'పవర్ స్టార్ వల్లే టీడీపీకి పవర్'
ద్వారకాతిరుమల : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మద్దతు వల్లే టీడీపీ పవర్ లోకి వచ్చిందని, చిరంజీవి పార్టీ పెట్టడంతోనే కాపులకు గుర్తింపు లభించిందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ద్వారకాతిరుమల కాపు కల్యాణ మండపంలో జిల్లా కాపునాడు శ్రీ వేంకటేశ్వర శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం జరిగిన కాపు ప్రజాప్రతినిధుల అభినందన సభకు ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ మాజీ ఛైర్మన్ వట్టి వెంకటరంగ పార్థసారధి అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా కాపు సంఘ అద్యక్షుడు చినమిల్లి వెంకటరాయుడు, పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి పైడికొండల మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియపై క్యాబినేట్ సమావేశంలో చర్చ జరిగిందని, త్వరలోనే ఇది పూర్తవుతుందని చెప్పారు. ప్రస్తుతం కాపు వర్గీయులు దుందుడుకు స్వభావంతో, దాడులు చేసేవిధంగా సమాజంలో ముద్రపడ్డారని, దీన్ని మార్చుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్రం విడిపోవడం మన అదృష్టం
రాష్ట్ర విభజన జరగడం వల్లే కాపులను బీసీల్లో చేర్చే ప్రతిపాదన వేగవంతమైందని, కలిసి ఉంటే జరిగే పరిస్థితి లేదని సమావేశంలో పాల్గొన్న రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. కాపుల వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అందుకే ఉపముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు ఇచ్చారని, కాపులను బీసీ చేర్చే ప్రక్రియ కూడా అమలవుతుందని చెప్పారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు మాట్లాడుతూ యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కాపు విద్యార్థులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ కాపుల ఆధ్యుడు, ప్రముఖ సినీనటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఏలూరులో ఏర్పాటు చేస్తానని, ఆయన పేరుతో కల్యాణ మండపాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్‌రావు, కాపు నేతలు పిల్లా వెంకటరాయుడు, బొల్లిశెట్టిరావు, వెంకటరత్నం నాయుడు, ఆర్‌ఎస్‌ఆర్ మాస్టారు, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, మైగాపుల మోహన్ పాల్గొన్నారు.