
సాక్షి, తాడేపల్లిగూడెం : గల్ఫ్ దేశాలు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టిం మాణిక్యాలరావు అన్నారు. బుధవారం స్థానిక కార్యాలయం వద్ద జరిగిన గల్ఫ్ హెల్ప్‌లో పలువురు మాణిక్యాలరావుకు వినతులు అందించారు. కొవ్వూరుకు చెందిన జి.నాగేశ్వరరావు జీవనోపాధి నిమిత్తం మూడేళ్ల క్రితం సౌదీ అరేబియా దేశం వెళ్లగా, అక్కడ అనారోగ్యం కారణంగా జూలై 4న మృతి చెందాడని, మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని మృతుని సోదరుడు ముత్యాలరావు వినతిపత్రం అందించాడు.
ఘంటావారిగూడెం గ్రామానికి చెందిన తన తల్లి ఎస్.నాగమణి పది నెలల క్రితం కుటుంబ అవసరాల నిమిత్తం కువైట్ వెళ్లిందని, ఆమెతో ఎక్కువ పనిచేయించుకుంటూ జీతం ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నారని, తన తల్లిని స్వదేశం రప్పించాలని కుమార్తె జ్యోతి వినతిపత్రం అందించింది.
భీమవరానికు చెందిన వీరమళ్ల దేవి రెండేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం సౌది అరేబియా దేశానికి వెళ్లగా అగ్రిమెంట్ ప్రకారం రెండేళ్ల తరువాత ఇండియాకు పంపాల్సి ఉన్నా ఇండియాకు పంపడం లేదని, తన కుమార్తెను ఇండియాకు రప్పించాలని తండ్రి జి.సోమేశ్వరరావు వినతిపత్రం సమర్పించారు. మాణిక్యాలరావు మాట్లాడుతూ భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి న్యాయం జరిగే విధంగా చూస్తానని బాధితులకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment