విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని బీజేపీ అధ‍్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అసలు రాష్టంలో ఎవరికీ రక్షణ లేదంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత పైడికొండల మాణిక్యాల రావును హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో తాడేపల్లిగూడెం బయల్దేరిన తమ పార్టీ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంపై కన్నా అసహనం వ్యక్తం చేశారు. కనకదుర్గమ్మ వారధి వద్ద రోడ్డుపై బైఠాయించిన కన్నా.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందనడానికి ఇదే ఉదాహరణని ఆరోపించారు.
‘ మా ఎమ్మెల్యేను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అన్యాయంగా రోడ్డుపైనే అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు. మాణిక్యాలరావు పరిస్థితి విషమంగా ఉంది. రాష్టంలో ప్రతిపక్ష నేతకు సైతం రక్షణ లేదు. మిగతా రాజకీయ పార్టీల నాయకులకి రక్షణ ఎక్కడ ఉంటుంది. మాణిక్యాలరావును అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది’ అని ఆయన ప్రశ్నించారు. మాణిక్యాలరావును హౌస్ అరెస్ట్ చేయడంతో కోర్ కమిటీ సమావేశం రద్దు చేసుకుని తాడేపల్లిగూడెం బయల్దేరిన కన్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు జీవీఎల్, కావూరి సాంబశివరావులను కూడా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా వారిని హౌస్ అరెస్ట్ చేశారు. దాంతో కన్నా ఇంటి వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment