవితంలో ఇంత గొప్ప భోజనం చేసిన రోజు లేనట్టే, ఇంత గొప్పగా నిద్రపోయిన రోజు కూడా లేదు.ముసలావిడ లేచేసరికి మంచం మీద మనిషి లేడు. ఆమె ఇచ్చిన డబ్బులన్నీ మంచం మీదే ఉన్నాయి. మర్చిపోయాడేమోననుకుని వాటిని పట్టుకుని గుడిసె బయటకొచ్చింది. ఆటో కనబడలేదు.అతడు తిరిగొస్తాడనుకుని ఆమె కళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నాయి. గుడిసె తడిక తెరిచే ఉంది. హంతకుల్ని కూడా అమాయకులనుకునే అమ్మతనానికి కిరాయి కట్టడానికి అతడు రాడని ఆమెకు తెలియదు. జుజ్జూరి వేణుగోపాల్ -
తాండూరు రోటీ రుచిలో మేటి
జొన్నరొట్టె తాండూరువాసుల ఆహారపుటలవాట్లలో ఓ భాగమైంది. చేతులతో పిండిని నునుపు బండపై కొడుతూ.. కట్టెల పొయ్యి మీద తయారు చేసిన ఈ రొట్టెను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఒక పూట భోజనం (వరి అన్నం) లేకపోయినా ఉంటారేమో కానీ.. జొన్నరొట్టె లేకుండా మాత్రం ఉండలేరు. విందులు, శుభకార్యాల్లో కచ్చితంగా మెనూలో ఉండి తీరాల్సిందే.. డిమాండ్ పెరగడంతో కొన్ని కుటుంబాలు వీటి తయారీని ఏకంగా ఉపాధి మార్గంగా మలుచుకోవడం విశేషం. పోషకాలు పుష్కలంగా ఉండడంతోపాటు రుచి విభిన్నంగా ఉండడంతో చాలామంది జొన్నరొట్టెలను తినేందుకు అమితాసక్తి చూపుతున్నారు. - తాండూరు * జొన్నరొట్టెను ఇష్టంగా తింటున్న తాండూరువాసులు * విందులు, శుభకార్యాల్లో ఉండి తీరాల్సిందే.. * పోషక విలువలు ఉండడంతో అమితాసక్తి * జీవనోపాధిగా మలుచుకున్న కుటుంబాలు * ఆర్డర్లపై విక్రయాలు * కిరాణాదుకాణాలు, హోటళ్లలోనూ లభ్యం జిల్లాలో ఇతర ప్రాంతాల ప్రజల ఆహారపు అలవాట్లతో పోల్చితే కర్ణాటక సరిహద్దులోని తాండూరు ప్రజలు భిన్నం. ఒకప్పుడు తాండూరు కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా పరిధిలో ఉండేది. అలా కర్ణాటక సంప్రదాయమే క్రమంగా తాండూరు ప్రజల ఆహార అలవాట్లలో భాగమైంది. తాండూరు కందిపప్పు ఎంత ప్రసిద్ధో.. ఇక్కడి జొన్నరొట్టెకూ అంతే ఖ్యాతి వచ్చింది. వీటి తయారీ చాలామందికి జీవనోపాధిగా మారింది. తాండూరు పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా కుటుంబాలు జొన్నరొట్టె తయారీపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రతి ఇంట్లో.. హోటళ్లలో.. ఎక్కడికి వెళ్లినా జొన్నరొట్టెను ఇష్టంగా తింటారు. ఈ క్రమంలో జొన్నరొట్టె తయారీ ఇక్కడ ఒక కుటీర పరిశ్రమగా మారింది. పండగలు, ప్రత్యేక విందులు, ఇతర శుభకార్యాల్లో ఇది కచ్చితమైన మెనూ అయింది. ఆర్డర్లపై జొన్నరొట్టెలను కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా కిరాణా దుకాణాలు, సూపర్మార్కెట్లలో సైతం హోల్‌సేల్, రిటైల్‌గా విక్రయిస్తుంటారు. తాండూరు ప్రాంతంలో సుమారు 20 కుటుంబాలు జొన్నరొట్టె తయారీతో ఉపాధిని పొందుతుండడం గమనార్హం. పలు హోటళ్లలో ఉదయం వేళల్లో జొన్నరొట్టె కాంబినేషన్లో ‘రోటీ-బోటీ’ స్పెషల్ మెనూగా ఉండడం విశేషం. ఒక్కో రొట్టె రూ.5 .. తాండూరు పట్టణంలోని 22వ వార్డు గాంధీనగర్‌లో బుగ్గమ్మ కుటుంబం దాదాపు పదేళ్లుగా జొన్నరొట్టెలను తయారు చేస్తోంది. బుగ్గమ్మతోపాటు వీరి కోడళ్లు కూడా ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు జొన్నరొట్టెలను తయారు చేస్తారు. ఒక్కో జొన్నరొట్టె రూ.5 చొప్పున విక్రయిస్తారు. కొందరు యంత్రాలపై కూడా రొట్టెలు తయారు చేసి విక్రయిస్తున్నా.. చేతులతో చేసిన రొట్టెలను ఎక్కువగా ఇష్ట పడతారు. ఇదే మాకు ఉపాధి.. పదేళ్లుగా జొన్నరొట్టెలు తయారు చేస్తున్నాం. ఇదే మా కుటుంబానికి జీవనోపాధి. అవసరమైన వారు ఆర్డర్లపై తీసుకువెళ్తారు. కొందరు కిరాణ, హోటల్ నిర్వాహకులు మా వద్ద హోల్‌సేల్‌గా తీసుకెళ్లి రిటైల్‌గా విక్రయిస్తారు. రూ.35 కిలో చొప్పు జొన్నలు కొనుగోలు చేస్తాం. కిలో జొన్నలతో పది రొట్టెలు అవుతాయి. ఆరోగ్యానికి మంచిదని చాలా మంది ఇష్టపడతారు. -బుగ్గమ్మ, గాంధీనగర్ రోజుకు 200దాకా విక్రయిస్తాం.. రోజుకు 200 వరకు జొన్నరొట్టెలు చేసి విక్రయిస్తాం. మా ఇంట్లో అత్త, తోటి కోడళ్లు అం తా కలిసి ఉదయం నుంచి సా యంత్రం వరకు రొట్టెలు త యారు చేస్తాం. ఒక మహిళ స హాయంగా పని చేస్తుంది. రొట్టెల తయారీకి రోజు కు క్వింటాలు కట్టెలు ఉపయోగిస్తాం. ఇందుకు రూ. 600 వరకు ఖర్చవుతుంది.ఒకరు రోజుకు 50 రొట్టె లు తయారు చేయొచ్చు. కందూర్, ఇతర విం దు కార్యక్రమాల సమయంలో ఆర్డర్లపై తీసుకువెళ్తారు. -మున్నీబాయ్, గాంధీనగర్ రోజూ తినాల్సిందే.. భోజనంలో తప్పనిసరిగా జొన్నరొట్టె తింటాం. రోజులో ఒక్కసారైనా రొట్టె లేకుండా భోజనం దాదాపు ఉండదు.చాలా కాలంగా జొన్నరొట్టెను తింటున్నాం. మా కుటుంబంలో అందరికీ ఇష్టం. ఆరోగ్యపరంగా కూడా మంచిది కావడంతో ఎక్కువగా ఆసక్తి చూపుతాం. -బిడ్కర్ రఘ, తాండూరు పోషకాలు పుష్కలం.. జొన్నల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో బీ, సీ విటమిన్లు ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో క్యాన్సర్ లాంటి వ్యాధులు దరి చేరవు. జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తంలో గ్లూకోజ్ తక్కువ మోతాదులో విడుదల చేస్తుంది. గింజల నూర్పిడి సమయంలో అల్యూరాన్ పొర దెబ్బతినకపోవడం వల్ల జొన్న రొట్టెతో సమృద్ధి పోషకత్వాలులభిస్తాయి. జాతీయ జొన్న పరిశోధనా సంచాలయం జొన్నలతో తయారు చేసిన ఆహార పదార్థాలకు విలువ ఆధారిత వస్తువులుగా ప్రచారంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా జొన్న లడ్డూ, జొన్న ఉప్మా తదితర పదార్థాలపై ప్రచారం కల్పిస్తున్నారు. -డా.సుధాకర్, వ్యవసాయ శాస్త్రవేత్త, తాండూరు -
విద్యుదావేశం
15 రోజులుగా వేళాపాళా లేని విద్యుత్ కోతలతో విసిగి వేసారిన చెరకు రైతులు రోడ్డెక్కారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కోత కారణంగా బెల్లం తయారికీ తీవ్ర ఆటంకం కలుగుతోందని అధికారులకు ఎన్నో మార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహించి విద్యుత్ ఏఈని నిర్బంధించారు. విద్యుత్ ఉపకేంద్రానికి తాళం వేశారు. మునగపాక, న్యూస్‌లైన్ : మండలంలోని అధికశాతం రైతులు చెరకుపంటను సాగు చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు. అయితే గత 15 రోజులుగా వ్యవసాయ రంగానికి ఇచ్చే విద్యు త్ సరఫరాలో తరచూ అంతరాయం కలుగుతోంది. దీంతో పదేపదే అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో అఖి లపక్షం ఆధ్వర్యంలో శనివారం విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. రహదారిపై బైఠాయించారు. ‘కోత’ కష్టాలు గట్టెక్కించాలంటూ సుమారు 3 గంటల పాటు నినాదాలు చేశా రు. వ్యవసాయ రంగానికి ఇచ్చే సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, బెల్లం తయారీకి అవసరమయ్యే విద్యుత్‌ను సకాలంలో సరఫరా చేయాలంటూ డి మాండ్ చేశారు. చెరకు తోటలకు వేలాది రూపాయలు పెట్టుబడులు పెడుతున్నామని అయితే రైతాంగానికి ఇచ్చే విద్యుత్ సరఫరాలో అంత రా యం కారణంగా రసం పులిసిపోయి దిగుబడులు తగ్గిపోతున్నాయని సీపీఎం జిల్లా నాయకుడు ఎ. బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిళ్లపాది కష్టపడి పనిచేసినా రైతుకు కష్టాలే తప్ప ఆదుకున్నవారు లేరంటూ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్య పరిష్కారంపై తమకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యుత్ ట్రాన్స్‌కో ఏఈ త్రినాథరావు కలుగజేసుకొని రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని ఆందోళన విరమించాలని కోరారు. అయితే తమకు ఇప్పటికిపుడే స్పష్టమైన హామీ ఇవ్వాలని లేకుంటే ఆందోళన విరమించబోమని రైతులు ఆయనకు స్పష్టం చేశారు. దీంతో అటు అధికారులు, ఇటు రైతుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. వివాదం పెరగడంతో రైతులు ట్రాన్స్‌కో ఏఈ త్రినాథరావును తోసుకుంటూ కొంతదూరం తీసుకువెళ్లి ఉపకేంద్రంలో నిర్బంధిం చి తలుపులు తాళం వేశారు. సమస్య జటిలంగా మారడంతో అప్రమత్తమైన పోలీసులు అనకాపల్లి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు ఇరువర్గాల వారితో సంప్రదింపులు జరిపారు. సాధ్యాసాధ్యాలను పరిశీ లించి సోమవారం సమస్య పరిష్కారానికి అవసరమయ్యే చర్యలు చేపడతామని ట్రాన్స్‌కో ఉన్నతాధికారుల నుంచి హా మీ లభించడంతో ఎట్టకేలకు రైతులు ఆందోళన విరమించారు. కాగా తనను రైతులు అన్యాయంగా నిర్బంధించారని ఏఈ త్రినాథరావు కూడా ట్రాన్స్‌కో ఉన్నతాధికారులకు ఫోన్లో సమాచారం అందించారు. ఆందోళన కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మళ్ల సంజీవరావు, రైతు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు పెంట కోట రమణబాబు, ఆడారి మహేష్, రైతు సంఘమాజీ అధ్యక్షుడు పెంట కోట సత్యనారాయణ, సీపీఎం నాయకుడు ఆళ్ల మహేశ్వరరావు, తెలుగుదేశం నాయకుడు దాడి అప్పలనాయు డు, కాండ్రేగుల జగ్గప్పారావు, నరాలశెట్టి తాతారావు, మళ్ల కృష్ణ, కాండ్రేగుల రామగణేష్, అప్పలనాయుడు , పలు ప్రాంతాల రైతులు పాల్గొన్నారు. ఆందోళన కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దారు. -
అమ్మ వచ్చింది..
వర్షకొండ (ఇబ్రహీంపట్నం), న్యూస్‌లైన్ : బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లి.. అక్కడి నిబంధనలతో ఐదు నెలల పాటు జైలులో బందీ అయిన ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండకు చెందిన కొంతం సుశీల తన ఐదుగురు పిల్లలతో కలిసి బుధవారం క్షేమంగా ఇల్లు చేరింది. పెళ్లయి.. ఓ కూతురు జన్మించాక.. భర్త నుంచి విడాకులు తీసుకున్న సుశీల 17 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ఆజాద్ వీసాపై కువైట్ వెళ్లింది. అక్కడ పలు గృహాల్లో పనిమనిషిగా పనిచేసింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పరిచయం కాగా వివాహమాడింది. మొదటి కాన్పుకోసం ఇక్కడకు వచ్చి బిడ్డ పుట్టాక ఇక్కడే వదిలి మళ్లీ కువైట్‌కు వెళ్లింది. అక్కడ మరో ఐదుగురికి జన్మనిచ్చింది. మహేశ్వరి, సాయిబాబా, నవీన్‌కుమార్, లయ, స్వప్న ఆమె పిల్లలు. ఈ క్రమంలో అక్కడి నిబంధనల ప్రకారం.. భర్తను స్వదేశానికి పంపించారు. సుశీలను అక్కడి పోలీసులు జైలులో బంధించారు. ఆమెతో ముగ్గురు పిల్లలు జైల్లో, ఇద్దరు బయట ఉండిపోయారు. సుశీల, ఆమె పిల్లల వ్యథను, వర్షకొండలో ఉన్న ఆమె మరో కూతురు వ్యథను ‘సాక్షి’ పలుమార్లు కథనాలుగా ప్రచురించింది. ఐదునెలల అనం తరం పిల్లలతోపాటు ఆమెకూ ఔట్ పాస్‌పోర్టులు ఇచ్చి స్వదేశానికి పంపించారు. విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఆమె.. అక్కడినుంచి ట్యాక్సీ ద్వారా ఇంటికి చేరుకుంది. దీంతో ఆమె కుటుంబసభ్యుల్లో ఆనం దం వెల్లివిరిసింది. ఎన్నాళ్లయ్యిందమ్మా.. నిను చూసి అం టూ కంటతడిపెట్టారు. విషయం తెలుసుకున్న మీడియా ఆమె వద్దకు వెళ్లగా.. తన కష్టాలను ఏకరువు పెట్టింది. వీసాను రెన్యూవల్ చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో పోలీసులు పట్టుకుని జైల్లో వేశారని, లంచా లు ఇవ్వనిదే మనదేశ రాయబార కార్యాలయం అధికారులు జైల్లో నుంచి విడిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదుకునేవారు లేక తనలాంటి వారెందరో జైల్లో మగ్గుతున్నారని పేర్కొంది. అలాంటివారిని విడిపించేం దుకు ప్రభుత్వం సహకారం అందించాలని విదేశీ వ్యవహారాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె కోరింది. తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది.