తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం, బీజేపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం, ఘర్షణ చోటుచేసుకుంది. జగన్నాధపురం గ్రామంలో అక్రమంగా మట్టి రవాణాకు పాల్పడుతోన్న 30 లారీలను స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు అడ్డుకున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే పైడికొండల, అధికారులకు సమాచారమిచ్చినా స్పందించకపోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు. పైడికొండలకు మద్దతుగా ఆందోళనలో వైఎస్సార్‌సీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆందోళనకు వ్యతిరేకంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. గ్రామంలోని అన్ని మార్గాలను తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు దిగ్బంధనం చేశారు. ఇరువర్గాల ఆందోళనలతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను భారీగా మోహరించారు.
ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు మాట్లాడుతూ..మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతోన్న వారిని అరెస్ట్ చేసి వారి వాహనాలను అధికారులు తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే తెలుగుదేశం నేతలు రోడ్లు దిగ్బంధించడం సిగ్గుచేటన్నారు. రోడ్లు దిగ్బంధనం చేసిన వారిని వదిలి నా వద్దకు వచ్చి జులూం చూపితే ఖబడ్దార్ అంటూ పోలీసులకు మాణిక్యాల రావు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. మీకు(పోలీసులకు) చేతకాకపోతే చెప్పండి.. మీరు పది నిమిషాలు వెళ్లిపోండి..తానేంటో చూపిస్తానని సవాల్ విసిరారు.
తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తత
Published Tue, Nov 27 2018 5:35 PM | Last Updated on Tue, Nov 27 2018 6:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment