pydikondala manikyala rao
-
ఫొటోగ్రాఫర్ నుంచి మంత్రి స్థాయికి..
సాక్షి, తాడేపల్లిగూడెం: రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు (60) కన్నుమూశారు. విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కరోనాతో పాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మధుమేహంతో కొన్నిరోజులుగా బాధపడుతున్న ఆయన ఒక్కసారిగా ఆరోగ్యంలో మార్పు రావడంతో ప్రాణాలు విడిచారు. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ ఇతర సమస్యలు ఆయనను ఇబ్బంది పెట్టడంతో ఆరోగ్యం క్షీణించింది. బీజేపీ అగ్రనేతల ఆదేశాలతో న్యూఢిల్లీలోని ఆలిండియా మెడికల్ సైన్సెస్ బృందం వెంటిలేటర్‌పై ఉన్న మాణిక్యాలరావుకు వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయింది. శనివారం మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ప్రాణాలు విడిచారు. ఆయనకు భార్య సూర్యకుమారి, కుమార్తె గట్టిం సింధు, అల్లుడు నవీన్‌కిషోర్ ఉన్నారు. గతనెల 3న కరోనా పాజిటివ్ రావడంతో విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన కొద్దిరోజుల్లో కరోనా నెగెటివ్ వచ్చినా ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రాణాలు వదిలారు. మాణిక్యాలరావు పార్థివదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తున్న దృశ్యం అసామాన్యుడిగా ఎదిగిన సామాన్యుడు పైడికొండల సుబ్బారావు, రంగనాయకమ్మ దంపతుల తొలి సంతానం మాణిక్యాలరావు. ఆయనకు ఇద్దరు చెల్లెళ్లు. మాణిక్యాలరావు సామాన్య ఫొటోగ్రాఫర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. తాడేపల్లిగూడెంలోని కేఎన్ రోడ్డులో ప్రభాతా టాకీస్ వద్ద సారథి స్టూడియోను ప్రారంభించారు. తర్వాత స్టూడియోను కుమార్తె సింధు పేరిట సింధు స్టూడియోగా మార్చారు. అనంతర కాలంలో బస్ డిపో ఎదురుగా సింధు షూమార్టును ప్రారంభించారు. బాల్యంలోనే రాష్ట్రియ స్వయం సేవక్ సిద్ధాంతాలకు ఆకర్షితులై సంఘ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 7వ తరగతి చదువుతుండగా జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారు. హైసూ్కల్ విద్యార్థి దశలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటం చేశారు. బీజేపీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా పనిచేసిన ఆయన పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998 నుంచి 2004 వరకు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయన నరసాపురం ఎంపీగా యూవీ కృష్ణంరాజును గెలిపించడంలో విశేష కృషి చేశారు. 13వ వార్డు శివాలయం వీధిలో కౌన్సిలర్‌గా పోటీచేసి విజయం పొందలేకపోయారు. 2019లో నరసాపురం లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా పైడికొండల పోటీచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం వచ్చినా, తల్లి మరణం కారణంగా ఆ పదవిని స్వీకరించలేదు. సీమాంధ్ర ఉద్యమ కమిటీ ఉపాధ్యక్షుడిగా సీమాంధ్ర అవసరాలను కేంద్ర నాయకుల వద్దకు తీసుకెళ్లారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడిగా ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, 30 మండలాల్లో శీతల శవపేటికల ఏర్పాటు వంటివి చేశారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. అయోధ్య కరసేవలో పాల్గొన్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ కేబినెట్లో ఆయన దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నిట్ తెచ్చిన ఘనత ఆయనిదే రాష్ట్ర విభజన అనంతరం జాతీయ విద్యాసంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)ను తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేయడంలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు నిట్ ఇక్కడికి రాకుండా మోకాలడ్డిన సమయంలో కేంద్రంలో పలుకుబడి ఉపయోగించి, బీజేపీ అగ్రనాయకుల ఆశీస్సులతో జాతీయ విద్యాసంస్థను ఇక్కడకు తీసుకువచ్చారు. మంత్రిగా రాష్ట్రంలో నూతన ఆలయాల నిర్మాణానికి కృషి చేశారు. పట్టణంలో బలుసులమ్మ, ముత్యాలమ్మ, నందికొమ్మ రామాలయ నూతన నిర్మాణాలు ఆయన హయాంలోనే జరిగాయి. ధైర్యం చెప్పి వెళ్లి.. ‘కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్ వచ్చింది. కరోనా వస్తే రహస్యంగా దాయవద్దు. భయపడాల్సిన అవసరం లేదు. ఎయిడ్స్ లాంటి ప్రమాదకరమైన వ్యాధి కాదు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, ఆరోగ్యంపై సాధ్యమైనంత శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటే ఇబ్బంది లేదు’ అంటూ ఆయన గతనెల 4న వాట్సాప్‌లో వీడియో సందేశం ఇచ్చి కరోనా చికిత్సకు విజయవాడ వెళ్లారు. చిరునవ్వు చిరునామా చెరిగిపోయింది వెండిలాంటి జుట్టు, ముఖంపై చిరునవ్వు చిరునామా, రండి, కూర్చోండి అంటూ ఆప్యాయత నిండిన పిలుపు కలబోతగా మాణిక్యాలరావు జనంతో ఉన్నారు. ఆనందం వచ్చినా, కోపం వచ్చినా దాచుకోని వ్యక్తిగా మాణిక్యాలరావు మెలిగారు. ఆయన మరణంతో జిల్లాలో విషాదఛాయలు అలముకున్నాయి. బీజేపీ అగ్రనేతలతో సత్సంబంధాలు బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వంతో మాణిక్యాలరావు సత్సంబంధాలు కొనసాగించారు. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, అగ్రనేతలు అమిత్‌షా వంటి వారితో పాటు జేవీఎల్ నరసింహారావు, కిషన్‌రెడ్డి, సోము వీర్రాజు వంటి వారితో స్నేహసంబంధాలు కొనసాగించారు. ఆయనకు కర్ణాటక పార్టీ నేతలతోనూ సంబంధాలు ఉన్నాయి. వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో వివిధ వర్గాలతో కలిసిమెలిసి పనిచేశారు. నిట్ పైడికొండలను మరువదు తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్ స్థాపనలో కీలకపాత్ర పోషించినందుకు మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును నిట్ ఎన్నటికీ మరువదని డైరెక్టర్ సీఎస్పీ రావు అన్నారు. శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మాణిక్యాలరావు మరణం ఊహించలేదని, కరోనా నుంచి కోలుకుని తిరిగి వస్తారనుకుంటున్న దశలో ఆయన మరణం విషాదకరం అని పేర్కొన్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు దేవదాయ, ధర్మాదాయశాఖ మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు పార్థివదేహానికి అధికార లాంఛనాలతో శనివారం అంత్యక్రియలు జరిగాయి. స్థానిక 6వ వార్డులోని శ్మశాన వాటికలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. తొలుత పట్టణానికి చేరుకున్న మాణిక్యాలరావు పార్థివదేహాన్ని స్థానిక మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఆయన కుటుంబ సభ్యులు కడసారి చూసేందుకు ఉంచారు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులు 20 మందిని మాత్రమే శ్మశాన వాటికలోకి అనుమతినిచ్చారు. శ్మశాన వాటిక ప్రాంగణం వద్ద మాణిక్యాలరావు చిత్రపటాన్ని సందర్శనార్థం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వచ్చిన పోలీసు దళం గాలిలోకి కాల్పులు జరిపి గౌరవవందనం సమరి్పంచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ, నాయకులు ఈతకోట తాతాజీ, అయినం బాలకృష్ణ, కంచుమర్తి నాగేశ్వరావు, నల్లకంచు రాంబాబు, తాడికొండ వాసు తదితరులు హాజరయ్యారు. సోము వీర్రాజు కన్నీటి పర్యంతం మాణిక్యాలరావు అంత్యక్రియల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారాన్ని పంచుకున్న వ్యక్తిని అధికార లాంఛనాలతో పంపించాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. 1981లో తన ఆ«ధ్వర్యంలో మాణిక్యాలరావు బీజేపీలో చేరారన్నారు. మాణిక్యాలరావు శాసనసభ్యులుగా, మంత్రిగా ఉత్సాహంగా పనిచేశారన్నారు. అలాంటి వ్యక్తిని ఈ పరిస్థితిలో చూస్తానని అనుకోలేదన్నారు. మాణిక్యాలరావు కుటుంబానికి పార్టీ తరఫున సానుభూతి తెలిపారు. మాణిక్యాలరావు మరణం పారీ్టకి, వ్యక్తిగతంగా తనకు తీరని నష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి మిత్రుడిని కోల్పోయా వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయానని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మరణం పట్ల రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సంతాపం తెలిపారు. దేవదాయ మంత్రిగా జీర్ణావస్థలో ఉన్న పలు ఆలయాలను ఆయన పునరుద్ధరించారన్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారన్నారు. నిట్‌ను తాడేపల్లిగూడెం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడానని, ఎంతో ధైర్యంగా ఉన్నారన్నారు. కరోనాను జయించి ఆరోగ్యవంతంగా వస్తారని తాను భావించానని, ఇంతలోనే ఇలా జరగడం అత్యంత బాధాకరం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. చాలా బాధ కలిగించింది కరోనా మహమ్మారికి మాజీ మంత్రి మాణిక్యాలరావు బలి కావడం చాలా బాధ కలిగించిందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సంతాపం తెలిపారు. మాణిక్యాలరావు క్రమశిక్షణ, నిబద్ధత గల నేత అని అన్నారు. ఉదయం ఆయన అల్లుడుతో ఫోన్లో మాట్లాడి యోగ క్షేమాలు కనుక్కుంటే బాగానే ఉందని చెప్పగానే ఎంతో సంతోషించానన్నారు. బీజేపీలో పేరున్న నాయకుడు ఇలాంటి పరిస్థితుల్లో దూరమవ్వడం చాలా బాధాకరం అన్నారు. మాణిక్యాలరావు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని ఎమ్మెల్యే కొట్టు అన్నారు. మంత్రి నాని దిగ్భ్రాంతి మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతిపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మాణిక్యాలరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నట్లు ఆయన తెలిపారు. సౌమ్యులు, ప్రజల నాయకుడు మూడున్నర దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో నిబద్ధత, నిజాయతీ, అంకితభావంతో పనిచేసిన నేత అని కొనియాడారు. దేవదాయశాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారని, బీజేపీ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో నిట్ విద్యాసంస్థ నెలకొల్పటంలో కీలకంగా వ్యవహరించారని అన్నారు. ఆప్యాయంగా పలకరించే ఆయన మృతి బీజేపీకి తీరని లోటన్నారు. -
‘భారతీయుడినని సగర్వంగా చెప్పుకునేలా చేశాడు’
సాక్షి, పశ్చిమ గోదావరి: ‘జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏను రద్దు చేసి దేశమంతటా ఒకే రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చిన ధీరుడు ప్రధాని నరేంద్ర మోదీ’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం పోడూరు మండలం వేడంగిలో బీజేపీ సభ్యత్వ నమోదులో కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి ఒక్కరు భారతీయుడు అని సగర్వంగా చెప్పుకునే విధంగా మోదీ సుపరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి తామే వాటిని అమలు చేసినట్లు దుష్ప్రచారం చేసిందని టీడీపీని విమర్శించారు. పైగా ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకులు అందినకాడికి ప్రజలను దోచుకున్నారని మండిపడ్డారు. -
‘నా అభిమానులంతా బీజేపీలో చేరండి’
సాక్షి, విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి వల్ల ప్రపంచ దేశాలు అన్ని భారతదేశం వైపు చూస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో నిర్వహించిన బీజేపీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోం సహాయక మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి మాణిక్యాలరావులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలబెట్టాడని కొనియాడారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం తన అభిమానులు అందరూ బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ.. గతంలో బీజేపీని ఒక వర్గానికి చెందిన పార్టీగా ముద్రవేశారు కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోదీ సాధించిన విజయంతో బీజేపీ అన్ని వర్గాల పార్టీగా అవతరించిందన్నారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వారికి తమ పార్టీలో ఉన్నతమైన పదవులు లభించాయన్నారు. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీయే అన్నారు. -
‘రాజీనామా స్పీకర్‌కు పంపలేదు.. సీఎంకే పంపాను’
సాక్షి, అమరావతి : నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన దీక్ష కూడా చేపట్టారు. బుధవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. రాజీనామా పత్రాలను సీఎం చంద్రబాబుకు మాత్రమే పంపానని, స్పీకర్‌కు పంపలేదని స్పష్టం చేశారు. ‘రాజీనామా ఆమోదించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంది. నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకే వచ్చాను. నా దీక్ష నియోకవర్గంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది’ అని చెప్పుకొచ్చారు. -
విమానాలు, స్టార్ హోటళ్లలో గడుపుతూ..
సాక్షి, పశ్చిమగోదావరి : కేంద్రం ఇచ్చిన నిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాలు, స్టార్ హోటళ్లలో విలాసవంతంగా గడుపుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోకెళ్లా ఏపీకే ప్రధాని మోదీ అధిక నిధులు ఇచ్చారని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయల కరువు సాయాన్ని ప్రకటించిందని జీవీఎల్ పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వ దొంగలు దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. దొంగ దీక్షలు చేస్తూ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కరువు సాయం ప్రభుత్వ దొంగల బారిన పడనివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ఓఆర్పీ అంటే ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ అనేది బీజేపీ నినాదమైతే.. కాంగ్రెస్ వాళ్లకు మాత్రం ఓన్లీ రాహుల్-ఓన్లీ ప్రియాంక అంటూ ఎద్దేవా చేశారు. -
మాణిక్యాలరావు దిక్ష భగ్నం
-
హమీలను తక్షణమే నెరవేర్చాలి..
-
ప్రారంభమైన మాణిక్యాల రావు నిరాహార దీక్ష
సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. తాడేపల్లి గూడెంలో ‘ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల సాధనకై పోరుబాట’ పేరుతో సోమవారం ఉదయం దీక్షను ప్రారంభించారు. తొలుత తెలుగుతల్లికి, బీజేపీ వ్యవస్థాపక నేతలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పైడికొండల మాట్లాడుతూ.. జిల్లాకు ఇచ్చిన 56 హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత నెల 25ననే చంద్రబాబు నాయుడుకి రాజీనామా అల్టిమేటం పంపినట్లు తెలిపారు. నెల రోజులు దాటినప్పటికి ముఖ్యమంత్రి స్పందించకపోవడంతో ఈ రోజు నుంచి దీక్ష ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. మాణిక్యాలరావుతో పాటు బీజేపీ నేతలు నరిశె సోమేశ్వర్రావు, ఈతకోట తాతాజీ, వట్టి శైలజ, కర్రి ప్రభాకర్ బాలాజీ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. -
అందుకే నేను దీక్ష చేస్తున్నా: పైడికొండల
సాక్షి, తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి అక్రమాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆరోపించారు. శనివారం ఆయన తాడేపల్లిగూడెంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... స్థానిక టీడీపీ నాయకుల కుతంత్రాలు కారణంగానే నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను చంద్రబాబు కావాలనే అమలు చేయడం లేదని విమర్శించారు. ఆటో మొబైల్ రంగానికి కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెంలో ఆటోనగర్ నిర్మాణం, విమానాశ్రయ భూముల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు తదితర ప్రధాన హామీలు అమలు చేసే అవకాశం ఉన్నా కూడా స్థానిక నేతలు ఒత్తిడితో ముఖ్యమంత్రి నిలిపి వేయడం దారుణమన్నారు. సోమవారాన్ని పోలవరంగా మార్చానని చెబుతున్న ముఖ్యమంత్రి ఏ పనీ చేయకుండా ఈ జిల్లాపై ఎందుకు కక్ష గట్టారో చెప్పాలన్నారు. ఈ జిల్లా ప్రజలు మీకు అన్ని నియోజకవర్గాలు నెగ్గించి ఇస్తే ఈ జిల్లాను వెనుకబడిన జిల్లాగా వదిలేశారని ఆయన అన్నారు. జిల్లాను తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిని గాలి కొదిలేయడం వల్లే మీకు రాజీనామా అల్టిమేటం పంపానని చెప్పారు. ఇప్పటి వరకు నేను పంపిన అల్టిమేటంపై సీఎం స్పందించని కారణంగానే ఈనెల 21 నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతున్నానని తెలిపారు. నా నిరవధిక నిరాహారదీక్ష ద్వారా అయినా ఈ జిల్లా, నియోజకవర్గానికిచ్చిన హామీలు ముఖ్యమంత్రి నెరవేర్చాలని అన్నారు. ఈ దీక్షకు ప్రజలంతా అండగా నిలిచి హామీలు అమలుకు సహకరించాలని పైడికొండల మాణిక్యాలరావు కోరారు. -
‘సమస్యల గురించి చెప్తే.. సీటు దక్కుతుందో..లేదో..’
సాక్షి, పశ్చివ గోదావరి : పచ్చకండువా ఉంటే తప్ప పనులు జరిగే పరిస్థితి లేదని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వాపోయారు. సమస్యల ప్రస్తావన తీసుకొస్తే వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందో లేదోనని టీడీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని వాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం నిధులతోనే జరుగుతోంది. జిల్లా ప్రజలకు టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. స్థానిక టీడీపీ నాయకుల స్వార్థం కారణంగానే ఎలాంటి పనులు జరగడం లేదు. నిట్ (నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని తాడేపల్లిగూడెం నుంచి ఆకివీడుకి తరలించే ప్రయత్నం చేసినపుడు కూడా రాజీనామా చేస్తానని చెప్పాను. ఫిషింగ్ హార్బర్, డెల్టా ఆధునికీకరణ, ఆక్వా యూనివర్సిటి వంటి సమస్యల పరిష్కారం కాలేదు. అవన్నీ హమీలకే పరిమితం అయ్యాయి’ అని చెప్పారు. (ఎమ్మెల్యే రాజీనామా.. చంద్రబాబుకు అల్టిమేటం) పశ్చిమ గోదావరి జిల్లాను చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి ఎన్ని సీట్లు ఇచ్చినా జిల్లాకు న్యాయం జరగలేదని ఆగ్రహం వక్యం చేశారు. పశ్చిమ వాసులకు ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదనీ, దానికోసం పోరాడుతున్నా చంద్రబాబు ఏమాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కేవలం ఆ పార్టీ నాయకులకు మాత్రమే లబ్ధి చేకూర్చాయని విమర్శించారు. ‘ఏ ఇండస్ట్రీ వచ్చినా సీఎం ఆయన సొంత జిల్లాకు తరలించాలని చూస్తున్నారు. వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరికి ఎన్ని పరిశ్రమలు ఇచ్చారో చెప్పాలి’ అని ప్రశ్నించారు. ఇదిలాఉండగా.. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న మాణిక్యాలరావు టీడీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
ఎన్నికల ముంగిట రాజీనామాస్త్రం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎన్నికల ముంగిట మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు రాజీనామాస్త్రాన్ని ప్రయోగించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిని అధికార పార్టీ అడ్డుకుంటుందని, ముఖ్యమంత్రి ఇప్పటివరకూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆయన ఆరో పించారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చేనెల 6న వస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మాణిక్యాలరావు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం జిల్లాలోతీవ్రచర్చకు దారి తీసింది. అభివృద్ధి విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు మంగళవారం ప్రకటించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనుల నిమిత్తం 56 హామీలిచ్చి వాటిలో కొన్నింటికి జీఓలు, మరికొన్నింటికి సీఎం హామీ ఐడీ నంబర్లు ఇచ్చికూడా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మాణిక్యాలరావు ఆరోపించారు. తాడేపల్లిగూడెం అభివృద్ధికి గాను 15 రోజుల వ్యవధిలో కార్యాచరణ ప్రకటించకుంటే 16వ రోజున ప్రజలతో కలిసి నిరవధిక నిరసన దీక్ష చేపడతానని హెచ్చరించారు. 15 రోజుల్లో అభివృద్ధి విషయంలో సీఎం నిర్ణయం తీసుకోకుంటే ఆయనకు పంపిన లేఖను స్పీకర్‌కు పంపి ఆమోదించే బాధ్యత కూడా సీఎం తీసుకోవాలని కోరారు. అయితే నాలుగేళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో ముఖ్యమంత్రిని పొగుడుతూ వచ్చిన మాణిక్యాలరావు తెలుగుదేశం, బీజేపీ మధ్య విభేదాలు మొదలైన తర్వాత స్వరం మార్చుతూ వచ్చారు. నాలు గేళ్లు మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకోలేకపోవడంపై ఆయన ఏనాడూ నోరు విప్పలేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమిపై విశ్వాసంతో ఎమ్మెల్యే, ఎంపీలను మొత్తంగా జిల్లా ప్రజలు కూటమికి కట్టబెట్టినా, జిల్లాకు ఒక ప్రాజెక్టు కాని, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ కాని, యూనివర్సిటీ కాని, తీరప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలో ఫిషింగ్ హార్బర్ కాని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని చెబుతున్న మాణిక్యాలరావు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఏ ప్రాజెక్టు తేలేకపోయారు. నిట్ ఒక్కటే ఈ నా లుగేళ్లలో వచ్చింది. అయితే నాలుగున్నరేళ్ల కాలంలో కూడా మిత్రపక్షాల మధ్య విభేదాల కారణంగా ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడానికే పరిమితం అయ్యారు. అధికార పార్టీ నేతలు కూడా మాణిక్యాలరావుకు పేరు రా కూడదన్న పద్ధతిలో వ్యవహరించడంతో అక్కడా అభివృద్ధి జరగకుండా పోయింది. ఇరుకున పడ్డ అధికార పక్షం మిత్రపక్షాలను నమ్మి గెలిపిస్తే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ తాడేపల్లిగూడెంను అభివృద్ధి చేయకుండా చేశారు. తెలుగుదేశం, బీజేపీ మధ్య సంబంధాలు తెగిపోయిన తర్వాత అభివృద్ధిపై బహిరంగ చర్చ అంటూ హైడ్రామా నడిపారు. ఇప్పుడు తాజాగా అభివృద్ధి చేయడం లేదంటూ పైడికొండల మాణిక్యాలరావు రాజీనా మాస్త్రం సంధించడంతో అధికారపక్షం ఒక విధంగా ఇరుకునపడింది. ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో వారు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎదురుదాడికి దిగుతున్నారు. మరోవైపు ఈ రాజీనామా పై ముఖ్యమంత్రి కూడా స్పందించారు. సొంత జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకపోతే మాణిక్యాలరావు ఎందుకు మాట్లాడరని చంద్రబాబు ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు, రాజీనామా పేరుతో బెదిరించడం సరికాదని చంద్రబాబు విమర్శించారు. మంత్రి పదవికి రాజీనామా చేసి.. టీడీపీతో తెగతెంపులు చేసుకున్నాక.. అసెంబ్లీలో మాట్లాడిన సమయంలో ప్రభుత్వం తమకు ఎంతో సహకారం అందించిందని ప్రకటించిన మాణిక్యాలరావు ప్రధాని మోదీ ఏపీకి వస్తున్న సమయంలో రాజీనామా డ్రామాకు తెరతీశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రాజీనామాతో నాలుగేళ్లు అధికారంలో ఉండి బీజేపీ, నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం పార్టీలు జిల్లా అభివృద్ధి కోసం ఏమీ చేయలేదని తేలిపోయింది. -
ఎమ్మెల్యే రాజీనామా.. చంద్రబాబుకు అల్టిమేటం
-
తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తత
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం, బీజేపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం, ఘర్షణ చోటుచేసుకుంది. జగన్నాధపురం గ్రామంలో అక్రమంగా మట్టి రవాణాకు పాల్పడుతోన్న 30 లారీలను స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు అడ్డుకున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే పైడికొండల, అధికారులకు సమాచారమిచ్చినా స్పందించకపోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు. పైడికొండలకు మద్దతుగా ఆందోళనలో వైఎస్సార్సీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆందోళనకు వ్యతిరేకంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. గ్రామంలోని అన్ని మార్గాలను తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు దిగ్బంధనం చేశారు. ఇరువర్గాల ఆందోళనలతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు మాట్లాడుతూ..మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతోన్న వారిని అరెస్ట్ చేసి వారి వాహనాలను అధికారులు తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే తెలుగుదేశం నేతలు రోడ్లు దిగ్బంధించడం సిగ్గుచేటన్నారు. రోడ్లు దిగ్బంధనం చేసిన వారిని వదిలి నా వద్దకు వచ్చి జులూం చూపితే ఖబడ్దార్ అంటూ పోలీసులకు మాణిక్యాల రావు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. మీకు(పోలీసులకు) చేతకాకపోతే చెప్పండి.. మీరు పది నిమిషాలు వెళ్లిపోండి..తానేంటో చూపిస్తానని సవాల్ విసిరారు. -
తాడేపల్లిగూడెంలో మళ్లీ ఉద్రిక్తత
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న(గురువారం) మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు గృహ నిర్బంధాన్ని, పోలీసుల వైఖరిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు శుక్రవారం ర్యాలీ నిర్వహించాయి. తహశీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు మళ్లీ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కనిపించడంతో భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. తాడేపల్లిగూడెం అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు పరస్పరం సవాళ్లు విసురుకున్న సంగతి తెల్సిందే. -
‘ఏపీలో ఎవరికీ రక్షణ లేదు’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అసలు రాష్టంలో ఎవరికీ రక్షణ లేదంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత పైడికొండల మాణిక్యాల రావును హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో తాడేపల్లిగూడెం బయల్దేరిన తమ పార్టీ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంపై కన్నా అసహనం వ్యక్తం చేశారు. కనకదుర్గమ్మ వారధి వద్ద రోడ్డుపై బైఠాయించిన కన్నా.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందనడానికి ఇదే ఉదాహరణని ఆరోపించారు. ‘ మా ఎమ్మెల్యేను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అన్యాయంగా రోడ్డుపైనే అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు. మాణిక్యాలరావు పరిస్థితి విషమంగా ఉంది. రాష్టంలో ప్రతిపక్ష నేతకు సైతం రక్షణ లేదు. మిగతా రాజకీయ పార్టీల నాయకులకి రక్షణ ఎక్కడ ఉంటుంది. మాణిక్యాలరావును అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది’ అని ఆయన ప్రశ్నించారు. మాణిక్యాలరావును హౌస్ అరెస్ట్ చేయడంతో కోర్ కమిటీ సమావేశం రద్దు చేసుకుని తాడేపల్లిగూడెం బయల్దేరిన కన్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు జీవీఎల్, కావూరి సాంబశివరావులను కూడా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా వారిని హౌస్ అరెస్ట్ చేశారు. దాంతో కన్నా ఇంటి వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చదవండి: మాణిక్యాలరావు నివాసం వద్ద తీవ్ర ఉద్రికత్త -
మాణిక్యాలరావు నివాసం వద్ద తీవ్ర ఉద్రికత్త
సాక్షి, పశ్చిమగోదావరి : మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత పైడికొండల మాణిక్యాల రావు నివాసం(తాడేపల్లిగూడెం) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గృహ నిర్బంధం నుంచి బయటికి వచ్చి రోడ్డుపై బైఠాయించిన ఆయనను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి ఇంట్లో పడేశారు. రోడ్డుపై గంటకు పైగా తీవ్రమైన ఎండలో కూర్చోవడం, పోలీసులు లోపలికి తీసుకెళ్లే క్రమంలో జరిగిన పెనుగులాటలో మాణిక్యాల రావు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అభివృద్ధికి ఆటంకం, మట్టి మాఫియా బాపిరాజు డౌన్ డౌన్, పోలీసుల దైర్జన్యం నశించాలంటూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కాగా స్థానిక జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లపై ఉచిత ఇసుక పేరుతో తెలుగు దొంగలు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని మాణిక్యాల రావు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినీతిపై చర్చించేందుకు సిద్ధమంటూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. దీంతో నిరసన చేపట్టేందుకు ఉపక్రమించిన మాణిక్యాల రావును పోలీసులు ఎత్తుకెళ్లి ఇంట్లో పడేశారు. -
చంద్రబాబు మానసికస్థితిపై అనుమానంగా ఉంది
తాడేపల్లిగూడెం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో పాటు స్థానిక జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లపై మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత పైడికొండల మాణిక్యాల రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం మాణిక్యాల రావు విలేకరులతో మాట్లాడారు. దేశం భ్రష్టుపట్టుకుని పోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని పారద్రోలాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కుతూ కాంగ్రెస్‌తో అంటకాగుతున్న చంద్రబాబును తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న ఆ పార్టీ నుంచి కార్యకర్తలు, నేతలు బయటకొచ్చి పార్టీని పునర్మించండని పిలుపునిచ్చారు. దేశంలో అభివృద్ధి పథంలో ఉన్న వ్యక్తులందరూ నా సలహాతోనే పైకొచ్చారు..నేనే వారందరికీ మార్గదర్శినని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు మానసిక స్థితిపై తనకు అనుమానంగా ఉందని, ఆయన ఎక్కడైనా చూపించుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క అంగుళమైనా ఇసుక ఉచితంగా వస్తుందా అని ప్రశ్నించారు. ఉచిత ఇసుక పేరుతో రాష్ట్రాన్ని తెలుగు దొంగలు దోచుకు తింటున్నారని ఆరోపించారు. నీరు-చెట్టు తెలుగుదేశం పాలిట కల్పతరువుగా మారిందని వ్యాక్యానించారు. జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లకు ఈ సందర్భంగా మాణిక్యాల రావు సవాల్ విసిరారు. మీరు తవ్వే నల్లజర్ల, జగన్నాథపురం చెరువుల్లో అయినా లేక మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తా, టైం మీరు చెప్పినా లేక మమ్మల్ని చెప్పమన్నా సరే నేను రెడీ అని మాణిక్యాల రావు ప్రకటించారు. గురివింద గింజలా మీ కింద మచ్చ ఉంచుకుని నాపై విమర్శలు చేస్తారా అని ఘాటుగా విమర్శించారు. నేను చేసే సేవాకార్యక్రమాల గురించి గుడి, బడి, ఆసుపత్రి దగ్గర అడిగితే చెబుతారు..నేనొక సామాన్యుడిగా ఇవన్నీ చేశా..మీరు గొప్పవాళ్లని చెబుతున్నారు కదా మీరు చేసిందేమిటో కనీసం ఒక్కటైనా చెప్పాలని సూటిగా అడిగారు. -
ఖబడ్దార్.. అంటూ హెచ్చరించిన పైడికొండల
సాక్షి, ప.గో జిల్లా : మాజీ మంత్రి, తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు ప్రభుత్వ ఉద్యోగులపై ఫైర్ అయ్యారు. పెంటపాడు మండలంలోని జట్లపాలెం గ్రామంలో సీసీ రోడ్డు ఓపెనింగ్‌కు వెళ్లిన పైడికొండలకు ప్రోటోకాల్ ప్రకారం అక్కడి రెవెన్యూ అధికారులు, గ్రామ నాయకులు హాజరుకాకపోవడంతో వారిపై విరుచుకపడ్డారు. కావాలనే కొంతమంది ప్రజాప్రతినిధులు ఇదంతా చేయిస్తున్నారని, అధికారులంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండకపోతే..ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ప్రజలంతా కలిసి అధికారులను నిలదీయాలని, వారి ఆఫీసుల నుంచి బయటకు రానీయకుండా చేయాలంటూ పిలుపునిచ్చారు. -
శివాజీ చెప్పిందే నిజమైతే ఫెయిలయినట్టే
కాకినాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరుపై మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పైడికొండల మాణిక్యాల రావు విలేకరులతో మాట్లాడుతూ..జగన్‌పై జరిగిన దాడి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే ప్రజలకు నిజాలు తెలుస్తాయని అన్నారు. జగన్‌పై జరిగిన దాడి ఆయన అభిమానే చేశాడని, చిన్న గాయమే అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని తప్పు దోవ పట్టించే ప్రయత్నమేనని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రాష్ట్రంలో సంచరించడానికి భయపడే పరిస్థితులను సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాణభయంతో ప్రతిపక్షాలు బయట తిరగకుండా ఉంటే వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందాలనుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని విమానాశ్రయాలను ఏపీ పోలీసులే పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. గతంలో కూడా విశాఖ రన్‌వేపై రాష్ట్రానికి చెందిన పోలీసులే జగన్‌ను అడ్డుకోవడం చూశామని గుర్తు చేశారు. ఆపరేషన్ గరుడ అంటూ నటుడు శివాజీ చెప్పింది నిజమే అయితే ఎందుకు మీ ప్రభుత్వం.. మీ పోలీసు వ్యవస్థ జగన్‌పై జరిగిన దాడిని అడ్డుకోలేకపోయిందని ప్రశ్నించారు. ఒక వేళ శివాజీ చెప్పిందే నిజమైతే దాడి మీ ఫెయిల్యూర్‌గా భావించి మీరు, హోంమంత్రి చినరాజప్ప రాజీనామా చేసి ప్రభుత్వాన్ని శివాజీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా శివాజీని అదుపులోకి తీసుకుని ఆపరేషన్ గరుడ వెనక ఎవరు ఉన్నారో విచారణ జరిపించాలని కోరారు. ఒకవేళ ఆపరేషన్ గరుడపై విచారణ జరిపితే దీని వెనకున్న పెద్దలకు, మీ ప్రభుత్వానికి నష్టమా అని చంద్రబాబును ప్రశ్నించారు. -
చెన్నారెడ్డినే తరిమిన వాళ్లం.. చంద్రబాబు మాకెంత..!
తాడేపల్లిగూడెం: దమ్ముంటే తెలుగుదేశం పార్టీ సభను అడ్డుకోవాలని టీడీపీ నాయకుడు ఒకరు ఛాలెంజ్ చేశారు. మర్రి చెన్నారెడ్డిని తరిమిన ఘనత మాది. ఆఫ్ట్రాల్ చంద్రబాబును తరమడం పెద్ద కష్టం కాదని ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. విమానాశ్రయ భూముల నిర్వాసితులకు పట్టాలు ఇవ్వాలని, చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో మౌన పోరాట దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టే ముందు విలేకరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ రెచ్చగొట్టే విధంగా టీడీపీ నాయకులు మాట్లాడితే వెనుకడుగు వేయమని హెచ్చరించారు. శనివారం ధర్మపోరాట దీక్షలో గూడెంకు ఇచ్చిన హామీల అమలులో అధికార పార్టీ నాయకుల స్పందనపై మా పోరాటం ఆధారపడి ఉంటుందన్నారు. తాడేపల్లిగూడెంలో ధర్మపోరాట దీక్ష చేసుకోడానికి ఈ ప్రాంతం పనికొచ్చింది కాని, ప్రభుత్వ వైద్య కళాశాల ఇవ్వడానికి పనికిరాదా అన్నారు. 2015 ఆగస్టులో నిట్ వేదికపై నుంచి ఇచ్చిన హామీలకు అతీగతీ లేదన్నారు. కేంద్రం ఈ రాష్ట్రానికిచ్చిన హామీలు 95 శాతం పూర్తిచేస్తే, మిగిలిన ఐదు శాతం హామీల అమలు కోసం ధర్మపోరాటం చేయడం ఎందుకని ప్రశ్నించారు. గూడెం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయని సీఎంపై ఏ పోరాటం చేయాలన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఇచ్చిన హామీలకు సమాధానం చెప్పి సభ నిర్వహించుకోవాలన్నారు. మౌనపోరాటం చేస్తామని ప్రకటించాక విమానాశ్రయ భూముల్లో 1800 మందికి పట్టాలు ఇస్తామని టీడీపీ నాయకులు ప్రకటించారు. విమానాశ్రయ భూముల్లో 5300 మంది పట్టాదారులుంటే కేవలం 1800 మందికి ఇస్తాననడం సరికాదు. అందరికీ పట్టాలిస్తానని సభలో ప్రకటించాలని మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాట యాత్ర చేస్తూ టీడీపీ వారిని ప్రశ్నిస్తున్నారని ఆయనపై దాడికి రెక్కీ నిర్వహిస్తే ప్రభుత్వం కళ్లు తేలేసి చూస్తుందా అన్నారు. అభిమాన నటుడుగా ఉన్న పవన్‌కల్యాణ్‌కు అన్యాయం జరిగితే మూల్యం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిం చారు. శాంతియుతంగా మౌనదీక్ష చేస్తున్న మమ్మల్ని రెచ్చగొడితే మేము కూడా కర్ర చేత్తో పట్టుకోడానికి సిద్ధమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు కోడూరి లక్షీనారాయణ, మహిళా మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి శరణాల మాలతీరాణి, పార్టీ నాయకులు ఈతకోట తాతాజీ, యెగ్గిన నాగబాబు, నరిశే సోమేశ్వరరావు, ధనలక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. సాధిద్దాం.. పట్టాలు సాధిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మౌన పోరాట దీక్ష సాగింది. ఎమ్మెల్యే సతీమణి సూర్యకుమారి కూడా దీక్షలో పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యం శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలే దీనికి నిదర్శనమని మాణిక్యాలరావు అన్నారు. ఇంటెలిజెన్సు వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం దీనికి కారణమన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దాడికి రెక్కీ నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు రక్షణ కొరవడిందన్నారు. పసుపు తమ్ముళ్ల రక్షణకే పోలీసు బలగం సరిపోతుందన్నారు. పవన్ కల్యాణ్‌తో పాటు, ప్రతిపక్ష నేతల రక్షణకు ప్రత్యేక వ్యవస్థను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
‘చెన్నారెడ్డినే తరిమిన ఘనత మాది’
సాక్షి, తాడేపల్లిగూడెం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మండిపడ్డారు. విమానాశ్రయ భూముల నిర్వాసితులకు పట్టాలు ఇవ్వడంలో టీడీపీ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. వారికి మద్దతుగా తాడేపల్లి గూడెంలో శుక్రవారం ఆయన నిరసన దీక్ష చేపట్టారు. భూ నిర్వాసితులకు పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని చంద్రబాబు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను రెచ్చగొడితే తిరగబడతామని హెచ్చరించారు. అవసరమైతే కర్రలు చేతబట్టి ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టం చేశారు. ‘మర్రి చెన్నారెడ్డినే తరిమిన ఘనత మాది. ఆఫ్ట్రాల్ చంద్రబాబును తరిమికొట్టడం పెద్ద కష్టం కాదు. దమ్ముంటే మా నిరసన దీక్షని అడ్డుకోండి’ అని సవాల్ చేశారు. నిట్ ప్రారంభోత్సవంలో బాబు ఇచ్చిన 56 హామీలకు కూడా అతీగతీ లేదని మండిపడ్డారు. -
ధర్మ పోరాట దీక్ష.. కేంద్రం నిధులతోనే
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమ గోదావరి): కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సక్రమంగా వాడుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. తాడేపల్లి గూడెంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలలో సుమారు రూ. 27,000 కోట్లు రాష్ట్రానికి ఎమ్ఆర్జీఎస్ నిధులు ఇచ్చిందని, ఆ నిధులతో పోలవరం ప్రాజెక్టునే నిర్మించేయవచ్చని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ది పనులు చేపట్టారని తెలిపారు. ఈ నెల 29న టీడీపీ ధర్మ పోరాట దీక్ష కూడా మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే చేస్తున్నారని ఎద్దేవ చేశారు. హామీలు నెరవేర్చేవరకు పోరాటం ఆగస్టు 20, 2015న నిట్ శంకుస్థాపనలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఇచ్చిన సుమారు నలభై హామీలలో ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. ధర్మ పోరాట దీక్షలో ఇచ్చిన హామీలపై ఇచ్చే ప్రకటన ఆధారంగా అవసరమైతే పోరాటం చేస్తానని తెలిపారు. బీజేపీ నుంచి పోటీచేస్తే డిపాజిట్లు తెచ్చుకోలేరని ముళ్లపూడి బాపిరాజు అనడం హాస్యాస్పదమన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. టీడీపీ పాలన ఇలాగే కొనసాగితే బాపిరాజు తన నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. బీజేపీ నాయకులు తమకు అనుకూలమైన పోలీసులని నియమించుకుంటున్నారని బాపిరాజు అనడం సబబు కాదని, టీడీపీ నాయకుల్లాగా పేకాట, కోడిపందాలు, క్రికెట్ బెట్టింగ్‌లతో తమకు పనిలేదని పేర్కొన్నారు. -
‘అక్కడ మొక్కితే.. ప్రధానికి మొక్కినట్టే’
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఆయన మంగళవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ పరిస్థితులు అన్నివేళలా ఒకేలా ఉండవని వ్యాఖ్యానించారు. ‘నేను సభలో మాట్లాడటం కోసం ప్రయత్నిస్తున్నా.. నన్ను పట్టించుకోవడం లేదు. పరిణామాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సమైక్యాంధ్ర ఉద్యమసమయంలో గ్రామాల్లోకి వెళ్లలేకపోయేవాళ్లం.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత టీడీపీ చేస్తోన్న వాదనను ప్రజలు నమ్మడం లేదు. రాష్ట్రంలో అవినీతి జరుగుతోంది కాబట్టే పైనుంచి నిధులు కట్ చేసి ఉంటారనే భావనలో ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కన్పిస్తోంది. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయం. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ కొన్ని బృందాలను కర్ణాటకకు పంపింద’ని మాణిక్యాలరావు తెలిపారు. మరో బీజేపీ నేత, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. పార్లమెంట్ మెట్లకు మొక్కి వెళ్లడమంటే.. పార్లమెంటులో అత్యున్నత స్థానంలో కూర్చొన్న ప్రధానమంత్రికి మొక్కినట్టే అన్నారు. రాఫెల్ డీల్ వంటి విషయాల గురించి మాట్లాడేంత పెద్ద వాళ్లం కాదని.. శాండ్, ల్యాండ్ గురించి మాట్లాడతామని అన్నారు. -
ఏపీ బీజేపీకి కొత్త సారధి?
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ పై, ప్రధాని నరేంద్ర మోదీఫై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నతరుణంలో వారిని ధీటుగా ఎదుర్కొనే విధంగా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. టీడీపీకి సరైన కౌంటర్ ఇచ్చే నాయకుడిని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి కంభంపాటి హరిబాబు తొలగించి.. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. కొత్త అధ్యక్ష ఎంపిక బాధ్యతని అమిత్‌షా పూర్తిగా ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ రాం మాధవ్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే అధ్యక్ష రేసులో ఒకే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, మాణిక్యాలరావు పేర్లు వినిపించినా రాంమాధవ్ మాణిక్యాలరావు వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఈ క్రమంలో మిగిలిన ఇద్దరు నేతలకు కీలక బాధ్యతల్లో చోటు కల్పించాలని భావిస్తున్నారట. కానీ, ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముఖ్యనేతల భేటీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక నేపథ్యంలో రాంమాధవ్ బీజేపీ ముఖ్య నేతలతో గురువారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో టీడీపీని ఎలా కట్టడి చేయాలి, అధ్యక్ష పదవిని ఎవరు సమర్థవంతంగా నిర్వర్తిస్తారనే అంశాలపై సీనియర్ నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. అధ్యక్షుడిగా హరిబాబు ఫెయిల్? ఇటీవల బీజేపీని టార్గెట్ చేసిన టీడీపీపై అధ్యక్షుడిగా కంభంపాటి హరిబాబు తగినరీతిలో స్పందించలేకపోవడం, పలు సందర్భాల్లో ఆయన మెతక వైఖరి ప్రదర్శించడంతో బీజేపీ అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. మిగిలిన నేతలు ఎప్పటికప్పడు టీడీపీపై దాడికి దిగుతున్నా, హరిబాబు మాత్రం దూకుడుగా వ్యవహరించలేదనే అభిప్రాయం నేతల్లో ఉంది. ఈ నేపధ్యంలోనే ఆయన స్ధానంలో మాణిక్యాల రావును నియమించేందుకు నిర్ణయం తీన్నారని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. -
ఆపరేషన్ ద్రవిడ వెనుక ఎవరున్నారు..
సాక్షి, అమరావతి: హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని ఏపీ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు డీజీపీని కోరారు. ఈ మేరకు డీజీపీ మాలకొండయ్యకి ఆయన లేఖ రాశారు. ఆపరేషన్ ద్రవిడ పేరుతో కుట్రలు జరుగుతున్నాయన్న అపోహలు ప్రజలకు పోవాలంటే విచారణ జరిపించాలన్నారు. ఆపరేషన్ ద్రవిడ కోసం రూ.4800 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ శివాజీ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. శివాజీ మాటల ప్రకారం ఏపీలో అరాచకాలు, కుట్రలు జరుగుతున్నట్లు అనుమానం కలుగుతోందని.. అందుకే ఆపరేషన్ ద్రవిడ వెనుక ఎవరు ఉన్నారో ప్రజలకు తెలియాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని లేఖలో డీజీపీని కోరినట్లు మాణిక్యాలరావు వివరించారు. సినీ నటుడు శివాజీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఓ జాతీయ పార్టీ ‘ఆపరేషన్ గరుడ’ చేపట్టబోతోందని శివాజీ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ ద్రవిడ’లో ఇదొక భాగమన్నారు. ఏపీ, తెలంగాణకు చెంది ‘ఆపరేషన్ గరుడ’.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ రావణ’.. కర్ణాటకలో ‘ఆపరేషన్ కుమార’ను ఆ పార్టీ చేపట్టబోతోందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌కు అనుసంధానకర్తగా ఓ రాజ్యాంగ శక్తి వ్యవహరిస్తోందన్నారు. ఫలితంగా ఆయన పదవీ కాలం పొడగించబోతున్నారని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కోసం రూ.4,800 కోట్లు కేటాయించారని, ఇందులో సగం ఇప్పటికే పంపిణీ జరిగిందంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి.