టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయపాటి సాంబశివరావు నుంచి రూ.150 కోట్లు తీసుకున్నారా? అయినా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ వ్యవహారంలో వారిని నాశనం చేశారా? చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు వీరి నుంచి డబ్బులు వసూలు చేసుకున్నారా? మామూలుగా ఇలాంటి ఆరోపణ మరెవరిమీద అయినా వచ్చి ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి,తదితర ఎల్లో మీడియా ఎంత భీబత్సంగా ప్రచారం చేసి ఉండేవి! ఆంగ్ల మీడియా సైతం ఎంత ప్రాధాన్యం ఇచ్చి ఉండేవి. కాని ఆశ్చర్యం ఏమిటంటే సాక్షి తప్ప ఇతర మీడియా ఏది పెద్దగా ప్రాచుర్యం ఇవ్వలేదు. చివరికి ఆంగ్ల మీడియాను కూడా మేనేజ్ చేసినట్లు అనిపిస్తుంది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఏమి చెప్పారో గుర్తు చేసుకోండి.
పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎం మాదిరి వాడుకున్నారని ఆయన ఆయా సభలలో అన్నారు. కాని దానిపై తదుపరి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అంతేకాదు. 2019 లో టిడిపి ఓటమి తర్వాత చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇంటిలో ఐటి శాఖ దాడులు చేసి సుమారు రెండువేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని గుర్తించినట్లు సిబిటిడి ప్రకటించింది. అయినా చంద్రబాబుకు ఏమీ కాలేదు. ఐదేళ్లు గడిచిపోయినా మోడీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అదే టైమ్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల అవినీతి జరిగిందో లేదు తెలియదు కాని నెలల తరబడి ఢిల్లీ ఆప్ మంత్రులు జైలులో గడపవలసి వస్తోంది. మన దేశ వ్యవస్థలలో ఎందుకు ఇంత తేడా వస్తోంది? ఒకే తరహా కేసుల్లో ఒకరికేమో ఆయా వ్యవస్థలలో పూర్తి సానుకూల నిర్ణయాలు వస్తుంటాయి.
✍️కొందరికేమో బెయిల్ రావడమే గగనం అవుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోల్చితే చంద్రబాబునాయుడుపై వచ్చిన అవినీతి ఆరోపణలు చాలా పెద్దవాటి కింద లెక్క. నిజంగానే చంద్రబాబుకు అవినీతితో సంబంధం లేకుంటే కేంద్రం కాని, ప్రధాన మంత్రి మోదీ కాని ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం తప్పు అవుతుంది. వాటిలో నిజం ఉంటే అలా వదలివేయడం సరైనదేనా అన్న చర్చ వస్తుంది. అంటే పలుకుబడి, మేనేజ్ మెంట్ నైపుణ్యాన్ని బట్టి కేసుల నుంచి తేలికగా బయటపడవచ్చన్న అభిప్రాయం కలగదా! బీజేపీ నేతలు అవినీతికి వ్యతిరేకంగా గంభీరంగా ప్రకటనలు చేస్తుంటారు. కాని చంద్రబాబు వంటి కొంతమందిపై వచ్చిన ఆరోపణల గురించి మాత్రం నోరు విప్పరు. ఇంకో సంగతి చెప్పాలి. న్యాయ వ్యవస్థ సైతం ఆయన పట్ల ఉదారంగా వ్యవహరిస్తుందా అన్న భావన ప్రజలలో కలుగుతుంది.
✍️ఎందుకంటే ఓటుకు నోటు కేసు విషయంలో సుప్రీంకోర్టులో సైతం ఏళ్ల తరబడి విచారణకే రాలేదంటే అది చంద్రబాబు నైపుణ్యం అని ఎవరైనా అనుకునే అవకాశం ఉంది కదా! చంద్రబాబు నాయుడు తనపై ఏ కేసు వచ్చినా స్టే తెచ్చుకోవడం ఆయన స్పెషాలిటీగా అంతా భావిస్తారు.ఒక సందర్భంలో ఆయనే ఒక మాట అన్నారు. తాను ఏ విషయంలోను టెక్నికల్ గా, లీగల్ గా దొరకనని చెప్పారు. ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎవరూ ఏమీ చేయలేకపోవడంతో అది వాస్తవం అనిపిస్తుంది. అలాంటిది ఎపి సిఐడికి స్కిల్ కార్పొరేషన్ స్కామ్ కేసులో చిక్కి ఏభై మూడు రోజులు జైలులో ఉండవలసి వచ్చింది.
✍️ఆయనకు కింది కోర్టులో బెయిల్ నిరాకరణ జరిగినా హైకోర్టులో మాత్రం పొందగలిగారు. విశేషం ఏమిటంటే బెయిల్ కోసం ఆయన తనకు నానా రకాల జబ్బులు ఉన్నాయని ఒక ప్రైవేటు ఆస్పత్రివారు ఇచ్చిన సర్టిఫికెట్ ను గౌరవ న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవడం. సాధారణంగా ఎవరికైనా ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చే రిపోర్టును చూస్తారు. మరి చంద్రబాబు విషయంలో బిన్నంగా జరిగిందంటే అది ఆయన లాయర్ల గొప్పదనం అనుకోవాలి. సు నుంచి బయటకు వచ్చాక మాత్రం చంద్రబాబు డాక్టర్ లు ఇచ్చిన రిపోర్టులన్నీ అబద్దాలే అన్నట్లుగా ఆయన టూర్లు చేస్తున్నారు. మంచి జోష్ గా అరుపులు,పెడబొబ్బలు పెడుతూ ప్రసంగాలు చేస్తున్నారు. నిజంగా అంత తీవ్రమైన గుండె జబ్జు ఉన్న వ్యక్తి అలా చేయగలుగుతారా? న్యాయ వ్యవస్థ ఆ విషయాలను పరిశీలించదా అంటే ఏమి చెబుదాం.
✍️స్కిల్ కేసులో ఆయన మాజీ పిఎస్ శ్రీనివాస్ అమెరికా పారిపోయినా ఏమీ కాలేదు. ఈడి అధికారులు నలుగురిని అరెస్టు చేసినా, అసలు కేసే లేదని చంద్రబాబు తరపున వాదించగలుగుతున్నారు. గవర్నర్ అనుమతి లేకుండా కేసులు పెట్టడం తప్పు అంటూ ఆయన సుప్రింకోర్టుకు వెళ్లారు.దానిపై కూడా గౌరవ కోర్టువారు నెలల తరబడి తీర్పు ఇవ్వకపోవడం కూడా గమనించదగ్గ అంశమే. ఒకప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆయనకు కోటి రూపాయలు ఇచ్చానని హర్షద్ మెహతా అని స్టాక్ బ్రోకర్ చేసిన ఆరోపణ తీవ్ర కలకలం సృష్టించింది. దేశంలోని మీడియా అంతా దానిపై చిలవలు, పలవలుగా కదనాలు ఇచ్చేవి.
✍️చివరికి కోర్టుకు కూడా పివి వెళ్లవలసి వచ్చింది. కాని చంద్రబాబును మాత్రం మూడు దశాబ్దాలలో ఎవరూ కదల్చలేకపోయారు. ఎన్ని అవినీతి అభియోగాలు వచ్చినా సేఫ్ గా బయటపడుతుంటారు. ఆయనకు ఉన్న పట్టు అటువంటిదని అంతా నమ్ముతుంటారు. ఈ నేపద్యంలో తాజాగా గుంటూరు మాజీ ఎమ్.పి.రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు చేసిన ఆరోపణ ఎలాంటి పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుందన్నది చర్చనీయాంశం. ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా ఈ ఆరోపణలకు సంబంధించి కుక్కిన పేల మాదిరి నోరు మూసుకుని కూర్చున్నాయి. అయినా సోషల్ మీడియా ఉంది కనుక జనానికి విషయం తెలిసింది. చంద్రబాబు, లోకేష్ లు తమ కుటుంబాన్ని నాశనం చేశారని అంటూ చంద్రబాబు ఫోటోను రంగారావు నేలకేసి పగలకొట్టిన వీడియో వైరల్ గా మారింది. రాయపాటికి కాంగ్రెస్ టైమ్ లో పోలవరం టెండర్ దక్కింది. దానిని ఆయన కొంతమేర ఎక్జిక్యూట్ చేశారు.
✍️ఈలోగా శాసనసభ ఎన్నికలు రావడం, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడంతో ఆ పార్టీ ప్రముఖులంతా టీడీపీ లేదా వైఎస్సార్‌సీపీలోకి వచ్చేశారు. రాయపాటి కూడా టీడీపీలో చేరి నరసరావుపేట టిక్కెట్ పొందారు. టీడీపీలో చేరినా పోలవరం కాంట్రాక్టును రాయపాటి నుంచి తప్పించి నవయుగ సంస్థకు చంద్రబాబు అప్పగించారు. ఎంపీ గా మరోసారి గెలిచారన్న భావన తప్పితే రాయపాటి ఆర్దికంగా బాగా దెబ్బతిన్నారని చెబుతారు.గత ఎన్నికల సమయంలో రూ. 150 కోట్లు ఇచ్చామని, చంద్రబాబు,లోకేష్ లు ఒకరికి తెలియకుండా డబ్బు వసూలు చేసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.సోమవారం పోలవారం అంటూ చంద్రబాబు చేసిన ప్రచారం అంతా బోగస్ అని ఆయన లోగుట్టు విప్పేశారు.టిడిపి రాజకీయ పార్టీ కాదని, ఒక వ్యాపార సంస్థ అని కూడా రాయపాటి సూత్రీకరించారు.
✍️దీనికి తోడు సత్తెనపల్లి సీటును తమ ప్రత్యర్ధి అయిన కన్నా లక్ష్మీనారాయణకు ఇవ్వడం కూడా రాయపాటి వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అయినా ఇన్నాళ్లు భరిస్తూ వచ్చి, ఎన్నికల సమయంలో బయటపడ్డారు. కట్టలు తెగిన ఆవేశంతో ఆయన మాట్లాడిన తీరు, పార్టీకి గుడ్ బై చెప్పిన వైనం అందరిని ఆశ్చర్యపరచింది. ఎంతగా నష్టపోయి ఉండకపోతే ఆయన ఇంతలా ఆవేదన చెందుతారా అన్నభావన కలుగుతుంది.దీనికి చంద్రబాబుకాని, ఆయన పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ కాని స్పందించలేక పోయారు. ఇక మరో కీలక నేత ,విజయవాడ ఎమ్.పి కేశినేని నాని పార్టీని వీడి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిపోవడం కాదు.
✍️ఆ పార్టీ తరపున పోటీచేయబోతున్నారు. చంద్రబాబు ,లోకేష్ లు ఎలా తన పట్ల అనుచితంగా వ్యవహరించింది ఆయన తెలియచెప్పారు. చంద్రబాబు పెద్ద మోసగాడని కూడా నిర్మొహమాటంగా పేర్కొన్నారు.తమ కుటుంబంలో చిచ్చుపెట్టారని ఆయన ఆరోపించారు.గుంటూరు, కృష్ణా జిల్లాలలో సామాజికపరంగా కూడా బలమైన నేతలుగా ఉన్న ఇద్దరు ప్రముఖులు పార్టీని వీడడమే కాకుండా, సంచలనాత్మకమైన ఆరోపణలు చేయడం సహజంగానే వచ్చే ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.ఈ క్రమంలో రంగారావు వేసిన మరో ప్రశ్న కూడా ఆసక్తికరంగా ఉంది. లోకేష్ రాయలసీమలో కాకుండా మంగళగిరి నుంచి ఎందుకు పోటీచేస్తున్నారని ప్రశ్నించారు..
ఈసారి కూడా గెలవనివ్వబోమని ఆయన అంటున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఎవరైనా టీడీపీలో చేరితే అదేదో వైఎస్సార్‌సీపీకి తీవ్రమైన నష్టం కలిగినట్లు టీడీపీ నేతలు, వారికి మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంటారు.మరి ఇప్పుడు కమ్మ సామాజికవర్గం నేతలే పలువురు టీడీపీకి రాం రాం చెప్పడమే కాకుండా సంచలన విషయాలు బయటపెడుతుండడం పై మాత్రం కిమ్మనడం లేదు.దీనిని బట్టే అర్దం కావడం లేదూ తెలుగుదేశం ఎంత ఆత్మరక్షణలో పడింది!
- కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ మాజీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment