ఓయూ మార్గదర్శకాలే ప్రామాణికం | Oyu standard guidelines | Sakshi
Sakshi News home page

ఓయూ మార్గదర్శకాలే ప్రామాణికం

Published Fri, Aug 22 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM

ఓయూ మార్గదర్శకాలే ప్రామాణికం

ఓయూ మార్గదర్శకాలే ప్రామాణికం

  •     కేయూలో పీహెచ్‌డీ ప్రవేశాలపై నివేదిక ఇచ్చిన కమిటీ
  •      ఆమోదించిన ఇన్‌చార్జ్ వీసీ వికాస్‌రాజ్
  •      వారం రోజుల్లో ఇంటర్వ్యూల  తేదీల ఖరారు
  • కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఆర్ట్స్, సోషల్ సైన్స్, సైన్స్, లా, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాల ప్రక్రియ ఓ కొలిక్కి వస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ మార్గదర్శకాలకనుగుణంగానే ఇక్కడ కూడా పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని యూనివర్సిటీ నియమించిన కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు కమిటీ నివేదికను కేయూ ఇన్‌చార్జ్ వీసీ వికాస్‌రాజ్ ఆమోదించారు. దీంతో ఎంతో కాలంగా పీహెచ్‌డీలో ప్రవేశాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులకు ఉపశమనం కలిగినట్లయింది.

    పీహెచ్‌డీ ప్రవేశపరీక్ష జరిగాక ఫలితాలు వెల్లడించడంలోనూ జాప్యం చేసిన అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించడంలో కూడా అదే వైఖరి అవలంబించారు. పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించే విషయంలో ప్రస్తుత మార్గదర్శకాలను అవలంబిస్తే ప్రవేశపరీక్షలో ప్రతిభ చూపిన వారికి సీట్లు దక్కే అవకాశం లేదు. దీంతో ఓయూ మార్గదర్శకాలను అవలంబించాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పందించిన కేయూ అధికారులు బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్.సదానందం చైర్మన్‌గా, ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు కన్వీనర్‌గా ఓ కమిటీని నియమించారు.

    ఈ కమిటీ సభ్యులు పలు దఫాలుగా సమావేశమై వివిధ యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు పాటిస్తున్న నిబంధనలను పరిశీలించడమే కాకుండా ఓయూ మార్గదర్శకాలను ఇక్కడ అనుసరించాలని పేర్కొంటూ నివేదిక సమర్పించారు. ఈ నివేదికను కేయూ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంఏ.సింగరాచార్య.. ఇన్‌చార్జ్ వికాస్‌రాజ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అప్రూవల్ చేశారు. దీంతో త్వరలోనే కమిటీ బాధ్యులు సమావేశమై పీహెచ్‌డీ ప్రవేశాలకు తేదీలను నిర్ణయించే అవకాశముంది.
     
    రెండు కేటగిరీలుగా ప్రవేశాలు

     
    కేయూ పీహెచ్‌డీ సీట్ల భర్తీని రెండు కేటగిరీలుగా విభజించనున్నారు. కేటగిరీ-1లో సీఎస్‌ఐఆర్, జేఆర్‌ఎఫ్, ఐసీఎస్‌ఎస్‌ఆర్, ఐసీహెచ్‌ఆర్, ఆర్‌జీఎన్‌ఎఫ్ ఫెల్లోషిప్ అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. రెండో కేటగిరీలో పీహెచ్‌డీ ప్రవేశపరీక్ష రాసిన, నెట్, ఎంఫిల్, స్లెట్ అభ్యర్థులందరికీ విభాగాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అభ్యర్థుల్లో నెట్ ఉన్న వారికి 20 మార్కులు, ఎంఫిల్‌కు 15 మార్కులు, స్లెట్‌కు 12 మార్కులు, ఎంట్రెన్స్‌కు 12 మార్కులు, పీజీలో డిస్టింక్షన్ కలిగి ఉంటే 10మార్కులు, ఇంటర్వ్యూకు 10మార్కులు, రీసెర్చ్ ప్రపోజల్స్‌కు ఐదు మార్కులు కేటాయించారు. ఆయా అభ్యర్థులకు నెట్ ఉంటే 20, స్లెట్ ఉండి ఎంఫిల్ ఉంటే ఎంఫిల్‌కు 15మార్కులే  కేటాయిస్తారు.

    ఇలా ఆయా కేటగిరీలో కేటాయించిన మార్కులన్నింటిలో 50 మార్కులనే ప్రామాణికంగా తీసుకోవడంతో పాటు ఇంటర్వ్యూ ల ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. మొత్తం 50 మార్కుల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారిలో రోస్టర్ రిజర్వేషన్ల ప్రాతిపదికన పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తారు. అయితే, పీహెచ్‌డీ నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నాటి సీట్లు భర్తీ చేయాలా, ప్రస్తుతం ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకోవాలా అనేది అధికారులు త్వరలోనే నిర్ణయిస్తారు. అనంతరం పీహెచ్‌డీ ఇంటర్వ్యూల తేదీలు ఖరారు చేస్తారు.
     
    ఫార్మసీ విభాగంలో పూర్తి
     
    కొన్నినెలల క్రితం పీహెచ్‌డీ ప్రవేశపరీక్ష ఫలితాలను కేయూ అధికారులు వెల్లడించగా.. అప్పటి ఫార్మసీ డీన్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 43మంది అభ్యర్థులకు ఇటీవల పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిం చారు. ఇందులో  జీ ప్యాట్ అర్హత కలిగిన వారికే చోటు దక్కగా, ఎంట్రెన్స్ రాసిన వారు కొందరే ఉన్నారు. తొలుత 29 పీహెచ్‌డీ సీట్లు ఉండగా, ఇంటర్వ్యూలు నిర్వహించాక రెండు నెలలకు అడ్మిషన్ల సమయంలో 43 మం దికి ప్రవేశాలు కల్పించారు. ఇందులో ఇద్దరు ప్రొఫెసర్లకు ఎనిమిది మంది కంటే ఎక్కువగా అభ్యర్థులను కేటాయించారని సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement