తాడేపల్లిగూడెంలో నిట్
తాడేపల్లిగూడెం : రాష్ట్రంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) తాడేపల్లిగూడెం పట్టణంలో కొలువు తీరనుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్ర విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించింది. ఈ మేరకు తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్రం నుంచి కేంద్రానికి తాజాగా అధికారులు నివేదిక పంపించారు. దేశంలో 36 నిట్‌లు ఉన్నాయి. రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రంలో వరంగల్‌లో మాత్రమే నిట్ ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గూడెంలో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కేంద్రానికి చెందిన ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పట్టణానికి వస్తుందని చెబుతూ వచ్చారు.
పురపాలక శాఖ మంత్రి కె.నారాయణ ఆధ్వర్యంలో ఇటీవల మంత్రుల బృందం గూడెంలో పర్యటించి వెళ్లింది. పట్టణంలోని విమానాశ్రయ రన్‌వే సమీపంలో ఉన్న భూమిని, వెంకట్రామన్నగూడెంలో ఉద్యానవర్సిటీ వెనుక ఉన్న కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న భూములను పరిశీలించి వెళ్లింది. ఈ మేరకు శనివారం కేంద్రానికి పంపిన జాబితాలో తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేయడానికి ఉన్న అనువైన పరిస్థితులు, భూముల వివరాలను పేర్కొన్నారు.
నిట్ అంటే ఇంజినీరింగ్, సైన్స్, టెక్నాలజీ, మేనే జ్‌మెంట్‌ల విద్యాసంస్థల వ్యవస్థను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా చెబుతారు. 2007లో పార్లమెంటులో చేసిన చట్టం ద్వారా నిట్‌లను నేషనల్ ఇంపార్టెన్స్‌గా పేర్కొన్నారు. నిట్‌లో సీట్లు సగం ఈ సంస్థ ఉన్న ప్రాంతానికి, మిగిలిన సగం సీట్లను దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ స్థాయిలో డిగ్రీ కోర్సులు ఉంటాయి. ఈ విద్యాసంస్థలు స్వయం ప్రతిపత్తితో నడుస్తాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా బోధన ప్రణాళికను తయారు చేసుకునే స్వేచ్ఛ వీటిలో ఉంటుంది.