
బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు
సాక్షి, అమరావతి: హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని ఏపీ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు డీజీపీని కోరారు. ఈ మేరకు డీజీపీ మాలకొండయ్యకి ఆయన లేఖ రాశారు. ఆపరేషన్ ద్రవిడ పేరుతో కుట్రలు జరుగుతున్నాయన్న అపోహలు ప్రజలకు పోవాలంటే విచారణ జరిపించాలన్నారు. ఆపరేషన్ ద్రవిడ కోసం రూ.4800 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ శివాజీ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. శివాజీ మాటల ప్రకారం ఏపీలో అరాచకాలు, కుట్రలు జరుగుతున్నట్లు అనుమానం కలుగుతోందని.. అందుకే ఆపరేషన్ ద్రవిడ వెనుక ఎవరు ఉన్నారో ప్రజలకు తెలియాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని లేఖలో డీజీపీని కోరినట్లు మాణిక్యాలరావు వివరించారు.
సినీ నటుడు శివాజీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఓ జాతీయ పార్టీ ‘ఆపరేషన్ గరుడ’ చేపట్టబోతోందని శివాజీ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ ద్రవిడ’లో ఇదొక భాగమన్నారు. ఏపీ, తెలంగాణకు చెంది ‘ఆపరేషన్ గరుడ’.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ రావణ’.. కర్ణాటకలో ‘ఆపరేషన్ కుమార’ను ఆ పార్టీ చేపట్టబోతోందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌కు అనుసంధానకర్తగా ఓ రాజ్యాంగ శక్తి వ్యవహరిస్తోందన్నారు. ఫలితంగా ఆయన పదవీ కాలం పొడగించబోతున్నారని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కోసం రూ.4,800 కోట్లు కేటాయించారని, ఇందులో సగం ఇప్పటికే పంపిణీ జరిగిందంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి.