తిరుపతి వెంకన్న, బెజవాడ కనకదుర్గమ్మ నవ్యాంధ్రప్రదేశ్‌కు సాంస్కృతిక రాయబారులని ఇటీవల ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఘనంగా ప్రకటించారు. ఆదాయపరంగా కూడా కొత్త రాష్ట్రంలో ఈ రెండు పుణ్యక్షేత్రాలే చాలా కీలకం కానున్నాయి. యాధృచ్ఛికమో, ఉద్దేశపూర్వకమో తెలియదు గానీ.. ఆ రెండు క్షేత్రాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు సరైన ప్రాధాన్యత దక్కలేదు. తిరుమల బ్రహ్మోత్సవాలకు కుటుంబ సభ్యులతో వెళ్లిన మంత్రిని అక్కడ సెక్యూరిటీ అధికారులు అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఆ తర్వాత ఉన్నతాధికారులు కల్పించుకున్నా దేవాదాయ శాఖ మంత్రికి గౌరవ మర్యాదలు దక్కలేదని స్వయంగా మంత్రి వర్గీయులే వాదిస్తున్నారు. ఇక విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్ర ఉత్సవాలకు మంత్రి దూరంగా ఉండాల్సిన పరి స్థితి కల్పించారని అంటున్నారు.
ఉత్సవాల సందర్భంగా ఏటా అమ్మవారి జన్మనక్షత్రం (మూలా నక్షత్రం) రోజున దుర్గమ్మకు ముఖ్యమంత్రి లేదా దేవాదాయ శాఖ మంత్రి పట్టు వస్త్రాలను సమర్పిం చడం ఆనవాయితీ. ఎప్పుడైనా ఆ ఇద్దరికీ కుదరని పక్షంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. ఈ ఏడాది ఇందుకు భిన్నంగా అమ్మవారి జన్మ నక్షత్రం రోజున కృష్ణా జిల్లాకు చెందిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వాస్తవానికి సీఎం చంద్రబాబునాయుడు మూలా నక్షత్రం రోజుకు నాలుగు రోజులు ముందుగా దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ప్రారంభోత్సవానికి విజయవాడ వచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు. దీంతో సీఎంకు బదులుగా దేవాదాయ శాఖ మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అందరూ భావించారు.
కానీ మంత్రి మాణిక్యాలరావు అందుబాటులో ఉన్నప్పటికీ ఆయనకు అవకాశం ఇవ్వకుండా దేవినేని ఉమకు ఆ అవకాశం కట్టబెడుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడం చర్చనీయూంశమైంది. అదే రోజున కేబినెట్ సమావేశం ఉన్నందున మాణిక్యాలరావుకు బదులు ఉమకు అవకాశం కల్పించారని అధికార వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మరి ఆ సమావేశానికి కీలకమైన భారీ నీటి పారుదల శాఖ మంత్రి హోదాలో దేవినేని ఉమ కూడా వెళ్లాల్సి ఉంది కదా అన్న ప్రశ్నకు ఎవరి వద్దా సమాధానం లేదు. బీజేపీకి చెందిన మంత్రి కావడంతోపాటు సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో కూడా మాణిక్యాలరావును పక్కనపెట్టి దేవినేని ఉమకు అవకాశం కల్పించారని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వాస్తవానికి దసరా ఉత్సవాల తొలిరోజు నుంచి దూరంగానే ఉన్న మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాల సమర్పణ వ్యవహారంతో అమ్మవారి ఉత్సవాలు ముగిసేవరకూ దూరంగానే ఉన్నారు.
దేవాదాయ శాఖకు మంత్రి ఉండి కూడా శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకాకపోవడం ఇదే ప్రథమం అని బెజవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తిరుమల సిఫార్సు లేఖల రద్దు వ్యవహారంలో మంత్రి మాణిక్యాలరావు మాట నెగ్గకపోవడం.. ఇప్పుడు దుర్గమ్మ ఉత్సవాలకు మంత్రి ఒక్కసారి కూడా వెళ్లకపోవడం తదితర పరిణామాలు ఎటు దారితీస్తాయోనని కమలనాథులు కలవరపడుతున్నారు.
- జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
దేవుళ్ల మంత్రిని దూరం పెట్టారెందుకో!
Published Sun, Oct 5 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM
Advertisement
Advertisement