తాడేపల్లిగూడెం : రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. ప్రజలు సుఖ, సౌఖ్యాలతో ఉండాలంటే స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శనివారం తాడేపల్లిగూడెంలో నిర్వహించిన స్వచ్ఛభారత్‌లో వారు పాల్గొన్నారు. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ చౌక్ వరకు రహదారులను, పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ ప్రజలు దేశభక్తి ప్రేరణతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరారు.
చేయి చేయి కలిపి స్వచ్ఛభారత్‌లో ముందుకెళితే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు స్వచ్ఛభారత్ నిర్వహించనున్నట్టు చెప్పారు. మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ ప్రతి వారూ తమ ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటురోగాలను తగ్గించవచ్చన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ దేశాన్ని శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమం కోసం రూ. 62 వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు.
కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు మాట్లాడుతూ కేవలం రోడ్లు, పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మనసు, హృదయాలను పవిత్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, డీఎన్‌ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గోకరాజు నరసింహరాజు, మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు, వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ , తాడేపల్లిగూడెం ఎంపీపీ పరిమి రవికుమార్, టీవీ ఆర్టిస్టు రవికిరణ్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఖండభట్టు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్
Published Sun, Nov 30 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM
Advertisement
Advertisement