ranga rao
-
మళ్లీ తెరపైకి రెండో రాజధాని?
పార్లమెంట్ సమావేశాలు దేశ రాజధాని ఢిల్లీ వెలుపల, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లోని ఏదైనా రాష్ట్రంలో నిర్వహించాలని ఇటీవల డిమాండు వస్తోంది. ఇది దేశానికి రెండో రాజధాని అవసరమనే వాదనకు దారి తీయవచ్చనేది ఒక అభిప్రాయం. రాజధాని ఢిల్లీలో తీవ్రమైన వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దక్షిణాదిలోనూ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని ఇటీవల వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీ, పార్లమెంటరీ వ్యవహా రాల శాఖ మంత్రి కిరణ్ రిజిజూలకు ఆయన లేఖ రాశారు. ఢిల్లీలోని వాతావరణం వల్ల ఎంపీల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతోందనీ, దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం వల్ల ఈ ఇబ్బంది తొలగడంతో పాటు, జాతీయ సమగ్రత వెల్లివిరుస్తుందనీ ఆయన చెబుతున్నారు.దేశానికి మరో రాజధాని కావాలని ప్రత్యేకించి ఎవరూ ప్రస్తుతానికి డిమాండ్ చేయనప్పటికీ ఆ ప్రతిపాదన మాత్రం పాతదే. రాజధానిలోని పార్లమెంట్లో కాకుండా, బయట రాష్ట్రాల్లో సమావేశాలను నిర్వహిస్తే సాంకేతికంగా రెండో రాజధానిని అంగీకరించినట్లేనని కొందరు మేధావులు చెబుతున్నారు. అయితే ఈ అంశాన్ని మరికొందరు విభేది స్తున్నారు. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రయోజనాల కోసం రాజధాని నగరాన్ని వినియోగిస్తార ని, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇతర రాష్ట్రాలు లేదా ప్రాంతాలను... వేర్వేరు ప్రయోజనాల కోసం వినియోగిస్తారనేది కొందరు మేధావుల అభిప్రాయం. ఈ విధంగా ప్రాధాన్యతనిచ్చే ఇతర నగరం మరో అధికారిక రాజధానిగా పరిగణించబడదని వారు చెబుతున్నారు.చట్టబద్ధంగా నిర్వచించిన ఒక రాజధాని ఉన్న సంద ర్భంలో... రాజధాని అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా మరో రాష్ట్రంలోని నగరాన్ని రాజధానిగా పేర్కొని ఉపయో గించుకుంటే మాత్రం తప్పేమిటని మరికొందరు వాదిస్తు న్నారు. ఒకటికన్నా ఎక్కువ రాజధానులను కలిగి ఉన్న దేశాలు ప్రపంచంలో పదమూడు ఉన్నాయి. మూడు రాజ ధానీ నగరాలను కలిగి ఉన్న ఏకైక దేశంగా దక్షిణాఫ్రికా నిలి చింది. ‘ప్రిటోరియా’ పరిపాలన, కార్యనిర్వాహక రాజ ధానిగా;‘ కేప్ టౌన్’ శాసన రాజధానిగా, ‘బ్లూమ్ ఫోంటైన్’ న్యాయ రాజధానిగా ఉన్నాయి.1950వ దశకం నుంచే దక్షిణ భారతదేశంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి అన్న డిమాండ్ మొద లైందని ఎంపీ గురుమూర్తి చెబుతున్నారు. ఈ అంశంపై 1968లో స్వతంత్ర ఎంపీ ప్రకాశ్ వీర్ శాస్త్రి ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టారనీ, నాడు 18 మంది ఎంపీలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేశారనీ ఆయన గుర్తు చేస్తున్నారు. అప్పటి కేరళ, మైసూరు ప్రభుత్వాలు పార్లమెంటు సమావేశాలకు మౌలిక వసతులు కల్పిస్తామని ముందుకు వచ్చాయనీ, అయితే అప్పట్లో సాధ్యాసాధ్యాలు పరిశీ లించిన అనంతరం ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. అప్పటితో పోల్చితే వీడియో కాన్ఫ రెన్స్, ఇంట ర్నెట్ వంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఎంతో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ఢిల్లీ వెలుపల నిర్వహించడం సాధ్యమైన విషయమేనని మేధావులు, పార్లమెంటేరియన్లు అంటున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభలు ఏడాదికి మూడు సార్లు సమావేశమవుతున్నాయి. జనవరి నెలాఖరున ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు మధ్యలో కొన్నాళ్ల విరామంతో రెండు విడతలుగా సాగుతాయి. జూలై–ఆగస్ట్ నెలల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, నవంబర్ – డిసెంబర్ మాసాల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతాయ నేది అందరికీ తెలిసిన విషయమే. ఈ మూడు సెషన్లలో కనీసం ఒకటైనా దక్షిణ భారతదేశంలో నిర్వహించా లని దక్షిణాదికి చెందిన వివిధ పార్టీల ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. వారిలో కొందరైతే రెండు సమావేశాలను దక్షిణాదిన నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.దేశంలో జమ్మూ కాశ్మీర్‌కు రెండు రాజధానులు ఉన్నాయి. శ్రీనగర్ వేసవి రాజధాని, జమ్మూ శీతాకాల రాజ ధాని. రాష్ట్రానికే పరిపాలనా సౌలభ్యం కోసం, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రెండు రాజధానులు ఉన్న నేపథ్యంలో... దేశానికి ఉండడం అభ్యంతరం చెప్పాల్సిన విషయం కాదని కొందరంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ–కశ్మీర్ వంటి పలు రాష్ట్రాల్లో/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండు నగరాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో... దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ సమావేశాల్లో ఒకటీ రెండు సెషన్లను నిర్వహించాలన్న డిమాండ్ సహేతుకంగానే ఉందని చెప్పవచ్చు. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశ రెండో రాజధాని రేసులో ఉన్నాయి. పగిడి రంగారావు వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడుమొబైల్: 94401 38573 -
అన్నదమ్ముల మధ్య కంటికి కనిపించని యుద్ధం
తమ్ముడు తమ్ముడే..పేకాట.. పేకాటే అన్నట్లు తయారైంది ఆ అన్నదమ్ముల మధ్య వ్యవహారం. అన్న మాజీ మంత్రి..తమ్ముడు తాజా ఎమ్మెల్యే..అన్న పదవిలో ఉండగా తమ్ముడెలా అన్ని వ్యవహారాల్లో వేలు పెట్టి అన్నకు తలనొప్పి తెప్పించాడో? ఇప్పుడు తమ్ముడు పదవిలో ఉండగా అన్న కూడా అదేరీతిన వ్యవహరిస్తుండడంతో అన్నదమ్ముల మధ్య బయటకు కనిపించని యుద్ధం సాగుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీని వదిలి రాష్ట్ర మంత్రి పదవి అనుభవించిన మాజీ మంత్రి ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావుకు, బొబ్బిలి తాజా ఎమ్మెల్యే ఆర్వీ కుమారకృష్ణ రంగారావు (బేబీనాయన)కు మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగుల బదిలీలు, గనుల శాఖలో అనుమతుల కోసం మంత్రిగా సుజయ్ సిఫారసు చేస్తే తమ్ముడు బేబీ నాయన అడ్డుపుల్ల వేస్తుండడం అప్పట్లో చర్చనీయాంశమయ్యేది. అదే సమయంలో మంత్రి సోదరుడిగా చక్రం తిప్పుతూ బేబీ నాయన చేసిన పైరవీలకు మంత్రి సుజయ్ అనుచరులు అడ్డుపడేవారు. మళ్లీ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో బొబ్బిలి నుంచి బేబీ నాయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సుజయ్‌తో కోల్డ్‌వార్ మళ్లీ మొదలైంది. అన్నదమ్ముల రాజకీయ క్రీడలో అధికారులు, సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. సుజయ్ అడ్డుచక్రం..బేబీ నాయన పేరుకు› బొబ్బిలి ఎమ్మెల్యే అయినా పెత్తనం మాత్రం అన్న సుజయ్కృష్ణదేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన సర్కిల్ ఇన్స్పెక్టర్ల (సీఐల) బదిలీల్లో రాష్ట్రవ్యాప్తంగా కేటాయించిన స్టేషన్లలో అందరూ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఒక్క బొబ్బిలి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ కె.నారాయణరావు తప్ప. పార్వతీపురం మన్యం జిల్లా కొటియా నుంచి బొబ్బిలి రూరల్ సీఐగా ఆయనకు బదిలీ అయ్యింది. విధుల్లో వారం రోజుల క్రితమే ఆయన చేరాల్సి ఉంది. కానీ బొబ్బిలి రాజుల మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్ ఆయన పోస్టింగ్‌కు చేటు తీసుకొచి్చంది. వాస్తవానికి బొబ్బిలి రూరల్ స్టేషన్లో సీఐ పోస్టులో నారాయణరావు చేరడానికి ఎమ్మెల్యే బేబీ నాయన సానుకూలత వ్యక్తంచేస్తూ సిఫారసు లేఖ రాశారు. ఆ లేఖనే నారాయణరావు తమ శాఖ ఉన్నతాధికారులకు సమర్పించుకోగా ఆయనను బొబ్బిలి రూరల్ సీఐగా నియమిస్తూ బదిలీల జాబితాలో పేరు ఖరారైంది. తీరా ఆయన బాధ్యతలు తీసుకునే సమయానికి సుజయ్ అడ్డుచక్రం వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ‘కులం’ సాకుతో..బొబ్బిలి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తో లేదా అనుకూల వర్గం వ్యక్తో సీఐగా వస్తే బాగుంటుందని స్థానిక టీడీపీ నాయకులు సుజయ్ చెవిలో ఊదినట్లు సమాచారం. నారాయణరావు కాళింగ సామాజికవర్గానికి వ్యక్తి కాబట్టి తాము ఆశించిన పనులు చేయకపోవచ్చని వాదించారట. ఆయన పోస్టింగ్ కోసం ఎమ్మెల్యే బేబీనాయన స్వయంగా లేఖ ఇచ్చారని చెప్పారట. అంతకుమించి ఆ సిఫారసు లేఖను మాజీ తెంటు లక్ష్ము నాయుడు ఇప్పించారనీ చెప్పేశారట. అప్పటికే తెంటు అంటే వైరం, సోదరుడు బేబీ నాయనతో కోల్డ్‌వార్ నేపథ్యంలో సుజయ్ వెంటనే స్పందించి నారాయణరావు చేరికకు అడ్డుపుల్ల వేశారని తెలిసింది. పోలీసు అధికారులను సుజయ్ అనుచరులు స్వయంగా కలిసి ఆయన మాటగా అసలు విషయం చెప్పారట. బొబ్బిలి నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న కొప్పుల వెలమ లేదా కాపు సామాజికవర్గానికి చెందిన సీఐని రూరల్ స్టేషన్‌కు ఇవ్వాలని, నారాయణరావు కాళింగ సామాజిక వర్గానికి చెందినవారని, తమకు పనిచేయాలంటే స్థానికంగా కొంత అవగాహన ఉండాలని చెప్పారట. తమకు అనుకూలమైన సీఐని తెచ్చుకునేవరకూ నారాయణరావు బాధ్యతలు తీసుకోకుండా ఆపాలని కరాఖండిగా చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే నారాయణరావును విధుల్లో చేరవద్దని చెప్పేశారట. ఇప్పుడు ఆయన పరిస్థితి డోలాయమానంలో ఉంది.అన్నదముల సవాల్‌తో సమస్య..బొబ్బిలి రూరల్ సీఐ పోస్టు ఖాళీగా ఉండడంతో గ్రామీణ మండలాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. పలు గ్రామాల్లో దొంగతనాలు, హత్యాయత్నాలు, అత్యాచార యత్నాలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యే బేబీనాయన, సోదరుడు సుజయ్ మధ్య సవాళ్లు తమకు సమస్యగా మారాయని పోలీసులు, సామాన్య ప్రజలు లోలోన రగిలిపోతున్నారు. -
అమ్మ చంద్రబాబూ.. అది నిజమేనట!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయపాటి సాంబశివరావు నుంచి రూ.150 కోట్లు తీసుకున్నారా? అయినా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ వ్యవహారంలో వారిని నాశనం చేశారా? చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు వీరి నుంచి డబ్బులు వసూలు చేసుకున్నారా? మామూలుగా ఇలాంటి ఆరోపణ మరెవరిమీద అయినా వచ్చి ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి,తదితర ఎల్లో మీడియా ఎంత భీబత్సంగా ప్రచారం చేసి ఉండేవి! ఆంగ్ల మీడియా సైతం ఎంత ప్రాధాన్యం ఇచ్చి ఉండేవి. కాని ఆశ్చర్యం ఏమిటంటే సాక్షి తప్ప ఇతర మీడియా ఏది పెద్దగా ప్రాచుర్యం ఇవ్వలేదు. చివరికి ఆంగ్ల మీడియాను కూడా మేనేజ్ చేసినట్లు అనిపిస్తుంది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఏమి చెప్పారో గుర్తు చేసుకోండి. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎం మాదిరి వాడుకున్నారని ఆయన ఆయా సభలలో అన్నారు. కాని దానిపై తదుపరి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అంతేకాదు. 2019 లో టిడిపి ఓటమి తర్వాత చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇంటిలో ఐటి శాఖ దాడులు చేసి సుమారు రెండువేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని గుర్తించినట్లు సిబిటిడి ప్రకటించింది. అయినా చంద్రబాబుకు ఏమీ కాలేదు. ఐదేళ్లు గడిచిపోయినా మోడీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అదే టైమ్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల అవినీతి జరిగిందో లేదు తెలియదు కాని నెలల తరబడి ఢిల్లీ ఆప్ మంత్రులు జైలులో గడపవలసి వస్తోంది. మన దేశ వ్యవస్థలలో ఎందుకు ఇంత తేడా వస్తోంది? ఒకే తరహా కేసుల్లో ఒకరికేమో ఆయా వ్యవస్థలలో పూర్తి సానుకూల నిర్ణయాలు వస్తుంటాయి. ✍️కొందరికేమో బెయిల్ రావడమే గగనం అవుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోల్చితే చంద్రబాబునాయుడుపై వచ్చిన అవినీతి ఆరోపణలు చాలా పెద్దవాటి కింద లెక్క. నిజంగానే చంద్రబాబుకు అవినీతితో సంబంధం లేకుంటే కేంద్రం కాని, ప్రధాన మంత్రి మోదీ కాని ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం తప్పు అవుతుంది. వాటిలో నిజం ఉంటే అలా వదలివేయడం సరైనదేనా అన్న చర్చ వస్తుంది. అంటే పలుకుబడి, మేనేజ్ మెంట్ నైపుణ్యాన్ని బట్టి కేసుల నుంచి తేలికగా బయటపడవచ్చన్న అభిప్రాయం కలగదా! బీజేపీ నేతలు అవినీతికి వ్యతిరేకంగా గంభీరంగా ప్రకటనలు చేస్తుంటారు. కాని చంద్రబాబు వంటి కొంతమందిపై వచ్చిన ఆరోపణల గురించి మాత్రం నోరు విప్పరు. ఇంకో సంగతి చెప్పాలి. న్యాయ వ్యవస్థ సైతం ఆయన పట్ల ఉదారంగా వ్యవహరిస్తుందా అన్న భావన ప్రజలలో కలుగుతుంది. ✍️ఎందుకంటే ఓటుకు నోటు కేసు విషయంలో సుప్రీంకోర్టులో సైతం ఏళ్ల తరబడి విచారణకే రాలేదంటే అది చంద్రబాబు నైపుణ్యం అని ఎవరైనా అనుకునే అవకాశం ఉంది కదా! చంద్రబాబు నాయుడు తనపై ఏ కేసు వచ్చినా స్టే తెచ్చుకోవడం ఆయన స్పెషాలిటీగా అంతా భావిస్తారు.ఒక సందర్భంలో ఆయనే ఒక మాట అన్నారు. తాను ఏ విషయంలోను టెక్నికల్ గా, లీగల్ గా దొరకనని చెప్పారు. ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎవరూ ఏమీ చేయలేకపోవడంతో అది వాస్తవం అనిపిస్తుంది. అలాంటిది ఎపి సిఐడికి స్కిల్ కార్పొరేషన్ స్కామ్ కేసులో చిక్కి ఏభై మూడు రోజులు జైలులో ఉండవలసి వచ్చింది. ✍️ఆయనకు కింది కోర్టులో బెయిల్ నిరాకరణ జరిగినా హైకోర్టులో మాత్రం పొందగలిగారు. విశేషం ఏమిటంటే బెయిల్ కోసం ఆయన తనకు నానా రకాల జబ్బులు ఉన్నాయని ఒక ప్రైవేటు ఆస్పత్రివారు ఇచ్చిన సర్టిఫికెట్ ను గౌరవ న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవడం. సాధారణంగా ఎవరికైనా ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చే రిపోర్టును చూస్తారు. మరి చంద్రబాబు విషయంలో బిన్నంగా జరిగిందంటే అది ఆయన లాయర్ల గొప్పదనం అనుకోవాలి. సు నుంచి బయటకు వచ్చాక మాత్రం చంద్రబాబు డాక్టర్ లు ఇచ్చిన రిపోర్టులన్నీ అబద్దాలే అన్నట్లుగా ఆయన టూర్లు చేస్తున్నారు. మంచి జోష్ గా అరుపులు,పెడబొబ్బలు పెడుతూ ప్రసంగాలు చేస్తున్నారు. నిజంగా అంత తీవ్రమైన గుండె జబ్జు ఉన్న వ్యక్తి అలా చేయగలుగుతారా? న్యాయ వ్యవస్థ ఆ విషయాలను పరిశీలించదా అంటే ఏమి చెబుదాం. ✍️స్కిల్ కేసులో ఆయన మాజీ పిఎస్ శ్రీనివాస్ అమెరికా పారిపోయినా ఏమీ కాలేదు. ఈడి అధికారులు నలుగురిని అరెస్టు చేసినా, అసలు కేసే లేదని చంద్రబాబు తరపున వాదించగలుగుతున్నారు. గవర్నర్ అనుమతి లేకుండా కేసులు పెట్టడం తప్పు అంటూ ఆయన సుప్రింకోర్టుకు వెళ్లారు.దానిపై కూడా గౌరవ కోర్టువారు నెలల తరబడి తీర్పు ఇవ్వకపోవడం కూడా గమనించదగ్గ అంశమే. ఒకప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆయనకు కోటి రూపాయలు ఇచ్చానని హర్షద్ మెహతా అని స్టాక్ బ్రోకర్ చేసిన ఆరోపణ తీవ్ర కలకలం సృష్టించింది. దేశంలోని మీడియా అంతా దానిపై చిలవలు, పలవలుగా కదనాలు ఇచ్చేవి. ✍️చివరికి కోర్టుకు కూడా పివి వెళ్లవలసి వచ్చింది. కాని చంద్రబాబును మాత్రం మూడు దశాబ్దాలలో ఎవరూ కదల్చలేకపోయారు. ఎన్ని అవినీతి అభియోగాలు వచ్చినా సేఫ్ గా బయటపడుతుంటారు. ఆయనకు ఉన్న పట్టు అటువంటిదని అంతా నమ్ముతుంటారు. ఈ నేపద్యంలో తాజాగా గుంటూరు మాజీ ఎమ్.పి.రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు చేసిన ఆరోపణ ఎలాంటి పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుందన్నది చర్చనీయాంశం. ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా ఈ ఆరోపణలకు సంబంధించి కుక్కిన పేల మాదిరి నోరు మూసుకుని కూర్చున్నాయి. అయినా సోషల్ మీడియా ఉంది కనుక జనానికి విషయం తెలిసింది. చంద్రబాబు, లోకేష్ లు తమ కుటుంబాన్ని నాశనం చేశారని అంటూ చంద్రబాబు ఫోటోను రంగారావు నేలకేసి పగలకొట్టిన వీడియో వైరల్ గా మారింది. రాయపాటికి కాంగ్రెస్ టైమ్ లో పోలవరం టెండర్ దక్కింది. దానిని ఆయన కొంతమేర ఎక్జిక్యూట్ చేశారు. ✍️ఈలోగా శాసనసభ ఎన్నికలు రావడం, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడంతో ఆ పార్టీ ప్రముఖులంతా టీడీపీ లేదా వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు. రాయపాటి కూడా టీడీపీలో చేరి నరసరావుపేట టిక్కెట్ పొందారు. టీడీపీలో చేరినా పోలవరం కాంట్రాక్టును రాయపాటి నుంచి తప్పించి నవయుగ సంస్థకు చంద్రబాబు అప్పగించారు. ఎంపీ గా మరోసారి గెలిచారన్న భావన తప్పితే రాయపాటి ఆర్దికంగా బాగా దెబ్బతిన్నారని చెబుతారు.గత ఎన్నికల సమయంలో రూ. 150 కోట్లు ఇచ్చామని, చంద్రబాబు,లోకేష్ లు ఒకరికి తెలియకుండా డబ్బు వసూలు చేసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.సోమవారం పోలవారం అంటూ చంద్రబాబు చేసిన ప్రచారం అంతా బోగస్ అని ఆయన లోగుట్టు విప్పేశారు.టిడిపి రాజకీయ పార్టీ కాదని, ఒక వ్యాపార సంస్థ అని కూడా రాయపాటి సూత్రీకరించారు. ✍️దీనికి తోడు సత్తెనపల్లి సీటును తమ ప్రత్యర్ధి అయిన కన్నా లక్ష్మీనారాయణకు ఇవ్వడం కూడా రాయపాటి వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అయినా ఇన్నాళ్లు భరిస్తూ వచ్చి, ఎన్నికల సమయంలో బయటపడ్డారు. కట్టలు తెగిన ఆవేశంతో ఆయన మాట్లాడిన తీరు, పార్టీకి గుడ్ బై చెప్పిన వైనం అందరిని ఆశ్చర్యపరచింది. ఎంతగా నష్టపోయి ఉండకపోతే ఆయన ఇంతలా ఆవేదన చెందుతారా అన్నభావన కలుగుతుంది.దీనికి చంద్రబాబుకాని, ఆయన పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ కాని స్పందించలేక పోయారు. ఇక మరో కీలక నేత ,విజయవాడ ఎమ్.పి కేశినేని నాని పార్టీని వీడి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిపోవడం కాదు. ✍️ఆ పార్టీ తరపున పోటీచేయబోతున్నారు. చంద్రబాబు ,లోకేష్ లు ఎలా తన పట్ల అనుచితంగా వ్యవహరించింది ఆయన తెలియచెప్పారు. చంద్రబాబు పెద్ద మోసగాడని కూడా నిర్మొహమాటంగా పేర్కొన్నారు.తమ కుటుంబంలో చిచ్చుపెట్టారని ఆయన ఆరోపించారు.గుంటూరు, కృష్ణా జిల్లాలలో సామాజికపరంగా కూడా బలమైన నేతలుగా ఉన్న ఇద్దరు ప్రముఖులు పార్టీని వీడడమే కాకుండా, సంచలనాత్మకమైన ఆరోపణలు చేయడం సహజంగానే వచ్చే ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.ఈ క్రమంలో రంగారావు వేసిన మరో ప్రశ్న కూడా ఆసక్తికరంగా ఉంది. లోకేష్ రాయలసీమలో కాకుండా మంగళగిరి నుంచి ఎందుకు పోటీచేస్తున్నారని ప్రశ్నించారు.. ఈసారి కూడా గెలవనివ్వబోమని ఆయన అంటున్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఎవరైనా టీడీపీలో చేరితే అదేదో వైఎస్సార్సీపీకి తీవ్రమైన నష్టం కలిగినట్లు టీడీపీ నేతలు, వారికి మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంటారు.మరి ఇప్పుడు కమ్మ సామాజికవర్గం నేతలే పలువురు టీడీపీకి రాం రాం చెప్పడమే కాకుండా సంచలన విషయాలు బయటపెడుతుండడం పై మాత్రం కిమ్మనడం లేదు.దీనిని బట్టే అర్దం కావడం లేదూ తెలుగుదేశం ఎంత ఆత్మరక్షణలో పడింది! - కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ -
నా ప్రాణానికి ఏదైనా జరిగితే లోకేశ్‌దే బాధ్యత
నగరంపాలెం: తనను కిరాయి మూకలతో హతమార్చేందుకు టీడీపీ రూ.50 లక్షల చందాలు వసూలు చేసిందని, దీనిపై గుంటూరు ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశానని టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు తెలిపారు. గుంటూరు లక్ష్మీపురంలోని నివాసంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 13న గుంటూరు రీజినల్ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన క్రమంలో ఈ చందాలు వసూలు చేశారన్నారు. వైజాగ్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి , చంద్రబాబుపై విమర్శలు మానుకోవాలని, లేకపోతే అంతు చూస్తామని బెదిరించారని చెప్పారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే వాడిని కాదన్నారు. తన ప్రాణానికి ఏదైనా జరిగితే అందుకు నారా లోకేశ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకి కొత్తకాదని, అందులో భాగంగానే రాయపాటి శైలజతో మాట్లాడిస్తున్నారని ధ్వజమెత్తారు. లోకేశ్ ఎక్కడా గెలవడని జ్యోస్యం చెప్పారు. యువగళానికి ఒక్క రోజు కూడా తాను వెళ్ళలేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలిచి ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని పేర్కొన్నారు. -
చంద్రబాబు, లోకేష్ పెద్ద బేవర్స్ గాళ్ళు..రాయపాటి రంగ రావు ఫైర్
-
చంద్రబాబు, లోకేశ్ దొంగలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు లోకేశ్ దొంగలని, ఆ పార్టీ ఓ దిక్కుమాలిన పార్టీ అని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రాయపాటి రంగారావు చెప్పారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్ ధన దాహానికి తమ కుటుంబం సర్వనాశనం అయిపోయిందని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్‌కు డబ్బే ముఖ్యమని, మరేమీ అవసరం లేదని అన్నారు. ఇక టీడీపీలో ఉండలేనని స్పష్టం చేశారు. పార్టీ కీ, పదవికి రాజీనామ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే తన కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరిన తాము ఆ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. గత ఎన్నికలకు ముందు తమ నుంచి రూ. 150 కోట్లు తీసుకున్నారని తెలిపారు. లోకేశ్, చంద్రబాబునాయుడు ఎంతెంత తీసుకున్నారో తమ వద్ద లెక్కలున్నాయన్నారు. తండ్రి, కొడుకు ఒకరికి తెలియకుండా మరొకరు డబ్బులు తీసుకున్నారన్నారు. డబ్బులు తీసుకుని కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో తమను సర్వ నాశనం చేశారన్నారు. చంద్రబాబు కమీషన్ల కోసం పోలవరాన్ని వాడుకున్నారని చెప్పారు. సోమవారం పోలవారం అని చంద్రబాబు చెప్పడం ఉత్త బోగస్ అని అన్నారు. చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష చేసింది కేవలం లంచాల కోసమేనని చెప్పారు. ప్రతి వారం డబ్బులు వసూలు చేశారని తెలిపారు. తమని హింసించి మరీ డబ్బులు వసూలు చేశారన్నారు. తమ ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టుకున్నారని అన్నారు. డబ్బులు వాడుకుని మూడు సంవత్సరాల తర్వాత మమ్మల్ని ప్రాజెక్టు నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తి చేసినట్లుగా చంద్రబాబు చెబుతున్నది పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. పేదల కోసం పని చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కోసం పనిచేస్తున్నారని రంగారావు చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్ ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టారని చెప్పారు. ఆ రెండేళ్లు ఆంధ్రప్రదేశ్ జీడీపీ ఎక్కువగా ఉందని రిజర్వ్ బ్యాంక్ వెబ్‌సైటే చెబుతోందని తెలిపారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయన్నారు. జగన్ అంటే తమకు ఇష్టమని, ఆయన సీటు ఇస్తే పోటీ చేస్తానని చెప్పారు. టీడీపీ ఫక్తు వ్యాపార సంస్థ తెలుగుదేశం రాజకీయ పార్టీ యే కాదని, ఫక్తు వ్యాపార సంస్థ అని ఆరోపించారు. ఆ పార్టీ ఉంది ప్రజల కోసం కాదని, కేవలం వాళ్లు బాగుపడటం కోసమేనని చెప్పారు. లక్ష ఉద్యోగాలు తెచ్చామని, శ్రీసిటీ కట్టించామన్నారని, కియా కంపెనీ తెచ్చామని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. కియా కంపెనీ తెస్తే అనంతపురంలో ఎందుకు ఓడిపోయారని అన్నారు. లోకేశ్ రాయలసీమలో కాకుండా మంగళగిరి ఎందుకొచ్చాడని ప్రశ్నించారు. లోకేశ్‌కు ధైర్యం ఉంటే రాయలసీమలో పోటీ చేయాలని సవాల్ చేశారు. మంగళగిరిలో లోకేశ్‌ను ఓడిస్తానని చెప్పారు. గతంలో మంగళగిరిలో కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావులను తామే గెలిపించుకున్నామని అన్నారు. బాబు, లోకేశ్ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కులచిచ్చు లేపుతున్నారని ఆరోపించారు. టీడీపీని నమ్ముకున్న వాళ్లంతా అప్పుల్లో ఉన్నారు తమ కుటుంబం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని, ఎవరినీ మోసం చేయలేదని తెలిపారు. తాను సత్తెనపల్లి సీటు అడిగినా, కన్నా లక్ష్మీనారాయణను నియమించారన్నారు. కన్నా నియామకంతో 83 ఏళ్ల తమ తండ్రి రాయపాటి సాంబశివరావు ఆవేదన చెందారన్నారు. 2014లో రాయపాటి సాంబశివరావు ఎంపీగా గెలిచాక కూడా టీడీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపారు. వినుకొండలో మంచినీటి పథకం తెస్తామని ఇచి్చన హామీని నిలబెట్టుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగితే చినబాబును అడగాలని చెప్పారన్నారు. ఇదేం పద్ధతని, లోకేశ్ ఏమైనా డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచారా అని నిలదీశారు. తామే కాదని, పార్టీని నమ్ముకున్న అనేకమంది అప్పుల్లో ఉన్నారని తెలిపారు. చనిపోయిన వారికి ఇన్సూ్యరెన్స్ ఇస్తానని డబ్బులు వసూలు చేసిన లోకేశ్ ఎంతమందికి ఇచ్చారని నిలదీశారు. చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్ర ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. రెండు, మూడు లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారని, ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
తమిళనాడులో మీ సంగీతం కెరీర్ విజయాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు
-
ఆ సంఘటన జరిగిన తర్వాత నా జీవితం చాలా మారింది
-
ఆ గొప్ప మనిషి ఎలాంటి వాడంటే: రంగారావు
-
నాన్నకు స్వాతిముత్యంలో అవకాశం రాలేదు
రంగావఝల రంగారావు... ఈ పేరు ఎవ్వరికీ తెలియదు... సాక్షి రంగారావు... అందరికీ పరిచితులే...సినిమాలలో విలన్ పాత్రలు... జీవితంలో సౌమ్యతత్త్వం.. సినిమాలలో కరణీకం... జీవితంలో అప్పులంటే భయం.. బాపు సాక్షితో వెండితెరకు పరిచితులై సాక్షి రంగారావుగా మారారు. తనకు తానే పేరు పెట్టుకున్న, వారి కుమారుడు సాక్షి శివతో ఈ వారం సినీ పరివారం... నాన్న ప్రకాశం జిల్లా కలవకూరు (అద్దంకి – సింగర కొండ మధ్య)లో పుట్టారు. మా తాతగారు లక్ష్మీనారాయణగారు కావిడి కట్టుకుని కాశీ దాకా నడిచి వెళ్లి వచ్చారు. తాతగారు... నాన్నగారి చిన్నవయసులోనే పోవడం వల్ల, మా మామ్మగారు రంగనాయకమ్మ గారి దగ్గర కాకుండా, మచిలీపట్నం దగ్గర పామర్రులో ఉంటున్న నాన్నగారి పెద్దమ్మ బుచ్చి రావమ్మగారి దగ్గర పెరగవలసి వచ్చింది. ఆవిడ వంటలు చేసి మా నాన్నను పెంచారు. అమ్మగారి పేరు బాలా త్రిపురసుందరి. మా తల్లిదండ్రులకు మేం ముగ్గురం పిల్లలం. అక్క కనక వరలక్ష్మిని అమ్ములు అని పిలిచేవారు. ఒకరోజు నాన్నకి ఒక స్వామిజీ కలలోకి వచ్చి, రామశివయ్య అని పేరు పెట్టమన్నారుట. అందుకని అన్నయ్యకు ఆ పేరు పెట్టి, నాకు ఆ పేరును తిరగేసి శివరామయ్య అని పెట్టారు. అన్నయ్య బిఎస్సి, అక్కయ్య ఏఎంఐఈ చదువుకుని మంచి స్థాయికి ఎదిగారు. నేను ప్లస్ టూ ఫెయిల్ కావటంతో, నా గురించి బెంగపెట్టుకున్నారు. మా వివాహ సమయానికి నాది చిన్న ఉద్యోగం. ప్రస్తుతం నేను సీరియల్స్‌లో నటిస్తున్నాను. ఉంగరం ఇచ్చారు.. నాన్నగారి చదువు పూర్తి అయ్యాక వైజాగ్‌లో పనిచేశారు. ఆ తరవాత డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశారు. ప్రముఖ రంగస్థల నటులు కుప్పిలి వెంకటేశ్వరరావు గారి దగ్గర శిష్యరికం చేశారు. ఆయన నాన్నకి బంగారు ఉంగరం బహూకరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొంతమంది సన్నిహితులు, ఆరు నెలలకు సరిపడా డబ్బులు పోగు చేసి నాన్నను మద్రాసు పంపారు. డబ్బులు అయిపోతున్న సమయంలో భగవంతుడు బాపురమణల రూపంలో ప్రత్యక్షమై, వారు తీస్తున్న మొదటి సినిమా ‘సాక్షి’లో నటించే అవకాశం ఇచ్చారు. అక్కడ మొదలైన అదృష్ట ఘడియలు, తుది శ్వాస వరకు ఆయనను వరిస్తూనే వచ్చాయి. అమ్మ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయించి మద్రాసు రప్పించారు. కారం అంటే ఇష్టం... నాన్నకి కారం అంటే ఇష్టం. అల్లం, పచ్చిమిర్చి, వాము వంటి ఘాటైన పదార్థాలు వంటకాలలో ఉండాలి. అమ్మ కష్టపడి కారం వంటకాలు నేర్చుకుంది. ఇంటి భోజనమే చేసేవారు. ఇంటి దగ్గర ఉంటే పంచె, లాల్చీ కట్టుకునేవారు. చెప్పులు లేకుండానే బయటకు వెళ్లిపోయేవారు. మేం కొద్దిగా పెద్దవాళ్లం అయినప్పటి నుంచి నాన్న మాతో చాలా స్నేహంగా ఉండేవారు. అవకాశం కుదిరినప్పుడు క్యారమ్ బోర్డు, గోళీలు, చెస్, వీడియో గేమ్స్ ఆడేవారు. సినిమాలు చూపించేవారు. ఆయన సినిమా అంటే... విశ్వనాథ్‌గారికి మా నాన్నగారంటే చాలా ఇష్టం. ఆయన తన ప్రతి సినిమాలోను నాన్నకి అవకాశం ఇచ్చారు. తెలుగు ‘స్వాతిముత్యం’ లో అవకాశం రాలేదు. హిందీ ‘ఈశ్వర్’లో వేషం ఇచ్చి కాంపెన్సేట్ చేశారు. బాపుగారు పద్మాలయ సంస్థ... అందరూ నాన్నకి అవకాశం ఇవ్వటం వల్లే, ఇన్ని వందల సినిమాలో నటించారు. డబ్బు సంపాదించుకోలేకపోయినా, గొప్ప పేరు వచ్చింది, నాన్న నటించిన ‘ఆడదే ఆధారం’ సినిమా చూసినప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయాను. నాన్నగారితో కలిసి నేను నటించిన రెండుమూడు సీరియల్స్‌లోనూ ఆయనకు కొడుకుగా నటించడం నా అదృష్టం. శంకరాభరణం సినిమా టైమ్‌లో ఐదేళ్లు కాషాయం కట్టుకుని, సన్యాసం పుచ్చుకుంటానన్నారు. మాకు గుండు కొట్టేశారు. రాళ్లపల్లి గారు, ఇరుగుపొరుగు వారి మాట మీద ఆ ప్రయత్నం విరమించుకున్నారు. తెల్ల పంచె లాల్చీ వేసుకోవటం ప్రారంభించారు. కన్యాశుల్కం అంటే కోపం.. ‘కన్నాశుల్కం’ ఏడు గంటల నాటకంలో నటించాలనుకున్నారు. మరో వారం రోజుల్లో ప్రదర్శన అనగా ... ఉన్నట్టుండి కుప్ప కూలిపోయారు. ఆ బాధలో నేను, ‘కన్యాశుల్కం నాన్నగారిని బలితీసుకుంది’ అని కోపం తెచ్చుకున్నాను. నాన్నగారి కోర్కె నెరవేర్చడానికి సంకల్పించుకుంటున్నాను. ఆ భయం వల్లే... నాకు ‘సాక్షి రంగారావు’ అని బాపు గారు పేరు పెట్టారు. నీకు నువ్వే పెట్టుకున్నావు. అందుకే ఆయనను క్షమించమని అడిగాను... అని నాన్న నన్ను స్నేహంగా మందలించారు. ‘ఏరా ఏం చదువుతున్నావు?’ అంటూ వెనకాల నుంచి తుండు గుడ్డతో కొట్టేవారు. ఆ దెబ్బలకు భయపడేవాడిని. నేను ఫీల్డ్‌లోకి రాగానే అప్పు చేసి కారు కొన్నానన్న కోపంతో, నా కారు ఎక్కలేదు. నాన్నగారు అప్పట్లో ఓ కోరిక కోరారు. ‘లక్షరూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించు’ అని. నాన్నకు అప్పు అంటే భయం. ఎవరు మోసం చేసినా పట్టించుకునేవారు కాదు. నాన్నగారు మొదటి సినిమా నుంచి ఆఖరి సినిమా వరకు ‘ఈ పాత్ర నేను చేయగలనా’ అనే భయంతోనే ఉండేవారు. కె. విశ్వనాథ్‌గారి సినిమాలో నటించవలసి వస్తే చాలు, ‘అమ్మో!’ అనుకునేవారు. ఆ భయం ఉంది కాబట్టే కళ్లు నెత్తికి ఎక్కకుండా మంచి పేరు తెచ్చుకున్నాను అంటుండేవారు. అవమానంగా భావించారు.. నాన్నకి అరవై వసంతాలు పూర్తి కాగానే షష్టి పూర్తి ఘనంగా చేశాం. మనసు బాగోలేకపోతే రామకృష్ణ మఠానికి వెళ్లేవారు. ఒకసారి ఒక పెద్దావిడ రామకృష్ణ మఠంలో నాన్న సిగరెట్ కాల్చిన తరవాత, అదే చేత్తో ప్రసాదం తేవటం చూశారట. ఆయన తన దగ్గరున్న ప్రసాదం ఆవిడకు పెడితే, ఆవిడ ‘సిగరెట్ వాసన వస్తోంది’ అన్నారట. నాన్న అవమానంగా భావించి, ఆ రోజు నుంచి సిగరెట్ మానేశారు. పరిశ్రమలో షైన్ అవ్వడం ఎంత కష్టమో, ఎన్ని ఒత్తిడులు ఉంటాయో, ఇప్పుడు నాకు తెలుస్తోంది. సినిమాలలో బిజీగా ఉండటం వలన నాన్న చాలా సరదాలు వదులుకున్నారని అనుభవం మీద అర్థం అయ్యింది. 63 సంవత్సరాలు నిండకుండానే 2005లో కన్నుమూశారు. నాన్న ఇంకా నాలోనే ఉన్నారనుకుంటాను. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఆ ఇద్దరి నామినేషన్లు తిరస్కరణ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ ఎంపీ బీజేపీనేత జితేందర్‌రెడ్డి నామినేషన్లు అనూహ్యంగా తిరస్కరించబడ్డాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ముగ్గురు నామినేషనన్లు వేయగా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. గతంలో ఒలంపిక్ అసోషియేషన్ ఆఫ్ తెలంగాణకు నాయకత్వం వహించిన కె. రంగారావు నామినేషన్‌ను స్వీకరించగా.. జయేష్ రంజన్ క్యాట్ నుంచి అనుమతి పొందకపోవడంతో ఆయన నామినేషన్‌ను రిజెక్టు చేశారు. దీనిపై జయేష్ రంజన్, జితేందర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ అధ్యక్ష ఎన్నికలు కాస్త రాజకీయనాయుడికి, ప్రభుత్వ అధికారికి మధ్య పోటీగా మారనున్నాయి. -
దర్శకులు ఎర్నేని రంగారావు ఇక లేరు
ప్రముఖ దర్శకులు ఎర్నేని రంగారావు గత ఆదివారం (ఈ నెల 18) తుది శ్వాస విడిచారు. కృష్ణా జిల్లా గురజకి చెందిన రంగారావు 20 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కెరీర్ ఆరంభంలో మద్రాస్‌లోని వాహినీ స్టూడియోస్‌లో జయరామ రెడ్డితో కలిసి పెయింటర్‌గా, మౌల్డర్‌గా చేశారు. ‘పాతాళ భైరవి’ సినిమాలోని విగ్రహం మౌల్డింగ్‌కి పని చేసినవాళ్లలో రంగారావు ఒకరు. రెండేళ్లు వాహినీ స్టూడియోస్‌లో చేసి, డైరెక్షన్ మీద ఆసక్తితో ప్రముఖ దర్శకులు హెచ్.ఎమ్. రెడ్డి, కేవీ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు రంగారావు. రెండేళ్ల తర్వాత జయరామ రెడ్డితో కలిసి బాపు ఫిలింస్ ఆరంభించి, 1960లో ‘టౌన్ బస్’ అనే సినిమాని తెలుగులోకి అనువదించి, విడుదల చేశారు. 1963లో ఎన్టీఆర్, షావుకారు జానకి, గుమ్మడి కలయికలో స్వీయదర్శకత్వంలో ‘సవతి కొడుకు’ అనే సినిమా రూపొందించారు. అలాగే నూతన తారలతో ‘మాయావి’, ‘అర్చన’ అనే చిత్రాలను స్వీయదర్శకత్వంలో తెరకెక్కించారు. వ్యక్తిగత విషయానికొస్తే 1954లో తన మేనకోడలు ఉప్పలపాటి రఘుమా దేవిని పెళ్లాడారు. ఈ దంపతులకు కుమారుడు పూర్ణచంద్ర రావు ఉన్నారు. యూఎస్‌లో డాక్టర్‌గా సెటిలైన తనయుడి దగ్గరకు 1990లో వెళ్లిపోయారు రంగారావు. అక్కడ దాదాపు 300 పెయింటింగ్స్ వేసి, న్యూయార్క్, న్యూజెర్సీలో ప్రదర్శనకు ఉంచారు. యూఎస్ పౌరసత్వం పొందిన రంగారావు 2002లో ఇండియా వచ్చేశారు. 2014లో రఘుమా దేవి కన్నుమూశారు. రంగారావు అంతిమ క్రియలు నేడు గురజలో జరుగుతాయి. -
ప్రముఖ దర్శకుడు మృతి
సాక్షి, కృష్ణా: ప్రముఖ సినీ దర్శకుడు యెర్నేని రంగారావు మృతిచెందారు. ఈయన ఆదివారం (ఆగస్టు 18)న స్వర్గస్తులైనారు. వాహిని స్టూడియోలో పెయింటర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన ప్రముఖ దర్శకుడు కెవి రెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ తరువాత ఆయన మాయావి, అర్చణ అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. యెర్నేని రంగారావు కృష్ణా జిల్లాకు గుడివాడ దగ్గర్లోని గురజకు చెందినవారు. ఈయన సతీమణి రఘుమాదేవి 2014లో మరణించారు. రంగారావు అంతిమయాత్ర 21-08-2019 న ఉదయం 9గంటలకు గురజలో జరుగుతుందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. -
దేశంలోనే బెస్ట్... ఏసీపీ రంగారావు
సాక్షి, హైదరాబాద్: నేరాలు నిరోధించడం... నిందితుల్ని పట్టుకోవడం... కోర్టులో దోషులుగా నిరూపించడం... ఈ మూడూ పోలీసుల ప్రాథమిక విధులుగా చెబుతుంటారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో మొదటి రెండూ ఆశించినస్థాయిలో ఉంటున్నాయి. అయితే, అనేక కేసులు కోర్టుల్లో వీగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి కేంద్రం నడుం బిగించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుసహా అన్ని దర్యాప్తు సంస్థల్లో ఉన్న అధికారుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దర్యాప్తు అధికారులకు ప్రత్యేక అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాదిలోనే ప్రారంభించింది. తొలి అవార్డును హైదరాబాద్ పోలీసు విభాగంలోని ఏసీపీ ఎస్.రంగారావు గెల్చుకున్నారు. ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఈయన బేగంపేట ఏసీపీగా ఉండగా 2016లో తొమ్మిదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసు దర్యాప్తునకు ఈ అవార్డు లభించిందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో రంగారావును అభినందించారు. మీడియాతో మాట్లాడిన రంగారావు కేసు వివరాలు వెల్లడించారు. కల్లు కాంపౌండ్ నుంచి కిడ్నాప్ చేసి... బొల్లారం కళాసినగర్కు చెందిన చిన్నారి(9) తల్లిదండ్రులతో కలసి ఉండేది. తల్లి ఆశావర్కర్ కాగా తండ్రి పెయింటర్. 2016 జూలై 2న సాయంత్రం తల్లిదండ్రులు తమతోపాటు చిన్నారిని బొల్లారంలోని కల్లు కాంపౌండ్‌కు తీసుకువెళ్లారు. అక్కడ ఆ చిన్నారితో పాత నేరగాడైన అనిల్ ఆడుకుంటున్నట్లు కాసేపు నటించాడు. తర్వాత తల్లిదండ్రులిద్దరూ కల్లుమత్తు లో జోగుతున్నట్లు గుర్తించాడు. బొమ్మలు, తినుబండారాలు కొనిస్తానంటూ మాయమాటలు చెప్పి చిన్నారిని అపహరించాడు. బొల్లారం బజార్ రైల్వేస్టేషన్ మీదుగా అల్వాల్‌లోని కాలవేరి బ్యారెక్గా పిలి చే మిలటరీ ఏరియాలోకి తీసుకువెళ్లి లైంగిక దాడి చేసి గొంతు నులిమి చంపేశాడు. సమాచారం అందుకున్న అప్పటి బేగంపేట ఏసీపీ రంగారావు రంగంలోకి దిగారు. బొల్లారం ఠాణాలో కేసు నమోదు చేయించి నిందితుడి కోసం ఆరా తీశా రు. బొల్లారానికి చెందిన అనిల్‌పై అల్వాల్ పోలీసుస్టేషన్లో 15 చోరీలు, రెండు హత్యకేసులు ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఓ లైంగికదాడి కేసులో జైలుకు వెళ్లిన ఇతడు 2016 జూలై 1న (చిన్నారిపై అఘాయిత్యానికి ఒకరోజు ముందు) బయటకు వచ్చాడు. కామాంధుడికి కఠిన శిక్ష పడాలనే.. ‘చిన్నారిని పాశవికంగా చిది మేసిన, ఇలాంటి నేరచరిత్ర ఉన్న ఆ కామాంధుడికి కఠినశిక్ష పడాలని భావించా. దర్యాప్తులో ఎక్కడా చిన్నలోపం కూడా లేకుండా ఉండాలని అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ వచ్చా. నేరస్థలానికి వెళ్లి అక్కడ ఉన్న నిందితుడి చెప్పులు, కొన్ని వస్త్రాలు సీజ్ చేశాం. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీకి పంపడంతోపాటు నిందితుడి నుంచి నమూనాలు సేకరించాం. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి డీఎన్ఏ శాంపిల్స్ ద్వారా నేరం చేసింది అతడే అని నిర్ధారణ పొందాం. ఈ వివరాలతోపాటు చట్టంలో ఉన్న అవకాశం సద్వినియోగం చేసుకుంటూ అతగాడి నేర చరిత్రను సవివరంగా కోర్టు దృష్టిలో ఉంచాం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కోర్టు అనిల్‌ను దోషిగా నిర్ధారిస్తూ అరుదైన తీర్పు ఇచ్చింది. అనిల్‌కు జీవితఖైదు విధిస్తూ చనిపోయే వరకు జైల్లోనే ఉంచాలని స్పష్టం చేసింది. 2017 జూలై 26న వెలువడిన ఈ తీర్పు నేపథ్యంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కొత్వాల్ అనుమతి, ప్రోత్సాహంతో కేంద్రానికి పంపాం. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకోవడం బాధ్యతను మరింత పెంచింది’ – ఎస్.రంగారావు, ఏసీపీ -
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడి మృతి
టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కో డైరెక్టర్‌గా, పలు చిత్రాలకు దర్శకుడిగా పనిచేసిన సీనియర్ టెక్నీషియన్ కె.రంగారావు అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1957 మే 5న జన్మించిన రంగారావు ఎన్నో దశాబ్దాలుగా టాలీవుడ్లో దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. ఇంద్రధనుస్సు సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన నమస్తే అన్న, బొబ్బిలి బుల్లోడు, ఉద్యమం, అలెగ్జాండర్ లాంటి సినిమాలతో దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన చివరగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. దర్శకుల సంఘంలోనూ కీలక బాధ్యతలు నిర్వహించిన రంగారావు మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం తెలియజేశారు. సోమవారం సాయంత్రం సూర్యపేట జిల్లా మేడారం గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కె. రంగారావు (ఫైల్ ఫోటో) -
ఖాజీపేట ఎస్ఐ రంగారావు సస్పెన్షన్
కడప అర్బన్ /ఖాజీపేట: ఖాజీపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఎం.రంగారావును గురువారం కడప–కర్నూలు రేంజి డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ కేసు విచారణలో తప్పుడు దర్యాప్తు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఖాజీపేట మండలం రంగాపురానికి చెందిన బండి హనుమంతుకు, వారి అన్నదమ్ములకు మధ్య ఉన్న భూమి, స్థలాల తగాదాలో తలదూర్చి అక్రమ కేసులను ఎస్ఐ రంగారావు బనాయించారు. ఆ మేరకు బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తమ దగ్గరున్న సాక్ష్యాధారాలను చూపారు. దీంతో డీఐజీ స్వయంగా తమ సిబ్బందితో విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే గుట్కా, ఇతరత్రా అంశాలలో అవినీతికి పాల్పడినట్లు ప్రచారం ఉంది. -
ప్రాచీన కట్టడాలను పరిశీలించిన సినీ సమీక్షకులు రంగారావు
ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలలో ఉన్న ప్రాచీన కట్టడాల చరి త్రను పరిశీలించి వివరాలు సేకరించడంలో భాగంగా భారతీయ సినీ, లలిత, సంగీత సుప్రసిద్ధ సమీక్షకులు చైన్నైవాసి వీఏకే రంగారావు సోమవారం ఆర్మూర్ పట్టణాన్ని సందర్శించారు. సిద్దుల గుట్ట చరిత్రను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని మహాలక్ష్మి కాలనీ లో ఉన్న నవలా రచయిత డాక్టర్ నందిని రామరాజు దంపతుల ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రముఖ కట్టడాలను సందర్శించి వాటి చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా కోట, బాల్కొండ కోట, దోమకొండ కోటలతో పాటు చారిత్రక కట్టడాల గురించిన సమాచారాన్ని సేకరించామన్నారు. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ కోట, కుంటాల, పొచ్చెర జలపాతాలను సందర్శించామన్నారు. అనంతరం నందిని రామరాజు దంపతులు, జిల్లా క్లాసిక్ సినిమా, కల్చరల్ సొసైటీ ప్రతినిధులు మేక రామస్వామి, వీపీ చందన్ రావు, చిటిమల విద్యాసాగర్ ఆయనను ఘనంగా సన్మానించారు. -
ప్రజల పక్షాన పోరాటం
విజయనగరం మున్సిపాలిటీ : ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావు అన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ విధానాలపై అవలంభించాల్సిన వైఖరిపై పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అధ్యక్షతన కోలగట్ల నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్ల ఏరివేత కోసం ప్రభుత్వం బోగస్ సర్వే చేయించిందన్నారు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. అర్హులైన వారిని కావాలనే తొలగించారని చెప్పారు. దీనిపై ప్రజల పక్షాన పోరుబాట పడతామని హెచ్చరించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు కలిసి పని చేయూలన్నారు. జిల్లా లో పార్టీ పరిస్థితులను తెలుసుకునేందుకు స్వయంగా పర్యటిస్తామన్నారు. పార్టీకోసం పనిచేసేవారికి గ్రామ, మండల, జిల్లా స్థారుు కమిటీల్లో స్థానం కల్పిస్తామని చెప్పారు. విశాఖ జిల్లాలో అర్బన్, రూరల్ ప్రాంతాల్లో కమిటీలు ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా శ్రీకాకుళంలో జిల్లాలో త్వరలో ప్రారంభిస్తామన్నారు. హామీల అమలుకు పోరాటం చేస్తామన్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కాలయూపనకే ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. ఈ నెల 2నుంచి చేపట్టిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పెంచిన పింఛన్లు ఇస్తామని ప్రకటించినా ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. బోగస్ పింఛన్ల ఏరివేత పేరుతో నిర్వహించి న సర్వే వల్ల అర్హులకు అన్యా యం జరిగిందన్నారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పా రు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ జిల్లాలో కింది స్థాయి నుంచి జిల్లా స్థారుు వరకు పార్టీ బలోపేతానికి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ నెల 9 నుంచి మండలాల్లో పర్యటించనున్నట్టు తెలిపారు. 9న ఉదయం పది గంటలకు చీపురుపుల్లి మండలంలో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు మెరకముడిదాం మండలంలో పర్యటించనున్నట్టు పేర్కొన్నారు. 10న ఉదయం బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలంలో, సాయంత్రం 4 గంటలకు రామభద్రాపురం మండలంలో, 11న ఉదయం 10 గంటలకు ఎస్.కోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో, సాయంత్రం 4 గంటలకు ఎల్.కోట మండలంలో, 12న ఉదయం నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలంలో, సాయంత్రం 4 గంటలకు డెంకాడ మండలంలో పర్యటించటం జరుగుతుందన్నా రు. 13న ఉదయం 10 గంటలకు గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలో, సాయంత్రం 4 గంటలకు గజపతినగరం మండలంలో, 14న ఉదయం విజయనగరం పట్టణంలో, సాయంత్రం మండల పరిధిలో, 18న ఉదయం 10 గంటల కు కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలంలో, సాయంత్రం 4 గంటలకు గరుగుబిల్లి మండలంలో, 19న ఉదయం 10 గంటలకు గుమ్మలక్ష్మీపురం మండలంలో, సాయంత్రం 4 గంటలకు కురుపాం మండలంలో పర్యటనలు ఉంటాయన్నా రు. 20న ఉదయం 10 గంటలకు పార్వతీపురం పట్టణంలో, సాయంత్రం 4 గంటలకు పార్వతీపు రం మండలంలో, 21న ఉదయం సీతానగరం మం డలంలో, సాయంత్రం బలిజిపేట మండలంలో మండల పర్యటనలు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ పర్యటనలో ఆయా నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు, పార్టీ తరఫున పోటీ చేసిన నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొంటారని తెలిపారు. వారి సమక్షంలోనే మండ ల కమిటీల ఏర్పాటు జరుగుతుందన్నారు. మరో నాలుగు రోజుల్లో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర పార్టీ ఆమోదం కోసం పంపించనున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 16న ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అన్ని మండలాల తహశీల్లార్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని చెప్పారు. తద్వారా జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా అభివృద్ధి చేసి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి వెన్నుదన్నుగా నిలుస్తామన్నారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మాట్లాడుతూ టీడీపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తేలికగా విడిచిపెట్టమన్నారు. ప్రధానంగా పింఛన్ల సర్వేలో అర్హులకు అన్యాయం చేస్తే న్యాయ పోరాటం చేస్తామన్నారు. సర్వే కమిటీల్లో టీడీపీ పార్టీ నాయకులను వేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడటాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. సమావేశంలో కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే పాముల పుష్ఫశ్రీవా ణి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బేబీనాయ న, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గ ఇన్చార్జిలు కడుబండి శ్రీనివాసరావు, నెక్కల నాయుడుబాబు, జమ్మాన ప్రసన్నకుమార్, పెనుమత్స సురేష్‌బాబు, కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, మార్క్‌ఫెడ్ డెరైక్టర్ కేవీఎన్ సూర్యనారాయణరాజు, అంబళ్ల శ్రీరాములనాయుడు, చనుమళ్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ఐసీ సేవలు మరింత విస్తృతం
మచిలీపట్నం : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేవలు మరింత విస్తృతం చేయనున్నట్లు మచిలీపట్నం డివిజన్ కార్యాలయ సీనియర్ డివిజనల్ మేనేజరు జె.రంగారావు తెలిపారు. ఎల్ఐసీ వార్షికోత్సవాలు సోమవారం ఎల్ఐసీ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజు ప్రారంభించారు. అనంతరం పేర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డివిజనల్ మేనేజర్ మాట్లాడుతూ ఎల్ఐసీ వారోత్సవాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ‘జీవన్ షగున్’ అనే నూతన పాలసీ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పాలసీలో ఎనిమిది సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వారు చేరేందుకు అవకాశం ఉంటుందన్నారు. పాలసీ వ్యవధి 12 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఈ పాలసీలో సింగిల్ ప్రీమియంలో నగదు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కనీసం బీమా మొత్తం రూ. 60వేలుగానూ, గరిష్ట బీమాకు పరిమితి లేదన్నారు. 12 సంవత్సరాల వరకు ఈ పాలసీ ఉంటుందని, పాలసీదారుడు చెల్లించిన ప్రీమియంకు 10 రెట్లు అదనంగా చెల్లించనున్నట్లు చెప్పారు. మచిలీపట్నం డివిజన్ 2013-14 సంవత్సరంలో సౌత్ సెంట్రల్ జోన్లోనే 2వ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. డివిజన్ కార్యాలయం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ. 25 లక్షలను కేటాయించినట్లు చెప్పారు. జీవిత బీమా సంస్థ మెచ్యూరిటీ క్లయిమ్, డెత్ క్లయిమ్‌లు చెల్లించడంలో ముందంజలో ఉందని వివరించారు. 6వ తేదీ వరకు ఎల్ఐసీ బీమా వారోత్సవాలు జరుగుతాయని, ముగింపు కార్యక్రమం మచిలీ పట్నంలోని టౌన్‌హాలులో జరుగుతుందని చెప్పారు. మార్కెటింగ్ మేనేజర్లు తపన్కుమార్పట్నాయక్, సేల్స్ మేనేజర్లు ఎంవి.రమణ, ఆదినారాయణ, పీఅండ్ఐఆర్ మేనేజరు కె.నాగేశం తదితరులు పాల్గొన్నారు. -
హిందీ సినిమా సంగీతం గురించి బాపుగారి పరిజ్ఞానం అపారం
వి.ఎ.కె. రంగారావు (సుప్రసిద్ధ సినీ, సంగీత, కళా విమర్శకుడు - గ్రామ్‌ఫోన్ రికార్డుల సేకర్త) బాపు - రమణలతో నా అనుబంధం ఈ నాటిది కాదు. కొన్ని దశాబ్దాల క్రితం నాటి పరిచయం, ఆపైన స్నేహం, అత్యంత సాన్నిహిత్యం మాది. ‘బాపు గొప్ప దర్శకుడు, ఆయన చేతి కుంచెది గొప్ప రేఖ’ లాంటివి నేను చెప్పనక్కర లేదు. అది సూర్యుడికి దివిటీ పట్టడం లాంటిది. ఆభరణాలకూ బాపు డిజైన్లు! నా వ్యక్తిగత అనుభవాల విషయానికి వస్తే, నాకు గురుతుల్యులైన రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రి గారితో నాకు పరిచయం కలిగించింది బాపు - రమణలే! ఆ రోజుల్లో ‘ఆంధ్రపత్రిక’ సచిత్రవారపత్రికలో పాటలపై నేను రాసిన ‘సరాగమాల’కు మల్లాది వారితో పేరు పెట్టించింది - రమణ అయితే, దానికి బొమ్మ వేసింది బాపు. ఆయన గీసే బొమ్మ, వేసే డిజైన్ ప్రత్యేకం. అవి నాకు ఎంత ఇష్టమంటే, ఆయన ఎంత సింపుల్ అంటే, నాకు లెటర్‌హెడ్స్, విజిటింగ్ కార్డులు కూడా ఆయనే డిజైన్ చేసి ఇచ్చారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే - ఉంగరాలు, నా కూతురు వరసైన ఒక అమ్మాయి పెళ్ళికి చేతి కంకణం, మెడలో వేసుకొనే పతకం వగైరా కూడా ఆయనే డిజైన్ చేశారు. సినిమాల సంగతికొస్తే - తొలితరం తెలుగు చిత్రాలైన ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ల్లో కనిపించిన మన తెలుగుదనం, మన తెలుగు వాతావరణం క్రమేణా అంతరించిపోయాయి. మళ్ళీ ఆ పరిమళాన్నీ, వాతావరణాన్నీ తన సినిమాల్లోని తెలుగుదనం ద్వారా తెరపైకి తెచ్చారు బాపు - రమణ. ‘సాక్షి’ సినిమాతో ప్రారంభించి, తరువాత ఎన్నో చిత్రాల్లో దాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇక, వాళ్ళిద్దరి ద్వారా నాకు కలిగిన సన్నిహిత పరిచయాలూ అనేకం. అక్కినేని నాగేశ్వరరావుతో, గాయకుడు పి.బి. శ్రీనివాస్‌తో, బెంగుళూరుకు చెందిన సుప్రసిద్ధ డిస్ట్రిబ్యూటర్ ఎం. భక్తవత్సలతో సాన్నిహిత్యం వారిద్దరి చలవే. ఇవన్నీ బాపు -రమణలు నాకు మిగిల్చిపోయిన బరువు - బంగారాలు. అపార సంగీత జ్ఞానం: హిందీ సినిమా సంగీతం బాపుకు తెలిసినంత తెలిసినవారు మరెవ్వరూ నాకు తెలియదు. ఆయనకు సంగీతమంటే ఎంత పిచ్చి ప్రేమంటే, స్వయంగా మా ఇంటికి వచ్చిన నా దగ్గరున్న అపురూపమైన రికార్డుల్లో నుంచి కొన్ని వందల హిందీ పాటలను తన స్పూల్ టేప్రికార్డర్పై రికార్డు చేసుకున్నారు. అవి వినీ వినీ, చివరకు వాటి గురించి నాకు కూడా తెలియని ఎన్నో విషయాలు చెప్పేవారు. ఒక్క సినిమా పాటలే కాదు... గజల్స్ గురించి, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం గురించి ఆయన పరిజ్ఞానం అపారం. వాటి గురించి అంత తెలిసినవారు మరొకరు నాకు తారసపడలేదు. ఆయనకు మెహదీ హసన్ గజల్స్ అన్నా, బడే గులామ్ అలీఖాన్ హిందుస్థానీ గానమన్నా ఎంతో ఇష్టం. ఇంకా ఎంతోమంది ఆయన అభిమాన గాయనీ గాయకులు. బాపు - రమణల పాటల్లో కూడా మన తెలుగుదనం, మన సంస్కృతి సంప్రదాయం వినిపిస్తాయి, కనిపిస్తాయి. ఆయన సినిమా సంగీతం తయారవుతున్నప్పుడు ఒక్కసారీ నేను పక్కన లేను. కానీ, మంచి మాట ఎవరు చెప్పినా వినేవారు. పేరు గుర్తు లేదు కానీ ఒక సినిమా విషయంలో నన్ను బాపు -రమణలు సంప్రతించారు. మువ్వనల్లూరు సభాపతయ్య రాసిన పదం ‘మంచి దినము నేడే...’ అన్నది ఆ సినిమాలో పెట్టాలనుకున్నారు. ఆ మాటే నాకు చెప్పారు. కానీ, అది మరీ నింపాదిగా ఉంటుందనీ, దాని బదులు ‘కృష్ణం కలయ సఖీ సుందరం...’ అనే తరంగం పెడితే బాగుంటుందనీ చెప్పాను. అదే సినిమాలో వాడారు. అభిప్రాయాన్ని గౌరవించే స్నేహశీలత: వ్యక్తిగతంగా బాపు ఎంతోమందికి ఎన్నో సాయాలు చేశారు. ఆ జాబితా పెద్దది. ఎప్పుడు బాపు-రమణల దగ్గరకు వెళ్ళినా, వాళ్ళ సినిమాల గురించో, రచనల గురించో మాట వస్తే, నా అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పేవాణ్ణి. దాన్ని వాళ్ళు సహృదయంతో తీసుకొనేవారు. నేను బాగుందని చెప్పినా, బాగా లేదని చెప్పినా బాపు చిరునవ్వు నవ్వేసేవారు. వారిద్దరి పక్షాన రమణే స్పందించేవారు. ఒకసారి బాపు -రమణలతో నాకు పెద్ద గొడవే అయ్యింది. ‘బుల్లెట్’ సినిమాలో అనుకుంటా... శంకరంబాడి సుందరాచారి ‘మా తెలుగుతల్లికి...’ రచన వాడారు. అందులో ‘అమరావతీ గుహల’ అనే వాక్యాన్ని ‘అమరావతీ నగర’ అని మార్చి, పాడించారు. గతించిన కవి రాసిన మాటలో, పాటలో మనం మార్పులు చేయకూడదని నా వాదన. బాపు నవ్వేసి, ఆ మాట రమణతో చెప్పమన్నారు. అప్పట్లో వారితో కలసి పనిచేసిన మరో రచయిత శ్రీరమణ చేసిన మార్పు అది. ఆ మార్పును సమర్థిస్తూ, ఆయన తన వాదన వినిపించారు. నేను సంతృప్తి చెందకపోయినా, ఇంత వాదన జరిగినా, మా స్నేహానికీ, సాన్నిహిత్యానికీ అది అడ్డు కాలేదు. అది వారి సంస్కారం. బొమ్మలే బంగారం బాపు బొమ్మల విషయానికి వస్తే, ‘ఆంధ్రపత్రిక’లో నేను ‘సరాగమాల’ రాస్తున్న రోజుల్లో కథలకు బాపు వేసే బొమ్మలు మిగిలిన పత్రికల్లో వచ్చే బొమ్మలకు చాలా భిన్నంగా, చాలా సంక్లిష్టంగా ఉండేవి. క్రమంగా ఆయన బొమ్మలన్నీ సులభతరం అయ్యాయి. ఒకప్పుడు 44 గీతలతో బొమ్మ వేసిన ఆయన చివరకు 4 గీతలతో బొమ్మ వేసే దశకు పరిణమించారు. ఆయన వేసే బొమ్మల పర్స్పెక్టివ్ కూడా డిఫరెంట్‌గా ఉండేది. అది ఆ తరువాత ఆయన సినిమాలు తీసినప్పుడు అందులోనూ ప్రతిఫలించింది. ఊరకే నటీనటుల ముఖం చూపించకుండా, పక్కనే ఉండే ఆకు, తీగలతో సహా క్లోజప్‌లో చూపే ఫ్రేమింగ్ అందుకు ఉదాహరణ. పుస్తకాలకు ఆయన వేసే బొమ్మలు ఎంత గొప్పగా ఉండేవంటే, విజయవాడలో ‘నవోదయ పబ్లిషర్స్’ రామ్మోహనరావు ప్రచురణలు ప్రారంభించాక, ఆ పుస్తకాల ముఖచిత్రాలన్నీ ఆయనవే. పుస్తకం బొమ్మ చూసి అద్భుతం అని కొనుక్కొని, తీరా పుస్తకం అంత గొప్పగా లేని అనుభవాలూ నాకు చాలానే ఉన్నాయి. ‘బొమ్మ బాగుంది కానీ, పుస్తకం అంత లేదండీ’ అంటే బాపు నవ్వేసేవారు. ఆయన బొమ్మల గొప్పదనం అది. పూవులతో పాటు నార తలకెక్కుతుంది. బాపు - రమణల వల్ల నాకూ అలాంటి అదృష్టం పట్టింది. నేను ప్రచురించిన ‘జనార్దనాష్టకం’ పుస్తకానికి బాపు వేసిన బొమ్మలు శృంగార పరాకాష్ఠతతో నన్ను ధన్యుణ్ణి చేశాయి. ఆ తరువాత నేను పరిచయం చేసిన శ్రీలక్ష్మణ యతీంద్రుల కోరికపై వారి ‘రసధుని’ (‘తిరుప్పావై’కి తెనిగింపు) పుస్తకానికి బాపు వేసిన బొమ్మలు మరో అద్భుతం. అవి ఆండాళ్ అంతరంగం నుండి దొంగిలించినవే - నిస్సందేహంగా! ఇటు బాపు గారు, అటు లక్ష్మణ యతీంద్రులు - వారిద్దరూ ఆ తిరుమల వెళ్ళే దారిలో నన్నొక మెట్టును చేశారు. నా జీవితాన్ని ధన్యం కావించారు. రికార్డుల పైనా...: ఆ రోజుల్లో ఎల్పీ రికార్డులకు ఆ సంస్థల ఆర్టిస్టులు వేస్తే అంత బాగుండేవి కావు. అదే బాపు వేస్తే, ఆ రికార్డులకొక స్థాయి, హోదా వచ్చేవి. అప్పట్లో కొలంబియా వారికీ, గ్రామ్‌ఫోన్ కంపెనీ వారికి నేను సంకలనం చేసిన అనేక ఎల్పీ రికార్డుల కవర్ మీద బాపు బొమ్మ, కవర్ వెనుక ‘స్లీవ్ నోట్స్’ నాది ఉండేవి. అన్నమయ్య కీర్తనలపై వచ్చిన తొలి ఎల్పీ రికార్డుకు బాలమురళీకృష్ణ పాట, బాపు వేసిన తిరుమల ‘బంగారు వాకిలి’ బొమ్మ, నా నోట్స్ - ఇప్పటికీ ఒక తీపి జ్ఞాపకం. అలాగే, తెలుగులో వచ్చిన మొట్టమొదటి ఎల్పీ ‘శ్రీకృష్ణ శ్శరణం మమ’కు ఆయన వేసిన గోపికా వస్త్రాపహరణం బొమ్మ, ఎస్పీబీ పాడిన వెంకటేశ్వర గద్యకు వేసిన చిత్రం, ‘రామదాసు కీర్తనలు’ ఎల్పీ, సినిమా పాటలతో చేసిన ‘శ్రీరామ నామం - శ్రీకృష్ణ గానం’ - ఇవన్నీ ఇప్పటికీ చిత్రకళా ప్రియులకూ, సంగీతాభిమానులకూ పండగ. ఎల్వీ ప్రసాద్ హిందీలో తీసిన తొలిచిత్రం ‘శారద’ (సి. రామచంద్ర సంగీతం) ఎల్పీకి మళ్ళీ బాపు బొమ్మే. బాపు గారు చనిపోయాక, చిత్రకళ ఉండదా అంటే ఎందుకుండదు! హాస్యప్రియత్వం: ఆయన చిత్రాల్లో ‘సంపూర్ణ రామాయణం’, ‘సీతాకల్యాణం’ లాంటి గొప్ప చిత్రాలు చాలానే ఉన్నాయి. అవీ అందరూ చెప్పేవే. కానీ, నాకు చాలా నచ్చిన సినిమా - ‘గోరంత దీపం’. అలాగే, ‘వంశవృక్షం’ చాలా గొప్ప సినిమా. అంత గొప్ప సినిమాయే - ‘భక్త కన్నప్ప’. బాపు - రమణల హాస్యం ఎంత గొప్పదంటే,వాళ్లు నా మీద, నా గ్రామ్‌ఫోన్ రికార్డుల పిచ్చిమీద సరదాగా ఎన్నో కార్టూన్లు వేశారు. అలాగే వాళ్ళ సినిమా ప్రివ్యూ చూసి నేను బయటకు వస్తుంటే, రమణ గారు ‘ఈ సినిమా మీకు నచ్చలేదుగా’ అని అడిగేవారు. ‘నచ్చలేద’ని అంటే, ‘హమ్మయ్య.. ఇక ఫరవాలేదు. సినిమా బాగా ఆడుతుంది’ అనేవారు. నా అభిరుచి, మాస్ ప్రేక్షకుల అభిరుచికి భిన్నంగా ఉంటుందని అంత సున్నితంగా హాస్యభరితంగా చెప్పడం వాళ్ళకే చెల్లింది. నాకు మిగిల్చిపోయిన ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలకు ఆ జంటకు కృతజ్ఞుణ్ణి. రవివర్మ చనిపోతే చిత్రకళ లేకుండా పోయిందా? లేదు కదా! బాపు గారి చిత్రకళాప్రభావం కూడా ఇంకో వందేళ్ళు తరువాతి చిత్రకారులపై ఉంటుంది. అది పైకి తెలిసేటట్లు కనిపించకపోయినా, తరువాతి తరాల వారి బొమ్మల్లో అంతర్లీనంగా ప్రతిఫలిస్తుంది. సంభాషణ: రెంటాల జయదేవ -
ఓయూ మార్గదర్శకాలే ప్రామాణికం
కేయూలో పీహెచ్డీ ప్రవేశాలపై నివేదిక ఇచ్చిన కమిటీ ఆమోదించిన ఇన్చార్జ్ వీసీ వికాస్‌రాజ్ వారం రోజుల్లో ఇంటర్వ్యూల తేదీల ఖరారు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఆర్ట్స్, సోషల్ సైన్స్, సైన్స్, లా, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాల ప్రక్రియ ఓ కొలిక్కి వస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ మార్గదర్శకాలకనుగుణంగానే ఇక్కడ కూడా పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని యూనివర్సిటీ నియమించిన కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు కమిటీ నివేదికను కేయూ ఇన్చార్జ్ వీసీ వికాస్‌రాజ్ ఆమోదించారు. దీంతో ఎంతో కాలంగా పీహెచ్‌డీలో ప్రవేశాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులకు ఉపశమనం కలిగినట్లయింది. పీహెచ్డీ ప్రవేశపరీక్ష జరిగాక ఫలితాలు వెల్లడించడంలోనూ జాప్యం చేసిన అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించడంలో కూడా అదే వైఖరి అవలంబించారు. పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించే విషయంలో ప్రస్తుత మార్గదర్శకాలను అవలంబిస్తే ప్రవేశపరీక్షలో ప్రతిభ చూపిన వారికి సీట్లు దక్కే అవకాశం లేదు. దీంతో ఓయూ మార్గదర్శకాలను అవలంబించాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పందించిన కేయూ అధికారులు బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్.సదానందం చైర్మన్‌గా, ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు కన్వీనర్‌గా ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ సభ్యులు పలు దఫాలుగా సమావేశమై వివిధ యూనివర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశాలకు పాటిస్తున్న నిబంధనలను పరిశీలించడమే కాకుండా ఓయూ మార్గదర్శకాలను ఇక్కడ అనుసరించాలని పేర్కొంటూ నివేదిక సమర్పించారు. ఈ నివేదికను కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంఏ.సింగరాచార్య.. ఇన్చార్జ్ వికాస్‌రాజ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అప్రూవల్ చేశారు. దీంతో త్వరలోనే కమిటీ బాధ్యులు సమావేశమై పీహెచ్డీ ప్రవేశాలకు తేదీలను నిర్ణయించే అవకాశముంది. రెండు కేటగిరీలుగా ప్రవేశాలు కేయూ పీహెచ్డీ సీట్ల భర్తీని రెండు కేటగిరీలుగా విభజించనున్నారు. కేటగిరీ-1లో సీఎస్ఐఆర్, జేఆర్ఎఫ్, ఐసీఎస్ఎస్ఆర్, ఐసీహెచ్ఆర్, ఆర్‌జీఎన్‌ఎఫ్ ఫెల్లోషిప్ అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. రెండో కేటగిరీలో పీహెచ్డీ ప్రవేశపరీక్ష రాసిన, నెట్, ఎంఫిల్, స్లెట్ అభ్యర్థులందరికీ విభాగాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అభ్యర్థుల్లో నెట్ ఉన్న వారికి 20 మార్కులు, ఎంఫిల్‌కు 15 మార్కులు, స్లెట్‌కు 12 మార్కులు, ఎంట్రెన్స్‌కు 12 మార్కులు, పీజీలో డిస్టింక్షన్ కలిగి ఉంటే 10మార్కులు, ఇంటర్వ్యూకు 10మార్కులు, రీసెర్చ్ ప్రపోజల్స్‌కు ఐదు మార్కులు కేటాయించారు. ఆయా అభ్యర్థులకు నెట్ ఉంటే 20, స్లెట్ ఉండి ఎంఫిల్ ఉంటే ఎంఫిల్‌కు 15మార్కులే కేటాయిస్తారు. ఇలా ఆయా కేటగిరీలో కేటాయించిన మార్కులన్నింటిలో 50 మార్కులనే ప్రామాణికంగా తీసుకోవడంతో పాటు ఇంటర్వ్యూ ల ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. మొత్తం 50 మార్కుల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారిలో రోస్టర్ రిజర్వేషన్ల ప్రాతిపదికన పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తారు. అయితే, పీహెచ్డీ నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నాటి సీట్లు భర్తీ చేయాలా, ప్రస్తుతం ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకోవాలా అనేది అధికారులు త్వరలోనే నిర్ణయిస్తారు. అనంతరం పీహెచ్డీ ఇంటర్వ్యూల తేదీలు ఖరారు చేస్తారు. ఫార్మసీ విభాగంలో పూర్తి కొన్నినెలల క్రితం పీహెచ్డీ ప్రవేశపరీక్ష ఫలితాలను కేయూ అధికారులు వెల్లడించగా.. అప్పటి ఫార్మసీ డీన్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 43మంది అభ్యర్థులకు ఇటీవల పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిం చారు. ఇందులో జీ ప్యాట్ అర్హత కలిగిన వారికే చోటు దక్కగా, ఎంట్రెన్స్ రాసిన వారు కొందరే ఉన్నారు. తొలుత 29 పీహెచ్డీ సీట్లు ఉండగా, ఇంటర్వ్యూలు నిర్వహించాక రెండు నెలలకు అడ్మిషన్ల సమయంలో 43 మం దికి ప్రవేశాలు కల్పించారు. ఇందులో ఇద్దరు ప్రొఫెసర్లకు ఎనిమిది మంది కంటే ఎక్కువగా అభ్యర్థులను కేటాయించారని సమాచారం. -
చరిత్ర సృష్టిద్దాం...!
బొబ్బిలి, న్యూస్‌లైన్:మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అధిక స్థానాల్లో గెలిపించి చరిత్ర సృష్టిద్దామని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయూలని సూచించారు. బుధవారం ఆయన స్థానిక దర్బార్ మహాల్లో పట్టణంలోని పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రాజులపై వ్యతిరేక ప్ర చారం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ నేతల వ్యాఖ్యాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ కూలీలను పెట్టి మరీ పట్టణంలో రాజులకు బలం తగ్గిపోయిందని.. గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేసిందన్నారు. ప్రస్తుతం మూడు నెలలుగా మళ్లీ అదే పని చేస్తోందన్నారు. ఈ ఎన్నికల ద్వారా వారందరికీ గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పారు. పార్టీ మారామన్న అక్కసుతో కాంగ్రెస్ నాయకులు పట్టణాభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. మన మెజార్టీతో ఎంపీ అయిన వ్యక్తి మనకు ఎంపీ నిధులతో కేవలం ట్యూబ్‌లైట్లు కోసమే నిధులు ఖర్చు పెట్టారని తెలిపారు. శంకుస్థాపనలకే బొబ్బిలి వస్తున్న ఎంపీ తరువాత వాటి అమలు గురించి పట్టించుకోవడం లేదన్నారు. రోడ్ల విస్తరణలో ప్రాధాన్యం ఉన్న రోడ్డును వదిలేసి, రాజకీయంగా వారికి ప్రాధాన్యత, నాలుగు కాసులు వచ్చే రోడ్డు విస్తరణకు నిధులు తెచ్చుకున్నారని మండిపడ్డారు. వీటన్నింటిపై ప్రజలకు వివరించాలని సూచించారు. అలాగే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయూలను కూ డా ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. పార్టీ విజయనగరం పార్లమెంట్ సమన్వయకర్త బేబీనాయన మాట్లాడుతూ నాయకులు సమన్వయం తో పనిచేసి మంచి ఫలితాలు తీసుకురావాలన్నారు. టిక్కెట్ రాని వారు నిరాశ పడవద్దని, అందరికీ సమానమైన గౌరవాన్ని ఇస్తామన్నారు. టిక్కెట్లు ఆశించే వారు దరఖాస్తులు అందివ్వాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు తూముల రాంసుధీర్, సీనియర్ కౌన్సిలరు రావు నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
జగన్ సీఎం కావడమే లక్ష్యం
బొబ్బిలి, న్యూస్‌లైన్: ప్రజల బాగోగులు గురించి నిత్యం ఆలోచిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం అహర్నిశలు ఆరాటపడిన వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వైఎస్ఆర్సీపీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త ఆర్వీఎస్కేకే రంగారావు (బేబినాయన) పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని బాడంగి మండలం పినపెంకిలో కాంగ్రెస్ పార్టీ లో కీలకంగా వ్యవహరించే ఇద్దరు మాజీ వార్డు సభ్యులు బోనుమద్ది సింహాచలం, అల్లు సీతంనాయుడు వారి అనుచరులతో ఆ పార్టీని వీడి సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. వీరికి బేబినాయన పార్టీ కండువా వేసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ లేని లోటు నేడు దేశ ప్రజలందరికీ తెలుస్తోందన్నారు. ఆ మహానేత ఉండి ఉంటే ఈ రోజు రాష్ట్రం ఇంత అల్లకల్లోలం అయ్యేది కాదని, తెలంగాణ సమస్య కూడా తెరమీదకు వచ్చి ఉండేది కాదన్నారు. ఆంధ్ర ప్రజలను మోసం చేసిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల వారు ఓట్ల కోసం అనేక జిమ్మిక్కులతో ప్రజల ముందుకు వస్తారని, వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అల్లు కృష్ణ, బోనుమద్ది సత్యం, చింతాడ సాంబమూర్తి తదితరులు 40 కుటుంబాలతో పార్టీలో చేరారు. కార్యక్రమంలో నర్సుపల్లి వెంకటేశ్వరరావు, మర్రాపు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. బేబినాయనకు ఘన స్వాగతం జి.అగ్రహారం (చీపురుపల్లి): వైఎస్ఆర్సీపీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించి, తొలిసారి చీపురుపల్లి వచ్చిన బేబినాయనకు ఆ పార్టీ స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. సోమవారం బేబినాయన చీపురుపల్లి వస్తున్న సందర్భంగా పట్టణ శివారుల్లోని అగ్రహారం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మీసాల వరహాలనాయుడు, వాకాడ శ్రీను, శనపతి శిమ్మినాయుడు, కరణం మురళి తదితరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పూలమాలలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రచార కమిటీ సభ్యులు కర్రోతు రమణ, మన్నెపురి ఉమామహేశ్వరరావు(చిట్టి), గరివిడి మండల కన్వీనరు సి.హెచ్.సత్యనారాయణరెడ్డి, దళిత నాయకుడు కాంతారావు, జమ్ము బంగారి, బలగ సూరిబాబు, గవిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేరమే అధికారమైంది..
బోధన్,న్యూస్‌లైన్ : నేరమయమైన అధికార పక్షం ప్రజలను నేరస్తులుగా చేస్తోందని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు పోటు రంగారావు ఆరోపించారు. పార్లమెంట్లో 545 మంది సభ్యుల్లో 350 మంది కోటీశ్వర్లు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. పీడీఎస్‌యూ 19వ జిల్లా మహాసభలను గురువారం బోధన్‌లోని ఉర్ధూహాల్‌లో నిర్వహించారు. సభకు పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షరాలు సరిత అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా హాజరైన రంగారావు మాట్లాడుతూ పీడీఎస్‌యూ వ్యవస్థాపకుడు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, మరో మహిళా నేత రంగవల్లీ ఈ ప్రాంతానికి చెందిన వారు కావడం విశేషమన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు మాట్లాడుతు బడా కంపెనీలు దేశ వనరులను దోచుకునేందుకు ప్రభుత్వాలు ప్రోత్సాహమిస్తున్నాయని ఆరోపించారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ బాలికల విద్య పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుచేయక తప్పదన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం ప్రసాద్ మాట్లాడుతు ఉన్నతవిద్య పేద వర్గాలకు భారంగా మారిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలకు ఆధార్‌కార్డు లింకేజీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సభ ప్రారంభానికి ముందు మౌనం పాటించి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సభలో పిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె యాదగిరి, నాయకులు ఆకుల పాపయ్య. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సరిత, వరదయ్య, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కట్లె భూమయ్య, నాయకులు ఎల్‌బీరవి, శ్రీనివాస్, మల్లేష్, మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు న్యాయవాది వి సంగం మాట్లాడారు. నాయకులు స్వప్న, జైత్రాం, గంగాధర్,యాదగిరి, ఆకుల పాపయ్య, వి ప్రబాకర్, ఎన్ దాసు, వేల్పూర్ భూమయ్య, వనమాల కృష్ణ, నరేందర్, గంగాధర్, మల్లేశ్ పాల్గొన్నారు. విద్యార్థులతో భారీ ర్యాలీ.. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) జిల్లా 19 వ మహాసభలు అట్టహాసంగా చేపట్టారు. స్థానిక శక్కర్‌నగర్ క్రీడా మైదానానికి చేరుకున్న వందలాది మంది కార్యకర్తలు, విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ కళాకళాకారులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. సభ ప్రారంభ సూచకంగా పిడికిలి గుర్తు ఉన్న ఎర్ర జెండాను జిల్లా అధ్యక్షురాలు సరిత ఆవిష్కరించారు. రెండువర్గాల ఘర్షణ.. మహాసభలో కాసేపు పీడీఎస్‌యూ నాయకులు రెండు వర్గాలు విడిపోయి ఘర్షణ పడటం ఉద్రిక్తతకు దారితీసింది. భోజన విరామ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రెండు గ్రూపులుగా విడిపోయి కార్యకర్తలు దాడులకు యత్నించారు. బోధన్ సీఐ శంకరయ్య పోలీసు సిబ్బంది అక్కడి చేరుకున్నారు. యూనియన్, పార్టీ నాయకులు రెండువర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించారు.