మన మంత్రులకు ఎన్ని మార్కులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ర్ట మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు సర్వే చేయించిన నేపథ్యంలో మన జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు ఎన్ని మార్కులు వచ్చాయనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్’ అన్న ఆంగ్ల నానుడి ప్రకారం చూస్తే.. తొలి రెండు నెలల పాలనలో మంత్రుల వ్యవహార శైలిపై వెల్లడైన అభిప్రాయమే భవిష్యత్‌లో వారి పనితీరుకు మరింత పదును పెట్టేందుకు దోహదం చేస్తుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం.
ఈ నేపథ్యంలో తొలినాళ్ల పనితీరుపై మన జిల్లాకు చెందిన మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాల రావులకు సీఎం ఎన్ని మార్కులు వేశారనేది చర్చంశనీయమైంది. సర్వే ఫలి తాల్లో మధ్య ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రులకు 30.2 శాతంతో సంతృప్తికర మార్కులు రాగా, 51శాతం ఓకే అని, 18.8 శాతం బాగోలేదని తేలింది. ఆ బాగున్న శాతంలో మన జిల్లా మంత్రుల వాటా ఎంత, బాగోలేదని తేలినదాంట్లో మన వాళ్ల శాతం ఎంత అనేదానిపై ఎవరి వద్దా స్పష్టమైన సమాచారం లేదు. టీడీపీ, బీజేపీ వర్గాలు మాత్రం ఎవరికి వారు తమ మంత్రి పనితీరు బాగుందని బాబు మెచ్చుకున్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
మాణిక్యం చేసిన ప్రతిపాదనలన్నిటికీ ఓకే
దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పని తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తికరంగా ఉన్నారని భారతీయ జనతాపార్టీ వర్గాలతోపాటు టీడీపీ శ్రేణులూ వాదిస్తున్నాయి. హడావుడి లేకుండా.. వివాదాలకు పోకుండా తన పనితాను చేసుకుపోయే మాణిక్యాలరావు వ్యవహార శైలిని మొదటి నుంచీ గమనిస్తున్న బాబు ఆయనకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారని అంటున్నారు. తిరుమలలో సిఫార్సు లేఖల రహిత దర్శనానికి శ్రీకారం చుట్టాలన్న మంత్రి ప్రతిపాదన కష్టసాధ్యమైనప్పటికీ టీడీడీ ఉన్నతాధికారులను చంద్రబాబు హైదరాబాద్ పిలిపించుకుని మరీ విధివిధానాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.
గోదావరి జలాలను విజ్జేశ్వరం నుంచి తాడేపల్లిగూడెంకు తరలించేందుకు మంత్రి ప్రతిపాదించిన రూ.129 కోట్ల ప్రాజెక్టుకు కూడా సీఎం సానుకూలంగా స్పందించారు. ఇక తాడేపల్లిగూడెం పట్టణంలోని మురుగునీటిని అవుట్‌లెట్ల ద్వారా బయటకు పంపేం దుకు రూ.54కోట్లతో ప్రతిపాదించిన ప్రాజెక్టుకు కూడా సీఎం అంగీకారం తెలిపారు. విమానాశ్రయ భూముల్లో దీర్ఘకాలికంగా నివాసముం టున్న 2,557 కుటుంబాలకు శాశ్వత ఇంటిస్థల పట్టాలు ఇవ్వాలన్న మంత్రి సూచనపై కూడా సీఎం సానుకూలంగా స్పం దించి సర్వే చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ లెక్కన చూస్తే తమ మంత్రి పనితీరుపై బాబు సంతృప్తికరంగానే ఉన్నారని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
సుజాత మాటేమిటి
ఇక జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఏకైక మంత్రి పీతల సుజాత పనితీరుపై చంద్రబాబు ఏం తేల్చారన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దళిత మహిళామంత్రిగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ పార్టీ వర్గాలు తనకు పూర్తిస్థాయిలో సహకరించడం లేదని సుజాత భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెను తొలిసారిగా మంత్రివర్గంలో తీసుకుని, కీలకమైన శాఖలు కట్టబెట్టడంతో ఉత్సాహంగా పనిచేస్తున్నా పార్టీ శ్రేణులపరంగా ఆమెకు సరైన సహకారం అందడం లేదని అంటున్నారు. గనులు, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖల పనితీరుపై ఎక్కడా నెగెటివ్ మార్కు పడలేదని, తమ మంత్రి సుజాత తీరుపై చంద్రబాబు సంతృప్తిగానే ఉన్నారని ఆమె వర్గీయులు చెప్పుకుంటున్నారు.
అయితే సహచర మంత్రి మాణిక్యాలరావు మాదిరి కనీసం ఆమె సొంత నియోజకవర్గమైన చింతలపూడి అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టుకూ ఇంతవరకు సానుకూల ప్రకటన రాలేదంటున్న వారూ లేకపోలేదు. మంత్రిగా ముందు నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసేవిధంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని సూచిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చే మార్కులు ఎలా ఉన్నా మొత్తంగా జిల్లా అభివృద్ధిపై సచివుల ‘మార్కు’ ఇంకా పడలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.